అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు బడేగులాం అలీ ఖాన్‌

ప్రఖ్యాత చిత్రకారుడు బాపు తనకెంతో నచ్చిన బడేగులాం అలీఖాన్‌ బొమ్మ గీసి, తెరిచిన ఉస్తాద్‌ నోట్లో కోయిల పాడుతున్నట్టు చూపారు. హిందుస్తానీ సంగీతాభిమానులకు చిరపరిచితుడైన ఈ గాయకుడు ఠుమ్రీలు పాడడంలో గానకోకిలగానూ, ఖయాల్‌ గానంలో సింహబలుడుగానూ ప్రసిద్ధుడు. ఆయన పాడిన లాంగ్‌ప్లే రికార్డ్‌ కవర్ల మీద “అత్యుత్తమ గాయకుడు” అని రాశారంటే అందులో ఆశ్చర్యంలేదు. ఆయనకు ముందు తరం గాయకులూ, సమకాలీనులూ, తరవాతివారూ అందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన విషయమది.

బడేగులాం అలీ ఖాన్‌ 1902లో పశ్చిమ పంజాబ్‌లోని కసూర్‌లో జన్మించారు. మూడు నాలుగేళ్ళ వయసులో పదాలూ, అక్షరాలూ నేర్చుకోక ముందే అతనికి పన్నెండు స్వరాలు పట్టుబడ్డాయట. “అదే నా మాతృభాష అయింది” అని తరవాత ఆయన చెప్పుకున్నాడు. మొదట్లో తన పెదనాన్న కాలేఖాన్‌వద్దా, తరవాత తండ్రి అలీబక్ష్‌ వద్దా పాట నేర్చుకున్నాడు. పది పన్నెండేళ్ళ వయసులో బడేగులాం తమ ఊరి బయటకు వెళ్ళి ఒక గోడకు దూరంగా నిలబడి గట్టిగా పాడేవాడట. ప్రతిధ్వనిని బట్టి తాను పాడుతున్న స్వరాలు నిర్దుష్టంగా పలుకుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడట. సమీపంలో ఉండి ఈ తతంగమంతా చూస్తున్న కొందరు బండివాళ్ళు కాసేపు తాము కూడా కేకలు పెట్టి గేలిచేసేవారట. ఇటువంటి సాధన అతనికి ఎంతో ఉపయోగపడింది. త్వరలోనే బడేగులాం మంచి గాయకుడుగా పేరు తెచ్చుకున్నాడు. కాని ఆయన ఖ్యాతి కొంతకాలం లాహోర్‌ ప్రాంతానికే పరిమితమయింది. ఆయనకు ముందు తరంవారైన కరీమ్‌ఖాన్‌, ఫయ్యాజ్‌ ఖాన్‌ వంటి ఉద్దండులకు బరోడా రాజసంస్థానంలో ఆశ్రయం కొన్నాళ్ళయినా తప్పనిసరి అయిందేమో కాని బడేగులాం కచేరీలు మొదలెట్టాక టికెట్ల ద్వారా తగినంత ఆదాయం పొందడం సాధ్యం కాసాగింది. ఎవరి ప్రాపకమూ కోరకుండా డబ్బు బాగా సంపాదించి, రాచఠీవితో జీవితం గడిపిన ఉస్తాద్‌గా ఆయనకు పేరొచ్చింది. ఆ రోజుల్లో సైగల్‌ వంటివారి వల్ల సినిమా సంగీతం చాలా ప్రజాదరణ పొందసాగింది. అది క్రమంగా శాస్త్రీయ సంగీతంతో పోటీపడి త్వరలోనే దాన్ని వెనక్కు నెట్టింది. అయినా బడే గులాంగారి కచేరీలూ, రికార్డ్‌లకు గిరాకీ తగ్గలేదు.

1939లో కలకత్తాలో కచేరీ చేసిన తరవాత ఆయన గురించి ఇతర ప్రాంతాలవారికి తెలిసింది. 1944లో బొంబాయి యూనివర్సిటీ కాన్వొకేషన్‌ హాలులో విక్రమాదిత్య సంగీతపరిషత్తు తరఫున బడేగులాం అలీఖాన్‌ చేసిన కచేరీ శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసింది. బొంబాయిలో రెండున్నర రూపాయల టికెట్టుకి ఉస్తాద్‌ ఫయ్యాజ్‌ఖాన్‌ వంటి గొప్ప గాయకులు రాత్రంతా గానకచేరీలు చేస్తున్న రోజుల్లో మా నాన్నగారు తొలిసారి బడేగులాం పాట విన్నారట. మూడున్నర రూపాయల టికెట్టుకు సరిగ్గా మూడుగంటల సేపు మాత్రమే అద్భుతమైన గాత్రకచేరీ చేసిన బడేగులాం ప్రేక్షకులు ఎంత కోరినా రాత్రంతా పాడటానికి నిరాకరించారట. ఆయన కచేరీలకు ఆనాటి అత్యుత్తమ సంగీత విద్వాంసులైన అల్లాదియాఖాన్‌, ఫయ్యాజ్‌ఖాన్‌, అల్లాఉద్దీన్‌ఖాన్‌, హాఫిజ్‌అలీఖాన్‌ మొదలైన వారంతా హాజరై మెచ్చుకున్నారు.

“అనర్గళం, అనితరసాధ్యం” అనిపించిన ఆయన శైలి త్వరలోనే ఆయనను గాయకులలో అగ్రస్థానాన నిలబెట్టింది. అతిమంద్రం నుంచి అతితారస్థాయిని అవలీలగా చేరుకోగలిగిన కమ్మని కంఠధ్వనీ, అసాధ్యం అనిపించే స్వరకల్పనా పటిమా ఆయన ఖయాల్‌ సంగీతానికి అద్దం పట్టాయి. అదికాక శ్రోతలు తొలిసారిగా ఆయనద్వారా అతిమధురమైన పంజాబీ శైలి ఠుమ్రీలు వినగలిగారు. ఏరాగం పాడినా మరెవరూ ఇలా పాడలేరనిపించేది. మామూలు ప్రేక్షకులే కాక పెద్ద సంగీతజ్ఞులందరూ కూడా బడేగులాం అలీఖాన్‌ ఒక ఫినామినన్‌ అని అంగీకరించారు. అనేకులు పాల్గొనే సంగీత సమావేశాల్లో ఆయన పాడిన తరవాత కచేరీ చెయ్యటానికి ఎవ్వరూ సాహసించేవారు కాదట. దేశమంతటా ఆయన పేరు మారుమోగింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి రూపం భావకవులకు ప్రతీక అయినట్టుగానే బుర్రమీసాలతో భారీ శరీరంతో కనబడిన బడేగులాం అలీ ఖాన్‌ గారిని దక్షిణాది ప్రజలు ఉస్తాదుగా, వస్తాదుగా తిలకించారు.

1954లో నా అయిదోఏట నేను మద్రాసులో బడేగులాం కచేరీకి మా నాన్నగారితో వెళ్ళాను. మిగతావేమీ గుర్తులేవుకాని మేము బయలుదేరేవేళకు ఆయన సింధుభైరవిలో “జమునా కే తీర్‌” అందుకున్నారు. కరీమ్‌ఖాన్‌ పాడిన ఆ రికార్డు మా ఇంటో ఉండేది కనక ఆ పాటను నేను గుర్తు పట్టాను. ఆ కచేరీ జరిగిన తరవాత ప్రసిద్ధ కర్ణాటక విద్వాంసుడు జి.ఎన్‌.బాలసుబ్రహ్మణ్యం ముగ్ధుడై ఉస్తాద్‌గారికి సాష్టాంగ ప్రణామం చేశాడని తరవాత తెలిసింది. మళ్ళీ నా తొమ్మిదో ఏట మద్రాసులో ఖాన్‌సాహెబుగారి మరొక కచేరీకి వెళ్ళినప్పుడు ఆయన్ను దగ్గర్నుంచి చూశాను. అప్పటికి ఆయన రికార్డ్‌లు చాలా విని ఉండడం వల్ల ఆయన అత్యుత్తమ గాయకుడని నాకు తెలుసు. పొట్టిగా అతిపెద్ద పొట్టతో, అతి కష్టం మీద నడుస్తూ బుర్రమీసాలతో చాలా ఇంప్రెసివ్‌గా అనిపించారు. ఆ కచేరీకి మద్రాసులోని కర్ణాటక విద్వాంసులందరూ వచ్చారు. ద్వారం, జి.ఎన్‌.బి., అరియక్కుడి తదితరులు కనిపించారు. ఇంటర్వెల్‌లో అందరూ లేచారు కాని ఉస్తాద్‌గారు లేవలేదు. స్టేజిమీదనే స్వరమండల్‌ శ్రుతి చేసుకుంటూ కూచున్నారు. “తరవాత ఏం పాడను?” అని అడిగినప్పుడు ప్రేక్షకులు ఆయన అనేక ఠుమ్రీలను పేర్కొని పాడమంటూ కేకలు పెట్టారు. పాడేటప్పుడు శరీరం కదలకపోయినా గమకాలూ, సంగతులకు అనుగుణాంగా ఒక చేతి వేలితో ఆయన గాలిలో తిప్పుతూ పాడేవారు. 1955లో మద్రాసులో జరిగిన శివాజీ గణేశన్‌ తమ్ముడి పెళ్ళికి ఆయన కచేరీ ఏర్పాటు చేసినప్పుడు తమకు ఆహ్వానం లేకపోయినా ఉండబట్టలేక సిగ్గు విడిచి, జనంలో కలిసిపోయి వెళ్ళి కచేరీ విని వచ్చామని బాపు, రమణగార్లు చెప్పారు. ఆయన పాటకు అంతటి సమ్మోహనశక్తి ఉండేది.

1948నుంచీ మద్రాసులో బడేగులాం కచేరీలు విన్న ఘంటసాల ఆయనకు వీరాభిమాని అయిపోయారు. మొదటిసారి రాగేశ్రీ వంటి రాగాలు విని ఎంతఘాటు ప్రేమయో, ఇది నా చెలి, అన్నానా భామిని వగైరా పాటలని ఆ రాగంలో స్వరపరిచారు ఘంటసాల. ఉస్తాద్‌ గారి ఎనిమిది మంది బృందం తమ ఇంటో ఎలా బసచేసేవారో, తమ వంట తామే ఎలా చేసుకునేవారో ఘంటసాల సావిత్రిగారు రాశారు. మేలుకుని ఉన్నంతసేపూ పాడటమే ఉస్తాద్‌ గారికి అలవాటు. రాగాలతోనూ, స్వరాలతోనూ ఆయన కంఠానికి ఉండిన గాఢమైన పరిచయానికి కారణం అదేకావచ్చు. “స్వరాల పరిశుద్ధతే నాకు ప్రాణం” అనేవాడట ఆయన. (లతా మంగేశ్కర్‌ పాట విన్నప్పుడల్లా “దుంపతెగ, ఒక్క అపస్వరం కూడా పడదు సుమా” అని మెచ్చుకునేవాడట). అలవోకగా శ్రమపడకుండా ఆయన గాత్రం చేసే అద్భుతవిన్యాసాలు విన్నవారికి సంగీతం ఆయనకు పాదాక్రాంతం అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఒక కచేరీలో పాట ఆపి “యే హవా కా ఖేల్‌హై” (ఇదంతా గాలి యొక్క లీల) అని వ్యాఖ్యానించాడాయన.

ఆ కాలంలో కచేరీల ద్వారా డబ్బు సంపాదించదలుచుకున్న ఉస్తాద్‌లకు రికార్డ్‌లూ, వాటిమీద వచ్చే రాయల్టీల గురించి సంకోచం ఉండేది. అమూల్యమైన తమ సంగీతాన్ని చవకగా కొట్టేసే ఉపాయమేమో అని భయపడేవారు. సిగ్గూ, అభిమానం విడిచి మీడియా వెంట కళాకారులు పరిగెత్తుతున్న ఈ రోజుల్లో అది వింతగా అనిపించవచ్చు. ఎందుకంటే ఎచ్‌.ఎం.వి. కంపెనీ తరఫున బడేగులాంగారిని బతిమాలి, సాగదీసి పాటలు రికార్డు చేయించటానికి తానెంత కష్టపడినదీ జి.ఎన్‌.జోషీ అనే ఆయన ఒక వ్యాసంలో వివరించారు. తాను స్వయంగా గాయకుడు కనక గొప్పగాయకుణ్ణి ఎలా మంచి చేసుకోవాలో జోషీకి తెలుసు. ఆ పాటలన్నీ “సబ్‌రంగ్‌” ముద్రతో ఉస్తాద్‌ రచించిన స్వీయరచనలే. వాటిలో కేవలం మూడు నాలుగు నిమిషాల్లోనే దర్బారీ, గుజరీ తోడీ, లలిత్‌, కేదార్‌ వగైరా పెద్ద రాగాలను అమోఘంగా పాడి వినిపించాడాయన.

అలాగే ముగలే ఆజం సినిమాలో తాన్‌సేన్‌కు ఆయన చేత పాడించాలని దర్శకుడు కె. ఆసిఫ్‌ పట్టుబట్టడంతో సంగీత దర్శకుడు నౌషాద్‌ ఉస్తాద్‌గారి వద్దకు వెళ్ళవలసివచ్చింది. వారిని ఎలాగైనా వదిలించుకోవాలని ఖాన్‌సాహేబుగారు పెద్ద మొత్తం ఇమ్మని అడిగాడు. దానికి వారు సరేననడంతో ఆయనకు ఆ సినిమాలో రెండు పాటలు పాడక తప్పలేదు. ఆయనకు మంచి తిండిపుష్టీ, వంటలో ప్రావీణ్యమూ ఉండేవి. ఒక పూర్తి చికెన్‌, నాలుగు కిలోల స్వీట్లూ, రెండు డజన్ల చపాతీలూ తినేసి, ఆ వెంటనే నాలుగు గంటల పాటు కచేరీ చెయ్యడం ఆయనకు మామూలే. ఎటొచ్చీ వ్యాయామం చెయ్యడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం ఎంత ముఖ్యమో తెలియని ఆ రోజుల్లో సహజంగా ఆయనకు అనారోగ్యం కలిగింది. 1960లలో లాంగ్‌ప్లే రికార్డ్‌ల శకంలో బడేగులాంను పాడటానికి ఒప్పించే లోపలే ఆయన ఆరోగ్యం క్షీణించింది. అది నిజంగా ఆయన అభిమానుల ఆశలకు గొడ్డలిపెట్టే.

బడేగులాంగారికి సంగీతశాస్త్రం గురించి మంచి పరిజ్ఞానం ఉండేది. ఏ రాగం ఎప్పుడు పాడాలో, ఎందులో ఏ స్వరం ఎలా పలకాలో ఆయన అనేక నిపుణుల సమావేశాల్లో పాడి వినిపిస్తూండేవారు. దక్షిణాదిలోలా కాకుండా ఉత్తరాది గాయకులు ఎవరికివారు “ఇది మా పద్ధతి” అని స్వల్ప మార్పులు చేస్తూండడం వల్ల కొంత గందరగోళం ఈనాటికీ తప్పడం లేదు. అందుచేత నిర్దుష్టమైన అవగాహనకు అప్పుడప్పుడూ వివరణలు కోరడం అవసరమవుతూ ఉంటుంది. జగన్నాథ బువా పురోహిత్‌ మొదలైన పండితులతో బడేగులాం చర్చలు జరుపుతూ, తనకుతెలిసినది చెపుతూ, ఇతరులు చెప్పేవి వింటూ ఉండేవారు. ఢిల్లీ రేడియో కేంద్రం ఆయనతో ఒక ఇంటర్వ్యూ ప్రసారం చెయ్యగా నేను విన్నాను. అందులో ఆయన పహాడీ రాగం పంజాబ్‌ కొండ ప్రాంతాల్లో జానపద శైలిలో ఎలా పాడతారో అద్భుతంగా వినిపించారు. కర్ణాటక సంగీతం గురించి ప్రస్తావిస్తూ మేఘరంజని వంటి కొన్ని రాగాలు వింతగా అనిపిస్తాయనీ, వాటి లక్షణం వెంటనే కొరుకుడు పడదనీ అన్నారు. (మాయామాళవగౌళలో పంచమ, ధైవతాలను వదిలేస్తే మేఘరంజని అవుతుంది).

పాకిస్తాన్‌ ఏర్పడ్డాక ఉస్తాద్‌గారికి అక్కడ ఉండడం నచ్చలేదు. స్వభావంలో తాను హిందువునే నని ఆయన ప్రకటించుకున్నాడు. పహాడీలో “హరిఓం తత్సత్‌”, భూపాలీ (మోహన)లో ” మహాదేవ మహేశ్వర” వగైరా గీతాల్ని అద్భుతంగా రచించి పాడాడాయన. ఆయన అభిమానులంతా భారతదేశంలో ఉండడం వల్ల మన రేడియోలోనూ, కచేరీల్లోనూ పాడటానికి ఇబ్బందులు పడి తరుచుగా రావలసివచ్చేది. విదేశీయుడని ఏవో అర్థంలేని నిబంధనల కారణంగా ఆయన రేడియో కచేరీలు రికార్డు చెయ్యరాదనే ఆంక్ష ఉండటం వల్ల అమూల్యమైన ఆయన ఆలిండియా రేడియోలో పాడిన సంగీతంలో కొంతభాగం పత్తాలేకుండా పోయింది. ఆయనకు బొంబాయిలో ఇల్లు ఏర్పాటు చేసినది అప్పటి ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయి. ఆ తరవాత ఆయన ఇండియాలో స్థిరపడి కలకత్తాలోనూ, చివరి రోజుల్లో (1968) హైదరాబాద్‌లోనూ ఉన్నారు. హైదరాబాద్‌లో ఆయన నవాబ్‌ జహీర్‌యావర్‌ జంగ్‌కు అతిథిగా బషీర్‌బాగ్‌ పాలెస్‌లో ఉన్నప్పుడు వయొలిన్‌ కళాకారుడు పూర్ణచందర్‌ ఆయన వద్ద ఠుమ్రీ వగైరాలు నేర్చుకున్నాడు. నండూరి పార్థసారథి తదితరులు వెళ్ళి కలుసుకున్నారు కూడా. అభిమానులని ఆప్యాయంగా పలకరించి, కోరగానే పాట వినిపించడం ఆయన పెద్ద మనసుకూ,నిరాడంబరతకూ నిదర్శనం.

బడేగులాం తమ్ముడు బర్కత్‌ అలీఖాన్‌ స్వయంగా ఠుమ్రీలూ,గజల్‌లూ అద్భుతంగా పాడేవాడు. బేగమ్‌ అఖ్తర్‌, గులాంఅలీ వంటి ప్రసిద్ధులు ఆయన వల్ల ప్రభావితులమయినామని చెప్పుకున్నారు. కచేరీల్లో అన్నగారికి హార్మోనియం వాయించిన బర్కత్‌అలీ కూడా తరుచుగా హైదరాబాద్‌ వస్తూండేవారు. ఆయన 1963లో కరాచీలో కాలం చేశారు. బడేగులాం పెద్ద కొడుకు కరామత్‌ అలీ కూడా పాకిస్తాన్‌లోనే ఉండిపోయాడు. రెండో అతను మునవ్వర్‌ అలీ ఖాన్‌ తండ్రితో బాటు కచేరీల్లో పాడి, తరవాత కలకత్తాలో గాయకుడుగా స్థిరపడ్డాడు. కాని అతను కూడా అరవై నిండక ముందే కాలం చేశాడు. ఇటీవల మరణించిన పాకిస్తాన్‌ సోదరులు నజాకత్‌, సలామత్‌ అలీలు బడేగులాం మానసపుత్రుల వంటి గాయకులు.

బొంబాయిలో బడేగులాంతో తన పరిచయాన్ని గురించి ప్రఖ్యాత గాయకుడూ, సంగీతశిక్షకుడూ అయిన దేవ్‌ధర్‌ రాశారు. మరైన్‌ డైవ్‌లో నివాసమున్నప్పుడు తరుచుగా చౌపాటీ బీచికి వెళ్ళి అక్కడ ఎగిసిపడే అలలను చూసి ఆనందిస్తూ ఉస్తాద్‌గారు వాటికి అనుగుణంగా గమకాలు వేసి పాడేవారట. కంటికి ఏది కనబడ్డా దానికి స్వరాల్ని అన్వయించి పాడడం ఆయనకు సరదా. పక్షవాతం వచ్చి కోలుకోగానే ముందు కొన్ని స్వరాలు పాడుకుని “అల్లాకా శుకర్‌ హై” అనుకున్నారట. చికిత్సకు ఒళ్ళు మాలిష్‌ చేసేవాణ్ణి ఉద్దేశిస్తూ ఠుమ్రీలు పాడితే అతను సిగ్గు పడిపోయేవాడట.

ఠుమ్రీల్లో గాని, ఖయాల్‌లో గాని ఉస్తాద్‌ బడేగులాం అలీ ఖాన్‌ను పోలగల విద్వాంసులు ఎవరూ లేరు. లలిత సంగీతాన్నీ, సినిమా పాటల్నీ అభిమానించేవారు ఆయన ఠుమ్రీలు వింటే నదులన్నిటికీ జన్మస్థలమైన మానసరోవరం చూసినట్టనిపిస్తుంది.ఆయన పాడిన తిర్‌ఛీ నజరియా ఠుమ్రీ ఒక్కటే పహాడీ రాగంలోని వందలాది హిందీ, తెలుగు, ఇతరభాషల సినీ గీతాలకు మూలం అయింది.లతా పాడిన “మేరీ ఆఁఖోఁమేఁ బస్‌గయా కోయీరే” దానికి నకలు. కాని బడే గులాంను కేవలం ఠుమ్రీ గాయకుడిగా పరిగణించడం పెద్ద పొరబాటు. ఆయన తక్కిన గొప్ప సంగీతకారులనే అబ్బురపరిచిన సంగీత మహాసాగరం.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...