ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం

“సినిమా ” కి ఎంత ప్రజాదరణ లభించిందో, “సినిమా పాట ” కి అంతకన్నా ఎక్కువ ఆదరణ లభించిందంటే అతిశయోక్తికాదు. గత 50 సంవత్సరాల తెలుగు సినిమా పాటల గురించి ఆలోచిస్తే ఇద్దరు గాయకుల పేర్లు తప్పకుండా మదిలో మెదుల్తాయి. వాళ్ళే ” ఘంటసాల వెంకటేశ్వర రావు ఎస్‌. పి. బాల సుబ్రహ్మణ్యం “. ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం ఈ ఇద్దరు పాడిన పాడించిన పాటల గురించి చర్చిస్తూ, తెలుగు సినిమా పాటలో వచ్చిన మార్పులని కూడా పాఠకుల ముందు ఉంచటం.

ఘంటసాల సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన కొంత కాలం తరవాత అయినా అతడి గొప్పదనాన్ని ఇండస్ట్రీ గుర్తించటానికి కారణం అతని టాలెంట్‌ ఖంగుమనే గొంతుకతో కలసిన విశేషమైన సంగీత జ్ఞానం. ముఖ్యంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో అతనికున్న ప్రజ్ఞ వల్ల గాయకుడుగా మాత్రమే కాకుండా వందకి పైగా సినిమాలకి సంగీత దర్శకుడిగా కూడా రాణించాడు. 1940 దశాబ్దం చివర నుంచి తెలుగు సినిమా పాటలు ముఖ్యంగా అనుసరించిన మార్గాలు రెండు. అవి సాంప్రదాయ, జానపద సంగీతాలు. ఈ రెంటిలోనూ కొత్త పోకడలను తొక్కి తెలుగు సినిమా పాటకు ఘంటసాల కొత్త రీతులు సమకూర్చాడు. ఒక పక్క పాటలు, మరొక పక్క సంగీత దర్శకత్వం మాత్రమే కాకుండా, తెలుగు పద్యాలకి ఒక కొత్తరూపం ఇచ్చినవాడు ఘంటసాల. పద్యాలు చదివే పద్ధతి మనకి నాటకాలనించి వచ్చినా, పద్యాలలో రాగలక్షణం ఉన్నా, కొంతమంది గాయకులు ఆ రాగాన్ని పట్టీ పీకీ కొంచెం భీభత్సం చేసేవారు. ఆ రోజుల్లో మనకి పద్యం ఇంకో రకంగా వినే వీలు లేకపోవడం వల్ల, పౌరాణిక నాటకాలు అందించిన విధంగానే విని ఆనందించేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో,శాస్త్రీయ సంగీత పరంగా స్వరబద్ధం చేస్తూ, ప్రజలందరూ పాడుకొనేట్లు పద్యాల్లో లలిత సంగీతపు ఛాయల్ని తెచ్చింది ఘంటసాలే ! జంధ్యాల పాపయ్య శాస్త్రి వంటి కవులు వ్రాసిన కుంతీకుమారి, పుష్పవిలాపం, సాంధ్యశ్రీ పద్యాలు ఈనాటికీ మనకి గుర్తుండటానికి కారణం ఘంటసాల గొంతుతో కలసిన స్వరబద్ధత. పాటల్లో కన్న పద్యాలకు ఎక్కువగా కావలసింది సరైన పదాల విరుపు. అర్ధవంతంగా పదాలు కావల్సిన చోట్ల విరుస్తూ, రాగ లక్షణం చెడకుండా పద్యాలు పాడటంలో ఘంటసాల మార్గం అనితరసాధ్యం. ” చూచెదవేలనో ప్రణయ సుందరి …” (కల్యాణి రాగం), “సంజవెలుంగులో ..” (సింధుభైరవి రాగం) వంటి పద్యాలు ఘంటసాల తెలుగుల కిచ్చిన వరాలు. హిందూస్ధానీ రాగాల్లో కూడా ఘంటసాల స్వరకల్పన చేసిన పద్యాలు (జాషువా ” పాపాయి ” పద్యాల్లో ” ఊయేల తొట్టి ..” అన్న పద్యం ” భాగేశ్వరి ” అనే హిందూస్దానీ రాగం) వింటే, పద్యాన్ని అతను ఎంత బాగా అర్ధం చేసుకున్నాడో తెలుస్తుంది. పద్య రచనలో ఉన్న మాధుర్యం చెడిపోకుండా , లలితంగా స్వరకల్పన చేస్తూ భావం ఉట్టిపడేలా పాడటం ద్వారా ఘంటసాల పద్యం ఎలా చదవవచ్చో తెలుగువాళ్ళకి తెలియ చెప్పాడు.

కర్ణాటక సాంప్రదాయ సంగీతం అభ్యసించినా, ఘంటసాలకి హిందూస్తానీ సంగీతంపై కూడా చాలా మోజు. ఇది అతను సంగీత దర్శకత్వం వహించిన సినిమాల్లో మనకి వినపడుతుంది. దేష్‌( అలిగిన వేళనే చూడాలీ .. గుండమ్మ కధ) , రాగేశ్వరి ( అన్నానా భామిని.. సారంగధర) ,( ఎంత ఘాటు ప్రేమయో … పాతాళ భైరవి), (ఇదినా చెలి ఇదినా సఖి … చంద్రహారం), భాగేశ్వరి (నీ కోసమే నే జీవించునదీ … మాయాబజార్‌ ఈ పాట స్వరకల్పన గురించి తెలిసిన వారు ఇది సాలూరు రాజేశ్వర రావు స్వరకల్పన అంటారు. ) , దెష్‌కార్‌(తెల్లవార వచ్చె తెలియక … చిరంజీవులు ), పహాడి (నవ్వుల నదిలో పువ్వుల పడవా … మర్మయోగి) వంటి రాగాలను ఉపయోగించటం అందుకు నిదర్శనం. బడే గులాం ఆలీ ఖాన్‌వంటి సుప్రసిద్ధ హిందూస్తానీ గాయకులు మద్రాసు వస్తే, వాళ్ళు ఘంటసాల ఇంట్లో బస చేసేవారట. పొద్దున్న నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకోబోయే దాకా పాటలు పాడుకుంటూ ఉండే వారట. సంగీతం మీద అటువంటి తృష్ణ ఉండటం అతని విజయానికి మరో కారణం. ” ఊహలు గుసగులాడే ..” లాంటి పాటలు మధుకోన్స్‌వంటి రాగాలలో స్వరకల్పన చేసిన ఘంటసాలకి హిందూస్తానీ సంగీతంతో పరిచయం తక్కువని ఎలా అనుకోగలం? అలాగే చాలా హిందూస్తానీ రాగాల్లో పరిచయం ఉన్న ఘంటసాలకి, సంగీత దర్శకుడిగా కొంతమంది మంచి కితాబు ఇవ్వకపోయినా ( న్యాయంగా సాలూరి రాజేశ్వర రావుని తెలుగు సినీమా సంగీతంలో ” ఆల్‌టైమ్‌గ్రేట్‌” గా చెప్పుకున్నా), ఘంటసాల సంగీత దర్శకునిగా తనదంటూ ఒక ఒరవడిని సృష్టించిన వాడు.

పెండ్యాల నాగేశ్వర రావు సంగీతంలో ఘంటసాల పాడిన కొన్ని వందల పాటల్లో, రెండు పాటలు తెలుగు వాళ్ళు ఎప్పుడూ మరచిపోలేరు. మొదటిది జయభేరి సినిమా కోసం పాడిన “రసికరాజ తగువారము కామా ..” ( చక్రవాక, కానడ రాగాల మేళవింపు), రెండవది జగదేకవీరుడు కథ కోసం పాడిన “శివశంకరీ శివానందలహరి ..” (దర్బారీ కానడ). స్వరకల్పన చేసిన పెండ్యాల, అందుకు దీటైన పద్ధతిలో పాడిన ఘంటసాల ఇద్దరూ ఇద్దరే! మళ్ళీ అంతటి ప్రజ్ఞతో శాస్రీయ సంగీతాన్ని సినిమా పాటల్లో ఉపయోగించుకొన్న సంగీతదర్శకుడు గాని, ఘంటసాల లాంటి కంచు కంఠం ఉన్న గాయకుడు గాని సినిమాలకు పరిచయం కాలేదు.

ఘంటసాల సినీ విజయానికి ఇంకో కారణం ఎన్‌. టి .ఆ ర్‌. , ఎ . ఎన్‌. ఆర్‌. సినిమాల్లో పాటలు పాడుతున్నట్టు నటిస్తుంటే, ఎవరి పాట వాళ్ళే పాడుతున్నారా అనిపించేట్లు ఇద్దరికీ ఆయన పాడటం. మాయాబజార్‌(లాహిరి లాహిరి..) , భూకైలాస్‌(దేవదేవ ధవళాచల ..) , తెనాలి రామకృష్ణ (కొన్ని పద్యాలు), గుండమ్మ కధ ( కోలొ కోలో యన్న ..) ,వంటి సినిమాల్లోనే కాక శ్రీ కృష్ణార్జున యుద్ధం, సంసారం, పల్లెటూరి పిల్ల, లాంటి సినిమాల్లో ఈ ఇద్దరు హీరోలూ కలిసి నటిస్తున్నప్పుడు, ఘంటసాల గొంతులో చూపించిన వైవిధ్యం మరపురానిది.

1950, 60 దశాబ్దాల్లో చాల సినిమా పాటలు కర్ణాటక రాగాల మీద ఆధారపడ్డప్పటికీ, సంగీత దర్శకులు పాటల్ని వీలైనంత లలితంగా ఉంచటానికి ప్రయత్నించేవారు. సాలూరు రాజే”స్వర” రావు, సుబ్బురామన్‌, పెండ్యాల, ఘంటసాల, టి. వి. రాజు లాంటి సంగీత దర్శకులు ఈ మార్గాలు తొక్కిన వాళ్ళే. ఆ రోజుల్లో ఒక గాయకుడు గానీ, సంగీత దర్శకుడు గాని రోజుకి ఒకటి, లేదా రెండు పాటల మీద పని చేస్తూ ఉండేవాళ్ళు. ఆ శ్రమకి తగ్గట్లు పాటల్లో ” సంగీతం ” ధ్వనించేది. పాటల్లో సంగీతం (వాయిద్యాలు) కూడా పాటకు తగ్గ మోతాదులో ఉండి, వినసొంపుగానూ, తిరిగి పాడుకోటానికి వీలుగానూ ఉండేవి. 1960 దశాబ్దంలో బాగా రాణించిన ఘంటసాల పాటల్లో క్వాలిటీ, 1970 దశాబ్దంలోకి అడుగు పెడుతున్నప్పుడే నానాటికీ తగ్గుతూ వచ్చింది. దానికి కొంత కారణం దెబ్బతిన్న అతని ఆరోగ్యం ఐనా, తెలుగు పాటల్లో సంగీతపరంగా వచ్చిన మార్పులు చాలా వరకు దోహదం చేశాయి. ఒకసారి ప్రఖ్యాత గాయకుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ ఎవరో అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతూ ” ఘంటసాల మంచి గాయకుడేగాని అతని చేత చివరి రోజుల్లో చాలా చెత్తపాటలు పాడించారు సంగీత దర్శకులు” అన్నాట్ట. తెలుగువారికి ఘంటసాల చివరి రోజుల్లో ఇచ్చిన మరో కానుక ” భగవద్గీత “. అప్పటికే అతని గొంతులో మాధుర్యం తగ్గినా, చిత్తశుద్ధితో పాడిన ఆ పద్యాలు, వాటి వివరణ ఎప్పటికి మరచిపోలేము. ఆ రోజుల్లోనే పది వేలకు పైగా పాటలు పాడిన ఘంటసాల తెలుగు వారి హృదయాల్లో చిరస్మరణీయుడు.

ఘంటసాల తెలుగేతర భాషల్లో ఎక్కువ పాటలు పాడలేదు. పాడిన కొద్ది పాటలూ వింటే అవి ఒక తెలుగువాడు పాడుతున్నట్లుండేవి కానీ, ఏ భాషలో పాడాలో ఆ భాష పాటలా ఉండేది కాదు. ఆ రకంగా ఘంటసాల పూర్తిగా ఆంధ్రుడు.

1967 సంవత్సరంలో ” శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న ” సినిమా ద్వారా సినీ రంగం ప్రవేశించిన శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం లేక ” ఎస్పీబి ” మరొక మరపురాని గాయకుడు (తొలి పాట రికార్డింగ్‌ జరిగింది డిసెంబరు 1966 లో). (ఎస్పీబిని సినిమాలకి పరిచయంచేసిన సంగీత దర్శకుడు ఎస్‌ పి. కోదండపాణి. అందుకు గుర్తుగా, ఎస్పీబి కట్టిన రికార్డింగ్‌స్టూడియోస్‌కి కోదండపాణి పేరు పెట్టుకోవడం ఎంతైనా సమంజసం.) ఘంటసాల గొంతు వినివిని అలసిపోయిన ప్రజలకి ఎస్పీబి గొంతు కొత్తగా, లేతగా వినిపించి, శాస్త్రీయ సంగీతం తేలేని లలిత మాధుర్యాన్ని తీసుకురావటం గమనించి, అతడ్ని ఆదరించారు. 19 ఏళ్ళ వయస్సులోనే, ఏ మాత్రం శాస్త్రీయ సంగీతంలో ప్రవేశంలేని ఎస్పీబి, అతి తొందరలోనే తనదంటూ ఒక ప్రత్యేక స్ధానాన్ని తయారుచేసుకోగలిగాడు.ఘంటసాల ఆరోగ్యం క్షీణించటంతో ఎస్పీబి కి పాటలు పాడే చాన్స్‌లు ఎక్కువయ్యాయంటారు కొందరు. నిజానికి ప్రతిభ ఉన్న వ్యక్తి ఎలాగైనా రాణిస్తాడు అంటానికి ఎస్పీబి ఒక ఉదాహరణ. ఎస్పీబి సినీ రంగంలో కాలు నిలదొక్కుకోటానికి ఎన్ని కష్టాలు పడ్డాడో, అన్ని విధాలుగా ప్రతి మ్యూజిక్‌డైరెక్టర్‌నుంచి ఎంతో నేర్చుకొంటూ త్వరత్వరగా తన స్ధాయి పైపైకి నెట్టుకొంటూ వచ్చాడు. కాలం మార్పు వల్ల వచ్చిన కొత్త సినిమా పాటల ధోరణులని అంగీకరించి, అభ్యసించి, ప్రతి సంవత్సరానికీ పెరుగుతున్న సినీమాల సంఖ్యకి తగ్గట్టు రోజుకి కనీసం 10 నుంచి 15 దాకా కొత్త పాటలు పాడటం సామాన్యమైన విషయం కాదు. మామూలుగా తెలిసిన పాట పాడటం ఒక ఎత్తు, సంగీత దర్శకుడు చెప్పినట్టు బాణీ పట్టుకోవటం ఇంకో ఎత్తు. అందులో మాష్టరీ సంపాయించాడు ఎస్పీబి. ఈ విషయంలో ఎస్పీబి కి ఉన్న అసాధారణ జ్ఞాపకశక్తి చాలా ఉపయోగపడింది. “తెలుగు సినిమాల్లో సంగీత వికాసం ” అన్న వ్యాసంలో చాగంటి కపాలేశ్వరరావు గారు ఎస్పీబి గురించి అన్న మాటలివి. ” ఎస్పీబి ఘంటసాల కాలంలోనే రంగంలోకి వచ్చి, స్వయంశక్తితో వేళ్ళు పాతుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. ఘంటసాల వెళ్ళిపోయాక ఆయన స్ధానాన్ని కూడా తానే అలంకరించి, దాదాపు 30 ఏళ్ళుగా సంగీత తారగా వెలిగిపోతున్న నిజమైన, నిఖార్సైన ప్రతిభావంతుడు. అతని నైపుణ్య వైవిధ్యం అపారం. శాస్త్రీయ సంగీతం నుంచి జానపదుల వరకూ, లలిత సంగీతం నుంచి రాక్‌, బ్రేక్‌, వంటి ధోరణులను సునాయాసంగా అలవర్చుకో గలిగిన సూక్ష్మగ్రాహి. తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాలతో సరిసమానంగా, కొన్ని విషయాల్లో ఆయనని మించిన (కొందరికి కోపంవచ్చినా సరే!) ప్రతిభా వైవిధ్యం కలిగినవాడు ఎస్పీబి “.

ఎస్పీబి సినిమాలకి మొదట్లో పాడిన పాటల్లో ఒక కొత్తదనం కనపడుతుంది. ” రావమ్మా మహాలక్ష్మి రావమ్మా …” (ఉండమ్మా బొట్టు పెడతా) పాట ఇప్పటికీ ఎంతోమంది పాడుకుంటూ ఉంటారు ( ఈ పాట తరవాత సంక్రాంతిని వర్ణిస్తూ అందరూ గుర్తుంచుకోదగ్గ పాట మళ్ళీ రాలేదు ). అతనికి పేరు తెచ్చిన తొలి పాటల్లో ” ఏ దివిలో విరిసిన పారిజాతమో ..” (కన్నె వయసు), ” మేడంటే మేడాకాదూ ..” (సుఖః దుఃఖాలు) గుర్తుంచుకో తగ్గవి. ఇప్పటికీ పాడుకోదగిన గీతాలు ఏకవీర సినిమా కోసం పాడినవి ( ఏ పారిజాతమ్ములీయగలనో చెలీ .., కలువ పూల చెంతచేరి కైమోడుపు చేతునూ ..). ఘంటసాల పోయాక కొంతకాలం దాకా ఎస్పీబి కెరీర్‌లో కొన్ని ఒడుదుడుకులు వచ్చినా, 1975 తరవాత వచ్చిన చాలా సినిమాల్లో పాటలు అతనికి పేరు తెచ్చాయి. “సిరిమల్లె నీవె ..” (పంతులమ్మ ), ” మావి చిగురు తినగానే ..” (సీతా మహలక్ష్మి), ” మధుమాస వేళలో …” (అందమె ఆనందం) , “శివరంజని నవరాగిణి ..” (తూర్పు పడమర) లాంటి పాటలు కొన్ని ఉదాహరణలు మాత్రమే. 1980 దశాబ్దం సంగీత దర్శకుడు ఇళయ రాజాది అన వచ్చు. ” వే వేల గొపెమ్మలా ..”, ” వేదం అణువణువున …”, “తకిట తధిమి తకిట తధిమి తందాన ..” వంటి సాగర సంగమం పాటలతో మొదలయ్యి, చాలా సినిమాలకు ఎస్పీబి మంచిపాటలు పాడాడు.

ఘంటసాల కి ఎన్‌. టి . ఆర్‌. , ఎ . ఎన్‌.ఆర్‌. మద్దతు ఎలావచ్చిందో, ఆ నాటి పాప్యులర్‌హీరో కృష్ణ మద్దత్తు ఎస్పీబికి ఉండేది (నేనంటే నేనే సినిమాలో ” గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ ..” పాటలో ఎస్పీబి గొంతు హీరో కృష్ణ గొంతు కి అతికినట్టు సరిపోయింది ). ఆ రకంగా కొంత ప్రోత్సాహం దొరికినప్పటికీ, ఎస్పీబి కి ఉన్న ఒక గొప్ప ప్రతిభ “అనుకరణ”. ఈ మిమిక్‌చెయ్యగల శక్తి వల్ల పెద్ద పెద్ద హీరోల దగ్గర నుంచి హాస్య నటులదాకా అందరికీ ప్లేబాక్‌సింగర్‌గా ఎస్పీబి యే ఉన్నాడు. అల్లు రామలింగయ్య, రాజ బాబు, మాడా, ఇలా ఎలాంటి నటుడైనా సరే, ఎస్పీబి గొంతు పాటకి సరిగ్గా సరిపోయేది.

ఎస్పీబి సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు ఉన్నా, అవి వేళ్ళమీద లెక్కించదగినవి. తూర్పు వెళ్ళే రైలు, మయూరి వంటి సినిమాలకి సంగీత సారధ్యం వహించినా, ఎస్పీబి సంగీత దర్శకుడుగా నిలబడలేకపోయాడు. అప్పటికే రకరకాల భాషల్లో పాటలు పాడటమే కాకుండా, డబ్బింగ్‌రికార్డింగ్‌ వల్ల ఎస్పీబి చాలా బిజీ ఆర్టిష్టు అవ్వటం కూడా దానికి కారణం.

సినీ రంగం చాలా పోటీ ఉన్న రంగం అని అందరికీ తెలిసిందే! అయితే, ఈ పోటీ ఎటువంటి మార్పుల్ని తెచ్చిందో తెలుగు సినిమా పాటల్లో, గాయకుల్లో కనపడుతుంది. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న ఘంటసాల చేత ” లవ్‌లవ్‌లవ్‌మీ నెరజాణ ” లాంటి పాటలు పాడించింది. ఎస్పీబి చేత రాక్‌, బ్రేక్‌, వంటి ధోరణులను అలవాటు చేయించింది. ఈ మార్పులకు మన ప్రముఖ సినీగాయకులు ఒప్పుకొని ఉండకపోయినట్టయితే, సినిమా సంగీత దర్శకులు, నిర్మాతలు మరింకెవర్నో తీసుకొచ్చి పాడించేవారు. కాలం తెచ్చిన మార్పుల్ని ఈ ఇద్దరూ అంగీకరించి, తిరుగులేని గాయకులుగా తెలుగు సినీ ప్రపంచంలో నిలబడ్డారు. ఘంటసాల, ఎస్పీబి దాదాపు 5 6 ఏళ్ళు కలసి సినిమాలకి పనిచేసినా, ఈ ఇద్దరు గాయకులూ కలిసి పాడిన పాటలు మూడు మాత్రమే. “ప్రతి రాత్రి వసంత రాత్రి …” (ఏకవీర), “ఎన్నాళ్ళో వేచిన ఉదయం ..” (మంచి మిత్రులు) మాత్రం నాకు గుర్తొస్తున్న పాటలు. మూడో పాట ఏమిటో తెలిసిన మిత్రులని అడిగి తెలుసుకోవాలి.

మార్పు అన్నది సంఘంలోనూ, జీవితాల్లోనూ కన్న సినిమా (పాట) ల్లో తేలికగా కనపడుతుంది. గత 50 సంవత్సరాలుగా, సంగీత పరంగా సినిమాపాట రకరకాలుగా పరిణతి చెందింది. మొదట్లో సశాస్త్రీయంగానే తప్ప మరే విధంగానూ స్వరకల్పన కాలేని పాట ( జానపద గీతాలు తప్ప), రానురాను మార్పులు చెందుతూ వచ్చింది. ఉదాహరణకి, శుద్ధ మోహన రాగంలో ” నిషాదం ” ఉపయోగం లాంటి ప్రయోగాలవల్ల పాటలు చాలా వినసొంపుగానూ, అర్ధవంతంగానూ ఉండి, ఒక కొత్తదనాన్ని తెచ్చుకున్నాయి. “ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి ..” (అప్పుచేసి పప్పు కూడు), “మనసు పరిమళించెను తనువు పులకరించెను ..” (శ్రీ కృష్ణార్జున యుద్ధం) పాటల్లో ఇదే ప్రయోగం జరిగింది. సహజంగానే కర్ణాటక సంగీతంలో బాగా ప్రచారం ఉన్న మోహన, కల్యాణి, అభేరి, సింధుభైరవి, హిందోళం వంటి రాగాలను మన తెలుగు పాటలు తమ సొంతం చేసుకొన్నాయి. ఘంటసాల సంగీతంలో రూపుదిద్దుకొని చాలా పేరుపొందిన ” లవకుశ ” సినిమాలో, హిందోళ రాగంలో స్వర కల్పన చేసిన ” సందేహించకుమమ్మా … ” పాటలో కావాలని వాడిన “పంచమం “, శాస్త్రీయ సంగీతం తెలిసిన వారికి కష్టం కలిగించినా, పాపులర్‌పాటగా చెలామణి అయ్యేట్లు చేసింది. ఇల్లాంటి ప్రయోగాలు ఆ కాలపు సినిమా పాటల్లో చాలా జరిగేవి. రాను రాను పాటల స్వర కల్పనలు శాస్త్రీయ రాగాలపై ఆధారపడటం తగ్గి, మెలోడీ బేస్‌గా స్వరబద్ధం అవుతూ వచ్చాయి. ఇది పాశ్చాత్య సంగీత ప్రభావం అయినా, పాట వినసొంపుగా ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తూ వచ్చారు. ఎ. ఆర్‌ రెహమాన్‌సంగీతం ఇచ్చిన ” రోజా ” సినిమాలో ” చిన్ని చిన్ని ఆశ …” పూర్తిగా మెలోడీ బేస్‌గా స్వరకల్పన కాబడ్డ పాట. ఈ పాటను కీబోర్డు మీద వాయించ ప్రయత్నిస్తే, అన్ని ” శంకరాభరణం ” రాగం స్వరాలు కనపడతాయి. కాని, ఈ పాటలో శంకరాభరణం రాగ లక్షణాలు ఎంతవెదికినా కనపడవు. ఇలాంటి పాటలు ఏ రాగం అని ఎవరన్నా అడిగితే సమాధానం ఏం చెబుతాం ? 1970, 80 దశాబ్దాలలో మంచి సంగీత దర్శకులు ( ఇళయ రాజా వంటి ఒకరిద్దరు తప్ప) కరువైనప్పటికీ, ఈ మధ్య కాలంలో (కీరవాణి వంటి కొత్త సంగీత దర్శకుల ద్వారా) తిరిగి కొత్త బాణీలు అందంగా వినపడుతున్నాయి. ముఖ్యంగా పాశ్చాత్య సంగీత ధోరణి తనలో కలుపుకొని, శాస్త్రీయ పరంగా ఉండటమే కాకుండా, రాగ లక్షణం చెడకుండా స్వర కల్పన చేయబడుతున్న పాటలు ఎక్కువగా వినవస్తున్నాయి. ఇందుకు సమానంగా చాలా కొత్త గొంతులు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ” సినిమా పాట ” ఎప్పటికప్పుడు కొత్త కొత్త ముస్తాబులు చేసుకొని, మళ్ళీ మన ముందుంటున్నది.