కోటి వీణలు మ్రోగి గుండెలో

కోటి వీణలు మ్రోగి గుండెలో
మాటలాగి పోయె గొంతులో
ఎదురుచూసిన గడియలెదురైన ఈ వేళ
రాగములు ఎద నిండి మూగనైపోతినే
మౌనమే మిగులునా బ్రతుకులో

కోటి వీణలు మ్రోగి గుండెలో
మాట లాగి పోయె గొంతులో

  1. వాసంత నవవేళ వనమంత కిలకిలలు
    మందారపూలలో మధువులను ద్రావి
    తుమ్మెదలు పాడెనే హాయిగా
    గాలి ఈలలు వేయ తోడుగా —

    కలల పూపొదల జావళులు పాడిన గళము
    రవళింపదిది యేమి రమణు గాంచియు నిపుడు
    మౌనమే మిగులునా బ్రతుకులో

  2. వాన కారు వచ్చి అంబరము సంబరము
    మెరుపు తీగల మేని ఒంపులను తాకి
    మేఘాలు ఉరిమెనే జోరుగా
    కడలి తోడై రాగ హోరుగా

    కలల కోవెలల కీర్తనలు పాడిన గళము
    స్వాగతింపదిదేమి స్వామి అరుదెంచెన ఇపుడు
    మౌనమే మిగులునా బ్రతుకులో

కోటి వీణలు మ్రోగి గుండెలో
మాటలాగిపోయె గొంతులో
ఎదురుచూసిన గడియలెదురైన ఈ వేళ
రాగములు ఎద నిండి మూగనై పోతినే
మౌనమే మిగులునా బ్రతుకులో


రచయిత తఃతః గురించి:

పెద్దగా ఏమీ లేదు -జస్ట్ ఎ కామన్ మాన్ -స్నే హితులనుంచి చాలా నేర్చుకున్నవాడు. క్రికెట్ , టేబుల్ టెన్నిస్ ఆడినవాడు.

 ...