‘మ’ కు ఇచ్చిన మ ఒత్తులాగ
గుండెను అల్లుకుంటుంది అఫ్సర
ట అక్షరం సరిగ్గా పలుకడం రాదు గానీ
ముద్దుముద్దుగా
మాటలగూడల్లుతుంది
నిన్న బడికి రానోళ్ళంతా
ఒక లైను కట్టుండ్రి అంటే
‘మా అమ్మను మా నాయిన కొట్టిండని’
రెక్కలు ముడుచుకున్న పిచ్చుకపిల్లలెక్క
కండ్లు నలుచుకుంట చేతులు చాపుతది
ఈసారి రెండు జడలు కట్టుకోనందుకు కూడా
ఏమనలేదు
క్లాసులోకి అడుగుపెట్టక ముందుకే
చాక్ పీస్ తేవాలా సార్
డెసర్ట్ తేవాలా సార్ అని
లోపలికి, బయటకు ఉరికే
కుందేలు చెవుల పిల్ల మా అఫ్సర
పేరుకు ఒకటో తరగతే గానీ
ఎన్ని మాటలు నేర్చిందో ఈ చిలుకమ్మ
‘ఆకాశంలో చుక్కలు
నా గుండెలో మా గోపాల్ సార్’ అని
టీచర్లందరి ముందు కవిత్వం చెబుతుంటే
మనసు పూలకొమ్మ ఊగినట్లు ఉంటది
ఒకరోజు హాజరు తీసుకుంటుంటే
పక్కనే వచ్చి నిలబడింది
నిన్నమొన్న నువ్వు ఎందుకు రాలేదో
నాకు తెలుసు
మీ అమ్మ చచ్చిపోయిందంట కదా సార్
మా తాత చెప్పిండు అన్నది
వెంటనే దివ్య ఇంకొక మాట అందుకుంది
వాళ్ళకు ఏమని చెప్పాలో తెల్వక
మీరంతా మా అమ్మలే కదా అన్నాను
‘అమ్మో… మేమా?ఏం కాదు’, అన్నరు ఒకే గొంతుతో
మల్లా ఏమనుకున్నరో ఏమో
‘అవును మీ అమ్మలమే సార్’ అన్నరు
బోధివృక్షంలాంటి
ఆ పిల్లల మాటల్లో
కాకరకాయ పాఠం చెబుతూ
బుద్దగీతానయ్యాను నేను