శ్రౌతార్థమే హృదనుభూతార్థ మైనపుడు
జ్ఞాతముగ సత్యదర్శన మగును నీకు
జ్యోతి నీలోనె హృదయాంతరాళమునుండు
ఆతుమకు తేజమదె – మంకుతిమ్మ
ఎం. ఆర్. చంద్రమౌళి
- పూర్తిపేరు
- మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీ
- ఇతరపేర్లు
- ఎం. అర్. చంద్రమౌళి / మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీ
- సొంత ఊరు
- మత్తకూరు / హెసరఘట్ట
- ప్రస్తుత నివాసం
- బెంగళూరు
- వృత్తి
- బోధనాభ్యసనము, సమాలోచన, నిర్వహణ-యాజమాన్య ప్రశిక్షణ
- ఇష్టమైన రచయితలు
- వ్యాస, వాల్మీకి, కాళిదాస, శ్రీనాథ, పోతన, త్యాగరాజ, విశ్వనాథ, పుల్లెల, జంధ్యాలాదులు
- హాబీలు
- వ్యక్తి వికాస శిక్షణము, ,సాహిత్య- సంగీత - వేదాంత క్షేత్రాలలో అధ్యయనము మరియు అధ్యాపనము
జీవిత విశేషాలు
చంచ్రమౌళిగారు విజ్ఞాన శాస్త్రంలో పట్టభద్రులై, కన్నడ సాహిత్యంలో స్నాతకోత్తర పట్టాను, మానవ వనరుల అభివృద్ధి (హెచ్.ఆర్.డి) రంగంలో ప్రత్యేక శిక్షణను పొందినవారు. అనేక అంతర్జాతీయ సంస్థలలో మానవ వనరుల విభాగానికి ప్రధానాధికారిగా పనిచేశారు. విలువల ఆధారంగా నాయకత్వ సామర్థ్య శిల్పం (వాల్యూ బేస్డ్ కాంపిటెన్సీ ఆర్కిటెక్చర్) అనే భావనకు చెందిన నమూనాలను రూపొందించి, పలు సంస్థల పరిపాలనా వ్యవస్థలలో అమలు చేసి, శిక్షణను అందించి, దానికి సంబంధించిన వివరణ గ్రంథాలను కూడా రచించారు. ఈ విషయమై యాభైకి పైగా వ్యాసాలు పత్రికలలో ప్రచురితమయ్యాయి. మొదటినుంచీ వృత్తి పరిధిని మించి వీరిని ఆకర్షించినవి ఆధ్యాత్మికత, సాహిత్యం, సంగీతం. చిన్నతనం నుంచే ఇంటి పెద్దల ప్రభావంతో, అనేక మహాత్ముల ప్రభావంతో అద్వైతం వైపు ఆకర్షితులై, వృత్తి బాధ్యతలలో ఉన్నప్పటికీ వేదాంతశాస్త్రాధ్యయనం తమ జీవితానికి ఆధార శ్రుతిగా నిలిచింది. ఉద్యోగ విరమణ అనంతరం కన్నడ-తెలుగు-సంస్కృత భాషల ప్రాచీన కావ్యాలపై వీరి అధ్యయనం కొనసాగుతోంది. స్వంతరచనతో, కొన్ని ముఖ్యమైన గ్రంథాలను కన్నడం నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి కన్నడంలోకి అనువదించారు.
డి.వి.జి. గారి ‘మంకుతిమ్మన కగ్గ’ను ‘మంకుతిమ్మని మిణుకు’ అనే పేరుతో, మూల ఛందస్సులోనే సరళమైన తాత్పర్యంతో అనువదించారు; ’సినారె’ గారి ’విశ్వంభర’ను కన్నడంలో అనువదించారు. ఈ రెండు గ్రంథాలూ కువెంపు భాషాభారతి ద్వారా ప్రచురితమైంది. చంద్రమౌళిగారు రచించిన స్వతంత్ర కృతి ‘ఘంటసాల రాగశాల’. ఇది ఘంటసాల గానంలోని శాస్త్రీయ సంగీత విలువలను గుర్తించే సంశోధన వ్యాససంపుటి. అద్వైత విజ్ఞానసారం, సద్దర్శనం, ఉపదేశసారం, రుద్రాధ్యాయం మొదలైన కృతులను కన్నడ పద్యరూపంలో ఆవిష్కరించారు. బెల్లంకొండ రామరాయ కవీంద్రుల సంస్కృత భాషలోని కొన్ని అద్వైత గ్రంథాలను ‘అద్వయ వాఙ్మయ’ అనే పేరుతో కన్నడభాషకు అనువదించారు. ఈ గ్రంథం శ్రీ శృంగేరి శారదాపీఠం ద్వారా ప్రచురితమైంది. వాల్మీకి రామాయణం, భగవద్గీత, కర్ణాటక సంగీతాలకు సంబంధించి అంతర్జాలంలో పాఠాలు, తాము నివసించే ప్రదేశంలో స్నేహితులతో వేదాంత గోష్ఠి — ఇలా వీరి పదవీ విరమణ జీవితం సాగుతోంది.