సర్వోత్తమ సితార్ విద్వాంసుడు ఉస్తాద్ విలాయత్‌ఖాన్

‌ప్రపంచమంతటా సామాన్యంగా సితార్ అనగానే రవిశంకర్ పేరును తలుచుకుంటారు. ఒక భారతీయ శాస్త్రీయసంగీతజ్ఞుడు ఎంతటి ఖ్యాతిని పొందవచ్చునో నిరూపించిన మేధావి రవిశంకర్ అనడంలో సందేహమేమీ లేదు. అయితే ప్రతి అర్జునుడికీ సరితూగే ఒక కర్ణుడు ఉంటాడనుకుంటే అందుకు సరిగ్గా సరిపోయే వ్యక్తి ఉస్తాద్ విలాయత్‌ఖాన్‌. సితార్ చేత “పాడించి”, సితార్ వాయిద్యపు పరిధిని అపారంగా విస్తరింపజేసి, సితార్ శైలికే కొత్త భాష్యం చెప్పిన విలాయత్‌ఖాన్‌కు మరెవరూ సాటిరారని భావించేవారూ ఉన్నారు. మార్చ్ 2004లో ముంబాయిలో కాలం చేసిన ఈ మహావిద్వాంసుడి గురించిన కొన్ని వివరాల కోసమే ఈ వ్యాసం.

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో రేడియో ఒక శక్తివంతమైన ప్రసారసాధనంగా ఉండేది. అయితే శాస్త్రీయసంగీతం వినిపించే కళాకారులకు ఆలిండియా రేడియోవారు ఇస్తున్న పారితోషికాలు మరీ అవమానకరంగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తూ కొందరు సంగీతవేత్తలు 1952లో రేడియోను బాయ్‌కాట్ చేశారు. ప్రసిద్ధ గాయకుడు పండిత్ ఓంకార్‌నాథ్ ఠాకూర్ వీరికి నాయకత్వం వహించాడు. సంతకాలు చేసినవారిలో యువ సితార్ వాయిద్యకారుడు విలాయత్‌ఖాన్‌కూడా ఉన్నాడు. ఆ తరవాత కొన్నాళ్ళకు కేంద్రమంత్రుల రాయబారాల ఫలితంగా ఠాకూర్‌తోసహా చాలామంది తమ ఫిర్యాదును ఉపసంహరించుకుని రేడియోలో కచేరీలు చెయ్యసాగారు. వారిలో రాజీ పడకుండా చివరిదాకా నిలిచినవాడు విలాయత్‌ఖానే. ఆ తరవాతి కాలంలో ఆయన 1964లో పద్మశ్రీ, 1968లో పద్మభూషణ్, 2000లో పద్మవిభూషణ్ పురస్కారాలనుకూడా నిరాకరించాడు. అతని వ్యక్తిత్వానికి ఇదొక నిదర్శనం. ఉస్తాద్ విలాయత్‌ఖాన్‌ మనస్తత్వం అర్థమవాలంటే అతని పుట్టు పూర్వోత్తరాల్లోకి వెళ్ళాలి.


ఉస్తాద్ ఇమ్‌దాద్ ఖాన్‌

విలాయత్‌ఖాన్‌ సితార్ , సుర్‌బహార్ విద్వాంసుల వంశంలో జన్మించాడు. వీరిది మొదట్లో రాజపుత్ర ఠాకుర్ వంశమనీ, ఎప్పుడో మతం మార్పిడి జరిగిందనీ అంటారు. విలాయత్‌ఖాన్‌ ముత్తాత సాహబ్‌దాద్ ఖాన్ ఆగ్రా సమీపాన ఇటావా అనే గ్రామంలో నివసిస్తూ తన ఏకైక పుత్రుడు ఇమ్‌దాద్ ఖాన్‌కు (1848-1920) సితార్ నేర్పసాగాడు. సుర్‌బహార్ అనే వాయిద్యాన్ని సాహబ్‌దాద్ స్వయంగా తయారుచేశాడట. కచ్ఛపవీణ అనబడే ప్రాచీనవాయిద్యానికి ఆయన సితార్ పద్ధతిలో దిగువ తీగలూ వగైరాలను అమర్చాడు. తన తండ్రివద్ద పన్నెండేళ్ళపాటు శిక్షణ పొందాక ఇమ్‌దాద్ మేటి విద్వాంసుడుగా తయారయాడు. విక్టోరియారాణి ఢిల్లీకి వచ్చిన సందర్భంలోనూ, మనదేశపు తొట్టతొలి గ్రామొఫోన్ రికార్డులలోనూ ఆయన సితార్ వాయించి బాగా పేరుపొందాడు. పాతతరం పద్ధతిలో ఆయన ప్రధానంగా యమన్, పూరియా రాగాలనే వాయించేవాడట. ఆయన మీది గౌరవం కొద్దీ ఆయన పాల్గొన్న సమావేశాల్లో ఇతరులెవరూ ఈ రాగాలను వినిపించేవారు కాదట. ఆయన వాయించిన యమన్ రికార్డు ద్వారా ఆయన శైలి తెలుస్తుంది.

ఇమ్‌దాద్ ఖాన్‌కు ఇనాయత్, వహీద్ అని ఇద్దరు కొడుకులు కలిగారు. వారిద్దరికీ ఆయన గాత్రం, సితార్, సుర్‌బహార్ నేర్పాడు. వారి చిన్నతనంలోనే కుటుంబమంతా కోల్‌కతాకు తరలివెళ్ళింది. అక్కడ వారి శిక్షణ ఎన్నో ఏళ్ళపాటు నిర్దుష్టమైన పద్ధతిలో కొనసాగింది. కొన్నాళ్ళకు ఇమ్‌దాద్ ఖాన్‌ తన కుటుంబాన్ని ఇందోర్‌కు తీసుకెళ్ళి, అక్కడ హోళ్కర్ మహారాజు ఆస్థానవిద్వాంసుడుగా ఉంటూ అక్కడే కాలంచేశాడు. ఇమ్‌దాద్ ఎంత శ్రద్ధగా సాధన చేసేవాడంటే తన కుమార్తె చనిపోయిందన్న వార్త విన్నాకకూడా చేస్తున్న అభ్యాసం పూర్తయేదాకా ఆయన లేవలేదట. అప్పట్లో కాలగమనాన్ని మూరెడు కొవ్వొత్తులు పూర్తిగా వెలిగే వ్యవధిని బట్టి చెప్పేవారట. ఆ లెక్కన ఇమ్‌దాద్‌గారిది నాలుగు కొవ్వొత్తుల సాధన అనేవారట. తమ వంశాన్ని గురించిన ఇటువంటి గాథలు తరవాతి తరంవా రందరిపైనా గాఢమైన ప్రభావం కలిగించాయి. ఇమ్‌దాద్ పెద్దకొడుకు ఇనాయత్ ఖాన్‌ (1894-1938) సితార్ , సుర్‌బహార్ రెండు వాయిద్యాలనూ అద్భుతంగా వాయించేవాడు.


కొడుకులతో ఇమ్‌దాద్‌ఖాన్ (మధ్య),
వహీద్‌ఖాన్ (ఎడమ), ఇనాయత్‌ఖాన్ (కుడి)‌

ఇమ్‌దాద్ తన కొడుకులిద్దరితోనూ కలిసి కచేరీ చేసిన ఫోటో చూడవచ్చు. తండ్రి చనిపోయాక ఇనాయత్ కోల్‌కతాకు వెళిపోయాడు. (ఆ తరవాత ఆయన తూర్పుబెంగాల్‌లోని గౌరీపూర్‌లో స్థిరపడ్డాడు. అందుకే ఈ బాణీని ఇటావా ఘరానా అనీ, గౌరీపూర్ ఘరానా అనీకూడా అంటారు).

కాస్త బిడియస్తుడైన రెండోకొడుకు వహీద్ మటుకు సుర్‌బహార్ వాయించేవాడు. అతను 18 ఏళ్ళపాటు ఇందోర్ ఆస్థానవిద్వాంసుడుగా కొనసాగాడు. 1958లో సత్యజిత్ రాయ్ తీసిన జల్సాఘర్ అనే సంగీతప్రధానమైన సినిమాలోని ఒక సన్నివేశంలో వహీద్ ఖాన్ స్వయంగా సుర్‌బహార్ వాయిస్తూ కనిపిస్తాడు. దీనికి సంగీతదర్శకుడు విలాయత్‌ఖాన్. ఈ సన్నివేశంలో సంగీతప్రియుడైన జమీందార్ రసాస్వాదనకు దూరాన మోగే ఎలెక్ట్రిక్ పంప్ అడ్డొస్తుంది.

ఇనాయత్ ఖాన్‌ మటుకు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిని గడించి వివిధ సంగీతసమావేశాల్లో పాల్గొనసాగాడు. ఆయన వాయించిన సింధుభైరవి రికార్డు వింటే ఆయన ప్రతిభ తెలుస్తుంది.

ఇనాయత్ తన పొడవైన జుట్టును కిటికీచువ్వలకు కట్టుకుని రోజూ గంటల తరబడి సాధన చేసేవాడట. కూర్చుని వాయిస్తూ ఉండగా నిద్రవచ్చినప్పుడల్లా తల ముందుకు వాలి జుట్టు బిగలాగుకుపోవడంతో మళ్ళీ మెలకువ వచ్చేదట. అటువంటి రాక్షససాధనవల్ల ఆయన తన తరంలో అద్వితీయుడని పేరు సంపాదించాడు. రవిశంకర్ ఆయనకు శిష్యుడు అవుదామనుకున్నాడటగాని టైఫాయిడ్ రావడంతో ఆ సంకల్పం వాయిదా పడింది. రవిశంకర్ తీరా జ్వరంనుంచి కోలుకునేసరికి ఉస్తాద్‌గారు కాలంచేశాడు. అందుచేతనే రవిశంకర్ అల్లాఉద్దీన్ శిష్యుడయాడు.


సుర్‌బహార్‌తో ఇనాయత్‌ఖాన్

ఇనాయత్‌ఖాన్‌ తరంలో సితార్ బాగా ప్రజాదరణ పొందసాగింది. అప్పట్లో రాగాలాపనకూ, తానం వాయించడానికీ పాతకాలపు ధ్రుపద్ శైలిలో రుద్రవీణ వాయించేవారు. సుర్‌బహార్‌ను రుద్రవీణ పద్ధతిలో ధ్రుపద్ శైలికి ఉపయోగించవచ్చు. సాహిత్యం లేనటువంటి గత్ రచనలకు మాత్రం సితార్ ఉపయోగించేవారు. ఇందులో మసీత్ ఖానీ (విలంబిత్ ఖయాల్‌ను పోలినది), రజాఖానీ (ద్రుత్ ఖయాల్‌ను పోలినది) గత్‌లుండేవి. రజాఖానీ గత్ అతివేగంగా సాగేది. అందులో కుడిచేతి పనితనపు ఆర్భాటం హెచ్చుగా వినబడేది. గత్ చివరలో మెరుపువేగంతో వాయించే ఝాలా ఉండేది. వీటన్నిటిలోనూ ఇనాయత్‌ఖాన్‌ అద్వితీయుడనిపించుకున్నాడు. ఇదంతాకాక సితార్‌ మీద గాయకశైలిలో, సుదీర్ఘమైన గమకాలనూ, సులువుగా జారే స్వరాలనూ పలికించవచ్చని ఆయన నిరూపించాడు. ఆయనకు సమకాలికులైన ప్రఖ్యాత గాయకులు కరీంఖాన్, ఫైయాజ్ ఖాన్, సరోద్ నిపుణుడు హాఫిజలీఖాన్ తదితరులూ, రవీంద్రనాథఠాకూర్ వంటి ప్రతిభావంతులూ ఆయనను మెచ్చుకునేవారు.

ప్రతితరంలోనూ ఒక కొడుకు సితార్‌నూ, మరొక కొడుకు సుర్‌బహార్‌నూ చేపట్టేవారు. ఇనాయత్, వహీద్‌ల లాగే తరవాతి తరంలో విలాయత్, ఇమ్రత్‌లూ, ఇమ్రత్ కుమారుల్లో నిషాత్, ఇర్షాద్‌లూ ఈ పధతిలో అభ్యాసం చేశారు. సుర్‌బహార్ గంభీరంగా మోగే పద్ధతిని ఇమ్రత్‌ఖాన్ వీడియోలో చూడవచ్చు.

ఈ సందర్భంలో సితార్ వాయించే శైలిని కొద్దిగా ప్రస్తావించాలి. వీణ తీగలను ఒక దిశలోనే మీటుతారు. సితార్ తీగలను ది, ర అనే పద్ధతిలో రెండు వేపులకూ మీటుతారు. సితారుకూ వీణకూ తేడా ఇదే. ఇరవయ్యో శతాబ్దం మొదట్లో ఇనాయత్‌ఖాన్‌ వంటి మేటి సితార్ విద్వాంసులందరూ కుడిచేత్తో ఈ “దిరదిర” అంటూ మీటే వేగాన్ని ఎక్కువగా ప్రదర్శించేవారు. ఇదికాక ఆయన ఎడమచేత్తో అందంగా గమకాలు పలికించడం కూడా చేసేవాడు.


విలాయత్‌ఖాన్‌ తల్లి బషీరన్

ఇనాయత్‌ఖాన్‌ ఉస్తాద్ బందేహసన్ అనే గాయకుడి కుమార్తె బషీరన్ బేగమ్ ను వివాహం చేసుకున్నాడు. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఆమె స్వయంగా కచేరీలు చెయ్యకపోయినా తండ్రి, భర్త, మామగార్లనుంచి ఎన్నో విషయాలను ఆకళించుకుంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు కలిగారు. పెద్దవాడు విలాయత్, రెండోవాడు ఇమ్రత్. పధ్నాలుగో ఏట పెళ్ళైన తరవాత ఆమెకు 32వ ఏట భర్త ఇనాయత్‌ఖాన్‌ మరణించాడు. ఆ తరవాత ఆమె తన కొడుకులనిద్దరినీ గొప్ప వాద్యకళాకారులుగా తయారుచెయ్యడంలో నిమగ్నం కాసాగింది. తన పుట్టింటివారి గాత్రశైలిని వాద్య సంగీతానికి చేర్చడంలో ఆమె పాత్ర చాలా ఉంది.


సితార్ వాయిస్తున్న విలాయత్ ,
ఒడిలో పిల్లలతో ఇనాయత్‌ఖాన్

విలాయత్‌ఖాన్‌ పుట్టిన సంవత్సరం 1924 అనీ, 27, 28 అనీ కూడా ప్రస్తావించబడింది. అతను తన మూడో ఏటి నుంచీ సంగీతంలో అసమానప్రతిభ కనబరిచినట్టుగా తెలుస్తోంది. “సితార్ ధున్, కళాకారుడు, విలాయత్‌ఖాన్‌, ప్రొఫెసర్ ఇనాయత్‌ఖాన్‌ కుమారుడు, వయసు 12 ఏళ్ళు” అని రాసి ఉన్న ఒక అద్భుతమైన 78 ఆర్.పి.ఎం. రికార్డు నేను చాలా ఏళ్ళ క్రితం స్వయంగా విన్నాను. అది 1936లో రిలీజయిందని అంటారు. దీన్నిబట్టి అతను 1924లో జన్మించాడని అన్నారేమో. తాను 1928లో పుట్టినట్టుగా ఆయనే చెప్పాడు.


1938లో తన ఇద్దరు శిష్యుల మధ్య ఇనాయత్‌ఖాన్
ఫోటోలో ఎడమపక్క జోషీ, వెనకాల
కూర్చున్న పిల్లలు విలాయత్, ఇమ్రత్

తండ్రినుంచి నేర్చుకున్న సంగీతమేకాక తమ ఇంటికి వచ్చిపోయే మహావిద్వాంసుల సాంగత్యమూ, తండ్రి చేసిన కచేరీలూ, ఆయన పొందిన ఆదరాభిమానాలూ అన్నీ విలాయత్‌పై గొప్ప ప్రభావాలని కలిగించాయి. 1932లో తండ్రి కచేరీ చేస్తూండగా తాను నిద్రపోయానని విలాయత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మధ్యలో కళ్ళు తెరిచినప్పుడు అంతా పసుపుపచ్చగా కనిపించిందని తండ్రితో అంటే ఆయన నవ్వి “పిచ్చివాడా అది బసంత్ రాగం రంగురా” అన్నాట్ట. మూడో క్లాసు మూడుసార్లు తప్పాక విలాయత్ స్కూలుకెళ్ళడం మానుకుని సితార్ మటుకే నేర్చుకుంటానన్నాట్ట. “సితార్ తేలుకొండివంటిది జాగ్రత్తసుమా” అని తండ్రి మొదట్లోనే హెచ్చరించాడట. ఆ తరవాత అతని సంగీతయాత్ర నిరాటంకంగా సాగింది. వాళ్ళ ఇంటికి వెంకటగిరియప్పవంటి కర్ణాటక వైణికులూ, బాలసరస్వతివంటి నాట్యకళాకారులూ కూడా వస్తూ ఉండేవారట.


డి.టి. జోషీ (1912-1993)

ఇంతలోనే, ఇమ్రత్ రెండు మూడేళ్ళవాడై ఉండగా, విలాయత్‌కు 11 ఏళ్ళ వయసు రాకమునుపే తండ్రి చనిపోయాడు. కచేరీకని అలహాబాద్ వెళ్ళినవాడు వ్యాధిగ్రస్తుడై తిరిగివచ్చి నడివయసులోనే కన్నుమూశాడట. చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకోవడం విలాయత్‌కు చాలా నష్టాన్ని కలిగించిన ట్టయింది. ఆ సమయంలో ఇనాయత్ శిష్యుడైన డి.టి. జోషీ అనే ఆయన విలాయత్‌కు చాలా మెళుకువలు నేర్పాడు.

తమ వంశమంటే గర్వం, దాని పేరు నిలబెట్టాలనే స్వాభిమానం విలాయత్‌కు చిన్నతనం నుంచీ ఉండేవి. వాయిద్యకారుడుగా ఒక్క వెలుగు వెలిగిన తండ్రి అకస్మాత్తుగా చనిపోయి, తామంతా దిక్కులేని పక్షులైపోయామనే భావనా, తమను నిర్లక్ష్యం చేస్తున్న సమాజంపై కసీ విలాయత్‌ను బాగా ప్రభావితం చేశాయి. ప్రత్యక్షంగా కాపాడేవారెవరూ లేకపోవడంతో అతను సాంప్రదాయక విలువలనే ప్రామాణికంగా భావించడం మొదలుపెట్టి, బతుకుతెరువు కోసం ఎవరి కాళ్ళూ పట్టుకోకుండా చిన్నతనంలోనే స్వశక్తి మీద మాత్రమే ఆధారపడాలనే నిర్ణయానికి వచ్చాడు. తన తండ్రి శిష్యులు కొందరు తనను కొన్ని సందర్భాల్లో ఈసడించుకోవడంతో తన మనసు గాయపడిందని ఒక వీడియోలో విలాయత్ చెప్పారు.

ఆ కారణంగా తన పదకొండో ఏట విలాయత్ ఒంటరిగా తన సితార్ చంకన పెట్టుకుని, కోల్‌కతానుంచి రైలెక్కి, టికెట్టు లేకుండా ప్రయాణిస్తూ, రైళ్ళు మారి చివరకు ఢిల్లీ చేరుకున్నాడు. అలిసి, డస్సిపోయి అక్కడున్న తన తండ్రి శిష్యుడు జఫర్‌హుసేన్‌ను కలుసుకుని తానెవరో చెప్పుకున్నాడు. రేగిన జుట్టుతో, నలిగిన బట్టలతో, స్వాభిమానం ఉట్టిపడేలా మాట్లాడిన ఆ కుర్రవాణ్ణి చూసి అతనికి ఆశ్చర్యానందాలు కలిగాయి. వెంటనే విలాయత్ ను రేడియో స్టేషన్‌కు తీసుకెళ్ళి డైరెక్టర్ జనరల్ బుఖారీకి పరిచయం చేశాడు. ‘నన్ను వెనక్కి పంపే ప్రయత్నం చెయ్యకండి; అలా చేస్తే నేను మళ్ళీ పారిపోతా’ అని వెక్కివెక్కి ఏడుస్తూ చెపుతున్న కుర్రవాణ్ణి బుఖారీ సముదాయిస్తూ ఇనాయత్‌ఖాన్‌ వారసత్వాన్ని సంరక్షించడానికి నిశ్చయించుకున్నాడు. ‘సితార్ మీద ఏమైనా వాయించగలవా?’ అని అడగగానే విలాయత్ మెరుపువేగంతో వాయించి తన ప్రతిభ కనబరిచాడు.

ఆ విధంగా విలాయత్ బస రేడియోస్టేషన్‌ సమీపంలోని బుఖారీ కారుషెడ్డులో ఏర్పాటయింది. నెలకు పదిరూపాయల జీతంతో రేడియో ఆర్టిస్టుగా ఉద్యోగమూ దొరికింది. అతని వాయింపు విన్నవారంతా అతనిలో ఇనాయత్ ఇప్పటికీ జీవించే ఉన్నాడని అనసాగారు. అక్కడుండగానే విలాయత్‌కు గాత్రంలోనూ, వాదనంలోనూ శిక్షణ ఇవ్వడానికి మాతామహుడి కుటుంబం నుంచీ, పినతండ్రి నుంచీ ఏర్పాట్లు జరిగాయి. అందుకు వీలుగా వారిద్దరికీ నెలనెలా ఢిల్లీకి వచ్చి రేడియోలో సంగీతం వినిపించేందుకు ఆహ్వానాలు పంపేవారు. ఈ సంగతులు చెప్పిన వీడియోలో పూరియా కల్యాణ్ వాయిస్తున్న విలాయత్ పక్కన ఆయన పాతశిష్యుడు అరవింద్ పారిఖ్ కనిపిస్తాడు.

ఆ తరవాత విలాయత్ తన మాతామహుడి గాత్రసంప్రదాయాన్ని అవగతం చేసుకున్నాడు. తాను బాగా పాడగలనని తెలుసుకున్నాక ఒక దశలో విలాయత్‌ఖాన్‌ సితార్‌ను వదలి గాత్రంపై శ్రద్ధ పెట్టసాగాడు. ఖయాల్ , ఠుమ్రీ ఇలా ప్రతిదీ అతన్ని ఆకర్షించసాగింది. అప్పుడతని తల్లి అతన్ని మందలిస్తూ ‘తండ్రి చనిపోయాక నేను నా మెట్టినింటిది కాకుండా పుట్టింటి సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్నాననే అపవాదు రాకూడదు. నువ్విక పాడడం కట్టిపెట్టి సితార్ సాధన చెయ్యాలి’ అని బాగా కోప్పడవలసివచ్చింది. దర్బారీకానడ, దేశ్ రాగాలు వాయించిన ఒక వీడియోలో విలాయత్ ఈ సంగతులు ఉదహరించారు.

ఆ విధంగా సితార్ అభ్యాసం కొనసాగిస్తున్నప్పటికీ విలాయత్ మీద గాత్రశైలి ప్రభావం బాగా పడింది. తమ ఇంటికి వస్తూపోతూ ఉండే మహాగాయకులు కరీమ్‌ఖాన్, ఫైయాజ్‌ఖాన్‌ల అద్భుత గాత్రపటిమతోబాటుగా విలాయత్ సోదరిని వివాహం చేసుకున్న ఉస్తాద్ అమీర్‌ఖాన్ గంభీరమైన గాత్రశైలికూడా అతన్ని ముగ్ధుణ్ణి చేసింది. తరవాతి కాలంలోకూడా విలాయత్‌ఖాన్ తక్కిన గాయకులంతా ఒక ఎత్తయితే అమీర్‌ఖాన్ ఒక ఎత్తు అని అంటూ ఉండేవాడు.

విలాయత్‌ఖాన్‌ సితార్‌పై నిరంతరం కఠోరసాధన చెయ్యసాగాడు. స్వరాల ప్రతి వరసనీ వందలేసి సార్లు ఎడమచెయ్యి పైకీ కిందికీ విసురుగా కదుపుతూ వాయిస్తున్నప్పుడు వేలు తెగి రక్తపు బొట్లు పక్కనున్న గోడమీద చిందుతూ ఉండేవని ఆయన తరవాతి కాలంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తన తండ్రి తాతలనాటి శైలిలో ప్రధానంగా కుడిచేతి వేగమూ, లయపరమైన అద్భుత విన్యాసాలూ ఉండేవి. ఎడమచేత్తో ధ్రుపద్ శైలి గమకాలు పలికేవి. గాత్రాన్ని పోలిన గమకాలను మొదలుపెట్టినవాడు ఇనాయత్‌ఖాన్. దీన్ని మరింతగా విస్తృతం చేస్తూ విలాయత్ రకరకాల ప్రయోగాలు చెయ్యసాగాడు. అచ్చగా ఖయాల్ గాయకులు పాడిన పద్ధతిలో రాగవిస్తారాన్నీ, ఆవాహన చేసే విధానాన్నీ ప్రవేశపెట్టాడు. ఠుమ్రీ అందాలను మొదటగా సితార్‌మీద పలికించాడు. కొత్తలో కొందరు ఇదేమీ గొప్ప కాదనే వైఖరితో చప్పరించినప్పటికీ అతను అంతులేని ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాడు. ఎంతో నిర్దుష్టంగా తాళగతుల మీద తాన్‌లు వాయించడంలోనూ, ఎంతటి వేగంలోనైనా పొల్లుపోకుండా చెయ్యి కదపడంలోనూ అతనికెవ్వరూ సాటిరారనిపించేది. 1942లో విలాయత్ పూనాలో సంగీత విద్వాంసుల ఎదుట చేసిన ఒక అద్భుతమైన సితార్ కచేరీ తాను విన్నానని మా గురువుగారు కేళ్కర్ నాతో అన్నారు. అందులో పదహారు మాత్రల విలంబిత్ తీన్‌తాల్ గత్ మీద ఏ ‘అక్షరం’ నుంచైనా మొదలుపెట్టి, తిహాయీ (ముక్తాయింపు) వాయించి సమం మీదికి సరిగ్గా రాగలనని అతను సవాలు చేసి నిరూపించాడట. ఆ యువకళాకారుణ్ణి పెద్దలంతా భేష్ అని మెచ్చుకున్నారట.

1943లో విలాయత్‌ఖాన్ బొంబాయికి వచ్చిన కొత్తలో అహమ్మదాబాద్‌నుంచి అరవింద్ పారిఖ్ అక్కడికి చేరుకుని అతని శిష్యుడయాడు. సితార్‌లో మంచి ప్రావీణ్యం ఉన్నప్పటికీ కచేరీల ఏర్పాటు, డబ్బు వ్యవహారాలు వగైరాల్లో విలాయత్‌కు అనుభవం తక్కువ ఉండడంవల్ల అరవింద్ అతనికి అడుగడుగునా తోడ్పడేవాడు. అప్పట్లో కొన్ని కచేరీలకూ, సమావేశాలకూ సినీతారలు కూడా వచ్చేవారనీ, వారంటే అప్పట్లో విలాయత్‌కు చాలా గ్లామర్ ఉండేదనీ అరవింద్ పారిఖ్ అన్నాడు. మోతీలాల్, దిలీప్‌కుమార్ తదితరులు అతని అభిమానులు. నర్గీస్ చాలాకాలం అతనివద్ద సితార్ నేర్చుకుందట. ఆ దశలో విలాయత్‌కు విలాసాలమీద మనసుపోయింది. కార్లూ, పెర్‌ఫ్యూమ్‌లూ, మంచి బట్టలూ, బాల్‌రూమ్ డాన్సింగ్ వగైరాలమీద మోజు పెరిగింది. పొగతాగడం అలవాటయింది. గుర్రపుస్వారీ, బిలియర్డ్స్, స్నూకర్ ఆడడం వగైరాల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ఆత్మవిశ్వాసం పెరిగింది. అతను దేన్ని గురించి చెప్పినా నలుగురూ వినేవారు. విలాయత్‌ఖాన్‌కు క్రమంగా పాతవీ, విలువైనవీ అయిన రకరకాల వస్తువులు సేకరించడం ఒక హాబీ అయింది.


యువకుడుగా విలాయత్‌ఖాన్

అతని ప్రధాన వ్యాపకం మాత్రం సితార్ సాధనే. దాన్ని గురించి అహర్నిశలూ యోచిస్తూ, కొత్త విషయాలు ఊహించేవాడు. విలాయత్ శైలిలో ఎడమచేత్తో ఒకే మెట్టుమీద అనేక స్వరాలను గమక భూయిష్ఠంగా పలికించడం ఉండేది. ఈ ధాటికి తట్టుకునేందుకని అతను సితార్ నిర్మాణంలో కొన్ని మార్పులను ప్రవేశపెట్టాడు. సితార్ పైపలకనూ, కాండాన్నీ మరింత బలంగా ఉండేట్టు తయారు చేయించాడు. మెట్లు కూడా మందంగా జర్మన్ సిల్వర్‌తో తయారుచేయించాడు. తీగలను మోసే బ్రిడ్జ్ మెరుగయింది. తమ సంప్రదాయంలో మంద్రస్థాయిలో మోగే సుర్‌బహార్ ఎలాగూ ఉంది కనక సితార్‌కు మామూలుగా ఉండే మంద్రస్థాయి తీగలను తొలగించి వాటి స్థానే స్టీల్ తీగలను అమర్చాడు. విలాయత్ బాణీని అనుసరించని రవిశంకర్, నిఖిల్ బెనర్జీ, హలీమ్‌జాఫర్‌ఖాన్ తదితరులు మాత్రం పాతపద్ధతిలో తీగలను అమర్చుకుంటారు. ఇందువల్ల విలాయత్ శైలిలో తయారయిన సితార్‌ను మీటగానే దానికొక ప్రత్యేక గుర్తింపు ఉన్నట్టు తెలుస్తుంది. మంద్రస్థాయి తీగల ‘రొద’ తగ్గడంతో కుడిచెయ్యి మరింత స్వేచ్ఛగా కదిలే వీలు ఏర్పడింది. తీగను మీటే పద్ధతుల్లో ఎన్నెన్నో మెళుకువలు ప్రవేశపెట్టిన విలాయత్‌ఖాన్ భావి సితార్ కళాకారులందరికీ అరాధ్యుడు అయాడు.


సితార్‌కు మారుపేరు

ఈ లోపల విలాయత్ తమ్ముడు ఇమ్రత్‌ఖాన్ తన పినతండ్రివద్దనుంచి సుర్‌బహార్ వాయించడాన్నీ, తల్లిద్వారా గాత్రాన్నీ అభ్యసించి చివరకు అన్నగారివద్దనే సితార్ నేర్చుకోసాగాడు.

త్వరలోనే వారిద్దరూ కలిసి సితార్, సుర్‌బహార్ జుగల్‌బందీ కచేరీలు కూడా చెయ్యసాగారు. ఇమ్రత్‌ఖాన్ కూ, ఆయన కుమారులకూ మాత్రమే కాక విలాయత్ తన మేనల్లుడు రయీస్‌ఖాన్‌కూ, ఆ తరవాత తన పినతండ్రి మనమడు షాహిద్ పర్వేజ్ తదితరులకూ సితార్ నేర్పాడు. ఆయన బంధువర్గానికి చెందని ఇతర శిష్యులుకూడా ఉన్నారుకాని కుటుంబసంప్రదాయం ప్రధానంగా ఆయన బంధువుల ద్వారానే కొనసాగుతోంది.

కొద్దికాలంపాటు ఇమ్రత్, అంతకన్నా ఎక్కువకాలం రయీస్‌ హిందీ సినిమాల్లో సితార్ వాయించి నేపథ్య సంగీతాన్ని సుసంపన్నం చేశారు. నౌషాద్‌కు ఇమ్రత్‌ఖాన్ గంగాజమునాలోనూ, 1960ల తరవాత రయీస్ తక్కిన సినిమాలన్నిటిలోనూ సితార్ వాయించారు. రయీస్ సితార్‌ను ఉపయోగించినవారిలో ఓపీ నయ్యర్, శంకర్‌జైకిషన్, మదన్‌మోహన్ తదితరులున్నారు.

మొత్తంమీద ఉత్తమం అనిపించుకున్న హిందీ సినీసంగీతంలో విలాయత్ బాణీయే ఎక్కువగా వినిపిస్తూవచ్చింది. 1958లో జల్సాఘర్ తరవాత విలాయత్‌ఖాన్ మర్చంట్, ఐవరీలు తీసిన గురు అనే సినిమాకూ, షబానా ఆజ్మీ నటించిన కాదంబరీ అనే సినిమాకూ సంగీతదర్శకత్వం వహించాడు. జల్సాఘర్ సంగీతానికి జాతీయ, అంతర్జాతీయ (మాస్కో) బహుమతులు లభించాయి. విలాయత్‌ఖాన్ మనీషా అనే చదువుకున్న బెంగాలీ బ్రాహ్మణ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వారికి యమన్., జిలా అనే కుమార్తెలూ, సుజాత్ అనే కొడుకూ కలిగారు. అయితే కొన్నాళ్ళకు వారు విడాకులు తీసుకున్నారు. తరవాతి కాలంలో ఆయన జుబేదా అనే ఆమెను వివాహం చేసుకున్నాడు: వారికి హిదాయత్ అనే కుమారుడు కలిగాడు. విలాయత్ కొడుకులిద్దరూ సితార్ వాయిస్తారు. ఆయన తమ్ముడు ఇమ్రత్‌ఖాన్ కొడుకులు నలుగురూ మంచి వాద్యకారులు అయారు.

తమ వంశం గొప్పదనం గురించీ, వారసత్వం గురించీ, తన శక్తియుక్తుల గురించీ విలాయత్‌కు మొదటినుంచీ స్వాభిమానం ఎక్కువే. ఒక వీడియోలో మిశ్రఖమాజ్ రాగం వినిపిస్తూ ఆ సంగతులు ఆయనే చెప్పాడు. తన తండ్రి వాయించినంత పరిశుద్ధమైన సంగీతం తాను ఎన్నటికీ వాయించలేనని విలాయత్‌ఖాన్‌ అభిప్రాయం (వీడియో).

అలాగే పాత జమీందారీ పద్ధతులూ, సంగీతపోషకులైన సంస్థానాధీశుల ఉత్తమ కళాభిరుచీ అతనికి నచ్చేవి. కొత్తగా స్వాతంత్ర్యం వచ్చిన పరిస్థితుల్లో వారి స్థానే సంస్కారం గురించి ‘ఏమీ తెలియని’ అధికారులూ, మంత్రులూ, నాయకమ్మన్యులూ రావడం, వారి ప్రాపకం కోసం పాకులాడేవారికి అధికారిక, ప్రభుత్వపరమైన గుర్తింపు లభించడం వగైరాలన్నీ అతనికి కంటగింపుగా ఉండేవి. రేడియోవారి సర్కారీ నిబంధనలనూ, అడుగులకు మడుగులొత్తేవారికే బహుమతులిచ్చే విధానాన్నీ అతను జీవితమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తూనేవచ్చాడు.


రవిశంకర్‌, ఆయన భార్య సుకన్యలతో

మరొకవంక ఉస్తాద్ అల్లాఉద్దీన్‌ఖాన్ తన ప్రియశిష్యుడు రవిశంకర్‌ను స్టేజి కళాకారుడుగా స్వయంగా తీర్చిదిద్దసాగాడు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో బాగా ఎరిగిన రవిశంకర్ సంప్రదాయపద్ధతిలో సంగీతం నేర్చుకుంటూనే త్వరగా పేరు సంపాదించుకోసాగాడు. 1950 ప్రాంతాల్లో కర్ణార్జునులు ఎదురుపడినట్టుగా ఢిల్లీలో జరిగిన ఒక కచేరీలో రవిశంకర్, విలాయత్‌ఖాన్ సితార్‌లతో తలపడ్డారు. కిషన్‌మహారాజ్ తబలా వాయించిన ఆ పోటీలో విలాయత్‌దే పైచెయ్యి అయిందట. కురువృద్ధుడివంటి అల్లాఉద్దీన్ ఆగ్రహంతో ఇద్దరినీ అందరి ఎదుటా తూలనాడినప్పుడు విలాయత్ బదులు చెప్పకుండా ఉండిపోయాడట. ఆ తరవాతికాలంలో కూడా రవిశంకర్ ‘హిప్పీ’లకు సితార్ నేర్పుతాడంటూ విలాయత్ అప్పుడప్పుడూ విమర్శలు చేస్తూనే వచ్చాడు. వయసులో పెద్దవాడైన రవిశంకర్ మటుకు వీటికి స్పందించకుండా ఉండిపోయాడు. మొత్తంమీద రవిశంకర్ ఎక్కువ విజయాలను సాధించినప్పటికీ విలాయత్‌ఖాన్ సంగీతాభిమానుల, విమర్శకుల అభిమానాన్ని ఎక్కువగా పొందా డనడంలో సందేహం లేదు. ఆయనది ఎవరికీ తలవంచని ధోరణి. ఏ సమావేశంలోనైనా బడేగులాం కచేరీ తరవాత ఒక్క విలాయత్ తప్ప మరెవరూ స్టేజీ ఎక్క సాహసించేవారు కాదట. ‘వీడికొక్కడికే ఆ ధైర్యం ఉంది’ అని పెద్దాయన విలాయత్‌ను మెచ్చుకునేవారట.

విలాయత్‌ఖాన్ ఔన్నత్యం ఎటువంటిది? ఆయన సితార్ వాయిస్తున్నప్పుడు అది గానకచేరీ పద్ధతిలోనే సాగేది. హమీర్ రాగంలో గత్ వాయిస్తున్నప్పుడూ,

దాన్ని ఖయాల్‌గా పాడి వినిపిస్తున్నప్పుడూ ఈ సంగతి గమనించవచ్చు.

ఏ వాయిద్యానికైనా సహజంగా కొన్ని పరిమితులుంటాయి. మీటిన తీగ కాసేపటికి కంపించడం మానేస్తుంది. గాత్రంలోనూ, వయొలిన్, సారంగీ, వేణువు మొదలైన వాయిద్యాల్లోనూ స్వరాన్ని ఎక్కువసేపు సాగదీయడం వీలవుతుంది. తీగ కంపనం ఎంతసేపు నిలుస్తే అన్ని సంక్లిష్టమైన గమకాలను వినిపించవచ్చు. విలాయత్‌ఖాన్ పెంపొందించిన శైలివల్ల ఒక్క మీటుతోనే స్వరాలను తెగకుండా జాలువార్చినట్టుగా పలికించడం, పాడితేతప్ప సాధ్యంకాదనిపించే గమకాలను మోగించడం వగైరాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఆయన ప్రభావం పడని ఈనాటి సితార్ వాద్యకారులను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. రాగవిస్తారంలో అంతులేని భావుకత, విద్వత్తు, తరతరాలుగా అందివస్తున్న లోతైన అవగాహన, గాంభీర్యం, నిండుతనం మొదలైనవన్నీ ఆయన కచేరీలను మరుపురానివిగా తీర్చిదిద్దాయి. గాత్రంలో ఉద్దండులైన అబ్దుల్ కరీమ్‌ఖాన్, ఫైయాజ్‌ఖాన్, బడేగులామలీఖాన్, అమీర్‌ఖాన్‌ల సుగుణాలన్నీ ఆయన తన సంగీతంలో రంగరించుకున్నాడు.

దర్బారీలో బడేగులాం రచనఅనోఖాలాడ్‌లా అనే కృతిని పాడి, గత్ రూపంలో ఆయన వాయించేవాడు. అలాగే కరీమ్‌ఖాన్ పాడిన ఝింఝోటీ రాగం అందమంతా మరొక గత్‌లో వినిపిస్తుంది. అటు జంత్రవాద్యపద్ధతిలో సాటిలేని కళాకారుడైన తన తండ్రి శైలినీ పుణికిపుచ్చుకుని చికారీ (తాళం తీగలు), ఝాలా మొదలైన కుడిచేతి విన్యాసాలనూ అద్భుతంగా కొత్తపద్ధతుల్లో పలికించి, తరవాతివారికి మార్గదర్శకుడుగా నిలిచాడు.

1950ల నుంచి ఆయన చేసిన కచేరీలు అద్భుతంగా ఉండేవి. మొదట చేపట్టిన రాగాన్ని 2 గంటలసేపు సునాయాసంగా వినిపించేవాడు. ఆలాపన, జోడ్ (తానం), ఝాలా (లయగతుల్లో తాళం తీగల విన్యాసాలతో వేగంగా సాగే ప్రక్రియ), ఆ తరవాత విలంబిత్ గత్, ద్రుత్ గత్, చివరికి తాళం మీద ఝాలా ఇలా అనేక విశేషాలతో రాగస్వరూపం పూర్తిగా బహిర్గతం అయేది. రాగం వికాసం చెందుతున్న క్రమం అద్భుతంగా ఉండేది. విరామం తరవాత ఆయన వైఖరి పూర్తిగా మారిపోయేది. ఏదో ఒక రాగంలో ఠుమ్రీ మొదలుపెట్టి, మధ్యలో కొన్ని రమ్యమైన గమకాలను పాడి వినిపిస్తూ, తన చిన్ననాటి ముచ్చట్లూ, గతకాలపు సంగీతతేజాలతో తన అనుభవాలనూ ఆత్మీయంగా వివరిస్తూ, రాగమాలికను జతచేస్తూ ఆహ్లాదకరంగా కచేరీ ముగించేవాడు. ప్రేక్షకులు కోరితే చివరకు (సింధు) భైరవి రాగం వినిపించేవాడు. కచేరీ జరుగుతున్నంతసేపూ శ్రోతలకు ఒళ్ళు పులకరించేదిగాని ఎక్కడా కేకలు పెడుతూ ప్రోత్సహించడం, వేగంగా వాయించినప్పుడు లయప్రకారం చప్పట్లు కొట్టడం వగైరా చవకబారు పనులేవీ చేసేవారుకాదు. ఆయన కచేరీలకు వెళ్ళడం ఒక విశేష అనుభవంగా అనిపించేది. రాగ మాధుర్యంలో ఓలలాడుతున్నప్పుడు ఆయన ఏ గమకం ఏ మీటుద్వారా పలికిస్తున్నాడనేది మరిచిపోయి శ్రోతలు సంగీతకారుడుగా ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి ముగ్ధులయేవారు.

ఠుమ్రీలను సితార్‌మీద పలికించడంలో ఆయన సిద్ధహస్తుడు. అందుకు కావలసిన ప్రత్యేక గమకాలను ఆయన ఎంతగానో అభివృద్ధి చేశాడు. కేవలం వాద్యనైపుణ్యమే కాక ఠుమ్రీలలోని సౌందర్యమూ, రొమాంటిక్ లక్షణాలూ ఆయన అంతరాత్మనుంచి మోగుతున్నట్టుగా అనిపించేది. తనకు నచ్చనిదీ, తన మనసుకు పట్టనిదీ ఆయనెప్పుడూ వాయించలేదు. సితార్ సృష్టికర్తగా పేరుపొందిన అమీర్ ఖుస్రో గురించీ, కవ్వాలీ, సూఫీ సంప్రదాయాల గురించీ చాలా అధ్యయనం చేశాడు.

విలాయత్‌ఖాన్‌కు అహంభావమూ ఎక్కువే. అయితే దానికి తప్పుపట్టి లాభంలేదనిపించేది. తనకుగాని, సంగీతానికిగాని ఏమాత్రం అవమానం జరిగిందనిపించినా సహించేవాడుకాడు. డబ్బు కోసమూ, పేరు కోసమూ కక్కూర్తిపడేవారంటే ఆయనకు ఏహ్యభావన ఉండేది. బొంబాయిలో ఒక సందర్భంలో నౌకాదళంవారు రవిశంకర్ సితార్ కచేరీ ఏర్పాటు చేసి, కారణాంతరాలవల్ల ఆయన రాలేకపోవడంతో ఆయనకు బదులుగా విలాయత్‌ఖాన్‌ను ఆహ్వానించారు. హాజరైన ప్రేక్షకుల్లో సంగీతం ఏమీ తెలియని నౌకాదళ సైనికులు ఎక్కువగా ఉన్నారు. ఉస్తాద్‌గారు హంసధ్వని రాగం వాయిస్తూ ఉంటే టికెట్లు కొనుక్కుని వచ్చిన నావంటి ప్రేక్షకులెంతో సంతోషించారు. మర్యాద తెలియని నావికులు మాత్రం బోరుకొట్టడంచేత చప్పట్లు కొట్టసాగారు. అంతే; ఉస్తాద్ వాయించడం మధ్యలోనే ఆపేసి దిగ్గున లేచి లోపలికెళిపోయారు. మహారాష్ట్ర గవర్నర్ అలీయావర్‌జంగ్, నౌకాదళాధిపతి కర్సెట్‌జీ తదితరులు వచ్చి సభాముఖంగా క్షమాపణలు చెప్పినా ఉపయోగం లేకపోయింది. టికెట్లు కొన్నవారందరికీ డబ్బు వాపస్ చెయ్యబడింది.

తన ప్రజాదరణకు రేడియో మీద కాస్తయినా ఆధారపడని గొప్ప విద్వాంసుడాయన. కేవలం రికార్డులు, కచేరీల మూలంగానే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారంటే అది సామాన్యమైన విషయం కాదు.

విలాయత్ వాయించిన అద్భుతమైన లాంగ్‌ప్లే రికార్డ్లు ఎన్నో ఉండేవి. యమన్, దర్బారీ రాగాల్లో తలొకటీ ఉండేవి. ఖమాజ్, పిలూ ఠుమ్రీ రికార్డుల్లో ఆయనతో సమానంగా శాంతాప్రసాద్ తబలా వినిపిస్తుంది. అలాగే పూరియా, అల్హైయా బిలావల్ రాగాల్లో కిషన్‌మహారాజ్ తబలా అమోఘంగా ఉంటుంది. అమీర్ ఖుస్రోకు నివాళిగా అతను సృష్టించిన సాజ్‌గిరీ రాగంలో ఒక రికార్డు వాయించారు. తమ్ముడు ఇమ్రత్‌తో (సుర్‌బహార్) కలిసి మియామల్హార్, చాంద్‌నీ కేదార్ రాగాల్లో వాయించారు.


(ఎడమనుంచి) తిరుచ్చి శంకరన్ (మృదంగం), లాల్గుడి జయరామన్ (వయొలిన్), విలాయత్‌ఖాన్, శాంతాప్రసాద్ (తబలా)

రవిశంకర్ ద్వారా ప్రపంచమంతా సితార్ పేరు మారుమోగింది. ఆ విధంగా సితార్ గురించి తెలుసుకున్నవారిలో కొందరు విలాయత్‌ఖాన్‌ను మరింత గొప్ప కళాకారుడుగా గుర్తించారు. పాశ్చాత్య సంగీతం జోలికి పోకుండా, మన సంగీతం గురించిన ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలని నొక్కిచెపుతూ ఆయన రాజీపడకుండా నిలిచాడు. అయితే రవిశంకర్, అలీఅక్బర్‌ఖాన్ జయప్రదంగా చేసిన జుగల్‌బందీ కచేరీలను ఆయన గుర్తించకపోలేదు. తన తమ్ముడు ఇమ్రత్‌ఖాన్‌తోనూ, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్‌తోనూ చేసిన కచేరీలే కాక, లాల్గుడి, ఎం.ఎస్. గోపాలకృష్ణన్ తదితరులతో హిందూస్తానీ, కర్ణాటక జుగల్‌బందీ కచేరీలు కూడా ఆయన వాయించాడు.


విలాయత్‌ఖాన్‌, ఇమ్రత్‌ఖాన్‌

పాప్యులారిటీ కోసం ఆయన ఎప్పుడూ తలవంచలేదు. ప్రేక్షకులకు ఉన్నతస్థాయి సంగీతాన్ని వినిపించి వారిని ‘పైకి’ తీసుకొచ్చాడు. కమర్షియల్ ధోరణులకు తలఒగ్గని ఇటువంటి ఒక ఉత్తమ కళాకారుడు ఒకడు ఇరవయ్యొకటో శతాబ్దంలో కూడా విజయాన్ని సాధిస్తున్నాడని అందరికీ గర్వంగా ఉండేది. ఆయన శైలి జగత్ప్రసిద్ధం అయింది. అందరికన్నా ఎక్కువ పారితోషికం తీసుకుంటూ కూడా కచేరీలకు ఆహ్వానాలు అందుకోవడం ఆయనకు సంతృప్తికరంగా ఉండేది.

1951నుంచి విలాయత్‌ఖాన్ అనేక విదేశీ పర్యటనలు చేసి కచేరీల ద్వారా ప్రపంచఖ్యాతిని పొందాడు. ఉన్నత సంగీతసంప్రదాయాలతో ఏ మాత్రమూ రాజీపడకుండా, పబ్లిసిటీకోసం ఎవరి వెంటా పడకుండా వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నందుకు ఆయనకు విశేషగౌరవం లభించింది. 1980ల తరవాత విలాయత్‌ఖాన్ ఎక్కువకాలం న్యూజెర్సీలో తన ఇంటో గడపసాగాడు. సంగీత ప్రపంచంలో పెరిగిపోతున్న కమర్షియల్ ధోరణులకు ఆయన విసుగుచెందాడు. 2003 డిసెంబర్‌లో బిస్మిల్లాతో ఆయన చివరి జుగల్‌బందీ కచేరీ జరిగింది. చివరకు ఆయనకు ఊపిరితిత్తుల కేన్సర్ సోకింది. మధుమేహం, రక్తపోటు సమస్యలకు ఇది తోడవడంతో మార్చ్ 2004లో బొంబాయిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశాడు. ఆయన భౌతికకాయాన్ని కోల్‌కతాలో ఖననం చేశారు.


లాల్గుడి జయరామన్,
విలాయత్‌ఖాన్

విలాయత్‌ఖాన్ కచేరీ చేస్తే ఊళ్ళో ఉన్న పెద్ద సంగీతవిద్వాంసులందరూ హాజరయేవారు. బొంబాయిలో శివకుమార్ శర్మ (సంతూర్), హలీం జాఫర్ (సితార్), అంజాద్ అలీ (సరోద్), కిశోరీ అమోణ్‌కర్ (గాత్రం) తదితరులంతా శ్రోతలుగా వచ్చి వినేవారంటే ఆయనపై వారికెంత గౌరవం ఉండేదో తెలుస్తుంది. మనవారిలో చిట్టిబాబు (వీణ) ఆయన మద్రాసుకు వచ్చినప్పుడల్లా కలుసుకుని తన గౌరవాభిమానాలు తెలుపునేవారు. విలాయత్‌ఖాన్ శైలి తనకు చాలా మ్యూజికల్‌గా అనిపిస్తుందని బాలమురళి నాతో అన్నారు. నాటి రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్అలీ నుంచి ఆయనకు ఆఫ్తాబే సితార్ (సితార్ మార్తాండుడు) అనే బిరుదు లభించింది.

మొత్తంమీద విలాయత్‌ఖాన్ కారణంగా సితార్‌కు ఒక గొప్ప స్థాయి ఏర్పడింది. రవిశంకర్ దానికి దేశవిదేశాల్లో ప్రజాదరణ తీసుకురాగా విలాయత్ దానికి పాట నేర్పారు. ఏదో నాజూకుగా నేపథ్యసంగీతానికి మాత్రమే పనికొచ్చే పద్ధతిలో కాకుండా గాయకవిద్వాంసుల శైలిలో, అవసరమైతే ‘గర్జించినట్టుగా’ కూడా సితార్ వాయించవచ్చునని ఆయన నిరూపించాడు. ఇది సితార్ శైలిలో ఒక విప్లవాత్మక పరిణామాన్ని తీసుకొచ్చింది. తాను జీవించినన్నాళ్ళూ విలాయత్‌ఖాన్ ఒక సితార్ విద్వాంసుడి హోదానుంచి పైకెదిగి అత్యున్నత సంగీతశిఖరంగా సంగీతాభిమానుల మనసుల్లో శాశ్వతస్థానం పొందారు. ఆయనకు సాటి రాగల విద్వాంసులు చాలా కొద్దిమందే కనిపిస్తారు.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...