వాడుక భాషలో తెలుగు కవితావికాసము

దేశభక్తికోసం వాడుక భాష

ఒక వంద సంవత్సరాలకు ముందు భారతదేశము బానిస దేశంగా ఉండింది. స్వాతంత్ర్యానికై ఎందరో తమ ప్రాణాలనే అర్పించారు. ప్రజల హృదయాలలో దేశంపై మమకారం, దేశమాతపై భక్తి ఎక్కువ చేయడానికి వ్యావహారిక భాషలో రాసిన పాటలు ఎంతో దోహదం కల్గించాయి. దేశాభిమానంతోబాటు సంఘసంస్కరణకు కూడా ఇవి తోడ్పడ్డాయి. గురజాడవారి “దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అన్న ముత్యాలసరం నిజంగా భారతమాతకు ముత్యాలసరమే. చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారు భారతదేశాన్ని గోమాతతో పోల్చి, ఆ ఆవు పాలను ఎలా అమానుషంగా తెల్లవారు పితుకుతున్నారో అని వాపోయారు.

భరతఖండంబు చక్కని పాడి యావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియబట్టి
– చిలకమర్తి లక్ష్మీనరసింహం

సులభంగా అర్థమయ్యే మరి కొన్ని ప్రబోధ గేయాలు, జాతీయ గీతాలు –

మలిన వృత్తులు మాలవారని
కులము వేర్చిన బలియు రొక దే-
శమున కొందరి వెలికి దోసిరి
మలినమే మాల
– గురజాడ అప్పారావు, లవణరాజు కల

మతము లన్నిటికి సమ్మతము దీని క్రీడ
హితము కూడ శాంతియుతముగ పోరాడ
హిందువులం దెర్రనై ఇస్లాము మతమందు
పొందుగ పచ్చనై యానందమును గూర్చు
ధవళమై యితర మతమ్ములకై వెలుగు
అవిరళ భాగ్య భోగ్యముల నీయగలుగు
కోట్ల ధనము జనము కొట్టి పొట్టను బెట్టు
కాటకముల నెట్టు రాట్నము గలట్టి
దిదియే జాతీయ జండా
జాతి కిదియె ప్రాణము మాన మిదియే
– గురజాడ అప్పారావు (1922)
(జాతీయ జండాపైన తెలుగులో వీరి కవితయే మొట్టమొదటిదేమో? ఇప్పుడున్న చక్రానికి బదులు అప్పుడు భారతదేశపు జండాలో రాట్నము ఉండేది.)

ఏ దేశ మేగినా ఎందు గాలిడిన
ఏ పీఠ మెక్కినా యెవ రెదురయిన
పొగడరా నీతల్లి భూమి భారతిని
నిలుపరా నీజాతి నిండు గర్వమ్ము
లేదురా యిటువంటి భూదేవి యెందు
లేదురా మనవంటి ధీరు లింకెందు
– రాయప్రోలు సుబ్బారావు, జన్మభూమి


కొల్లాయి గట్టితే నేమి మా గాంధి
బసవరాజు, మాలపిల్ల చిత్రంలో

కొల్లాయి గట్టితే నేమి మా గాంధి
కోమటై పుట్టితే నేమి
వెన్నపూస మనసు, కన్నతల్లీ ప్రేమ
పండంటి మోముపై బ్రహ్మతేజస్సు

నాల్గు పరకల పిలక
నాట్యమాడే పిలక
నాలుగు వేదాల నాణ్య మెరిగిన పిలక

బోసి నోర్విప్పితే
ముత్యాల తొలకరే
చిరునవ్వు నవ్వితే వరహాల వర్షమే
– బసవరాజు, మా గాంధీ (మాలపిల్ల చిత్రంలో ఈ పాటను విని ఆనందించండి.)

శ్రీగాంధి నామం – మరువాం మరువాం
సిద్ధము జైలుకు – వెరువాం వెరువాం
కూడి భారతమాత – గొలుతాం గొలుతాం
నేడే స్వరాజ్యాన్ని – తెస్తాం తెస్తాం

దేశభక్తులు మాకు – సారాం సారాం
దేశద్రోహులు మాకు – దూరాం దూరాం
వర గాంధి మార్గాన్ని – వదలాం వదలాం
వేరే మార్గాలన్నీ – వదిలాం వదిలాం

లాటీ దెబ్బలకేము – బెదరాం బెదరాం
మేటి తుపాకీకి – చెదరాం చెదరాం
శ్రీగాంధి నామం – మరువాం మరువాం
– దామరాజు

మాకొద్దీ తెల్ల దొరతనము దేవ
మాకొద్దీ తెల్ల దొరతనము

మా ప్రాణాలపై పొంచి మానాలు హరియించే
పన్నెండు దేశాలు పండుచున్నాగాని
పట్టెడన్నమె లోపమండి
ఉప్పు ముట్టుకొంటే దోషమండి
నోట మట్టికొట్టి పోతాడండి
అయ్యో కుక్కలతో పోరాడి
కూడు తింటామండి
– గరిమెళ్ళ సత్యనారాయణ

ఉప్పు కొనండయ్యా స్వరాజ్యపు
ఉప్పు కొనండయ్యా
ఉప్పు చట్టమును ధిక్కరించితే
తప్పక మనకు స్వరాజ్యము వచ్చు

బానిసతనము బాపే మందిది
భారతీయుల భాగ్యఫలంబిది
పేదలపాలిటి పెన్నిధాన మిది
సాధులు చేసిన సంజీవిని యిది

శాంతి సైన్యములు చేసిన ఉప్పిది
శాంతి శుభమ్ములు జగతి కిచ్చునది
గాంధి మహాత్ముడు కనిపెట్టిన దిది
బంధనంబుల బారదోలు నిది

గవర్నమెంటుకు కను విప్పంగా
కాంగ్రెసు యోధులు కలసి చేసినది
– మంగిపూడి పురుషోత్తమ శర్మ

సిగ్గులేదా నీకు శరము లేదా
అన్నమైనలేక బీద లల్లాడుతుంటేను
సీతాకోక చిలుకలాగ సీమగుడ్డ కట్టి తిరుగ

పూట కూడు లేని ప్రజకు రాట్న మొకటే పెన్నిధాన
మోటంచు పవిత్రమైన రాటం ఖద్దరు వెక్కిరింప

అంగడులన్నియుంటే అల్లుడినోట శానున్నట్లు
భాగ్యరాశి భారతభూమి పరదేశ సరుకులేల
– బసవరాజు ఆపారావు

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో జరిగే అవినీతి పనులను, పాలకుల దౌర్జన్యాన్ని ప్రజల దుస్థితిని గురించి కూడా వాడుక భాషలో వచన పద్యాలు రాస్తూనే ఉన్నారు కవులు, కవయిత్రులు. కింద ఒక రెండు ఉదాహరణలు –

కడగొట్టు తమ్ముడని
గారాబు తమ్ముడని
కనికరమ్మే లేని
కటిక రక్కసులారా
ఏ తప్పు చేశాడురా
మీ సొమ్ము
ఏమి కాజేశాడురా
-జంధ్యాల పాపయ్యశాస్త్రి, తప్పులేని తమ్ముడు

అమ్మా భారతమాతా
ఎండిన పాలిండ్లనుంచి
స్తన్యం రాక
రుధిరపానం చేస్తున్నాడు
ఈ భావి భారత బాలుడు

స్వార్థ రాజకీయాలతో
పదవీ కాంక్షతో
ఈ వయసు ముదిరిన ఊసరవెల్లులు
నిన్నే శృంఖలాబద్ధను చేయదలిస్తే
నీకోసం
రక్తతర్పణం చేయడానికి
వాడి శరీరంలో కావలసినంత రక్తం
– జయప్రభ, రక్తతర్పణం

ఓ మగమద మృగాల్లారా
మీరు మీ ఇళ్ళల్లో చావండి
మీరు మీ భార్యల ఒళ్ళల్లో చావండి
మీ తల్లుల గుండెలపై చావండి
మీరు చావటానికి మా దగ్గరకు రాకండి
బతకటానికి నానా చావూ చస్తున్నవాళ్ళం
– ఓల్గా

ఏ.సి. రూముల్లోన ఎఫ్.సి. కులపోలుంటే
తాటికమ్మ పాకల్లో బి.సి. కులపోలున్నరు
కులంలేని మతంలేని రాజ్యం మనదన్నరు
హైదరాబాదులో కులంలోని అగ్గి పెట్టుకొన్నరు
– వంగపండు ప్రసాదరావు, శూద్రుల సవాల్