Comment navigation


15815

« 1 ... 1531 1532 1533 1534 1535 ... 1582 »

  1. పద్యాలు – వాడుకభాష గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    01/31/2007 8:24 am

    భాషకి అనువుగా ఛందస్సు మారాలని మొదట గుర్తించింది గురజాడ. అతని అడుగుజాడలో నడిచిన వాడు శ్రీ శ్రీ (ఆ విషయంలో). గురజాడ, శ్రీ శ్రీ సాంప్రదాయిక ఛందస్సులలో రాసిన పద్యాలలో భాషనీ, మాత్రా ఛందస్సుల్లో రాసిన పద్యాలలోని భాషనీ గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. అప్పటికున్న కవితత్వం ప్రథానంగా పద్యరూపం కావడం మూలానా, పద్యాలకి వ్యవహార భాష తగదని తెలుసున్న కారణానా, ఆనాటి వ్యావహారిక భాషా వాదులు వచన సాహిత్యం గురించే పోరాడారుగాని పద్యాలజోలికి, కవిత్వం జోలికీ పెద్దగా పోలేదు. గురజాడ ఒకడుగు ముందుకు వేసి కవిత్వంలో కూడా వ్యవహార భాష తెచ్చే ఉద్దేశంతోనే మాత్రా ఛందస్సులని స్వీకరించాడు. ఐతే మాత్రా/దేశి ఛందస్సులలో కథా కావ్యాలని సృష్టించగలమా, సృష్టించినా అవి ఎంత వరకూ జన రంజకం అవుతాయీ అన్నది పరిశీలించాల్సిన విషయం. పాల్కురికి సోమనాథుని ద్విపద కావ్యాలుకాని, రంగనాథ రామాయణం కానీ అంతగా ప్రసిద్ధి చెందకపోవడానికి కారణం కేవలం రాజకీయమనో, పండితుల నిరాదరణ అనో కొట్టి పారేశాం కానీ, వాటిని ఒక పోతన భాగవతం తోనో, మొల్ల రామాయణంతోనో పోల్చి వాటి అనాదరణకి కారణాలు వెతికే ప్రయత్నం జరగలేదు.

    భాషా శాస్త్ర పారిభాషిక పదాలపై నాకు పెద్ద అధికారం లేదు కాని, agglutination, inflection, vowel harmony మొదలైన లక్షణాలన్నీ కలిసి తెలుగు భాషకి ఆ ప్రవాహగుణాన్ని స్తున్నాయి, బహుశా.

    “జ”కి “శో” కి హల్ మైత్రి కుదిరినా అచ్చుల మైత్రి కుదరదు (“అ”కి “ఒ”కి). కాబట్టి ఆ రెండక్షరాల మధ్య యతి సాధ్యం కాదు. అలాగే “వ”కి “వి”కి కూడా కుదరదు. కొంత అరుదైనా నన్నయ్య “ప”కి “వ”కి, “బ”కి “వ”కి యతి వేసాడు. ఉదా:
    “నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృత
    వ్రత యొక బావి మేలు మఱి బావులు నూరిటికంటె నొక్క స
    త్క్రతువది మేలు…”

    “ప్రల్లదుడైన యొక్క కులపాంసను జేసిన దాన దత్కులం
    బెల్లను దూషితంబగుట యేమి యపూర్వము గావునన్ మహీ
    వల్లభ! తక్షకాధము నెపంబున సర్పము లెల్ల నగ్నిలో
    …”

  2. పద్యాలు – వాడుకభాష గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    01/31/2007 7:00 am

    Morphological typology లో నేను అర్థం చేసుకున్నది తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకే పదంలో ఎన్నో శబ్దాలు (morphemes) ప్రత్యయాల (affix) సాయంతో అల్లుకుపోయి ఉండే భాషలను agglutinative భాషలనీ, ఒక పదంలో దాదాపుగా ఒక శబ్దం మాత్రమే కనిపించే భాషలని isolating భాషలని చెప్పవచ్చు. ఈ రెంటికి మధ్యస్థంగా ఒక పదంలో శబ్దాలు (సంధి) సూత్ర నియతంగా, శబ్దాలు తమ స్వ-రూపం మార్చుకొనే విధంగా సంలీనం చెందే భాషలను fusional/inflectional భాషలని స్థూలంగా చెప్పవచ్చు. తెలుగు, తమిళాదులు agglutinative భాషలనీ, సంస్కృత-లాటిన్ భాషలు fusional భాషలనీ, చైనీస్, ఇంగ్లీష్ భాషలు isolating భాషలనీ చెప్పుకోవచ్చు. “ఇంటిపైనుండి” అన్న తెలుగు పదాన్ని ఇంగ్లీషులో “over the top of the house” అన్న ఆరు విడి విడి పదాలుగా రాయాలి. అనుష్టుప్ ఛందస్సు, విరామయతి, పాదాంత విరామం fusional భాష అయిన సంస్కృతానికి ఒప్పినట్టుగా agglutinative భాష అయిన తెలుగుకు ఒప్పదనే నన్నయాదులు వృత్త ఛందస్సును విరామ నియమాలు లేకుండా అక్షరమైత్రితో స్వీకరించారని కామేశ్వర రావు గారు చెబుతున్నారని నా interpretation!

  3. పద్యాలు – వాడుకభాష గురించి chavakiran గారి అభిప్రాయం:

    01/30/2007 10:22 pm

    agglutinative మరియు isolating అంటే ఏమిటో ఎవరన్నా చెపుతారా?

    కొన్ని ఉదాహరణలతో

  4. పద్యాలు – వాడుకభాష గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    01/30/2007 4:10 pm

    కామేశ్వరరావుగారు,

    “-‌న్”, “-ల్” వంటి ప్రత్యయాలు మొదలైనవి లేకుండా నేటి కాలపు భాషలో పద్యాలు రాయాలంటే ఛందస్సు (వృత్తాలు) మారాలి అన్న విశ్వనాథ అభిప్రాయం సబబే అని తోస్తోంది. ఒక విధంగా చూస్తే, ఆధునిక భాషలో అద్భుతమైన శబ్దసౌందర్యాన్ని, ప్రవాహగుణాన్ని ప్రదర్శిస్తూ దేశీ ఛందస్సులతో (మాత్రా ఛందస్సులతో) కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ ఇత్యాదులు సృష్టించిన కవితలే మారిన ఛందస్సుకు ఉదాహరణలని నాకనిపిస్తోంది. ఈ ఆధునిక కవులు వాడిన భాష నిజంగా వాడుక భాషేనా అని కొంతమంది వేసే ప్రశ్నకు సమాధానం మీరు చర్చించకుండా వదిలేసిన “కవిత్వ భాష”. కొన్ని పదాలూ, లక్షణాలూ ఎప్పటికీ వ్యవహారంలోకి రానివీ, వ్యవహార దూరమైనవీ కవిత్వ భాషలోనే ఉంటాయి. “పరిమళపు తుఫానుల్ని రేపి, మహారణ్యాల సౌందర్యాన్ని చూపి, మౌనంగా ఉన్న ద్వీపాల్ని ఊపి” అన్న మాటలు కవిత్వంలోనే తప్ప మనం సాధారణంగా మాట్లాడే వాక్యాల్లో వినిపించవు కదా!

    ఇంకో విషయం. “తెలుగు పద్యాలకి ఉండే మరొక ప్రత్యేకమైన లక్షణం ప్రవాహ గుణం, లేక ధార … ఈ నాదం తెలుగు భాష సొత్తు.” అని అన్నారు. ఇక్కడ మీరు తెలుగు భాష agglutinative స్వభావాన్ని వివరిస్తున్నారని నా సొంత అభిప్రాయం ! అయితే, ప్రపంచీకరణ వల్ల, అన్యభాషాప్రభావాల వల్ల తెలుగు agglutinative స్వభావాన్ని కోల్పోయి ఇంగ్లీష్ భాష లాగే isolating భాషగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. “ఈ వారము సమైక్య కృషి” అన్న తెలుగు వికీపీడియా లేబుల్ ఇందుకు ఒక ఉదాహరణ 🙂

    కృతజ్ఞతలతో,
    సురేశ్.

    – “శోకింపంగన్” అన్నప్పుడు యతిభంగం కాలేదు. నన్నయ్య “జ”-కారానికి “శ”-కార యతి వాడిన సందర్భాలు ఆది పర్వంలోనే కనిపిస్తాయి.
    – నన్నయ్య “వ”-కారానికి “ప”-కార యతి వాడాడో లేదో నాకు తెలియదు. “వారిజ కాంతల్” కు బదులుగా “వికచ కుసుమముల్” వాడొచ్చని అది పోస్టు చేసిన కాసేపట్లోనే అనుకున్నాను.

  5. పద్యాలు – వాడుకభాష గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    01/30/2007 11:27 am

    నిజమే, గ్రాంధిక భాషకీ వాడుకభాషకీ మధ్యనున్న భేదాన్ని వివరించడం శ్రమతో కూడుకున్న పనే. అసలు గ్రాంధిక భాషనీ, వ్యావహారిక భాషనీ సరిగ్గా నిర్వచించాలంటేనే అనేక సమస్యలున్నాయి. వాడుక భాషకి ఒక కాలపరిమితిలోనే లక్షణాలు చెప్పుకోగలం, అది నిత్యం మారుతూ ఉంటుంది కాబట్టి. గ్రాంధిక భాష అంటే, గ్రంథస్థమైన భాష అన్న నిర్వచనం చెప్పుకుంటే, అదీ కాలంతోపాటు మారుతూ ఉంటుంది. గాంధిక వ్యావహారిక భాషా వాదాలు నడచిన కాలంలో, గ్రాంధిక భాషంటే ప్రాచీన కావ్యాల ఆధారంగా రూపొందించిన కొన్ని వ్యాకరణాలకి బద్ధమైన భాష అనీ, వ్యావహారిక భాష అంటే ఆ వ్యాకరణాలకి బద్ధం కానిదనీ నిర్వచించుకున్నారు. ఐతే అటువంటి వ్యాకరణాలకి విరుద్ధమైన ప్రయోగాలు కావ్యాలలో ఉండడం అటు గ్రాంధిక భాషా వాదులు, ఇటు వ్యావహారిక భాషా వాదులూ కూడా గుర్తించారు. ఐతే గ్రాంధిక భాషంటే కేవలం సంస్కృత పదభూయిష్టమైన రచనే కాదన్నది నిర్వివాదం. శివుడిని “అరపదిమోముల దయ్య”మనడం వ్యవహార దూరమే కదా, అంచేత అది గ్రాంధిక భాషే అవుతుంది. ఒక రకంగా ఆలోచిస్తే వాడుకభాష ఎప్పుడైనా గ్రాంధిక భాష కావచ్చు. కానీ గ్రాంధిక భాషలో కొన్ని పదాలూ, లక్షణాలూ ఎప్పటికీ వ్యవహారంలోకి రానివీ, వ్యవహార దూరమైనవీ ఉంటాయి.

    గ్రాంధికభాష అంటే గ్రంథస్థమైన భాష అని చెప్పుకుంటే, అది వ్రాసే భాష అవుతుంది. అప్పుడు వాడుకభాషంటే మాట్లాడుకునే భాష అని నిర్వచించుకోవాలి. ఐతే ప్రాచీన కాలంలోని కావ్యేతరమైన లిఖిత సాహిత్యాన్ని పరిశీలిస్తే, అది కావ్య భాషకి భిన్నంగా కనిపిస్తుంది.

    ఈ రకంగా గ్రాంధిక, వ్యవహార భాషల నిర్వచనాలగురించే చాలా చర్చ చెయ్యవచ్చు. భాషా శాస్త్ర అభిమాన్లు గ్రాంధిక, వ్యవహార భాషల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పులని పరిశీలించ వచ్చు.

    ఇవన్నీ నా వ్యాసానికి ముఖ్యం కాదని నేననుకోవడం వల్ల ఈ విషయాల్లోకి వెళ్ళలేదు. నేను ప్రథానంగా చర్చించాలనుకున్నది – ఈ కాలంలో పద్య కవిత్వం రాయాలంటే, ఇప్పటి వాడుకభాషను ఎంతమేరకు ఉపయోగించ వీలవుతుంది? ప్రాచీన కావ్య భాష అనువైనంతగా నేటి వాడుక భాష పద్యాలకి తగుతుందా? దీనికోసమే వాడుక భాష అంటే గత వంద సంవత్సరాలుగా వాడుకలో ఉన్న భాష అని అన్నాను. గ్రాంధిక భాషకి తాత్కాలిక నిర్వచనం (ఇది చేరాగారి దగ్గరనుండి నేనరువుతీసుకున్న పదం) మాత్రమే ఇచ్చి, ఆ భాషలో కనిపించే లక్షణాలని ప్రస్తావించాను. ప్రాచీన కావ్య భాష కూడా నన్నయ్య నుండి, విశ్వనాథ వరకూ మార్పులు పొందుతూ వచ్చినా కొన్ని ప్రధానమైన లక్షణాలను మాత్రం కోల్పోలేదు. వాటినే నా వ్యాసంలో ఉపయోగించుకున్నాను. అధికమైన పద సంపద, “-‌న్”, “-ల్” వంటి ప్రత్యయాలు మొదలైనవి. అలాగే వాడుక భాషలోని ప్రధానమైన లక్షణాలని ప్రస్తావించాను – నామవాచకాలలోని “ము” సున్నాగా మారడం, విసంధి మొదలైనవి.

    ఆధునిక పద్య కవిత్వాన్ని పరిశీలించి, వాడుక భాష పద్య కావిత్వంలో ఎలాంటి మార్పులు చెందుతుంది అన్న విషయమ్మీద ఇంకా పరిశోధన చెయ్యవచ్చు.

    “నేనొక పూలమొక్క….” పద్యం మనసుకి హత్తుకోవడం వెనుక వాడుకభాష సహాయం తగినంత ఉందని తెలుస్తుంది – “చివాలున” కొమ్మ వంచడం, “జాలిగ నోళ్ళు”విప్పడం, “బావురు”మనడం వంటి పదాలని గమనిస్తే.

    సురేశ్ గారూ, “అడవికి బువ్వులు దేరగ వడి నరిగిన కచుని జంపి…” అన్న నన్నయ్య గారి పద్యాన్ని బాగానే పట్టుకున్నారండీ!

    వారిజములంటే తామరపువ్వులుకాబట్టి ఆ పదం సరిపోదు. “ప్రసవమ్ములొగిన్” అంటే సరిపోతుంది:-)

    అలాగే చివరి పాదంలో యతిభగం జరిగింది, “జాలింబడగన్” అని మార్చుకోవచ్చు.

  6. పద్యాలు – వాడుకభాష గురించి Raja Sankar Kasinadhuni గారి అభిప్రాయం:

    01/29/2007 3:05 pm

    కామేశ్వరరావుగారి వ్యాసం చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే, గ్రాంథికానికి వాడుక భాషకి తేడా చెప్పడం ఒక పరిథి దాటిన తరువాత చాలా కష్టం అని నాకనిపిస్తుంది.
    ఉదాహరణకు ఒక పద్యంలో “అరపది మోముల దయ్యము” (ఐదు ముఖముల దైవము, అనగా శివుడు) అని అచ్చ తెలుగులోని మాటలతో ఈశ్వరుడిని వర్ణిస్తాడు కవీశ్వరుడు. ఈ పద్యం ఏ కోవలోకి వస్తుంది?
    సంస్కృత పద భూయిష్టమైన రచనలే గ్రాంథికమని రచయత అభిప్రాయామా?
    ఏది ఏమైనా రచయత విషయాన్ని చెప్పిన శైలి చాలా బాగుంది. కామేశ్వరరావుగారి కలంనుంచి మరిన్ని మంచి వ్యాసాలు రావాలని కోరుతున్నాను.

    కొలిచాలగారి క్రింది అభిప్రాయంలో ఎదో self-contradiction కనిపిస్తోంది:
    “పండితుల పట్టుదల వల్ల, లాక్షణీకుల వ్యాకరణ సూత్రాల వల్ల గ్రాంథిక భాష కొంత జడత్వం చూపినా, “ప్రాఁతవడ్డ మాటలను” పరిహరించడంలో, కొత్త మాటలను, ప్రయోగాలను ఉపయోగించడంలో నన్నయ్య, తిక్కనల నుండి విశ్వనాథ వరకూ, మహాకవులెవ్వరూ సందేహించలేదని నాకనిపిస్తుంది.”

    1. పూర్వ కవుల ప్రయోగంబులు గ్రాహ్యంబులని కదా వ్యాకరణ సూత్రం? మరి పై ఆక్షేపణ (వ్యాకరణం వలన భాషలో జడత్వం) ఎంత వఱకు సమంజసం?
    2. నన్నయ, తిక్కన, విశ్వనాథ ఇత్యాదులంతా పండితులు కారా?

    ధన్యవాదాలతో,
    కాశీనాథుని రాజాశఙ్కర్

  7. పద్యాలు – వాడుకభాష గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    01/29/2007 9:33 am

    లోతైన విశ్లేషణతో ఆలోచింప చేసే చక్కని వ్యాసం! అయితే, “గ్రాంధిక భాష అంటే ఇంతకాలం సాంప్రదాయికంగా లిఖిత పూర్వకంగా వస్తున్న ప్రాచీన కావ్యాలలో వాడబడిన కావ్య భాష.” అని మీరిచ్చిన తాత్కాలిక నిర్వచనాన్ని ఇంకొంత వివరిస్తే బాగుండేదేమో. కాల గతిలో వాడుక భాష మారినట్టుగానే కావ్య భాష కూడా పరిణామం చెందుతూ వస్తోందని, నన్నయ్య, తిక్కనాదులనుండి విశ్వనాథ వరకు వారి వారి కావ్యాల్లో వాడిన కావ్యభాషలన్నీ ఒకే రూపంలో లేవని మీకు తెలుసు. నన్నయ్య కావ్యభాషకు ఎనమిదో శతాబ్దపు భాష ఆధారమైతే, 11వ శతాబ్దపు శాసనాలలో కనిపించే ఇచ్చినాఁడు ( < ఇచ్చినవాడు < ఇచ్చినవాణ్డు) వంటి మాండలిక ప్రయోగాలు తిక్కన నాటికి కావ్య గౌరవం పొందాయి. అంటే ఒకనాటి వ్యవహారిక భాషా ప్రయోగాలు మరో నాటికి కావ్యభాషలో భాగాలయ్యాయన్నమాట. ఒకటి, రెండు శతాబ్దాలు ప్రజల నాలుకల్లో నలుగుడు పడ్డ వాడుక భాషా ప్రయోగాలు ఆ తరువాత గ్రాంథిక భాషలో ఆమోద యోగ్యాలయ్యాయని నా అభిప్రాయం. పండితుల పట్టుదల వల్ల, లాక్షణీకుల వ్యాకరణ సూత్రాల వల్ల గ్రాంథిక భాష కొంత జడత్వం చూపినా, "ప్రాఁతవడ్డ మాటలను" పరిహరించడంలో, కొత్త మాటలను, ప్రయోగాలను ఉపయోగించడంలో నన్నయ్య, తిక్కనల నుండి విశ్వనాథ వరకూ, మహాకవులెవ్వరూ సందేహించలేదని నాకనిపిస్తుంది. మీరేమంటారు? రిగార్డులతో, సురేశ్. "నేనొక పూలమొక్కకడ నిల్చి ..." పద్య భావాన్ని నన్నయ్య భాషలోకి ఎవరైనా అనువాదం చేసి రాస్తే చూడాలని ఉంది. నా శుష్క ప్రయత్నం: అడవికిఁ బువ్వులు దేరఁగ వడినరిగిన నన్నుఁజూచి వారిజ(?) కాంతల్ పొడవుఁ సెడఁ ద్రుంచి వగవక జడముడిఁ వడలింతురనుచు శోకింపంగన్ (నన్నయ్య భాషలో పొడవు=రూపము; వగవక=ఆలోచింపక)

  8. తెలుగులో అంకెలు, సంఖ్యలు 11 నుంచి పైన గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    01/29/2007 6:04 am

    ఏడు, పది డెబ్బది ఎలాగయిందో, ఏ వ్యాకరణసూత్రం ఉపయోగించాలో నాకు అర్థం కాలేదు.

    వర్ణవ్యత్యయం!

    మూల ద్రావిడంలోని ధాతువులలో ప్రథమాక్షరంగా కనిపించని మూర్ధన్యాక్షరాలు (ట,ఠ, డ, ఢ, ణ, ళ, ೞ లు), ర-ఱ-లలు తెలుగు-కుయి లో మాత్రమే కనిపించడాన్ని విశ్లేషిస్తూ భద్రిరాజు కృష్ణమూర్తి గారు వర్ణవ్యత్యయం (metathesis) అనే ధ్వని పరిణామం వల్ల మూల ధాతువులలో ద్వితీయాక్షరంగా ఉన్న ఈ మూర్ధన్యాక్షరాలు మొదటి స్థానానికి చేరాయని వివరించారు (చూ. Telugu Verbal Bases p 51-52)

    ఉదాహరణలు:
    లోన < ళోన < *ఒళన
    డస్సి < ೞస్సి < *అೞసి
    లే(త) < *ఎల
    రే(యి) < రెయి < *ఇరు
    రోలు < ఒరలు < *ఉరల్

    ఈ ధ్వని పరిణామం ఆధారంగా ఏడు + పది డెబ్బది ఎలా అయ్యిందో వివరించడం సులభం:
    *ఏೞು > ఏడు+పది > డేబ్బది > డెబ్బది > డెబ్భై

    రిగార్డులతో,
    సురేశ్.

  9. రచయితలకు సూచనలు గురించి Dr.K. Sujatha గారి అభిప్రాయం:

    01/28/2007 10:54 pm

    Being outside India we miss terribly telugu literature especially meaningful discussions.
    It is good today I came across your website. You are doing agreat service.Congrtaulations.

    Dr.K. Sujatha
    Canberra ,Australia

  10. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    01/26/2007 4:57 pm

    మనుషుల్లో వివిధ వ్యక్తులకి వివిధ విషయాల్లో ఆసక్తి ఉండడం సహజంగా అనిపిస్తుంది. ఎవరి కిష్టమైన సబ్జెక్ట్ వారు చదువుకుంటే సైన్స్, కామర్స్, ఆర్ట్స్, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలా ప్రతీ సబ్జక్ట్ లోనూ నిష్ణాతులు తయారవుతారు. అలా కాకుండా మంచి మార్కులొచ్చాయి కదా అని మనలో చాలా మంది తోసినట్టుగా ఇంజనీరింగో, మెడిసినో చదివి, “విధిలేక” అదే రంగంలో జీవితమంతా కొనసాగుతారు. “ఎందుకూ పనికిరాని” ఏ తెలుగు సాహిత్యంలోనో ఆసక్తి ఉన్నప్పటికీ అది ఔత్సాహిక దశలోనే ఆగిపోతుంది.

    సురేశ్ వంటి వారు తెలుగు భాష, సాహిత్యం తదితర విషయాల్లో తమకున్న గాఢమైన ఆసక్తిని చంపుకోలేక మరేదో ఉద్యోగం చేస్తూ, ఇటువంటి విషయాల గురించి ఉన్న పరిమిత సమయంలోనే చదివి, తమ ఉత్సాహాన్ని నలుగురితోనూ వ్యాసాల ద్వారా పంచుకునే ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యాసాలను విమర్శించకూడదని అనలేముగాని, రచయిత ఎటువంటి ఒత్తిళ్ళకు లోనయి ఇటువంటి ప్రయత్నం చేస్తాడో పాఠకులు కాస్త గుర్తుంచుకోవాలని నాకనిపిస్తుంది.

    యూనివర్సిటీల్లో జరిపే రిసెర్చ్ మరింత నిర్దుష్టంగా ఉండవచ్చు గాని ఔత్సాహికుల రచనల్లాగా అవి చదువరులను ఎక్సయిట్ చేసి ఆసక్తి కలిగించలేకపోవచ్చు. ఈ వ్యాసానికి లభించిన, లభిస్తున్న స్పందనే అందుకు ఉదాహరణ.

    ఈమాట, తదితర వెబ్ పత్రికలలో ఇతర ప్రొఫెషన్లలో ఉన్నవారు ఎన్నో విషయాల గురించి ఆసక్తికరమైన వ్యాసాలు రాస్తున్నారనేది గమనించాలి. వీరిలో ప్రసిద్ధ రచయితలుగాని, మహా పండితులుగాని ఎక్కువగా లేకపోవచ్చు. తెలుగు గురించి విశేష పరిశోధనలు చేసిన ఒక చేరాగారో, బూదరాజువారో, వెల్చేరువారో అరుదుగా కనిపిస్తారుగాని తెలుగు రచనల్లో వైవిధ్యాన్నీ, విస్తృతినీ కలిగించటానికి ప్రయత్నిస్తున్న ఇతర “చిన్న” రచయితల ప్రయత్నాలు ఎంతో మెచ్చుకోదగ్గవి.

    సురేశ్ గారికి అభినందనలు.

« 1 ... 1531 1532 1533 1534 1535 ... 1582 »