[ఇటీవల తెలుగు రామాయణ అనువాదాలపై, ముఖ్యంగా విశ్వనాథ సత్యనారాయణ గారి ‘కల్పవృక్షం’లోని సుందరకాండ వర్ణనలు, సీతాంజనేయ సంభాషణల గురించి కొంత ఆసక్తికరమైన చర్చ జరిగింది. వాల్మీకి రామాయణంలోని మూల వర్ణనలు తెలుగు పాఠకులకు అంతగా పరిచయం లేదని ఆ చర్చ ద్వారా నాకు అనిపించింది. అందుకే, ఆ ఘట్టాన్ని మూలానికి వీలైనంత చేరువగా, సరళమైన తెలుగులో అనువదించే ప్రయత్నమే ఇది. ఇందలి శ్లోకాలను దాక్షిణాత్య వాల్మీకి రామాయణ ప్రతుల నుండి గ్రహించడం జరిగింది. వెలిసిపోయిన బూడిద (grey) రంగులో కనిపించే శ్లోకాలు దక్షిణ ప్రతుల్లో మాత్రమే ఉండి, బరోడా వారి పరిష్కృతప్రతిలో (critical edition) లేనివి. — రచయిత ]
/images/jun2026/harikrishna-seeta-anjaneya-sambhashana.mp3
వ. లంకానగరమంతటా సీతాన్వేషణ గావించిన హనుమంతుడు, ఎట్టకేలకు అశోకవనంలో భయంకరమైన రాక్షసకాంతల నడుమ శోకతప్తయై ఉన్న ఆ సాధ్వీమణిని కనుగొన్నాడు. అయితే, శ్రీరాముని సందేశాన్ని ఆ పతివ్రతకు ఏ విధంగా విన్నవించాలి? ఆమెను ఏమని పలకరిస్తే తనను విశ్వసిస్తుంది? అని హనుమ తనలో తాను పలువిధాలుగా ఆలోచించినాడు.
ఏవం బహువిధాం చిన్తాం చిన్తయిత్వా మహాకపిః ।
సంశ్రవే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహార హ ॥ 5.31.1 ॥
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- ఏవం – బహువిధాం చింతాం చింతయిత్వా మహాకపిః -సంశ్రవే – మధురం – వాక్యం వైదేహ్యాః వ్యాజహార హ ॥
అన్వయక్రమము:- మహాకపిః ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా వైదేహ్యాః సంశ్రవే, మధురం వాక్యం వ్యాజహార.
ప్రతిపదార్థము:- మహాకపిః = వానరశ్రేష్ఠుడైనట్టి హనుమంతుడు, ఏవం = ఈ రీతిగా, బహువిధాం = పలువిధములగు, చింతాం = ఆలోచనను, చింతయిత్వా = ఆలోచించి, వైదేహ్యాః = సీతాదేవి యొక్క, సంశ్రవే = సమీపమునందు (అనగా వినబడునట్లు), మధురం = మధురమైన, వాక్యం వచనమును, వ్యాజహార = పలికెను.
రాజా దశరథో నామ రథకుఞ్జరవాజిమాన్ ।
పుణ్యశీలో మహాకీర్తిరృజురాసీన్మహాయశాః మహాయశాః ॥ 5.31.2 ॥
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- రాజా – దశరథః నామ రథకుంజరవాజిమాన్- పుణ్యశీలః – మహాకీర్తిః – ఋజుః – ఆసీత్ మహాయశాః ॥ –
అన్వయక్రమము:- దశరథః నామ, రథకుంజరవాజిమాన్, పుణ్యశీలః, మహాకీర్తిః ఋజుః మహాయశాః, రాజా ఆసీత్.
ప్రతిపదార్థము:- దశరథః నామ = దశరథుడని విఖ్యాతి నొందినట్టి, రథకుంజరవాజిమాన్ = మేలైన రథములు, గజములు, అశ్వములును గలవాడును, పుణ్యశీలః = పవిత్రశీలుడును, మహాకీర్తిః = ఘనమైన యశస్సుగలవాడు నగు, ఋజుః = ఋజువర్తనుడు; రాజా = భూపతి, ఆసీత్ = ఉండెను.
సీ. ఎన్నెన్ని విధములో యెదలోన తలపోసి
సీతా శుభాంగన చెవిసోకునట్లుగా
ఇక్ష్వాకు కులములో ఎనలేని గుణశీలి
రథగజ తురగముల్ రంజిల్లు బలశాలి
రాజర్షీణాం గుణశ్రేష్ఠస్తపసా చర్షిభి స్సమః ।
చక్రవర్తికులే జాతః పురన్దరసమో బలే ॥ 5.31.3 ॥
టీకా, తాత్పర్యములు
-పదచ్ఛేదము:- రాజర్షీణాం – గుణశ్రేష్ఠః – తపసా – చ – ఋషిభిః – సమః -చక్రవర్తికులే – జాతః – పురందరసమః – బలే ॥
అన్వయక్రమము:- సుగమము.
ప్రతిపదార్ధము:- (సః = ఆ దశరథుడు) రాజర్షీణాం = రాజర్షులలో, గుణశ్రేష్ఠః = గొప్పగుణములచే ఎన్నదగినట్టివాడు, తపసా = తపస్సంపదచే, ఋషిభిః = మహాఋషులతో, సమః = సమమైనవాడు, చక్రవర్తికులే = చక్రవర్తుల వంశము నందు, జాతః = జనించినవాడు, బలే = పరాక్రమమునందు, పురందరసమః = దేవేంద్రునికి సాటియైనవాడు.
తే.గీ. శిష్టరాజర్షి గణముల శ్రేష్ఠుడతడు
తపమునందు మహర్షుల తాదృశుండు
చక్రవర్తుల వంశ సంజాతుడతడు
బలమున పురందరుని సాటి బలిమికాడు!
అహింసారతిరక్షుద్రో ఘృణీ సత్యపరాక్రమః ।
ముఖ్యశ్చేక్ష్వాకువంశస్య లక్ష్మీవాన్ లక్ష్మివర్ధనః ॥ 5.31.4 ॥
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- అహింసారతిః – అక్షుద్రః – ఘృణీ – సత్యపరాక్రమః – ముఖ్య – చ – ఇక్ష్వాకువంశస్య – లక్ష్మీవాన్ – లక్ష్మివర్ధనః ॥
అన్వయక్రమము:- సుగమము.
ప్రతిపదార్థము:- అహింసారతిః = అహింసయందు ప్రీతి గలవాడును, అక్షుద్రః = నీచస్వభావము లేనివాడును, ఘృణీ = దయావంతుడును, సత్యపరాక్రమః = అమోఘమైన పరాక్రమముగలవాడును, లక్ష్మీవాన్ = గొప్పసంపదలు గలవాడును, లక్ష్మివర్ధనః = సర్వసంపదలను పెంపొందించు నట్టివాడును.
ఆ.వె. హింస నొల్ల డెపుడు హీనత సైపడు
సత్యశూరు డతడు సదయమూర్తి!
సిరి కలిగినవాడు సిరుల బెంచెడివాడు
ఇన కులమున పుట్టి యెసగు వాడు!
పార్థివవ్యఞ్జనైర్యుక్తః పృథుశ్రీః పార్థివర్షభః ।
పృథివ్యాం చతురన్తాయాం విశ్రుతస్సుఖదస్సుఖీ ॥ 5.31.5 ॥
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- పార్థివవ్యంజనైః – యుక్తః – పృథుశ్రీః – పార్థివర్షభః – పృథివ్యాం చతురంతాయాం – విశ్రుతః సుఖదః సుఖీ ॥ –
అన్వయక్రమము:- సుగమము.
ప్రతిపదార్థము:- (సః = ఆ దశరథుడు) పార్థివవ్యంజనైః = సమస్తరాజ లక్షణములతో, యుక్తః = కూడియున్నవాడు, పృథుశ్రీః =విస్తారమైనట్టి సంపదగలవాడు, పార్థివర్షభః = రాజులలో అగ్రగణ్యుడు, చతురంతాయాం = చతుస్సముద్ర పర్యంతమైన, పృథివ్యాం = భూమండలమునందు, విశ్రుతః = విఖ్యాతి నొందినవాడు, సుఖదః = (ప్రజలను) సుఖపెట్టువాడు, సుఖీ = (తాను) సుఖముగ నుండువాడు.
ద్వి. రాజ లక్షణముల రాజిల్లువాడు
పృథ్విరాజులలోన వృషభుడాతండు
క్షితి నాల్గు చెరగులు కీర్తించువాడు
సుఖమును పంచుచు సుఖియైనవాడు
తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠస్తారాధిపనిభాననః ।
రామో నామ విశేషజ్ఞః శ్రేష్ఠ స్సర్వధనుష్మతామ్ ॥ 5.31.6 ॥
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- తస్య – పుత్రః – ప్రియః- జ్యేష్ఠః – తారాధిపనిభాననః- రామః – నామ విశేషజ్ఞః – శ్రేష్ఠః – సర్వధనుష్మతామ్ ॥
అన్వయక్రమము:- తస్య, రామః, నామ, తారాధిపనిభాననః, విశేషజ్ఞః, సర్వధనుష్మతాం శ్రేష్ఠః, జ్యేష్ట, పుత్రః ప్రియః (ఆసీత్),
ప్రతిపదార్ధము:- తస్య = ఆ దశరథునకు, తారాధిపనిభాననః = చంద్రునితో సమానమైన ముఖముగలవాడును, విశేషజ్ఞః = సర్వధర్మవిశేషముల నెఱిగినవాడును, సర్వధనుష్మతాం = విలుకాండ్రందరిలోను, శ్రేష్ఠః = మేటియైన వాడును అగు, రామః = రాముడను, నామ = పేరుగల, జ్యేష్ఠః పుత్రః = పెద్దకుమారుడు, ప్రియః (ఆసీత్) = ప్రీతిపాత్రుడైయుండెను.
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా ।
రక్షితా జీవలోకస్య ధర్మస్య చ పరన్తపః ॥ 5.31.7 ॥
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- రక్షితా – స్వస్య – ధర్మస్య – స్వజనస్య – చ రక్షితా- రక్షితా -జీవలోకస్య – ధర్మస్య – చ – పరంతపః ॥
అన్వయక్రమము:- పరంతపః (సః) స్వస్య ధర్మస్య రక్షితా, స్వజనస్య చ రక్షితా, జీవలోకస్య -ధర్మస్య చ రక్షితా.
ప్రతిపదార్థము:- పరంతపః (సః) = శత్రువులను తపింప చేయునట్టి ఆ శ్రీరాముడు, స్వస్య ధర్మస్య రక్షితా = తన ధర్మమును కాపాడు నట్టివాడు, జీవలోకస్య = ప్రాణిలోకమునకు, రక్షితా = రక్షకుడైనవాడు, ధర్మస్య చ = (వర్ణాశ్రమ?) ధర్మమునకు గూడ, రక్షితా = రక్షకుడైనట్టివాడు.
సీ. దశరథ పుత్రుండు, తారాధిపాస్యుండు
సకల విద్యావేత్త, సజ్జనాధారుండు
పగతుర భంజించి ప్రజలను రక్షించి
జీవలోకము గాచు జితవైరివర్గుండు
తస్య సత్యాభిసన్ధస్య వృద్ధస్య వచనాత్పితుః ।
సభార్యస్సహ చ భ్రాత్రా వీరః ప్రవ్రాజితో వనమ్ ॥ 5.31.8 ॥
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- తస్య – సత్యాభిసంధస్య – వృద్ధస్య వచనాత్ పితుః సభార్యః – సహ – చ – భ్రాత్రా వీరః ప్రవ్రాజితః – వనమ్ ॥ –
అన్వయక్రమము:- సత్యాభిసంధస్య, వృద్ధస్య, తస్య పితుః వచనాత్, సభార్యః, భ్రాత్రా సహ చ (సః) వీరః వనం ప్రవ్రాజితః.
ప్రతిపదార్ధము:- సత్యాభిసంధస్య = సత్యము తప్పనట్టివాడును, వృద్ధస్య = వృద్ధుడును, అగు, తస్య పితుః = అతని తండ్రియైన దశరథునియొక్క వచనాత్ = మాటవలన (సః) వీరః = ఆ వీరుడైన శ్రీరాముడు, సభార్యః = భార్యతో గూడినవాడై, భ్రాత్రా చ సహ = తమ్మునితోడను గూడ, వనం ప్రవ్రాజితః = అరణ్యమునకు వెడలు నట్లు చేయబడెను.
తే.గీ. సత్యసంధుండు వృద్ధుడౌ జనకు నాజ్ఞ
శిరసు దాల్చె రాముడు ధర్మ చరితమూర్తి
ప్రియ సతీమణి, తమ్ముడు వెంట రాగ
వన్యసీమల కేగిన ధన్యమూర్తి
తేన తత్ర మహారణ్యే మృగయాం పరిధావతా ।
రాక్షసా నిహతాశ్శూరా బహవః కామరూపిణః ॥ 5.31.9 ॥
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- తేన – తత్ర మహారణ్యే మృగయాం పరిధావతా రాక్షసాః – నిహతాః – శూరాః బహవః – కామరూపిణః ॥
అన్వయక్రమము:- తత్ర మహారణ్యే మృగయాం పరిధావతా తేన బహవః శూరాః, కామరూపిణః రాక్షసాః నిహతాః
ప్రతిపదార్థము:- తత్ర మహారణ్యే = ఆ ఘోరాటవి యందు, మృగయాం పరిధావతా = వేటనుగూర్చి పరిభ్రమించుచున్న. తేన = ఆ శ్రీరామునిచే, కామరూపిణః = కామరూపులైనట్టియు, శూరాః = వీరులైనట్టియు, బహవః రాక్షసాః = పెక్కుమంది రాక్షసులు, నిహతాః = పధింపబడిరి.
జనస్థానవధం శ్రుత్వా హతౌ చ ఖరదూషణౌ ।
తతస్త్వమర్షాపహృతా జానకీ రావణేన తు ॥ 5.31.10 ॥
వఞ్చయిత్వా వనే రామం మృగరూపేణ మాయయా ।
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- జనస్థానవధం – శ్రుత్వా – హతౌ – చ – ఖరదూషణా – తతః -తు – అమర్షాపహృతా – జానకీ – రావణేన – తు – వంచయిత్వా – వనే రామం – మృగరూపేణ – మాయయా ॥
అన్వయక్రమము:- జనస్థానవధం, హతౌ ఖరదూషణా చ, శ్రుత్వా, రావణేన మాయయా మృగరూపేణ వనే రామం వంచయిత్వా, జానకీ తతః అమర్షాపహృతా.
ప్రతిపదార్ధము:- జనస్థానవధం = జనస్థానమునందలి రాక్షసుల సంహారమును గూర్చియు, హతౌ ఖరదూషణా చ = చంపబడిన ఖరదూషణులను గూర్చియు, శ్రుత్వా = విని, రావణేన = రావణాసురునిచే, మాయయా = మాయచే, మృగరూపేణ = లేడిరూపమున, వనే = అరణ్యమునందు, రామం శ్రీరాముని, వంచయిత్వా మోసగించి, తతః = ఆ యడవినుండి, జానకీ = సీతాదేవి, అమర్షాపహృతా = క్రోధముతో అపహరింపబడినది.
సీ. విపినాంతరములందు వేటకై చరియించి
శూరులౌ నసురుల చురుకుగా వేటాడి
ఖరదూషణాదుల కదనాన హతమార్చ
అదివిని దశకంఠు డతికోప వివశుడై
ఆ.వె. కనకమృగము నంపి కాననమందున
రాము మోస పుచ్చె రాక్షసుండు
సీత నపహరించి శీఘ్రమె గొనిపోయె
రావణుండు వట్టి రట్టుకాడు
స మార్గమాణస్తాం దేవీం రామస్సీతామనిన్దితామ్ ॥ 5.31.11 ॥
ఆససాద వనే మిత్రం సుగ్రీవం నామ వానరమ్ ।
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- సః – మార్గమాణ-దేవీం తాం – రామః – సీతామ్ –అనిందితామ్ – ఆససాద వనే మిత్రం సుగ్రీవం నామ – వానరమ్ ॥ —
అన్వయక్రమము:- సః రామః అనిందితాం తాం సీతాం దేవీం మార్గమాణః, వనే సుగ్రీవం నామ వానరం మిత్రమ్ ఆససాద.
ప్రతిపదార్ధము:- సః రామః = ఆ శ్రీరాముడు, అనిందితాం = ఉత్తమురాలైనట్టి, తాం సీతాం దేవీం = ఆ సీతాదేవిని, మార్గమాణః = వెదకుచున్నవాడై, వనే = అరణ్యమునందు, సుగ్రీవం నామ వానరం = సుగ్రీవు డను వాసరరాజును, మిత్రం = మిత్రునిగా, ఆససాద = పొందెను.
ఆ.వె. నిందలేని సాధ్వి నెలత సీతమ్మను
వెతికి వెతికి వగచి వేగినపుడు
నమ్మకమున గలిసె నెమ్మి సుగ్రీవుండు
వానరుడె సఖుడయె వనమునందు!
తత స్స వాలినం హత్వా రామః పరపురఞ్జయః ॥ 5.31.12 ॥
ప్రాయచ్ఛత్కపిరాజ్యం తత్సుగ్రీవాయ మహాబలః ।
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- తతః – సః – వాలినం- హత్వా రామః పరపురంజయః -ప్రాయచ్ఛత్ కపిరాజ్యం తత్ సుగ్రీవాయ – మహాబలః ॥ –
అన్వయక్రమము:- తతః మహాబలః పరపురంజయః సః రామః వాలినం హత్వా తత్ కపిరాజ్యం సుగ్రీవాయ ప్రాయచ్ఛత్.
ప్రతిపదార్థము:- తతః = పిమ్మట, మహాబలః = మహాబలాఢ్యుడును, పరపురంజయః = శత్రుపురవిజేతయు నగు, సః రామః = ఆ శ్రీరాముడు, వాలినం = వాలిని, హత్వా = చంపి, తత్ కపిరాజ్యం = ఆ వానరరాజ్యమును, సుగ్రీవాయ = సుగ్రీవునకు, ప్రాయచ్ఛత్ = ఒసగెను.
తే.గీ. పగతురను గెల్చు రాముడు పరమ బలుడు
వాలినంతట వధియించి వానరులకు
రవి కుమారుని సుగ్రీవు రాజు జేసి
కపుల రాజ్యము నతనికి కట్టబెట్టె
సుగ్రీవేణాపి సన్దిష్టా హరయః కామరూపిణః ॥ 5.31.13 ॥
దిక్షు సర్వాసు తాం దేవీం విచిన్వన్తి సహస్రశః ।
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- సుగ్రీవేణ అపి సందిష్టాః హరయః కామరూపిణః- దిక్షు – సర్వాసు -తాం- -దేవీం – విచిన్వంతి – సహస్రశః ॥
అన్వయక్రమము:- సుగ్రీవేణ సందిష్టాః కామరూపిణః హరయః ఆపి సహస్రశః తాం దేవీం సర్వాసు దిక్షు విచిన్వంతి.
ప్రతిపదార్ధము:- సుగ్రీవేణ = సుగ్రీవునిచే, సందిష్టాః = ఆజ్ఞాపింపబడినట్టి, కామరూపిణ: = కామరూపధరులైనట్టి, హరయః అపి = వానరులుగూడ, సహస్రశః = వేలకొలదిగ, సర్వాసు దిక్షు = అన్ని దిక్కులయందును. తాం దేవీం = ఆ సీతాదేవిని, విచిన్వంతి = వెదకుచున్నారు.
తే.గీ. కామరూపులు బలులైన కపివరులును
వేల సంఖ్యను దాటిన వీరవరులు
సూర్యనందను నాజ్ఞను చూరగొనియు
దిక్కు దిక్కున వెదకిరి దేవి కొఱకు
అహం సమ్పాతివచనాచ్ఛతయోజనమాయతమ్ ॥ 5.31.14 ॥
అస్యా హేతోర్విశాలాక్ష్యాః సాగరం వేగవాన్ప్లుతః ।
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- అహం -సంపాతివచనాత్- శతయోజనమ్ – ఆయతమ్. —అస్యాః హేతోః విశాలాక్ష్యాః సాగరం వేగవాన్ ప్లుతః ॥
అన్వయక్రమము:- సంపాతివచనాత్ అస్యాః విశాలాక్ష్యాః హేతోః శతయోజనమ్ అయతం సాగరం వేగవాన్ అహం ప్లుతః.
ప్రతిపదార్ధము:- సంపాతివచనాత్ = సంపాతి యను పక్షియొక్క మాటవలన, అస్యాః విశాలాక్ష్యాః హేతోః = ఈ పద్మాక్షి యగు సీతాదేవికొఱకై, శతయోజనం ఆయతం = నూరు ఆమడల పొడవుగల, సాగరం = సముద్రమును, వేగవాన్ అహం = మహావేగము గలవాడనైన నేను, ప్లుతః = దాటితిని.
తే.గీ. పక్షి రాజైన సంపాతి పలుకు వినియు
నడుమ నూరామడల మించు కడలి దాటి
వెడద కన్నుల సీతను వెతుకుటకును
వేగమున వచ్చితిని నేను ద్వీపమునకు!
యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీవతీం చ నిశ్చితామ్ ॥ 5.31.15 ॥
అశ్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితా మయా ।
విరరామైవముక్త్వాసౌ వాచం వానరపుఙ్గవః ॥ 5.31.16 ॥
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీం – చ – నిశ్చితామ్ -అశ్రౌషం రాఘవస్య – అహం – సా – ఇయమ్ – ఆసాదితా – మయా ॥ విరరామ ఏవమ్ ఉక్త్వా అసౌ వాచం వానరపుంగవః
అన్వయక్రమము:- రాఘవస్య (ముఖాత్) యథారూపాం, యథా వర్ణాం, యథాలక్ష్మీం చ నిశ్చితామ్ ఆహమ్ అశ్రౌషం, సా ఇయం మయా ఆసాదితా. అసౌ వానరపుంగవః ఏవం వాచమ్ ఉక్త్వా విరరామ.
ప్రతిపదార్థము:- రాఘవస్య ముఖాత్ = శ్రీరాముని ముఖమునుండి, యథారూపాం = ఎట్టి స్వరూపముగలదిగను, యథావర్ణాం = ఎట్టి వర్ణము గలదిగను, యథాలక్ష్మీం చ = ఎట్టి సౌందర్యముగలదిగను, నిశ్చితాం = నిశ్చయింపబడినదిగా, అహం = నేను, అశ్రౌషం = వినియుంటినో, సా ఇయం = ఆ విధమైనట్టి ఈమె, మయా = నాచేత ఆసాదితా = పొందబడినది (కనుగొనబడినది). అసౌ వానరపుంగవః = ఈ వానరశ్రేష్ఠుడైన హనుమ, ఏవం = ఈరీతిగా, వాచం = వచనమును, ఉక్త్వా = పలికి, విరరామ = ఊరకుండెను
త్రిశ్రం అదే రూప మదే వర్ణ మవే లక్షణములు
రామభద్రు డెట్టి రమణి గూర్చి జెప్పె
నిశ్చయముగ గంటి నట్టి నెలత సీత నిపుడు
అనుచు పలికి హనుమ మౌనమొందె నపుడు
జానకీ చాపి తచ్ఛ్రుత్వా పరం విస్మయమాగతా ।
తతస్సా వక్రకేశాన్తా సుకేశీ కేశసంవృతమ్ ॥ 5.31.17 ॥
ఉన్నమ్య వదనం భీరుశ్శింశుపావృక్షమైక్షత ।
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- -జానకీ – చ – అపి – తత్- శ్రుత్వా పరం విస్మయమ్ – ఆగతా – తతః – సా – వక్రకేశాంతా సుకేశీ – కేశసంవృతమ్- ఉన్నమ్య – వదనం – భీరుః – శింశుపావృక్షమ్ – ఐక్షత
అన్వయక్రమము:- జానకీ చ అపి తత్ శ్రుత్వా పరం విస్మయమ్ ఆగతా తతః వక్రకేశాంతా సుకేశీ సా భీరుః కేశసంవృతం వదనమ్ ఉన్నమ్య శింశుపావృక్షమ్ ఐక్షత.
ప్రతిపదార్థము:- జానకీ చ అపి = సీతాదేవియును, తత్ = ఆ మాటను, శ్రుత్వా = విని, పరం విస్మయం ఆగతా = మిక్కిలి ఆశ్చర్యము నొందెను. తతః = పిమ్మట, వక్రకేశాంతా = వంకరగ నున్న ముంగురులు గలిగినట్టియు, సా భీరుః = ఆ భీతచిత్తురాలైన సీతాదేవి, కేశసంవృతం = జుట్టుచే కప్పబడినట్టి, వదనం = ముఖమును, ఉన్నమ్య = పైకి ఎత్తి, శింశుపావృక్షమ్ = శింశుపావృక్షమును, ఐక్షత = చూచెను.
నిశమ్య సీతా వచనం కపేశ్చ దిశశ్చ సర్వాః ప్రదిశశ్చ వీక్ష్య ।
స్వయం ప్రహర్షం పరమం జగామ సర్వాత్మనా రామమనుస్మరన్తీ ॥ 5.31.18 ॥
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- నిశమ్య – సీతా – వచనం కపేః చ దిశః చ సర్వాః – ప్రదిశః చ వీక్ష్య – స్వయం ప్రహర్షం పరమం- జగామ- సర్వాత్మనా – రామమ్ – అనుస్మరంతీ ॥
అన్వయక్రమము:- సీతా కపేః వచనం నిశమ్య సర్వాః దిశః ప్రదిశః చ వీక్ష్య సర్వాత్మనా రామమ్ అనుస్మరంతీ స్వయం పరమం ప్రహర్షం జగామ.
ప్రతిపదార్థము:- సీతా = సీతాదేవి, కపేః = హనుమయొక్క వచనం = మాటను, నిశమ్య = ఆకర్ణించి, సర్వాః దిశః చ = అన్నిదిక్కులను, ప్రదిశః చ = మూలలను గూడ, వీక్ష్య = చూచి, సర్వాత్మనా = ఏకాగ్రచిత్తముతో, రామం శ్రీరాముని, అనుస్మరంతీ = ధ్యానించుచున్నదై, స్వయం = తాను, పరమం = గొప్పదైన, ప్రహర్షం = మహానందమును, జగామ = పొందెను.
సీ. పరమ విస్మయమున పావని పలుకులు
పట్టరాని ముదము పట్టివిడుచుచును
విరబోయు కురులచే మరుగైన మోమెత్తి
భక్తితో రాముని పలుమార్లు తలపోసి
సా తిర్యగూర్ధ్వం చ తథాప్యధస్తాన్నిరీక్షమాణా తమచిన్త్యబుద్ధిమ్ ।
దదర్శ పిఙ్గాధిపతేరమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్థమ్ ॥ 5.31.19 ॥
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- సా – తిర్యక్ – ఊర్ధ్వం – చ – తథా అపి అధస్తాత్ -నిరీక్షమాణా-తమ్ – అచింత్యబుద్ధిమ్ దదర్శ పింగాధిపతేః అమాత్యం వాతాత్మజం – సూర్యమ్ – ఇవ – ఉదయస్థమ్ ॥
అన్వయక్రమము:- సా తిర్యక్ ఊర్ధ్వం చ, తథా అధస్తాత్ అపి నిరీక్షమాణా, ఉదయస్థం సూర్యమ్ ఇవ, తమ్ అచింత్యబుద్ధిం, పింగాధిపతేః అమాత్యం వాతాత్మజం దదర్శ.
ప్రతిపదార్థము:- సా = ఆ సీతాదేవి, తిర్యక్ = అడ్డముగను, ఊర్ధ్వం చ = మీదుగను, తథా = అట్లే, అధస్తాత్ అపి క్రిందుగను గూడ, నిరీక్షమాణా = పరికించి చూచుచున్నదై, ఉదయస్థం సూర్యమ్ ఇవ = ఉదయమున నున్న సూర్యునివలె నున్నట్టి, అచింత్యబుద్ధిం = అమితమైన ప్రజ్ఞగల, పింగాధిపతేః అమాత్యం = సుగ్రీవుని సచివుడైనట్టి, తం వాతాత్మజం = అ వాయునందనుని, దదర్శ = అవలోకించెను.
తే.గీ. క్రింద పైనను దిశలను కెలను జూచి
శింశుపాతరుశాఖల శ్రేణి నడుమ
సూర్యపుత్రునిమంత్రిని సూక్ష్మమతిని
తరుణభానుని బోలిక వెలుగునట్టి
పవనసూనుని గాంచెను పడతి యపుడు