డి.వి.జి అని ఖ్యాతిగాంచిన దేవనహళ్ళి వేంకటరమణయ్య గుండప్పగారు (17-3-1887 – 7-10-1975) కన్నడ నవోదయ సాహిత్య ఆచార్య పురుషులలో అగ్రశ్రేణికి చెందిన ప్రతిభాశాలి. అరవై సంవత్సరాలకన్నా ఎక్కువ కాలం సాహిత్యము, పత్రికోద్యమము మరియు సార్వజనిక క్షేత్రాలలో ప్రతిఫలాకాంక్షలేక సేవజేసిన ఆధునిక ఋషి. ధర్మము, జీవన మౌల్యములు, పురుషార్థము — వీటియొక్క సమన్వయ భావాల ప్రతిబింబమే ఆయన జీవితము. అభిమానులు లక్షరూపాయల ధనాన్ని ఆయనకు సమర్పించాలని ప్రస్తావిస్తే వద్దన్నారు. డి.వి.జి గారు సర్.ఎం.విశ్వేశ్వరయ్య గారికి కార్యదర్శిగా సేవలను అందించారు. డి.వి.జి గారికి అప్పుడప్పుడు కొంత ధనాన్ని చెక్కుల్లో ఇచ్చేవారు. వచ్చిన చెక్కులన్నీ స్వీకరించారే గాని వాటిని బ్యాంకుల్లో వేయనేలేదు. ఆయన గతించిన తరువాత నగదుగా మార్చని ఆ చెక్కుల చరిత్ర బయటపడింది.
డి.వి.జి గారి సర్వతోముఖమైన సామర్థ్యం విస్మయకారకం. తెలుగు, సంస్కృతము, కన్నడము మరియు ఆంగ్లభాషలో పాండిత్యం పొందిన డి.వి.జి. రాజ్యశాస్త్రం మరియు అర్థశాస్త్రంలోనూ నిష్ణాతులు. వేదాధ్యయనం మరియు పాండిత్య విద్వత్ ఘన సంప్రదాయంలో మూర్తిగొన్న వారొక మహాచేతనం. వేద-వేదాంత-శాస్త్ర సంప్రదాయ అధ్యయన పూర్ణుడైననూ, అంధశ్రద్దలేక వ్యాసవాల్మీకి కాళిదాసాది మహాకవుల కృతులను జీర్ణించుకొన్నట్లే పాశ్చాత్య సాహిత్యాన్నీ ఆపోశనపట్టిన డి.వి.జి ఆధునిక అగస్త్యుడు. డి.వి. గుండప్ప గారి సాహిత్యలోకం అగాధమైనది. అందులో జీవనచరిత్రలు, కవితా సంపుటాలు, నాటకాలు, స్వతంత్ర విమర్శాత్మక కావ్యాలు, రాజకీయ క్షేత్రానికి, పత్రికోద్యమానికి చెందిన గ్రంథాలు – ఇవన్నీ ఒక ప్రక్కనైతే, జ్ఞాపకచిత్రశాల సంపుటాలలో చిత్రించబడిన సాహితీ–సజ్జనులు, వైద్యులు–ఉపాధ్యాయులు, సంప్రదాయస్తులు–హృదయసంపన్నులు మున్నగువారి స్మృతిచిత్రాల మనోజ్ఞ కథనాలు కన్నడ సాహిత్యంలో మరెక్కడా కనిపించవు. పురుషసూక్తము, ఈశోపనిషత్తు, శ్రీమద్భగవద్గీతా తాత్పర్యమను జీవనధర్మయోగము మొదలైన దార్శనిక కృతులకు సమకాలీన వ్యాఖ్యానాన్ని అందించినవారు డి.వి.జి. వారి భగవద్గీతోపన్యాసముల కృతిలోని చింతన, ఆచార్యుల భాష్యమంతే ప్రముఖమైనది. అందులో జీవితాన్ని బాగుజేసుకోవడమే ప్రధానమైనది. డి.వి.జి. గారి మహాకృతి “మంకుతిమ్మన కగ్గ ” కన్నడిగులకు పారాయణ గ్రంథమైన భగవద్గీతలాంటిది. తెలుగులో దీనిని “మంకుతిమ్మని మిణుకు” అంటున్నాను. మంకుతిమ్మని మిణుకులో స్వోపజ్ఞమైన దార్శనిక తత్వాంశాలను పద్యశిల్పంలో చెక్కి చూపించారు. “తత్త్వాన్ని తానే మననం చేసుకోడానికి అప్పుడప్పుడు విడివిడిగా పద్యాలను రాసుకున్నాను” అని ఆయన చెప్పినా, ఇప్పటికీ ఈ మననకావ్యం జీవనధర్మానికి, వేదాంత మర్మానికి సమకాలీన వ్యాఖ్యానంగా పండిత–పామరులను ఆకట్టుకుంటుంది. మంకుతిమ్మన కగ్గ , ’మంకుతిమ్మని మిణుకు’ గా తెలుగు పద్యములు మరియు తాత్పర్యంతో 2021లొ కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కువెంపు భాషాభారతి ప్రాధికారం ప్రకటించింది. దానికి రెండవ భాగమైన ’మంకుతిమ్మని మిణుకు–2’ ఇప్పుడు ’ఈమాట’ లో ధారావాహికంగా ప్రకటింపబడుతున్నది.
మంకుతిమ్మని మిణుకు–2 లో డి.వి. గుండప్పగారు జీవితాన్ని సూటిగా, లోతైన తాత్త్వికతతో ప్రతిపాదించారు. సామాన్య ప్రజలు కూడా గ్రహించేలా ఉపమానాలు, సందర్భాలను ఉపయోగించడం దీని ప్రత్యేకత. ప్రతి పద్యం చిన్నదిగా కనిపించినా, దాని అంతర్భావం ఎంతో విశాలమైనది. ధర్మం, నైతికత, మానవ సంబంధాలు, కర్తవ్యబోధ, అధ్యాత్మం, శాస్త్రదృష్టి, లోకదృష్టి లాంటి అంశాలను గింజలో చెట్టును నిలిపినట్టు సంక్షిప్తంగా విస్తారార్థంతో వ్యక్తంచేశారు. జీవితంలోని పరిపక్వదశలో రచించబడిన ఈ కృతిలోని పద్యాలు సూచనాత్మకత కంటే ఉపదేశాత్మకత వైపు ఎక్కువగా మొగ్గుతాయి. అయినప్పటికీ, మిణుకు–2 కాలాతీత విలువలతో, లోతైన పరిశీలనతో మానవజీవితానికి దర్పణం పట్టే రచన. ఇది పాఠకుడిని ప్రశ్నిస్తుంది, ఆలోచింపజేస్తుంది, ఎన్నడో ఒకప్పుడు జీవనపాఠాల వద్దకు తిరిగి తీసుకువస్తుంది.
ఇందులోని పద్యాల ఛందస్సు మాత్రాగణయుక్తమైన చౌపది. నాలుగు పంక్తులలోనూ ద్వితీయాక్షర ప్రాస ఉంది. ప్రతి పంక్తిలో నాలుగు గణములు ఉంటాయి. ప్రథమ–తృతీయ పంక్తులలో నాలుగు పంచమాత్రా గణములు; ద్వితీయ పాదంలో మూడు పంచమాత్రా గణములు మరియు ఒక చతుర్మాత్రా గణము ఉంటాయి. చతుర్థ పాదంలో మూడు పంచమాత్రా గణములు మరియు రెండుమాత్రలు ఉంటాయి. ఆటవెలదిలా అంశగణము, యతి విధానమో చౌపదికి ఉండదు. 2వ & 4వ పంక్తుల నాల్గవ గణాల కొలత నాలుగు మరియు రెండుమాత్రలైనప్పటికీ, కర్షణ వల్ల అవి ఐదుమాత్రల కాలప్రమాణానికి సరిపోతాయి. మాత్రానిబద్ధ సీసపద్యంలోని రెండు పంక్తులనో, ఆటవెలదినో పాడినట్లే చౌపది వినిపిస్తుంది.
పూజ్యులైన డి.వి.గుండప్పగారి ఈ గ్రంథము ’మంకుతిమ్మని మిణుకు’ అనే ఆంధ్రానువాదానికి మూలమైన ’మంకుతిమ్మన కగ్గ’కు రెండవభాగము. ఈ రెండవ భాగం ప్రకటమైనది 1984లో, డి.వి.జి గారు గతించిన తొమ్మిది సంవత్సరాల తరువాత. మొదటి భాగములోని విషయ క్రమము మరియు గ్రంథపు ముక్తాయ భాగ సూచన ఇక్కడ కనబడవు. ఎప్పడు ఆయన రచన నిలిచిపోయినదో అక్కడికే సమాప్తి అనుకోవాలి. స్వతః తాను వ్రాసుకున్నదాన్నే చదవలేనట్టి అనారోగ్యంతో ఉన్నప్పుడు పుట్టిన కృతి ఇది. చెప్పి వ్రాయించిన, ఆ వ్రాతలొ, ఒకటి రెండు అక్షరాలు హెచ్చు తక్కువై ఛందోదోషములు ఎన్నో వచ్చి పడ్డాయి. కొన్ని పద్యాలకు నాల్గవ పంక్తి ఖాళిగా ఉండేది. వీటిని డి.వి.జి.గారి పుత్రుడైన డా.బి.జి.ఎల్ స్వామి పరిష్కరించడానికై పూనుకొని కొంత శ్రమించారు. అయితె ఆయన అకాల మృత్యువుకి ఆహుతి కావడంతో ఆ పని అక్కడికే ఆగిపోయిది. తుదకు ఈ గ్రంథాన్ని ప్రకటించాలనే ఉద్దేశంతో డి.వి.జి.గారికి ఆప్తులైన విద్వాన్ ఎన్. రంగనాథ శర్మగారిని కోరడం జరిగింది. ఆయన పరిశ్రమంతొ ఈ రెండవభాగానికి ఒక్క రూపమేర్పడింది. ఐననూ నాల్గవ కీలక పంక్తిలేని కొన్ని పద్యాలను ఎలా పూరించేది అన్న సమస్య ఎదురై రంగనాథ శర్మగారు తమకు తోచినంతగా పూరించి, వారు స్వతః పూరించిన పద్య ఖండాన్ని కంసంలో (బ్రాకెట్స్) సూచించి వాటిని పరిశిష్టంగా పొందుపరిచారు.
ప్రస్తుత కాలానికి ఈ గ్రంథభాష, ఇది ప్రతిపాదించే తత్త్వంలా కొంచెం క్లిష్టంగానే అనిపిస్తుంది. ప్రతి పద్యంలోని నాలుగు పంక్తులలో డి.వి.జి. అమర్చిన విషయం గంభీరమైనది. వాడిన సంస్కృతము మరియు ప్రాచీన కన్నడ పదములు ప్రౌఢమైనవి. కన్నಡ–తెలుగు భాషల సామరస్యాన్ని ఆధారంగా తీసుకొని సాధ్యమైనంతవరకు పద్యాలను యథాతథంగా అనువదించే ప్రయత్నం చేయబడింది.