కర్ణభారం – సమూలానువాదం

పూర్వరంగం

కథాసంగ్రహం

కర్ణుడు యుద్ధసన్నద్ధుడయ్యాడు. అంతకు కొన్ని రోజుల ముందే తెలిసిన తన జన్మరహస్యం, తన తల్లికి తానిచ్చిన మాట అతడి స్థైర్యాన్ని నీరుగారుస్తూ ఉన్నాయి. అవసరమున్న వేళలో తన అస్త్రవిద్య పనికిరాకుండా పోతుందన్న గురుశాపం అక్షరసత్యమని తేలింది. గడప దాటుతుండగా, బ్రాహ్మణవేషంలో ఇంద్రుడు వచ్చి కవచకుండలాలను దానంగా అందుకొని వెళ్ళిపోతాడు, ఆకాశాన ఐరావతంపై కూర్చొని తీరుబడిగా కర్ణార్జునయుద్ధాన్ని చూసేందుకు. పైచేయి తనదే అయ్యిందన్న తృప్తి మిగిలింది కర్ణుడికి. ఇంతలో బ్రాహ్మణవేషధారియైన దేవదూత వచ్చి ఇంద్రుడు పంపిన విమలమనే అస్త్రాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. అర్జునుడున్న చోటికే శల్యుడు కర్ణరథాన్ని తీసుకెళుతూ ఉండగా భరతవాక్యం వినబడుతుంది.

కొన్ని విశేషాలు

  1. భాసనాటకాల్లో అతి చిన్నది ఇదే. ఐదే పాత్రలు. స్త్రీపాత్రల విలాపాలు లేవు కానీ ప్రాకృతికమైన నాయకుడు ఉన్నందునా, కరుణరసప్రధానమైనందునా దీన్ని ఉత్సృష్టికగా పరిగణిస్తారు.
  2. ఇంద్రుడు కర్ణుడిని కవచకుండలాలు యాచించే కథ మహాభారతం వనపర్వంలో వస్తుంది (దాక్షిణాత్యపాఠంలో 311వ అధ్యాయం; సంశోధితపాఠంలో 284వ అధ్యాయం). ఈ కథను కర్ణుడు యుద్ధానికి బయలుదేరుతున్న సందర్భానికి జరపడం భాసుడు చేసిన మార్పు. మహాభారతకథలో, ఇంద్రుడి రాక కన్నా ముందు సూర్యుడు కర్ణుడిని హెచ్చరిస్తాడు. కర్ణుడు తన మాట విననందున శక్తి అనే ఆయుధాన్ని ఇంద్రుడినుంచి ఇప్పించుకొమ్మని సలహా ఇస్తాడు. కర్ణభారం కథలో సూర్యుడు ఉండడు. కర్ణుడికి హితవు చెప్పే బాధ్యత శల్యుడు తీసుకుంటాడు. ఈ నాటకంలో శల్యుడు మంచివాడే. కర్ణుడి మనఃస్థైర్యాన్ని క్రుంగదీసేలా ‘శల్యసారథ్యం’ చేసే రకం కాదు. కర్ణుడి హితం కోరినవాడే.
  3. యుద్ధానికి వెళ్ళకముందే తాను ఓడిపోవడం మొదలుపెట్టాడని గ్రహించినా, తన ఉదాత్తతను వదులుకోని కర్ణుడి పాత్రచిత్రణ ఇప్పుడు మనకు కొత్తగా అనిపించకపోవచ్చు కానీ ఇతిహాసాల్లోని దుష్టపాత్రలను సానుభూతితో పునఃపరిశీలించడం, మృదువుగా చిత్రీకరించడం బహుశః భాసుడితోనే మొదలయ్యిందేమో.
  4. ఈ కథలో ఒకటికి మూడుసార్లు కర్ణుడి బ్రాహ్మణభక్తిప్రకటనం ఎదురవుతుంది మనకు. రచయిత నేపథ్యము, అప్పటి బౌద్ధిక, సామాజిక వాతావరణాలు అలాంటి ప్రస్తావనలకు కారణమై ఉంటాయని ఊహించవచ్చు.
  5. చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి ‘భాసుని భారతనాటకములు’ పుస్తకంలో ‘కర్ణభారం’ చోటుచేసుకోలేదెందుకో. మానవల్లి రామకృష్ణకవిగారి అనువాదం ఆం.ప్ర.సాహిత్య అకాడెమీవారు ప్రచురించిన మానవల్లి కవి – రచనలు పుస్తకంలో లభ్యమవుతున్నది. ఫిబ్రవరి 1913 కల్లా మానవల్లివారి అనువాదం సిద్ధమయ్యింది (టి.గణపతిశాస్త్రిగారు పరిష్కరించిన భాసనాటకాలు 1912లో ప్రచురితమయ్యాయి). ముద్రితప్రతుల ఆధారంగా కాక నేరుగా తాళపత్రాలనుంచే అనువాదం చేసానని కర్ణభారానికి ముందుమాటలో చెప్పారు మానవల్లి రామకృష్ణకవిగారు.

పాత్రలు

  1. భటుడు
  2. కర్ణుడు
  3. శల్యుడు
  4. ఇంద్రుడు
  5. దేవదూత




(నాన్ద్యన్తే తతః ప్రవిశతి సూత్రధారః ।)

సూత్రధారః:
నరమృగపతివర్ష్మాలోకేనభ్రాన్తనారీ
నరదనుజసుపర్వవ్రాతపాతాలలోకః ।
కరజకులిశపాలీభిన్నదైత్యేన్ద్రవక్షాః
సురరిపుబలహన్తా శ్రీధరోఽస్తు శ్రియే వః ॥ 1 ॥



(నాంది అనంతరం సూత్రధారుడు ప్రవేశిస్తాడు)

సూత్రధారుడు:
నృసింహరూపంలో తనను దర్శించిన స్త్రీ-పురుష-అసుర-దేవతల సమూహాలకు, పాతాళలోకానికి సంభ్రమం కలిగించినవాడు, వజ్రాయుధసమానమైన తన చేతి గోళ్ళ వరుసతో హిరణ్యకశిపుడి వక్షాన్ని బద్దలుచేసినవాడు, దేవతల శత్రువులైన దానవుల బలాన్ని అణచినవాడూ అయిన లక్ష్మీధరుడు మీకు ఐశ్వర్యములను కలిగించుగాక!


ఏవమార్యమిశ్రాన్విజ్ఞాపయామి । (పరిక్రమ్య కర్ణౌ దత్వా) అయే కిన్నుఖలు మయి విజ్ఞాపనవ్యగ్రే శబ్ద ఇవ శ్రూయతే । అఙ్గ! పశ్యామి ।


(నేపథ్యే)
భో భోః! నివేద్యతాం నివేద్యతాం మహారాజాయాఙ్గేశ్వరాయ ।


గౌరవనీయులైన మీకు విన్నవించుకుంటున్నాను… (వెనక్కి తిరిగి) అరె! నేను విన్నపం చేసుకుంటుండగా, ఏదో శబ్దం వినబడుతున్నదే? సరే, చూస్తాను.


(తెర వెనక)
ఓయీ! విన్నవించు. అంగరాజ్యాధిపతి అయిన కర్ణమహారాజుకు విన్నవించు.


సూత్రధారః:
భవతు విజ్ఞాతమ్ ।
సఙ్గ్రామే తుములే జాతే కర్ణాయ కలితాఞ్జలిః ।
నివేదయతి సమ్భ్రాన్తో భృత్యో దుర్యోధనాజ్ఞయా ॥ 2 ॥


(నిష్క్రాన్తః ।)
ప్రస్తావనా ।



సూత్రధారః:
తెలిసింది –-

భయానకమైన యుద్ధం ఆసన్నమవుతుండగా, దుర్యోధనుడి ఆజ్ఞచేత, తడబడుతూ ఉన్న సేవకుడు చేతులు జోడిస్తూ కర్ణుడికి మనవి చేసుకుంటున్నాడు.



(తతః ప్రవిశతి భటః ।)

భటః:
భో భోః! నివేద్యతాం నివేద్యతాం మహారాజాయాఙ్గేశ్వరాయ యుద్ధకాల ఉపస్థిత ఇతి ।

కరితురగరథస్థైః పార్థకేతోః పురస్తాత్
ముదితనృపతిసింహైః సింహనాదః కృతోద్య ।
త్వరితమరినినాదైర్దుస్సహాలోకవీరః
సమరమధిగతార్థః ప్రస్థితో నాగకేతుః ॥ 3 ॥



(నిష్క్రమిస్తాడు.)
ప్రస్తావన ముగిసింది.
(భటుడు ప్రవేశిస్తాడు.)

భటుడు:
ఓయీ! విన్నవించు. అంగరాజ్యాధిపతి అయిన కర్ణమహారాజుకు విన్నవించు, యుద్ధకాలం వచ్చేసిందని.

ఏనుగులను, గుఱ్ఱాలను, రథాలను అధిరోహించి, ప్రసన్నులై అర్జునుడి ధ్వజం ముందర ఉన్న రాజసింహులు సింహనాదాన్ని చేస్తున్నారు. కన్నెత్తి తేరిపార చూసేందుకైనా వీలుకాని వీరుడు, గజచిహ్నితమైన పతాకం గలవాడూ అయిన దుర్యోధనుడు, శత్రువుల నినాదాల కారణాన త్వరపడుతూ యుద్ధానికని బయలుదేరాడు.


(పరిక్రమ్య విలోక్య) అయే అయమఙ్గరాజః సమరపరిచ్ఛదపరివృతః శల్యరాజేన సహ స్వభవనాన్నిష్క్రమ్యేత ఏవాభివర్తతే । భోః! కిం ను ఖలు యుద్ధోత్సవప్రముఖస్య
దృష్టపరాక్రమస్యాభూతపూర్వో హృదయపరితాపః । ఏష హి

అత్యుగ్రదీప్తివిశదః సమరేఽగ్రగణ్యః
శౌర్యే చ సంప్రతి సశోకముపైతి ధీమాన్ ।
ప్రాప్తే నిదాఘసమయే ఘనరాశిరుద్ధః
సూర్యః స్వభావరుచిమానివ భాతి కర్ణః ॥ 4 ॥

యావదపసర్పామి । (నిష్క్రాన్తః ।)


(వెనక్కి తిరిగి చూసి) అరె! ఇదిగో అంగరాజు, యుద్ధవేషాన్ని ధరించి శల్యరాజుతో సహా తన భవనంనుంచి ఇటే వస్తున్నాడు! ఇదేమి, సమరోత్సాహం కలవారిలో ప్రముఖుడు, ఇతఃపూర్వమే తన పరాక్రమాన్ని లోకానికి చూపించినవాడు అయిన ఇతడికి ఎప్పుడూ లేని ఈ విషాదము? ఇతడు –-

అతిభయంకరమైన పరాక్రమంతో వెలిగేవాడు, యోధాగ్రణి… ఇప్పుడీ బుద్ధిమంతుడు దుఃఖిస్తున్నాడు. మబ్బుల దొంతరచేత తన కిరణాలు అడ్డగించబడిన సూర్యుడిలా ఉన్నాడు కర్ణుడు.
ఇంక నేను దారి తొలగుతాను. (వెళ్ళిపోతాడు)



(తతః ప్రవిశతి యథానిర్దిష్టః కర్ణః శల్యశ్చ ।)

కర్ణః:
మా తావన్మమ శరమార్గలక్షభూతాః
సంప్రాప్తాః క్షితిపతయః సజీవశేషాః ।
కర్తవ్యం రణశిరసి ప్రియం కురూణాం
ద్రష్టవ్యో యది స భవేద్ధనఞ్జయో మే ॥ 5 ॥

శల్యరాజ! యత్రాసావర్జునస్తత్రైవ చోద్యతాం మమ రథః ॥



(కర్ణుడు, శల్యుడూ ప్రవేశిస్తారు)
కర్ణుడు:
నా బాణాల దారిలో లక్ష్యాలై నిలిచిన రాజులు ప్రాణాలతో మిగిలి ఉంటారా? శత్రుసేనకు అగ్రభాగాన నిలిచిన అర్జునుడు నాకు కనబడితే, కౌరవులకు ప్రియం చేకూరుస్తాను.

శల్యరాజా! అర్జునుడున్నచోటికే నా రథాన్ని నడిపించు.


శల్యః:
బాఢమ్ ।


శల్యుడు:
అలాగే! (రథాన్ని తోలుతాడు)


కర్ణః:
అహో ను ఖలు

అన్యోన్యశస్త్రవినిపాతనికృత్తగాత్ర-
యౌధాశ్వవారణరథేషు మహాహవేషు
క్రుద్ధాన్తకప్రతిమవిక్రమిణో మమాపి
వైధుర్యమాపతతి చేతసి యుద్ధకాలే ॥ 6 ॥

భోః కష్టమ్ ।

పూర్వం కున్త్యాం సముత్పన్నో రాధేయ ఇతి విశ్రుతః ।
యుధిష్ఠిరాదయస్తే మే యవీయాంసస్తు పాణ్డవాః ॥ 7 ॥

అయం స కాలః క్రమలబ్ధశోభనో
గుణప్రకర్షో దివసోఽయమాగతః ।
నిరర్థమస్త్రం చ మయా హి శిక్షితం
పునశ్చ మాతుర్వచనేన వారితః ॥ 8 ॥

భోః శల్యరాజ! శ్రూయతాం మమాస్త్రస్య వృత్తాన్తః ।



కర్ణుడు:
అయ్యో!

పరస్పరం దేహాలను ఖండించుకొన్న యోధులతో, అశ్వాలతో, ఏనుగులతో, రథాలతో నిండే మహాయుద్ధాలలో క్రుద్ధుడైన యముడివలె విక్రమించే నాకు సైతం ఈ యుద్ధసమయంలో హృదయవైక్లబ్యం కలుగుతుంది.

కష్టంగా ఉన్నది.

పూర్వం కుంతికి పుట్టాను. రాధేయుడిగా పేరుపొందాను. యుధిష్ఠిరాదులైన ఆ పాండవులు నాకన్నా చిన్నవాళ్ళు.

చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభసమయం – సుదినం – ఎట్టకేలకు సంప్రాప్తించింది. కానీ అమ్మ మాట కారణంగా నా అస్త్రవిద్య అడ్డగించబడి, వ్యర్థమవుతున్నది.

ఓ శల్యరాజా! నా అస్త్రవిద్యాభ్యాసవృత్తాంతాన్ని వినిపిస్తాను.


శల్యః:
మమాప్యస్తి కౌతూహలమేనం వృత్తాన్తం శ్రోతుమ్ ।


శల్యుడు:
ఆ వృత్తాంతాన్ని వినాలని నాకూ కుతూహలంగా ఉన్నది.

కర్ణః:
పూర్వమేవాహం జామదగ్న్యస్య సకాశం గతవానస్మి ।


కర్ణుడు:
పూర్వం నేను జమదగ్ని కుమారుడైన పరశురాముడివద్దకు వెళ్ళాను.

శల్యః:
తతస్తతః ।


శల్యుడు:
ఆ తరువాత?


కర్ణః:
తతః,

విద్యుల్లతాకపిలతుఙ్గజటాకలాప-
ముద్యత్ప్రభావలయినం పరశుం దధానమ్ ।
క్షత్రాన్తకం మునివరం భృగువంశకేతుం
గత్వా ప్రణమ్య నికటే నిభృతః స్థితోఽస్మి ॥ 9 ॥



కర్ణుడు:
ఆ తరువాత…

మెరుపు తీగలవంటి ఎర్రని జడలను ఎత్తుగా కొప్పు కట్టుకున్నవాడు, ఉదయకాంతుల వలయాన్ని కలిగినవాడు, గండ్రగొడ్డలిని ధరించినవాడు, క్షత్రియుల పాలిట యముడు, మునిశ్రేష్ఠుడు, భృగువంశానికి పతాకంవంటివాడు అయిన పరశురాముడివద్దకు వెళ్ళి నమస్కరించి మాట్లాడకుండా నిలబడ్డాను.


శల్యః:
తతస్తతః ।


శల్యుడు:
అప్పుడు?

కర్ణః:
తతో జామదగ్న్యేన మమాశీర్వచనం పృష్టోఽస్మి । కో భవాన్ కిమర్థమిహాగత ఇతి ।


కర్ణుడు:
అప్పుడు ఆయన నన్ను ఆశీర్వదించాడు. ఎవరు నీవు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగాడు.

శల్యః:
తతస్తతః ।


శల్యుడు:
అనంతరం?

కర్ణః:
తతః భగవన్ అఖిలాన్యస్త్రాణ్యుపశిక్షితుమిచ్ఛామీత్యుక్తవానస్మి ।


కర్ణుడు:
అనంతరం, “భగవన్, అన్ని అస్త్రాలను నేర్చుకోవాలని నా కోరిక,” అన్నాను.

శల్యః:
తతస్తతః ।


శల్యుడు:
ఆ తరువాత?

కర్ణః:
తత ఉక్తోఽహం భగవతా బ్రాహ్మణేషూపదేశం కరిష్యామి న క్షత్రియాణామితి ।


కర్ణుడు:
ఆ తరువాత, ఆ పూజ్యుడు, “బ్రాహ్మణులకే కాని క్షత్రియులకు ఉపదేశించను,” అన్నాడు.

శల్యః:
అస్తి ఖలు భగవతః క్షత్రియవంశ్యైః పూర్వవైరమ్ । తతస్తతః ।


శల్యుడు:
ఆయనకు క్షత్రియవంశీయులతో పూర్వశత్రుత్వం ఉన్నది కదా. అటు పిమ్మట?


కర్ణః:
తతో నాహం క్షత్రియ ఇత్యస్త్రోపదేశం గ్రహీతుమారబ్ధం మయా ।



కర్ణుడు:
అటు పిమ్మట, నేను క్షత్రియుడను కానని చెప్పి అస్త్రోపదేశాన్ని స్వీకరించడం ప్రారంభించాను.


శల్యః:
తతస్తతః ।


శల్యుడు:
ఆ తరువాత ఏమయ్యింది?


కర్ణః:
తతః కతిపయకాలాతిక్రమే కదాచిత్ఫలమూలసమిత్కుశకుసుమాహరణాయ గతవతా గురుణా సహానుగతోఽస్మి ।



కర్ణుడు:
కొంతకాలం గడిచింది. ఒకసారి పళ్ళను, కందమూలాలను, దర్భలను, పూవులను సేకరించేందుకు వెళుతున్న గురువుగారి వెంట వెళ్ళాను.


శల్యః:
తతస్తతః ।


శల్యుడు:
అప్పుడు?


కర్ణః:
తతః స గురుర్వనభ్రమణపరిశ్రమాన్మదఙ్కే నిద్రావశముపగతః ।



కర్ణుడు:
అడవిలో తిరుగుతూ శ్రమకు లోనైన గురువుగారు నా ఒడిలో నిద్రలోకి జారుకున్నారు.


శల్యః:
తతస్తతః ।


శల్యుడు:
అప్పుడు?

కర్ణః:
తతః

కృత్తే వజ్రముఖేన నామ కృమిణా దైవాన్మమోరుద్వయే
నిద్రాచ్ఛేదభయాదసహ్యత గురోర్ధైర్యాత్తదా వేదనా ।
ఉత్థాయ క్షతజాప్లుతః స సహసా రోషానలోద్దీపితో
బుద్ధ్వా మాం చ శశాప కాలవిఫలాన్యస్త్రాణి తే సన్త్వితి ॥ 10 ॥


కర్ణుడు:
అప్పుడు…

నా దురదృష్టం కొద్దీ వజ్రముఖం అనే పురుగు నా రెండు తొడలనూ కుట్టింది. గురువుగారి నిద్రకు భంగం కలుగుతుందనే భయంతో బిగబట్టి ఆ నొప్పిని ఓర్చుకున్నాను. నా గాయంనుంచి స్రవిస్తున్న రక్తం కారణంగా ఆయన మేల్కొని, ఏం జరిగిందో తెలుసుకొని కోపంతో మండిపడుతూ “అవసరమైనప్పుడు నీ అస్త్రాలు నిష్ప్రయోజనమగు గాక!” అని శపించారు.


శల్యః:
అహో కష్టమభిహితం తత్రభవతా ।


శల్యుడు:
అయ్యో, ఆ పూజ్యుడు ఎంతటి కష్టాన్ని కలిగించాడు!

కర్ణః:
పరీక్షామహే తావదస్త్రస్య వృత్తాన్తమ్ । (తథా కృత్వా)[ ఏతాన్యస్త్రాణి నిర్వీర్యాణీవ లక్ష్యన్తే । అపి చ ।

ఇమే హి దైన్యేన నిమీలితేక్షణా
ముహుః స్ఖలన్తో వివశాస్తురఙ్గమాః ।
గజాశ్చ సప్తచ్ఛదదానగన్ధినో
నివేదయన్తీవ రణే నివర్తనమ్ ॥ 11 ॥

శఙ్ఖదున్దుభయశ్చ నిఃశబ్దాః ।


కర్ణుడు:
ఈ అస్త్రాల సంగతి పరీక్షిద్దాము. (అలా చేసి) ఈ అస్త్రాలు శక్తిహీనమైనట్లున్నాయి. పైగా…

దైన్యంతో కన్నులు మూతపడుతున్న ఈ గుఱ్ఱాలు స్వాధీనం తప్పి మాటిమాటికీ జారి పడుతున్నాయి. ఏడాకుల అరటి చెట్టు వాసన ఉండే మదాన్ని స్రవిస్తున్న ఏనుగులు యుద్ధవైముఖ్యాన్ని సూచిస్తున్నాయా అన్నట్లు ఉన్నాయి.

శంఖాలు, దుందుభులు శబ్దం చేయడం లేదు.


శల్యః:
భోః కష్టం కిం ను ఖల్విదమ్ ।


శల్యుడు:
అయ్యో! ఎంత కష్టం!

కర్ణః:
శల్యరాజ! అలమలం విషాదేన ।

హతోఽపి లభతే స్వర్గం జిత్వా తు లభతే యశః ।
ఉభే బహుమతే లోకే నాస్తి నిష్ఫలతా రణే ॥ 12 ॥

అపి చ

ఇమే హి యుద్ధేష్వనివర్తితాశా
హయాః సుపర్ణేన సమానవేగాః ।
శ్రీమత్సు కామ్బోజకులేషు జాతాః
రక్షన్తు మాం యద్యపి రక్షితవ్యమ్ ॥ 13 ॥

అక్షయోఽస్తు గోబ్రాహ్మణానామ్ । అక్షయోఽస్తు పతివ్రతానామ్ । అక్షయోఽస్తు రణేష్వపరాఙ్ముఖానాం యౌధపురుషాణామ్ । అక్షయోఽస్తు మమ ప్రాప్తకాలస్య । ఏష భోః ప్రసన్నోఽస్మి ।

సమరముఖమసహ్యం పాణ్డవానాం ప్రవిశ్య
ప్రథితగుణగణాఢ్యం ధర్మరాజం చ బద్ధ్వా ।
మమ శరవరవేగైరర్జునం పాతయిత్వా
వనమివ హతసింహం సుప్రవేశం కరోమి ॥ 14 ॥

శల్యరాజ! యావద్రథమారోహావః ।


కర్ణుడు:
శల్యరాజా! చాలు ఈ విషాదం!

మరణిస్తే స్వర్గం లభిస్తుంది. గెలిస్తే కీర్తి! ఈ లోకంలో ఆ రెండూ గౌరవించబడేవే. యుద్ధంలో నిష్ఫలత్వం అనేది ఉండదు.

అంతే కాక –

యుద్ధంనుంచి తిరిగి వస్తాయన్న ఆశ లేకపోయినప్పటికీ ఈ గుఱ్ఱాలు వేగంలో గరుత్మంతుడికి సమానమైనవి. శ్రీమంతమైన కాంభోజజాతికి చెందినవి. నిజానికి, వీటిని రక్షించాల్సిన బాధ్యత నాది. అయినప్పటికీ, ఈ అశ్వాలు నన్ను కాపాడుగాక.

గోవులకు బ్రాహ్మణులకు శుభమగుగాక. పతివ్రతలకు శుభమగుగాక. యుద్ధాలలో వెనుతిరగని యోధులకు శుభమగుగాక. సమయం ఆసన్నమైన నాకు శుభమగుగాక! అయ్యా, ప్రసన్నుడనయ్యాను.

దుస్సహమైన పాండవసేనలలో జొచ్చి, గుణగణసంపన్నుడని ఖ్యాతిగాంచిన ధర్మరాజును బంధించి నా శ్రేష్ఠమైన బాణాల వేగంతో అర్జునుడిని నేలకూల్చి – సింహం చనిపోయాక అడవి ప్రవేశయోగ్యం అయినట్లు – ఈ సమరభూమిని ప్రవేశయోగ్యంగా మారుస్తాను.

శల్యరాజా! ఇంక రథాన్ని అధిరోహిద్దాము.


శల్యః:
బాఢమ్ ।

(ఉభౌ రథారోహణం నాటయతః ।)


శల్యుడు:
మంచిది.


(ఇద్దరూ రథారోహణాన్ని అభినయిస్తారు.)


కర్ణః:
శల్యరాజ! యత్రాసావర్జునస్తత్రైవ చోద్యతాం మమ రథః ।


కర్ణుడు:
శల్యరాజా! ఆ అర్జునుడుండే చోటుకే నా రథాన్ని నడిపించు.

భో కణ్ణ! మహత్తరం భిక్ఖం యాచేమి ।

భోః కర్ణ! మహత్తరాం భిక్షాం యాచే ।



(తెర వెనకనుండి)
ఓ కర్ణా! మహత్తరమైన భిక్షను యాచిస్తున్నాను.

కర్ణః:
అయే వీర్యవాన్ శబ్దః ।

శ్రీమానేష న కేవలం ద్విజవరో యస్మాత్ప్రభావో మహా-
నాకర్ణ్య స్వరమస్య ధీరనినదం చిత్రార్పితాఙ్గా ఇవ ।
ఉత్కర్ణస్తిమితాఞ్చితాక్షవలితగ్రీవార్పితాగ్రాననా-
స్తిష్ఠన్త్యస్వవశాఙ్గయష్టి సహసా యాన్తో మమైతే హయాః ॥ 15 ॥

ఆహూయతాం స విప్రః । న న । అహమేవాహ్వయామి । భగవన్నిత ఇతః ।


కర్ణుడు:
(విని) ఏమి శక్తిమంతమైన శబ్దము!

ఈ శ్రీమంతుడు శ్రేష్ఠుడైన బ్రాహ్మణమాత్రుడు కాదు. ధీరగంభీరమైన ఇతడి మాటను విన్నంతనే నా ఈ అశ్వాలు, అకస్మాత్తుగా, చెవులను రిక్కించి, అందమైన కన్నులను మోడ్చి, మెడలను వంచి, తమ దేహాలపై అదుపును కోల్పోయి నిలుచుండిపోయాయి.

ఆ విప్రుణ్ణి రమ్మనండి. కాదు, కాదు నేనే ఆహ్వానిస్తాను. స్వామీ, ఇటు, ఇటు.


(తతః ప్రవిశతి బ్రాహ్మణరూపేణ శక్రః ।)

శక్రః:
భో మేఘాః । సూర్యేణైవ నివర్త్య గచ్ఛన్తు భవన్తః । (కర్ణముపగమ్య)

భో కణ్ణ! మహత్తరం భిక్ఖం యాచేమి ।

భోః కర్ణ! మహత్తరాం భిక్షాం యాచే ।



(బ్రాహ్మణరూపాన్ని దాల్చిన ఇంద్రుడు ప్రవేశిస్తాడు)

ఇంద్రుడు:
ఓ మేఘాల్లారా! సూర్యుడితోబాటు వెనుతిరిగి వెళ్ళండి మీరూ. (కర్ణుడిని సమీపించి) ఓ కర్ణా! మహత్తరమైన భిక్షను యాచిస్తున్నాను.


కర్ణః:
దృఢం ప్రీతోఽస్మి భగవన్!

యాతః కృతార్థగణనామహమద్య లోకే
రాజేన్ద్రమౌలిమణిరఞ్చితపాదపద్మః ।
విప్రేన్ద్రపాదరజసా తు పవిత్రమౌలిః
కర్ణో భవన్తమహమేష నమస్కరోమి ॥ 16 ॥


కర్ణుడు:
చాలా సంతోషం, స్వామీ!

రాజేంద్రుల కిరీటాలలోని మణుల కాంతిచే ఎరుపెక్కిన పాదాలు కలవాడను, విప్రేంద్రులైన మీ పాదధూళిని శిరస్సున దాల్చి, ఈనాడు, ఈ లోకంలోని ధన్యుల సమూహంలో చేరిన వాడను అయిన నేను – కర్ణుడను – మీకు నమస్కరిస్తున్నాను.


శక్రః:
(ఆత్మగతమ్) కిం ను ఖలు మయా వక్తవ్యం, యది దీర్ఘాయుర్భవేతి వక్ష్యే దీర్ఘాయుర్భవిష్యతి । యది న వక్ష్యే మూఢ ఇతి మాం పరిభవతి । తస్మాదుభయం పరిహృత్యం కిం ను ఖలు వక్ష్యామి । భవతు, దృష్టమ్ ।


ఇంద్రుడు:
(తనలో) ఏమని చెప్పనిప్పుడు? “చిరంజీవ” అని అంటే, దీర్ఘాయుష్మంతుడవుతాడు. అనకపోతే, నన్ను మూర్ఖుడిగా లెక్కగట్టి పరాభవిస్తాడు. కనుక, ఆ రెండూ కాక ఏం చెప్పాలి? ఆఁ, తెలిసింది.


(ప్రకాశమ్)

ఇన్ద్రః:
భో కణ్ణ! సుయ్యే విఅ, చన్దే విఅ, హిమవన్తే విఅ, సాగళే విఅ, చిట్ఠదు దే జసో ।/play]
[play](భోః కర్ణ! సూర్య ఇవ చన్ద్ర ఇవ హిమవాన్ ఇవ సాగర ఇవ తిష్ఠతు తే యశః ।)



ఇంద్రుడు:
(ప్రకాశంగా) ఓ కర్ణా! సూర్యుడివలె, చంద్రుడివలె, హిమవంతుడివలె, సాగరమువలె – స్థిరంగా – ఉండుగాక నీ కీర్తి!


కర్ణః:
భగవన్! కిం న వక్తవ్యం దీర్ఘాయుర్భవేతి । అథవా ఏతదేవ శోభనమ్ । కుతః

ధర్మో హి యత్నైః పురుషేణ సాధ్యో
భుజఙ్గజిహ్వాచపలా నృపశ్రియః ।
తస్మాత్ప్రజాపాలనమాత్రబుద్ధ్యా
హతేషు దేహేషు గుణా ధరన్తే ॥ 17 ॥

భగవన్, కిమిచ్ఛసి । కిమహం దదామి ।


కర్ణుడు:
స్వామీ, ‘దీర్ఘాయువు క’మ్మని అనలేదేమి? పోనీలే, ఇదే బాగున్నది. ఎందుకంటే –

మనుష్యుడు ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని సాధించుకోవాలి. రాచరికపు సంపదలు పాము నాలుకవలె చంచలమైనవి. అందుకే ప్రజాపాలనలో మాత్రమే తన బుద్ధిని మగ్నం చేస్తే, దేహం నశించాక కూడా గుణాలు నిలిచి ఉంటాయి.

స్వామీ, మీకేమి కావాలి? ఏమి ఇవ్వను?


శక్రః:
మహత్తరం భిక్ఖం యాచేమి ।

మహత్తరాం భిక్షాం యాచే ।


ఇంద్రుడు:
మహత్తరమైన భిక్షను అర్థిస్తున్నాను.

కర్ణః:
మహత్తరాం భిక్షాం భవతే ప్రదాస్యే । శ్రూయన్తాం మద్విభవాః ।

గుణవదమృతకల్పక్షీరధారాభివర్షి
ద్విజవర! రుచితం తే తృప్తవత్సానుయాత్రమ్ ।
తరుణమధికమర్థిప్రార్థనీయం పవిత్రం
విహితకనకశృఙ్గం గోసహస్రం దదామి ॥ 18 ॥


కర్ణుడు:
మహత్తరమైన భిక్షను ఇస్తాను. నా వైభవం గురించి వినండి.

ద్విజోత్తమా! మంచి గుణాలతో, అమృతసమంగా ఉండే క్షీరధారలను వర్షించేవి, కాంతిమంతమైనవి, సంతృప్తి చెందిన దూడలచే అనుసరించబడేవి, వయస్సులో ఉన్నవి, అర్థిజనం ఎక్కువగా కోరుకునేవి, పవిత్రమైనవి, కొమ్ములకు బంగారం తాపడం చేయబడ్డవీ అయిన వేయి ఆవులను ఇస్తాను.


శక్రః:
గోసహస్సం త్తి । ముహుత్తఅం ఖిరం పిబామి । ణేచ్ఛామి కణ్ణ! ణేచ్ఛామి ।

గోసహస్రమితి । ముహూర్తకం క్షీరం పిబామి । నేచ్ఛామి కర్ణ! నేచ్ఛామి ।)


ఇంద్రుడు:
వేయి ఆవులా? ముహూర్తకాలం పాలు తాగుతాను. వద్దు కర్ణా, నాకు వద్దు.

కర్ణః:
కిం నేచ్ఛతి భవాన్ । ఇదమపి శ్రూయతామ్ ।

రవితురగసమానం సాధనం రాజలక్ష్మ్యాః
సకలనృపతిమాన్యం మాన్యకామ్బోజజాతమ్ ।
సుగుణమనిలవేగం యుద్ధదృష్టాపదానం
సపది బహు సహస్రం వాజినాం తే దదామి ॥ 19 ॥


కర్ణుడు:
వద్దా మీకు? ఇదీ వినండి –

సూర్యుడి గుఱ్ఱాలకు సమానమైనవి, రాజులకు ఐశ్వర్యాన్ని సాధించిపెట్టేవి, రాజులందరూ మెచ్చుకునేవి, కాంబోజదేశంలో జన్మించినందున గౌరవానికి అర్హమైనవి, మంచి గుణాలు కలిగినవి, వాయువేగం కలిగినవి, యుద్ధానుభవాన్ని గడించినవీ అయిన గుఱ్ఱాలను వేలకొలదిగా వెంటనే మీకు ఇస్తాను.


శక్రః:
అస్స త్తి । ముహుత్తఅం ఆళుహామి । ణేచ్ఛామి కణ్ణ! ణేచ్ఛామి ।

అశ్వ ఇతి । ముహూర్తకమారోహామి । నేచ్ఛామి కర్ణ! నేచ్ఛామి ।)


ఇంద్రుడు:
గుఱ్ఱాలనా? ముహూర్తకాలం వాటిని ఆరోహించగలను. వద్దు కర్ణా, నాకు వద్దు.

కర్ణః:
కిం నేచ్ఛతి భగవాన్ । అన్యదపి శ్రూయతామ్ ।

మదసరితకపోలం షట్పదైః సేవ్యమానం
గిరివరనిచయాభం మేఘగమ్భీరఘోషమ్ ।
సితనఖదశనానాం వారణానామనేకం
రిపుసమరవిమర్దం వృన్దమేతద్ దదామి ॥ 20 ॥


కర్ణుడు:
వద్దా మీకు? మరొకటీ వినండి.

మదజలం నదుల్లా పారే చెక్కిళ్ళతో ఉన్నవి, తుమ్మెదలచే చుట్టుముట్టబడి ఉన్నవి, ఉన్నతపర్వతసమూహాలను పోలి ఉన్నవి, తెల్లని గోళ్ళు, దంతాలూ ఉన్నవి, యుద్ధంలో శత్రువులను సంహరించేవీ అయిన ఈ ఏనుగుల మందను ఇస్తాను.


శక్రః:
గఅ త్తి ముహుత్తఅం ఆళుహామి । ణేచ్ఛామి కణ్ణ! నేచ్ఛామి ।

గజ ఇతి । ముహూర్తకమారోహామి । నేచ్ఛామి కర్ణ! నేచ్ఛామి ।


ఇంద్రుడు:
ఏనుగులా? ముహూర్తకాలం ఆరోహిస్తాను. వద్దు కర్ణా! నాకు వద్దు.

కర్ణః:
కిం నేచ్ఛతి భవాన్ । అన్యదపి శ్రూయతామ్ । అపర్యాప్తం కనకం దదామి ।


కర్ణుడు:
వద్దా మీకు? ఇంకో మాట – అపరిమితమైన బంగారాన్ని ఇస్తాను.

శక్రః:
గహిణఅ గచ్ఛామి ।

గృహీత్వా గచ్ఛామి

కిఞ్చిద్గత్వా

ణేచ్ఛామి కణ్ణ! ణేచ్ఛామి ।

నేచ్ఛామి కర్ణ! నేచ్ఛామి ।


ఇంద్రుడు:
తీసుకొని వెళతాను. (కొంచెం దూరం వెళ్ళి) వద్దు కర్ణా! వద్దు.

కర్ణః:
తేన హి జిత్వా పృథివీం దదామి ।


కర్ణుడు:
అయితే, ఈ భూమిని గెలిచి ఇస్తాను.

శక్రః:
పుహువీయే కిం కరిస్సమ్ ।

పృథివ్యా కిం కరిష్యామి ।


ఇంద్రుడు:
భూమితో ఏం చేసుకుంటాను?

కర్ణః:
తేన హ్యగ్నిష్టోమఫలం దదామి ।


కర్ణుడు:
అయితే, అగ్నిష్టోమయజ్ఞఫలాన్ని ఇస్తాను.

శక్రః:
అగ్నిట్ఠోమఫళేణ కిం కయ్యం ।

అగ్నిష్టోమఫలేన కిం కార్యమ్ ।


ఇంద్రుడు:
అగ్నిష్టోమయజ్ఞఫలంతో ఏం పని?

కర్ణః:
తేన హి మచ్ఛిరో దదామి ।


కర్ణుడు:
అయితే, నా శిరస్సునిస్తాను.

శక్రః:
అవిహా అవిహా

అవిహా అవిహా ।)


ఇంద్రుడు:
అరరే!

కర్ణః:
న భేతవ్యం న భేతవ్యమ్ । ప్రసీదతు భవాన్ । అన్యదపి శ్రూయతామ్ ।

అఙ్గైః సహైవ జనితం మమ దేహరక్షా
దేవాసురైరపి న భేద్యమిదం మహాస్త్రై: ।
దేయం తథాపి కవచం సహ కుణ్డలాభ్యాం
ప్రీత్యా మయా భగవతే రుచితం యది స్యాత్ ॥ 21 ॥


కర్ణుడు:
భయపడవద్దు, భయపడవద్దు. మీరు ప్రసన్నులు కండి. ఇంకో మాట –

మీకు ఇష్టమైతే, నా అవయవాలతోబాటు పుట్టినది, నా దేహానికి రక్ష, దేవాసురులైనా మహాస్త్రాలతో సైతం భేదించలేనిది అయిన ఈ కవచం, కుండలాలతో సహా ఇచ్చేందుకు అర్హమైనది.


(సహర్షమ్ ।)

శక్రః:
దేదు, దేదు ।

దదాతు, దదాతు ।


ఇంద్రుడు:
(సంతోషంగా) ఇవ్వు, ఇవ్వు.


కర్ణః:
ఏష ఏవాస్య కామః । కిం ను ఖల్వనేకకపటబుద్ధేః కృష్ణస్యోపాయః । సోఽపి భవతు । ధిగయుక్తమనుశోచితుమ్ । నాస్తి సంశయః ।



కర్ణుడు:
(తనలో) ఇదీ ఇతడి కోరిక। ఆ జిత్తులమారి కృష్ణుడి పన్నాగమై ఉంటుందా ఇది? అవనీ. ఇప్పుడు విచారించడం నిస్సంశయంగా సిగ్గుచేటు. (పైకి) తీసుకోండి.


కర్ణః:
గృహ్యతామ్ ।


కర్ణుడు:
స్వీకరించండి.

శల్యః:
అఙ్గరాజ! న దాతవ్యం న దాతవ్యమ్ ।


శల్యుడు:
అంగరాజా! ఇవ్వవద్దు, ఇవ్వవద్దు.

కర్ణః:
శల్యరాజ! అలమలం వారయితుమ్ । పశ్య

శిక్షా క్షయం గచ్ఛతి కాలపర్యయాత్
సుబద్ధమూలా నిపతన్తి పాదపాః ।
జలం జలస్థానగతం చ శుష్యతి
హుతం చ దత్తం చ తథైవ తిష్ఠతి ॥ 22 ॥

తస్మాత్ గృహ్యతామ్ । (నికృత్య దదాతి ।)


కర్ణుడు:
శల్యరాజా! అడ్డుకోవద్దు. చూడండి –

కాలం గడిచే కొద్దీ నేర్చుకున్న విద్య నశించిపోతుంది. బలంగా వేళ్ళూని ఉన్న వృక్షాలూ పడిపోతాయి. చెరువుల్లో చేరిన నీరూ ఇంకిపోతుంది. దేవతలకు ఇచ్చిన ఆహుతి, అర్థులకిచ్చిన దానము శాశ్వతంగా ఉండిపోతాయి.

ఇదిగో, స్వీకరించండి (ఒలిచి ఇస్తాడు)


శక్రః:
(గృహీత్వా ఆత్మగతమ్) హన్త గృహీతే ఏతే । పూర్వమేవార్జునవిజయార్థం సర్వదేవైర్యత్ సమర్థితం తదిదానీం మయానుష్టితమ్ । తస్మాదహమప్యైరావతమారుహ్య అర్జునకర్ణయోర్ద్వన్ద్వయుద్ధం పశ్యామి । (నిష్క్రాన్తః ।)


ఇంద్రుడు:
(తీసుకొని, తనలో) హమ్మయ్య! స్వీకరించాను వీటిని. పూర్వం, దేవతలందరూ అర్జునుడి విజయం కోసం చేసి తీరవలసినదని నిశ్చయించిన పనినే చేసానిప్పుడు. ఇక నేను ఐరావతాన్ని అధిరోహించి అర్జునకర్ణుల ద్వంద్వయుద్ధాన్ని చూస్తాను. (వెళ్ళిపోతాడు)

శల్యః:
భో అఙ్గరాజ! వఞ్చితః ఖలు భవాన్ ।


శల్యుడు:
ఓ అంగరాజా! మోసపోయారు మీరు.

కర్ణః:
కేన ।


కర్ణుడు:
ఎవరిచేత?

శల్యః:
శక్రేణ ।


శల్యుడు:
ఇంద్రుడిచేత.


కర్ణః:
న ఖలు । శక్రః ఖలు మయా వఞ్చితః । కుతః,

అనేకయజ్ఞాహుతితర్పితో ద్విజైః
కిరీటవాన్ దానవసఙ్ఘమర్దనః ।
సురద్విపాస్ఫాలనకర్కశాఙ్గులి-
ర్మయా కృతార్థః ఖలు పాకశాసనః ॥ 23 ॥



కర్ణుడు:
కాదు. ఇంద్రుడు కదా నాచేత మోసపోయాడు. ఎలాగంటే –

బ్రాహ్మణులచేత అనేక యజ్ఞాహుతులనందుకొని తృప్తినందుకున్నవాడు, కిరీటాన్ని ధరించినవాడు, దానవసమూహాలను సంహరించినవాడు, ఐరావతాన్ని చరిచి చరిచి చేతివేళ్ళు రాటుతేలినవాడు అయిన ఇంద్రుడి ప్రయోజనం నాచేత నెరవేర్చబడింది.


(ప్రవిశ్య బ్రాహ్మణరూపేణ)

దేవదూతః:
భోః కర్ణ! కవచకుణ్డలగ్రహణాజ్జనితపశ్చాత్తాపేన పురన్దరేణానుగృహీతోఽసి । పాణ్డవేష్వేకపురుషవధార్థమమోఘమస్త్రం విమలా నామ శక్తిరియం ప్రతిగృహ్యతామ్ ।



(బ్రాహ్మణరూపంలో ప్రవేశించి)
దేవదూత:
ఓ కర్ణా! కవచకుండలాలను స్వీకరించడంవల్ల కలిగిన పశ్చాత్తాపంతో ఇంద్రుడు నిన్ను అనుగ్రహించాడు. పాండవులలో ఒకడిని చంపడంలో వమ్ము కాని విమల అస్త్రాన్ని – విమల అనే పేరుగల ఈ శక్తిని – స్వీకరించు.

కర్ణః:
ధిగ్, దత్తస్య న ప్రతిగృహ్ణామి ।


కర్ణుడు:
ఛీ! దానానికి బదులుగా ప్రతిదానాన్ని స్వీకరించను.

దేవదూతః:
నను బ్రాహ్మణవచనాద్ గృహ్యతామ్ ।


దేవదూత:
బ్రాహ్మణుడి మాట మేరకు స్వీకరించవచ్చు.

కర్ణః:
బ్రాహ్మణవచనమితి । న మయాతిక్రాన్తపూర్వమ్ । కదా లభేయ ।


కర్ణుడు:
బ్రాహ్మణుడి మాటా? ఇంతకు ముందెప్పుడూ జవదాటలేదు. ఎప్పుడు లభిస్తుంది?

దేవదూతః:
యదా స్మరసి తదా లభస్వ ।


దేవదూత:
నీవు ఎప్పుడు తలచుకుంటే అప్పుడే లభిస్తుంది.

కర్ణః:
బాఢమ్ । అనుగృహీతోఽస్మి । ప్రతినివర్తతాం భవాన్ ।


కర్ణుడు:
మంచిది. ధన్యుడను. తిరిగివెళ్ళండి మీరు.

దేవదూతః:
బాఢమ్ । (నిష్క్రాన్తః ।)


దేవదూత:
మంచిది. (వెళ్ళిపోతాడు.)


కర్ణః:
శల్యరాజ! యావద్రథమారోహావః ।



కర్ణుడు:
శల్యరాజా! ఇంక రథాన్ని ఎక్కుదాము.


శల్యః:
బాఢమ్!

(రథారోహణం నాటయతః)


శల్యుడు:
అలాగే.

(రథాన్ని ఎక్కినట్లు అభినయిస్తారు)

కర్ణః:
అయే శబ్ద ఇవ శ్రూయతే । కిం ను ఖల్విదమ్ ।

శఙ్ఖధ్వనిః ప్రలయసాగరఘోషతుల్యః
కృష్ణస్య వా న తు భవేత్స తు ఫాల్గునస్య ।
నూనం యుధిష్ఠిరపరాజయకోపితాత్మా
పార్థః కరిష్యతి యథాబలమద్య యుద్ధమ్ ॥ 24 ॥

శల్యరాజ! యత్రాసావర్జునస్తత్రైవ చోద్యతాం మమ రథః ।


కర్ణుడు:
అరే! ఏదో చప్పుడు వినిపిస్తున్నది. ఏమిటది?

ప్రళయకాలసముద్రఘోషకు సమానమైన శంఖధ్వని – కృష్ణుడిదో, అర్జునుడిదో అయి ఉండాలి. యుధిష్ఠిరుడి పరాజయానికి కోపించి అర్జునుడు ఈనాడు తన చేవ మేరకు యుద్ధం చేయనున్నాడు.

శల్యరాజా! ఆ అర్జునుడున్నచోటికే నా రథాన్ని తీసుకెళ్ళు.


శల్యః:
బాఢమ్ ।


శల్యుడు:
అలాగే.

(భరతవాక్యమ్ ।)

సర్వత్ర సమ్పదః సన్తు నశ్యన్తు విపదః సదా ।
రాజా రాజగుణోపేతో భూమిమేకః ప్రశాస్తు నః ॥ 25 ॥


(నిష్క్రాన్తౌ ।)[
కర్ణభారమవసితమ్ ।


(భరతవాక్యం)

అంతటా సంపదలు కలుగుగాక. ఎల్లవేళలా ఆపదలు నశించుగాక. రాజగుణాలను కలిగిన రాజు ఈ భూమినంతటినీ, మనలను పాలించుగాక!

(ఇద్దరూ నిష్క్రమిస్తారు)
కర్ణభారం ముగిసింది.