రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

భారతీయ ఖగోళ సంప్రదాయం – ఆర్యభట-I కల్పనాశక్తి

రచన: నౌడూరి సూర్యనారాయణ మూర్తి
ఆగస్ట్ 2026

ఆగష్టు 12న సంభవించే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కానీ, ఈ సందర్భం మనకి భారతీయ ఖగోళ సంప్రదాయాన్ని మననం చేసుకుందికి, ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. ‘అతి పరిచయాదవజ్ఞా’ అని లోకోక్తి. అంటే బాగా పరిచయం ఉండడం వల్ల… అది వ్యక్తి ఐనా, విషయమైనా… ఒక రకమైన నిరసన భావం, చులకన భావం కలుగుతుంది అని తాత్పర్యం. భూమి నీడలోకి చంద్రుడు రావడంవల్ల పౌర్ణమినాడు చంద్రగ్రహణం, సూర్యుడికీ భూమికీ మధ్య చంద్రుడు రావడంవల్ల అమావాస్యనాడు సూర్యగ్రహణం ఏర్పడతాయని ఈ రోజు బడిపిల్లలతో సహా అందరికీ తెలిసిన విషయం. అందువల్ల, ఆ ప్రసక్తి వచ్చినప్పుడల్లా దానిలో కొత్త విషయం తెలుసుకోవడంలో ఉండే ఆసక్తి, ఉత్సాహం కనిపించవు. నిజానికి సేరోస్ ఆవృతి (Saros Cycle) పేరు ప్రచారంలో ఉన్నంతగా, మాధవ గురుకులానికి చెందిన వాతస్సేరి పరమేశ్వర (సా.శ. 1365-1455) 55 సంవత్సరాలు గ్రహణాలను స్వయంగా పరిశీలించి, రచించిన “గ్రహణ మండన”, “గ్రహణాష్టక”, “గ్రహణన్యాయదీపిక” అనే మూడు గ్రంథాలకు లేదు. 1608లో దూరదర్శిని (telescope) కనిపెట్టబడకముందే, వేల సంవత్సరాల క్రితమే భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు – ముఖ్యంగా ఆర్యభట I, గ్రహణాలను ముందుగా అంచనా వెయ్యడానికి కావలసిన గణిత వ్యవస్థను రూపొందించారు. ఆర్యభట I ప్రత్యేకత కేవలం గ్రహణాలను గణించడం మాత్రమే కాదు; ఖగోళాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన అవలంబించిన ఆలోచనావిధానమే విశిష్టమైనది.

ఈ వ్యాసం ఉద్దేశం ఆధునిక ఖగోళ పరిభాషలో గ్రహణ సిద్ధాంతాన్ని వివరించడం కాదు. ఆర్యభట I వంటి మహా ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు, అతని ఆలోచనల వెనుక ఉన్న తర్కం ఏమిటి, అతని గణిత వ్యవస్థ ఎందుకు శతాబ్దాల తరబడి ప్రభావవంతంగా కొనసాగిందన్న విషయాలను పరిశీలించడం.

ముందుగా ఒక హెచ్చరిక. ఆర్యభట తన సిద్ధాంతాలను చాలా సంక్షిప్తంగా మాత్రమే వ్యక్తం చేశాడు. చాలావరకు వివరణలన్నీ బహుశా బోధనాత్మకంగా ఉండి ఉండాలి. అందువల్ల అతని ఆలోచనల స్వభావాన్ని అతను రూపొందించిన గణిత వ్యవస్థ ఆధారంగా అంచనా వెయ్యడమేగాని, అవే అని రూఢిపరచడం లేదు. అతని వ్యవస్థ తరతరాల మేధావుల పరిశీలనకు, నిశితమైన విమర్శకు గురి అయింది. అయినప్పటికీ అనుసరణీయమైందిగా నిలబడటానికి దాని గణితపరమైన అపూర్వ కల్పనాశక్తి ఒక కారణం. సృష్టికీ, కాలానికీ తొలితుదలులేని చక్రీయగతిని సంభావించిన భారతీయ తత్త్వదృష్టిపై ఆధారపడటం రెండవ కారణం.

1. గ్రహాల స్థానాలను నిర్ణయించే శాస్త్రంగా ఖగోళశాస్త్రం

ఈనాటి పాఠకులు ముందుగా గుర్తుంచుకోవలసిన విషయం, ప్రాచీన భారతీయ ఖగోళశాస్త్ర మౌలిక లక్ష్యం గ్రహకక్ష్యల స్వరూపాన్ని కనుగొనడంగాని, వాటి ద్రవ్యరాశి, భూమినుండి వాటి కచ్చితమైన దూరాలను కొలవడంగాని కాదు. వారి ప్రధాన లక్ష్యం: ఏ సమయంలోనైనా ఒక గ్రహం ఎక్కడ ఉంటుందో ముందుగా చెప్పగలగడం. కనుకనే వారి జ్యామితి పరిశీలనాత్మకమై (observational), కక్ష్యలో గ్రహాల స్థానాల్ని నిర్ణయించడానికీ, మందవృత్తాలద్వారా (epicycles) వాటి గమనాలని వివరించే (explanatory)దిశలోనూ కొనసాగింది.

దీనికోసం వారు కొన్ని ప్రాథమిక ప్రమేయాలను స్వీకరించారు. గ్రహాలు తమ తమ కక్ష్యల్లో ‘సమాన ఋజు వేగం’తో (constant linear velocity) నడుస్తాయన్నది మొదటిది. దానివల్ల, భూమినుండి దూరంగా కక్ష్యగల గ్రహాలు ఒక భ్రమణాన్ని పూర్తి చెయ్యడానికి ఎక్కువకాలం తీసుకుంటుందన్నది సూచితము (వాటి కోణీయ వేగాలు — angular velocities — సమానం అనుకుంటే, అన్ని గ్రహాలూ తమ కక్ష్యల దూరాలతో నిమిత్తం లేకుండా తమ భ్రమణాలను ఒకే కాలపరిమితిలో పూర్తిచెయ్యవలసి వచ్చేది). రెండు నక్షత్రాలకి (న + క్షత్ర) స్వయంగా చలనం లేదు (గత శతాబ్దం వరకూ శాస్త్రజ్ఞసమాజం నిశ్చితాభిప్రాయం అదే). అందువల్లనే మేషరాశి ప్రారంభ బిందువును యుగ ప్రారంభానికి ప్రామాణికంగా తీసుకోగలిగారు. దీనికి భిన్నంగా, గ్రహాలకి తూర్పుదిశగా స్వీయచలనం ఉంటుందన్నది రెండవది. చంద్రుడి కక్ష్య ఆధారంగా, ఒక మహాయుగంలో చంద్రుడు నడిచే దూరాన్ని అన్ని గ్రహాలూ మహాయుగంలో నడిచే దూరంగా నిర్ణయించారు. దాన్నిబట్టి, ఒక మహాయుగంలో వివిధ గ్రహాల భ్రమణాలను నిర్ధారించారు.

ఈ విధమైన ఖగోళ గణిత వ్యవస్థ ద్వారా వారు

  • పంచాంగ నిర్మాణం చేయగలిగారు.
  • చంద్రుని కళలను నిర్ణయించగలిగారు.
  • గ్రహణసమయాల పూర్వనిర్ధారణ చేయగలిగారు.
  • గ్రహ సంయోగాలను లెక్కించగలిగారు.
  • మతపరమైన ఆచారాలకు అవసరమైన కాలనిర్ణయాలను చేయగలిగారు.
  • వ్యవసాయ కార్యక్రమాలకు అనువైన సమయాలను నిర్ధారించగలిగారు.

భారతీయ ఖగోళశాస్త్రం ప్రధానంగా స్థానీయ ఖగోళ శాస్త్రంగా (Positional Astronomy) అభివృద్ధి చెందింది.

2. కాలగమనపు చక్రీయత మరియు మహాయుగాలు: నిరయన సిద్ధాంత వ్యవస్థ

భారతీయ ఖగోళ గ్రంథాలలో కనిపించే మహాయుగాలూ, కల్పాలూ సూచించే సంఖ్యలు ఆధునిక పాఠకులకు ఆశ్చర్యం కలిగిస్తాయి. భారతీయ గణిత ప్రతిభని అంచనా వేసిన పాశ్చాత్య మేధావులు ఈ అంకెలని కేవలం మతపరమైన ఊహలుగా త్రోసిపుచ్చారు.

ఈ సంఖ్యలు ఖగోళ చలనాల పునరావృత స్వభావాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగించబడ్డాయి. గ్రహాలు, చంద్రుడు, నాడులు మొదలైన ఖగోళ అంశాల గమనాలకు ఒక సామూహిక ప్రారంభ బిందువును ఊహించి, అక్కడినుండి గణనలు నిర్మించడం వారి విధానం.

కాలానికి ఆది అంతం లేదని భావించిన భారతీయ తత్త్వదృష్టిలో, ఈ రకమైన చక్రీయ గణిత నిర్మాణం సహజ పరిణామం.
ప్రాచీన భారతీయ ఖగోళశాస్త్రజ్ఞులకు విషువత్తుల చలనం (Precession of Equinoxes) గురించి అవగాహన ఉంది. అంటే, వసంత(vernal equinox), శరత్ విషువత్తు(autumnal equinox)లు స్థిరంగా లేకుండా, సంవత్సరానికి సుమారు 50 సెకెన్ల చాపరేఖతో పడమటి దిశగా నడుస్తాయని వారికి తెలుసు. ఐతే, అది వారు ఇప్పటి శాస్త్రం చెప్పినట్లు వృత్తాకారంలో కాకుండా, లోలకం (pendulum)లా ఒక వైపునుంచి మరొక వైపుకు ఊగిసలాడుతున్నట్టు (Trepidation of Equinoxes) భావించారు. దానివల్ల, ప్రతి సంవత్సరం మేషరాశి ప్రారంభ బిందువు వద్ద నాక్షత్రిక సౌర సంవత్సరం ప్రారంభం అవదు.

స్థిర నక్షత్రాల నేపథ్యం ఒక స్థిరమైన నిర్దేశాంక వ్యవస్థను అందిస్తుంది. దానివల్ల నక్షత్రాల నేపథ్యంలో గ్రహాల స్థానాలను కోణీయ దూరాల రూపంలో సులభంగా వ్యక్తీకరించవచ్చు.ఈ సౌలభ్యం వల్ల, ఏ రోజు గ్రహ స్థితి కావలసి వచ్చినా, యుగ ప్రారంభంనుండి గడిచిన పౌరదినాలను (civil days)బట్టి, మహాయుగంలో ఆ గ్రహం చేసే భ్రమణాలకి దామాషా పద్ధతిలో ఆ రోజు వరకు గ్రహ భ్రమణాలనీ, దానినుండి మధ్యమ గ్రహాన్ని కనుక్కోవచ్చు. అలా ఏ సమయంలోనైనా గ్రహాల మధ్యమ స్థానం కనుక్కోవాలంటే, నిలకడగా ఉండే ప్రారంభ బిందువు ఉంటేనే సాధ్యమౌతుంది. విషువత్తుల చలనం వల్ల ప్రతి సంవత్సరమూ మారుతుండే సాయన మేషరాశి ప్రారంభ బిందువు ఉపయోగించదు. [ఇక్కడ మరొక విషయం స్పష్టం చెయ్యాలి. సాయన సిద్ధాంతంలో, సూర్యుడు తన భ్రమణంలో ఉత్తరార్ధగోళంలో ప్రవేశించేటపుడు జ్యోతిశ్చక్రాన్ని ఖండించే బిందువు(vernal equinox)ని మేషరాశి ప్రారంభ బిందువుగా పరిగణిస్తారు. నిరయన సిద్ధాంతంలో మేషరాశి ప్రారంభ బిందువు స్థిరం. ఈ రెండింటి మధ్యనున్న దూరమే విషువత్ చలనం.] అందుకని జ్యోతిశ్చక్రం మీద సూర్యుడి చలనం ఆధారంగా, విషువత్తులనీ, ఉత్తర- దక్షిణ ఆయనాలనీ, [ఇప్పటి కార్తీయ నిరూపణ వ్యవస్థ (cartesian coordinate system)లోలా,] నాలుగు మూల దిక్కులుగా తీసుకుని, యుగప్రారంభ బిందువుగా మేషరాశి ప్రారంభ బిందువును ప్రామాణికంగా తీసుకుని నిరయన సిద్ధాంతం (Sidereal System) రూపొందించారు.

ఈ సందర్భంలోనే, ఆర్యభట I నిర్వచించిన (అర్థ) జ్యా (Sine), కోటిజ్యా (Cosine), ఉత్క్రమజ్యా (Versine) ల ప్రాముఖ్యత మనకు తేటతెల్లం అవుతుంది. ఈ నిరూపకాల ద్వారా ఒక తలంలోని ఏ బిందువునైనా అది కేంద్రబిందువుతో చేసే కోణాన్నిబట్టి, కచ్చితంగా నిర్ణయించడంతోపాటు, కేంద్రంనుండి, రెండు అక్షాలనుండి, దాని దూరాన్ని కూడా కనుక్కోవచ్చు. రీని డేకార్త్ (Rene Descartes(1596–1650)) కంటే సుమారు వెయ్యి సంవత్సరాలు ముందు ‘అటువంటి’ వ్యవస్థని రూపొందించినా, దురదృష్టవశాత్తూ, మనం మన శాస్త్రజ్ఞుల కృషిని గుర్తించి అనుసరించలేకపోయాము. ఈ త్రికోణమితీయ సాధనాల ద్వారా గ్రహాల స్థానాలు, క్రాంతి (Declination) వంటి అనేక పరిమాణాలను ఆర్యభట సులభంగా, కచ్చితంగా గణించగలిగాడు.

3. గ్రహ కక్ష్యల స్వరూపానికి ఎందుకు తక్కువ ప్రాముఖ్యం?

ఆర్యభట I, ఇతర భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించినట్లు కనిపిస్తుంది: ఒక గ్రహం ఎక్కడ ఉందో చెప్పడానికి, దాని కక్ష్య అసలు స్వరూపం పూర్తిగా తెలుసుకోవడం తప్పనిసరి కాదు. గ్రహం ఎందుకు అసమగతిలో సంచరిస్తుందన్న ప్రశ్నకంటే, ఆ అసమగతిని గణితపరంగా ఎలా నిర్దేశించవచ్చన్నదే వారికి ముఖ్యం.

గ్రహం అసమగతిలో నడుస్తోందని పరిశీలనలు వ్యక్తపరుస్తున్నా, అది సమవేగంతో ఒక వృత్తాకార కక్ష్యలో నడుస్తోందని ప్రమేయం తీసుకోవడం వెనుక, మందవృత్తాల ద్వారా ఆ అసమచలనాన్ని వివరించగల సమర్ధత కారణం. వారి లక్ష్యం గ్రహస్థానాన్ని కచ్చితంగా అంచనా వేయడం. దానికోసం వారు:

  • మంద సంస్కరణ
  • శీఘ్ర సంస్కరణ
  • మందవృత్తాలు

వంటి జ్యామితీయ పద్ధతులను ఉపయోగించారు.

ఒక గణిత వ్యవస్థ విజయాన్ని నిర్ణయించేది – అది “వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంది?” అన్న ప్రశ్న కాదు; “ఎంత కచ్చితంగా అంచనా వెయ్యగలుగుతోంది?” అన్నదే.

4. ఆర్యభట I ప్రతిభ

ఆర్యభట ప్రతిభ కేవలం గ్రహణ గణితంలో లేదు. ఆధునిక కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే, ఒక విస్తృత ఖగోళ గణిత వ్యవస్థకు అవసరమైన ‘ఆర్కిటెక్చర్’ను నిర్మించడంలో ఉంది.

అతని ప్రతిభకి గీటురాళ్ళు:

  • అప్పటివరకూ ఉన్న సిద్ధాంతాలనీ, సంప్రదాయాలనీ పునస్సమీక్షించి, సమకాలీన మేధావులైన బ్రహ్మగుప్తుడు, వరాహమిహిరుడు వంటివారికి కూడా అవగాహన కానంత దూరదృష్టితో చేసిన భూ-భ్రమణ సిద్ధాంతం
  • మహాయుగ ప్రక్షాళన
  • వృత్తపాదాన్ని 24 భాగాలుగా విభజించి జ్యాలూ, జ్యాల మధ్య తేడాల సూచికల నిర్మాణం, ఆ విలువల కచ్చితత్వం
  • గ్రహణాలని ముందుగా పసిగట్టడానికి రూపొందించిన గణిత ప్రక్రియ
  • కాలాన్ని శబ్దంతో సమన్వయం చేసి 60 దీర్ఘాక్షరాలు పలకడానికి 24 సెకెన్ల కాలం అంటే ఒక విఘడియ కాలం పడుతుంది అని నిర్ణయించడం
  • అప్పటివరకూ ఎవరూ చెయ్యని రీతిలో π ని వ్యవహారానికీ (√10), కచ్చితత్వానికీ (62832/20000) వేరు వేరుగా నిర్వచించిన తీరు
  • ఖగోళ వస్తువు నియమిత కాలంలో ఆవర్తనాలు జరుపుతున్నపుడు, దాని కక్ష్య వ్యాసార్ధాన్ని పరిమాణంతో నిమిత్తం లేకుండా, రేడియన్ల ప్రమాణంలో దానిని కుదించి R = 3438 = 21600/ 2π అని నిర్ణయించడం
  • అతి చిన్న కోణాలలో జ్యాకీ, చాపానికీ ఉండే ప్రమాణం దాదాపు సమానం అన్న విషయాన్ని (ఇప్పటి భాషలో first order approximation ఉపయోగించి ) జ్యాపట్టికల వ్యవస్థని నిర్మించిన తీరు

400 సంవత్సరాలు అఖండంగా వెలుగొందిన కేరళ గురుపరంపర అతని వ్యవస్థని అక్కునజేర్చుకుని, దాన్ని మెరుగుపరిచిందన్న ఒక్క విషయం చాలు. అతని ప్రతిభకి వేరెవ్వరి కితాబులూ అవసరం లేదు.

5. చంద్రుని నాడుల (Nodes) ప్రాముఖ్యత

గ్రహణాలను ముందుగా అంచనా వెయ్యడంలో చంద్రుని కక్ష్యకన్నా, ఆ కక్ష్య జ్యోతిశ్చక్రాన్ని ఖండించే రెండు బిందువులు అతి ముఖ్యమైనవి. వీటిని ఆధునిక ఖగోళశాస్త్రం ఆరోహణ నాడి (Ascending Node), అవరోహణ నాడి (Descending Node)గా వ్యవహరిస్తుంది.

సమకాలీన భారతీయ సంప్రదాయంలో ఇవి రాహు, కేతువులుగా ప్రసిద్ధి పొందాయి. సూర్య, చంద్రులు ఈ నాడుల సమీపంలో అమావాస్య సమయంలో సంయోగంలోకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవించే అవకాశం వస్తుంది. అందుకే భారతీయ ఖగోళశాస్త్రజ్ఞులు ముందుగా నాడిని ఆధారంగా తీసుకుని, సూర్యచంద్రుల రేఖాంశాలనుండి నాడి రేఖాంశాన్ని ముందుగా తగ్గించేవారు. ఇది ఆధునిక నిర్దేశాంక గణితంలో మూలబిందువు బదిలీ (Shifting the Origin)కి సమాంతర భావన. దానివల్ల, చంద్రుడి అక్షాంశ గణన సులభమౌతుంది.

చంద్రుడు జ్యోతిశ్చక్రంపై ప్రయాణించడు. అతని కక్ష్యకు జ్యోతిశ్చక్రంతో కొంత వాలు (obliquity) ఉంటుంది. అందువల్ల, కేంద్రాన్ని నాడికి తీసుకుపోయినపుడు, చంద్రుడి అక్షాంశం నాడినుండి దూరంగా మారుతుంది. ఇక్కడే జ్యా గణనలు కీలకమవుతాయి. నాడినుండి చంద్రుని దూరం గ్రహణసంభవతనీ, గ్రహణస్వరూపాన్ని, గ్రహణకాలాన్ని నిర్ణయిస్తుంది.

దీన్నిబట్టి, భారతీయ త్రికోణమితి వికాసానికి గ్రహణ గణితం ఒక ప్రధాన ప్రేరణగా నిలిచిందని ఊహించవచ్చు.

6. వృత్తపాదాన్ని 24 భాగాలుగా విభజించడం వెనుక ఆలోచన

ఆర్యభట ప్రణాళికలో వృత్తపాదాన్ని 24 భాగాలుగా ఎందుకు విభజించాడన్నది అత్యంత కీలకమైన, గహనమైన విషయం. కుతూహలం రేకెత్తించే ప్రశ్నలలో ఒకటి. మరొక సంఖ్య ఎంచుకోకుండా 24నే ఎందుకు ఎంచుకున్నట్టు అని ఆధునిక మేధావులు ఆశ్చర్యపోవడం కద్దు. గ్రంథంలో ఎక్కడా ఆ సంఖ్య ఎంచుకోవడం వెనుక కారణం ప్రత్యక్షంగా పేర్కొనబడి లేదు. కనుక మనం ఏది చెప్పినా అది ఊహాత్మకమే.

వృత్త పాదాన్ని (90o= 5400’లని) ఆర్యభట I 24 భాగాలుగా… అంటే ఒక్కొక్కటీ 225′ గా… ఎందుకు విభజించాడు? ఈ విభజన

  1. నక్షత్ర పాద ప్రమాణానికి (200′) సరికాదు.
  2. గణిత సౌలభ్యానికి 3 డిగ్రీల (180′) చాపం కాదు.
  3. పంచాంగ దృష్టిలో చూస్తే షాష్టిక పద్ధతిలో (sexagesimal system) విభజించే, ఘడియలూ, విఘడియలూ, కరణాలు వంటి 60 వ వంతు ప్రమాణసంఖ్య కాదు
  4. అంతకంటే సుళువుగా ఒక్కొక్కటీ 270′ చాపం ఉండే 20 భాగాలు కూడా కాదు.

దానికి కారణం సూర్యుడు రాశిచక్రంమీద తిరుగుతున్నపుడు పొందే అత్యధిక క్రాంతి విలువ కూడా 24o.

కనుక దాని వెనుక గణిత సౌలభ్యంకంటే, పంచాంగ అవసరాలకంటే, ఖగోళ అవసరాలు, ముఖ్యంగా గ్రహణ సంభవత, చిన్న కోణాలలో first order approximation ఆధారంగా కోణానికీ, జ్యాకీ ఉండే వ్యత్యాసం సున్నా అవుతుందన్న విషయం, అత్యధిక క్రాంతి ఆధారంగా ఏ రేఖాంశానికైనా తత్కాల క్రాంతి కనుక్కునే అవకాశంవంటి విషయాలు శాసించాయని సులభంగా గుర్తించవచ్చు.

దాన్నిబట్టి,

  1. నాడి రేఖాంశం
  2. సూర్యుని రేఖాంశం
  3. చంద్రుని రేఖాంశం
  4. చంద్రుని క్రాంతి
  5. సూర్య, చంద్రుల దిన వేగాలు

గమనించి, విస్తృత గణనలు ప్రారంభించక ముందే

  1. గ్రహణం సంభవిస్తుందా?
  2. పాక్షికమా?
  3. సంపూర్ణమా?
  4. లోతైన సంపూర్ణ గ్రహణమా?

అన్న విషయాలను ముందుగా అంచనా వేసే అవకాశం కలుగుతుంది.

7. ఆర్యభటనుండి కేరళ మాధవ గణిత సంప్రదాయం వరకు

ఆర్యభట I వ్యవస్థ బలం, దాన్ని అనుసరించిన తరువాతి శాస్త్రజ్ఞుల అపూర్వమైన కృషిని పరిశీలిస్తే స్పష్టమవుతుంది.
ఆర్యభటీయానికి లెక్కలేనన్ని వ్యాఖ్యానాలు సంస్కృతంలో, మలయాళంలో, తెలుగులో, తమిళంలో, అనేక ఇతర భాషలలో వచ్చాయి. ఆర్యభటీయం ఆధారంగా అనేక కరణ గ్రంథాలు వచ్చాయి. ఏ ఖగోళ గ్రంథానికి వ్యాఖ్య వ్రాసినా అందులో ఆర్యభటీయ ప్రసక్తి లేనివి దాదాపు శూన్యం. కేరళ మాధవ గణిత సంప్రదాయానికి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞులు:

  • ఆర్యభట ప్రతిపాదించిన జ్యా విలువలను మరింత కచ్చితంగా సవరించారు.
  • యుగారంభ స్థిరాంకాలను (epochal constants) మెరుగుపరిచారు.
  • ఆయన పరిశీలనలను మరింత పదునుపెట్టారు.
  • త్రికోణమితి సిద్ధాంతాలను అభివృద్ధి చేశారు.

వారు పూర్వాచార్యులను తిరస్కరించలేదు; వారి వ్యవస్థను మరింత మెరుగుపరిచారు. ఇదే నిజమైన శాస్త్రీయ సంప్రదాయానికి నిదర్శనం.

8. ముగింపు

రాబోయే సూర్యగ్రహణం, ప్రణాళిక వేసుకుంటే, మనకు ఒక అద్భుత ఖగోళ దృశ్యాన్ని ఆస్వాదించే అవకాశాన్ని ఇవ్వడమే కాదు, వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న భారతీయ ఖగోళ సంప్రదాయాన్ని స్మరించుకునే సందర్భాన్ని కూడా అందిస్తుంది.

భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు గ్రహణాలను కేవలం చూచి ఆశ్చర్యపడలేదు. వారు వాటి వెనుక ఉన్న గణితాన్ని, జ్యామితిని, కాలవ్యవస్థను, గ్రహగతులను అర్థం చేసుకుని ఒక సమగ్ర ఖగోళ సిద్ధాంత వ్యవస్థను నిర్మించారు. ఆ మహత్తర సంప్రదాయంలో ఆర్యభట I ఒక మైలురాయి. ఒక దిక్సూచి. ఒక ధ్రువతార. అతని అసామాన్య కృషి గ్రహణ గణితానికి మాత్రమే పరిమితం కాదు; ఖగోళాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన గణిత-జ్యామితీయ-కటపయాది పద్ధతికి భిన్నమైన – భాషను నిర్మించడంలో ఉంది. జ్యాలు, నాడులు, నక్షత్ర మండలం, మహాయుగాలు — ఇవన్నీ ఒక విస్తృత ఖగోళ సిద్ధాంత నిర్మాణశిల్పంలో పరస్పరానుసంధానమైన భాగాలు.

సంపూర్ణ సూర్యగ్రహణం కొన్ని నిమిషాలు మాత్రమే కొనసాగవచ్చు. చంద్రగ్రహణం కొన్ని గంటలు మాత్రమే కొనసాగవచ్చు. కానీ ఆర్యభట నెలకొల్పిన ఖగోళ సంప్రదాయం పదిహేను శతాబ్దాలకు పైగా కొనసాగుతూనే ఉంది. ఆ వారసత్వాన్ని మూఢభక్తితో ఆరాధించడంకంటే, దాని వెనుక ఉన్న శాస్త్రీయ దృష్టిని అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి పునరంకితులం కావడమే మనం వారికి అందించగల నిజమైన నివాళి.

    
   

6అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    తః తః August 1, 2026 11:27 am

    చాలా బాగా రాశారు సు నా మూ [ su na mu- నా కన్నా రెండు సంవత్సరాలు జూనియర్ – ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో -అయిన శ్రీ నౌడూరి కి ఈ పేరు పెట్టింది నేనే కాబట్టి ] మీ పుస్తకాన్ని గూడా తొందరగా బయటకు తెండి – సంతోషం తో -తః తః

  2. 2
    కొడవళ్ళ హనుమంతరావు August 2, 2026 3:43 pm

    ప్రాచీన, ఆధునిక ఖగోళ-గణిత శాస్త్రాలపై తమకున్న లోతైన జ్ఞానంతో, సంక్లిష్టమైన విషయాలను స్పష్టమైన తెలుగులో వివరించిన నౌడూరి గారికి నా హృదయపూర్వక అభినందనలు.

    కేవలం 121 శ్లోకాలలో విస్తృతమైన ఖగోళ-గణిత శాస్త్రాలను నిక్షిప్తం చేసిన ఆర్యభటుని అపారమైన కల్పనాశక్తికి అబ్బురపడకుండా ఉండలేము. వ్యాసంలోని కొన్ని అంశాలపై నా విమర్శనాత్మక పరిశీలనలివి:

    1. “ఆర్యభట ప్రతిభ కేవలం గ్రహణ గణితంలో లేదు. ఆధునిక కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే, ఒక విస్తృత ఖగోళ గణిత వ్యవస్థకు అవసరమైన ‘ఆర్కిటెక్చర్’ను నిర్మించడంలో ఉంది,” అన్నారు. గ్రీకులు వ్యవస్థలకు, భౌతిక నమూనాలకు ప్రాధాన్యత ఇస్తే, ఆర్యభటుడు ‘మోడల్-ఫ్రీ’ అల్గారిదమిక్ పద్ధతిని ఎంచుకున్నాడు. ఆర్యభటుని వైశిష్ట్యం ఒక మోడల్ లేదా ఆర్కిటెక్చర్‌ను నిలబెట్టడంలో లేదు; ‘దృగ్గణితైక్యం’ (కంటికి కనిపించే పరిశీలనకు, గణించిన లెక్కలకు పొంతన) సాధించేందుకు అవసరమైన గణన విధానాలను (అల్గారిదమ్‌లను) రూపొందించడంలోనే ఉంది.

    2. “ఈ నిరూపకాల ద్వారా ఒక తలంలోని ఏ బిందువునైనా అది కేంద్రబిందువుతో చేసే కోణాన్నిబట్టి, కచ్చితంగా నిర్ణయించడంతోపాటు, కేంద్రంనుండి, రెండు అక్షాలనుండి, దాని దూరాన్ని కూడా కనుక్కోవచ్చు,” అన్నారు.

    సైన్, కొసైన్ అనేవి ‘నిరూపకాలు’ (Coordinates) కావు. అలాగే “కచ్చితంగా నిర్ణయించడంతోపాటు…” అనే వాక్యంలో దేనిని నిర్ణయిస్తున్నారనే దానిపై స్పష్టత కొరవడింది. “రెండు అక్షాల నుండి” స్థానాన్ని కొలవడం గోళీయ ఖగోళశాస్త్రంలో (Spherical Astronomy) ఉండదు.

    3. “రేనే డెకార్త్ (René Descartes, 1596–1650) కంటే సుమారు వెయ్యి సంవత్సరాలు ముందు ‘అటువంటి’ వ్యవస్థని రూపొందించినా, దురదృష్టవశాత్తూ, మనం మన శాస్త్రజ్ఞుల కృషిని గుర్తించి అనుసరించలేకపోయాము,” అన్నారు. ఈ పోలికలో ‘అటువంటి’ అనే పదాన్ని ఉపయోగించడం వల్ల డెకార్త్ సాధించిన విప్లవాత్మక ఆవిష్కరణ ప్రాధాన్యత తగ్గుతుంది. డెకార్త్ తెచ్చిన విశ్లేషణాత్మక రేఖాగణితం (Analytic Geometry) బీజగణితాన్ని, జ్యామితిని అనుసంధానించిన ఒక గొప్ప సాంకేతిక పరిణామం.

    4. మన పూర్వీకుల పుట్టుపూర్వోత్తరాలను కచ్చితంగా నిర్ణయించడం సులభం కాకపోయినా, చారిత్రకాంశాలను రాసేటప్పుడు ఉజ్జాయింపుగానైనా పేర్కొనాలి: ఆర్యభటుడు (క్రీ.శ. 476–550), వరాహమిహిరుడు (క్రీ.శ. 505–587), బ్రహ్మగుప్తుడు (క్రీ.శ. 598–668). వీరిని “సమకాలీనులు” అనడం పూర్తిగా సరికాదు.

    5. ఇక భూభ్రమణ సిద్ధాంతం విషయానికొస్తే, పడవలో ప్రయాణిస్తున్నప్పుడు ఒడ్డున ఉన్న చెట్లు వెనక్కి వెళ్తున్నట్లు అనిపిస్తుందనే ఉదాహరణతో ఆర్యభటుడు సాపేక్ష చలనాన్ని (Relative Motion) ఎంతో స్పష్టంగా వివరించాడు. బ్రహ్మగుప్తుడు, వరాహమిహిరుడు దీనిని తిరస్కరించింది ‘అవగాహన’ లేక కదు. నాటి భౌతిక శాస్త్ర పరిమితుల దృష్ట్యా — “భూమి వేగంగా తిరుగుతుంటే పక్షులు తమ గూళ్లకు తిరిగి రాగలవా? గాలిలో ఎగిరే వస్తువులు వెనకబడిపోవా?” అనే తర్కాల ఆధారంగా, అలాగే నాటి సాంప్రదాయక/పౌరాణిక విశ్వాసాలకు భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే వారు దానిని తోసిపుచ్చారు. వారి విమర్శను అవగాహనా రాహిత్యంగా చూడకుండా, నాటి శాస్త్రీయ వాదోపవాదాలుగా చూడాలి.

    6. “ఆర్యభట ప్రణాళికలో వృత్తపాదాన్ని 24 భాగాలుగా ఎందుకు విభజించాడన్నది అత్యంత కీలకమైన, గహనమైన విషయం…. మనం ఏది చెప్పినా అది ఊహాత్మకమే,” అంటూ, “… అన్న విషయాలను ముందుగా అంచనా వేసే అవకాశం కలుగుతుంది,” అని ముగించారు. ఈ భాగం నాకసలు అర్థం కాలేదు. [2] లో వేరే ఊహ ఉంది.

    నాకు సంస్కృతం రాదు. మూల గ్రంథం కానీ, దానిపై వ్యాఖ్యానాలు కానీ నేను చదవలేదు. నా ఈ వ్యాఖ్యకు ప్రసిద్ధ శాస్త్రవేత్త, 2004 ఆర్యభట పురస్కార గ్రహీత ప్రొఫెసర్ రొద్దం నరసింహ (Roddam Narasimha, 1933–2020) రాసిన వ్యాసాలే [1] [2] ప్రధాన ఆధారం.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] Narasimha, Roddam. “Axiomatism and Computational Positivism: Two Mathematical Cultures in Pursuit of Exact Sciences.” Economic and Political Weekly, Vol. 38, No. 35 (August 30, 2003): 3650–56.

    [2] Narasimha, Roddam. “Sines in terse verse.” Nature, Vol. 414 (December 20, 2001): 851.

  3. 3
    NS Murty August 3, 2026 1:17 pm

    శ్రీ కొడవళ్ళ హనుమంతరావుగారికి,

    ముందుగా నా వ్యాసాన్ని చదివి మీరు చేసిన కొన్ని సమంజసమైన పరిశీలనలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

    మీ వ్యాఖ్యలు చదివిన తర్వాత, కొన్ని సాంకేతిక భావనలు వ్యక్తీకరించడంలో నా భాషలో నిర్దిష్టత (precision) కొరవడిందన్న విషయం అర్థం అయింది. అదే లోపం నా సమాధానంలో కూడా ఉండకుండా చూసుకోడానికి కొంత సమయం తీసుకుని ప్రతి అంశం గురించి విడిగా స్పందించాలనుకుంటున్నాను. ఐతే ఒక విషయం మాత్రం ముందుగా స్పష్టం చెయ్యదలుచుకున్నాను:

    నా వ్యాసంలో ఆర్యభట I ని ఇతర శాస్త్రజ్ఞులతో సరిపోల్చిన సందర్భాలలో, నా ఉద్దేశం ఆర్యభట ఆలోచనల నైశిత్యాన్ని వివరించడానికి ప్రయత్నించడమూ, అతను చూపిన మార్గాన్ని భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు ముందుకు తీసుకుపోలేకపోయారని వ్యక్తపరచడమేగాని, ఏ ఇతర శాస్త్రజ్ఞునీ, అతని కృషిని తక్కువచేసి చూపటం ఎంతమాత్రం కాదు.

    భారతీయ సంప్రదాయాన్నే పరిశీలించినా, ఆర్యభటI ని అనేక అంశాలలో తీవ్రంగా విమర్శించిన బ్రహ్మగుప్త సైతం ఆయన గ్రంథంపై సుదీర్ఘమైన వ్యాఖ్య వ్రాసిన విషయం అందరకూ తెలిసినదే. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరచడమూ, పూర్వాచార్యుల కృషిని గౌరవించడమూ ఒకేసారి సాధ్యమైన సంప్రదాయం మనకు ఉంది.

    నా రచన వల్ల మీకు వేరే అభిప్రాయం కలిగితే, అది బహుశా నా భాషలోని అస్పష్టత వల్లనే. సరిదిద్దుకుందికి ప్రయత్నిస్తాను.

    ధన్యవాదాలతో,
    నౌడూరి సూర్యనారాయణ మూర్తి

  4. 4
    కొడవళ్ళ హనుమంతరావు August 9, 2026 3:56 pm

    నా వ్యాఖ్య చదివి నౌడూరిగారు నన్ను వ్యక్తిగతంగా సంప్రదించారు. గత కొద్ది రోజులుగా వారి వ్యాసంపై, ముఖ్యంగా 24 విభజనల గురించి, మాట్లాడుకున్నాము. వారు ఆర్యభటీయ ప్రామాణిక గ్రంథాన్ని [1] తెలుగులోకి అనువదిస్తున్నారనీ, గణితంలో పట్టభద్రులనీ తెలుసుకున్నాను. వారికి ఉన్నంత ఖగోళ, గణిత విస్తృత పరిజ్ఞానం నాకు లేదు. కానీ వారి ప్రతిపాదన — 24 విభజనలకూ అత్యధిక క్రాంతి విలువకూ సంబంధం కల్పించడం — సరికాదని మాత్రం నాకు కచ్చితంగా అనిపిస్తోంది.

    “కనుక దాని వెనుక గణిత సౌలభ్యంకంటే, … చిన్న కోణాలలో first order approximation ఆధారంగా కోణానికీ, జ్యాకీ ఉండే వ్యత్యాసం సున్నా అవుతుందన్న విషయం,” అన్న వాక్యంలోనే వైరుధ్యం ఉంది. ఆ రెండోది కూడా గణిత సౌలభ్యమే కదా.

    ఆర్యభటుడు అసలు ఏం రాశాడో గత కొద్ది రోజులుగా కొంత అధ్యయనం చేశాను. ఆ 24 అంశాల పట్టికకు మూలం ఏమిటి? అది ఖగోళవేత్తలకు ఎంతో ఉపయోగపడినా, దాని వెనుక ఉన్న గణిత సూత్రం ఏమిటో తెలిస్తే గాని ఆర్యభటుని ప్రతిభ ఎక్కడుందో నాకు అర్థం కాలేదు.

    ఇందుకు నాకు బాగా ఉపయోగపడింది P. P. దివాకరన్ పుస్తకం [2]. దురదృష్టవశాత్తూ అలాంటి పుస్తకాలు చాలా ఖరీదుగా ఉండి సామాన్యులకు అందుబాటులో ఉండవు. (నేను University of Washington at Seattle లైబ్రరీలకు అరగంట దూరంలో ఉంటాను కాబట్టి నాకు సులభమే.) అయితే ఈ విషయాలపై దివాకరన్ ఇచ్చిన వివరణ అందరికీ అందుబాటులో ఉన్న, “The Forgotten Mathematical Legacy of Aryabhata,” వ్యాసంలో [3] దొరుకుతుంది. మనం చిన్నప్పుడు చదువుకున్న జ్యామెట్రీ, ట్రిగొనామెట్రీ గుర్తుచేసుకుంటే దాన్ని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా అది పది, పదకొండో తరగతి పిల్లల స్థాయిని దృష్టిలో పెట్టుకుని రాసిన వ్యాసం.

    ఆర్యభటీయంలో నాలుగు భాగాలున్నాయి: గీతికపాదం, గణితపాదం, కాలక్రియాపాదం, గోళపాదం. గీతికపాదం 12వ శ్లోకంలో 24 అంశాల పట్టిక ఉంటే, గణితపాదం 11, 12వ శ్లోకాలలో దాని వెనుక ఉన్న సూత్రం దాగుంది. నీలకంఠుని వ్యాఖ్య ఆధారంగా వచ్చే పునరావృత సూత్రం (recursive formula) 24 విభజనలకే ప్రత్యేకమైనది కాదు; ఏ సమాన విభజనకైనా వర్తించే సాధారణ సూత్రం. అయితే 24 విభజనలను తీసుకున్నప్పుడు ప్రారంభ విలువలు చాలా సరళంగా రావడంతో గణన సులభమవుతుంది.

    దీనిపై దివాకరన్ ఇలా అంటాడు:“The arc of pi/48 [24 divisions] seems to have held a curious and mystical fascination for the Indian mathematical imagination which … defies rational explanation and which may have discouraged an appreciation of the true import of one of Aryabhata’s insights and held back progress for centuries.”

    అవసరమైన చోట్ల నిరూపణలతో నిండి ఉన్న దివాకరన్ పుస్తకం నాకు నచ్చడానికి మరో కారణం అతని దృక్పథం:“The hope is that we can begin to chip away, little by little, at the encrusted layers of the mythology — and occasionally, ill-informed bias — that still has some currency: that Indian mathematics was, in some strange and exotic way, not quite of the mainstream. If this book has an overriding message, it is that, conceptually and technically, the indigenous mathematics of India is in essence the same as that of other mathematically advanced cultures — how can it be otherwise? — and that its quality is to be adjudged by the same criteria.”

    దివాకరన్ తన పుస్తకాన్ని ఆర్యభటీయంలోని ఉపాంత్య శ్లోకంతో (గోళపాదం 49) మొదలుపెడతాడు. (నిజానికి అదే చివరి శ్లోకమనీ, ప్రస్తుతం చివరగా ఉన్న శ్లోకాన్ని ఆ తర్వాత ఎవరో చేర్చారనీ అతని అభిప్రాయం.)

    “సదసజ్జ్ఞానసముద్రాత్ సముద్ధృతం బ్రహ్మణః ప్రసాదేన
    సజ్జ్ఞానోత్తమరత్నం మయా నిమగ్నం స్వమతినావా.”

    “From the ocean of true and false knowledge, by the grace of brahma, the best of gems that is true knowledge has been brought up by me, by immersing [myself in it] and by [means of] the boat of my own intelligence.”

    పి. పి. దివాకరన్ గణిత భౌతికశాస్త్రవేత్త, గణిత చరిత్ర పరిశోధకుడు. ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR)లో ప్రొఫెసర్‌గా పనిచేసి 1996లో పదవీ విరమణ చేశాడు. ఇలాంటి పుస్తకం రాసినందుకు మనమందరం ఆయనకి కృతజ్ఞులమై ఉండాలి.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] Shukla, Kripa Shankar, and K. V. Sarma, eds. Āryabhaṭīya of Āryabhaṭa. New Delhi: Indian National Science Academy, 1976. 3 వొల్స్.
    [2] Divakaran, P. P. The Mathematics of India: Concepts, Methods, Connections. New Delhi: Hindustan Book Agency, 2018.
    [3] Singh, Vijay A., and Aneesh Kumar. “The Forgotten Mathematical Legacy of Aryabhata.” School Science 61, nos. 2–3 (June–September 2023): 40–47. National Council of Educational Research and Training (NCERT).

  5. 5
    ఉప్పలూరి ఆత్రేయ శర్మ August 13, 2026 1:34 am

    చంద్ర, సూర్య, గ్రహణ, విషయాలనెన్నిటినో మన భారతీయ శాస్త్రజ్ఞులు ఆ కాలంలోనే, ఈ నాటి యాంత్రిక పరికరాలు లేని ఆ నాటి కాలంలోనే…నిశితంగా పరిశీలించి, పరిశోధన చేసిన విషయాలెన్నిటికో ఈనాటి శాస్త్రీయ సమర్థన కలిగిన అంశాలను వెలిదీసి కూలంకషంగా విశదీకరించిన మనలోని “సూర్య” అంశ అయిన నౌడూరి సూర్యనారాయణ మూర్తికి హార్దిక అభినందనలు, వినమ్ర కృతజ్ఞతలు. గతానికి, వర్తమానానికి వారధిగా మరుగున పడి ఉన్న ఇటువంటి మన భారతీయ పరిశోధనాంశాలను బయటకు తీసుకు వచ్చే కృషి నిరంతరం కొనసాగుతూనే ఉండాలి.

  6. 6
    కొడవళ్ళ హనుమంతరావు August 15, 2026 12:07 pm

    ఉప్పలూరివారి వ్యాఖ్యలోని పరికరాల ప్రస్తావన చూసి కొంత పరిశోధించగా కొత్తగా తెలుసుకున్న రెండు విషయాలు పంచుకుంటాను — ఒకటి ఆర్యభటుని గురించి, మరొకటి మా ప్రాంతానికి (ప్రకాశం జిల్లా) చెందిన ఒక విశిష్ట పండితుని గురించి.

    ఎరటోస్థెనీస్ (Eratosthenes, 276-194 BC) ఓ కర్ర నీడను, రెండు నగరాల మధ్య దూరాన్ని ఆధారంగా చేసుకుని భూమి చుట్టుకొలతను అంచనా వేశాడు. మనవాళ్లు ఏయే పరికరాలు వాడారో అన్న కుతూహలం కలుగుతుంది. ఆర్యభటీయంలో పరికర నిర్మాణాన్ని చెప్పే శ్లోకాలు రెండే: గోళపాదం 22వ శ్లోకం తేలికైన చెక్కగోళాన్ని తయారుచేసి, పాదరసం, నూనె లేదా నీటితో కాలగమనానికి అనుగుణంగా తిప్పమనీ, 23వ శ్లోకం దానిపై నక్షత్రగోళంలో సగభాగాన్ని చిత్రించమనీ తెలుపుతాయి.

    ఆర్యభటుని మరొక, ఇప్పుడు లభించని రచనగా భావించే గ్రంథం “ఆర్యభటసిద్ధాంతం.” మనకు లభిస్తున్న “ఆర్యభటీయం” ఉదయిక పద్ధతిలో, అంటే దినారంభాన్ని సూర్యోదయం నుంచి లెక్కిస్తే, “ఆర్యభటసిద్ధాంతం” అర్ధరాత్రిక పద్ధతిని అనుసరిస్తుంది. బ్రహ్మగుప్తుడు తదితరుల రచనల్లో “ఆర్యభటసిద్ధాంతం” ప్రస్తావనతోబాటు, ఆ గ్రంథంలోని యంత్రాధ్యాయంలో పరికరాలపై గల 34 శ్లోకాల వివరణలు ఉన్నాయి.

    ప్రకాశం జిల్లా ఉలిచి గ్రామంలో పుట్టిన శ్రీరాముల రాజేశ్వర శర్మగారు భారతీయ ఖగోళ పరికరాల చరిత్రపై విశేష పరిశోధన చేశారు. అనేక దేశాలలోని మ్యూజియంలు, వ్యక్తిగత సేకరణలను పరిశీలించి, “A Descriptive Catalogue of Indian Astronomical Instruments,” రూపొందించారు. అది అందరికీ అందుబాటులో ఉంది. దాని పీఠిక నుంచి:

    తనుర్ నేత్రైర్ న్యూనా, నృపతిరహితా రాజనగరీ;
    సరస్యో నిష్పద్మా, యువతిరపి కాంతేన రహితా;
    నిశా నిఃశీతాంశుః, సరిదపి యథా చక్రరహితా;
    తథా జ్యోతిర్విద్యా భవతి విఫలా యంత్రరహితా.

    (కళ్ళులేని శరీరం, రాజులేని రాజధాని, పద్మాలు లేని సరస్సు, ప్రియుడు లేని యువతి, చంద్రుడు లేని రాత్రి, చక్రవాకపక్షులు లేని నది ఎలా వెలితిగా ఉంటాయో, యంత్రాలు లేని ఖగోళవిద్య కూడా అలాగే నిష్ఫలమవుతుంది.)
    — రామచంద్ర వాజపేయిన్, 1428, యంత్రప్రకాశ

    శర్మగారిని నా దృష్టికి తెచ్చినందుకు పరుచూరి శ్రీనివాస్‌కి అనేక కృతజ్ఞతలతో,
    కొడవళ్ళ హనుమంతరావు

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • బెంతోమార్మె
  • వర్షంలో పిల్లికూన
  • తన రచనకి ఒక ప్రామాణికతని సృష్టించుకున్న కథకుడు మధు పెమ్మరాజు
  • సమయసూచి వరరుచి 1
  • పదిహేనుగురు హంతకుల అద్భుతం

ఇటువంటివే…

  1. భారతీయ పుస్తక చరిత్ర: 2. రాత పుట్టుక, పరిణామం – భారతీయ లిపులు
  2. పరిచయం: భారతీయ రచయిత్రులు
  3. భైరప్ప నవలలు — భారతీయ దర్శనాలు
  4. భారతీయ పరిచయక్రమం: కాఫ్కా
  5. స్పందన: భారతీయ కావ్యాల కాల-కర్తృనిర్ణయం

ఆగస్ట్ 2026 సంచికలో ...

  • అఫ్సర, ఒకటవ తరగతి
  • అలుపెరగని యాత్రికుడి అంతరంగం: డా. నిమ్మగడ్డ శేషగిరిగారితో ముఖాముఖి
  • ఆగస్టు 2026
  • ఇలియాడ్: రణరంగం-I
  • ఎంవివి సత్యనారాయణ స్మారక సాహితీ పురస్కారం
  • ఓర్పు
  • కంప్యూటర్ చిప్ కథ – 16: ఐన్‌స్టైన్ ఊహాజనిత ఫోటాన్
  • కర్ణభారం – సమూలానువాదం
  • కోటి వీణలు మ్రోగి గుండెలో
  • గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాలు 2026 – ఫలితాలు
  • చీకటి చందమామ
  • చెదిరిన సరిహద్దులు – వలసల వ్యథ: సామ్ డాల్రింపుల్ ‘షాటర్డ్ లాండ్స్’
  • తిక్కన అనుసృజనకౌశలం
  • దేశం విసిరిన…
  • నింగీ, నీరూ, నికోబార్-1
  • నీకు నువ్వు, నీ భాషలో
  • పరీక్ష
  • బేలా టార్ చనిపోయిన రోజు
  • భారతీయ ఖగోళ సంప్రదాయం – ఆర్యభట-I కల్పనాశక్తి
  • మంకుతిమ్మని మరో మిణుకు — 7 (61-70)
  • మహాకవి రావిపాటి త్రిపురాంతకుడు – II: కర్తృత్వ వివాదాలు
  • ముద్దుపళనిని ఎలా చదవాలి? రాధికాసాంత్వనంలోని అంతర్లీన కావ్యదృష్టి
  • యూట్యూబ్ లో ఈమాట: జూలై 2026
  • రక్త సింహాసనం
  • సీతాంజనేయ సంభాషణం – III
  • స్మృతిభానుత్రిశతి
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

మంకుతిమ్మని మరో మిణుకు — 7 (61-70)
మహాకవి రావిపాటి త్రిపురాంతకుడు – II: కర్తృత్వ వివాదాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.