జుగల్‌బందీ కచేరీలు

శాస్త్రీయ సంగీతంలో జుగల్‌బందీ కచేరీలకి కొంత ప్రత్యేకత ఉంది. రెండు వేరువేరు శైలులనో, వాయిద్యాలనో ఉపయోగించి వాటి మధ్యనున్న సామాన్య లక్షణాలని ఈ కచేరీలు విశదం చేస్తాయి. ఇది జరుగుతున్న క్రమంలో ఒక్కొక్క శైలిదీ విశిష్టత మనకు తెలుస్తూనే ఉంటుంది. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అన్న పద్ధతిలో ఈ మిశ్రమ సంగీతాన్ని శ్రోతలు స్వాదించి, ఆనందించగలుగుతారు. ఇందుకు భిన్నంగా రాధాజయలక్ష్మి వంటి గాయనుల ద్వయం ఒకేసారిగా కలిసి ఒకే పద్ధతిలో పాడుతూ ఉంటారు. బృందగానంలాగా సాగే ఇటువంటి కచేరీలకు జుగల్‌బందీకి ఉన్న అందం ఉండదు. పడుగూ పేకలాగా, కలినేత వస్త్రంలాగా విడివిడిగానూ, అప్పుడప్పుడు కలిసికట్టుగానూ వినబడే రెండు రకాల జుగల్‌బందీ సంగీతం దారే వేరు.

మునవ్వర్ అలీ ఖాన్ బాలమురళీకృష్ణ 1969లో నేను ఆంధ్రా యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో కేంపస్ బైట కాల్టెక్స్ కంపెనీ క్వార్టర్స్‌లో ఒక జుగల్‌బందీ కచేరీకి నేను హాజరు కాగలిగాను. కాగలిగాను అనడానికి కారణమేమిటంటే అది ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే ఏర్పాటు చెయ్యబడింది కాబట్టి. అందులో బాలమురళీకృష్ణ, మునవ్వర్ అలీ ఖాన్ (బడే గులాం అలీ కుమారుడు) పాడారు. 1980లలో బాలమురళి భీంసేన్ జోషీతోనూ, కిశోరీ అమోణ్‌కర్ తదితరులతోనూ తరుచుగా జుగల్‌బందీ కచేరీలు పాడడం జరిగింది కాని అప్పట్లో ఇది చాలా అరుదైన సంఘటనే.

బాలమురళిగారితో నాకున్న పరిచయం కారణంగా గేట్‌క్రాష్ అయిన నేను కచేరీ జరిగే ముందు నుంచీ అక్కడే ఉన్నాను కనక కొన్ని విశేషాలు నా కంటబడ్డాయి.

ముందుగా బాలమురళి, మృదంగ విద్వాన్ దండమూడి రామమోహనరావు తదితరులు దిగిన ఇంటికి మునవ్వర్ తదితరులు వచ్చారు. పరస్పర పరిచయాలూ, ఆలింగనాలూ, కుశలప్రశ్నలూ అయిన తరవాత కర్ణాటక, హిందుస్తానీ సంగీత పద్ధతుల గురించి కాస్త మాట్లాడుకున్నారు. రెండూ స్థూలంగా ఒకే సంగీతానికి వేర్వేరు రూపాలనీ, పేర్లు వేరైనా కామన్ రాగాలెన్నో ఉన్నాయనీ ఎవరికొచ్చిన యాసలో వారు ఇంగ్లీషులోనే మాట్లాడుకున్నారు.

మాటల మధ్యలోనే కల్యాణి (యమన్) రాగాల్లో తలొక సంగతీ, వరసలూ పాడుకోగా మేమంతా మా సంతోషాన్ని వ్యక్తం చేశాం. అలాగే హిందోళం (మాల్కౌస్) రాగాల ప్రస్తావన వచ్చింది. ఇలా కాసేపు ముచ్చటించుకున్నాక డిన్నర్ తినడానికని ఎవరి విడిదికి వారు వెళిపోయారు.

ఇదంతా చూస్తున్న నాకు ఆందోళన తగ్గలేదు. నేను చిన్న గొంతుతో బాలమురళిగారితో ‘అయ్యా, మీరు ఏ రాగాలు పాడబోతున్నారో అనుకున్నారు, సరే. మరి వాటిలో ఏయే పాటలు పాడతారో అనుకోలేదేం?’ అని అడిగాను. దానికాయన చిరునవ్వుతో ‘చూద్దాంలే, అతనికి తోచిందతను పాడతాడు. నాకు తోచిందేదో నేను పాడతాను ‘ అన్నాడు. ఆయన ధీమాగానే ఉన్నాడు కాని నాకే మధ్యలో ఆత్రుతగా అనిపించింది.

ఇంతలో దండమూడివారు ‘ఇదిగో, మరొహరూ మరొహరూ అయితే నేనిలాంటి కచేరీలకి ఒప్పుకోను తెలుసా? బాలమురళిగారు గనక పరవాలేదు. ఆయన మహా సమర్థుడు ‘ అన్నాడు. ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠతో నేను లోలోపలే తబ్బిబ్బయాను.

ఆ సంస్థ ఏర్పాట్లన్నీ ఘనంగా ఉన్నాయి. కళాకారులు నడిచి వస్తున్నప్పుడు ఇరువేపులా పిల్లలు నిలబడి వారు నడుస్తున్న దారిలో మల్లెపూలు చల్లారు. వారికి నిలువెత్తు మల్లెపూల దండలు సమర్పించారు. ప్రతిచోటా అమెరికన్ కంపెనీ డాలర్ల బలం కనబడింది. ఏర్పాట్లన్నీ చాలా చక్కగా జరిగాయి.

కాసేపటికి కచేరీ మొదలయింది. కలకత్తా నుంచి వచ్చిన మునవ్వర్ అలీకి తబలా వాయించడానికి బొంబాయి నుంచి నిజాముద్దీన్ ఖాన్ వచ్చాడు. దాదాపు ఒకే వయసుగల బాలమురళి, మునవ్వర్‌లకు అభిమానులం చాలామందిమి వింటూ ఉన్నాం. మొదటగా కల్యాణి ఆలాపన ప్రారంభించారు. యమన్‌లో మునవ్వర్ శైలి హుందాగా, అందంగా సాగింది. చిరపరిచితమైన బాలమురళి గానం కల్యాణి అందాలని ఎత్తి చూపింది.

కొంతసేపటికి హెచ్చరికలాంటిదేమీ ఇవ్వకుండా మునవ్వర్ యమన్‌లో ఒక తరానా (తిల్లానా) పాడటం మొదలుపెట్టాడు. తాన్న ధీం అంటూ సాగే ఇటువంటి పాటలకు సాహిత్యం ఉండదు. హిందుస్తానీ పద్ధతిలో సాహిత్యానికి ఎలాగూ ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. ద్రుత్ తీన్‌తాల్‌లో మొదలైన ఈ గీతానికి బాలమురళి ఎలా స్పందిస్తారోనని అందరమూ వేచి చూస్తున్నాం.

అయిదు నిమిషాల తరవాత ఆయనవంతు రానేవచ్చింది. మునవ్వర్ పాడిన ట్యూన్ వరసలోనే ఆయన అప్పటికప్పుడు ‘కల్యాణీ రాగిణీ’ అంటూ పల్లవి ఎత్తుకోగానే చప్పట్లు మారుమోగాయి. ఎంతో సమయస్ఫూర్తితో ఆయనొక చిన్న అనుపల్లవి కూడా కట్టి పాడేశారు. మునవ్వర్ కూడా అవే మాటలు పట్టుకుని ‘కల్యానీ రాగ్‌నీ’ అంటూ కొనసాగించాడు. ఏమాత్రమూ పోటీ ధోరణి లేకుండా ఇద్దరూ రాగాన్ని ఆహ్లాదంగా పాడి వినిపించారు.

తరవాత హిందోళం గానం చేశారు. మునవ్వర్ హిందుస్తాని పద్ధతిలో ఆలాపన తరవాత లక్షణగీతం శైలిలో ‘గావో మాల్కౌస్ ‘ అని ఊరుకున్నాడు. దానికి ప్రతిగా బాలమురళి ‘మనమంతా హిందువులం’ (హిందోళం అనేదానికి దగ్గరి మాట) అన్నారు! (మునవ్వర్ హిందువు కాదు గనక వ్యక్తిగతంగా నాకది తప్పు మాటేమో అనిపించింది గాని రాగం పేరుతో పోలినది కదా అని సరిపెట్టుకున్నాను)

చివరగా ఇద్దరూ సింధుభైరవి పాడారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఆ కచేరీ ఎంతో అద్భుతంగా, అపురూపంగా అనిపించింది. బాలమురళి లయవిన్యాసాలకి ముగ్ధుడైన నిజాముద్దీన్ ఆయన పాడుతున్నప్పుడు మృదంగంతో బాటుగా వాయించసాగాడు. చివరకు తాళవాద్యాల ‘తని ఆవర్తనం’ కూడా ఎంతో బాగా కుదిరింది. ఆ తరవాత సుమారు పదిహేనేళ్ళకు మునవ్వర్ కచేరీ బొంబాయిలో విన్నప్పుడు ఆయనను కలుసుకుని ఆనాటి కచేరీ గురించి గుర్తుచేశాను. ఆయన పరమానందంతో ‘ఓహో, మీరది విన్నారా? మేమానాడు చరిత్ర సృష్టించాం’ అన్నాడు. ఆయన 60 ఏళ్ళ లోపునే 1989లో చనిపోవడం చాలా దురదృష్టకరం.

సలామత్ అలీ ఖాన్, నజాకత్ అలీ ఖాన్
సలామత్ అలీ ఖాన్, నజాకత్ అలీ ఖాన్

రవిశంకర్, అలీ అక్బర్ ఖాన్
రవిశంకర్, అలీ అక్బర్ ఖాన్

అంతవరకూ నేను విన్న ప్రసిద్ధ జుగల్‌బందీ సంగీతంలో పాకిస్తాన్ గాయకులైన నజాకత్, సలామత్ అలీ సోదరులదీ, రవిశంకర్ (సితార్), అలీ అక్బర్ (సరోద్) లదీ ముఖ్యమైనవి. అలాగే విలాయత్ ఖాన్ (సితార్), ఆయన తమ్ముడు ఇమ్రత్ ఖాన్ (సుర్‌బహార్) వాయించిన అమోఘమైన కచేరీ విన్నాను. మరికొంత కాలానికి విలాయత్ ఖాన్ (సితార్) బిస్మిల్లా ఖాన్ (షెహనాయి) తో కచేరీ చేసి చరిత్ర సృష్టించారు. బిస్మిల్లా ఖాన్ (షెహనాయి), వి.జి.జోగ్ (వయొలిన్) కలిసి వాయించిన కచేరీలు కూడా ప్రసిద్ధమైనవే. హరిప్రసాద్ చౌరాసియా (వేణువు), శివకుమార్ శర్మ (సంతూర్) అనేక జుగల్‌బందీ కచేరీలు చేశారు. ఇటీవల షాహిద్ పర్వేజ్ (సితార్), రషీద్ ఖాన్ (గాత్రం) కలిసి అద్భుతమైన సంగీతం వినిపించారు. కర్ణాటక పద్ధతిలో లాల్గుడి జయరామన్ (వయొలిన్), రమణి (వేణువు) అనేక కచేరీలు చేశారు.

బిస్మిల్లా ఖాన్, విలాయత్ ఖాన్
బిస్మిల్లా ఖాన్, విలాయత్ ఖాన్

విలాయత్ ఖాన్, ఇమ్రత్ ఖాన్
విలాయత్ ఖాన్, ఇమ్రత్ ఖాన్

బిస్మిల్లా ఖాన్, వి.జి.జోగ్
బిస్మిల్లా ఖాన్, వి.జి.జోగ్

శివకుమార్ శర్మ, హరిప్రసాద్ చౌరాసియా
శివకుమార్ శర్మ, హరిప్రసాద్ చౌరాసియా

లాల్గుడి జయరామన్, రమణి
లాల్గుడి జయరామన్, రమణి

రెండు విభిన్న సంప్రదాయాల సమ్మేళనం మాత్రం నేను 1969లో వినడం అదే మొదటిసారి. ఆ తరవాత విలాయత్ ఖాన్ (సితార్), అంజాద్ అలీ ఖాన్ (సరోద్) లిద్దరూ లాల్గుడి (వయొలిన్) తో కలిసి హిందుస్తానీ, కర్ణాటక కచేరీలెన్నో చేశారు. ఈ మధ్య రాం నారాయణ్ (సారంగీ), రమణి (వేణువు) కూడా అటువంటిది చేశారు. టి.ఎన్.కృష్ణన్, ఆయన సోదరి ఎన్. రాజం లిద్దరూ వయొలిన్ మీద కర్ణాటక హిందుస్తానీ జుగల్‌బందీ కచేరీలు చేశారు. ఇలాంటివి ఇంకెన్నో జరుగుతున్నాయి. అప్పట్లో మాత్రం ఇవి చాలా అరుదుగా జరుగుతూ ఉండేవి. అటు రవిశంకర్ యెహుదీ మెనూహిన్ (వయొలిన్)తోనూ, జపానీయులతోనూ జుగల్‌బందీలు వాయించాడు కాని అవన్నీ ముందుగా కంపోజ్ చేసుకుని వాయించినవి.

జుగల్‌బందీ సంగీత కచేరీల్లో ఇద్దరు సంగీతకారులు ఒకే రాగం వినిపిస్తారు. ఇద్దరూ ఒకే బాణీకి చెందినవారయినా, వేరు పద్ధతుల్లో శిక్షణ పొందినవారయినా ఎవరి శైలి, దృక్పథం వారికుంటాయి. ఇద్దరూ కలిసినప్పుడు రాగానికీ, పాడే కృతికీ ఉన్న విభిన్న అంశాలు విదితం అవుతాయి. అన్నీ సరిగ్గా ఒనగూడితే ఈ శైలులు ఒకదానికొకటి సంపూరకంగా (సప్లిమెంటరీ లేదా కాంప్లిమెంటరీ) పనిచేస్తాయి. ఏ నాయుడుగారికో మంగతాయారులా కాకుండా ఇద్దరు కళాకారులకీ సమాన హోదా ఉంటుంది.

ఉదాహరణకు పాకిస్తాన్ సోదరుల్లో నజాకత్ శైలి మృదువుగా, రాగ స్వరూపాన్ని నిర్దేశిస్తూ ఉండేది. సలామత్ అతి వేగంగా, దూకుడుగా, విద్వత్తుతో వివరాలన్నీ నింపేవాడు. ఇద్దరూ కలిసి పాడుతున్నప్పుడు అద్భుతమైన సమన్వయం ఉండేది. వాద్యకారులైతే రెండు వాయిద్యాల్లోని తేడాలూ, శబ్ద విశేషాలూ అందంగా కలుస్తాయి. చిన్నతనం నుంచీ కలిసి నేర్చుకున్న రవిశంకర్, అలీ అక్బర్‌ల మధ్య అద్భుతమైన సమన్వయం ఉండేది. సరోద్ గాంభీర్యానికి సితార్ చిలిపితనం అందంగా తోడయేది. దీర్ఘమైన స్వరాలను పలికించగల షహనాయితో బాటు విస్ఫులింగాలు వెదజల్లగలిగిన సితార్ మోగినప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. వీటన్నిటినీ మించి రాగాలను గురించిన ఇద్దరు మేధావుల సంభాషణ వింటున్నట్టుగా ఉంటుంది. ఉన్న సమయాన్ని ఇద్దరు పంచుకుంటున్నప్పటికీ, ఏ ఒక్కరికీ నిరాటంకంగా తమ ఆలోచనా సరళిని వ్యక్తం చేసే అవకాశం తగ్గినప్పటికీ జుగల్‌బందీ కచేరీలకు ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. ‘ఈ ఇద్దరి కుమ్ములాటలో ఎవడు గెలుస్తాడ్రా’ అనే ధోరణిలో ప్రేక్షకులు వింటే అది చాలా పొరపాటే. పరస్పర అభిమానం, గౌరవం ఉన్న సందర్భాల్లోనే జుగల్‌బందీలు రాణిస్తాయి.

నేను విన్న కొన్ని కచేరీల్లో విలాయత్ ఖాన్ సితార్ సంగీతం బిస్మిల్లా గారిని ఎంత ప్రభావితం చేసేదంటే ఆయన మామూలు కన్నా గొప్పగా షహనాయి వాయించాడనిపించేది. ఒక కచేరీలో విలాయత్ ఖాన్ పిలూ రాగం వాయిస్తున్నప్పుడు బిస్మిల్లా వాయించకుండా తలవంచుకుని వింటూ కూర్చున్నారు. రెండు మూడు సార్లు తనవంతు వచ్చినా ‘మీరే కానివ్వండి’ అనే సైగ చేశారు. ఆ తరవాత కొద్ది సేపు బిస్మిల్లా తన వర్షన్ ఎంతో భావయుక్తంగా వాయించగానే ప్రేక్షకులు చలించిపోయారు. అందుకనే పెద్ద కళాకారుల మధ్య సయోధ్య కుదిరితే వర్ణనాతీతమైన సంగీతం పుట్టుకొస్తుంది. ఇది సోలో కచేరీల్లో వీలవదు.

కర్ణాటక, హిందుస్తానీ జుగల్‌బందీల సంగతి కాస్త భిన్నమైనది. హిందుస్తానీ, కర్ణాటక సంగీతాల గురించి తెలిసినవారికి వాటి మధ్య గల పోలికలూ, వ్యత్యాసాలూ ఎటువంటివో చెప్పక్కర్లేదు. ఒకే రాగానికి వేరు వేరు పేర్లుండడమూ (మోహన, భూపాలీ), ఒకే పేరు కలిగిన విభిన్న రాగాలుండడమూ (తోడి), కర్ణాటక రాగాలు ఉత్తరాది శైలిలో జనాదరణ పొందడమూ (హంసధ్వని, కీరవాణి), హిందుస్తానీవి కర్ణాటక సంగీతంలో పాడడమూ (దేశ్, బాగేశ్రీ) మామూలే. లోతుగా విశ్లేషించని శ్రోతలకు కర్ణాటక సంగీతం గమకభూయిష్ఠంగా, పట్టు కలిగిన సంగతులతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. హిందుస్తానీ శైలి నింపాదిగా, అంత బిగువుగా అనిపించని సంగతులతో సాగుతుంది. కలిసి వాయిస్తున్నప్పుడు ఈ తేడాలు అందాన్ని కలిగిస్తూనే కొన్ని ఇబ్బందులను కూడా తెచ్చిపెట్టగలవు.

నేను గమనించినంత వరకూ వాయిద్యాల కర్ణాటక, హిందుస్తానీ జుగల్‌బందీల్లో అతి వేగంగా మోగే సితార్, సరోద్‌ల ప్రభావం కాస్త “సంసారపక్షంగా” మోగే కర్ణాటక సంగీతం మీద ఎక్కువగా పడుతుంది. ఇదంత హర్షణీయంగా అనిపించదు. గాత్రంలో బాలమురళి, జోషీగార్ల కచేరీలో అప్పుడప్పుడూ పోటాపోటీ ధోరణి కనిపించినప్పటికీ ఇద్దరూ ఉన్నత శ్రేణికి చెందిన అనుభవజ్ఞులు కనక హుందాగా సాగింది. అయితే బాలమురళి తప్ప హిందుస్తానీ గాయకులతో ‘తలపడి’ ధైర్యంగా ప్రయోగాలు చెయ్యగలిగిన కర్ణాటక గాయకులు తక్కువే. బొంబాయిలో అరుణా సాయిరాం, నీలా భాగవత్‌లు ఇటువంటి ప్రయత్నం చేశారు. ఈమధ్య రవికిరణ్ (చిత్రవీణ), విశ్వమోహన్ భట్ (మోహన్ వీణ) జుగల్‌బందీ చేశారు.

బాలమురళీకృష్ణ, భీంసేన్ జోషీ
బాలమురళీకృష్ణ, భీంసేన్ జోషీ

హిందుస్తానీ గాత్రంలో స్వరాలు పలుకుతూ స్వరకల్పన చెయ్యడం తక్కువ. వారి ‘తాన్‌లన్నీ ‘అ’ కారం మీదనే సాగుతాయి. ఆ పద్ధతిలో వేగంగా పాడడం కర్ణాటక గాయకులకు అలవాటు ఉండకపోవచ్చు. వారిది ప్రధానంగా సరిగమలతో సాగే విన్యాసం. ఒక్క బాలమురళి మాత్రం ఎంత వేగంగానైనా, ఏ పద్ధతిలోనైనా పాడగల సమర్థుడనేది తెలిసినదే. బహుశా అందుకే ఇతర కర్ణాటక గాయకులు ఇటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చెయ్యరేమోనని నాకనిపిస్తుంది.

నాకు వ్యక్తిగత పరిచయం ఉన్న చిట్టిబాబుగారితో జుగల్‌బందీ విషయం ప్రస్తావించినప్పుడల్లా ఆయన ‘అబ్బే, మనకి ఇతరులతో కుదరదయ్యా’ అని తోసిపుచ్చేవారు. ఆయనా (వీణ), మా గురువుగారైన ఇమ్రత్ ఖాన్ (సితార్) కలిసి వాయిస్తే వినాలని నాకు మహా కోరికగా ఉండేది. చాలా ఏళ్ళ క్రితం ఈమని శంకరశాస్త్రిగారు (వీణ) రేడియోలో గోపాలకృష్ణ (విచిత్రవీణ) తో కలిసి వాయించారు. ఆయన ముందు గోపాలకృష్ణ ‘నిలవలేకపోయాడని’ నాకనిపించింది గాని అది వేరే సంగతి.

కర్ణాటక-హిందుస్తానీ జుగల్‌బందీలో మరొక ఇబ్బంది పాటలకు సంబంధించినది. కర్ణాటక పద్ధతిలో ప్రసిద్ధ వాగ్గేయకారుల రచనలే ఎక్కువగా ఉంటాయి. హిందుస్తానీలో వాటిని పోలినవేవీ ఉండవు. ఇందులోని కష్టసుఖాలు నేను శ్రీకాంత్ చారి (వీణ) తో 1994లో కాలిఫోర్నియాలో సితార్ జుగల్‌బందీ కచేరీ వాయించినప్పుడు బాగా తెలిసివచ్చాయి. కర్ణాటక సంగీతజ్ఞులకు ఉత్తరాది సంగీతం గురించి తెలిసినంతగా హిందుస్తానీ వారికి దక్షిణాది సంగీతం గురించి తెలియదు. కాని తమాషా ఏమిటంటే వాతాపి వంటి కీర్తనలకు నకళ్ళు హిందుస్తానీలో తయారయాయి. అలాగే మరాఠీ నాటకాల్లో పాడేవారు కర్ణాటక సంగీతంలోని వరములొసగి (కీరవాణి) వంటి కీర్తనలను అనుకరించారు. ఏవో మీరా భజనలు తప్ప హిందుస్తానీ పాటలను కర్ణాటకంవారు పాడిన సందర్భాలేవీ నాకు గుర్తురావడం లేదు.

మొత్తం మీద ఈ ఉత్తర దక్షిణ సంప్రదాయాల మధ్య సంపర్కం ఏర్పడడానికి రాగాలు మాత్రమే తోడ్పడతాయని అనిపిస్తుంది. భాష, సాహిత్యాదుల వల్ల కలిగే అవరోధాలను ప్రయత్నపూర్వకంగా ‘భారతీయత’ను దృష్టిలో ఉంచుకుని అధిగమించాలి. అసలీ కలుపుగోలు పద్ధతి ఎందుకు? పులిహోరనూ, పులావునూ విడిగా తిని ఆనందించవచ్చునుగదా అనేవారూ లేకపోలేదు. ఇటువంటి కర్ణాటక-హిందుస్తానీ సమ్మేళనాల్లో కొంతవరకూ రాజీపడక తప్పదేమో. అలా కాకుండా ఒకే పద్ధతిలో ఇద్దరు గాయకులో, వాద్యకారులో కలిసి పాల్గొంటే మరింత గొప్పగా ఉంటుందనేదాంట్లో సందేహం లేదు.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...