స్మృతిభానుత్రిశతి

సతీమణి భానుమతి స్మృతిలో

[సతీవియోగదుఃఖంతో సంవత్సరకాలంలో శ్రీశ్యామలానందప్రసాద్‌గారు దాదాపు రోజుకొన్న పద్యం చొప్పున 300కు పైగా పద్యాలను వాట్స్‌ఆప్ వేదికలలో ప్రకటించారు. వాటిలో దొరికిన 259 పద్యాలను శ్రీమతిభానుమతిగారి స్మృతికి నివాళిగా ప్రచురిస్తున్నాము — సం.]

1. పిచ్చి పద్యం (దశాహం)
నలుబదియైదు లెక్కకయినన్ మన పెండ్లికి నేబదేళ్లుగా
కలసియె ప్రేమ స్వర్ణపురి కావ్యము శాస్త్రము సంస్కృతాంధ్ర సం
కలితము లభ్యసించినవి కన్నుల ముందర తోచునిప్పుడున్
జ్వలితములయ్యె నేటి కిట స్వర్గపురిన్ బెజవాడలో సతీ!

2. పచ్చి పద్యం
తానొక వాగుగా మగువ తానొక రాయి మగండు నైరి ఆ
సానిగ కాక రాయివయి సాగరు చేరక కృష్ణనుంటివా
నేనిట వాగునై దినము నీకయి కృష్ణను మున్గమందువా
నేనును రాయినై పడెద నిప్పులు పుట్టెడి కాపురంబుగా
(శిలోద్వాసము 15/8/25)

3. వీడుకోలు పద్యం
ఒకగది, చాపకాపురము, నున్నవి లేనివి నైననాళ్ళు, పే
రుకు గలమేష్టరీగిరికి రూకల నిచ్చిన నీయకున్న స
ద్దుకొనుచు కొండబిడ్డ పతితో వలె చేసితి క్రొత్తకాపురం
బిక నటులే శ్రమంపడుచు నేగుమ షోడశివై సుమంగళీ!

4. అత్తా కోడళ్ళ పద్యం
శ్రీ విశ్వావసునామ వత్సరమునన్ జేరన్ వసుస్థాన మౌ
రా! వచ్చున్వసువత్తదామెకగు రౌద్రంబంచు ముత్తైదువై
నీ వేగందగునే ఇటన్ పసిండికొనలేనే అప్పొ సప్పైన ని
ట్లే వందేండ్లు వసుప్రకాశమున గౌరీలోక మందుండుమీ!

5. దాసపద్యం
నీవన్నట్టులె మంగళాద్రి గృహమున్నిర్మాణముం జేసితిన్
నీవన్నట్టులె సర్వ రక్షణలునీ నిర్భీతికై చేసితిన్
నీవన్నట్టులె దృశ్యవీక్షణికలన్నిన్నెప్పుడున్ చూచుచు
న్నా వేగంబుగ మాయమైతివి సతీ!నా కర్మవై కాలితే

6. పుల్లవిరుపు పద్యం
గణముల్ ప్రాసయతుల్ సమాసముల వంకల్లేక యిన్నాళ్ళు ధో
రణి ధైర్యమ్మును ధారణాధిషణలన్ రాణించె నాకైత కా
రణమీవై వగఁ బుట్టుకైత నవి జారంజొచ్చె నంచున్ సుధీ
గణముల్ నవ్వెడునట్లు చేసితివి నీకై యేడ్చు పుణ్యానకున్

7. నువ్వుల పద్యం
నవ్వులు నువ్వులైనవను నానుడి ప్రాసయొ శబ్ద వృత్తియో
ఎవ్వరికైన నాకు నటులే అనిపించిన దింతదాక నీ
నువ్వుల లోన రాయివయి నూతన రూపము నీవు దాల్ప నీ
నవ్వులు గంటి నువ్వులను నా చదువిట్టుల చట్టుబండలై

8. యాత్రాపద్యం
శ్రీ నరసింహసంస్మరణ చేత భటుల్ కడు గారవంబుగా
ఏ నగరాననైన నిను హింసలుపెట్టక వెంటసాగగా
మానిని! అన్నపానములు మాసికముల్ పదియారు గూర్తు మా
పైని అపర్ణలోకము శుభంబుగ చేరుదువే సుమంగళీ!

9. పిచ్చి పద్యం – 2
ఇద్దరు మేనమామలును ఈగతి పోయిన పోల్కి నీకునై
ఇద్దరు మేనమామలకు ఇంతులు పోయిన పోల్కి నాకునై
పెద్దల మాట నిక్కమనిపించినదిప్పటికేమిచేసినన్
దిద్దగ రాని వ్రాతకు మదిన్ సరిపెట్టుటయే సువాసినీ!

10. పిచ్చి పద్యం – 3
శ్రవణద్వాదశి మంగళాద్రి నుపవాసైకాదశీదీక్షతో
నవిరామంబుగ నారసింహజపజిహ్వాఘోషయార్తారవం
బవుచుండంగసుమంగళీమణిగప్రహ్లాదోత్కృతిన్ దివ్యగా
త్రివి భానూదయవేళ నేగితివి గౌరీలోకవైకుంఠముల్

11. నిమజ్జనపద్యం
పెదకళ్ళేపలి నస్థికల్ కలుపుచో విన్పింతు సందేశమి
య్యది నాగేశ్వర హంస భావనముగా స్వార్థమ్ము తీర్థమ్ముగా
మది రవ్వంతగ చిక్కబట్టుకొని సంభావింతు శ్రీ విశ్వ(నాథ)శా
రద నీ హంసలదీవి ద్వారమున భార్యాశల్యసాకల్యుడన్
‘నాథ’ ఛందోగూఢము

12. ప్రశ్నపద్యం
యాన్యస్మాకపు తైత్తిరీయ వచనవ్యావృత్తిలో రెంటిలో
గణ్యంబా సుచరిత్రమా? ఇతరమా? కాకున్న నీ శిష్యుడున్
మాన్యంబౌ త్రిశతిన్ బొనర్ప కవిసమ్రాడ్వ్యూహమా? నేడునా
పుణ్యంబిట్టుల పుచ్చిపోయె గురువా! పూరింపుమా శేషమున్

13. ఆలాపనపద్యం
ఇది తెండింటికి వేగరండనుచు నీవెన్నెన్నొ సందేశముల్
పొదియౌ నీ చరవాణి మూగదయి నా ముందున్నదే మ్రోగున
న్నది యాలాపనయై సదాశయయి యైనన్ దాని మేల్కొల్పి యుం
చెద సోదమ్మిగ నిన్ను పిల్చునను పిచ్చిన్ నిన్ను రానిత్తురా?
(24/8/2025)

14. పంపిణీ పద్యం
పోసిన పానకాల సగమున్ వెలిగ్రెక్కెడు సామి వంచు నా
యాసముతో స్మరించుసతి ప్రాణములైదును ధారవోయ ను
ల్లాసముగా గ్రహించి మరలన్ సగమైనను వెన్కకీవు స్వా
మీ! సగమైతి నీ యొసగుడే ఇదియా!? ఇదియేమి పంపిణీ?
(25/8/2025)

15. విస్ఫోటపద్యం
ధారణ తగ్గుచున్నదిక దాటెడి ప్రాయము నందటంచు కం
గారుగ యోగసాధనలకై పరుగెత్తుట కోర్వలేక ఈ
దారిని చూపితే తరుణి! త్రవ్వినకొద్దియు జ్ఞాపకమ్ములై
ధారణ బ్రద్దలైనది కదా! యనలాద్రిగ అగ్గివాగులన్
(26/8/2025)

16. చవితిపద్యం (వ్యాకరణం గోల)
నీవును నింగికేగితివి నింగికి నేలకు చాతురర్థికం
బైవెలుగున్ చతుర్థియు గణాధిప మిద్ది ఖగోళగాధ రా
గావిలమాదిసూత్రముగ నంతము బైల్వకమైన లుక్కు వి
శ్వావసువిట్టులైనది ద్విపాస్యకృపాప్తి సవర్ణదీర్ఘమై
(27/8/2025)

17. తారలపద్యం
నాకు విపత్తు తారవయి నన్ను విపత్తులనుండి కావగా
నీకును మిత్రతారనయి నెయ్యమునన్ నినుగావనైతినౌ
లే! కలికాలజాతకపులెక్కలు తిక్కిరిబిక్కిరేమొ గౌ
రీకృప నామె సన్నిధిచరిష్ణువువై వినుమా సుమంగళీ!
(28/8/2025)

18. తిలాక్షరపద్యం
నావలె నీకునున్ నరసినన్ తలమొత్తము తండులస్థితిన్
జీవిక సాగియుండెడిదొ?చేకొనుటన్ తిలతండులప్రభా
వావృతి నిట్లుపోయితివొ? ఆ తిలతండుల తర్పణమ్ములే
నీవయిపోయెనేమొ తరుణీ! అనుమాన ప్రమాణ పద్ధతిన్

19. అతిథిపద్యం
అదె ఏకాదశి వచ్చుచున్నదుపవాసాచారమున్ వీడ వె
య్యది భక్షింపవు రెండుమూడరటి పండ్లైనన్ దురాచారుడన్
మది గుర్తుండిన తెచ్చినన్ తినెదవామార్గాననే స్వామి స
న్నిధికింజేరితి విప్పుడా తిథికి స్పందింతున్ భయభ్రాంతులన్
(30/8/2025)

20. గణితపద్యం
ఆరాగస్టు పదారునన్ చనిన గేహంబున్ హఠాత్త్యాగమై
ఆరాగస్టున నిర్వదైదు విడుటత్యాశ్చర్యమౌ గేహినీ!
ఔరా!శ్రావణశుక్లపంచమియు దివ్యైకాదశీద్వాదశుల్
చేరన్ తొమ్మిదియేండ్ల వార యగుచున్ శ్రీమంగళాద్రీశ్వరున్
(31/8/2025)

21. పండుగపద్యం
ఎవ్వరు రారు పండుగల కింతటికొంపకు చాకిరీ యటం
చెవ్వరిగూర్చి దెప్పెదవొ ఎల్లరు వచ్చిరి పెద్దపండుగై
నవ్వుచు పల్కరించుచు కనంబడవీ పదినాళ్ళుచాటుగా
నొవ్వకచూచుచుంటివొ నినుం గననీరిక చూడుమెల్లరన్
(1/9/2025)

22. అద్విజపద్యం
అజునకు నిట్లె ఇందుమతి అచ్చరగా మటుమాయమయ్యె నీ
ద్విజునకు నట్లె భానుమతి వ్రేల్మిడి నేగెను మంగళాద్రికిన్
ఋజువులు పెక్కులున్నవి సరే!అతడెన్మిది యేడులేడ్చిపో
యె జరుగునా?అదే యిచటనేమొ?నృసింహుని చిత్తమో సతీ!
(2/9/2025)

23. చిత్రపద్యం
కణ్వసగోత్రజాతవయి కాశ్యపగోత్రవధూత్వమందినా
వణ్వవధిన్ శకుంతల హిమాలయమేగిన యట్టులేగితే
స్థాణ్వవతారమంది సతి దగ్ధముకాగ తపంబొనర్పనా?
కృణ్వవధానినౌచు లిఖియింతునొ? పెక్కు మనస్కృతాకృతుల్
(కృణువు=చిత్రకార జాతి, 3/9/2025)

24. జోగిపద్యం
సౌమంగల్యము నిత్యమౌటకయి నే సంన్యాసముంబుచ్చుకో
వ్యామోహంబుల వీలుకాదనుచు నీ వాయాసముంబొందకే
శ్రీమన్మంగళశైలు సోదరిగ గౌరీలోకముంజేరగా
నే మాత్రంబిక జోగినై తిరుగుటన్ నీవాపగా లేవుగా
(4/9/2025)

25. ఒౙ్జపద్యం
సరిగా నేబదియేండ్ల క్రిందట కళాశాలన్ మహాభక్తితో
జరుపంగా గురుపూజ నేటితిథినా సందర్భమందేను గీ
తి రచింపన్ గురుదేవవందనము ప్రీతిన్ వించు మర్నాడు తొం
దరతో నిచ్చితి ప్రేమలేఖ నిపుడున్నావెచ్చటో నింగిలో
(ఆ పాట పల్లవి: గురుదేవుల పాదాలకు వందనం, ఇరుల నణచు దీపాలకు వందనం 5/9/2025)

26. అంగుష్ఠపద్యం
శుక్ల ద్వాదశి నాడు *వామనతనుస్ఫూర్తిన్ బలిన్నేనుగా
వైక్లబ్యాన నధోజగత్తునకు బోవంద్రోసి పైకేగితే
ఈ క్లప్తిన్ నరసింహసంస్మరణ తా నిట్లీవరంబిచ్చెనో
శుక్ల ద్వాదశి మాసికాబ్దికములై శోకప్రసాదంబుగన్
(*సూక్ష్మశరీరము 6/9/2025)

27. విధురనీతిపద్యం
తక్కిన రెండు వెల్గుటకు దారిని చూపెడి గార్హపత్యమున్
చక్కగ వెంటబెట్టుకొని సాగితి విక్కడ నాకు సున్నయై
అక్కడ నీకు తోడగుచు నా ప్రవరుంబలె గాచుగాక నా
యక్కర తీర్చికొందు విధురాగ్నిని వ్రేల్చుచు నా పితాళ్ళకున్
(6/9/2025)

28. గ్రహణపద్యం
ఉపరాగంబు మనః ప్రభుండు శశికయ్యున్ పూర్ణ ముత్తీర్ణుడై
విపులాకారుడు రాగ కాంతులను విన్వీధిన్ ప్రకాశించెగా
జపముల్ పెక్కు పొనర్చి పట్టు విడుపుల్ స్నానంబులన్జేసినన్
కృపణంబీ గ్రహణంబు వీడదెడదన్ సీమంతినీ!మంత్రిణీ!
(8/9/2025)

29. యాతనా పద్యం
తీసుకపోమదేమియని తీసుకతీసుక పోవుచుంద్రనా
యాసముగా నృసింహు స్మరణాంచితదీక్షితమైన సాధనా
భ్యాసమదొక్కటే మరణయాతనగా చనుటన్ సుమంగళీ!
నీ సుఖయాత్రసాగు నట నిన్నెవరున్ భయపెట్టబోరులే
(9/9/2025)

30. తాళంచెవి పద్యం
నీవున్నప్పుడు చూచినా ననను గానీ నీవు లేవన్నచో
జీవాఘాతము నీరసించె నెద రాశీభూతదుఃఖమ్ముగా
గ్రావంబంతటి నేను నొక్కపరి యౌరా! గుల్కరాయైతినే
ఈ వాల్లభ్యరహస్యకుంచికనహో! కృష్ణానదిన్ వైచితే
(10/9/2025)

31. అరుణ పద్యం
లక్షితమైన శాస్త్రగతులన్ తొలిమాసికమైన తోడ త్రై
పక్షికమాచరించుటను భానవసౌరిపురంబుదాటుచో
రక్షణకోసమై అరుణప్రశ్న పఠించుట భానుసత్కృపన్
దక్షత దాటిపోగలవు ధైర్యముగా నికపై సువాసినీ!
(11/9/2025)

32. కురుక్షేత్రపద్యం
ఆకాశాన విమానయానమున మున్నాశింతు పైనున్న వా
రై కన్పించెద రమ్మనాన్నయని ఇప్డాత్రోవ నీ కోసమ
ట్లే కన్గొంటిని కానవచ్చితివి మున్నెక్కించుటన్ తోడుగా
నీకై ప్రక్కన చోటునుంచిరచటన్ నీవుంటివందున్ సతీ!
(12/9/2025)

33. అద్వైత పద్యం
అవునేమో భవభూతిగారనిన యా అద్వైతపద్యంబులో
ఎవరో యొక్కరె చెప్పినట్టివివి యన్నీపొందనౌనన్నదే
వివరంబైనటు తోచుచున్నదిపుడీ విశ్లేషణస్థాయిలో
కవిచాతుర్యము ఏక శబ్దగతమై కన్పట్టుచుండెన్ సతీ!
(13/9/2025)

34. పలకరింపు పద్యం
తల కొట్టేసిన యట్టులున్నది అదో దారిన్ ననున్ చూచుచున్
నిలువెల్లన్ పెనుజాలిగా మొగములున్ నిస్తేజముల్గా నయో!
అలవింగానిది వచ్చె వంత ముది నన్యాయమ్ము మీకన్న యా
పలుకున్ముల్కులు చప్పరింతలు వినన్ పంపింతు నీకున్ సతీ!
(14/9/2025)

35. తడక పద్యం
కొందరు వాస్తుదోషమని కొందరు దొంగలుపడ్డ యిల్లుగా
కొందరు దిష్టికొట్టెనన కొందరు మందుని ఏలినాటి దె
బ్బందురుపోషముండుటయె అంతకు కారణమందురక్కటా!
అందరికిప్డె తోచె నవురా!మును చెప్పరుగా సుమంగళీ!
(15/9/2025)

36. తగాదా పద్యం
వెదకుచునుంటి తప్పులను వెళ్ళినదానవు గౌరిలోకమం
దొదిగినదానవేడిచిన నూసులరాసులు కొట్టిపోసినన్
కదలవు గాన నెయ్యెదొ తగాదను పెట్టెద నాగవల్లిలో
కదలగ నప్పగింతలకు కల్పితమౌ కలహమ్ము వోలికన్
(16/9/2025)

37. దారపద్యం
పితృకృతదారయంచు కడుప్రేముడి చూచెదనన్న రాముడా
యతకృతి సీతఁ గెల్చినపు డాయనయున్దలయూపెనంతె మ
త్పిత మనయింట చేయుదము పెండిలి చక్కగనంచు చేసె చూ
చితి కడు శ్రద్ధ వృద్ధతను సేమముగా నిను చూచు నచ్చటన్
(17/9/2025)

38. దాలిగుంట పద్యం
బ్రతుకు లశాశ్వతంబులను భావన సర్వము శూన్యమే యటం
చతుకులు తెంచుకోవలయు నంచనిపించుట నాటినాటికన్
ముతకదనంబు పల్చబడి పోవుచు నల్గురిలోనికేగి నా
ప్రతిభను చాట దాలిగల శ్వానమునై విదిలించెదన్ సతీ!
(18/9/2025)

39. గయ్యాళి పద్యం
కలదానిన్ సరిపెట్టు బింకమునకై గయ్యాళిగంపంచు పి
ల్లలచే మాటలు పడ్డ నీవటుల నేలా చేసితో వారి పి
ల్లలతో వేగెడి వారికిందెలిసి చాలా నిన్నుమెచ్చంగ న
వ్వులుచిందించెడిదానవిప్పుడె ఇటుల్ పోనేలనే గేహినీ!
(19/9/2025)

40. చచ్చిన పద్యం
(మయైవేతే నిహతా పూర్వమేవ భ. గీ.11.33)
చచ్చినవాడ నీ కనుల చచ్చినలోకము చూచుచుంటినన్
పిచ్చి నసాళమంటినది వీడునొ వీడదొ పైకి చెప్ప నీ
పిచ్చికి మందులేదనుచు పిల్తురొ పిల్వరొ నన్ను గీతయే
వచ్చినయట్టులున్నదని స్వాగతమిచ్చెదరో? సుమంగళీ!
(20/9/2025)

41. ౘదలు పద్యం
చెదలకు మందుచల్లు పని చెప్పితి వెన్నియొ మారు లెందుకో
కుదురని దింత కాలమునకున్ కుదిరెన్ నలుమూలమూలలన్
వదలక చల్లిపోయిరిక వత్తువొ యన్నది వెఱ్ఱియూహ ఆ
ౘదలునకేగియున్ చెదలసంగతి చూచితివౌర! గేహినీ!
(21/9/2025)

42. కేళీ పద్యం
మానసికావృతిన్ దలప మా దెసకెట్టులు రావుగాన న
ద్దాన న వర్ణలోపమున తప్పక వచ్చెడునట్లుచేసెదన్
దేనికినైన నక్షరమె తీర్పును చెప్పును వర్ణలోపకే
ళీనవయుక్తి గెల్చెదములే నిను చూతుములే సుమంగళీ!
(22/9/2025)

43. ఒంటరి పద్యం
గౌరీలోక వికుంఠలోకములలో కాకైన లేకుండగా
వారెల్లన్ నవరాత్ర పర్వములిటన్ బ్రహ్మోత్సవాలంచునున్
చేరన్భూమికి నిన్ను దెచ్చిరొ సతీ! నీవొక్కతై ఉంటివో?
ధీరత్వంబున నుండగా గలవుగా నీ తీరట్టిదే గేహినీ!
(23/9/2025)

44. శోభనాద్రి పద్యం
చేరితి మంగళాద్రి నరసింహు స్మరించుచు శ్రావణంబులో
చేరెద శోభనాద్రి నరసింహుకు చెప్పగ నాల్గు బాసలన్
వారల క్రొత్తలీల పసిబాలుడు తండ్రియెకాక యాల్మగల్
దూరముకాగ భక్తుల కిదో? ఉపదేశము కల్లసింగమా!
(24/9/2025)

45. అంకిత పద్యం
నీవు నృసింహ సంస్మరణ నింగికి చేరుట మెచ్చుకొన్న ఆ
దేవుడు శోభనాద్రిని పతివ్రత భర్తగ నన్ను గావ నా
చే వినిపించె పద్యములు చిత్తము నిల్వగ నాల్గు బాసలం
దావిడ కంకితమ్మిడుమురా యని గర్జనతోడ గేహినీ!
(25/9/2025)

46. శంకాపద్యం
నీకసలేమి కాదనుచు నేనును నాకునటంచు నీవునం
చూకను దంపుకొంటిమయయో! అతి స్నేహము పాప శంకియన్
వాకునుబట్టి ఎన్నడును పాపపు శంకయె రాదటన్నచో
పైకటు తోచు స్నేహమొ? అపప్రతిపాదన కాళిదాసుదో?
(26/9/2025)

47. తంతు పద్యం
ఆ నడురేయి మూరుతమునందు పురోహితుడేమి పల్కెనో
గాని వినంగ లేనయితిగా మమ జీవన హేతు ఒక్కటే
గాని అటే పొనర్చితివిగా ఇరుమారులు ఆయువిచ్చి ఆ
పైనిది చెప్పలేదొ మగువా! శరదాం శత మన్నదయ్యయో!
(27/9/2025)

48. తథ్య పద్యం
కన్యాదానములైదు కానుపులలెక్కంజూడగా నేడు నే
దైన్యంబొందక కన్నవారరుదు నీ స్థైర్యంబు నీనాటి లో
కన్యాయమ్మునుమించి ధైర్యముగ నిష్కంపమ్ముగా చేయుటన్
ధన్యత్వంబున గౌరిలోకమొదవెన్ తథ్యంబుగా గేహినీ!
(28/9/2025)

49. మూల పద్యం
మూలపుటమ్మ జేరుటకు మూలయె తారల మంచిదంచునో
మూలను మట్టిమేన్విడిచి ముచ్చటగా వెలుగై తటాలునన్
నేలనువీడి యేగితివి నింగికి నీ దసరాలనుండియున్
మూల సరస్వతిన్ దెలుపు మూలయె గుండియచీల్చు గేహినీ!
(29/9/2025)

50. దుర్గ పద్యం
ఎన్నో యేండ్లుగ నింద్రకీలగిరిపైకేకాకిగా కాల్నడన్
నిన్నుంజూడగ నింటినుండి దసరాల్ నిత్యంబునున్ వచ్చెగా
నిన్నే నమ్మిన భక్తురాలి పయినన్ నీకెంత వాత్సల్యమే
మిన్నెక్కించితివే సుమంగళిగ పేర్మిన్ స్వర్ణదుర్గాంబికా!
(30/9/2025)

51. మహర్నవమి పద్యం
అన్ని మహస్సులున్ కలసినట్టి మహర్నవమిప్రభాసమా
సన్నమహోగణంబుల ప్రసన్నత నిన్నును చేర్చుకొంటకై
మున్నె నృసింహు డక్కకొక ముక్కను తప్పక చెప్పియుండు నీ
వెన్నియొ మార్లు వాని స్మరియించుచు నేగితి గాన గేహినీ!
(1/10/2025)

52. కొరివి పద్యం
తలకుంబెట్టితి చేతులార కొరివంతన్ రెచ్చిమండంగ నే
చలనం బింతయు లేక చూచితిని మోక్షంబై కపాలానకున్
నిలువెల్లన్ పెనుబూది సంచయనమై నీ యెమ్ము లేనేరితిన్
కలయట్లే కనిపింతువెల్లెడల నింకన్ నిక్కమౌనా?! సతీ!
(3/10/2025)

53. యోగ పద్యం
మంచము పట్టలేదు పెనుమందులు మాకులు మింగలేదు ఆ
కొంచెముసేపు యాతనను కూడ నృసింహు స్మరించియుంట రా
యంచగ జీవుడేగుటయు నాపయికర్మల నవ్వుతోడ క
న్పించెదు సీ వి వీగురుని ప్రేయరునందున నో సుమంగళీ!
(5/10/2025)

54. కాన్పుల పద్యం
కాన్పునుకాన్పు క్రొత్త పుటుకై పలుపుట్టుక లందినావుగా
మున్పటికన్న ఓపికయు మోస్తరుగా దిగజారుచుండుటన్
మన్పును గౌరిలోకమున మాతృగణంబు మనోహరంబుగా
కన్పడకున్న మాకిట సుఖంబుగ నుండుమటే సుమంగళీ!
(6/10/2025)

55. దొంగ పద్యం
దొంగల కెల్ల నాయకునితో నరసింహుడు కూడియుంటనో
దొంగతనాలకిష్టపడి దొంగల కొందరి పంపి మచ్చుగా
ముంగిట బండి వెండియును పోవుటచూపి తనంతతానుగా
చెంగున వచ్చి యొంటరిని చేసి నినున్ హరియించె గేహినీ!
(6/10/2025)

56. మామిడిపద్యం
ఇది నే పాతిన మావిమొక్కయనగా నేడెన్మిదేండ్లాయె పిం
దె దిగంబోవదు కొట్టివైతునన నే తిన్నాకనే పోదు న
న్నది తా విన్నదొ కొన్ని కాసినది అంతా పచ్చడింబెట్టి యి
చ్చెద నమ్మాయిలకంచు నిచ్చి చనుటే చిత్రంబగున్ గేహినీ!
(7/10/2025)

57. తద్దినపద్యం
నేడిట నట్లతద్దె మును నీవు నెరుంగుదు వత్తగారు నా
వేడుక గోరిటాకు నిసి పెట్టుక నద్దమరేయి నొప్పితో
వీడెను మేను తద్దినము పెట్టగ నగ్గి నొసంగు నీవునున్
వీడితి వట్లె యిప్పుడెటు పెట్టెద నైదువలార!చెప్పరే!
(9/10/2025)

58. స్త్రీవాద పద్యం
చేసినదేదియో తినుడు (ము) చేసినదానికి వంకపెట్టినన్
రోసము వచ్చు నాకు నెవరున్ పొరపాటులు చేయకుందురే
వేసిన ఉప్పుకారములవే వెనుదీయగ లేనటన్న నీ
బాసయె యొంటబట్టె నిక పల్కనెటన్ తినబోయి గేహినీ!
(11/10/2025)

59. ఋషి పద్యం
ఋషి కాకుండ కవిత్వ మబ్బదనగా నే మీసముంద్రిప్పితిన్
ఋషి నైనానని పిచ్చి పద్యములకే ఈనాటి నీ పోకతో
ఋషి నే కానని అర్థమైనది మహర్షిశ్రేణి గార్హస్థ్యసం
తుషితుల్ లేరు వియుక్తులెవ్వరును సూక్తుల్ కల్లలా? గేహినీ!
(12/10/2025)

60. ప్రమాణపద్యం
అతిచరితవ్యవై యరిగి నప్పుడు నే నతిచారజీవినై
బ్రతుకక యెట్లుగా కుదురు బాసను తప్పుటగా తలంతువే
ప్రతిదియు చెప్పిచేసెదను స్పష్టత నర్థము కామమైనచో
గతియెటులౌను ధర్మగమకంబున నొంటరినై సువాసినీ!
(13/10/2025)

61. ౙడదారిపద్యం
చెలగి పెటాకులై చనిన చేడియలుండ్రి నృదేవకాంతలం
దలిగి విడాకులై చనినయట్టిరు నుండ్రి నృదేవకాంతలన్
నలిగి రుజాదులన్చనిన నాతుక లుండ్రి నృదేవకాంతలన్
తెలిసి యివేమి కాక చనితే ౙడదారులదారి గేహినీ!
(14/10/2025)

62. మధుపద్యం
నాయకుడున్ వియోగమున నాయికకై మధుసేవ చేయుచున్
గేయములాలపింపు వినికిన్ ననునీ మధుమేహసేవలో
గాయముకామి చూచుకొనగా పయిలోకమునుండిగాంచుచున్
శ్రేయముగూర్పుమంచు చెవిఁజెప్పుమ మాతకు నో సుమంగళీ!
(15/10/2025)

63. మాయ పద్యం
ఈ యేకాదశి విష్ణుమాయయగు నిన్నిల్లాలుగా దెచ్చె తా
నే యింటిన్ పుడమిన్ వెడల్చె నిను నీ వేకాదశీదీక్షలో
నే యాటంకము లేకయుండినను పాహీ! నారసింహా!యటం
చాయాసమ్మున కేక పెట్టినను శోకైకాదశిన్ చేసెనే
(16/10/2025)

64. వెఱ్ఱి పద్యం
ఉందునొ పోదునో అనుట ఊతపదమ్ముగ నేవొ తెమ్మనన్
తొందరలేదులే పదిపదుల్ నను నిల్పును నీదు తాళి త
త్కంథరవౌట నుందువుగదా! ఎటకేగవు నీవటంచు నే
నందును నీ వివేకము రవంతయెఱుంగని వెఱ్ఱినై సతీ!
(17/10/2025)

65. దారేషణపద్యం
అమ్మయు నాన్నయున్ చనినయప్పుడు నిశ్చితబుద్ధి వృద్ధతల్
క్రమ్మిన దుఃఖపుం దెరపి కారణభూతము లయ్యెనేమొ నీ
విమ్మెయి రొష్టురోగము లవేమియులేమిని నాకుతోడుగా
నెమ్మి చరించుచున్ చిటికె నింగికి నేగుట నోర్వ గేహినీ!
(18/10/2025)

66. గుబులు పద్యం
ప్రస్థానత్రయమున్ పఠించితిని పల్ వ్యాసాల్ ప్రవాచంబు లా
యాస్థానంబుల ప్రస్తరించితి బళీ అన్పించుకొంటిన్ మహా
ప్రస్థానాఖ్య సుపర్వ పర్వమును సుస్పష్టంబుగా చూచితిన్
స్వస్థన్ నిన్ను దలంచు నా గుబులు పోవంబోదహో గేహినీ!
(19/10/2025)

67. రెండు నాలుకల పద్యం
సప్తతిపూర్తి సున్న మును షష్టికినుంటివి వేడ్కగంటివిన్
సప్తపదిన్ వినండొ హరి? సాక్షిగ నుండిన సప్త జిహ్వుడున్
లుప్త నొనర్చినారలు నినున్ తెగమ్రొక్కుటచేత త్రెంచిరో
శప్తుడనైతి నాలుక లసంఖ్యము లిర్వురికిన్ సుమంగళీ!
(23/10/2025)

68. నల్లబల్ల పద్యం
నీవొక నల్లబల్లవయి నిల్వగ మేష్టరు బుద్ధిపోక నే
నేవియొ పిచ్చి వ్రాతలవి ఎవ్వరు వెన్కను చూచుచుండిరో?
వావిరి నేనె వాగికొనువాడుగ వ్రాయుచు నుందు చట్టులున్
మ్రోవని గంట ఎప్పటికి మ్రోయునటంచును చూడ గేహినీ!
(21/10/2025)

69. దివ్వెల పద్యం
అసలొకదివ్వె యుండినకదా!పది వెల్గుట పండగౌటయున్
విసవిస కొండకెక్క నిలు వెల్వెలపోయెను చిమ్మచీకటిన్
బుసబుసలేవొ విన్పడునుపో అయియుండును మిత్తిపామువే
మసనము చూచివచ్చితి సుమా! వెరపేటికి?ఇంటిదీపమా!
(20/10/2025)

70. తెగింపు పద్యం
ఎవరిని గూర్చి ఏమనిన నేమనుకొందురొ మాటవచ్చునో
కవిలెలు విప్పనేలయని కైతలు పూతమెరుంగు లట్లుగా
నెవియెవియో లిఖించితిన యిప్పటికిట్లు తెగింపుతెచ్చితో
యువిద! భయంబు పోయెననుకున్నది చెప్పగనైతి గేహినీ!
(24/10/2025)

71. తుమ్మి పద్యం
క్రిందటి కార్తికమ్మె కద రెక్కలు విప్పిన హంస బృందమై
క్రిందటి కార్తికమ్మె కద రేకులు విప్పిన తుమ్మి పూవులై
క్రిందటి కార్తికమ్మె శివుక్షేత్రములన్ పదకొండు కోనసీ
మందున రామలింగని దయన్ కనుగొంటిమి ధన్యవే సతీ!
(25/10/2025)

72. విశాఖపద్యం
నాకు నియోగమిచ్చితివి నాకడ గొంటివి వైదికత్వమున్
చేకొని యప్పులేన్గడుగ నిప్పులు గడ్గుట నీవునేర్వగా
లోకము మెచ్చునట్లుగ గురుల్ హితపాళికి నచ్చునట్లుగా
సాకిరివౌచు దంపతికి చాకిరితో దివికేగితే సతీ!
(26/10/2025)

73. ఆంగ్లపద్యం
నేనాంగ్లమ్మున నాపకుండ పలుకన్ నీచేయి వెన్వెంటనే
నానొస్టన్ తగిలించి అయ్యొ జ్వరమింతా అంత కాదందువే
ఈ నీ పోకను పిచ్చివాగుడుకు లేదే వేఁకి ఏ కారణం
బో నన్నెవ్వరు బాగుచేసెదరు సంపూర్ణమ్ముగా గేహినీ!
(27/10/2025)

74. ఉపాదానపద్యం
మేను నశింప కారణనిమిత్తత చెల్లదుకాన తానుపా
దానము కారణంబగుగదా యని చెప్పెను వేదశాస్త్రముల్
నేననుభూతి నా నుడుల నిక్కమటంచువచింపగా *నుపా
దానము* కారణంబయిన కారణమైతివిగా సుమంగళీ!
(28/10/2025)

75. పరోక్ష పద్యం
దేవతలా? పరోక్షప్రియధీకులు మానవు డట్టులెట్లు? తా
నేవయినన్ కనంబడెడివే తన వంచు తలంచు లేనిచో
లేవని ఏడ్చు మేము నటులే అయియుంటిమి నీవు నింగిలో
దేవతవౌట పిల్లలకు దీవెన లిచ్చుచు నుండుమా సతీ!
(29/10/2025)

76. మెట్ట పద్యం
ఈ వేదాంత మిదెన్ని గ్రంథములనేనీ దుఃఖ వారాశి వీ
చీవిన్యాసగుణంబు మార్చగలదా తత్ జ్ఞాపకానీక ధా
రావైరళ్య పదంబు చేర్చగలదా ప్రాస్తావి కానేక గా
ధావాచాలసమష్టి తీర్చినను చిత్రశ్రవ్యవాగ్ధిన్ సతీ!
(30/10/2025)

77. లంకణం పద్యం
రెండును ఆత్మ ద్రవ్య గుణరీతులె మృత్యువు శోకమైనచో
నుండవె తోడుతోడుగ నహో! పరిహార్యమె శోకమెట్లురా
కుండు ననర్హుడెట్లగుదు నొక్కడు నుండునె యట్టివాడు కృ
ష్ణుండిది పెట్టె చావునకు నొక్కిన లంకణ మౌటకున్ సతీ!
(31/10/2025)

78. చిలుకు పద్యం
పాల్కడలెక్కడో కనము ద్వాదశి శుక్లము కార్తికంబునన్
చిల్కిన యానవాలనుచు చేసెడు పండుగ వోలె నీదు పో
కల్కదిలించు ద్వాదశిని కాసిని నీళ్ళును ముద్ద నిత్త్రు పి
ల్లల్కొనసాగుమా నడకలన్ క్షుధ తృష్ణలులేక గేహినీ!
(2/11/025)

79. ఇదేమి పద్యం
అమెరిక నాస్టినందు జపమందున తోచిన దెందుచేతనో
కొమరుని చేత కొన్ని చితుకుల్ గయికొంటిని దేనికన్న ?హో
మము జరిపింప నీకనగ మాసము లోపల నిట్టులయ్యె న
మ్ముమ యదె కొర్విపెట్టితినిమూలపుటమ్మ మదేమొ?గేహినీ!
(3/11/2025)

80. దర్శపద్యం
నలుబదినాల్గుపున్నమలు నాలుగు కన్నుల కార్తికంబులో
వెలుగులు చిమ్మ చూచితిమి విశ్వవసుస్థితి రెండు కన్నులై
తలగని చింత తోడ జడదర్శనమై మసిబారిపోవుటన్
నలుబదియైదు దర్శగ మనంబున పున్నమి యయ్యె గేహినీ!
(4/11/2025)

81. కత్తెరదివ్వె పద్యం
కార్తికశుక్లమేగినది కార్తికపూర్ణిమ వర్షవర్తికా
మూర్తిగ నీవు పెట్టుదని మోటుగ మూకుట నేనొకండనే
ఆర్తిగ వెఱ్ఱిదివ్వె నడి యాకసమంటగ పెట్టినాడ.నీ
వార్త ఫలంబు నగ్నిముఖవై గ్రహియింపగ నర్హవే సతీ!
(6/12/2025)

82. లెక్కతప్పుపద్యం
వయసును పాఠశాల నొకవత్సరమెక్కువవేసిరంచు ని
శ్చయముగ చిన్నదానననిచాటుచునుండెడిదానవట్లె ని
ర్భయముగ, చిత్రగుప్తుడదె వ్రాసెనొ తప్పుగ నంబికాభటుల్
నయమున చూడకుండుట పొరంబడి ఎత్తుకపోయిరే సతీ!
(7/11/2025)

83. వేగిన పద్యం
తావియు పోని మజ్జిగను త్రావుట నేర్చితి త్రావుమన్న నే
వేవియొ వంటలో నరటివే పువునూచలవంటి జిల్గు శా
కావళి నెన్నొ నా కొఱకునై పొనరించుటెఱింగినావు నా
త్రోవలు నెట్టివైన ననుతో పడివేగితివే సుమంగళీ!
(8/11/2025)

84. మృత్యుపద్యం
యామము యామమందున శివార్చన దీక్షగ చేయువారి వ్యా
యామము నెల్లకాలమున ఆపక ఓపిక చేయువారి న
య్యా! మము కావు మంచు కడు ఆర్తిని కీర్తన చేయువారి నే
నీ మరుపింతలేక హరియించెడి మృత్యువు చూచితే సతీ!
(9/11/2025)

85. నిశ్చింతపద్యం
నా జీతంబది ఎంత యంచడుగ వేనాడైన చేఖర్చు లే
రోజుంగోరవు నింటి వెచ్చములు పాలున్ మంగ చెల్లింపులే
సాజంబెప్పుడు, నిల్వలప్పులను ప్రస్తావింపగాబోవు నే
నే జై కొట్టిన ఏమి అయ్యెడిదొ చింతే లేదికన్ గేహినీ!
(10/11/2025)

86. మత్తుమధ్యాక్కఱ
కౌముదిచెప్పించుకొంద్రు కష్టమ్ముగానున్నదంచు
మేము సహాధ్యాయులమెసుమీ!పంచసంధులుదాటి
నాము స్త్రీప్రత్యయములను నాపేరు వివరింపుమనగ
నీ మతి మతికాదు మత్తు నిజమన నగితి భానుమతి!
(11/11/2025)

87. బాణామతిపద్యం
నేనొక్కండ విదేశయానముల నెన్నే మాసముల్ చేయగా
నేనేమౌదు నటన్న నిద్దరము నింతేయుందుమా ఎప్పుడున్
నేనేమైనను తట్టుకోవలయునంటిన్ నాకు నా మాటనే
బాణంబట్టుల కొట్టిపోయితివి కోపంబింతయా గేహినీ!
(12/11/2025)

88. ఘటపటపద్యం
వరదన్ దుంగలు కూడు వీడు నెపుడో బంధంబు లీరీతివన్
కరదల్ చెప్పి ఘటంబునుం బటమునాకాశంబు లో వెల్పలన్
పరమాత్మ స్థితి నుండునంచు చదువన్ బాగుండు వేదాంతముల్
సరిగా నాచరణాన్వయంబు కుదురన్ చావయ్యెడిన్ గేహినీ!
(13/11/2025)

89. నాతిచరామి పద్యం
నీవున్నప్పుడు బైట నేమి తినినన్ నీ గూర్చియే తోచలే
దీ వైచిత్రిపుడేది నోటి నిడబో నీవేమి తిన్నావొ నీ
కావంతైన మిగల్చగావలయుగాదా యన్న గాద్గద్య కం
ఠావష్టంభము నాతిచర్యవచనాధ్యాసమ్మగున్ గేహినీ!
(14/11/2025)

90. సతీర్థ్యపద్యం
కవిసతి జన్మధన్యమగు కాలముతీరుట కాయమేగినన్
భువిపయి నక్షరాకృతిని పొంది మృతింగనకుండనిల్చు తా
మెవరెవరుండిరిట్టులన నెన్నిక పేర్లను చెప్పవచ్చు శీ
లవిమల విశ్వనాథవరలక్ష్మి సతీర్థ్యతతో సుమంగళీ!
(15/11/2025)

91. జందెపు పద్యం
నీకెన్నేండ్లని స్వామినన్నడుగగా వింటిన్ మహాస్వామి వా
రే కార్యంబున ప్రశ్న చేసిరని నే శృంగేరిలో దిగ్భ్రమన్
వాకొంటిన్ వెనుదిర్గి వచ్చి అరయన్ వామాంసమున్ శూన్యమై
లేకుండెన్ సతి! జందెమేమయినదో లీలాస్మృతీ! గేహినీ!
(16/11/2025)

92. ఆకాశపద్యం
గగనపథంబు శబ్దగుణకంబు సనాతనమౌ నిధానమై
అగణిత శబ్దజాలమున కాకరమౌచు తరంగమేళనన్
దిగువను ధ్యానవేళల మదిన్ స్పురియించు యుగాలకేని ని
న్ను గురుతుతెచ్చు నెంతురు నినున్ కవితాగుణితా! సుమంగళీ!
(17/11/2025)

93. వధూ పద్యం (కోడలి పద్యం)
ఇరువురు గౌరిలోకమున కేగిరి కోడలు అత్త ఆ తిథుల్
వరుసగ శ్రావణంబవల వచ్చెడి నాశ్వయుజంబు నీ తిథిన్
సరసకు వచ్చునామె చనజాలవు నీవటు నీకు నమ్మయే
మరువక గారె బూరెలిడు మన్నన చూడగదే వధూమణీ!
(18/11/2025)

94. దౌహిత్రపద్యం
నీ గేహం బవధానసౌధమనగా నిర్మాణమై నిత్యమున్
రాగా తామవధాన రంగ యువ వీరశ్రేణి మాతామహీ
యోగక్షేమములాతిధేయత గనం వ్యుత్పన్నభక్తిన్సదా
నీ గానం బొనరింత్రు ధన్యము కదా నీ జన్మయే గేహినీ!
(19/11/2025)

95. శారదాపద్యం
సరస వినోదినీ గగనశారద సేవలొనర్చినావు పె
క్కురకవధాన వర్యులకు కూర్చితి ప్రశ్నల కృష్ణరాట్ సభా
వరణల పాత్రధారిణిగ పల్ దిశలన్ కనుపట్టినావు స
ద్గురువులొసంగ శృంగగిరి గొంటివి సత్కృతి ధన్యవై సతీ!
(19/11/2025)

96. పాడ్యమిపద్యం
ఇది సంకల్పమునందమాఖ్య ప్రతిపత్తే వచ్చి కూర్చుండెమా
సదమై మార్గశిరంబుతెచ్చుచును మాసంబిద్ది నేనంచుపే
రొదుగన్ గీతనుగీసె కృష్ణు డవురా! యొండేల నన్నింట ను
న్నది నీవేనని శ్రావణంబుననె కృష్ణాధీనవైతే సతీ!
(20/11/2025)

97. పోలిక మధ్యాక్కఱ
పోలికి స్వర్గమే నీవు పొందితి గౌరిలోకమ్ము
ఏలన అత్తయారళ్ళు నేనాడు నీకు లేవు కద
పోలిక మీదు పుట్టిళ్ళు పొన్నూరుకు శివారులగుట
పాలనకై నిన్ను పిలిచె పసుపుకుంకుమల భానుమతి!
(21/11/2025)

98. కొయ్య పద్యం
రసముల్ స్థాయిగణంబు భావతతి నిర్మాణ ప్రకారంబు ను
ల్లసనంబంతయు వ్యస్తమై జటిలమై తత్తద్గతుల్ తప్పి బు
ద్ధిసమీచీనత క్రుంగి చెల్లచెదరై తిర్యక్త్వ మావిష్టమై
వసికొయ్యైతిని ఏమి ఎత్తుకొని పోవంగల్గితో గేహినీ!
(22/11/2025)

99. చెవిటి పద్యం
శ్రీశైలంబున స్పర్శదర్శనమునన్ శీర్షంబు ఫాలంబు మ
ల్లేశుందాకగ కొట్టుకొంటి పడి ముమ్మారేదియో చెప్పికో
నాశన్ వైధురబాధ బాధిరవిభుండాలించునో సంకు పె
న్గోసన్ బొప్పియు నొప్పినాకు మిగిలెన్ నొష్టన్ సువాసిన్యళీ!
(24/11/2025)

100. ముదితల పద్యం
సులువుగ సైకిలెక్కగను స్కూటరు బైకును రైలు బస్సులున్
చెలువుగ కార్ విమానముల చేతిని పట్టుకఎక్కినావుగా
లలనలు నేర్వరానివి కళల్ గలవేయనినట్లు నేర్పుగా
నెలమిని నంతరిక్షరథమెక్కితివొక్కతవే సుమంగళీ!
(25/11/2025)

101. కంటినీటి పద్యం
గ్రుడ్లన్ నీటిని గ్రుడ్ల గ్రుక్కికొనుటన్ క్రొత్తర్థమే తోచెనే
వడ్లన్ బియ్యము వోలె కంటతడి నిల్వంబోద ఆ చుక్కలన్
గడ్లన్ పల్కిన పద్యమందు నిలుపంగా అక్కరాలై యవే
గ్రుడ్లన్ కుక్కికొనంగనౌ చదువ నీ కూర్పందుకే గేహినీ!
(26/11/2025)

102. జాయ పద్యం
నీ యుపవాసవేళలను నిల్వుగ నీ తలనెత్తి కొమ్మలన్
కాయలకై కనుంగొనెదుగా మన ముంగిటి జామచెట్టు నే
దో యొకమూల కన్పడును దోరలు తిందువు పండ్లు నచ్చవౌ
రా!యిక *జాయచెట్టు* గ నవాహ్వయమిచ్చితిలే సుమంగళీ!
(27/11/2025)

103. నీతిపద్యం
పోతన శుక్రనీతి మునుముందుగ చెప్పిన వారిజాక్షివిన్
నా తలపందు నీవగుట నాలుగొ నల్బదొ ఇంక నెన్నియో
నా తెలివొప్పగా పలికినన్ పలుబొంకులు కళ్ళు పెద్దగా
చూతువెఱుంగనట్లెఱుగుచుండిఁ గృతజ్ఞుడనో సుమంగళీ!
(28/11/2025)

104. మాస్టర్ పద్యం
అంగుష్ఠాకృతివయ్యు ధ్యానమున పూర్వాకార హావాదిస
ర్వాంగీణత్వదరాస్యభాషణలు ప్రత్యక్షమ్ముగా చేయనై
తింగా సంజెల నారు గంటలకు వర్థిల్లన్ కృపన్ సీవివీ
అంగీకార నమస్కృతిన్ సుఖముగా యాత్రించుమా గేహినీ!
(29/11/2025)

105. డాలు పద్యం
నన్నెవరెట్టిమాట యనినన్ సహియింపవు కస్సుమందు వా
తెన్నునబోక నేను కడు తేలికగా గయికొందు నన్నిటిన్
నిన్నటిదాక కాచితివి నీవె భరించితి వన్ని యింకపై
నన్నియు సూటిగా తగులు నాలన డాలగునా?సుమంగళీ!
(30/11/2025)

106. గీత పద్యం
నీ యేకాదశి ద్వాదశిం గలసియుండెన్ మార్గశీర్షంబునం
దో యిల్లాల!విశిష్టమాసికముగా నొప్పారుగా పారణన్
సాయుజ్యంబు నృసింహకృష్ణమగుచున్ సాన్నిధ్యమున్ మోక్షద
ధ్యేయంబున్ నెరవేర్చు భాగ్యవతివై దీపించుమా గేహినీ!
(1/12/2025)

107. కంచి పట్టు పద్యం
మన స్మార్తత్వము నొక్కి చెప్పు స్మృతి ప్రామాణ్యంబు నట్లౌట నా
మనమందున్న స్మృతిప్రపంచమును త్వన్మాంగల్యబద్దంబు నా
సున కండెంబలెత్రిప్పి నేసెదన యంచుల్ మంచి పట్టైన చీ
రనుగార్హస్థ్యకళామనోజ్ఞమును చేరన్ కంచికిన్ గేహినీ!
(2/12/2025)

108. బంగరు పద్యం
మంగళసూత్రముల్ చెరిపి మారిచి తీరిచి దర్బగ్రంధిగా
ఉంగరమొక్కటిత్తుమని ఒక్క పరిన్ ప్రకటింప దుఃఖమై
బంగరు రూపుమారుటకు బావురుమంటిని వద్దటంచు నీ
వుంగదుమంగజెల్లు వినవో అనవో కనవో సుమంగళీ!
(3/12/2025)

109. పొడి పద్యం
రేపును మాపు వక్కపొడి లేదనుమాటయు, సున్నయయ్యె కా
ఫీపొడి అన్నమాటయును విన్పడకుండగ నీదుకట్టడిన్
లోపము లేక తెచ్చితిని లోకము వీడితి విన్నియిప్పుడీ
కోపున ఖర్చుచేయుటకు క్రొత్తలవాటులగున్ సుమంగళీ!
(4/12/2025)

110. గుడజీరపద్యం
కండలు మైసొబంగులును కావు విలప్తికి కారణంబు లా
పెండిలియన్న పీటముడిపెట్టెడు తంతు నెవండు కూర్చెనో
గుండగ జీరబెల్లములు కూర్చి శిరస్సున పెట్టినంత నే
ముండెనొ దాన జివ్వుమనుటొక్కటె ఇట్టటుగా సుమంగళీ!
(5/12/2025)

111. అంపపద్యం
భీష్మైకాదశి మంచిమూరుతముగా పెండ్లౌట కన్గుట్టెనో
భీష్మాచార్యుడు బ్రహ్మచారియగుటన్ పిత్రూఢకై నన్నునున్
భీష్ముంజేయగ కుట్రచేసి నిను పంపెన్ శ్రావణైకాదశిన్
సూష్మోక్త్యాకృతి యంపశయ్య పడుమంచున్నన్నికన్ గేహినీ!
(8/12/2025)

112. మంచి పద్యం
పోయినవారలందరును బోలెడు బోలెడు మంచివారుగా
గేయములాలపించెదరు కీలకమేమన వారి మంచికే
పోయిరటన్నదే నిజము పోక వివాదములందు చిక్కి శ
ల్యాయితమూర్తులౌట వృధ యంచు నెఱుంగగ నయ్యె గేహినీ!
(9/12/2025)

113. సంస్కృత పద్యం
నేననుకున్న యట్లుగనె నేననినట్టులె సాగగావలెన్
దానికి భిన్నమౌటకును తాళను కాళిక నౌదునన్న య
జ్ఞానము సంస్కృతాధ్యయన కారణమై శమియింపవచ్చునన్
దానికి నీవుదాహృతి గదా పలుదావులలో సుమంగళీ!
(11/12/2025)

114. పెత్తనపు పద్యం
అమ్మయు నాన్నయున్ చనినయట్టులె ఆల్మగ లేమివింతనన్
సమ్మతమే విభిన్నతయు సత్యము పిల్లలు పెద్దలౌదురా
పిమ్మట పెద్దలే యిచట పిన్నలు నౌటయు రెంటియందు స్ప
ష్టమ్మగు లోక రీతులు హఠాత్తుగ పెత్తనమేగె గేహినీ!
(12/12/2025)

115. వైతరణి పద్యం
నీవై వైతరణీనదీష్ణుతకు చింతింపన్ పనే లేదు నీ
కా వైశిష్ట్యము నారసింహుడిడెనాహా! అంత్యకాలస్మృతిన్
గోవుంగూడ నొసంగి గ్రాసమును చేకూర్తున్ యథాశక్తి కా
నీ వారింపవు నేను దాటుటనిటన్ చేయిమ్ము సద్గేహినీ!
(13/12/2025)

116. శ్రద్ధాపద్యం
ఆ పదమూడునాళ్ళనిట నందరుపిల్లలు నొక్క మాటగా
లోపము లేవి లేనటుల లోకము మెచ్చగ ఉత్తరక్రియల్
జ్ఞాపక ముండు నట్టులుగ సల్పిరి వర్ష విముక్తిదాక న
ట్లే పొనరించు శ్రద్ధ మతి నిమ్ము ప్రయాణము సాగ గేహినీ!
(14/12/2025)

117. మల్లెల పద్యం
మలిసంజెన్ సిగజేర విచ్చెడి విరుల్ మల్లెల్ కునారిల్లగా
తొలిసంజెన్ శివుజేరగా నిపుడవే దోసిళ్ళతో పూచెడున్
కలవా వానికి కన్నుముక్కుచెవియున్ జ్ఞానంబు వైరాగ్యమున్
తెలిసెన్ వానికి నీవులేవని వలంతీ!వింతయౌ గేహినీ!
(15/12/2025)

118. మానవతా పద్యం
నీకున్ తోడుగ ఆసుపత్రికి కడున్ స్నేహమ్ముతో క్రైస్తవీ
సాకంబౌచు మహమ్మదీయమహిళా సాహాయ్యమున్ వచ్చుచో
నాకున్ మానవతే మతమ్మెరిగితిన్ నా వాళ్ళు మీరే యనన్
వాకున్ నీ కరవాణివింటి నిజమే వాకొంటివౌ గేహినీ!
(16/12/2025)

119. లక్ష్యపద్యం
ఏడుచువానిపెండ్లమిపుడేతెరినం దన పెండ్ల మట్టులే
వీడక వచ్చునన్న ధృతి వేదన తగ్గగ మాదృశాళికిన్
కూడిక నక్షరాకృతిగ కూర్చుట సంస్మరణీయవౌట నా
మ్రేడిత పుణ్యలోక గతి మించుటకై రచియింతు గేహినీ!
(17/12/2025)

120. మోక్షపద్యం
కన్యాదానములైదుచేసితిమి వాకట్టుంటివేకాదశుల్
ధన్యాకాంక్షత రామకోటిరచనా తాదాత్మ్యముంగొంటివే
యన్యాలోచనలేక పల్కుచు నృసింహా యంచు మైవీడి ప
ర్జన్యానేకము దాటిపోయితివి మోక్షంబబ్బగా గేహినీ!
(18/12/2025)

121. వ్రత పద్యం
తడయక లక్షవత్తుల వ్రతమ్మును తోడుగ చిత్రగుప్తమున్
ముడిగొన షష్టిపూర్తివ్రతమున్ మనమిర్వుర మాచరించుటన్
సుడిగొని చిత్రగుప్తుడు ఋజుత్వము చూపును లేఖనంబులో
వడిఁజని పుణ్య లోకముల వాసము చేయుదువే సువాసినీ!
(20/12/2025)

122. స్పందన పద్యం
రహి దేహమ్మును వీడి వచ్చితి హరిద్రా కుంకుమాంకంబుగా
ఇహ దుఃఖంబులు నాకు లేవనుచు నీవేమైన గర్వమ్ముతో
అహమున్ పొందెదవేమొ చెల్లదు సుమీ! ఆనాటి కానాడు దు
స్సహమై పుట్టెడు వాని నే పడెదనో స్పందించుమా గేహినీ!
(20/12/2025)

123. మరాఠి పద్యం
తలఁతున్ పెండిలి ముందొ క్రొత్తలనొ రాధాకృష్ణశిల్పంబు నెం
దులకో కానుకనిచ్చినావిపుడుఁగందున్ దాని బృందావనం
బెలమిన్ బృందముతోడ పోయితివి నీ కిష్టుండు కృష్ణుండు నా
యలరుల్ గందములున్నవిచ్చటనె కన్నయ్యే మఱాటీ సతీ!
(మఱాటీ=తగాదాలమారి, మాయల మరాటి, 22/12/2025)

124. మంచు పద్యం
సీతువు తెల్లమంచుతెరచే వడికట్టెను నింగి నేలకున్
సేతువు ఆడపిల్లపిత చేయును సాయము మాటచెప్పగా
నీ తరి నందజేయగల డేమనుకో డట లోటులున్నచో
చేతుము పిండతర్పణవిశేషములన్ వినుమా సుమంగళీ!
(23/12/2025)

125. పులిన పద్యం
ఒడ్డుల్ కోయుచు పూర్ణగర్భిణిగ తా నున్మత్తకృష్ణమ్ముగా
గడ్డైనన్ బెజవాడ కాగమిని వేగంబొప్ప నీ బూది నే
యడ్డున్ లేక సముద్రుఁజేర్చెనిపుడౌరా! యట్టి కృష్ణమ్మ తా
నెడ్డయ్యెన్ పులినైకరూపముగ నీవే సాక్షిగా గేహినీ!
(24/12/2025)

126. ఉసురు పద్యం
నీ యుసురుల్ తగుల్ పనులు నేరిచి నేరక చేసినట్టి ఆ
త్మీయుల కట్లుగా నటుల మీరలె నా యుసురెల్ల పోసి కొం
డాయువు తీర బోయద నటంచును పోయితొ కుంకుమాస్యవై
శ్రేయములిత్త్రు గౌరి నృహరిన్ స్మరియించుట నో సుమంగళీ!
(25/12/2025)

127. ధిషణాపద్యం
విసుగు చిరాకు కోపము నెవిన్ గనరావిపుడెఱ్ఱబొట్టుతో
పసిమిమొగంబు నవ్వుకనవచ్చును ధ్యానపువేళలందు సం
తసముగ సాగుచున్నధిషణాపరిణద్ధమహస్స్వరూపమై
ఎసగుట గోచరించునిది యెల్లరికబ్బదుగా సువాసినీ!
(25/12/2025)

128. మొద్దు పద్యం
ఏనిట నుండనింక నెటకేనియు పోయెద నిల్లు మారెదన్
నేనుగ పాతపొన్నురున నిల్తు శివాలయవీధి నంటి వే
వో నను గిల్లుమాటలని యూరక నవ్వితినందులోని వా
చానిశితత్వమున్ తెలియజాలని మొద్దునహో! సుమంగళీ
(12/26/2025)

129. తిలాపద్యం
అంచితనమైన శ్రద్ధ ఇది ఆచరణీయ మటంచునెంచి చే
సంచిని నువ్వుపొట్లమును జారిచి దప్పికవేళ పాత్రలో
నించిననీట కొన్ని యిడినెమ్మదిఁబల్కు స్వధోక్తి నీకునై
పంచుచు త్రాగెదన్ గొను పిపాసను గ్రుంగకువే సుమంగళీ
(12/27/2025)

130. హిమానీపద్యం
దాంపత్యాన స్వతంత్ర భావములు భేదాల్ సద్దుబాట్లల్కలున్
సంపాదించుట ఖర్చు పెట్టుట ప్రజాస్వామ్యప్రభుత్వంబుగా
నింపై కన్పడి నా నియంతృత హిమానీచ్ఛన్నశైలంబుగా
పెంపైనన్ భరియించి పోయితివి యుర్విన్ వీడి సద్గేహినీ!
(27/12/2025)

131. బైరాగిపద్యం
నీవున్నప్పుడు లేని చావుభయమెంతేనిప్డు వెంటాడెడిన్
రావచ్చుంగద ఎప్పుడేని యనుచున్ రాపాడెడిన్ పాడెడిన్
నావౌ వీనులలో వికార మురజానాదాంతరావంబెదో
ఈ వైరాగ్యము నిక్కమా? క్షణికమా? ఏమందువో గేహినీ!
(29/12/2025)

132. ఏటివిడుపుపద్యం
భోరున తిట్టిపోసెదనొ పోయెడి ఏటిని మంచి చెడ్డలన్
వేరొనరింప ఎత్తుకొని వెళ్ళెను నిన్నను పెద్ద చీకటిన్
చేరిన వెల్గు చుక్కలను చెప్పగనైనది తానె యౌటచే
ఊరక సాక్షి మాత్రముగ ఉండక చేసిడిదేమి గేహినీ!
(31/12/2025)

133. గుట్టు పద్యం
అట్లొనరించియున్న ఇటులయ్యెడిదా పొరపాటుచేసినా
నిట్లొనరించియున్న అటులెందుకు అయ్యెడిదంచు దాని కి
ప్పట్ల నదేదొ చేయుటకు పట్టునుపట్టుక ప్రాకులాడు నా
కెట్లునుపిచ్చియందురని ఎవ్వరు చూడక ఏడ్తు గేహినీ!
(1/1/2026)

132. వికృతిపద్యం
నీవెపుడో దివంబునకు నేగితి వంచెలనౌర్థ్వదైహిక
శ్రీవిభవక్రియావితతి చేయుచు నుంటి నికేమి చేయుదున్
నీవొక పావుగా స్మృతులనేకముగా కదిలించి గోష్ఠిగా
ధీవికృతుల్ కవిత్వమగు తీరులు చూపెదనేసుమంగళీ!
(2/1/2026)

133. లంచపు పద్యం
దేవీదూతలు విష్ణుదూతలును పాధేయంబులో వంతుకై
నీ వంకన్ కనుచుందురంచిడెద దొంతిన్ గారెలన్ బూరెలన్
గోవున్ భోక్తలు నీకు చేర్తురిడు మే కొంచెమ్మొ లంచమ్ము గా
త్రోవన్ వీడక వెంట వత్తురు గదా తోడౌచు సద్గేహినీ!
(3/1/2026)

134. దంభావపద్యం
జాయాశబ్దనిపాతరూపములుగా జంభావ దంభావ లీ
లాయుక్తిన్పణినాత్మజప్రణయనశ్లాఘ్యాకృతుల్ రెంటిలో
భూయోవ్యాప్తము దంపతీపదము తన్మూలంబు కర్మాధికా
రాయాతిక్రమమౌ సహత్వవిరతివ్యర్ధుండనైతిన్ సతీ!
(5/1/2026)

137. విప్రలంభ పద్యం
విప్రలంభము లేక రసవివేకపుష్టి కలుగదనుట
సప్రమాణమ్ముగా చెల్లు సర్వ రసావలి కనుచు
వ్యాపృత దుఃఖమ్మునేదొ వంకతో నాపితి వేమొ
కప్రము గాలి కొండెక్కగా వెలిగింతు భానుమతి!
(9/1/2026)

138. యానపద్యం
రసయానంబు తృతీయమంచు కవిసమ్రాట్ దేవపిత్రాఖ్యముల్
పొసగున్ నింగిని సూర్యచంద్రపథమై మూడైనదో దంపతీ
ప్రసృతంబౌనన నట్లెపోదునని సంభావింప నీవిట్లు సం
తసమున్ ద్రుంచితి దేవయానవయి పైత్రంబందెదన్ గేహినీ!
(10/1/2026)

139. శృంగగిరి పద్యం
చిత్రంబిద్ది విమానయానము కురుక్షేత్రంబు శృంగేరి నే
నత్రాసంబుగ నేగినప్పుడవురా ఆరెంట నాప్రక్కనే
మాత్రంబున్ గడి నిండబోదదియు నేమంత్రంబొ ఏ మాయయో
గాత్రాదృశ్యత తప్ప నీ యునికి నిక్కంబౌనె నింగిన్ సతీ!
(11/1/2026)

140. గడ్డ పద్యం
అప్పుడువచ్చి శృంగగిరియందున నెచ్చట నెచ్చటిద్దరై
యొప్పుగసంచరించితిమొ యొంటరినై యిపుడచ్చటచ్చటన్
చప్పున నీవునున్న చిరుచాయగ దోచగ నవ్వునేడ్పులన్
కప్పుక యన్నిచూతు ౘలి గడ్డలుకట్టగ గుండె గేహినీ!
(11/1/2026)

141. జయ పద్యం
ఉడిపిని కృష్ణసన్నిధిని నొప్పుగ నీ తిథి నన్నదానమే
ర్పడగ విరాళమిచ్చితిమి భాగవతోత్తములారగింపగా
గడుసరి కన్నయన్నటులె కాలము చేయుచు సంస్మరించినా
విడునతడే విముక్తి భయమేమియులేదు జయంబగున్ సతీ!
(12/1/2026)

142. మృడానిపద్యం
మును మురుడేశ్వరమ్మున సముద్రపుటొడ్డుననిల్చినట్టితా
వుననిలువన్ తటాలున నపూర్వముగానొకకాకివచ్చిని
ల్చెను కడుదగ్గరై పలుకరించెను కూతును నల్లునిన్ ననున్
కనగ మృడాని సత్కృపయె కారణమంచు తలంచెదన్ సతీ!
(13/1/2026)

143. మూకపద్యం
ఈ మూకాంబిక చూచినా మపుడు తానెట్లుండెనో ఇప్పుడ
ట్లే మాటాడక నవ్వుచున్నటులె ఆర్తిన్ విన్నటే తోచె నె
ప్డో మాధ్వీకరసోక్తి పొందెనట వేడో కాని నేవేడగా
నా మూకత్వము నిత్తు నొంటరికి మౌనంబే యనెన్ గేహినీ!
(కొల్లూరు మూకాంబికాదేవి(కర్ణాటక), 14/1/2026)

144. గూఢపద్యం
మును శృంగేరిని కాళికాంబ గుడికిన్ బొబ్బెక్కగా కాళ్ళు వె
ళ్ళిన వైనంబును చెప్పి పిల్లలకు కాళిన్ జూపగాపోవ ద
ర్శనవేళాతిగమయ్యు నర్చకవరుల్ రారెంత సేపైననీ
వును లేకుంటను తల్లి కన్పడదొ ఏవోగూఢతల్ గేహినీ!
(15/1/2026)

145. ఒప్పందపు పద్యం
ఇర్వదినాలుగేళ్ల క్రితమీకనుమన్ తలబ్రద్దలైన నే
నుర్వర నుండ కష్టమనరో ఘనవైద్యులునీదుతాళిబొ
ట్టర్వణమై యమానుమతి నాయువుతెచ్చిన అంతరార్థ ము
త్తర్వున నీవు ముత్తయిదుదారిని గౌరినిచేరుటో సతీ!
(16/1/2026)

146. బడాయి పద్యం
ఒండు పుదీనపువ్వును మరొక్కటి చక్కని వాముపువ్వు నీ
రెండును నొక్కతావున చరించిన నీరయిపోవునంచు తా
రొండిని రెండుపొట్లములెఱుంగగ దాచును రెండు ప్రక్కలన్
దండిగ నిద్ది వానిపని దైవ్యభిషక్కు బడాయ్ సుమంగళీ!
(22/2/2026)

147. సున్నా పద్యం
ద్వాదశమాససంపుటి సదా త్రయి శూన్యము లింత దాక కా
నీ దిశ మార్చెనిప్పుడు గణింపగ అన్నియు సున్నలయ్యెగా
భేదము పేరునందె కనిపించునుగా పితృపక్షమా
సాదృతియే సమస్తమయి ఆగక సాగుచునుండె గేహినీ!
(17/1/2026)

148. పాళ్ళపద్యం
‘రసమే గొప్పది వేయిరెట్లు’ కవిసమ్రాట్ తీర్పుతో నాకు సం
తసమయ్యెన్ రసవద్గృహస్థతకు నాధారంబుగా నంతలో
బిసగా తొంబదియైన పాళ్ళనుటచే పేచీ పదిన్ వచ్చెనో
రసహీనంబయి సాగ నీ పదియు సర్వస్వంబులో గేహినీ!
(20/1/2026)

149. అంగి పద్యం
అంగిరసమ్ము తానొకటి హంగుగ అంగరసమ్ములై పెరల్
కంగునుకాయుచుండు ననగా నది శాస్త్రపుమాట లోతు గాం
చంగ మహాదశాంతరదశల్ పెనవైచిన యట్టులంగి లో
నం గదలున్ తదన్యములనన్ మన కాపురమయ్యె గేహినీ!
(21/1/2026)

150. చిక్కుముడి పద్యం
అనినాడా భవభూతి గారు *జరసా యస్మిన్నహార్యో రసః*
పనిగా వేదము నిర్వచించెను *రసో వై సః* యటంచున్ కనుం
గొన తచ్ఛబ్దమిటన్ పుమేకవచనక్షుణ్ణంబు ద్వంద్వైకశే
షనిపాతంబవునొక్కొ?పూరుషునకే స్వత్వంబొ? సద్గేహినీ!
(14/9/2026)

151. ఆలంబన పద్యం
కంబము నారసింహజనకంబయినట్లు రసాళికెల్ల నా
లంబనమౌ విభావము సురద్రువుగా ననుభావ సాత్త్వికా
డంబర విస్తృతిన్ రసవిడంబన మంబర మంటు నట్టి ఆ
లంబనమే నశింప విఫలంబగుస్థాయిగణంబు గేహినీ!
(22/1/2026)

152. మద్యాక్కఱ పద్యం
భావనారాయణ స్వామి వారి సంస్కృత కళాశాల
లో విద్యనేర్చిన వారిలో నీవు లేకుండ తొలిగ
కేవలమొకడనరుగుటకే పూర్వవిద్యార్థిగోష్ఠి
కావటిల్లెద మోముచెల్లదట్లయ్యె నిపుడు భానుమతి!
(23/1/2026)

153. అప్రత్యయపద్యం
ప్రకృతివిహీనమై వెలయు ప్రత్యయమెంతటి గొప్పదైన దా
నికిని స్వతఃప్రయోగగతి నిల్పదు వ్యాకృతి కంటి ముందటన్
ప్రకృతి ప్రయోగయోగ్యతకు వచ్చు సమాసమొ? కృత్తొ? తద్దితం
బొ? కరుణ లేదు పాణినికి ఒంటరి ప్రత్యయపుంభృతిన్ సతీ!
(27/1/2026)

154. గౌరీపద్యం
ఔరా చిత్రమదొక్కనాడగుట భీష్మైకాదశీద్వాదశుల్
గౌరీపూజకు గౌరిలోకగతికేకంబైతిథుల్ గూడగా
*మేరేజ్డే* యిదె మాసికంబు నిదె అమ్మీ! నేలకున్ వత్తువీ
పేరన్ సంతసమయ్యె పిల్లలకు దీవింపంగదే గేహినీ!
(28/1/2026)

155. లహరీపద్యం
నిజమే చెప్పెద దర్శనీయ లెవరేనిన్ తోపఁజూపాగు ము
న్ను జరాత్యక్తము కాక జన్యుగతమౌనో కాని నేడారయం
గ జనించున్ మదిలో విరక్తి లహరీగ్రంథస్థసౌందర్యభే
షజమున్ శాంకర మిద్ది మాతృవివృతిన్ స్థాపించెనో గేహినీ!
(29/1/2026)

156. అవారపద్యం
నీవున్నప్పటియట్లె నీ కొరకు చింతింపన్ సభల్ నాటకా
లేవో తీరికలేని వ్యాపకములై ఈ రెండు మూణ్ణాళ్ళు నీ
కై విన్పించెడి పద్యముంపమికి నేమయ్యెన్ సుఖంబుంటిరా
మా వీనుల్ కనులున్ ప్రతీక్షితములన్ మాన్యాళి గొల్తున్ సతీ!
(30/1/2026)

157. గౌరింటిపద్యం
గోరింటాకుల పెద్దచెట్టెవరికేన్ కోరంగ నీవిత్తు వా
పేరర్థమ్మును గౌరియింటి దనుచున్ పెద్దల్ విభాగింప నే
దో రాణింపుగ చెప్పిరంచు తలతున్ తోచెన్ యథార్థంబుగా
చేరన్ నీవిటు గౌరియింటికి సదాసిందూరికా! గేహినీ!
(31/1/2026)

158. తారుమారు పద్యం
మేఘనభస్సుమాసమున మేనును వీడి నభంబు చేరగా
మాఘము వచ్చెనప్పుడె అమాంతముగా చనుచుండె పండిత
శ్లాఘము మల్లినాథమగు సామెత వ్యత్యయ మేఘమాఘమై
ధీఘృణమై ‘గతం వయ’ అదేగతి సాగుచు నుండె గేహినీ!
(2/2/2026)

159. గణితాక్కర
పెండ్లిలెక్క జవాబు కొరకు వేయింతు రేడడ్గు లపుడు
బండ్లోడ లోడలు బండ్లు వచ్చుటకు జవాబు సున్న
చెండ్లుకట్టవలెను లెక్కచెరుపుట కాదు జవాబు
ముండ్లపై ఉన్నట్టు లేల పోయితివీవు భానుమతి!
(3/2/2026)

160. సంధ్యా పద్యం
మలిసంజెన్ ౘలివేళ చీకటితెరల్ మంచుంబొరల్ క్రమ్ముచో
నిలుచేరంగను పుష్యమాఘములు హాయింగూర్చు నావేళలో
పులియై దూకిన గుండెనొప్పి నిను గొంపోవంగ సంధ్యాసమ
స్యలలో చేరిన క్రొత్తప్రశ్న యయి నన్నాందోళించెడిన్ గేహినీ!
(-యయి అధ్యాసించెదన్ గేహినీ, 4/2/2026)

161. పశ్యకపద్యం
పశ్యక శబ్దమే తిరిగి వ్రాలను మార్పిడి చేసినంతనే
కశ్యపుడౌట వ్యాకరణ కార్యము కశ్యపగోత్రునిన్ ననున్
పశ్యకుఁజేసి పోయితివి పాఠమునప్పుడు తప్పువింటివో
పశ్యకతాప్తి సౌక్ష్మ్యపరిపశ్యకతన్ గొన నైతి గేహినీ!
(5/2/2026)

162. ఉపాయపద్యం
నీకు స్వథోక్తితర్పణలనే సతతంబు నొసంగకుండ నీ
రాకకు నాందివృద్ధిశుభశ్రాద్ధములన్ స్వదితోక్తి పల్కగా
చేకొని యిమ్ము దీవెనలశేషముగా శుభకార్యపంక్తికై
మాకడ నుండవచ్చు పలుమారులుపాయముగా సుమంగళీ!
(6/2/2026)

163. హేతుపద్యం
నిష్ఠగ దుఃఖహేతువుననేకమతమ్ములఁ జూడయోగవా
సిష్ఠము జైనబౌద్ధములు చెప్పినదొక్కటె కోర్కి యంచుద్రా
ఘిష్ఠత శ్రీవశిష్ఠుడు లిఖించె సుఖావహము నద్దెయంచు న
ల్పిష్ఠుడ నెందుకీగతి చరింతునొనేనెఱుగన్ సుమంగళీ!
(10/2/2026)

164. తాబేటి పద్యం
నీవటులేగ నేనునొక నిర్ణయమున్ గయికొంటి నప్పు డి
వ్వేవియు నుండబోవు కొననేటికి వస్తువు లేను నుందునా
పోవకయంచు కూర్మగతి మూసితి గుప్పిలి నింతలోనజం
ఘావిపరీతలంఘనలుగాశశకాకృతి సంచరించెదన్
(14/2/2026)

165. సాయిమేకుపద్యం
ఆడకునీడకంచు సభలంచు శుభాశుభగోష్ఠులంచు నే
తోడునులేక యొంటరిగ తోచియు తోచనియావ సాయి మే
కూడిన చక్రమై తిరుగుచుంటి తటాలున నెప్డుజారునో
గూడును కూలు చక్రమెటకో చనుప్రక్కలకున్ సువాసినీ!
(16/2/2026)

166. గీతలపద్యం
అడవులనున్న పాండవుల కార్షగణంబులు వచ్చి యిట్టులే
యిడుములుపడ్డవారు గలరెందరొ యింతకుమించి మీరలే
కడు నయమంచు నా కథల కళ్ళకు కట్టిన యట్లు చెప్పి ఏ
డ్పుడిపిన యట్టులౌదు నొకటొక్కటి పోలుచుకొంచు గేహినీ!
(17/2/2026)

167. చిలుక పద్యం
చిలుకై వత్తువొ జామకాయకని నా చేయెత్తినన్ కోయనౌ
పలుకాయల్ కనుపించుచున్న మనసొప్పంబోదు కోయంగ నీ
తలపైకెత్తుక చూచుచుందువెపుడున్ దండంబు చేపట్టి నీ
విలకున్ వచ్చిన చిల్కవై సులువుగానే మెక్కవచ్చున్ సతీ!
(18/2/2026)

168. ఉపోత్తమపద్యం
మారినగాధగా రురుప్రమద్వరమయ్యెను కాలసర్పదం
ష్ట్రారురుదంశనంబనగ సాగిన మూడు ప్రమాదవేళలన్
తేరుకొనంగనైతినన నీదగు నాయువు నిచ్చి పోయితో
తీరదు నా కుపోత్తమతిథిన్ కసి ద్వాదశికిన్ సుమంగళీ!
(20/2/2026)

169. పైసా పద్యం
షడ్జాద్వైతము క్రిందుమీదగుచునే సప్తస్వరాంతస్థ వి
భ్రాడ్జీవంబయి అన్నిటిన్ నడుపగా ప్రాధమ్యముంగాంచి స
మ్రాడ్జూటీక కిరీట రత్నమయి తా రాజిల్లు దాంపత్య భూ
రుడ్జన్యంబు ఫలంబు నిట్టిదనుచున్ ప్రోషించెదన్ గేహినీ!
(20/2/2026)

170. బడాయి పద్యం
ఒండు పుదీనపువ్వును మరొక్కటి చక్కని వాముపువ్వు నీ
రెండును నొక్కతావున చరించిన నీరయిపోవునంచు తా
రొండిని రెండుపొట్లములెఱుంగగ దాచును రెండు ప్రక్కలన్
దండిగ నిద్ది వానిపని దైవ్యభిషక్కు బడాయ్ సుమంగళీ!
(22/2/2026)

171. అభ్యాసపద్యం
పూర్వకవిప్రయోగమును ముచ్చట నొక్కటినిచ్చి దాని నం
తర్వలితోహ నూత్నగమనంబున పద్యము వ్రాయుమంచు ని
త్తుర్విని సంబరంబుననెదోరచియింతును విశ్వనాథ వా
రుర్వి నటుల్ సతీస్మృతిప్రయోగమునిచ్చిరిటుల్ సువాసినీ!
(23/2/2026)

172. ఆలంబనాక్కఱ
ఆలంబన విభావమగుదు వన్నిరసాలను నాకు
ఆలంబన విభావరహితమై రసోత్పత్తియు లేద
ఆలంబనాభావమయ్యు నదియుండు విప్రలంభాది
నా లెక్క నే యభావమవొ ఆ నాల్గులో భానుమతి!
(24/2/2026)

173. తిక్కేకాదశి
ఏదయినన్నిరామయత నెత్తుకపోయెను నిన్ను ఫాల్గునై
కాదశి గొప్పయేమి?అది కాదిది యంచును మెచ్చనేల? మ
ర్యాదలు చేయనేల?అవురా!ఉపవాసము నుంతు పెట్టబో
నేది కుదుర్తు తిక్క మన మెల్లి భుజింతుములే సుమంగళీ!
(27/2/2026)

174. ఎక్కిరింత పద్యం
మామిడిచెట్టువంటిననుమార్చితివల్లనచింతచెట్టుగా
ఏమిడి ఎంతకొల్చిననొకింతయు నిల్పక పైకిచేర్చి ఆ
పామిడి*యెక్కిరింతదొర పచ్చనికొంపను చిచ్చునార్పగా
చీమిడిముక్కుతో తిరుగు చిన్నరి నైతినిగా సుమంగళీ!
(*నరసింహుడు, 28/2/2026)

175. పోఁకాకుపద్యం
పోఁకకు సార్థకత్వమిడుబో తెలనాకును సున్నమట్లె నీ
పోకయు సార్థకంబగుడు బోలెడు ఛాందసనాగవల్లికా
నీకము తెల్లసున్నమగు నిక్కపుటూహలు పొక్కకుండ ప
ద్యాకృతి వీటిచుట్టి యిడెదన్ పలు నాల్కల నాడగా సతీ!
(1/3/2026)

176. చిత్తి*పద్యం
చిత్తియె స్రుక్కు, చిత్తమగు నాజ్యము,వాక్కు వేది,వి
ద్వత్తయె దర్భపోచలగు,ధ్యాసయు విజ్ఞత అగ్ని,హో
త్రుత్తముడున్ గురుండు,మనమో ఉపవక్త,హవిస్సు ఊపిరౌ
ఇత్తరి కైత ఋత్విజుడిదే స్మృతిపన్నమగున్ సుమంగళీ!
(*జ్ఞానము. తైత్తిరీయారణ్యకం(3.1), 3/3/2026)

177. సున్నా పద్యం
అరుణప్రశ్నము కశ్యపోఽష్టమ యటంచా గోత్రనామస్థవౌ
టరసెన్ ద్వాదశహూణమాసములలో నా సంఖ్యలో అష్టమీ
స్ఫురణన్ కృష్ణుని గన్న శ్రావణమునన్ సున్నాలపన్నంబు సు
స్థిరతన్ మాకును సున్న చుట్టి దివికిన్ చేర్చెన్ నినున్ గేహినీ!
(4/3/2026)

178. రేకుపద్యం
డెబ్బదియైదు నెన్బది నడిన్ పలుజాబులు రేకుపెట్టెలో
నిబ్బడి ముబ్బడైన వటకెక్కి గణించు పఠించువెఱ్ఱియే
అబ్బురమౌట పద్యముల అప్పులుతీర్చుట గుర్తుతప్పె నా
పబ్బమునే యొకానొకటి పద్య మొనర్చెదలే సుమంగళీ!
(6/3/2026)

179. మల్లీపద్యం
ఆకులు తానె రాల్చుకొని అంత చివుళ్ళును మొగ్గలొప్ప మా
ఘ్యాకృతి మల్లికాసుమసమర్చన చేయగ మల్లెపాదు తా
నీకయి పూయుచున్నదవనిన్ మునుపాకులు దూసి సంజెలన్
వేకువ నీరువోసితని నిత్యకృతజ్ఞతనో సుమంగళీ!
(7/3/2026)

180. గుండ్లమధ్యాక్కఱ
అన్నినాళ్ళసకుల పండుగ* ని నిను పిల్వరాన్ లేద
అన్నిగుండ్లసకుల† పండుగందు పాల్గొనబోయె నంటి
కన్నుల నీరిడు కొంద్రు కతమేమొ యెరుగను నేను
వెన్నెల వత్తిగా నింగి వెల్గుచుంటివిగ భానుమతి!
(*అంతర్జాతీయ మహిళా, †అంతర్లోకమహిళా, 8/3//2026)

181. వల్లెల పద్యం
వచ్చును బోయ నూకలను వాగుర మాటున చల్లు వాలినన్
చచ్చెదనంచు పల్కుటను చక్కగ నేర్పిచనెన్ గృహస్థు తా
వచ్చి కనుంగొనంగ కనుపట్టదు పెంపుడుచిల్క జీవ పా
టచ్చరమౌ *మృ* ధాతుకపటత్వము వల్లెల లొంగునా సతీ!
(10/3/2026)

182. యోగపద్యం
పిలువకుడీ! ప్రయాణమున వేగముతగ్గు శ్రమంబునౌనటం
చలయక యల్గకుండగ నుపాయమునొక్కటిగంటి సందెలన్
తలపున సీవివీ స్మరణ ధ్యానతరంగపథంబునందు నిన్
గలసెద మాటలాడెదను కన్పడుచుందువుగా సుమంగళీ!
(11/3/2026)

183. మంచు పద్యం
కొండలు నేరులున్ కనులకున్ కనిపించక కప్పి వైచె బ్ర
హ్మాండ సమస్తమిప్డు పొగ మంచు గవాక్షమనోహరంబు పో
కుండగ నాగు టెట్లు? పథికుండు హిమఘ్నుని రాకదాక నా
ఎండఁ తృణాత్త కూపమున కిద్దియె మేలనెదన్ సువాసినీ!
(13/3/2026)

184. పుష్పాగ్రహపద్యం
పూవులకేగ తీవియలు మొగ్గలు తున్గెడి నొంటిచేతితో
నీ విటు గుంజబోకు హవణింపదె రెండవచేయి మంచివే
ఈవలె విచ్చుకొన్నవిరులే సరిగా గొనిపొమ్మటన్న ఆ
తీవియ కామె లేదనుచు తెల్పుట యెట్టులగున్ సువాసినీ!
(14/3/2026)

185. మలిద్వాదశిపద్యం
తొలిగా నిక్కపు జీతముంగొనిన సంతోషమ్ముతో జీడిప
ప్పులు రుబ్బించిన నేతి గారెలను నీవు న్నేను నున్వండి మి
త్రులకధ్యాపకశ్రేణికిచ్చితిమి వారున్ దిగ్భ్రమంగైకొనన్
మలిదీ ద్వాదశి నీవు చన్నసమ గొన్మా పారణన్ గేహినీ!
(15/3/2026)

186. మధుమధ్యాక్కర
ఏ పువ్వు నైన కోయుచును నేను పంచాక్షరి ననెద
నా పున్నెమో ఏమొ గాని యల సన్నజాజి పువుపువు
నాపక తొడిమల నుండి అల్లన చిందు తేనియల
నీ పగిదిని నేవిచేయ విది నీదు పెంపు భానుమతి!
(17/3/2026)

187. అమాపద్యం
ఈ యమతోడ విశ్వవసు వేగ పరాభవవత్సరంబునం
దా యమవై విమోకములనంతర మేగెదు గౌరిలోకమున్
నాయకురాలవై యట గణంబులచేరగ నైదుమాసముల్
చేయుము యాత్ర పండుగకు చెప్పెడిదిప్పటి కింతియే సతీ!
(అమ=అమావాస్య| ఆయమ=ఆమె,18/3/2026)

188. మాంద్యపద్యం
సంధ్యల నెన్ని పూచినను సర్వము పూజకు గిల్లుకొన్నచో
వంధ్యనుగా దలంత్రు నను బాటనుపోయెడివారు తన్మృషా
సంధ్యపకర్షణమ్మొకటి చాలును కోయకు మన్నదీవుగా
మాంద్యమువీడి పద్యకుసుమంబొకటుంచితిలే సుమంగళీ!
(20/3/2026)

189. దిష్టి పద్యం
వినుము పరాభవాది శుభవేళ వధానయుగంబుగాగ నే
పొనరిచితిన్ వధానములు ప్రొద్దుట మాపట నచ్చ తెల్గులో
అనిరట దిష్టి తీసికొను డంచు నదే విని నాకునేనుగా
ననువుగ నుప్పు తిప్పుకొని ఆవల వైచితినో సుమంగళీ!
(22/3/2026)

190. వాతపద్యం
స్త్రీలన్ బాలుర వృద్ధులన్ మనుచు దాక్షిణ్యమ్ము దైవత్వమౌ
బాలుండొక్కనిగాచినంత నది సంపన్నంబు గాబోదుగా
స్త్రీలంగాచిన బాలవృద్ధులకు సంక్షేమమ్ము చేకూరు గ
గ్గోలుంబెట్టిన కావడానృహరి నాకున్ వాతపెట్టెన్ సతీ!
(23/3/2026)

191. నవమిపద్యం
శిశిరమునందు రావణుడు సీతమ నెత్తుకపోయినంతలో
నిశలు పవళ్లుగా గడచి నెమ్మదివచ్చె వసంత మందులో
పొసగిన శుక్లమౌ నవమి పూట సుమిత్ర సుతుండు గుర్తుగా
నొసగిన మావిపండనెదనోయి! పరాభవపర్వమున్ సతీ!
(23/3/2026)

192. పారణపద్యం
ఏదొ విచిత్రమున్నదిట నెన్నియొ మాసికపుందిధుల్ పురై
కాదశి ద్వాదశుల్ కలియు కారణ మా నరసింహసత్కృపా
పాదితమేమొ పార్వణమె పారణ చేయక పోయినందు కీ
ద్వాదశికిన్ లభింపనిటు తానొనరించెనొ యేమొ గేహినీ!
పారణ=ఏకాదశి ఉపవాసము తరువాత తినెడి ప్రసాదము
పార్వణ=పితృదేవతలకుపెట్టు పిండములు (29/3/2026)

193. తిరుగుడు పద్యం
రాతిరులర్ధరాత్రులపరాత్రులు వేళయుపాళలేనివౌ
నా తిరుగుళ్ళలో సభలనారతమై నడి నిద్రలేచుచున్
కాతర మందుబాధ ఇక కల్గదటంచును సంతసింతు నిం
తీ! తలుపెవ్వరింకనిటు తీసెదరంచును గ్రుంగెదన్ సతీ!
(30/3/2026)

194. నూజివీడుపద్యం
వెజ్జులు మానుమన్న చవివీడక చిన్న రసంబునొక్కటిన్
బెజ్జము పెట్టి కొంచెముగ పిండిన పిమ్మట పండు మొత్తమున్
గుజ్జురసంబు నెల్ల గయికొందువునీవిటలేమి దానికిన్
పజ్జకు పోవకుందునొ? గబాలున మొత్తము తిందునో? సతీ!
(31/3/2026)

195. అగణిత పద్యం
ఈ శరదశ్శతమ్మనుట ఏటికి? ఏను శరత్తు పుట్టువున్
పాశవికమ్ముగా రుజల బాధలనందుచు తట్టుకొంచు నా
క్రోశము లేక నెట్టుకొని కొయ్యవలెన్ వసియించుచుండగన్
వేసవిపుట్టువౌటనొ గణింపదు దీవెన నిన్ సుమంగళీ!
(1/4/2026)

196. శ్రద్ధాపద్యం
అగ్నిముఖుల్ సురల్ తినుటకాయనపై పడి ఆశ్రయింత్రుగా
అగ్నియు భోక్త గోవు త్రివిధాధ్వములందున అన్నపానముల్
లగ్నమనస్కతన్ పరమశ్రద్ధ నొసంగ పితాళ్ళకున్ దయా
మగ్నత నిత్త్రు దీవెనలు మంచిగ చూడుము పిల్లలన్ సతీ!
(2/4/2026)

197. విస్తరి పద్యం
విస్తరికూడు కాపురము వ్రేళుల గోళులు గీయకుండగా
దస్తురి గుండ్రమైనటులు తాకియు తాకనియట్లు పైపయిన్
మస్తుగ నారిగించుటన మాటలు కాదిట చారుమజ్జిగల్
పుస్తెలు తెంపినట్టులయిపోయెను విస్తరి చీలుటన్ సతీ!
(3/4/2026)

198. అభయశ్లోకః
గృహిణి! గమన మార్గే దేవభాషైవ తత్త్ర
భటభటభటవక్త్రాత్ భాషమాణాపితైస్తైః
వదనసులభమాదాత్ భావనారాయణోఽత్ర
ఇహపరవిహితం నౌ సంస్కృతం మాద్య భైషీః!
(వదనమ్=మాట్లాడుట, 5/4/2026)

199. పున్నమి పద్యం
పున్నమి వెన్నెలల్ విరియబూచిన నిన్నజ పట్టలేముగా
పున్నమి మంగళాద్రి పయి ముందును వెన్కగ మూడు నాళ్ళగున్
వెన్నెలందు జాబిలిని వీసము మార్పు కనంగలేమికన్
కన్నులు మూసి ధ్యానమున కాంచుట దారిగనయ్యె గేహినీ!
(6/4/2026)

200. పండితపద్యం
తమి నీ తోడున శ్వానధేనువుల తత్తద్భేదముల్సూచితిన్
గమికర్మీకృతవైధురీసరణి నిష్కంపమ్ముగా నేటికిన్
సమదర్శిత్వముగాంచి పండితయశస్సంభావితుండైతి గీ
తమహత్త్వంబిటు లిచ్చితాచరణసాధ్యంబంచునో గేహినీ!
(7/4/2026)

201. నింబార్కపద్యం
తడపర తట్టు మాడుటకు తప్పక వాడెడి వేపమండలే
వడి నిలువెత్తు మాడుట విపత్తి ప్రపత్తుల నేది యౌనొ క
న్పడెడిసమస్త నింబముల వైఖరి కర్కుడు కారణంబొ?నా
ఎడదకు నంతు పట్టదటులేగితి వైదువవై సుమంగళీ!
(8/4/2026)

202. కాశ్మీరపద్యం
తెల్హని వస్తువేదయిన దృష్టికి తోచిన దాన నున్నటుల్
బిల్హణునట్టు లూహలను వేయి విధమ్ముల చేయుచుందు నా
కల్హణునట్లుగా చరిత కట్టి తరంగిణి వ్రాయుచుందు నా
సల్హరియింతు వీ యునికి సత్యము కామిని నో సుమంగళీ!
(18/4/2026)

203. ముఖ్య పద్యం
ప్రాణంబిచ్చెద నన్నమాట తెలుగుల్ పల్మారులంచుందురే
కానీ యక్కడదాక వచ్చినదిపో కన్పట్టగాబోరుగా
గౌణంబయ్యది సాన్నిహిత్యమునకున్ గాఢాప్తతా స్ఫూర్తిగా
దానిన్ ముఖ్యము చేసిపోయితి యథార్థంబంచు నో గేహినీ!
(24/4/2026)

204. లలాటపద్యం
ఈ వైశాఖపు మల్లెపూల్ పుటుకయందే గుప్పుమన్ కమ్మనౌ
తావుల్ వెన్నెలకిచ్చు చీకటికి సంధ్యాదేవికిన్ పంచు ని
ట్లావాంతాద్భుతగంధపీఠికలుగా నావిర్భవింపన్ లలా
టావిచ్చిన్న మషీవిలేఖనము లేదన్యమ్ములన్ గేహినీ!
(24/4/2026)

205. నేలపాలుపద్యం
ఈ నీ మామిడి దోరకాయొకటి నీవే కొట్టి పారేసితో
నేనేమైనను నిన్ను పొమ్మనెదనో నీ చెట్టు నీ కాయ అం
తా నింపాదిగ తిన్న కాదనెదనో తానిప్పుడిట్లయ్యె నౌ
రా! నీకున్ మరి నాకు కానిదయి నేలన్ రాలెగా గేహినీ!
(30/4/2026)

206. లహరీపద్యం
దుఃఖంబొక్కటి మానుపట్టె నన సందున్జూచి వేరొక్కటం
తఃఖేదాబ్ధితరంగమై ఎగయగా దానన్ పురాభంగ స
ద్యఃఖేలాంతము వర్తమాన లహరీ దంభమ్ముగా నిత్యమే
నః ఖండావళి కుట్టిపోయుదురు పిన్నల్ పెద్దలున్ గేహినీ!
(సుమంగళీ!ఒక దుఃఖం తగ్గుతుండగా మరొక దుఃఖాబ్ధితరంగం పైకి లేస్తోంది. దాంతో మునుపటి అల కొత్తదాంట్లో కలిసిపోతోంది. నిత్యమూ పిన్న పెద్దలందరికీ ఈ దుఃఖాల అతుకులు సాగుతూనే ఉన్నాయి. 26/4/2026)

207. నోటిపద్యం
ఆయన అన్నమాట అది అట్లెయగున్ పలుమార్లు చూచితిన్
ఖాయమటంచు పిల్లలకు గట్టిగ చెప్పెడి దాన విప్పుడే
మాయెను దానినిక్కమని మాటికి మాటికి దెప్పుచుందు రౌ
నా! అటులైన నేనెపుడు నన్నది లేదిటులౌటనో సతీ!
(2/5/2026)

208. ఏతత్తత్ పద్యం
ఏతత్ తత్స్థసులుప్తితో పదత నీవే త్రెంచి పుంజమ్ములన్
తాతా!పాణిని !యొంటి జేసితివి స్త్రైణప్రత్యయాధార మా
ఖ్యాతంబున్నది పౌంస్న మేమగును మోయంజాలదున్ తప్పదున్
నీ తీర్పున్ మహిళానుకూలమనెదన్ నీవున్ వినన్ గేహినీ!
*పాణినీ! ఏతత్ తత్ శబ్దపుంజములను అనగా పుంలింగములను అర్థాంతరంగా సులోపంతో ఒంటరులను చేసి పదత్వాన్ని ఇస్తున్నావు. దానిని మోయక తప్పదు. స్త్రీలకు అలా చేసినా వారి ప్రత్యయం వారిని కాపాడుతుంది.పురుషులగతిఏమిటి?
గేహినీ! నీ సూత్ర రచన మహిళానుకూలంగా ఉందని నీవువింటుండగానే పాణినిగారితో అంటున్నాను*, 3/5/2026)

209. సంకల్ప పద్యం
సంధ్యావందనవేళ నిత్యమును నే సంకల్పమున్ చెప్పుగ
ద్యం ధ్యేయర్తువు చెప్పబో శిశిరమే ఆడుంగదా జిహ్వ నీ
ఆంధ్యం బెప్పటికేగు నేగదొ సదా అట్లే ప్రతారించునో
కంధ్యతంబుగ ఒక్కటే శిశిరమా? కాలంబునం గేహినీ!
(5/5/2026)

210. బహుళపంచమిపద్యం
భయమును గూర్చునీ బహుళ పంచమి జ్యోత్స్న అదేల నన్నచో
స్వయముగ తద్దశాహమికవచ్చును షష్ఠికి కూర్చశిలల్ త్యజించి పై
పయికి ప్రయాణ మౌచు పితృవర్గము చేరెదు నేల వీడి అ
న్న యెరుకనిచ్చు వెన్నెల యనన్ మదికిన్ దిగులే సుమంగళీ!
(5/5/2026)

211. రసయానపద్యం
కలవట దేవయానమనగా పితృయానమనంగ మానవా
వళికి ప్రయాణ మార్గములు ప్రాణము పోయెడివేళ క్రొత్తగా
నిల రసయానముంబలికె నెల్లెడబోవగ విశ్వనాథ నా
పలికెడి సర్వ పద్య ప్రతిపాద్యము నీకును నాకునౌ సతీ!
(8/5/2026)

212. అపశబ్దపద్యం
ఉపమాలంకృతి కాళిదాసనగ తానో కావ్యలింగమ్ముగా
సుపధంభై భవభూతి మానుషముగా చూపించెదాంపత్యశి
ష్టపరీక్షావరణాత్యయంబనగ తాన్ సంపృక్తమన్నన్ గురుం
డపశబ్దంబులు వాడినట్లయినదౌరా!నీదు పోకన్ సతీ!
(*కాళిదాసు దాంపత్యాన్ని ఉపమాలంకారంగా వాగర్థములవలె విడిపోనిది అన్నాడు. భవభూతి కావ్యలింగాలంకారంగా పెళ్లి నుండి చావు వరకు విడిపోనిది అన్నాడు నీ పోకతో వారిరువురు అపశబ్దాలను వాడినట్టు అనిపిస్తోంది*. 9/5//2026)

213. సాధ్వీపద్యం
అమ్లేచ్ఛాంచిత జీవనాధ్వగమనవ్యాసక్తి నాసక్తితో
నమ్లానమ్ముగ నున్నదెంతయిన దీర్ఘాయుష్యమే అన్నటుల్
సుమ్లక్షంబగు పుణ్యసంతతి తమస్సుంజీల్చు పాధేయమై
ధీమ్లానిన్ గనకుండ వీడితివి సాధ్వీ! పృథ్వినిన్ గేహినీ!
(11/5/2026)

214. గీత పద్యం
విచ్చుచునున్న పువ్వులనిపించిన మొగ్గల గిల్లి నప్పుడా
పచ్చని లేత మొగ్గలుగ ప్రక్కన తోచిన వంత లోపలన్
విచ్చగబోవు మొగ్గలనిపింపగ చూపున మార్పు వచ్చుఁదా
నచ్చుగ చిన్న గీత ఒకటైనపుడద్దియె పెద్దదౌ సతీ!
(15/5/2026)

215. జాతకపద్యం
ఆదిని జాతకమ్ముల గ్రహావళి తీరులు చూడకుండ ని
చ్ఛాదృతి పెండ్లియాడితిమి చక్కగ సాగెను పిల్ల పాపలన్
ద్వాదశినాడు నీవరుగ దానికి కారణముం గనంగ *ద్వి
ద్వాదశ* దోషమప్డు కనవచ్చె గ్రహమ్ములలో సుమంగళీ!
(వధూవరుల జాతకాల పొంతనలో ద్విద్వాదశదోషం
ఉండరాదు . మన జాతకాలలో అది ఉందేమో అందుకే ద్వాదశి నాడు పోయావేమో?13/5/2026)

216. అమవసపద్యం
దాగుడుమూతలాటలుగ ధారణి చంద్రుడు భాస్కరుండు నీ
లాగున పూర్ణిమామల కలాపములాడగ రెంటి యందు తా
నే గడి దొంగ పెట్టు శశి యీతడు తానె మనోనియంతగా
నాగము చేసి మానవుల నల్లరి పెట్టునుగా సుమంగళీ!
(16/5/2026)

217. జ్యేష్ఠపద్యం
జ్యేష్ఠము లవ్విరెండగుట జెష్టగ నెంచెదరేమొ లోకులేన్
శ్రేష్ఠమటంచు నీ సమను చెప్పెద వచ్చెదురెండుమారుల
ల్పిష్ఠము లైన ఆసలివి వెళ్ళినవారరుదెంతురే కనన్
నిష్ఠగ ధ్యానమందు నిను నేఁగనుగొందునులే సుమంగళీ!
(21/5/2026)

218. వడగాలిపద్యం
ఈ వడగాలి వేడిమికి ఎల్లగతంబు హతంబుకాగ ఆ
భావి అగమ్యగోచరము భానుమతిప్రథితాఖ్య వ్యాకృతిన్
కేవలకాంతి యంచు పులకించెద విగ్రహవాక్యమెంచి కా
నీ వికటించి భాస్కరత నిక్కమొకో యనిపించు గేహినీ!
(22/5/2026)

219. వంతెన పద్యం
రోసెద నాదు పుట్టుపొగరుంబడి సింగపుమోముజేజెగా
వేసముగొన్నవాడు నను వేరుగఁబంపితటాలునన్ నినున్
తీసుకపోయె, బాపడటు తీసుకపోయెను మున్ను, నేనిటుల్
చేసెద రాౘవాడనని చేసెనొ? వంతెన కట్టితిన్ సతీ!
(23/5/2026)

220. ఎంకి పద్యం
కొట్లాటల్ పగలెట్టులున్న నిసి నాకున్ మల్లెపూల్ దెచ్చు తా
నెట్లాంటోడయినన్ సరే యనిన ఆ ఎంకిన్ బలెన్ వేసగిన్
పెట్లన్ ఱోళులు కాయునెండ పవలబ్బీ! మాపటన్ వాన నా
పట్లన్ రెండును రెండు కత్తులయి చెప్పన్ పద్దెమున్ గేహినీ!
(29/5/2026)

221. భాగ్యపద్యం
అవయవముల్ ప్రసూదరసమాగతముల్ చితి చేరుదాక న
య్యవి కలవట్లె మార్పిడుల నందవు శస్త్ర చికిత్స లేని దా
నవు నినువంటివారరుదనందగు కోశము లాశయంబులం
దెవియును లోటులేక దివికేగితి భాగ్యవతీ!సుమంగళీ
(30/5/2025)

222. నిబ్బరపుపద్యం
రోయిని కార్తెకున్ చెఱువులోపలి తమ్ములు కూడ వాడగా
నీయది మల్లెమొగ్గ యొకయించుక ౙంకక పూలరాణిగా
నై యలసంజె వెల్లగొడుగై యిలువాకిలి తావి గుమ్ముగా
చేయుట గుండెనిబ్బరపుఁజేతిది నీదియొ నాదొ గేహినీ!
(31/5/2026)

223. భడవాపద్యం
భడవాకానలు చేతికందవు విరుల్ పైకేగి ఇంకొన్ని ఇ
ప్పుడె పూజాంగముగా సమర్పితములై పో మేలటంచున్ ననున్
వడిగా చేరగ చేతికందు నరయన్ వారుండిపోనెంత్రు వీ
ర్వడిపోకన్ గుడిచేరవచ్చుననుచున్ భావింత్రుగాగేహినీ!
(2/6/2026)

224. కాకపద్యం
దారిని దేవళమ్ము గన దండము పెట్టగ కేలు లేచు నా
చారమొ సంప్రదాయమొ వెసన్ జతనంబొక ఇంతలేక ఔ
రౌర! యిటేలచేసితని ఆపయి నే పెడమోము బెట్ట కా
కారుతి గోపురమ్ముపయి కాకి పకాలున నవ్వు గేహినీ!
(2/6/2026)

225. పాఅడం సిలోఅ (ప్రాకృత శ్లోకః) ఇత్థీపుంసదంపచ్చరసాణుభూఈ
మూలం పఈఈఇ పురిసాణుసత్తీ
ఇచ్చుత్తిమాసిజ్జ దదామి తుజ్ఝం
తం పాఅడం సిలోఅ మిమం గిన్హ

సంస్కృతచ్ఛాయా:
స్త్రీపుంసదాంపత్య రసానుభూతేః
మూలం ప్రకృత్యా పురుషానుషక్తిః
ఇత్యుక్తి మాశ్రిత్య దదామి తుభ్యం
తం ప్రాకృతం శ్లోకమముం
గృహాణ!

తెలుగుచాయ:
ఆలుమగల వలపులకు ఆటపట్టు
ప్రకృతితో పురుషుని అనుబంధమగుట
దాని దారిని నిద్ది సొంతముగ నిత్తు
ప్రాకృతము పద్దెమును నీకు పడతి!కొనుము
(4/6/2026)

226. మారేడుపద్యం
ఒక బిల్వంబు శివార్పణంబనుచు నే నువ్వెత్తునన్ కొమ్మవం
చి కడున్ నేర్పుగ గిల్లుచో నపుడె వీచెన్ వాత్య ఝంఝార్భటీ
ప్రకటంబై మలయానిలంబె యయియున్ బైల్వీహఠాద్ధూతిచే
వికటింపంగ ప్రయత్న మర్పణముగా పేర్కొందునే గేహినీ!
(5/6/2026)

227. అంతర్లీన పద్యం
అవి వైయక్తికమెంత చెప్పినను నాసాంతంబు నా దుఃఖమే
ను వెదంజల్లక సార్వజీవికముగా నూత్నాను షంగంబుగా
నవమై మానవ జీవనాధ్వముల నంతర్లీన లీలా విషా
ద విభావాదుల నిట్లుచూప స్మృతిగాథల్ కూర్చెదన్ గేహినీ
(6/6/2026)

228. సిందూరపద్యం
నీ సిందూరము రక్తచందనమునై నిర్వర్ణ్యబంధూకమై
రోసంబార్చెడి కాళినాల్కయయి ఆ రుద్రాలికాక్ష్యగ్నియై
బాసల్ మీరిన పెక్కుకైతలుగ దాంపత్యారుణాకాశవీ
ధీసంచారమరాళపంక్తి యగుచున్ దీపించెడిన్ గేహినీ!
(7/6/2026)

229. కలనేతపద్యం
అంగుష్ఠాకృతి సూక్ష్మవైతివనినన్ ధ్యానంబులో నేటికిన్
సాంగోపాంగము మానవాకృతివి యౌరా!పప్పుగోంగూర చీ
రం గట్టన్ జరి యంచు చూచితిని స్మేరశ్రీహరిద్రాకృతి
స్వాంగన్ గౌరి సకుంకుమన్ గనిన యాహార్యంబునన్ గేహినీ!
(9/6/2026)

230. పిడుగుపద్యం
తిథియున్ తేదియు నొక్కటై యురుములున్ తీవ్రధ్వనిన్ పిడ్గులై
పథముల్ కానగరాని వర్షమయి యొప్పన్ నేటి ఏకాదశీ
తిథి స్తుత్యమ్ము బహిర్వ్యవస్థితము నింతీ! ఇవ్వి లేకుండ నా
పొదలో బెబ్బులి నెత్తిపై పిడుగు తెల్పున్ క్రూరతన్ గేహినీ!
(10/6/2026)

231. మిత్తి పద్యం
ఎవరుం గెల్వగలేని నన్ను గెలిచెన్ మృత్యుంజయుండన్న వై
భవమీ సామిద వీని గొల్చుటకు పుష్పంబుల్ కడుందెత్తు న
న్న వచోవిన్యసనంబు విన్న విరులన్నా! మేము సిద్ధమ్మె పె
ద్దవు మొగ్గల్ గొనిపోకుమన్న నుడి శ్రోతవ్యంబగున్ గేహినీ!
(14/6/2026)

232. శాకినీపద్యం
నల్లని శాకలావిక యనంగుని యమ్ముల నీలికల్వ తా
మెల్లగవచ్చి అమ్మ ఇది మీకయి తెమ్మను నెప్పు డిప్పుడా
తల్లియె లేదటన్నదెడదన్ పిడిబాకయి కొందునద్ది ఉ
త్ఫుల్లహసన్ముఖాబ్జ మది బుగ్గలసొట్టలు తెల్పెడిన్ సతీ!
(15/6/2026)

233. అరుసు పద్యం
ఏమిజగత్తు? తిమ్మరుసువే యనిమెత్తురు కొంతకాల మ
ల్జీమరు సందురాపయిని చెంతకు చేరరు వింతపోకడన్
భామిని!నీ వలెన్ చనెడి భాగ్యముకల్గుట కోరుకొందురౌ
నా? మనవారు దైన్యము వినా రుజ నొవ్వనిపోకకై సతీ!
(17/6/2026)

234. సమాసోక్తిపద్యం
ప్రతిది ఋణానుబంధమని పల్కు సమాసపు విగ్రహం బనే
కతనగు ద్వంద్వతత్పురుషకార్యము లింకను కర్మధారయ
స్థితి నవిరెండొ?యొక్కటియొ?తీరె ఋణంబని సంతసింతునా?
గతమనుబంధమన్న వెత కన్నుల నీరిడుకొందునా?సతీ!
(19/6/2026)

235. హోమియో* పద్యం
సారూప్యౌషధ వైద్యరీతి త్రిగుణస్వామ్యమ్ము నేనందులో
*సోరిక్* నీవును *సైకొటిక్కు* వయినన్ సొంపారనింపార సం
సారంబున్ పొనరింపగల్గితిమి రోసంబున్న రవ్వంత నా
దారిన్ ఛాందస మీవు నోర్చితివి వైద్యశ్రేణి మెచ్చన్ సతీ!
(*హోమియో వైద్య విధానంలో మానవులందరూ మూడు స్వభావాలలో ఏదో ఒక దానికి చెందినవారై ఉంటారు. ఆ వైద్యానికి ఇది ప్రధాన సూత్రం. వారివారి నడవడికలనుబట్టి వైద్యునికి అవిస్పష్టమవుతూ ఉంటాయి. వారికి తగిన మందు ఇవ్వగలుగుతారు. ఈ సిద్ధాంతం ఆధారంగా ఈ పద్యం స్ఫురించింది. భిన్న స్వభావాల సామరస్యమే భారతీయ దాంపత్యం. 20/6/2026)

236. యోగపద్యం
యోగ దినోత్సవోత్సవసమున్నతి కాయపరంబు దంపతీ
యోగమహోత్సవంబునకు నొక్కదినంబని లెక్కచూడమీ
యోగవిశేషమున్ త్రికరణోద్భవమై మన ఉక్తికాయమై
బాగొనరించు మూడిటిని భార్యకు భర్తకు పుణ్యగేహినీ!
(21/6/2026)

237. పతాకాపద్యం
కాష్ఠానేకసమష్టిసంజ్వలనదీక్షాదగ్ధదేహప్రభా
సుష్ఠూహాకృతిదర్శనీయకవితాశుస్పృష్టదాంపత్య ద్రా
ఘిష్ఠాలోకనభావజాలకలనోక్తిస్ఫూర్తి పద్యావళీ
కాష్ఠారోపణదీప్తిశాశ్వతపతాకన్ చేసెదన్ గేహినీ!
(22/6/2026)

238. అగ్ని పద్యం
యజ్ఞేశుండు పురోహితుండనుచు నాయా ఈడనల్ చేయుటే
విజ్ఞానంబుగ సాక్షిగా పిలుచుటే విధ్యుక్తిగా వానికిన్
సుజ్ఞాతంబుగ పెళ్లికిన్ పిలువగా చూచెన్ గదా ఆతడే
అజ్ఞప్తిన్ బడి వచ్చె వేరిమికి సాక్ష్యంబై అసత్తిన్ సతీ!
(23/6/2026)

239. ఈకేకపద్యం
ఈశావాస్యమొ? కేనమో?కఠమొ?నా ఈ కేక ఆత్మాధ్వమౌ
నా?శాసించెడి ప్రశ్న ముండకము నౌనా?గంతు మాండూక్యమై
రాశిన్ తిత్తిరి నౌచు ఐచ్ఛముగ చేరంగా బృహద్గానమై
పాశచ్ఛిత్తి దశారవమ్మగునొ చెప్పంగావలెన్ గేహినీ!
(24/6/2026)

240. మీమాంసాపద్యం
పడి మీమాంసను శబ్దనిత్యగుణకత్వప్రాప్తితో నింగి వెం
బడి నీమాటలకై చెవిన్నిలిపి తీవ్రధ్యానముంజేయ వి
న్పడబోదంచు ననిత్యమంచు పలుకన్ న్యాయంబు నేన్ క్రుంగితిన్
పడతీ!విన్పడితౌర అచ్చెరువుగా పై శాస్త్రమే మేల్ సతీ!
(25/6/2026)

241. శనిపద్యం
పదమూడింటి తిథిన్ శనైశ్చరుని సంభావింతు రిళ్ళన్నియున్
పదిరెండే పదమూడు తానధికమౌ భావంబు నేల్నాటిలో
గదులన్ మూడిట తానె పెత్తనములన్ గావించు నెల్లప్పు డ
య్యది యయ్యెన్ పదమూడు నిన్నుగొనిపోనై ఏలినాటన్ సతీ!
(27/6/2026)

242. పిలకపద్యం
తొలకరిజల్లునన్ మొలకతోచె తటాలున కందపిల్క తా
నిలువున నింగి వైపెగసి నిన్నును నన్నును మించె నెత్తునం
దలవి మయూరముద్రను ఘనంబుగ నాకులు విచ్చెనట్లె చూ
పుల వెనువెంట వత్సరవిమోకము నెట్టుక వచ్చె గేహినీ!
(30/6/2026)

243. జన్మదినశ్లోకః
శ్రీ శైలస్య ప్రకట శిఖరే మేఘమాశ్లిష్టదేవం
ఆపఃపూర్ణం ఘటమివ విభోస్సేచనార్థం యతంతం
దృష్ట్వా జన్మోత్సవ శుభవచఃప్రేషణార్థం ప్రయాచే
మల్లేశోక్త్యా స వదతి దృఢం గౌరిలోకే శ్రుణుష్వ
(*శ్రీశైలశిఖరం పై కనబడిన నల్లని మబ్బుతో ఇవ్వాళ నీ పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేయమని అడిగాను. మల్లేశ్వరుని మాటగా అతడు నీకు గౌరీలోకంలో అందజేస్తాడు. విను. 1/7/2026)

244. దుండిగల్లుపద్యం
నిరుడేవేళకుదత్తపీఠమున నింతీ!దుండిగల్లాశ్రమం
బరయంబెండ్లికి పోతిమో విడిదిగా నావాసమేమిచ్చిరో
వరుసన్ జేజెలకెట్లుమ్రొక్కితిమొఉద్వాహాశుసంచారమే
తరి గావించితొ నేడు చూడ గలవంతన్ నీవునున్ గేహినీ!
(3/7/2026)

245. నాగస్వరపద్యం
పడగను విప్పి బుస్సుమని పైబడు దుఃఖపు కాలసర్పమున్
తడయక నిల్వరించు జతనంబున పద్దెపు బుఱ్ఱ నూదగా
నొడబడి నట్టులుండు నెపుడూదుట నాపిన నప్పుడల్గి కా
టిడ పడగూపు బుఱ్ఱ నిటులెప్పుడు నాపకనూదెదన్ సతీ!
(4/7/26)

246. ముల్లుపద్దెం
గొౙ్జగిక్రింద మూగయయి గోడపయిన్గడియారమందు తా
నొౙ్జగ టిక్కుటిక్కుమనియున్ తనకొక్కటెయంచు ముల్లు నా
అౙ్జయు పౙ్జ నీ యుసురులాపవు చేపవు మెప్పు తిట్లు నా
పౙ్జకురావు పొమ్మనుట పల్కెడి నీ గడియారమో సతీ!
గులాబిపువ్వు కింద మౌనంగా ఉన్నా గడియారంలో టిక్కు టిక్కుమన్నా నా అస్తిత్వం నీ ప్రాణాలు తీయలేదు పోయలేదు నీ తిట్లు పొగడ్తలు నా దగ్గరకు రావు అని గడియారంలో ముళ్ళు అౘ్చతెలుగులో నవ్వుతున్నాయి 6/7/2026)

247. సనాయాస* పద్యం
ఔరా! ఎంతటి భాగ్యశాలిని వనాయాసంబు నీపోక నా
యారోగ్యంబిది హెచ్చుతగ్గుల సనాయాసంబుగా సాగుచో
ఏరోజేమగునో యటంచు దిగులై ఎన్నెన్నొ వైద్యంబులై
ధారాళవ్యయదుఃఖహింసనచణస్థాయిన్ వ్యథింతున్ సతీ!
(*సనాయాసము=నిరంతరాయాసము, 8/7/26)

248. తురాయి పద్యం
ఎఱ్ఱ తురాయిచెట్టు నిలువెల్ల భగాభగ మండుచున్నటుల్
పఱ్ఱను వల్లకాడొనరుపన్ పువువిల్తుడొ దక్షుబిడ్డయో
బుఱ్ఱకు గుర్తువచ్చెదరు మున్పిపుడిక్కడ నేను కాపరిన్
కఱ్ఱనుపట్టి నిల్చితని గాత నొకండు తలంతు గేహినీ!
(9/7/2026)

249. పిట్టమధ్యాక్కర
నీవొ నేనో తేల్తు మింక నీ మాటొ నా మాటొ చెల్ల
గా వలె ననుకొంట వినియె కాబోలు గడుసుసింగమ్ము
నా వంగడపు పిల్లి వోలె నడిపించి ఈ పోరు తీర్తు
లే వాటముగ నని చేసెలే నరసయ ఇట్లు పిట్ట!
(10/7/2026)
250. పూదారి పద్యం
కోసిన దేవయానమగు కోయనిచో పితృయాన మౌనుగా
ఈ సుమజాల నిష్క్రమణ మిట్టులెయౌ మనవోలె పూజ కై
సేసిన దేవయానముగ చేయని వన్నియు నేలపాలుగా
వాసిగ తల్లి పాదముల వ్రాలి యిహానకు వచ్చుటౌ సతీ!
(11/7/2026)
251. కూత పద్యం
వేకువ జామునందు పదివేలుగ పిట్టలు కూయుచుండినన్
కాకులు కోయిలల్ తెలియగానగు క్రొత్తగ వచ్చెనేదియో
తేకువ కొద్దిసేపు తన తీరున కూయ వినంగ నౌనిటుల్
నాకది *పిచ్చిపిచ్చి* అని నట్లుగ దానిదొ నాదొ గేహినీ!
(12/7/2026)

252. ఆషాఢస్య పద్యం
స్మరియింతున్ మనపెండ్లినాటి ప్రథమాషాఢానుభూతిస్థితిన్
స్మరియింతున్ కవికాళిదాసు ప్రథమాషాఢానుభూతివ్యథన్
పరిశీలింపగ రెండునింగికెగయన్ ప్రత్యక్షవీక్షార్థినే
ను రసాక్షిత్వవిమానయక్షు నయితిన్ చూతున్ నినున్ గేహినీ!
(14/7/2026)

253. జులై 15పద్యం
ఇంత విచిత్రమా! మునుపటేడున నేడు తెనుంగు నాంగ్లపుం
బొంతన నీకు నాకు నొక పుట్టిననాడుగ నేనమేరికా
ప్రాంతమువీడి మంగళధరాధరదైవము చూచినాము నీ
వింతటనింగి నేనమెరికేగుచు నింగిన యుంటి మంగనా!
(15/7/2026)

254. యథార్థపద్యం
చిరమాశ్చర్యవిమానయాత్రలు కురుక్షేత్రంబుశృంగేరి ము
న్నరుగన్ రాకలపోకలందెడమ శూన్యాసీనకంబౌట కెం
దరొ సాక్ష్యం బిపుడీఅమేరికవిమానంబందు నట్లౌట నే
మిరహస్యంబొ నిగూఢమంచనెద సుమ్మీ!అమ్మి!నెమ్మిన్ సతీ!
(15/7/2026)

256. శంసాపాద* పద్యం
శంసాపాద విమాన కేంద్ర మరుగన్ స్వాగత్యుదారాకృతి
స్వాంశన్ కాకమొకండు వేకువన సోపానంబుపై వ్రాలి వీ
క్షాంశూంకృతియై విహాయసము నా కన్నన్ త్వరన్ జేర మీ
మాంసన్ నిక్కము నీ వటంచు మది సంభావించితిన్ గేహినీ!
(*శంషాబాద్ 16/7/2026)

257. అనూహ్య* పద్యం
కొండలదారులన్ తిరిగి కోనలు చుట్టితి సాహసంబుగా
కండలు నొవ్వగా నమెరికా పలుతావుల వాగువంకలన్
పండిన ధ్యానసీమ కనవచ్చుటెకాక యనూహ్యకాక మే
నుండినచోట తోచుటకహో! వెఱగందిరి స్థానికుల్ సతీ!
(ఆస్టిన్ సంఘటన, 21/7/2026)
258. తిరుగుబోతుపద్యం
వీచే గాలిని పూచుపూవులను నీవే తోడుగానున్నటుల్
తోచున్ పెక్కు తెరంగులౌ విరుల విందుల్ నన్ను నోదార్ప మే
థాచాంచల్యము చిత్తశల్యమగు బాధాగాధవాస్తీరమై
ఈ చీచర్షిష* ద్వంద్వమై అమెరికా నేనుంటినో గేహినీ!
(*పదేపదే చరించాలనే కోరిక 24/7/2026 శానోజా)

259. ధన్యపద్యం
క్రౌంచద్వీపము* వర్షమున్ రమణకాఖ్యం బైంద్ర ఖండంబునన్
సంచారంబున ద్వాదశాఖ్యమగు మాసశ్రాద్ధకార్యంబు గా
వించన్ శ్రీ శివరామ దంపతులు కల్పింపన్ సమస్తమ్ము సి
ద్ధించెన్ వైదికమై సమగ్రముగ సాధ్వీ! ధన్యవౌరా! సతీ!
(*అమెరికాసంకల్పము 28/7/2026)


పాలపర్తి శ్యామలానంద ప్రసాదు

రచయిత పాలపర్తి శ్యామలానంద ప్రసాదు గురించి:

‘తొలి అచ్చతెలుగు అవధాని’, ‘కుదురాటగండ’, ‘కళారత్న’ డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాదుగారు సంస్కృతాంధ్రాలలో నిష్ణాతుడైన కవి-పండితులు. తెలుగులోనూ, సంస్కృతంలోనూ ఎం.ఎ. పూర్తిచేసి రెంటిలోనూ పి.హెచ్.డి. సాధించారు. సంస్కృతంలో విశ్వనాథ రాసిన రూపకాలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. అయిదువందలకు పైగా అష్టావధానాలు, మూడు శతావధానాలు చేసారు. అచ్చతెలుగులో అవధానం చేయడం వీరి ప్రత్యేకత.

 ...