అలుపెరగని యాత్రికుడి అంతరంగం: డా. నిమ్మగడ్డ శేషగిరిగారితో ముఖాముఖి

జీవితమే గమనం అన్నది జగమెరిగిన సత్యం. మన ఉనికే ఒక నిరంతరమైన, గతిశీలమైన సంఘటనాక్రమాల కదంబం అనుకుంటే, అందులో ప్రయత్నపూర్వకంగా యాత్రలు తలపెట్టి, ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడి విశేషాలను ప్రత్యక్షంగా చూడటం, అక్కడి వారితో పరస్పర సాహచర్యం, ఇవన్నీ ఒకెత్తు కాగా, చూసిన విశేషాలనీ పొందిన అనుభవాలనీ ఎటువంటి స్వలాభాపేక్షా లేకుండా అందరికీ పంచబోవడం ఒక బృహత్కార్యం; సత్కార్యంకూడా. ఈ విధమైన యజ్ఞాలను పరిపూర్ణం చెయ్యడానికి మనిషిలో తపన, అవగాహన, క్రమశిక్షణ, అవధులు లేని సకారాత్మకమైన ఆలోచనాధోరణీ కావాలి. ఇవన్నీ ఒకే వ్యక్తిలో సమకూడటం, తక్కువమందిలో కనిపించే ఒక విలక్షణమైన సమ్మేళనం.

పైన చెప్పుకున్న ఉత్తమ లక్షణాలే కాకుండా, నాయకత్వ లక్షణాలు కూడా తోడయాయి డా. నిమ్మగడ్డ శేషగిరిగారికి. అవి ఆయన చేత అనేక దేశాల్లో అడుగులు వేయించాయి. సాహసయాత్రలు చేయించాయి. చూసిన వాటిని చెప్పించాయి.

డా. శేషగిరిగారు వృత్తిరీత్యా మానసిక వైద్యులు. ఉద్యోగరీత్యా లండన్‌లో స్థిరపడ్డారు. ఈ మధ్య ఢిల్లీ వచ్చినప్పుడు, ఆయనతో జరిపిన సంభాషణలో కొన్ని ఆసక్తికరమైన, ప్రత్యేకమైన విషయాలు అవగాహనకు వచ్చాయి. వాటిని మీతో పంచుకుందామని ఈ ప్రయత్నం.


నమస్తే శేషగిరిగారూ, మీరు ఫోరెన్సిక్ సైకియాట్రిస్ట్ అని విన్నాం. అంటే ఏమిటి? కొంచెం వివరిస్తారా?

నమస్తే. మౌలికంగా మేమందరం డాక్టర్లమేనండి. మానసిక వైద్యులుగా శిక్షణ పొంది, అందులో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళం. మానసిక రుగ్మతలున్న నేరస్థులకు చేయవలసిన చికిత్స గురించి ఫోరెన్సిక్ సైకియాట్రిస్ట్‌లకు నైపుణ్యం ఉంటుంది. అలాంటి నేరస్థులని నేను పరిశీలించి, రోగనిర్ధారణ చేసి, వైద్యం చేయడమే కాక, కొన్ని సంక్లిష్టమైన, తీవ్రస్థాయి నేరాల కేసులకు తీర్పులు రూపొందించడంలో న్యాయస్థానాలకు తోడ్పడుతుంటాను.

మీ యాత్రాకథనాలని చదువుతుంటే తోచిన ప్రశ్న ఇది. సాధారణంగా అందరూ పర్యటించాలనుకునే చోట్లకు కాకుండా అంతగా దృష్టికి రాని, ఎవరూ పెద్దగా ఆసక్తి చూపని ప్రాంతాలకూ దేశాలకూ మీ యాత్రలు సాగాయి, సాగుతున్నాయి. అలాంటి ప్రయాణాలు చేయాలన్న ఆలోచనకు నాంది ఏది? ఇప్పటివరకూ ఎన్ని దేశాలు సందర్శించారు?

ఈరోజు నేను చేపడుతున్న యాత్రలకు కనీసం ఒక పాతికేళ్ళ నేపథ్యం ఉందని చెప్పాలి. మొదట్లో నేను కూడా అందరిలానే దర్శనీయ స్థలాలకూ, ప్రసిద్ధి చెందిన చోట్లకే వెళ్ళేవాణ్ణి. రానురానూ ప్రయాణాలు చెయ్యడమన్న అభిరుచిలో గాఢత పెరిగేసరికి, ప్రతి చోటా ఏదో ఒక విధమైన ఆకర్షణా, ప్రత్యేకతా కనిపించడం మొదలైంది. మనం చూసే దృష్టికోణం వల్లనే అవి కనిపిస్తున్నాయని స్ఫురించింది. అందుకే కొన్ని కొన్ని ప్రాంతాలు మొదట అనాసక్తికరంగా కనిపించినా అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ ప్రాంతాలకే ప్రత్యేకమైన విశేషాలు, అక్కడి వ్యక్తులతో జరిగే ఇంటరాక్షన్ – వాటికి ప్రత్యేకతను సమకూర్చుతాయి. కొత్త కొత్త ప్రదేశాలను చూడడం అంటే ఆసక్తి నాలో చిన్న వయసునుంచే ఉంది. అదే నా ప్రయాణాలకు నాంది పలికిందనుకుంటాను. ఇక సంఖ్యాపరంగా చెప్పాలంటే, దాదాపు 130 దేశాలకు పైగా సందర్శించాను.

మీ రచనల్లో, హిమాలయాల్లో చేసిన ట్రెక్‌లలో హిమాలయ నిశ్శబ్దాన్ని గురించిన ప్రస్తావన ఉంది. గలాపగోస్ యాత్రలో, అతి తక్కువమందికి తెలిసిన హమ్‌బోల్ట్ గురించిన వివరణ ఉంది. అడుగుపెట్టిన ప్రతి చోటినుంచీ ఇలా పోగు చేసుకున్న దృశ్యాలనూ అనుభూతులనూ మీ యాత్రాకథనాల ద్వారా మాకు అందించారు. ఇవన్నీ మీలోని నమ్రతను మరింత పెంచుతున్నాయీ అన్నారు. దాంతో, ప్రతి యాత్రలోనూ మీలోకి కూడా మీరు ప్రయాణించారని అర్థమవుతోంది. అలాంటి అంతర్యాత్ర విశేషాలు కొన్ని చెప్పండి.

చిన్నప్పటినుంచీ నాకు హిమాలయాలంటే ఒక గొప్ప వూహా, ఆ పర్వతాలని ప్రత్యక్షంగా చూడాలని గాఢమైన తపనా ఉండేవి. మన చందమామ కథల దగ్గర్నుంచీ రామాయణ మహాభారత గాథల్లోనూ, కావ్యాల్లోనూ చాలాచోట్ల హిమాలయాల వర్ణన ఉంటుంది. ట్రెకింగ్‌ల రూపేణా, నేపాల్‌లో ఉన్న హిమాలయాల్లోని కొన్ని అద్భుతమైన ప్రాంతాలకు వెళ్ళే అవకాశం దొరకడం నా అదృష్టం. హిమాలయ పర్వతాల సానువులనుంచీ, 5000 మీటర్లకు మించిన ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ కాంప్, అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్, మనస్లువంటి పర్వతాల్లోకి చేసిన ప్రయాణాలు అద్భుతమైన అనుభవాలను మిగిల్చాయి. హిమాలయాల ప్రారంభంలో ఉన్న అడవులనుంచీ, నదుల పక్కనుంచి, గ్లేషియర్లు, మంచుటోపీలు తొడుక్కున్న శిఖరాలు, చిన్న చిన్న గ్రామాలను దాటుకుంటూ పైపైకి, ఎడారుల్లాంటి ప్రదేశాల్లోకి చేరడం – నా వరకూ ఒక కలలాంటి అనుభవం. ఇక హిమాలయన్ సైలెన్స్ అన్నది ఏ కాంటెక్స్ట్‌లో అన్నానంటే, ఒకదాని తర్వాత మరొకటిగా ఎదురయ్యే అనుభవాలూ అనుభూతులూ అన్నీ ఆగిపోయి, శూన్యంవంటి ఒక నిర్గుణ మనఃస్థితి కలుగుతుంది. అది మాటల్లో చెప్పలేని, పరిపూర్ణమైన సంతృప్తిని కలిగిస్తుంది. దాన్ని వర్ణించేందుకే ఆ పదాన్ని వాడాను.

ఇక హమ్‌బోల్ట్ విషయానికి వస్తే, కనుమరుగైన అనేకమంది విశిష్ట వ్యక్తులను మనం క్రమంగా మర్చిపోతుంటాం. అలా చరిత్ర పుటల్లో పదిలమైన మహానీయులని గుర్తు చేసుకోవడం, వాళ్ళ గురించి వివరంగా తెలుసుకోవడం నాకు ఇష్టమైన వ్యాపకం. హమ్‌బోల్ట్, డార్విన్‌వంటి వాళ్ళు మానవజాతి పరిజ్ఞానాన్ని పెంచేందుకు నిరుపమానంగా కృషి చేశారు. డార్విన్ గురించి కాస్తో కూస్తో చదువుకున్నామేమోగానీ హమ్‌బోల్ట్ గురించి తెలిసింది అంతంతమాత్రమే. ‘హమ్‌బోల్ట్ కరెంట్’ అన్నదానితో సహా, హమ్‌బోల్ట్ పేరుమీద చాలా ఆవిష్కరణలున్నాయి. గలాపగోస్ వెళ్ళిన తర్వాత ఆయన ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి ఆ సందర్భం దోహదపడింది. డార్విన్ గురించి మనకు తెలిసినా, గలాపగోస్ వెళ్ళిన తర్వాత ఆయన ఏమేం పరిశోధనలు చేశాడు, ఆయన గురించిన ఇతర విశేషాలేమిటి అన్నది వివరంగా తెలుస్తుంది.

ఆ యాత్రలో నేనొకటి గమనించాను. హమ్‌బోల్ట్, డార్విన్‌వంటి వాళ్ళ గురించి చదివితేనో, వీడియోలో చూస్తేనో కలగని ఒక సందర్భజనితమైన అనుభవం అక్కడికి వెళ్ళి, వాళ్ళు చేసిన కృషి, వాళ్ళు సమకూర్చిన పరిజ్ఞానం, ఆ దేశాలకి వాళ్ళ మీదున్న గౌరవంవంటివన్నీ ప్రత్యక్షంగా చూసినప్పుడు కలుగుతుంది.

గాంధీగారి గురించి చదువుతున్నప్పుడు వచ్చే అనుభూతి కాకుండా, ఆయన నివసించిన సబర్మతీ ఆశ్రమంలో ఆయన రాట్నం వడికిన చోటుని, కూర్చుని రాజకీయ నిర్ణయాలు తీసుకున్న గదిని చూస్తే, అప్పుడు కలిగే అనుభూతి, ఆయన గురించి తెలిసిన విషయాలకు ఒక ప్రత్యేకతను జోడిస్తుంది. అందుకే, చిలీ వెళ్ళినప్పుడు పాబ్లో నరూడా గురించి తెలుసుకుని, ఆయన ఇంటికి వెళ్ళి, ఆయన వాడిన వస్తువులు వగైరాలని చూసినప్పుడు నాకు అటువంటి ప్రత్యేకమైన అనుభూతే కలిగింది. అలాంటి ప్రత్యేకమైన అనుభవాలనే నా రచనల ద్వారా పంచుకునేందుకు ప్రయత్నించాను.

మీరు డాక్టర్‌గా, వృత్తివ్యాపకాల్లో బిజీగా ఉంటారు. కుటుంబ బాధ్యతలు సరే సరి. వీటికి అదనంగా, బంధుమిత్రులతో కలిసి పాల్గొనే సందర్భాలు కూడా ఎన్నదగిన సంఖ్యలోనే ఉంటాయి. వీటన్నిటి మధ్యా, మీ పర్యటనలకోసం ప్రణాళికలను వేసుకోవడం అసాధ్యం కాదుగానీ, అతి కష్టం. ఈ సంయమనాన్ని ఎలా సాధించగలుగుతున్నారు?

మనం కొంత ప్రణాళికాబద్ధంగా ఉంటే, ఆ సమతుల్యత అంత కష్టం కాదనిపిస్తుంది. యాత్రలు చెయ్యడం నా అభిరుచి అని నా సహోద్యోగులు, సన్నిహితులు, కుటుంబసభ్యులు అందరికీ తెలుసు. నా యాత్రాప్రణాళికల గురించి, వాటికి వినియోగించే సెలవులు వగైరాల గురించి ఒక సంవత్సరం ముందే ప్లాన్ చేసి ఉంచుకొని, వాళ్ళందరితోనూ వాటిని ముందుగానే పంచుకుంటాను. వాళ్ళ సలహాలూ తీసుకుంటాను. ఇదంతా నా హాబీలో భాగమే. అలా చెయ్యడంవల్ల నాకు వృత్తిపరంగాగానీ, కుటుంబపరంగాగానీ, సాంఘిక చర్యల్లోగానీ ఇబ్బందులు రాకుండా చూసుకోగలుగుతున్నాను. నిజానికి, ‘నేను ప్రతి సంవత్సరమూ ఇన్ని దేశాలు పర్యటించాలనుకుంటున్నాను’ అని ముందే అందరికీ తెలియడంవల్ల, అటు నా సహోద్యోగులూ, ఇటు నా కుటుంబమూ కూడా నాకు సహకరిస్తున్నారు. ఈ రొటీన్‌ను పాతికేళ్లుగా కొనసాగిస్తున్నాను.

నా యాత్రల గురించి రాయడానికి కొంత సమయం పడుతుందిగానీ, అది కూడా చాలా సంతృప్తినిస్తుంది. పైగా నేను రాసింది అమరేంద్రగారూ, జయశ్రీగారూ అనువదించడం, అవి ‘ఈమాట’ ద్వారానూ ‘మిసిమి’ ద్వారానూ పదిమందికీ చేరడం, పుస్తకాల రూపంలో రావడం – ఇవన్నీ ఎంతో తృప్తినీ, మరింత ప్రేరణనూ కలిగిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే, మనకు ఆనందాన్ని కలిగించేది చెయ్యడం మనకు టైమ్ వేస్ట్‌గా తోచదు. ఏ పనైనా చెయ్యడానికి సమయం ఎప్పుడూ ప్రతిబంధకం కాదు. పైగా దానికి కావలసిన టైమ్ దానంతట అదే సమకూరుతుంది కూడా. మరో విధంగా చెప్పాలంటే, సమయం దొరకడం, దొరకకపోవడం అన్నది మనం ఇచ్చుకునే ప్రాధాన్యతలమీద ఆధారపడి ఉంటుంది అనాలి.

మీ పర్యటనల్లో ఒంటరిగా చేసినవీ ఉన్నాయి, బృందాలకు నాయకత్వ బాధ్యతలు వహిస్తూ సమిష్టిగా చేసే, ట్రెక్‌లవంటి సాహసయాత్రలూ ఉన్నాయి. వీటిలోని సౌలభ్యాలూ సవాళ్ళూ వేర్వేరు ఉంటాయి కదా! వాటి గురించి వివరించండి.

నేనైతే మొదట్లో ఒంటరిగా ప్రయాణించాలని అనుకోలేదు. అది కూడా పరిణామక్రమంలో జరిగిందే. మొదట్లో నేను కూడా కుటుంబంతోనూ స్నేహితులతోనూ వెళ్ళేవాణ్ణి. రానురానూ నేను వెళ్ళే పేస్ అందరికీ కుదరకపోవడం, నేను వెళ్ళే మారుమూల ప్రాంతాలను చూడటానికి ఇతరులు అంతగా ఆసక్తి చూపకపోవడం, నాకు సెలవు దొరికినప్పుడు వాళ్ళకు దొరకకపోవడంవంటివి జరుగుతుండేసరికి, నాకు తెలియకుండానే, క్రమంగా ఒంటరి ప్రయాణాలకు ఒడిగట్టసాగాను. అది దాదాపు ఇరవై ఏళ్ల క్రితం మొదలైంది. మెల్లమెల్లగా ఆ ఒంటరి ప్రయాణాల్లోని ఏకాంతం, ఆ ఏకాంతంలోని ఆనందం, మనల్ని మనం తెలుసుకునే టైమూ స్పేసూ దొరకడం – ఇవన్నీ నాకు చాలా ప్రయోజనకరంగా అనిపించసాగాయి. అలాంటి ప్రయాణాల్లో నాకు తోడుగా ఎవరూ లేకపోయినా, ఎప్పుడూ బోర్ కొట్టలేదు. దాంతో ‘నాకు నా తోడు సరిపోతుంది’ అన్న వాస్తవం స్ఫురించింది. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నా, ఒక విధంగా ప్రపంచమే తోడుగా ఉంటుంది. పక్కన ఎవరుంటే వాళ్ళే మనకు కంపెనీ. పదిమంది ఉన్న ఒక చిన్న గ్రూప్‌తో వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు తోడవుతారు. ఒక్కళ్ళమే ఉన్నప్పుడు చుట్టుపక్కలున్న ప్రపంచమంతా మనకు తోడుగా మారిపోతుంది. ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు నాతో అరమరికలు లేకుండా మాట్లాడటం, నన్నూ తమలో ఒకడిగా స్వీకరించడం, ఆదరించడం జరిగాయి.

ఒంటరిగా ప్రయాణాలు చెయ్యడంలో చాలా ప్రయోజనాలున్నాయి. నా వరకూ నాకు అవి చాలా సంతృప్తినిస్తాయి. సాధారణంగా, కుటుంబంతో ఉన్నప్పుడైనా, పనిలో ఉన్నప్పుడైనా, స్నేహితులతో ఉన్నప్పుడైనా, మనకు ఉండే స్థిరమైన సంబంధబాంధవ్యాలను మనం గౌరవించక తప్పదు. కానీ ఒంటరి ప్రయాణాల్లో ఒక స్వేచ్ఛావిహంగంలా, స్వతంత్రుడిగా ఉండొచ్చు. మనకు మనమే తప్ప, మరెవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఏకాంతానికి ఏకాంతమూ ఉంది, చుట్టూ ప్రపంచమూ ఉంది. మీది అనుకుంటే ప్రపంచమంతా మీదే అవుతుంది. లేదూ, మీకు మీరు ఎటూ ఉండనే ఉంటారు. అలాంటి భావనలవల్ల, రోజుల తరబడి ఏకాంతంగా ప్రయాణం చెయ్యడం, ఆ క్రమంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త కొత్త అనుభూతులు పొందడం, కొత్త మనుషులతో పరిచయం ఏర్పడటం నాకు అలవాటైన ప్రక్రియగా మారింది.

ఇక బృందాలతో చేసే యాత్రల గురించి. ఆ యాత్రలు నేను తలపెట్టడానికి మొదటి కారణం – నేను చేసేవి, రెండు మూడు వారాలపాటు కొనసాగే పెద్ద పెద్ద ట్రెక్‌లు. వాటిని ఒంటరిగా చెయ్యడానికి పూనుకుంటే, ఏర్పాట్ల విషయంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాలి. అదే ఒక బృందంగా వెళ్తే, దానికి సంబంధించిన గైడ్లూ, పోర్టర్లవంటి వనరుల ఏర్పాట్లు చేసుకోవడం సులభమౌతుంది. ఇక రెండోది, ‘మేము కూడా మీతోబాటు ట్రెక్ చేస్తాం’ అని చాలామంది అడుగుతుంటారు. వాళ్ళను కాదనలేను. వాళ్ళకు కూడా ఆ అనుభవాన్ని రుచి చూపించడం మంచిదే కదా అనిపిస్తుంది. ఇక మూడో కారణం, అన్నేసి రోజులపాటు, పరిచయమున్న వాళ్ళతో కలిసి నడిచినప్పుడు ఆ బంధాలు ఎటూ బలోపేతమౌతాయి. కొత్తవాళ్ళతోనూ, నాకు అంతగా పరిచయం లేని వాళ్ళతోనూ కలసి నడవటం వల్ల, కొత్త కొత్త స్నేహాలు ఏర్పడతాయి. హిమాలయాల్లో, కిలిమంజారో, మౌంట్ తుబ్‌కల్, అట్లాస్ పర్వతాల్లో, పెటగోనియాలో చేసిన ట్రెక్‌లకు పెద్ద పెద్ద బృందాలనే తీసుకెళ్ళాను. అవన్నీ ఎంతో సంతృప్తికరంగా సాగాయి.

మరి ఏకాంతం, హిమాలయ నిశ్శబ్దం – వీటి సంగతేమిటి?

ఎంతమందితో ఉన్నా, ఆ విశాలమైన నిర్జనప్రదేశాల్లో అటు ఏకాంతమూ, ఇటు ఇతరుల సాహచర్యమూ రెండూ ఉంటాయి. అక్కడ ఏకాంతానికి భంగం కలగదు. కొద్దిగా శ్రద్ధ వహిస్తే మీ నిశ్శబ్ద ధ్యానాలనూ, మీ నిశ్శబ్దావిష్కరణలనూ మీరు కొనసాగించుకోవచ్చు. అదే సమయంలో సాంగత్యం, సమిష్టి కృషి, ఒక్కరి భద్రత గురించి బృందమంతా కలసికట్టుగా పూనుకోవడం, ప్రకృతిశక్తులను ఎదుర్కొంటూ నడుస్తున్నప్పుడు ఒకరికొకరు దన్నుగా నిలవడం – ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మొత్తానికి దేని సౌందర్యం దానిదే, దేని ప్రయోజనం దానిదే.

మీరు చేసిన యాత్రల్లో, సందర్శించిన దేశాల్లో మీమీద మరపురాని ముద్ర వేసిన దేశం/ప్రాంతం ఏది?

ఇది కొంచెం కష్టమైన ప్రశ్నే అనిపిస్తుందండీ నాకు! స్విట్జర్లాండ్ అందం స్విట్జర్లాండ్‌దే, సూడాన్ అందం సూడాన్‌దే. సూడాన్ వెళ్ళినప్పుడు ఖార్తూమ్‌లో, బ్లూ నైల్-వైట్ నైల్ నదుల సంగమాన్ని చూశాను. బ్లూ నైల్, సుదూరాన వాయువ్య ఇథియోపియాలోని తానా సరస్సులో పుట్టి సూడాన్ చేరుతుంది. వైట్ నైల్ నది తూర్పు, మధ్య ఆఫ్రికాలోని విక్టోరియా సరస్సులో పుట్టి సాగుతుంది. ఆ రెండిటి సంగమం ఒక అద్భుతం. అంటే – అది చూడగానే ఆకట్టుకునే దృశ్యం అనడంకన్నా, దాని ప్రాముఖ్యతను గుర్తించాలి అంటున్నాను. నైల్ నది వెంబడి ఎంత గొప్ప నాగరికత పరిఢవిల్లిందో మనకు తెలుసు. ఆ విధంగా, ఎంత చిన్న దేశానికి వెళ్ళినా అక్కడ కూడా ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది నాకు. అలాంటి దృష్టి ఉండబట్టే కొన్ని అప్రసిద్ధమైన, ఎప్పుడూ పేరైనా వినని, అసలు అలాంటి దేశం ఉన్నట్లుకూడా తెలియని కొన్ని దేశాలకు వెళ్ళగలిగాను. కాబట్టి, మరపురాని ముద్ర వేసిన దేశం ఇదీ అని చెప్పలేనుగానీ, ప్రతి దేశమూ నా మీద ఏదో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసిందనే చెప్పగలను.

ఇక ఆసియా ఖండానికి తిరిగి వద్దామండి. పాకిస్తాన్‌తో భారత్‌కు చారిత్రాత్మకమైన సంబంధాలున్నాయి. అవి ఎప్పటికప్పుడు మార్పులకూ గురవుతున్నాయి. మిగిలిన దేశాల విషయం ఎలా ఉన్నా ప్రస్తుతం నడుస్తున్న చరిత్రలో పాకిస్తాన్ పేరు కూడా గణనీయంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో, మీ పాకిస్తాన్ యాత్ర విశేషాలు కొన్ని మాతో పంచుకోండి.

పాకిస్తాన్ వెళ్లగలగడం అన్నది నేను మరచిపోలేని విషయం. ఆ దేశాన్ని గురించి ‘సరిహద్దులు దాటి – యాత్రాకథనాలు’ అన్న పుస్తకంలో చాలా వివరంగా మూడు వ్యాసాలు రాశాను.

2004 లో, పాకిస్తాన్‌లో మూడు రోజులపాటు ఒక సమావేశం జరిగింది. అందులో పాల్గొనడానికి యూకేనుంచి వెళ్ళిన పదిమంది సైకియాట్రిస్ట్‌ల బృందంలో నేనొకడిని. మిగిలిన వాళ్ళందరూ బ్రిటిష్ పాస్‌పోర్ట్‌తో ఉండగా ఇండియన్ పాస్‌పోర్ట్‌తో ఉన్నది నేనొక్కడినే. అదే నేను మొదటిసారి పాకిస్తాన్ వెళ్ళడం. అక్కడ నాకు ఏ ఇబ్బందీ రాలేదు. ఆ కాన్ఫరెన్స్‌లో కలిసిన ఒక స్థానిక పార్లమెంట్ సభ్యురాలు మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి, ఆయా ప్రదేశాలకు ఆర్మీ ఎస్కార్ట్‌తో తీసుకువెళ్ళేరు. ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలోని ఖాగన్ వాలీ, నారాన్‌లను సందర్శించాం. ఇస్లామాబాద్, అబోటాబాద్, అశోకుడి శాసనం ఉన్న మన్షేరా, తక్షశిల, అక్కడి పంజాబ్‌లోని ఖేవ్రా హిమాలయన్ ఉప్పు గనులు, ఇంకా అక్కడ ఉన్న కొన్ని హిందూ దేవాలయాలను కూడా సందర్శించాం. నేను ఆ అవకాశాన్ని వినియోగించుకుని, మరో రెండు వారాలపాటు ఆ దేశంలో గడిపాను. సింధ్ ప్రావిన్స్‌లోని సుక్కూర్‌లో, సింధునది మీద ఒక ఆనకట్ట ఉంది. అక్కడినుంచి, మన భారతీయ నాగరికతకు పునాది అయిన మొహెంజొదారో వెళ్ళాను. అప్పుడు మొహెంజొదారోలో గైడ్లు, స్థానిక పర్యాటకులు తప్ప ఇంకెవరూ లేరు. ఒక పూట మొత్తం నేనొక్కడినే గడిపాను. అలా ఆ ప్రదేశాన్ని అతి వివరంగా చూసేందుకు వీలు కావడం అద్భుతమేనని చెప్పాలి. తర్వాత, బేనజీర్ భుట్టో స్వస్థలం నార్ఖానా మీదుగా ప్రయాణించి కరాచీ, అక్కడినుంచి ముంబై వెళ్లిపోయాను. మొత్తం మీద, భారతీయుడిని అని తెలిసినా, నన్ను చాలా ఆదరంగా చూశారు అక్కడి వాళ్ళందరూ. వాళ్ళు స్వతహాగా మర్యాదస్థులు. అతిథులను ఆదరిస్తారు. అయితే, కాశ్మీర్ విషయంలో కొంత జాగ్రత్తగానే మాట్లాడాలని స్ఫురించింది. అక్కడి వాళ్ళలో కొందరు ఆ ప్రస్తావన తెచ్చినా, ఆ విషయాన్ని గురించి నాకు అంతగా అవగాహన లేదంటూ, సంభాషణను దాటవేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి చిన్నప్పటినుంచీ పాఠ్యాంశాల్లో కూడా ‘కాశ్మీర్ మనది, మనం దాన్ని తిరిగి సాధించాలి’ అంటూ నూరిపోస్తారు. ‘ఇండియా కాశ్మీర్‌ని లాక్కుంది’ అని వాళ్ళు బలంగా నమ్ముతారు, వాదిస్తారు. ఆ వాదనకు లాజిక్ పెద్దగా ఉండదు. ఇక మీదట ఏం జరుగుతుందనేది చరిత్రే చెప్పగలదు. అన్నట్టు, పాకిస్తాన్ వైపునుంచి వాగా బోర్డర్‌కు వెళ్ళాను. అదొక మరపురాని అనుభూతి. రుడ్యార్డ్ కిప్లింగ్‌కు సంబంధించిన విషయాలు, లాహోర్ మ్యూజియంలో చూసిన స్టార్వింగ్ బుద్ధా అనే బుద్ధ విగ్రహం, ఇవన్నీ మనసులో ముద్రించుకుపోయిన జ్ఞాపకాలు. మొత్తం మీద పాకిస్తాన్‌ యాత్ర ఒక ప్రత్యేకమైన అనుభవం.

ప్రస్తుతం ఏయే దేశాలకు వెళ్లబోతున్నారు?

ఐస్‌లాండ్‌లో, లౌగా వాగర్ అనే చోట, ఒక అయిదు రోజుల ట్రెక్ చేస్తున్నాం. అగ్నిపర్వతాలూ, మంచు ఎడారుల్లోంచి సాగే ఆసక్తికరమైన, అతి ప్రసిద్ధమైన ట్రెక్ అది. ఆ ట్రెక్‌లో, ప్రపంచంలో వేర్వేరు చోట్లనుంచి వచ్చిన, నలభైమంది ఉన్న బృందానికి నాయకత్వం వహించబోతున్నాను. అక్కడివరకూ వెళ్తున్నాం కాబట్టి, ట్రెక్ ముగిసిన తర్వాత మరో అయిదు రోజులు నేనొక్కడినే ఐస్‌లాండ్‌లో పర్యటించాలని ప్లాన్ చేసుకున్నాను. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో మరో ట్రిప్ చేయాలి. అక్కడినుంచి లిసూటూ, ఎస్వాటినీ, మొజాంబిక్‌లను సందర్శించిన తర్వాత జింబాబ్వే, జాంబియా, బోట్స్‌వానా దేశాల్లో పదిహేను రోజులపాటు ఒక రోడ్ ట్రిప్ చేయబోతున్నాను. వచ్చే సంవత్సరం కైలాష్-మానస సరోవరం వెళ్ళొద్దామని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. ఆ తర్వాత, నాకు ఎప్పటినుంచో గొప్ప అభిమానం ఉన్న టిబెట్‌లోని ల్హాసా మొదలైనవి చూడాలి. ప్రస్తుతానికి ఇవి, నేను తలపెట్టిన యాత్రలు.

మీ ప్రయాణాల తీరు నిస్సందేహంగా అద్వితీయం. ఇప్పుడు, వాటిని అక్షరీకరిస్తున్న మీ రచనల గురించిన విశేషాలు చెప్పండి.

నేను నా వ్యాసాలన్నీ ఇంగ్లీష్‌లో రాసి ఫేస్‌బుక్‌లో పెట్టాను. పుస్తకరూపంలో ముందుగా వచ్చింది, దాసరి అమరేంద్రగారు తెలుగులోకి అనువదించిన ‘ఊహలకందని మొరాకో’. జయశ్రీగారు, ఆదినారాయణగారు అనువదించగా ‘మిసిమి’లో వస్తున్న నా వ్యాసాలన్నీ ‘సరిహద్దులు దాటి – యాత్రా కథనాలు’ అన్న పేరుతో రెండో పుస్తకంగా వచ్చాయి. మూడోది ‘మనమెరుగని లాటిన్ అమెరికా’. దాన్ని కూడా అమరేంద్రగారే అనువదించారు. హిమాలయాల్లో చేసిన ట్రెక్‌ల గురించి ‘ఈమాట’లో వచ్చిన వ్యాసాలన్నీ కలిపి, నాలుగో పుస్తకంగా తెచ్చే ప్రయత్నంలో ఉన్నాం. మొరాకో గురించీ, లాటిన్ అమెరికా గురించీ రాసిన వ్యాసాల అనువాదాలు ముందుగా మన ‘ఈమాట’లోనే ప్రచురితమయాయి.

ఇక ఇంగ్లీష్‌లో, ‘ట్రావెల్స్ ఆఫ్ ఎ మైండ్ ఎక్స్‌ప్లోరర్’ అన్న థీమ్‌తో నా పుస్తకాలు రాబోతున్నాయి. ‘ట్రావెల్స్ ఆఫ్ ఎ మైండ్ ఎక్స్‌ప్లోరర్ – ఇన్ మొరాకో’ పేరుతో మొదటి పుస్తకం నవంబర్లో రాబోతోంది. లండన్‌కు చెందిన ట్రూబడార్ పబ్లిషర్స్ దాన్ని ప్రచురిస్తున్నారు. ఆ ప్రచురణకర్తలే ‘ట్రావెల్స్ ఆఫ్ ఎ మైండ్ ఎక్స్‌ప్లోరర్ – ఇన్ సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా’ అన్న పేరుతో 2027 ఫిబ్రవరి-మార్చి నెలల్లో మరో పుస్తకాన్ని విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత, హిమాలయాల్లో చేసిన ట్రెక్‌ల వ్యాస పరంపరను ఇంగ్లీష్‌లో కూడా తేవాలని ప్రయత్నం చేయబోతున్నాం.

శేషగిరిగారూ, హద్దులు లేని సకారాత్మకతతో, తీరైన ప్రణాళికలతో, ప్రకృతిపట్ల మమకారం, ఆరాధనలతో మీరు చేసిన యాత్రలకు మనసారా అభినందనలందిస్తున్నాం. ఇకపై కూడా మీరు చేసే పర్యటనలన్నీ సఫలం కావాలని శుభాకాంక్షలు అందజేస్తున్నాం. మీరు మరిన్ని ఆసక్తికరమైన, విలక్షణమైన యాత్రలు చేయాలని, ఆ అనుభవాలని మాతో పంచుకొమ్మని సాదరంగా కోరుతున్నాం. All the best.

మీకు, ఈమాట సంపాదకులకు, అమరేంద్రగారికి విశేష కృతజ్ఞతలు, ధన్యవాదాలండీ.


శ్రీనివాస్ బందా

రచయిత శ్రీనివాస్ బందా గురించి:

శ్రీనివాస్ బందా మాజీ సైనికుడు, కార్పొరేట్ ఉద్యోగి. సంగీత సాహిత్యాలంటే చిన్నప్పటినుంచీ వున్న మక్కువే ఒకప్పుడు ఆకాశవాణికీ, దిల్లీ చేరేక నేపథ్య గాత్రధారణకూ పునాది అయింది. తన ఆర్మీ అనుభవాలను కథలుగా మలిస్తే, అవి ‘సోల్జర్ చెప్పిన కథలు’గా ‘ఈమాట’లో ధారావాహికంగా వెలువడ్డాయి. కాగితం మీదికి దిగే ప్రతి అక్షరానికీ ఒక సామాజిక బాధ్యత ఉంటుందని నమ్మే శ్రీనివాస్‌కు, ఆలోచింపజేసే ఏ రచన అన్నా ఇష్టమే.

 ...