మంకుతిమ్మని మిణుకు – 2 (1-10)

1.
శ్రీమజ్జగన్ముకుర విస్తరదొళార్ తన్న ।
మైమెయ ప్రతిబింబ చిత్రగళ నోడు– ।।
త్తామోదబడుతిహనొ ఆతనడిదావరెయ ।
నామరసువం బారొ -మరుళమునియ
।।

శ్రీమజ్జగన్ముకుర విస్తరమునన్ స్వాంత
మైమల ప్రతిబింబ చిత్రముల చూచి
యామోద పడుచుండునొ వాని పదమరయ
ప్రేమతో చనిరండు – మంకుతిమ్మ

నగరవీథికి ఎదురుగా ఒక పెద్ద అద్దాన్ని నిలిపితే, ఆ వీథి భవనాలతో సహా సర్వం అద్దంలో ప్రతిబింబిస్తుంది. అద్దాన్ని తొలగిస్తే, ఆ ప్రతిబింబం మాయమౌతుంది. బింబం అద్దంలో లేదు. అద్దమున్నా లేకపోయినా బింబం ఉండగలదు. ఇదే సత్యం; అద్దంలో కనిపించే ప్రతిబింబం మాత్రం మిథ్య.

ఇలాగే, మనకు కనిపించే ఈ ప్రపంచం “జగన్ముఖ విస్తారం” అనే ప్రతిబింబమే. కనిపించేది భగవద్భూతి. భగవంతుడు తన విభూతి వైవిధ్య చిత్రాలను విశ్వదర్పణంలో తనే చూసి మురిసిపోతున్నాడట! వాని చరణములు ఎక్కడో, పరమాత్మస్వరూపం ఎటువంటిదో తెలుసుకుందాం అని కవి మమ్ములను ఆహ్వానిస్తున్నాడు.

వటవృక్షం క్రింద దక్షిణాభిముఖంగా కూర్చొని, అమూర్తుడైననూ, శిష్యానుగ్రహార్థం మూర్తిగా కనిపించే విద్యాసంప్రదాయ ప్రవర్తకుడు, విద్యోపదేశక గురువు శ్రీ దక్షిణామూర్తి. “విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం” అన్న భగవత్పాదుల మాటే ఈ ప్రార్థనశ్లోకానికి స్ఫూర్తి కావచ్చు. స్వాంతమైన మహిమచే ప్రతిబింబమై, దర్పణంలో ప్రతిబింబంవలె కనిపించే ఈ మిథ్యావిశ్వాన్ని, తన కృతిలోని చిత్రాలనూ ఆస్వాదిస్తూ ఆనందించే ఆ ప్రభువుకు నమస్సులు.

2
శ్రీమజ్జగద్దర్పణదొళావ రాజం స్వ ।
సామ్రాజ్య బింబగళ తాం కాణలెందు ।।
ఈ మోహనాగారవం నిరవిసిదనవన ।
నామరసువం బారొ – మరుళమునియ
।।

శ్రీమజ్జగద్దర్పణముననే రాజు స్వ-
సామ్రాజ్య బింబముల తానె చూడంగ
ఈ మోహనాగారమును జేసెనో వాని
నేమ మరయగ రండు – మంకుతిమ్మ

ఈ జగద్దర్పణ విస్తారము పరబ్రహ్మయొక్క స్వాంత మాయావిలాసము.
కలలో మనమందరం నిర్మించుకొనే నగరాలు, వ్యక్తులు, వస్తువులు మొదలైన దృశ్యాలన్నీ మెలకువ వచ్చిన వెంటనే మటుమాయమౌతాయి. నిద్ర ముగిసి జాగృతావస్థ లేచినప్పుడు—అన్నీ భ్రమలేనని మనకు తెలిసే సత్యము ప్రత్యక్షమౌతుంది. కల ఒక మాయానగరి; అలా ఈ విశ్వమూ బ్రహ్మయొక్క మోహనాగారము.

మెలకువ రాగానే కలల ప్రపంచం గాలిలో కలిసినట్టు, ప్రబోధము అనగా ఆత్మజ్ఞానం కలిగిన క్షణం నుంచే గోచరించే సకల విశ్వమూ “దర్పణ ప్రతిబింబిత మాయానగరంలా” మనమే నిర్మించుకున్న స్వప్నంలాంటిదని బోధపడుతుంది.

విశ్వము దైవమాయ; స్వప్నము మన మాయ. తానే చూసుకొని ఆనందించుటకు ఈ మోహనాగారమును ఎవరు నిర్మించుకొన్నాడో— అతడిని తెలుసుకోవడమే సత్యాన్ని తెలుసుకోవడం. ఆ సత్యాన్వేషణకు రండి అని పిలుస్తూ, కవి తన కృతియొక్క పరమోద్దేశాన్ని వెల్లడిస్తున్నాడు.

3
ఈ భువన ముకురదొళగావాసితం తన్న ।
వైభవ విలాసగళ కాణలెందెళసి ।।
ఈ భిదుర భిత్తిగళ నిరవిసదనో అవన ।
శోభెగెరగువ బారొ – మరుళమునియ ।।

ఈ భువనముకురమున నివసించియు స్వాంత
వైభవ విలాసముల గన సంభ్రమించి
ఈ భిదుర భిత్తులను నిర్మించెనెవడొ తన
శోభకంజలినిడుము- మంకుతిమ్మ

భువనమంటే విశ్వం. విశ్వం విష్ణుః; అదే సహస్రనామార్థం. ఇంద్రియగోచరములు, మనోగోచరములు, అగోచరములు ఏవేవి ఉన్నా, ఇవన్నీ ఈశ్వరనిర్మిత చిత్రవిచిత్రాలే. విశ్వ వైభవవిలాసములన్నీ భగవంతుని విభూతి. ఆ తన సంపదల శోభను తనే చూసుకోవాలంటూ, భువనమనే అద్దంలో కనిపిస్తూ (భువనముకురమున నివసించియూ), భేద్యములగు కుడ్యములను—అనగా నిత్యప్రవర్తనశీలమై మారుతూ కనిపించే లోకాన్ని (భిదురభిత్తులను)—ఎవరు నిర్మించారో తెలుసుకుని, ఆ శోభకు నమస్కరించాలి.

ఈశ్వరతత్త్వాన్ని గ్రహించిన ఆచార్య పురుషుడు గురువు. ఆ గురువెవరు? సాక్షాత్ పరబ్రహ్మమే. ఆ గురు బోధను గ్రహించి తరించే శిష్యులూ బ్రహ్మస్వరూపులే. ఈశ్వరుడు, గురువు మరియు తను అని ముమ్మూర్తులుగా పేర్కొన్నా, అన్నీ ఒకే తత్త్వమే. అదే ఆకాశంలా వ్యాపించిన దక్షిణామూర్తి తత్త్వము. (“ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే। వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః”). దైవ ప్రార్థనతో కృతిని ప్రారంభించడం సాంప్రదాయిక పద్ధతి. కవి ఇక్కడ పరబ్రహ్మ తత్త్వాన్ని అద్వైత భావంతో స్తుతిస్తున్నాడు.

4
శ్రీమంతనావనీ భువన ముకురది నిజ ।
స్వామితెయ లీలెగళ నోడి నలియల్కీ ।।
భూమ ప్రపంచవం నిరవిసిదనో అవన ।
నామరసువం బారొ – మరుళ మునియ ।।

శ్రీమంతుడెవడీ జగతి ముకురమున స్వాంత
స్వామిత్వలీలలన్ చూచి విలసిల్ల
భూమ ప్రపంచమును నిర్మించెనెవడొ నా
స్వామి కంజలినిడుము – మంకుతిమ్మ

ఈ విశ్వమనే అద్దాన్ని నిర్మించి, అందులో తన స్వాంతమైన స్వామిత్వలీలలను చూసి మురిసిపోతున్నవాడు ఎవరు? ఈ విశ్వ నిర్మాత ఎవరు? ఆ స్వామికి నమస్కరించమని దీని భావం.

(ఈ నాలుగు పద్యాల సారం ఒకటే. కవి ఈ నాలుగు ప్రారంభిక పద్యాలలో ఏదో ఒక పద్యాన్ని ఎంపిక చేసుకొనవలెనని వ్రాసి ఉండటంతో, పునరుక్తిగా కనిపించినా, యథాతథంగా ఇక్కడ పొందుపరచడం జరిగింది.)

ఈ ప్రార్థనా పద్యాల భావం దర్పణదృష్టాంతం ద్వారా వర్ణించబడింది. ఎందుకంటే అధ్యాత్మికసత్యం మాటలకు అందదు. అందుకే దక్షిణామూర్తి మౌనంగా ఉపదేశిస్తాడు. జ్ఞానస్వరూపుడై మనలోనే నిశ్శబ్దంగా ఉపదేశించే పరబ్రహ్మకు సంకేతమే దక్షిణామూర్తి. అంటే, మనలో ప్రకాశించే చైతన్యమే నిజమైన గురువు. అది మాటలకు అందదు. మనస్సు దానిని పట్టుకోజాలదు, ఎందుకంటే అది నాకు భిన్నమైన వస్తువు కాదు. దానిని తెలుసుకోవడం అసాధ్యం. అన్నీ తెలుస్తున్నది దానికే. అన్నిటినీ తెలుసుకొనే జ్ఞానమే ఆ చైతన్య తత్త్వము. అది మన లోపల, బయట, సర్వత్రా ఉన్న, అద్యంతాలు లేని సత్యం. ఆ తత్త్వానికి నమస్కరించమని కవి సూచిస్తున్నాడు.

5
ద్వంద్వ తర్కదినాచె శుభ అశుభదిందాచె ।
ఇంద్రియ స్పర్శనద సుఖ దుఃఖదాచె ।।
సందిర్పుదొందు దశెయదు నిత్యసౌఖ్యదశె ।
ఎందుమరసదను నీ -మరుళ మునియ ।।

ద్వంద్వ తర్కము శుభాశుభములావల నీదు
ఇంద్రియ స్పర్శ సుఖ దుఃఖముల వెనుక
చెందెనొక దశ నిత్యసౌఖ్యదశ యద్దాని
పొంద వెదుకుము నీవు – మంకుతిమ్మ

పరబ్రహ్మవస్తువు నిర్ద్వంద్వమైనది, తర్కానికి అతీతమైనది, శుభ–అశుభాలకు ఆవలనున్నది. చక్షురాది కరణములు, శబ్ద–స్పర్శాది తన్మాత్రలు, సుఖ–దుఃఖ అనుభూతులు — ఇవన్నిటికీ అతీతంగా నిత్యమైన సౌఖ్యప్రద స్థితి ఒకటుంది. అన్నిటి వెనుక ఉన్న ఆ సద్వస్తువు నిత్యానందస్వరూపము. ఆ పరమానందమనే సౌఖ్యస్థితిని ఎల్లప్పుడూ అన్వేషిస్తూ ఉండాలి.

పరమానంద దశ అనేది ఆధ్యాత్మిక దృష్టిలో అత్యున్నత ఆనంద స్థితి. దీనిని ఆత్మస్వరూపంలో లీనతగా అర్థం చేసుకోవాలి. ఇది సాధారణ లోకానందం కాదు. మనస్సు, ఇంద్రియాలు పొందే సుఖం అనిత్యం — వచ్చిపోతూ ఉంటుంది. కానీ పరమానందం అనేది అద్వైతంలో చెప్పబడిన ఆత్మానుభూతి, సత్యం–జ్ఞానం–ఆనందం అనే ఒకే స్వరూపంలో శాశ్వతంగా నిలిచే అనుభవం. ఇది ద్వంద్వాలు (సుఖ–దుఃఖం), భావోద్వేగాలు, చిత్తచాంచల్యం లేని స్థితి. ఆకాంక్ష, భయం, లోపభావం పూర్తిగా లీనమయ్యే స్థితి. ఇందులో తాను శరీరం కాదు, మనస్సు కాదు, భావప్రవాహం కాదు — శుద్ధ చైతన్యం అనే ప్రత్యక్ష అనుభూతి మాత్రమే. దీనిని మాటలతో పూర్తిగా వర్ణించడం సాధ్యం కాదు; ఎందుకంటే అది బాహ్యానుభవం కాదు — అంతర్గత స్వరూప ప్రబోధం. అదే నిర్లహరి సముద్రం వంటి నిశ్శబ్ద–అచంచల ప్రశాంతత. ఆ దశలో “నేనే అది — అదే నేను” అనే బ్రహ్మైకత్వభావం ప్రత్యక్షమవుతుంది.

ద్వంద్వరహిత స్థితిలో సుఖ–దుఃఖం, జయం–అపజయం, పుణ్యం–పాపం అన్నీ మిథ్యగా గోచరిస్తాయి. ఆ స్థితి ఒక కొత్త సంపాదన కాదు — ఉన్నదానినే ఆత్మస్వరూపంగా గుర్తించుకోవడం. ఆత్మను తెలుసుకున్నపుడు అనుభవించేవాడు–అనుభవం–అనుభవిత్యం అనే త్రిపుటి లీనమై, మిగిలేది పరమానందమే. ఉనికి–ఎరుక–ఆనందం అన్న మూడు కూడా ఆ పరబ్రహ్మస్వరూపమే. వ్యక్తిత్వమే లీనమవుతుందిగనుక, అక్కడ అనుభవించే ‘వ్యక్తి’ ఉండడు. బాహ్యకారణం లేకుండానే స్వయంగా ప్రకాశించే స్థితి కావున అది నిరుపాధికం. ఈ జ్ఞానం ఏ వస్తువును గుర్తించడం కాదు — స్వరూపసత్యాన్ని సాక్షాత్కరించడం.

నేను మంకుతిమ్మని తమ్ముడైన మరుల మునిని

6
మరుళ మునియను నాను మంకుతిమ్మన తమ్మ ।
కొరగెన్నెదెయ తిత్తియొళగె తుంబిహుదు ॥
సురివెనదనిల్లి సాధుగళు సరిపేళరేం ।
గురువలే జగ నమగె -మరుళ మునియ ॥

మరుల ముని నేను తమ్ముడ మంకు తిమ్మనకు
ఒఱపు యూపిరి తిత్తులను నిండె నాకు
కురిపింతు దానిచట సాధువులు సరిజెప్ప
గురువు జగమే మనకు – మంకుతిమ్మ

డి.వి.జి. గారు ‘మంకుతిమ్మని మిణుకు’ రచించిన తరువాత కూడా అలాంటి పద్యరచన కొనసాగుతూ ఉండేది. ఏ చిన్న కాగితమైనా, టపా కవరు వెనుకైనా, ఆ క్షణానికి లభించిన ఏ కాగితపు ముక్కయినా దొరికితే దానిపై పద్యాలను రాస్తూ, వాటిని ఒక సంచిలో వేసుకుంటూ వచ్చారే తప్ప వెలుపల ప్రకటించలేదు. డి.వి.జి. గారు పరమపదించిన తరువాతనే ఆ పద్యాలు బయటికొచ్చాయి.

‘మంకు తిమ్మడు’ అన్నవాడి తమ్ముడు ‘మరుల మునియ’—అంటే మంకుతిమ్మని మిణుకు రెండవ భాగం—మొదటి భాగం వెలువడిన నలభై సంవత్సరాల తరువాత పుట్టింది. వేల పద్యాలను చెప్పిన తరువాత కూడా, కవిచిత్తంలో ఏదో తీర్చలేని ఆరాటం నిండి ఉన్నది. ప్రపంచమే గురువు—అది నిరంతరం బోధిస్తూనే ఉంటుంది. విశ్వవీక్షణమే ఒక్కడైన తపస్సు. ప్రపంచాన్ని గమనిస్తే అందులోనే సత్య–మిథ్యలు, శాశ్వత–అశాశ్వతాలు, విశ్వసూత్రమై నిలిచి వెలిగే ఆత్మతత్త్వ పరమార్థం ప్రత్యక్షమవుతుంది. అదే ఒకే తత్త్వాన్ని పునఃపునః కొత్తదనంతో, మనస్సుకు హత్తుకునేలా చెప్పడం దార్శనిక కవికి ఒక సహజమైన, తప్పరానిదైన క్రియ.

ఈ పద్యాలను ఎందుకు రాసానని కవి వివరించే సమయంలో—వాటి సరితప్పులను సాధుజనులే నిర్ణయించాలని కోరుకుంటున్నాడు. (మరుల మునియ రచనలు ‘మంకుతిమ్మని మిణుకు’ గ్రంథానికి రెండవ భాగమవుతాయి. మరుళ మునియ అనే పేరు తెలుగు నుడికారంలో పొందికగా ఉండదని, ఈ గ్రంథానికి ‘మంకుతిమ్మని మిణుకు – 2’ అనే పేరును పెట్టడమైనది.)

7
మరుళ మునియను నాను మంకుతిమ్మన తమ్మ ।
సురివెనెన్నెదెచీలదెల్ల పురుళుగళ ।
సరి నోడి కొడువ సజ్జనరిహరె లోకదలి ।
శరణప్పెనవరింగె – మరుళ మునియ ।।

మరులు ముని మంకు తిమ్మనకు నే సోదరుడు
కురిపింతు నెదసంచి లోని సరుకంత
సరిజూసి తెలుప సజ్జనులు జగతిని గలర?
శరణంటి వారలకు – మంకుతిమ్మ

“మంకుతిమ్మని మిణుకు” రెండవ భాగమైన దీనిలో ప్రధానంగా తత్త్వవిచారణ మనకు కనబడుతుంది. అలాంటి అంతరార్థములను తెలిసినవారు లోకంలో ఉన్నారా? ఉంటే వారికి నా నమస్కృతులు అంటున్నాడు కవి. ‘మంకుతిమ్మని మిణుకు – 1’ లో డి.వి.జి గారి ప్రాథమిక చింతనాప్రవాహం కనిపిస్తుంది. అందులో తన రచనయొక్క ఉద్దేశాన్ని కవి ఇలా చెప్పాడు —

“విశదమైనట్టి జీవనధర్మదర్శనము ।
నొసగ తన మనసుకై తానే సత్యమును ।।
ధిషణమున గ్రంథానుభవములన్‌ శోధించ ।
ప్రసవమైనది మిణుకు – మంకుతిమ్మ.”

విస్తారమైన జీవితానికి అన్వయించే ధర్మరూపమైన ఆ నిశ్చయమైన తత్త్వాన్ని (విషయాన్ని), గ్రంథములు మరియు స్వానుభవములనుండి సంగ్రహించి — నేను కనుగొన్నట్లుగా ఈ కగ్గము రచింపబడినదని కవి అర్థమిచ్చాడు.

‘మంకుతిమ్మని మిణుకు – 2’ లో మరింత పరిపక్వమైన భావచింతన, ఇంకా చెప్పాల్సిన ఎన్నో ప్రశ్నలు — జిజ్ఞాస, కుతూహలం ఉద్భవిస్తూ; వాటన్నింటికీ సమాధానం చెప్పాలని ఒక తపనగా కనిపిస్తుంది. “లోకశాస్త్రాల పరిశీలనతో మరియు స్వానుభవంతో ఆ మహనీయుని మేధస్సు పరిపక్వతను పొంది, వృద్ధాప్యంలో దేహశక్తి తగ్గినప్పుడు ఈ పద్యాల రచన జరిగింది.” ఇందులోని తత్త్వచింతన మొదటి భాగంకన్నా తీవ్రమై, గహనమైన రూపంలో కనిపిస్తుంది. ఈ పద్యాలను బ్రహ్మసూత్రాలు మరియు ఉపనిషత్తుల ఆధారంగా వివేచన చేయాలి. డి.వి.జి గారు తమ అంతిమ ఘట్టంలో — జీవితానుభవం పక్వమై, విశేషంగా పరమార్థచింతనలో నిమగ్నులై ఉండటంవలన — ఇక్కడ అధికంగా ఆ పరమార్థతత్త్వమే ప్రతిఫలిస్తుంది

8
మరుళ మునియన మనసు సరళ బాళ్వెయ కనసు ।
సరస ఋత సౌజన్య శాంతిగళ సొగసు ।।
కెరెయినెద్దలెయెరచి తణివు తుంతురనినితు ।
మరళి తెరె సేర — మరుళ మునియ ।।

సరళ జీవనపు కల మంకుతిమ్మని మనసు
సరస ఋత సౌజన్య శాంతి శోభనము
సరసి తెరలేచి తుంపర చినుకులను చల్లి
మరల సరసిని జేరు – మంకుతిమ్మ

సరళంగా జీవితాన్నిగడపడమే మంకుతిమ్మని మనస్సు కన్న కల. జీవితం సరసము, ఋతము, సౌజన్యము, శాంతితో నిండి శోభించేదే ఆ కల. ఒక సరస్సునుండి లేచిన ఒక్క అల తన తుంపరలతో పరిసరాన్ని చల్లార్చి మరల తన మూల స్థానంలో కలిసిపోతుంది. ఒక గహనమైన తత్త్వాన్ని గ్రహించుకొని, యథార్థ దర్శనమైన పిమ్మట జీవితం ఎలా ఉంటుంది? సరసంగా, ప్రామాణికంగా (ఋతం), సకల జీవరాశులయందు స్నేహ సౌజన్యాలలో శాంతిగా సాగుతుంది. అందరిలో, అన్నిటిలో, అన్నియెడల బ్రహ్మాన్ని దర్శించగల జ్ఞానికి కనుపడేది ఒక్కటే. సరస్సు, అందులో లేచిన అల, అందులోని బిందువులు, దాని తనివి, అన్నీ నీళ్ళేకదా! లేచి కనిపించిన అల, దిగి మరల సరస్సులో కలిసిపోతుంది. అలా ఉంటూ, కనిపిస్తూ, మరుగైనటుల భాసించేది ఆ జలమే, మన స్వరూపం బ్రహ్మమే సరస్సు. ఆ సరస్సులో లేచిన ఒక చిన్న తరంగమే ఈ జీవితం. తరంగం పైకిలేచి తుంపరలను వెదజల్లి మరల సరస్సులో కలిసిపోయే విధంగా మన జీవితమనే అలను తన చుట్టూ హాయినందించి వెదజల్లే తుంపరలుగా మలచుకొని జీవించి తన స్వరూపమైన బ్రహ్మమనే సరస్సులో ఉండిపోవాలి అంటు తను కంటున్న ‘సరళ జీవనపు’ కలను నివేదిస్తున్నాడు.

9
కగ్గవిదు బెళెయుతిదె లంకెయలి హనుమంత ।
హిగ్గి బెళసిద బాలదంతె సిగ్గుళిదు ।।
నుగ్గి బరుతిరె లోకద ప్రశ్నెగళ ధాళి ।
ఉగ్గు బాయ్చపలవిదు – మరుళ మునియ ।।

పెరుగుచున్నది ‘మిణుకు’ లంకలో హనుమంతు
భరముతో లాంగూలమును పెంచినటుల
దొరలు ప్రశ్నల దాడి భోరుమన, నా నత్తి
పొరలి వాగిందిలా – మంకుతిమ్మ

మిణుకు (భాగం–1)లో వేల పద్యాలుగా వివరించినా, లోకుల ప్రశ్నలకు అంతు కనిపించలేదు. హనుమంతుడు లంకలో లాంగూలము పొడిగినట్లు — ప్రశ్నల శృంఖల నిరంతరం పెరుగుతూనే వచ్చింది. అప్పుడు ప్రశ్నలు ఇలా నిలిచాయి:

సద్వస్తువు ఒకటేనా? రెండుగా కనిపించే ఒకటేనా?
ద్వైత–అద్వైత–విశిష్టాద్వైత సిద్ధాంతాలలో వ్యత్యాసాలున్నవా?
ఉంటే అవి ఏమిటి?
సత్యదర్శనం ఎక్కడ, ఎప్పుడు కలుగుతుంది?
“నేను–నీవు–వారు” అనే భావంలో ఉండగా ఏకత్వం ఎట్లు సిద్ధిస్తుంది?
ఈశ్వరుడు ఎవరు? ఎక్కడున్నాడు?
ఒకే తత్త్వం పురుష–ప్రకృతి రూపాలలో విడిపోయి మరల సంధించడం ఎందుకు?
హృదయానుభవమే గొప్పదా? బుద్ధి వికాసమా?
ఉన్నతుడు శివుడా? విష్ణువా?
జీవితానికి ధ్యేయం ఉన్నదా? ఉంటే ఏమది?
సమాధి, యోగము, శాంతి, ముక్తి — ఇవి నిజంగా దేనిని సూచిస్తాయి?
జపం, ధ్యానం, తీర్థయాత్ర — ఎందుకు అవసరం?
చర్చ–తర్క–చింతనల ప్రయోజనం ఏమిటి?
నిరాకార పరబ్రహ్మకు సాకారరూపాన్ని ఎందుకు అంగీకరించాం?
సత్యానికే జయం అయితే కలహాలు కష్టాలు ఎందుకు?
లోకం ఎల్లప్పుడూ అస్థిరంగా బొబ్బలెత్తినట్లు ఎందుకు ఉంటున్నది?
ఈ విశ్వం నశ్వరమా? శాశ్వతమా?
మరణం జీవననాటకానికి చరమాంకమా? లేక విష్కంభమా?

ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు — తత్త్వదర్శనమే. అది మాటలతో కాదు; అనుభవంతోనే అవగాహనగా వికసించాలి. కాని ఆ అనుభవాన్ని ఎలా వ్యక్తపరచాలి? దానిని తెలియజేయాలనే ఆత్మతపన–జిజ్ఞాస–చాపల్యమే ఈ మిణుకు రెండవ భాగానికి మూలం.

పరబ్రహ్మము

10
బినద కథెయల్ల హృద్రసద నిర్ఝరియల్ల ।
మననానుసంధానకాదుదీ కగ్గ ।।
నెనెనెనెయుతొందొందు పద్యవనదొమ్మొమ్మె ।
అనుభవిసి చప్పరిసొ – మరుళ మునియ ।।

విన వన్నెకథ కాదు హృద్రసాపగ కాదు
మననానుసంధానమునకైన మిణుకు
తనివార నొక్కొక్క పద్యమును తలపోసు-
కొని చప్పరించరా – మంకుతిమ్మ

ఈ మిణుకు, వినోదకథకాదు. ఎదలో రసాలను పొంగించే కావ్యమూ కాదు. ఇదొక మననకావ్యం, ఆచరణకై రచించిన ఆనుభవిక దర్శనం. ఇదే ‘తత్త్వము’ అంటూ చెప్పితే సరిపోదు. దానిని గురించి వచ్చే ప్రశ్నలకు జవాబు మరియు సందేహాలకు పరిహారాన్ని ఆలోచించడమే మననం. ఆ మననమైన నిర్ణయానికి శాస్త్రవాక్యమే ప్రమాణం. అలా దృఢపడిన బుద్ధి అనుసంధానానికి తగినదై అనుష్ఠానానికి సిద్ధమవుతుంది. అందుకనే, ఒక్కొక్క పద్యాన్నీ చదివి, దాని అర్థాన్ని గ్రహించి, స్వారస్యాన్ని మదిలోనే చప్పరించి అనుష్ఠానానికి దగ్గరవ్వాలి.