ఓ.పీ.నయ్యర్‌

O. P. Nayyar అతను లతా మంగేశ్కర్‌ చేత పాడించకుండానే హిందీ సినీ రంగంలో సంగీత దర్శకుడుగా వెలిగాడు. స్వరజ్ఞానమేదీ లేకుండానే సంగీత దర్శకత్వం చేపట్టి విజయం సాధించాడు. ఇటీవల కాలం చేసిన ఓ.పీ. నయ్యర్‌ గురించిన ఈ రెండు విశేషాలూ చెప్పుకోదగ్గవే. 1950లూ, 60లలో అతను హిందీ సినీ సంగీతాన్ని ఒక ఊపు ఊపాడు. అతని సంగీతంలాగే అతని జీవితమూ, వ్యక్తిత్వమూ కూడా ప్రత్యేకమే. హిందీ సినీ సంగీతంలో అతన్ని మొదటి “రౌడీ” అనవచ్చునేమో. అతని యుగం ముగిసి మూడు దశాబ్దాలు గడిచినా అతని అభిమానులు ఈనాటికీ ఉన్నారు. తన గురించీ, ఇతరుల గురించీ అనేక ఇంటర్వ్యూలలో నయ్యర్‌ ముక్కు సూటిగా, నిర్మొహమాటంగా, కుండ బద్దలు కొట్టినట్టుగా అనేక విషయాలు చెపుతూ వచ్చాడు. వాటిలో కొన్ని విషయాలను పాఠకులతో ముచ్చటించుకునేందుకే ఈ వ్యాసం.

1930ల నాటి బెంగాలీ ధోరణులను వదిలించుకున్నాక హిందీ సినిమా పాటలు అనిల్‌ బిశ్వాస్‌, అతని శిష్యుడు సి.రామచంద్ర, తదితరులవల్ల నాజూకుదనాన్నీ, నౌషాద్‌ వంటివారివల్ల పటిష్టతనూ సంతరించుకున్నాయి. 1940లు ముగిసే నాటికి పెద్ద నిర్మాతలూ, సంస్థలూ, దర్శకులూ, హీరోలూ ఒక్కొక్క సంగీత దర్శకుణ్ణి “నిలయ విద్వాంసుడు”గా పెట్టుకోవడం ఉండేది. రాజ్‌కపూర్‌ శంకర్‌ జైకిషన్లనూ, దిలీప్‌కుమార్‌ నౌషాద్‌నూ, దేవానంద్‌ ఎస్‌.డి.బర్మన్‌నూ ఆదరించి, పోషించారు. శాంతారామ్‌ వసంత్‌ దేశాయినీ, సి.రామచంద్రనూ తీసుకునేవాడు. నయ్యర్‌ విషయంలో అలాంటిది జరగలేదు. అతను పనిచేసిన సినిమాలు ఎక్కువగా “అనామకులు” నిర్మించి, నటించినవే. ఆ సినిమాలూ, నటీ నటులూ గుర్తున్నా, లేకపోయినా నయ్యర్‌ పాటలను మాత్రం ఎవరూ మరిచిపోలేరు. సినిమా పాటలు అతని చేతిలో విశృంఖలం అయినట్టుగా అనిపించేవి. హిట్‌ పాటలు అంతకు ముందు లేవని కాదు. శంకర్‌ జైకిషన్లకు శాస్త్రీయ సంగీతంతో పాశ్చాత్య బాణీలను కలిపి జనాదరణ పొందడం బాగా తెలుసు. అందుకే “నిన్నొక్కణ్ణి చూస్తేనే మాకు భయం” అని సాటి సీనియర్‌ సంగీత దర్శకుడు శంకర్‌ తనతో అన్నట్టుగా ఒక సందర్భంలో నయ్యర్‌ చెప్పుకున్నాడు. అప్పట్లో శంకర్‌ జైకిషన్ల జోరు విపరీతంగా ఉండేది కనక ఇది గర్వపడవలసిన సంగతే.

అప్పటి సినీ సంగీతానికి ఉన్న కట్టుబాట్లను నయ్యర్‌ చాలావరకూ వదిలించాడు. అతని గుర్రపు డెక్కల సంగీతం యువతకు ప్రతీక అయింది. నౌషాద్‌ “దీదార్‌”లో “బచ్‌పన్‌ కే దిన్‌ భులా న దేనా” అనే పాటలోనూ, “కోహినూర్‌”లో “కోయీ ప్యార్‌ కీ దేఖే జాదూగరీ” అనే పాటలోనూ వాడిన గుర్రబ్బండీ నడకను నయ్యర్‌ లెక్కలేనన్ని సార్లు (అవసరం ఉన్నా లేకపోయినా) ఉపయోగించుకున్నాడు. నిజానికి సంగీతపరంగా చూస్తే నయ్యర్‌ పరిధి సంకుచితమైనదే. అయితే అతని పాటల్లోని హుషారు అతనికి అంతులేని పాప్యులారిటీని తెచ్చిపెట్టింది. అంతమాత్రాన అతన్నీ, సినీ సంగీతం మీద అతని ప్రభావాన్నీ తక్కువగా అంచనా వెయ్యలేం. అతని కొన్ని పాటల్లో అద్భుతమైన కల్పనాశక్తి కనబడుతుంది. ఎటొచ్చీ అతని సంగీతానికి సరైన పునాదులు లేకపోవటంతో అతని సంగీతయాత్ర అంతా వ్యక్తిగత ప్రేరణలూ, భావనల ఆధారంగానే సాగినట్టుగా అనిపిస్తుంది. అందువల్ల నయ్యర్‌ సంగీతాన్ని గురించి చెపుతున్నప్పుడు అతని వ్యక్తిగత జీవితపు ప్రస్తావన తప్పనిసరి అవుతుంది.

1926లో లాహోర్‌లో జన్మించిన ఓంకార్‌ ప్రసాద్‌ నయ్యర్‌ తన ప్రొఫెషనల్‌ జీవితాన్ని ముంబయిలోనే గడిపాడు. అతని సంగీతం కన్నా అతని జీవిత విశేషాలే ఎక్కువ ఆసక్తికరం అనిపిస్తాయి. తన తొలి రోజుల గురించి నయ్యర్‌ తానే చెప్పుకున్నాడు. అతని తండ్రి గవర్న్‌మెంట్‌ మెడికల్‌ స్టోర్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేసేవాడట. అతని సోదరులూ, దగ్గర బంధువులూ డాక్టర్లూ, న్యాయాధికారుల ఉద్యోగాలు చేపట్టారు కాని నయ్యర్‌కు అటువంటి ధ్యాస ఉండేది కాదట. అతనికి చదువబ్బలేదు సరికదా కాలేజీ పరీక్ష ఫీజుకని ఇచ్చిన 18 రూపాయలను విస్కీ కోసం ఖర్చుపెట్టి తండ్రి చేత తన్నులు తిన్నాడట. సంగీతం పిచ్చి మాత్రం ఉండేది.

అతను పదకొండో ఏటనే తానుగా హార్మోనియం వాయించడం, పాడడం నేర్చుకున్నాడు. శాస్త్రీయ రాగాలూ, స్వరాలూ ఏవీ ఏ గురువు వద్దా నేర్చుకోకపోయినా పటియాలాలోనూ, అమృత్‌సర్‌లోనూ సంగీతం పాఠాలు కూడా చెప్పాడు. లాహోర్‌లో నయ్యర్‌ కుర్రవాడుగా ఉన్నప్పటినుంచీ చూసేదాన్నని శమ్‌శాద్‌ బేగమ్‌ చెప్పింది. సైకిల్‌ మీద గ్రామొఫోన్‌ కంపెనీ చుట్టూ తిరిగేవాడనీ, సీనియర్లు అడిగినప్పుడల్లా వెళ్ళి సోడాలూ, అయిస్‌క్రీములూ పట్టుకొస్తూ ఉండేవాడనీ తెలిపింది. నయ్యర్‌ తన పదిహేడో ఏట సైగల్‌ను మనసులో ఉంచుకుని “ప్రీతమ్‌ ఆన్‌ మిలో” అనే పాటను కంపోజ్‌ చేసి సి.ఎచ్‌.ఆత్మా చేత పాడించాడు. ఆ రికార్డు 1945లో విడుదలైంది. (1989లో ఇటువంటి భావగీతాన్ని మళ్ళీ “నీరాజనం” సినిమాలో నయ్యర్‌ ఎం.ఎస్‌.రామారావు చేత అద్భుతంగా పాడించడం చెప్పుకోదగ్గ విషయం). సంగీత దర్శకుడుగా పేరొచ్చిన పదేళ్ళకు మళ్ళీ తన తండ్రిని కలుసుకున్నప్పుడు ఆయన చాలా సంతోషించాడని నయ్యర్‌ అన్నాడు. “సంగీతం నేర్చుకోకుండా అదెలా సాధ్యమైంది?” అని అడిగితే నయ్యర్‌ “అదంతా దేవుడి కృప” అంటాడు. అదే మన దేశపు సంస్కారమనీ, సహజ శక్తి అనీ అతని ఉద్దేశం. పైగా “గౌతమ బుద్ధుడూ, ఏసుక్రీస్తూ ఏ బళ్ళో చదువుకుని జ్ఞానం సంపాయించారు? ఈనాడైనా కవిత్వం రాయడమెలాగో నేర్పే స్కూళ్ళున్నాయా?” అని నయ్యర్‌ ఎదురు ప్రశ్న వేస్తాడు.
దేశ విభజన తరవాత అమృత్‌సర్‌ చేరి, మొదట్లో జలంధర్‌ రేడియోలో గాయకుడుగా, సంగీత దర్శకుడుగా పనిచేసిన నయ్యర్‌ మిత్రుల సహాయంతో బొంబాయి చేరుకుని, 1949లో కనీజ్‌ అనే సినిమాకు స్వరరచన చేశాడు. దానిలాగే దాని తరవాతి రెండు మూడు సినిమాలూ ఫ్లాప్‌ అవడంతో అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు. తరవాత 1954, 55, 56లలో గురుదత్‌ తీసిన ఆర్‌ పార్‌, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55, సీఐడీ సినిమాల వల్ల అతనికి బాగా పేరొచ్చింది.

గీతా దత్‌, రఫీ ఆర్‌ పార్‌లో రఫీ, గీతా పాడిన సరదా పాట “సున్‌ సున్‌ జాలిమా” ట్యూన్‌ను గీతా విషాద గీతంగా “జా జా బేవఫా” అంటూ ఎంతో భావయుక్తంగా పాడింది. సీఐడీ సినిమాలో అమెరికన్‌ గీతం “ఓ మై డార్లింగ్‌ క్లెమెంటైన్‌” అనేదాన్ని అనుకరిస్తూ “యే హై బంబై మేరీ జాన్‌” అనే ప్రసిద్ధ గీతాన్ని నయ్యర్‌ రఫీ చేత పాడించాడు. ఆర్‌ పార్‌ లోని “యే లో మైఁ హారీ పియా” పంజాబీ శైలి పాట. గురుదత్‌ భార్య అయిన గీతాకు ఈ పాటల వల్ల చాలా పేరొచ్చింది. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55లో “ఠండీ హవా కాలీ ఘటా” చాలా ప్రజాదరణ పొందింది. ఆర్‌ పార్‌లాగే జానీ వాకర్‌కు రఫీ అద్భుతంగా పాడాడు. ఈ పాటలన్నీ గురుదత్‌ నిర్దేశించినట్టుగా ముందుగా ఆరెస్ర్టా ఏమీ లేకుండా అకస్మాత్తుగా మొదలవడం గమనించవచ్చు. 1957లో బి.ఆర్‌. చోప్రా తీసిన నయా దౌర్‌ వల్ల నయ్యర్‌కు బాగా గుర్తింపు వచ్చింది.

శమ్‌శాద్‌ బేగమ్‌నయ్యర్‌ 1950లలో ప్రవేశించే నాటికి హిందీ సినిమాల్లో ఉద్దండులు వెలిగిపోతూ ఉండేవారు. శాస్త్రీయ, ఠుమ్రీ, గజల్‌, జానపద బాణీల్లో అద్భుత సృష్టి చేస్తున్న నౌషాద్‌, ఎస్‌.డి.బర్మన్‌, రోషన్‌, అనిల్‌ బిశ్వాస్‌, సి. రామచంద్ర, శంకర్‌ జైకిషన్లవంటి హేమాహేమీల మధ్య నిలదొక్కుకోవటానికి నయ్యర్‌ సంగీతంలోని పంజాబీ “ఊపు” బాగా పనికొచ్చింది. “హౌరా బ్రిజ్‌”లో గీతా పాడిన “మేరా నామ్‌ చిన్‌చిన్‌చూ” క్లబ్‌ పాటగా ఎంతో ప్రజాదరణ పొందింది. అతని పాటలవల్ల అప్పటిదాకా సాగదీస్తూ, ఏడుపు పాటలకే పరిమితమైన గీతాదత్‌ కొత్త అవతారం ఎత్తినట్టయింది. గీతాదత్‌నే కాక ఆశా భోఁస్లే పాడే శైలిని కూడా తానే తీర్చి దిద్దినట్టు నయ్యర్‌ చెప్పాడు. అలాగే శంకర్‌ జైకిషన్ల యాహూ పాటకు చాలాకాలం క్రితమే గాయకుడుగా రఫీ ఇమేజ్‌ని నయ్యర్‌ మార్చగలిగాడు. “దిల్‌ దేకే దేఖో” సినిమాలో షమ్మీ కపూర్‌ “తుమ్‌సా నహీఁ దేఖా” మొదలైన పాటల వల్ల కొత్త శైలి మొదలుపెట్టాడు. కిస్మత్‌ (1968) సినిమాకు ఆశా, శమ్‌శాద్‌ బేగమ్‌ కలిసి పాడిన “కజ్‌రా మొహబ్బత్‌వాలా” అనే జానపద గీతం బాగా పాప్యులర్‌ అయింది.

సినిమాల్లో పాటలే కాక సందర్భోచితంగా ఎంతో నేపథ్య సంగీతం ఉంటుంది. అయితే సంగీత జ్ఞానం లేకపోయినా రీరికార్డింగ్‌ సంగీతం సమకూర్చడం తనకు కష్టం కాలేదనీ, శృంగార, భావపరమైన సన్నివేశాలు తనకు సులభమనీ నయ్యర్‌ అన్నాడు. క్రైమ్‌ మొదలైనవాటిని మాత్రం తన అసిస్టెంట్లకు వదిలేవాడట. “ఎవరూ నమ్మకపోవచ్చుగాని ఈ కారణం వల్లనే నేను పనిచేసిన సినిమాలను పూర్తిగా చూడని సందర్భాలు కూడా ఉండేవి” అన్నాడు నయ్యర్‌.

తన శక్తుల గురించీ, తన పాటల జనాదరణ గురించీ నయ్యర్‌కు బాగా తెలుసు. సినిమా ఎటువంటిదైనప్పటికీ తన పేరుతో బాగా ఆడుతుందని గుర్తించాక నయ్యర్‌ ఎవరికీ తలవంచకుండా నిలిచాడు. చోప్రా, శాంతారామ్‌ మొదలైనవారు తానడిగినంత ఇవ్వకపోవడంతో వారిచ్చిన కొన్ని అవకాశాలను నయ్యర్‌ వదులుకున్నాడు కాని రాజీ పడలేదు. ప్రొడ్యూసర్లూ, డిస్ర్టిబ్యూటర్లూ గదిలోకి వచ్చినప్పుడల్లా లేచి నిలుచోవడం వగైరాలేవీ చేసేవాడు కాడు. అతని గర్వమూ, అహంభావమూ కొందరికి నచ్చేవికావు. “నేను ఏ ట్యూన్‌ అయినా అయిదు నిమిషాల్లో చేసేవాణ్ణి; అయినా సంగీతం గురించి ఏమీ తెలియని ప్రొడ్యూసర్లకు లోకువ అవుతానని వారిని 15 రోజుల తరవాత రమ్మనేవాణ్ణి. అప్పుడు వారికెంతో సంతృప్తిగా ఉండేది” అని నయ్యర్‌ అన్నాడు. “సన్నివేశాన్ని వర్ణించినప్పుడూ, చిత్రీకరించినప్పుడూ పాటకు తగిన ప్రేరణ లభిస్తుంది. తానిచ్చిన ట్యూన్‌ను డైరెక్టర్‌ నిరాకరిస్తే నయ్యర్‌ ఒప్పుకునేవాడు కాదు. “ఒక సందర్భంలో గురుదత్‌ నా పాట చరణాన్ని మార్చమన్నాడు. నువ్వు తీసిన సీన్‌ను మరో రకంగా తియ్యి; అప్పుడు నేనూ మారుస్తాను” అన్నాను. అతనికి కోపం వచ్చింది కాని నేను లొంగలేదు” అన్నాడు నయ్యర్‌.

అతనికి అందరు పాటల రచయితలతోనూ పడేది కాదు. మహాకవి సాహిర్‌ ఎవరితోనో మాట్లాడుతూ “ప్యాసా” సినిమాలోని తన పాటల వల్లనే ఎస్‌.డి.బర్మన్‌కు పేరొచ్చిందని అనడం నయ్యర్‌ చెవిన పడింది. బర్మన్‌ మీద తనకున్న గౌరవం వల్ల నయ్యర్‌ ఆ తరవాత సాహిర్‌ పాటలకు సంగీతం సమకూర్చలేదు. ఎప్పుడో తప్ప నయ్యర్‌ సామాన్యంగా పాట రాసిన తరవాతనే, మాటల అర్థాన్ని బట్టి ట్యూన్‌ చేసేవాడు. ముందుగా ట్యూన్‌చేసి కూర్చోవడం, దానికి సరిపడే మాటలని ఇరికించడం అంటే శవపేటికను తయారు చేసేసి, ఆ తరవాత శవాన్ని అందులో కుదించినట్టుగా ఉంటుంది అనేవాడు!

శమ్‌శాద్‌ బేగమ్‌
రాజీ పడని మనస్తత్వం

మొత్తం మీద తన మొండి వైఖరి వల్ల నయ్యర్‌ పెద్ద రచయితలతోనూ, సంస్థలతోనూ పనిచెయ్యలేదు. తన సామర్య్థాన్నే నమ్ముకుని, తన జీవితాన్ని ఇతరులెవరూ శాసించకుండా చూసుకున్నాడు. అతను టైము విషయంలో చండశాసనుడే. సమయానికి రికార్డింగ్‌కు హాజరు కాలేదని అతను రామ్‌ నారాయణ్‌ (సారంగీ), రయీస్‌ఖాన్‌ (సితార్‌) మొదలైన పెద్ద విద్వాంసులను కూడా వెనక్కి పంపేవాడు. అనవసర జాప్యం వల్ల ప్రొడ్యూసర్లకు నష్టం రాకూడదని అతని ఉద్దేశం. చివరికి ఇది మహమ్మద్‌ రఫీ విషయంలో కూడా జరిగి అతను కొన్నేళ్ళ పాటు రఫీని పిలవలేదు. అపస్వరాలు పాడతాడని తెలిసినప్పటికీ మొండిగా మహేంద్ర కపూర్‌ చేత పాడించాడు. అలాగే ముకేశ్‌ పాడిన “చల్‌ అకేలా” బాగా పేరు పొందింది.

ఆశాతో లతా మంగేశ్కర్‌ చేత పాడించకుండానే పేరు సంపాదించడం నయ్యర్‌ ఘనతే. పాటకు కట్టిన ట్యూన్‌ బలంగా ఉండాలనీ, పాడేవారి శక్తిమీద ఆధారపడడం బలహీనత అనీ అతను వాదిస్తాడు. మంచి పాట ఎవరు పాడినా రాణించాలని అతని ఉద్దేశం. 1952లో నయ్యర్‌ “ఆస్‌మాన్‌” అనే సినిమాలో పాడించడానికి లతాను పిలిపించినప్పుడు రికార్డింగ్‌ జరగక ముందే ఏదో తగాదా వచ్చిందట. లతా, ఆశా, వారి తక్కిన కుటుంబ సభ్యులతోదాంతో లతా పాడకుండానే వెళిపోయిందట. ఆమె లేకుండానే పని కానిస్తానన్న నయ్యర్‌ గీతా దత్‌ చేత పాడించాడట కాని సినిమా బాగా ఆడలేదు. ఆ తరవాత ఇంటర్వ్యూల్లో నయ్యర్‌ లతా ఒకరినొకరు ప్రశంసించుకోవడం జరిగింది కాని ఈ సంఘటన ప్రస్తావనకు రాలేదు. అతని బాణీలకు లతా గొంతు నప్పదని మాత్రం ఇద్దరూ అన్నారు. “నేను దేన్నైనా ఒకసారి వదిలిపెడితే మళ్ళీ వెనకు వెళ్ళడమనేది జరగదు” అన్నాడు నయ్యర్‌. ఇది లతా విషయంలోనే కాదు; పాకిస్తాన్‌కు తిరిగి వెళ్ళడం గురించి కూడా జరిగింది.

నయ్యర్‌ మొదటి నుంచీ రంగేళీ శృంగార పురుషుడే. పెళ్ళయిన తరవాత కూడా తాను ఇతర స్త్రీల వెంటపడడం మానబోయేది లేదని కాబోయే భార్యకు తానే చెప్పేశాడట! ఈ ధోరణి అతని జీవితమంతా కొనసాగింది. తాను పొడుగ్గా, ఎర్రగా, బుర్రగా ఉంటాననీ, ఆడవాళ్ళు తన వెంట పడతారనీ అతని నమ్మకం. ఇటువంటి వ్యక్తిగత వివరాలు అంత అవసరం కావుగాని ఆశా భోఁస్లే విషయంలో దీనికి ప్రాముఖ్యత ఉండేది. 1952 తరవాత తన వైవాహిక జీవితంలో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న ఆశా నయ్యర్‌కు చేరువ అవడంతో వారిద్దరి కాంబినేషన్‌వల్ల ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయి. అయితే ఆశా భోఁస్లే విధించిన ఆంక్షలవల్ల తాను గీతాదత్‌, శమ్‌శాద్‌ బేగమ్‌వంటి మంచి గాయనులకు అవకాశం ఇవ్వలేకపోయానని నయ్యర్‌ ఇటీవలి ఒక సందర్భంలో వెల్లడించాడు. 1974లో “ప్రాణ్‌ జాయే పర్‌ వచన్‌న జాయే” అనేది ఆశా నయ్యర్‌కు పాడిన ఆఖరి సినిమా. “చైన్‌సే హమ్‌కో కభీ” అనే మంచి పాటకు ఆమెకు అవార్డ్‌ కూడా లభించింది. ఆ తరవాత ఆమె ఆర్‌.డీ.బర్మన్‌కు భార్య అయింది. ఆ సంగతి ప్రస్తావిస్తూ నయ్యర్‌ తనకు జాతకాల మీద నమ్మకం ఉందనీ, తన శకం అయిపోతోందని ముందుగా గుర్తించడం వల్ల తానే ఆశాకు దూరం కావటానికి నిశ్చయించుకున్నాననీ అన్నాడు. ఇదెంత నిజమో తెలియదు కాని నయ్యర్‌ యుగం ఆనాడే ముగిసిపోయింది. తననుంచి వేరు పడ్డాక ఆశా పాటల్లో జీవం తగ్గిపోయిందనీ, ఆశాను పెళ్ళి చేసుకున్నప్పటికీ ఆర్‌.డీ.బర్మన్‌ ఎప్పుడూ తన మంచి పాటలను లతా చేతే పాడించేవాడనీ నయ్యర్‌ అన్నాడు.

కొన్ని ఇంటర్వ్యూల్లో ఆశాను నయ్యర్‌ గురించి అడిగినప్పుడు “అతని పాటల్లో కొన్ని మంచి గమకాలు ఉండేవి; అవి నా శైలికి బాగా నప్పేవి” అని మాత్రమే చెప్పి ఊరుకుంది. మొత్తం మీద వీరిద్దరి వ్యవహారం బాగా చర్చకు వచ్చిన సంగతి. పేర్లు చెప్పకపోయినా 1997లో సయీ పరాంజపే తీసిన “సాజ్‌” అనే సినిమా గాయనులుగా లతా, ఆశాల జీవితాల గురించి తీసినదేనని తెలుస్తుంది. ఆమె దర్శకత్వంలో అరుణా ఇరానీ, శబానా ఆజ్మీలు అక్కా చెల్లెళ్ళుగా నటించారు. ఇందులో “నయ్యర్‌, “ఆర్‌.డీ.బర్మన్‌” (ప్రముఖ తబలా కళాకారుడు జకీర్‌ హుసేన్‌ నటించాడు) పాత్రలు కూడా ఉన్నాయి.

నయ్యర్‌ మార్క్‌ మూస ధోరణిలో లేని మంచి పాటలు చాలానే ఉన్నాయి. “బాప్‌రే బాప్‌” సినిమాలో ఆశా భోఁస్లే, కిశోర్‌కుమార్‌ పాడిన “పియా పియా” అనే యుగళగీతం గుర్రపు డెక్కలదే కాని, “బహారేఁ ఫిర్‌ భీ ఆయేంగీ” లోని రఫీ పాట “ఆప్‌కీ హసీన్‌ రుఖ్‌” అనే భావగీతం, గీతా, ఆశా కలిసి “జానీవాకర్‌” అనే సినిమాలో పాడిన యుగళగీతం “ఠండీ ఠండీ హవా”,”కిస్మత్‌” (1968)లో ఆశా పాడిన “ఆఓ హుజూర్‌” అనే మైకపు పాట, “మిట్టీ మేఁ సోనా”లో ఆశా పాడిన “పూఛో న హమేఁ హమ్‌ ఉన్‌కే లియే”, “నయా అందాజ్‌”లో కిశోర్‌, శమ్‌శాద్‌ బేగం పాడిన “మేరీ నీందోం మేఁ తుమ్‌”, మొదలైనవన్నీ నయ్యర్‌ అసమాన ప్రతిభకు అద్దంపడతాయి.

సోనే కీ చిడియాలో నటించిన బల్‌రాజ్‌ సహానీ, 
తలత్‌ మహమూద్‌లతో “సోనే కీ చిడియా”లో తలత్‌ మహ్మూద్‌ నటించి, అతని దర్శకత్వంలో పాడాడు. ఎటొచ్చీ ఒక సందర్భంలో అతనే చెప్పినట్టు నయ్యర్‌ సినిమాల్లో ఎక్కువ భాగం పెద్దతరహా ప్రొడ్యూసర్లు తీసినవి కావు. పైన చెప్పిన పాటల్లో ఎంతో మంచివన్నీ ఎవరికీ గుర్తుండని అనామకులైన డైరెక్టర్లూ, తారలూ పాల్గొన్న సినిమాలే. కాస్త ప్రసిద్ధులు నటించినవాటిలో కశ్మీర్‌కీ కలీ, మేరే సనమ్‌, ఫిర్‌ వొహీ దిల్‌ లాయాహూఁ మొదలైనవి ఉన్నాయి. “ఫాగున్‌, రాగినీ, సంబంధ్‌, సావన్‌ కీ ఘటా, సోనే కీ చిడియా” మొదలైన సినిమాల్లోని అతని మంచి పాటలన్నీ Music India Online లో దొరుకుతాయి. తెలుగువారికి పరిచితమైన నీరాజనం సినిమాకు నయ్యర్‌ 1989లో సంగీతం అందించాడు. అందులో ట్యూన్లన్నీ నయ్యర్‌ తరహాలో బావుండడంతో బాగా ప్రజాదరణ పొందాయి. ఎటొచ్చీ అందులో జానకీ, బాలసుబ్రహ్మణ్యం ఆశా, రఫీల్లాగా పాడ ప్రయత్నించి విఫలం చెందారనేది నా వ్యక్తిగత అభిప్రాయం.

ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంతో
ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంతో

నా మటుకు నేను ఏ సినిమా పాట విన్నా రాగం ఊహించటానికి ప్రయత్నిస్తాను. ఒక్క నయ్యర్‌ విషయంలో మటుకు పాట బావున్నప్పటికీ ఎందుకో రాగం మీదికి నా మనసు పోదు. స్వర రచయితకు రాగం ధ్యాస లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందేమో; ఏమైనా ఇదొక ప్రత్యేకత అని నా కనిపిస్తుంది. ఏక్‌ ముసాఫిర్‌ ఏక్‌ హసీనా చిత్రంలోని ఆప్‌ యూఁహీ అగర్‌, బహుత్‌ శుక్రియా, హమ్‌కో తుమ్హారే మొదలైన పాటలన్నీ దాదాపుగా కేదార్‌ రాగంలో చేసినవే. అయితే ఎవరో చెప్పేదాకా నయ్యర్‌కు ఆ సంగతి తెలియలేదట! ఒక సినిమాలో అతను ఉస్తాద్‌ అమీర్‌ఖాన్‌ చేత పాడించాడు. తనకేమీ సంగీతం రాదంటే ఉస్తాద్‌గారు నమ్మలేకపోయాడట.

తన శకం అయిపోయిందని గుర్తించిన నయ్యర్‌ 1975 తరవాత వెనక్కు తగ్గాడు. జాతకాల్లో అతన్నికున్న నమ్మకం కూడా అందుకొక కారణం. 1990లలో ఒకటి రెండు సినిమాలకు అతను సంగీతం ఇచ్చాడు కాని వాటికి పేరు రాలేదు. బప్పీ లాహిరీ వంటి కుర్రకారు ముందుకు రావడం చూసి పాత సంగీత దర్శకులు అసూయ పడడం తగదనీ, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలనీ నయ్యర్‌ అనేవాడు. సంగీతం ఎప్పుడూ చవకబారు అవదనీ, పాటల సాహిత్యమూ, సినిమాల పోకడలూ నీచస్థాయిలో ఉండవచ్చు గాని దేవుడిచ్చిన ఏడు స్వరాలూ ఎప్పటికీ పవిత్రమైనవేననీ అతను అనేవాడు. తల మీద నల్ల టోపీ, చేతిలో కర్రతో అతను ఎన్నో టీవీ ఇంటర్వ్యూల్లో కనబడుతూ, అనేక విషయాల గురించి నిర్భయంగా, నిస్సంకోచంగా వ్యాఖ్యానిస్తూ ఉండేవాడు. తన సినిమాల్లో “యే రాత్‌ ఫిర్‌ న ఆయేగీ” తనకు చాలా ఇష్టమని చెప్పేవాడు.

2006లో జనవరి 19న హైదరాబాద్‌లో నయ్యర్‌ 81వ పుట్టినరోజు సందర్భంగా నాటి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ సుశీల్‌కుమార్‌ శిందేతో
2006లో జనవరి 19న హైదరాబాద్‌లో నయ్యర్‌ 81వ పుట్టినరోజు సందర్భంగా నాటి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ సుశీల్‌కుమార్‌ శిందేతో

వయసు మళ్ళాక అతను హోమియో వైద్యం నేర్చుకుని ఉచితంగా మందులివ్వడం మొదలుపెట్టాడు. మొదట్లో పాటల ద్వారా మనస్సులను బాగు చేసిన తానిప్పుడు శరీరాలను బాగు చేస్తున్నానని జోక్‌ చేసేవాడు. ఒంటెత్తు పోకడల కారణంగా అతనికీ, అతని భార్యా పిల్లలకూ బాగా చెడింది. చివరకు ఖర్చులకు తట్టుకోలేక బొంబాయి సరసనున్న ఠాణేకు మకాం మార్చాడు. టెలిఫోన్‌ కోసమని ఏదో పబ్లిక్‌ బూత్‌కు వెళ్ళినప్పుడు దాన్ని నడిపే రాణీ నఖ్వా అనే ఆవిడను తనకు ఎక్కడైనా తలదాచుకునేందుకు చోటు దొరుకుతుందా అని అడిగితే అతను ఫలానా అని తెలియక, ఆమె “ప్రయత్నిస్తాను” అన్నదట. ఆ తరవాత సంగతి తెలిసి తన ఇంటోనే ఆశ్రయ మిచ్చిందట. నయ్యర్‌ చివరి దాకా ఆవిడ ఇంట్లోనే వారి కుటుంబంతో జీవితం గడిపాడు. 2004లో హాసం పత్రిక తరఫున ఈ వ్యాస రచయిత ఆయనను ఇంటర్వ్యూ చెయ్యడానికి ప్రయత్నించినప్పుడు అది పొసగలేదు. నయ్యర్‌ ఆరోగ్యం బావుండదనీ, ఆయనకు ఇంటర్వ్యూలిచ్చే ఓపిక లేదనీ ఆయన సంరక్షకురాలు టెలిఫోన్‌లో తెలిపింది.

చివరి రోజుల్లో నయ్యర్‌
చివరి రోజుల్లో నయ్యర్‌

మనుషులతోనూ, అభిప్రాయాలతోనూ రాజీ పడకుండా నయ్యర్‌ ఒంటరిగా మిగిలి, వెళ్ళిపోయాడు. అతనివల్ల పేరు ప్రఖ్యాతులూ, డబ్బూ సంపాదించిన ఆశాగాని, ఇతర సినీ పెద్ద లెవరూ కాని అతని భౌతికకాయాన్ని చూడటానికి కూడా రాలేదు. ఒక్క శరద్‌ పవార్‌ తప్ప రాజకీయవేత్తలూ రాలేదు. రీమిక్స్‌ వగైరా పద్ధతుల్లో నయ్యర్‌ పాటలను యథేచ్ఛగా వాడుకుని సొమ్ము చేసుకుంటున్నవారు ఏమీ పట్టనట్టుగా ఊరుకున్నారు. పంజాబీ జానపద రీతులను సినిమా సంగీతంలో ప్రవేశపెట్టి ఎన్నో తరాలను అలరించిన నయ్యర్‌ను సంగీతాభిమానులు ఎన్నటికీ మరిచిపోకూడదు.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...