మంకుతిమ్మని మరో మిణుకు – 3 (21-30)

3. మ్రొక్కు ఆ వొక్కటికి

21
ఒందిరువుదెందెందుమొందు తానే తాను ।
హిందెనిపుదిల్ల ముందెనిపుదిల్లెత్తల్ ॥
సందినలి బయలినలి బీడినలి కాడినలి ।
వందిసొ అదొందక్కె-మరుళ మునియ ॥

ఒక్కటున్నది నిరతమొక్కటే తానుగా
ఎక్కడను ముందు వెనుకలు తనకు లేవు
ఇక్కలో సందు సీమలయందు వనమందు
మ్రొక్కు దానొక్కటికి- మంకుతిమ్మ

సత్యమనగా ఎప్పుడూ ఉండేది. అదే నిత్యత్వం. తాను తప్ప మరొకటి లేనిది అదొక్కటే. అదే ఏకత్వం. ఆ ఏకత్వానికి ముందు, వెనుక, క్రింద, పైన ఏదియు లేదు. ఈ ఏకత్వము సర్వవ్యాప్తము. అందుగలడు–ఇందు లేడని అనే సందేహమే వలదు; ఎందెందు వెదకి చూచినా అందందే గలడు అన్న రీతిగా, ఇది లేని చోటు లేదు. సీమలో, అడవిలో, అన్నిటనూ గల రెండవది లేని దానికి మొక్కు. మ్రొక్కుతున్న నీవు కూడ దాని కన్న భిన్నమూ కాదు.

ఎల్లప్పుడూ ఉండేది అంటే కాలానికి అధీనం కాని తత్త్వం. కాలం దానిలోనే పుట్టుకొస్తుంది. ఆది అనేది లేకున్నా, ఎప్పుడూ ఉండే సత్యాన్ని “ఆదినుండి ఇదే ఉంటున్నది” అంటాము. (సదేవ సోమ్యేదమగ్రమాసీత్ ఏకమేవాద్వితీయమ్ – ఛాందోగ్యం). దానికి ముందు వెనుకలు లేవు. అనగా అది ఎప్పుడూ పుట్టదు, ఎప్పుడూ చనిపోదు; కనుక ముందు–తరువాత అనే భావాలకు అతీతమైనది. (న జాయతే మ్రియతే వా కదాచిత్ – కఠోపనిషత్).

దానికి కాల పరిచ్ఛేదమే కాదు, దేశ పరిచ్ఛేదమూ లేదు. సందులో, బయలులో, సీమలో, వనములలో అన్నియెడలా తాను ఉన్నది. అనగా అది దేశపరిచ్ఛేదం లేని సర్వవ్యాపకత్వం. అది లోపల ఉన్నది – బయట ఉన్నది. (అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః – మహానారాయణోపనిషత్). అది అన్నియెడలా, అన్నిటిలో గూఢంగా నిండియున్నది. (ఏక ఏవ సర్వభూతేషు గూఢః – శ్వేతాశ్వతరోపనిషత్). అన్నిటిలోనూ ఉన్నది అంటే అది స్థలాన్ని నింపలేదు; స్థలమే దానిలో పుట్టుకొన్నది. గదిలోని ఆకాశం, అడవియందున్న ఆకాశం, పర్వతాలపై ఉన్న ఆకాశం అని భేదం కనిపించినా ఆకాశం ఒక్కటే ఉన్నట్లుగా, ఈ ఒక్కటి నిత్యమై సర్వగతమైనది. (ఆకాశవత్ సర్వగతం నిత్యం – శంకరభాష్యం)

జీవుడిలో, జగత్తులో ఉండేది ఈ చైతన్యమే. మనం వెతుకుతున్న సద్వస్తువు మనకు బయట ఎక్కడో లేదు. మనలో మనం చూసే ప్రతి చోట అదే ఉన్నది. ఉన్నది ఒకటైతే ఎందుకు ద్విధముగా, త్రిధముగా కనిపించుచున్నది? బ్రహ్మము రెండా? పర–అపర అంటారు కదా? రెంటినీ ఓంకారంలా ఉపాసన చేయమన్నది ఉపనిషత్తు. అవిద్యాకృత విశేషములను తిరస్కరించు — “ఇది అణువు కాదు, స్థూలము కాదు, ఇది కాదు, అది కాదు” అని చెప్పబడేది పరబ్రహ్మము. ఉపాసనకు అనుకూలంగా నామ–రూప విశేషణాలతో చెప్పినది అపరబ్రహ్మము. ఇది శ్రుతిసమ్మతమే. “ద్విరూపం హి బ్రహ్మ అవగమ్యతే, నామరూపవికారభేదోపాది విశిష్టం…” (బృహదారణ్యకం). “యత్ర నాన్యత్ పశ్యతి, నాన్యత్ శృణోతి, నాన్యత్ విజానాతి…” (ఛాందోగ్యం). ఆ ఏకత్వంలో మరొకటి లేదు; చూడడానికి, వినడానికి, తెలుసుకోవడానికి అన్యముగా ఏదీ లేని స్థితియే పరబ్రహ్మయొక్క ఏకత్వము.

22
ఇరువుదొందెందెందుమెత్తెత్తలుం మరెయొళ్ ।
ఇరువుదదు హెరువుదదు హొరువుదెల్లవదు ॥
పిరిదు తానాగిరువ కిరిదెనిపుదెల్లవను ।
శరణు అవొందక్కె – మరుళ మునియ ॥

ఉన్నదొక టంతటన్ స్థిరముగా మరుగునం-
దన్నిటిని కని పెంచి ధరియించు తాను
అన్నిటిని సన్నజేయును తానె పెద్దదై
సన్నుతుల దొక్కటికి – మంకుతిమ్మ

సృష్టిలో ఎన్నో వైవిధ్యాలు, జీవరాశులు, వస్తువులు ఉన్నవి. నదీ-నదాలు, పర్వతాలు, భూమి చుట్టూ ఉన్న గ్రహాలు, తారకలు, సౌరవ్యూహాలు, కనరాని లోకాలు… ఇవన్నీ ఉండగా ఉన్నది ఒకటేనా! ఔను. ఉన్నది ఒక్కటే. అయినా ఎన్నో ఉన్నట్లు స్ఫురిస్తున్నది. ఉన్నదంతా పంచభూతాలే; వాటిలోనూ మూలమైనది ఆకాశం. ఆకాశానికి మూలం ఆత్మ. లోన బయట అన్నిటా వ్యాపించిన శక్తి ఆ ఒక్కటే. “సర్వం విష్ణుమయం” అన్నా, “ఈశావాస్యమిదం సర్వం” అన్నా అదే.

ఉన్నది ఒకటే అయినప్పుడు అది స్థిరంగా ఉంటుంది. దానికంటే మనం వేరు అనుకున్నప్పుడు, అది మనకు కనబడదు. కనబడే సకలమూ ఉన్నది దానిలోనే. వెయ్యి కుండలున్నా, ప్రతికుండలో ప్రత్యేకంగా ఒక్క ఘటాకాశం ఉన్నట్టు స్ఫురించినా, ఉన్నది ఒక్క ఆకాశమే. ఆకాశంకన్నా పెద్దది ఏదీ లేదు. అంటే, కనిపిస్తున్న సర్వమూ దానిలోనే ఉన్నదిగనుక, అన్నీ దానికంటే చిన్నవే. ఆ బ్రహ్మమే కుడి ఎడమలలో, ఉత్తర దక్షిణాలలో, పైన క్రింద వ్యాప్తమై ఉన్నది. (“బ్రహ్మైవేదమమృతం పురస్తాత్ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతశ్చోత్తరేణ । అధశ్చోర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠమ్” అంటుంది ముండకోపనిషత్తు.) ఉన్న ఆ ఒక్కటికి మ్రొక్కులిడు.

మనిషి ఇలా భావిస్తాడు: “నేను ఇక్కడ ఉన్నాను, బ్రహ్మము ఎక్కడో ఉంది.” అదే భ్రమ. బ్రహ్మము వస్తువుల్లా కనిపించదు; ఎందుకంటే అది చూడబడే వస్తువు కాదు — చూడటానికి కారణమైన చైతన్యం. దేనిచేత అన్నీ తెలుసుకుంటున్నామో, దానిని దేనిచేత తెలుసుకోవాలి? (“యేన సర్వమిదం విజానాతి, తం కేన విజానీయాత్?” — బృహదారణ్యకం). “కనబడే సకలమూ ఉన్నది దానిలోనే” అంటే ఉపాదాన కారణత్వం. గ్రహతారాదులు, లోకాలు, జీవులు, వారి శరీరాలు, మనస్సులు — ఇవన్నీ బ్రహ్మసత్తాలోనే కనిపిస్తున్న రూపాలు. దానికంటే పెద్దదేదీ లేదు అంటే ఇది పరిమాణాతీత తత్త్వము. ఇది భౌతిక పరిమాణం కాదు — అస్తిత్వ పరిమాణం.

దీనికంటే పెద్దది మరొకటి ఉండాలంటే, అది దీనికి బయట ఉండాలి! అన్నీ బ్రహ్మములోనే ఉండగా, దానికి బయట అనే భావమే లేదు. అంటే అది పరిమాణం లేనిది కాదు; పరిమాణ భావనకే అతీతమైనది. అన్నిటికి ఆధారమైన పెద్దది; ఆధేయమైనది చిన్నది. ఆకాశంలో పెద్ద మేఘమున్నా, ఆకాశం లేనిదే మేఘం ఉండదు. అలాగే ప్రపంచం ఎంత విశాలంగా ఉన్నట్లు కనిపించినా, తోచినా, బ్రహ్మసత్తాతో పోల్చితే అది ఆధేయమే కాని ఆధారం కాదు. ఎన్ని వైవిధ్యాలున్నా, ఉన్నదంతా ఒక్కటే. అది స్థిరం, నిత్యం, సర్వవ్యాపకం, దేశకాలాతీతం. దానిని మనకంటే వేరుగా భావించినంతవరకు అది కనబడదు. కనిపిస్తున్న సమస్తమూ నామరూపాలే. నామరూపాలకు ఆధారమైనది ఒక్కటే. ఈ సత్యానికి మ్రొక్కులిడు అంటే — దానిని గుర్తించి తెలుసుకో — అని ఈ పద్యంయొక్క మథితార్థం.

23
ఒబ్బంటి దైవవదు హబ్బదూటవనెళసి ।
ఇబ్బరాటక్కిళిదు హలవాగి మత్తె ॥
దిబ్బణవ నడసుతిహుదుబ్బిదీ లోకదలి ।
అద్భుతకె నమిసెలవొ-మరుళ మునియ ॥

ఒంటిగా దైవమది విందారగించంగ
జంటాటకై దిగి యనేకులై పిదప
వెంట నూరేగింపు సలుపు నీ జగమందు
అంటి దానికి మ్రొక్కు – మంకుతిమ్మ

ఒంటిగా ఉన్న దైవానికి పండుగ చేసుకోవాలనిపించిందట ! తనే మాయను సృష్టించెనట. ఆ మహామాయ సత్-అసత్ విలక్షణమైన అనాది భావరూపి. ఈశ్వరుడే ఆ మాయాసహిత బ్రహ్మ. ఒక్కడే అనేకులై ఈశ్వరసృష్టిలో పెద్ద వేడుకలు ఊరేగింపులు జరుగుతున్నట్లు జేసి ఆ బ్రహ్మ ఆనందిస్తున్నాడు. ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి, సత్. అది పరబ్రహ్మకాదు, బ్రహ్మజ్ఞానమైన పిదప దానికి ఉనికి లెదు కాబట్టి అది అసత్. ఈ మాయ నిజమనిపించేలా ఉన్నది. ఇది గగనకుసుమంలా, కుందేలు కొమ్ములా అసత్ కాదు గనుక, అనిర్వచనీయం. మాయ, బ్రహ్మకులేని తన త్రిగుణాలచే స్థూల-సూక్ష-నిబిడమైన ప్రకృతిని చేసింది. ఇవన్నిటి వెనకాలనున్న ఆ తత్త్వమునుకు మ్రొక్కు.

ఈ పద్యభావం వేదాంతంలోని లీలా–వివర్త సిద్ధాంతాన్ని సున్నితంగా సూచిస్తుంది. ఒంటిగా ఉన్న దైవానికి లోటులేమీ ఉండవు. అయిననూ అది మంచి పండుగ భోజనాన్ని అపేక్షించింది అనేది కవి దృష్టికి వచ్చిన ఉపమానం మాత్రమే. పరమార్థంగా దైవం ఎప్పుడూ ఏకమే, అఖండమే, స్వయంపూర్ణమే. అయినా తన అనంతత్వాన్ని అనుభవించడానికి, వ్యక్తపరచడానికి, మాయాశక్తి ద్వారా తానే తనకు ఎదురుగా నిలుస్తుంది. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి ఆనందించే మనిషిలా, బ్రహ్మ తన స్వరూపాన్నే జగత్తుగా దర్శిస్తుంది. అప్పుడు చూసేవాడు–చూసేది అంటూ రెండుగా కనిపించినా, వాస్తవానికి రెండూ ఒకటే. అన్నం వేరు – తినేవాడు వేరుకదా అంటే, ఉపనిషత్తు ఆ భేదాన్నే ఖండించి, అన్నమే అన్నాదుడై, అన్నం తింటున్నది అంటోంది (అన్నమన్నాదో భవతి)

ఈ లోకాల వైభవం, జీవరాశుల వైవిధ్యం, సుఖ–దుఃఖాల నాట్యం—ఇవన్నీ దైవానికి నిజమైన మార్పులు కావు; అది లీల. త్రిపాత్రాభినయంలో పాత్రలు వేరువేరుగా కనిపించినా నటుడు ఒక్కడే ఉన్నట్లు, జీవుడుగా, జగత్తుగా, ఈశ్వరుడుగా భాసించేది ఒక్క చైతన్యమే. అందుకే “జంటాటకై దిగి యనేకులై పిదప” అన్న మాట, ఈ లోతైన సత్యాన్ని సూచిస్తుంది. దైవం రెండై ఆడుతున్నట్టు కనిపించడం—నిజంగా రెండవవాడు పుట్టినాడని కాదు. తానే తనకు పాత్రలుగా కనిపించడంవలన. ఒకే నటుడు అనేక పాత్రలను ధరించి వేషాలు మారినా, నటుడు మారడు. అలా చైతన్యం తన అనంతత్వాన్ని నామ–రూపాలుగా అభివ్యక్తి చేస్తుంది. అదే లీలగా మనకు కనిపిస్తుంది. ఇది ఆభాసే కాని నిజమైన క్రీడ కాదు.

ఇక్కడ స్ఫురించే ద్వైతం నిజం కాదు, ఆభాస మాత్రమే. రెండై కనిపించేది విజ్ఞానానికి కాదు—అజ్ఞానానికి. ఆ అజ్ఞానం తొలగినప్పుడు, క్రీడ ముగిసినట్టు కాదు; క్రీడను చూసేవాడే లేనట్టు అవుతుంది. అప్పుడు తెలుస్తుంది—ఆడింది దైవము కాదు, ఆడినట్టు కనిపించింది మన దృష్టికే. ఉన్నది, ఉండేది, ఉండబోయేది ఒక్క చైతన్యమే. బహువుగా కావడం దైవానికి అవసరం కాదు; కానీ దైవస్వభావమే అలా వ్యక్తమయింది. ఇది కోరిక కాదు, లోటు కాదు. ఇది వ్యక్తీకరణ (అభివ్యక్తి). “ఏకోఽహం బహుస్యాం ప్రజాయేయ” (తైత్తిరీయం). స్వప్నంలో — నేనున్నాను, నీవు ఉన్నావు, ఇతరులు ఉన్నారు, సంఘటనలు జరుగుతాయి — అన్నీ నిజంగా అనిపిస్తాయి. కానీ మేల్కొన్నాక? అన్నీ ఒక్క చైతన్యంలోనే భాసమైనవని తెలుస్తుంది.

24
నూరు నూర్ గుడిగళలి నూరు నూర్ హెసరుగళ ।
నూరు నూరాకృతి విలాస విభవగళిం- ॥
దారాధనెయనావనంగీకరిపనొ అవ-।
నోరువంగీ నమన -మరుళ మునియ ॥

వందలుగ గుడులలో వందవందల పేర్ల
వందలాది కృతి విలాస విభవముతో
వంద్యుడై పూజలను గొనునొ తానొకనికీ
వందనమ్ములు చెల్లు – మంకుతిమ్మ

వందలాది గుడులలో వందలాది ఆకారములను, పేరులనూ ధరియించి, వెయ్యివిధాలుగా తన వైభవ లాస్య ప్రకృతి నృత్యాన్నంతయూ నడుపుచూ, సాకారముగా నిరాకారముగా వ్యక్తమగుచున్న మూలవిరాట్టుగా తానొకడు వాడెవడో ఆ ఒక్కనికి నమస్సులు.

దేవతలు అనేకులు. విష్ణువు వేరు. శివుడు వేరు. దేవి వేరు. వీరిలో ప్రతి దేవునికీ ప్రత్యేకమైన శక్తులు గలవు. అందువల్ల పూజల ఫలాలు కూడా వేర్వేరు. అందుచేత — “వంద్యుడై పూజలను గొనునొ తానొకనికీ” అనడం ఎట్లు చెల్లుతుంది? కోట్యనుకోటి దేవతలు అనే నామరూపభేదం ఉన్నా తత్త్వభేదం లేదు. దేవతల భేదం వ్యావహారికం. బ్రహ్మతత్త్వం పారమార్థికం. అందువల్ల — పూజను స్వీకరించేది ఒక్క బ్రహ్మతత్త్వమే.( సర్వభూతాల లోపల ఒక దేవుడే ఉన్నాడు – ఏకో దేవః సర్వభూతేషు గూఢః – కఠోపనిషత్తు; సర్వం ఈశ్వరమయం — ఈశావాస్యమిదం సర్వం). ఒక సూర్యుడు ఉన్నా, వంద నీళ్ళ గిన్నెలలో వంద ప్రతిబింబాలు కనిపిస్తాయి. సూర్యుడు వందమంది కాడు. అలాగే — ఒక చైతన్యం వంద శరీరాలలో వంద దేవతారూపాలలో ప్రతిబింబిస్తుంది. అందువల్ల దేవతలు అనేకులు అనిపిస్తారు. అలాగే జీవులందరి శరీరాలూ క్షేత్రాలు. అందులో ఉన్నవాడు ఒక్కడే. ఈ సత్యాన్ని తెలిసినవాడే క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడు ఒక్కడే (గీత). నామరూపాలన్నీ అజ్ఞానకల్పితమైన ఉపాధులు. సహస్రాది నామాల బ్రహ్మము నిర్నామకం.

ఏకమేవాద్వితీయం బ్రహ్మ! బ్రహ్మము ఒక్కటే, రెండవది లేదు అనేదే సత్యమైతే ఇన్ని దైవాలు ఎలా వచ్చాయి? పరమార్థంలో దైవం ఒకటే. అది రూప-లక్షణరహితమైన అనంతతత్త్వం. మానవ మనస్సుకు నిరాకారాన్ని గ్రహించడం కష్టం. నిర్గుణ, నిరాకార సత్యాన్ని సామాన్య మనుష్యుడు సులభంగా గ్రహించలేడు. అందుకే ఆ సత్యాన్ని రూపం, పేరు, లక్షణాలతో చూపించాల్సి వచ్చింది. సృష్టి–పాలన–లయ కార్యభేదం వల్ల, ఉన్నది ఒకే సత్యమైనా, ఆ సత్యం యొక్క మూడు కార్యాలకు త్రిమూర్తులు, వారి శక్తిరూపాలుగా ముగురమ్మలు రూపుదాల్చారు. మనిషి స్వభావభేదం కొద్ది ఒకే దైవం ఇష్టదేవతగా కల్పించబడుతుంది. ఐశ్వర్యానికి లక్ష్మి, జ్ఞానానికి సరస్వతి, శక్తికి గౌరి, వైరాగ్యానికి శివుడు — ఇలా మనస్సు తనకు అనుకూలంగా దైవాన్ని చూస్తుంది. మనలోని కర్మజ్ఞానేంద్రియాలకు దేవతలుగా, ప్రాణాపానాది పంచప్రాణములకు, ధనంజయ కృకరాది పంచ-ఉపప్రాణములకు దేవతలుగా నిలబడి, ఋతుకాలదేశములకు ఆధారమై వాటన్నిటిని నడిపించెది ఒకే తత్త్వమే.

మనుషులందరూ ఒకే స్థాయిలో ఉండరు. కొంతమందికి భక్తిమార్గం, కొందరికి కర్మమార్గం, కొద్ది మందికి జ్ఞానమార్గం అవసరమై, దైవం అనేక రూపాల్లో దర్శనమిస్తుంది. ఆరంభంలో: “నేను శివభక్తుడిని”, “నేను విష్ణుభక్తుడిని” అని అంటూ, పక్వస్థితిలో: “అన్నీ ఒకటే” అని తెలుసుకున్న పిదప, ఇక అంతిమజ్ఞానంలో: నేనే అది (అహం బ్రహ్మాస్మి) అని బోధపడుతుంది.

25
దేవనో ధర్మవో కాలవో కర్మవో ।
దేవియో తత్త్వవో స్వామియో విభువో ॥
పావనాత్మవో సాక్షియో పరబ్రహ్మవో ।
ఆవగం నతియవగె -మరుళ మునియ

దేవుడో ధర్మమో కాలమో కర్మమో
దేవియో తత్త్వమో స్వామియో విభుడో
పావనాత్ముడొ సాక్షియో పరబ్రహ్మమో
చేవిప్పు దానికిన్ – మంకుతిమ్మ

ఆ ఒక్క తత్త్వానికే అనేక నామాలు కలవు. దేవుడని, ధర్మమని, కాలమని, కర్మమని, దేవియని, తత్త్వమని, స్వామియని, విభుడని, పావనాత్ముడని, సాక్షియని, పరబ్రహ్మమని — ఏ నామముతో పిలిచినా ఉన్నది ఒక్కటే. మన ఇంద్రియములకు అగోచరమైన ఆ దివ్యతత్త్వమే దైవము. సర్వమును ధరించియున్నదిగనుక అది ధర్మము. సృష్టి–స్థితి–లయములు కాలాధీనముగా కనిపించినను, స్వయంగా కాలాతీతమగుటవలన అది కాలస్వరూపుడుగా, కాలాతీతుడుగా వర్ణింపబడుచున్నది. ప్రకృతిలో జరుగుచున్న క్రియలైనను, మనచే చేయబడుచున్న కర్మలైనను — ఏ కర్మ చేయబడునో అది మనలోని వాసనలచే ప్రేరితమై, సంచిత–ఆగామి–ప్రారబ్ధ కర్మల నియమముచే ప్రవహించుచున్నదని, ఆ కర్మఫలనిర్ణయవ్యవస్థయూ సమస్త కర్మలకూ ఆధారమూ అదేనని కొందరు ఆచార్యులు వాదింతురు. కాని — సర్వశక్తుడైన భగవంతుడు అకర్త, అభోక్త, అచలుడు; సృష్టి–స్థితి–లయములన్నియు వాని శక్తియొక్క వికాసములే తప్ప, వాడు కర్తకాడు, కర్మభోక్తకాడని ఉపనిషత్తులు స్పష్టముగా ప్రతిపాదించుచున్నవి. వాని శక్తియే సృష్టి–స్థితి–లయలుగా బ్రహ్మ–విష్ణు–రుద్రుల రూపములుగా వ్యక్తమగుచున్నదిగనుక, ఉన్నది ఒక్కటే — ఆ శక్తినే దేవియని “ముగురమ్మల మూలపుటమ్మ”ని కొందరు ఉపాసింతురు.

ఇవన్నియు వ్యావహారికదృష్టిలో సత్యములే. కాని దైవత్వమునకు నరాకృతిని ఆరోపించుట మన సగుణోపాసనకు ఉపకారమగుటకే తప్ప, పరమార్థతః దైవము నామరూపాతీతము, నిర్గుణము, నిరాకారము, అవ్యవహార్యము మరియు అద్వితీయము. అందువలన — దేవుడు వేరుగా లేడు, జీవుడు వేరుగా లేడు, జగత్తు వేరుగా లేదు. బ్రహ్మమొక్కటే సత్యము; జగత్తు మిథ్య; జీవుడు బ్రహ్మస్వరూపుడే. దానికి నమస్కరించు అని కవి ఉపదేశించుచున్నాడు.

ఆ శక్తి నిరాకారమైనది, స్త్రీ–పురుషభేదరహితమైనది; అదొక తత్త్వమే తప్ప వ్యక్తిగాదు అని కొందరనిన, కానిమ్ము — దానినే మేము మా స్వామి, మా విభుడు అంటున్నాము అనెదరు. ఇది అపూర్ణమైన జీవాత్మ, అది పూర్ణమైన పరమాత్మ అని కొందరనగా, ఇదేదీ కాదు; అన్నిటికీ సాక్షియే అది. అది నేనే. అవస్థాత్రయములకు సాక్షియైనదే ఆ పరబ్రహ్మ అని మరికొందరనగా, ఎలా పిలిచిననూ — సగుణరూపమైనా, నిర్గుణరూపమైనా — ఆ నామరూపరహితమైన ఒక్కటికి నమస్కరించు.

దేవుడు, ధర్మము, కాలము, కర్మము, దేవి, తత్త్వము, స్వామి, విభుడు, సాక్షి, పరబ్రహ్మము అను ఈ నానావాచక పదములు భిన్నభిన్నమైన అర్థములు గలవిగా లోకంలో ప్రసిద్ధములై యున్నప్పటికిని, వీటన్నిటి విషయమై తత్త్వవిచారణ చేయబడినచో, వేదాంతవాక్య ప్రమాణములచేత ఇవన్నియు ఏకతత్త్వవాచకములేనని నిర్ధారించబడును. దీనినే ఉపనిషత్తులు — “సర్వం ఖల్విదం బ్రహ్మ”, “ఏకమేవాద్వితీయము”, “నేహ నానాస్తి కించన” అని స్పష్టముగా ప్రకటించుచున్నవి. ఇక్కడ దేవుడు అను పదము సగుణబ్రహ్మమును సూచించుచున్నది. అనగా సృష్టి, స్థితి, లయములకు కారణమగు బ్రహ్మము మాయోపాధితో కూడి ఈశ్వరత్వమును పొందినదే దేవుడు అను వ్యవహారము. ’ధర్మము’ అను పదము బ్రహ్మమునకు స్వభావమైన ఋతరూపమును, జగన్నియమనశక్తిని సూచించుచున్నది. జగత్తులో క్రమము, నియమము, న్యాయము అనేవి బ్రహ్మతత్త్వప్రకాశములే.

కాలము అనగా స్వతంత్రమైన తత్త్వమొకటి కాదు. బ్రహ్మశక్తియే కాలరూపముగా ప్రకాశించుచున్నది. కాలములో మార్పులు కనిపించినప్పటికిని, ఆ మార్పులను తెలిసికొనుచున్న చైతన్యము కాలాతీతమగు బ్రహ్మమే. కర్మము అను పదము కూడ బ్రహ్మమునకు భిన్నమైనది కాదు. అవిద్యావశాత్ జీవభావమును పొందినచో కర్తృత్వ-భోక్తృత్వములు కలుగుచున్నవి. బ్రహ్మము స్వయంగా అకర్త, అభోక్తయే.

దేవి అనగా శక్తి. ఆ శక్తి బ్రహ్మమునకు భిన్నమైనది కాదు. అగ్నికి ఉష్ణత వేరు కాదనునట్లు, బ్రహ్మమునకు శక్తి వేరు కాదు.

తత్త్వము అను పదము పరమార్థసత్యమును సూచించుచున్నది. “తత్త్వమసి” అను మహావాక్యము చేత జీవుడే బ్రహ్మమని నిర్ధారింపబడుచున్నది. స్వామి అను పదము సర్వాధారభూతుడగు బ్రహ్మమునే సూచించుచున్నది. విభుడు అనగా సర్వవ్యాపకుడు. దేశ–కాల–వస్తు పరిచ్ఛేదములేని బ్రహ్మమే విభుడు. సాక్షి అంటే జాగ్రత్తు, స్వప్నము, సుషుప్తి అను మూడు అవస్థలలోని అనుభవములకు ద్రష్టయైన చైతన్యము. ఆ సాక్షి వేరెవరో కాదు — బ్రహ్మమే. పరబ్రహ్మము అనగా సర్వోపాధివినిర్ముక్తమైన, నిర్గుణమైన, నిర్విశేషమైన శుద్ధస్వరూపము.

అందువలన దేవుడు, ధర్మము, కాలము, కర్మము, దేవి, తత్త్వము, స్వామి, విభుడు, సాక్షి, పరబ్రహ్మము అను పదములలో తత్త్వభేదము లేదు. నామరూపభేదములే గాని సత్యభేదము లేదు. ఎలా బంగారం ఉంగరముగా, హారముగా, కడియముగా భిన్నరూపాలను పొందినప్పటికిని స్వర్ణత్వము ఏకముగానే యుండునో, అలాగే బ్రహ్మము నానానామరూపములలో ప్రకాశించినప్పటికిని బ్రహ్మత్వము ఏకమే. ఇక్కడ ఏ భేదమూ లేదు — “నేహ నానాస్తి కించన” (బృహదారణ్యకోపనిషత్)

26
దైవవొందే సత్త్వవదర నెరళె జగత్తు ।
ఆవగమదెల్లెడెయు గూఢమిరుతిహుదు ॥
నోవు సావుగళెల్లవిరువుదర దవలత్తు ।
నావదకె మణివమెలొ- మరుళ మునియ ॥

దైవమే సత్త్వమ్ము దాని నీడ జగత్తు
ఈవిశ్వమంతటన్ గూడముగ నుండు
చావు నొప్పు లివన్ని దానియొక దౌలత్తు
చేవిచ్చు దానికే – మంకుతిమ్మ

దైవమొక్కటే సత్త్వము. దాని నీడ ఈ జగత్తు. చైతన్య సత్త్వము ఎల్లప్పుడూ అన్నియెడల గుప్తంగా ఉంటుంది. జగతిలోని నొప్పులు, బాధలు, మరణము ఇవన్నీ ఆ సత్త్వముయొక్క దౌలత్తు. ఈ భువనము భగవంతుని మోహనాగారము, ఎప్పుడూ తరగని, అన్నిటా గూఢముగా వ్యాపించిన ఆ వింతను ప్రతిబింబించే అద్దమే ఈ జగత్తు. జగత్తు ఆ ఒక్క చైతన్యపు నీడ. నీడకు తనదైన అస్తిత్వములేదు. అదెప్పుడూ మూలపదార్థాన్ని వెంటబెట్టుకొనే ఉంటుంది. ఆ మూల చైతన్యమొక్కటే. ఆ ఒక్కటికి నమస్కరించు.

“దైవమొక్కటే సత్త్వము” అంటే, ఈ సృష్టిలో నిజంగా ఉన్నది ఒక్కటే తత్త్వం. అదే పరమసత్యం. బ్రహ్మమన్నా, చైతన్యమన్నా అదే. ఈ సమస్తమూ బ్రహ్మమే (సర్వం ఖల్విదం బ్రహ్మ). అది రెండవది లేని ఒక్కటే సత్యం (ఏకమేవ అద్వితీయం). దేవుడు వేరు, ప్రపంచం వేరు, మనం వేరు అన్న భావన ప్రాథమిక స్థాయిలో ఉపయోగపడుతుంది. కానీ లోతైన సత్యం ఏమిటంటే, అన్నిటి మూలంలో ఉన్నది ఒకే చైతన్యం. ప్రపంచం అనేది స్వతంత్రంగా ఉన్న సత్యం కాదు. అది చైతన్యంపై పడిన ప్రతిబింబం మాత్రమే. “దాని నీడయే ఈ జగత్తు” అనగా అదే. నీడకు స్వంతంగా ఉనికి లేదు. నీడ ఉండాలంటే ఒక వస్తువు, కాంతి ఉండాలి.

ఈ చైతన్యసత్త్వము అన్నియెడల ఉండి మనకు కనబడక ఎందుకు గూఢంగా ఉన్నది? మన కంటికి కనిపించేవి రంగు, ఆకారం. కానీ చైతన్యం రంగూ కాదు, ఆకారమూ కాదు, ఇంద్రియగ్రాహ్యమైన వస్తువు కాదు. ఇలా మాటలాడుటలోగల వాక్యాలను నడిపించేది ఏదో, అదే బ్రహ్మము (యేన వాగభ్యుదితం యేన వాగ్వ్యాప్యతి). మన కళ్ళతో అన్నీ చూస్తున్నాము. కానీ మన కళ్ళు మనకే కనిపించవు. అనుభూతిని అనుభవిస్తున్న చైతన్యం మనకు ప్రత్యక్షంగా వస్తువులా కనిపించదు. కానీ అది లేకపోతే ఏ అనుభవమూ ఉండదు.

జగత్తు ఆ దైవతత్త్వానికి నీడ ఎలా? పుట్టుక మన శరీరానికే, చావు కూడా దానికే. మన చిన్నతనంలో ఉన్న శరీరం వేరు, ఇప్పుడున్న శరీరం వేరు. అయినా “నేను” అనే భావం మారలేదు. మారుతున్నది శరీరమే కాని ఆత్మ కాదు. ఆత్మకు చావు-పుట్టుకలు లేవు (న జాయతే మ్రియతే వా కదాచిత్). నొప్పి, బాధలు వచ్చి పోతున్నాయి. అవి శరీరానికి మరియు మనస్సుకి. బాధను గమనిస్తున్నవాడు బాధపడడం లేదు. గమనిస్తున్న “నేను” మారడంలేదు గనుక అవన్నీ నీడలు. సినిమాలో యుద్ధం, హత్య, నిప్పు ఉన్నా స్క్రీన్ ఏమి కాదు. ఈ ప్రపంచం ఒక అద్భుతమైన మాయాప్రదర్శన అంటే తప్పు కాదు. కానీ దీనిని శాశ్వతమని భావించడం తప్పు. ఈ మాయలన్నీ ప్రకృతియని తెలుసుకోవాలి. మాయకు అధిపతి ఈశ్వరుడు (మాయాం తు ప్రకృతిం విద్యాన్ మాయినం తు మహేశ్వరం).

ప్రపంచం అనుభవానికి నిజమే కానీ పరమార్థానికి తాత్కాలికం. “వర్చువల్ రియాలిటీ” క్రీడలో లోపలంతా నిజమే అనిపిస్తుంది. కానీ శిరస్త్రాణం తీస్తే ఆ “గేమ్” అనేది లేదు. జగత్తు దైవానికి నీడ. అద్దంలో ప్రతిబింబంలాంటిదే కాని నిజం కాదు. జగత్తులో కనిపించేవన్నీ ఒకే చైతన్యానికి ప్రతిబింబాలు. చైతన్యం లేకుండా ప్రపంచం ఉండదు. కానీ ప్రపంచం లేకుండా చైతన్యం ఉండగలదు. సత్యం ఒకటే. అదే చైతన్యం. జగత్తు దాని ప్రతిబింబం. దానికి నమస్కరించు అంటే, నీవు ఆ చైతన్యమే. బయట మరియు నీ లోపల ఉన్న చైతన్యాన్ని గుర్తించి జీవించు అని భావం.

27
జగకెల్ల కారణం ప్రేరణం ధారణం ।
భగవంతనెంబొందదేనొ ఇహుదల్తె ॥
బగెవ నామదర సంబంధగళ గూఢమదు ।
ముగివ కైగళనదకె – మరుళ మునియ ॥

జగతికెది కారణము ప్రేరణము ధారణము
భగవంతుడని యొకటదేమొ యుండు గదా
అగుపడని దాని సంబంధముల కనుగొనుచు
మిగుల దానికి మ్రొక్కు – మంకుతిమ్మ

మనకు స్ఫురించే జగత్తు కార్యమైతే, దానికి కారణం భగవంతుడు. ఆభరణం కార్యమైతె దానికి కారణం బంగారమైనట్లు. జగతిలోని సర్వకార్యాలను ప్రేరేపించువాడూ, అన్నిటిని ధరియించియున్నవాడూ ఒక్కడే. నమ్మిననూ నమ్మకపోయిననూ, ప్రతియొక కార్యానికి ఒక్క కారణముండాలిగా. ఏ కారణమూ లేక జగతియందు పుట్టి, పెరిగి లయము చెందుటగాని, సౌరవ్యూహాది తారాపథ నియత సంచారములూ, ఋతువుల మార్పులూ, గురుత్వాకర్షణశక్తిభేదాలు, ఇవన్నీ వాటివెనుక ఒక్క నిర్మాత, నిర్వాహకుడు ఒక్కడూ/ఒక్కటీ లేక తమంతట తానుగా జరుగునా? లేదుకదా! ’భగవంతు’డని కొందరు పిలిచే అదేదో ఉన్నది కదా, కనబడని దానికి, కనిపించే వీటికి ఉండే సంబంధములను స్మరించుకొని ఆ ఒక్కదానికి మ్రొక్కు.

మన కళ్ళముందు విస్తరించిన ఈ విశ్వం ఒక అద్భుతమైన క్రమంలో నడుస్తున్నది. పగలు–రాత్రులు, ఋతువుల మార్పు, జననం–మరణం, గ్రహగతులు, ప్రకృతిలోని సమతుల్యత — ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నట్లుగా కనిపించవు. ప్రతిదీ ఒక నియమానికి లోబడి సాగుతున్నట్లు మన అనుభవమే చెబుతుంది. అప్పుడు సహజంగా మన మనస్సులో ఒక ప్రశ్న ఉదయిస్తుంది — ఈ జగత్తుకు మూలకారణం ఏమిటి? ఈ సమస్తం తనంతట తానే పుట్టిందా, లేక దీని వెనుక ఏదైనా ఒక కారణశక్తి ఉన్నదా?

లోకవ్యవహారంలో మనం అంగీకరించే ఒక మూలసూత్రం ఉంది — కారణం లేకుండా కార్యం జరగదు. ఒక ఇల్లు కనిపిస్తే కట్టినవాడు ఉన్నాడని ఒప్పుకుంటాం. ఒక పుస్తకం కనిపిస్తే రచయిత ఉన్నాడని నమ్ముతాం. ఒక యంత్రం పనిచేస్తే దానికి రూపకర్త ఉన్నాడని అంగీకరిస్తాం. అప్పుడు ఈ మహావిశ్వం అనే అపారమైన కార్యానికి కారణం ఉండదని అనుకోవడం తార్కికంగా సాధ్యంకాదు. కాబట్టి జగత్తుకు ఒక మూలకారణం తప్పక ఉండాలి. ఆ కారణమే శాస్త్రాలలో బ్రహ్మము అని చెప్పబడింది.

ఉపనిషత్తులు ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటిస్తున్నాయి — “యతో వా ఇమాని భూతాని జాయంతే, యేన జాతాని జీవంతి, యత్ ప్రయంత్యభిసంవిశంతి, తద్బ్రహ్మ”. అనగా దేని నుండి ఈ భూతాలన్నీ పుట్టాయో, దేనిలో నిలిచి జీవిస్తున్నాయో, దేనిలో లయమవుతాయో — అదే బ్రహ్మము. ఈ సమస్తమూ బ్రహ్మమే. అప్పుడు జగత్తు వేరే, కారణం వేరే కాదు. కారణమే జగత్తుగా కనిపిస్తున్నది. బ్రహ్మము మన కళ్ళకు కనిపించదు. కాని బ్రహ్మము లేకుండా జగత్తు ఉండలేడు. విద్యుత్ మన కళ్ళకు కనిపించదు. కాని బల్బు వెలిగినప్పుడు విద్యుత్ ఉందని తెలుసుకుంటాం. గాలి కనిపించదు. కాని ఆకులు కదిలినప్పుడు గాలి ఉందని గ్రహిస్తాం. అలాగే కనిపించే ఈ జగత్తు అనేది కనిపించని ఒక శక్తి యొక్క ప్రభావం. ప్రభావం ఉన్నచోట కారణం తప్పక ఉంటుంది.

ఇంకా లోతుగా పరిశీలిస్తే, బ్రహ్మము ఎక్కడో దూరంలో లేదు. మన అనుభవంలోనే ఉంది. మన శరీరం మారుతుంది. మన ఆలోచనలు మారుతాయి. మన భావాలు మారుతాయి. కాని ఈ మార్పులన్నింటినీ గమనిస్తున్న సాక్షి మాత్రం మారడం లేదు. ఆ సాక్షి చైతన్యమే బ్రహ్మము. అందువల్ల బ్రహ్మము బయట ఎక్కడో ఉన్నది కాదు; మనలోనే సాక్షిరూపంగా ఉన్నది. మనము నమ్మినా నమ్మకపోయినా సత్యం మారదు. మన నమ్మకం వల్ల సూర్యుడు ఉదయించడు; మన నమ్మకం లేకపోతే సూర్యుడు ఆగిపోడు. అలాగే బ్రహ్మతత్త్వం కూడా మన అభిప్రాయాలపై ఆధారపడలేదు. అది ఉన్నదే. ఎప్పుడూ ఉన్నదే.

అందువల్ల ఆ ఒక్క తత్త్వాన్ని స్మరించడం, దాని ఉనికిని గుర్తుచేసుకోవడం, దాని పట్ల వినయభావంతో జీవించడం — ఇదే నిజమైన మ్రొక్కుట. పుష్పాలతో అర్చించడమే పూజ కాదు. దీపం వెలిగించడమే భక్తి కాదు. “ఈ జగత్తు వెనుక ఒక సత్యం ఉంది, ఆ సత్యమే నాలోనూ ఉంది” అనే నిరంతర స్మృతి కలిగి జీవించడమే అసలైన ఉపాసన. ఇలా చూసినప్పుడు జగత్తుకు కారణము ఒకటే, జగత్తుకు ప్రేరణ ఒకటే, జగద్ధారణము ఒకటే. ఆ ఒక్కటినే ఎవరో భగవంతుడన్నారు, మరెవరో బ్రహ్మమన్నారు, తత్త్వమంటారు. పేరు ఏదైనా, సత్యం మాత్రం ఒక్కటే. కనిపించే ఈ విశ్వమంతా కనిపించని ఆ అనంత సత్యానికి ఒక మహావ్యక్తీకరణ మాత్రమే.

28
శ్రీమంతనార్ తన్న సిరివంతికెయ విభవ ।
సామర్థ్యగళ నోడి సంతసిసలెందీ ।
భూమ్యాదియిం జగద్దర్పణవ రచిసిహనొ ।
ఆ మహాత్మంగె నమొ – మరుళ మునియ ॥

శ్రీమంతుడెవడు తనదైన సంపద విభవ
సామర్థ్యముల చూసి సంతసిల్లంగా
భూమ్యాదులతొ జగద్దర్పణమునన్ జేసె
ఆమహాత్మునికి నతి – మంకుతిమ్మ

“ఎవరు తన సామర్థ్యశ్రీమంతములను చూసి సంతసిల్లాలని భూమినుండి మొదలుగొని ఈ జగద్దర్పణమును రచియించెనో ఆ మహాత్మునికి నమస్సులు”. – ఇది కేవలం కవితాత్మక ప్రశంస కాదు; ఇది సృష్టి తత్త్వాన్ని అత్యంత సూక్ష్మంగా సూచిస్తున్నది. మనం సాధారణంగా ఈ ప్రపంచాన్ని మనకు బయట ఉన్న ఒక వస్తువుగా, మనకు సంబంధం లేని స్వతంత్ర సత్తాగా భావిస్తాము. కానీ జగత్తు అనేది పరమాత్ముని సామర్థ్యానికి అద్దం. చిత్రకారుడు చిత్రాన్ని గీస్తే, అది అతని కల్పనాశక్తికి ప్రతిబింబం. కవి కావ్యం రచిస్తే అది అతని భావజాలానికి అద్దం. అలాగే ఈ అనంతబ్రహ్మాండం, కాల–దేశ–కారణ నియమాలతో నడిచే ఈ విశ్వవ్యవస్థ అంతా ఆ పరమాత్ముని అపార సామర్థ్యానికి ప్రతిబింబంగా నిలిచింది.

ఆ పరమాత్మునికి ఏ లోపమూ లేదు, ఏ అవసరమూ లేదు, ఏ కోరికా లేదు. ఉపనిషత్తులు ఆయనను ఆప్తకాముడిగా, అకాముడిగా వర్ణిస్తాయి. అయినప్పటికీ సృష్టి ఉంది. అప్పుడు ఈ సృష్టి ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఇదే — తన సామర్థ్యాన్ని తానే దర్శించుకొని ఆనందించుటకే. ఇది అహంకారంతో చేసిన ప్రదర్శన కాదు; సంపూర్ణతలో నుండే ప్రవహించిన లీల. ఈ లీలలో భూమి పుట్టింది, నదులు ప్రవహించాయి, పర్వతాలు నిలబడ్డాయి, చెట్లు పెరిగాయి, జీవులు ఉద్భవించారు, మనస్సులు వికసించాయి, బుద్ధులు ఆలోచించాయి. ఇవన్నీ కలసి ఒక మహా దర్పణంలా నిలిచాయి. దర్పణంలో కనిపించే ప్రతిబింబం ముఖానికి భిన్నమైనది కాదు; ముఖమే అద్దంలో కనిపిస్తుంది. అలాగే జగత్తు బ్రహ్మకు వేరుగా పుట్టినది కాదు; బ్రహ్మలోనే కనిపించే రూపం. పర్వతం బ్రహ్మమే, నది బ్రహ్మమే, శరీరం బ్రహ్మమే, మనస్సు బ్రహ్మమే. భేదం ఉన్నట్లు అనిపించేది మన దృష్టిలో మాత్రమే; తత్త్వంలో భేదం లేదు. అందుకే ఈ ప్రపంచం జగద్దర్పణం. ఈ వాక్యంలో “భూమినుండి మొదలుగొని” అని చెప్పడం కూడా లోతైన సూచన. భూమి అంటే కేవలం గ్రహం కాదు; స్థూల స్థాయి. స్థూలం నుంచి సూక్ష్మం వరకు, సూక్ష్మం నుంచి కారణం వరకు మూడు స్థాయిల్లోనూ ఆ పరమాత్ముని సామర్థ్యం వ్యక్తమవుతోంది. ఒక చిన్న గింజలో మహా వృక్షం దాగి ఉన్నట్లే, ఒక మనిషి మస్తిష్కంలో గణితం, సంగీతం, తత్త్వశాస్త్రాదులు దాగి ఉన్నట్లే, ఈ సమస్త జగత్తులో అపార చైతన్యశక్తి నిగూఢంగా ఉంది. ఈ జగద్దర్పణాన్ని రచించిన మహాత్ముడు ఎవరు? అదే బ్రహ్మ. “ఆ మహాత్మునికి నమస్సులు” అని చెప్పడం భయంతో చేసిన నమనం కాదు, లాభం కోసం చేసిన వందనం కాదు. అది ఆశ్చర్యంతో, కృతజ్ఞతతో, వినయంతో చేసిన నమస్కారం. ఇలాంటి జగద్దర్పణాన్ని రచించిన ఆ పరమాత్మునికి మన హృదయం వంగి నమస్కరిస్తోంది. ఈ జగత్తు యాదృచ్ఛికం కాదు. ఇది ప్రమాదవశాత్తు పుట్టలేదు. జగత్తు ఒక మహా చైతన్య సామర్థ్యానికి ప్రతిబింబం. ఆ చైతన్యమే బ్రహ్మ. ఆ బ్రహ్మమే నీవు, నేను. అందువల్ల నీ జీవితాన్ని కూడా ఒక దర్పణంగా మార్చుకో. నీ లోపలి సామర్థ్యాన్ని వెలుగులోకి తెచ్చుకో. అదే నిజమైన భగవత్ పూజ.

(గ్రంథకర్త డి.వి.జి. గారు గతించిన తరువాత ప్రకటితమైన గ్రంథమిది. విడివిడిగా ఉన్న కాగితపు ముక్కలపై ఆయనే రాసినవి కొన్ని, చెప్పి రాయించినవి మరికొన్ని — ఇలా ఛిన్నాభిన్నంగా లభించిన పద్యాలలో, గ్రంథపరిష్కరణకారులు పునరుక్తిభావం గల కొన్ని పద్యాలను అలాగే ఉంచారు. అలాంటి పద్యమే ఇది. నిజానికి ఇది నాలుగవ పద్యం తరువాత రావలసినది. కాని ఇక్కడ ప్రకటితమైన మూలగ్రంథాన్ని అనుసరిస్తున్న కారణంగా సంకలనం చేయబడలేదు)

29
జాగరూకతె సహనె సదసద్వివేకమీ ।
త్రైగుణ్య నీగువుదు బహు కష్టగళను ॥
ఆగదొడె దైవక్కె తలెబాగు శరణెందు ।
బాగు తలెయను నగుత – మరుళ మునియ ॥

జాగరూకత యోర్పు సదసద్వివేకమీ
త్రైగుణ్యములు నీఁగు బహు కష్టములను
ఆగకున్నను దైవమునకు తలవంచి శర-
ణాగతుడవై మ్రొక్కు- మంకుతిమ్మ

జాగ్రత్తగా ఉండటం, ఓర్పుతో సహించగలగటం, మంచి–చెడులను గుర్తించే వివేకం — ఈ మూడు గుణాలు మనలో ఉంటే జీవితం లోని ఎన్నో కష్టాలు తగ్గిపోతాయి. ఒకవేళ జాగ్రత్త, ఓర్పు, వివేకం మనలో తగ్గిపోతే, దేవుణ్ణి తలచుకొని శరణు పొందడమే మంచి మార్గం.

ఏ పని చేయకముందు అది సరైనదా కాదా అని క్షణమయినా ఆలోచిస్తే, ఆవేశంతో చేసే తప్పు నిర్ణయాల నుంచి తప్పించుకోగలం. అలా ఆలోచించే శక్తికి ఓర్పు చాలా అవసరం. నిజానికి జాగ్రత్త, ఓర్పు, వివేకం — ఈ మూడు వేర్వేరు గుణాలు కాకుండా ఒకదానితో ఒకటి కలసి ఉన్నవే. వివేకం లేకుండా జాగ్రత్త ఉండదు; ఓర్పు లేకుండా వివేకం పనిచేయదు. ఓర్పు ఉన్నవాడికే వివేకం నిజంగా ఉపయోగపడుతుంది. “సుఖమైనా దుఃఖమైనా ఒకటేలా చూడాలి, లాభం–నష్టం, జయం–పరాజయం అన్నిటినీ సమానంగా స్వీకరించాలి” అని గీత చెబుతుంది. అలా జీవించాలంటే మనకు తప్పనిసరిగా ఓర్పు, సహనం కావాలి. బలవంతంగా తెచ్చుకున్న ఓర్పుకన్నా, మంచి–చెడులను తెలుసుకున్న వివేకంతో వచ్చిన ఓర్పే నిజమైనది.

జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కోవడానికైనా, ఆధ్యాత్మికంగా ఎదగడానికైనా ఈ మూడు గుణాలు చాలా అవసరం. మొదట్లో ఇవి మనలో స్పష్టంగా కనిపించకపోవచ్చు. అయినా దేవునికి అర్పణ భావంతో పనులు చేస్తూ, ప్రతి పనినీ కర్మయోగంగా మార్చుకుంటూ, ఓర్పుతో సాధన చేస్తూ ఉండాలి.

30
ప్రకటరంగదొళారు నిజ బాలరను వివిధ ।
వికల పాత్రద నటనెయాడువుద నోడి ॥
సకల తానిరుత గూఢదలి నలియుత్తలిహ ।
వికటరసికంగె నమొ -మరుళ మునియ ॥

ప్రకటరంగమున నిజ బాలకుల వైవిధ్య
వికల పాత్రాభినయముల నెవడు జూచి
సకలమున తానుండి గూఢమున చెలగునా
వికటరసికునికి నతి – మంకుతిమ్మ

నామరూపాలతో కనిపించే వ్యక్తమైన జగత్తే “ప్రకటరంగము”. రంగస్థలంపై జీవరాశులు పశు, పక్షి, ప్రాణి, కీటకములుగా, గిరి, తరు, వన, నద్యాదులుగా తమ తమ పాత్రలను అభినయిస్తుంటే, “భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా” అనే గీతావాక్యంలా, ఆ ప్రతి పాత్రలోనూ, సకలములోనూ తానే గూఢముగా ఉన్నాడు. అన్నిటినీ చేయిస్తూ, వెనుక దాగి ఆనందిస్తున్నఆ వికట రసికుడు వాడు. వానికి నమస్సులు.

క్షరమైన, వ్యక్తమైన ప్రపంచ చలిత నాటకము, అవ్యక్త స్థితిలో అచలము—అక్షరము. సంసారము, జగత్తు అనేవి వ్యక్తముగా మరియు బీజభూతముగా అవ్యక్తముగా ఉన్నాయి. కనబడేవన్నీ నామరూపాలే. ఉండేది ‘అస్తి–భాతి–ప్రియ’మైన ఆ బ్రహ్మవస్తువొక్కటే. దానిని దర్శించడమంటే, దర్శించే ద్రష్ట అందులోని భాగమే కాని ప్రత్యేక అంశము కాదు. బ్రహ్మమంటే ఏమనే ప్రశ్న అందరినీ బాధిస్తుంది. వచనానికి చిక్కని, మనస్సుకు అప్రాప్తమైన ఆ విచారాన్ని భావించుకొనడానికి అనువైనది ఈ పద్యార్థ చింతన.

ఈ ప్రపంచమంతా ఒక రంగస్థలంలాంటిది. అందులో కనిపించే జీవుల వైవిధ్యం, వారి పాత్రల భేదం, వారి క్రియాకలాపాలన్నీ వాస్తవానికి పరమార్థసత్యం కావు; అవి అవిద్యావశాత్ కనిపించే నాటకరూపాలు మాత్రమే. “నిజ బాలకులు” అని చెప్పబడిన వారు స్వభావతః చైతన్యరూపులే అయినా, ఉపాధుల ప్రభావంతో వివిధ పాత్రలను ధరించి నటిస్తున్నట్లు కనిపిస్తారు. ఆ పాత్రాభినయాలన్నిటిని ప్రత్యక్షంగా చూస్తున్నట్టే కనిపిస్తూ, అదే సమయంలో సమస్తంలో అంతర్యామిగా, గూఢంగా, చలనరూపంగా నిలిచి ఉన్నది ఒక్కటే చైతన్యం — బ్రహ్మ.

ఈ నాటకాన్ని చూసి కదలకుండా ఉండలేని వాడు ఎవడో కాదు; నిజానికి చూసేవాడు, కదిలేవాడు, కదలింపజేసేవాడు అన్న భేదాలన్నీ మిథ్య. పరమార్థంగా ఉన్నది ఒక్కటే సాక్షిచైతన్యం. అది కర్త కాదు, భోక్త కాదు, అయినప్పటికీ కర్తృత్వ–భోక్తృత్వాలు దానిపై అధిరోహింపబడినట్టు కనిపిస్తాయి. ఈ జగత్తు, జీవులు, క్రియలు అన్నీ ఆ చైతన్యంపై ప్రతిబింబించిన రూపాలే.

కాబట్టి “వికట రసికుడు” అని చెప్పబడినది ఎవరో ఒక వ్యక్తి కాదు, దేవుడని ప్రత్యేకంగా వేరు చేసి ఊహించాల్సిన అవసరం లేదు. అదే నిరుపాధిక బ్రహ్మ, లీలగా కనిపించే ఈ మిథ్యా జగత్తును అనుభవిస్తున్నట్టుగా ఔపచారికంగా చెప్పబడింది. నిజానికి బ్రహ్మకు, ఆస్వాదన లేదు, మార్పు లేదు. అయినా అవిద్యాదృష్టిలో అది రసికుడిలా, నాటక దర్శకుడిలా భావించబడుతుంది. అందుచేత ఈ పద్యం చెప్పే అంతిమ సత్యం ఏమిటంటే — జగత్తు నాటకం, జీవుడు నటుడు అన్న భావన కూడా ఆఖరికి నాటకమే. పరమార్థంగా ఉన్నది ఒక్కటే, నిశ్చలమైన, నిర్వికారమైన, సాక్షిరూపమైన బ్రహ్మ. అదే నీవు. అదే నేను. అదే సమస్తం.