తమరి బాధ్యత

చక్కయ్య తన తలకు చుట్టుకున్న ఎర్ర తువ్వాలును తీసి చేతిలో పట్టుకుని, స్టేషన్‌లో రైలు కోసం చూస్తున్న ప్రయాణికుల దగ్గరకెళ్ళి, “వానరూ చనిపోయాడు… దానం చేయండి” అని అడుగుతున్నాడు. వానరూ ఎవరు అని ఎవరూ అడగలేదు.

కొంతమంది చిల్లర నాణేలను తీసి ఆ తువ్వాల్లో వేశారు. ఒకరు తన ప్యాంటు జేబులోనుండి పర్స్ తీసి చూసి, ఏమీ లేదని చేతులు చాపారు.

చెన్నైనుండి వచ్చే ఎక్స్‌ప్రెస్ రైలు ఇంకా రాలేదు. అందులో చాలామంది జనం దిగుతారు. ‘వాళ్ళు ఖచ్చితంగా వానరూ కోసం సాయం చేస్తారు’ అనుకున్నాడు.

‘వానరూ’ అని అందరూ పిలిచే ఆ కోతి ఈ రోజు ఉదయం చనిపోయింది. మనుషులకు వచ్చేట్టే దానికి కూడా వార్ధక్యం వచ్చింది. కొన్ని రోజులుగా సగం తెరిచిన కళ్ళతో, దేహం పీల్చుకుపోయి ముడుచుకుని పడుకుని ఉంది. ఈ రోజు ఉదయం ప్రాణం విడిచిపెట్టింది.

మొదటి ప్లాట్‌ఫారమ్‌లోని నీళ్ళ తొట్టి పక్కనున్న రావి చెట్టు మీద ఆ కోతి నివసించేది. ఎనిమిది ఏళ్ళ క్రితం ఒకరోజు ఆ కోతి ప్రయాణికుల్లో ఒకరిలాగే రైలు దిగింది. పొడవైన ప్లాట్‌ఫారమ్ చివరివరకు అటు ఇటు తిరిగిన తర్వాత, అది రైల్వే స్టేషన్ జెండా స్తంభం ఎక్కి విన్యాసాలు చేసిన ఆ రోజు చక్కయ్యకు బాగా గుర్తుంది.

రైల్వే స్టేషన్‌లో తిరిగే కుక్కా, పిల్లిలాగే ఆ కోతి కూడా స్టేషన్ నివాసులలో చేరిపోయింది.

వానరూ ప్రయాణికుల దగ్గరున్న తినుబండారాలను లాక్కుని వెళ్ళి మఱుగుదొడ్డి గోడ మీద కూర్చుని తినడం చక్కయ్య ఎన్నోసార్లు చూశాడు. ప్రయాణికుల బట్టల సంచులను, అరటిపండ్లను, పూలదండలను లాక్కుని వెళ్ళిపోయేది. పూలదండను తన మెడలో తానే వేసుకుని ఆ కోతి ప్లాట్‌ఫారమ్ మీద తిరుగుతున్నప్పుడు, కొందరు ప్రయాణికులు దానికి దండం పెట్టేవారు.

దానికి ‘వానరూ’ అని పేరు పెట్టింది పొన్నుదురై. ఒకరోజు రైల్వే పోలీస్ టోపీని లాక్కెళ్ళినప్పుడు, “వానరూ ఇచ్చేస్తుంది… పద్ధతిగా అడగాలి, అంతే” అని అన్నాడు పొన్నుదురై. వాళ్ళు చేతులు చాచుకుంటూ కోతి వెనుకే పరిగెట్టారు.

వానరూ టోపీని ఇవ్వలేదు. దాన్ని తన తలపై పెట్టుకుని, పెంకుల పైకప్పు ఉన్న స్టేషన్ మాస్టర్ గదిపై నడుస్తూ వేడుక చూపించింది. టోపీని పళ్ళతో కొరికి తినడానికి ప్రయత్నించింది. ముఖం చిట్లించింది. తర్వాత టోపీని రైలు పట్టాల మీదకు విసిరేసింది.

ఆ రైల్వే స్టేషన్ ఒక ప్రసిద్ధ ఆలయానికి సమీపంలో ఉంది. అందువల్ల మంగళ, శుక్రవారాల్లో స్టేషన్‌లో దిగేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇరవై ఏళ్ళ క్రితం ఆ గుడికి ఇంత ప్రాచుర్యమూ, మాహాత్మ్యమూ ఉండేవి కాదు. కానీ ఉన్నట్టుండి, దశ తిరిగి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ఉత్తరాది రాష్ట్రాలనుండి కూడా భక్తులు రావడం మొదలుపెట్టారు.

దానితో ఆ ఊర్లో కొత్త లాడ్జీలు, హోటళ్ళు, పూల దుకాణాలు, టీ కొట్లు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకు యాభైమందిలోపు వచ్చి వెళ్ళే రైల్వే స్టేషన్, వేల సంఖ్యలో జనం వచ్చే ప్రదేశంగా మారింది. మూడేళ్ళ క్రితమే స్టేషన్‌ను కొంచెం విస్తరించారు. రెండు ప్లాట్‌ఫారమ్‌లు ఉన్న స్టేషన్‌లో కొత్తగా మరో రెండు ప్లాట్‌ఫారమ్‌లు నిర్మించడంతో పాటు ఎక్స్‌ప్రెస్ రైళ్ళు కూడా ఆగడానికి వసతులు కల్పించారు.

చక్కయ్య పదేళ్ళకు పైగా ఆ స్టేషన్‌లో పోర్టర్‌గా ఉన్నాడు. అప్పట్లో ఇద్దరే పోర్టర్లు ఉండేవారు. ఇప్పుడు ఎనిమిదిమంది ఉన్నారు. అందులోనూ నాలుగో ప్లాట్‌ఫారమ్‌నుండి మెట్ల ద్వారానే స్టేషన్ బయటకు రావాల్సి ఉండటంతో సామాను మోసేవారి సాయం అవసరమైంది.

వానరూ ఆ స్టేషనంతా తనకే సొంతం అన్నట్టు స్వేచ్ఛగా తిరిగేది. అరటిపండు తిని ఆ తొక్కను ఆకాశం వైపుకు విసిరేది. ఎవరైనా దాన్ని తరమబోతే రెప్పపాటులో ఎగిరి ఎత్తుకు ఎక్కిపోయేది. ఇలా అల్లరి చేయడమంటే దానికి చాలా ఇష్టం. స్టేషన్ మాస్టర్ గదిలోకి దూరి ఏదో ఒక కాగితం పట్టుకుపోయేది. తనను వెళ్ళగొట్టేందుకు ప్రయత్నిస్తూ తరుముకుంటూ వచ్చేవాళ్ళను సూటిగా చూసి పళ్ళు ఇకిలించడం దానికి అలవాటుగా మారిపోయింది.

నానా ఇబ్బంది పెడుతున్న ఆ కోతిని స్టేషన్‌నుండి తొలగించాలని ఎందరో ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు కూడా ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు.

ఒకసారి మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చి దానిని పట్టుకోవాలని చూసినా విఫలమయ్యారు. ఆ పని మీద వచ్చిన వెటరినరీ డాక్టర్ మీదకు వానరూ రాయి విసిరినప్పుడు, అది కూడా మనుషులు ప్రదర్శించినట్టే ఉగ్రమైన కోపాన్ని ప్రదర్శించింది.

రైల్వే క్యాంటీన్ నడిపే గణేశం మిగిలిపోయిన ఆహారాన్ని వానరూకి ఇవ్వడం మొదలుపెట్టాక, అది ప్రయాణికుల దగ్గర ఆహారాలు, వస్తువులు లాక్కోవడం మానేసింది. దాహం వేసినప్పుడు స్టేషన్‌లోని నీటి కుళాయిల్ని తిప్పి నీళ్ళు తాగడం నేర్చుకుంది.

ఉత్తరాదినుండి వచ్చే రైలు పెట్టె మీదకు ఎక్కి కూర్చుని కొంత దూరం ప్రయాణించి, మళ్ళీ రైల్వే గేటు దగ్గర దిగేయడం ఒక ఆటగా మారిపోయింది. అలాగే ప్లాట్‌ఫారమ్ మీద నిద్రపోయేవాళ్ళ చెప్పులు తీసుకెళ్ళి చెట్టుకు వేలాడదీసేది.

ప్లాట్‌ఫారమ్‌ను శుభ్రం చేసే మంగమ్మ దానిని తన సొంత కొడుకులా చూసుకునేది.

“ఇట్టా వొచ్చి కూర్చోవయ్యా,” అని ఆమె పిలిస్తే వానరూ దగ్గరకు వచ్చి కూర్చునేది. ఆకూ వక్కా నములుతూ మంగమ్మ తన ఇంటి కథను, కష్టాలను, పాత జ్ఞాపకాలను వానరూతో పంచుకునేది. వానరూ చేసే అల్లరిని చూసి ఆస్వాదించేది. ఆ స్టేషన్‌లో నివసించే ఒక వ్యక్తిలా వానరూను అక్కడి వాళ్ళందరూ అంగీకరించారు.

వర్షాకాలంలో వానరూ స్వభావం మారిపోయేది. దానికి ఉరుముల శబ్దం అంటే ఇష్టం ఉండదు. అలాంటి రోజుల్లో స్టేషన్ మాస్టర్ గదిలోకి వచ్చి ఒదిగి కూర్చునేది. వరుసగా వర్షం పడే రోజుల్లో అది వర్షాన్ని అసహ్యించుకుంటున్నట్టుగా పళ్ళు బిగబట్టి నిలబడేది. ఎండ వస్తే తెగ ఆనందపడిపోయేది. వెలుతురును తాగుతున్నట్టుగా చేతులు చాచేది, ఆడుకునేది.

ఎవరో ఒక చిన్నారి ప్లాట్‌ఫారమ్ మీద వదిలేసిన ప్లాస్టిక్ బొమ్మతో వానరూ కొన్ని రోజులు ఆడుకునేది. ఆ బొమ్మను చెట్టు చిటారు కొమ్మమీదకు తీసుకెళ్ళి పెట్టుకునేది. ఆ తర్వాత ఒకరోజు దాన్ని విసిరి పడేసింది. ఎందుకు అలా విసిరేసిందో ఎవరికీ తెలియదు.

మనుషులలాగే ముసలితనం కోతులను కూడా బాధించడం చక్కయ్య కళ్ళారా చూశాడు. ప్లాట్‌ఫారమ్ మీద వానరూ నడుస్తుంటే సత్తువ ఉడిగిన ముసలివాడు వెళ్తున్నట్టుగా మారిపోయింది. గతంలో కొబ్బరి చిప్పను అది సునాయాసంగా పగలగొట్టడం చూశాడు. ఇప్పుడు అది కొబ్బరి చిప్పను పగలగొట్టలేక దొర్లిస్తూ ఆడుకుంటోంది. మనుషులలాగే దానికీ రుచి మారిపోయింది. దాని కళ్ళు మసకబారినట్టుగా అయిపోయాయి. ఎప్పుడూ గాలిలో చేతులు ఆడిస్తూ ఉండేది.

అందునా ఈ ఐదారు రోజులుగా వానరూ తల ఒక పక్కకు వాల్చి నీరసంగా మరుగుదొడ్డి రేకుల పైకప్పు మీదే కూర్చుని ఉండిపోయింది. క్యాంటీన్ గణేశం పెట్టిన ఏ ఆహారాన్నీ తీసుకోలేదు. కొన్నిసార్లు తీవ్రమైన ఎండలో ఇనుప బెంచిపై ముడుచుకుని పడుకుని ఉండేది.

ఇదంతా గమనించిన క్యాంటీన్ గణేశం “తను చనిపోయే రోజు కోతికి ముందుగానే తెలిసిపోతుంది. కాబట్టి ఏమీ తినకుండా పడుండి చనిపోతుందని విన్నాను,” అన్నాడు.

ఆయన చెప్పింది నిజమన్నట్టే వానరూ ఆహారమేమీ తినకుండా అలా పడుండేది.

మంగమ్మ ఒకరోజు దాని దగ్గరకు వెళ్ళి తన చేతులతో నిమిరినప్పుడు దాని శరీరం వణికింది. జబ్బు పడిన పసిబిడ్డకు అన్నం కలిపి పెట్టినట్టు ఆమె ఇడ్లీని చిన్న ముక్కలుగా చేసి పిసికి “రొంతైనా తిను నాయనా,” అని తినిపించడానికి ప్రయత్నించింది. కోతి అసలు నోరు తెరవలేదు. కానీ దాని కళ్ళనుండి నీరు మాత్రం కారింది. ఆమె కోతి నుదుటిని నిమురుతూ “తగ్గిపోద్దిలే,” అని మనసులో ఏదో ప్రార్థన చేసింది.

ఆ మరుసటి రోజే వానరూ చనిపోయింది.

ముందుగా ఎవరు చూశారో తెలియదు. వానరూ చనిపోయిందనే వార్త వచ్చినప్పుడు చక్కయ్య రెండో ప్లాట్‌ఫారమ్‌లో ఉన్నాడు. ఆత్రుతగా మొదటి ప్లాట్‌ఫారమ్‌కు వచ్చి చూస్తే నీళ్ళ తొట్టిదగ్గర కోతి చనిపోయి పడుంది. వడలిన ముఖం. ఒక కన్ను సగం తెరిచుకుని ఉంది, మరో కన్ను మూసి ఉంది. నిశ్చలంగా ఉన్న దాని శరీరాన్ని చక్కయ్య తాకి చూశాడు. రైలు పెట్టెలపై గెంతుతూ అది చేసిన అల్లరంతా గుర్తొచ్చింది.

ముందుగా మంగమ్మ ఎక్కడికి వెళ్ళిందోననే చక్కయ్య వెతికాడు. ఆమె ఈ దుఃఖాన్ని ఎలా తట్టుకోగలదో అనుకున్నాడు. ఆమెకు మనసు విరిగిపోతుంది. మంగమ్మ ఈ రోజు కూతురు వాళ్ళ ఊరికి వెళ్ళాలని నిన్నే సెలవు చెప్పి వెళ్ళిందని చెప్పారు.

క్యాంటీన్ నడిపే గణేశంకు విషయం చెప్పినప్పుడు ఆయన స్టేషన్ మాస్టర్‌కు చెప్పమన్నారు.

ఇంతలో సమాచారం తెలిసి ఆటో డ్రైవర్లు, పక్కన టీ కొట్టు నడిపే నాయరు, స్టేషన్ పేపర్ షాప్ అబ్బాయి, బొబ్బట్లు అమ్మే అతను- ఇలా చాలామంది ప్లాట్‌ఫారమ్ మీద గుమిగూడారు.

పోర్టర్లలో కొందరు చనిపోయిన కోతిని చెత్తబండిలో వేసి తీసుకెళ్ళాలని మాట్లాడుకున్నారు. ‘చనిపోయిన వీధి కుక్కల్ని అలాగే కదా తొలగిస్తారు’ అన్నాడు పేపర్ షాప్ అబ్బాయి.

కానీ క్యాంటీన్ గణేశం దానికి అంగీకరించలేదు.

“మనం వానరూకు సంప్రదాయ ప్రకారంగా అంత్యక్రియలు చేయాలి,” అన్నాడు.

చక్కయ్య కూడా దానికి అంగీకారం తెలిపాడు. పాడె కట్టి మనుషుల్లాగే శ్మశానానికి తీసుకెళ్ళి పూడ్చిపెట్టాలని ‌వాళ్ళందరూ నిర్ణయించారు.

“నేను ఒక పట్టు తువ్వాలు కొనుక్కొచ్చి కప్పుతాను,” అన్నాడు పోర్టర్ శేఖర్.

“నేను పాడె రెడీ చేస్తాను,” అన్నాడు ద్రవ్యం.

చక్కయ్య చందా వసూలు చేసి డబ్బులు ఇస్తానని చెప్పాడు. స్టేషన్ మాస్టర్ విషయం తెలుసుకుని యాభై రూపాయలు ఇచ్చాడు. దాంతోపాటు, “రెండు గంటల ఎక్స్‌ప్రెస్ వచ్చేలోపే బాడీని తీసేయండి,” అని సలహా కూడా ఇచ్చాడు.

రైల్వే కానిస్టేబుల్ ముత్తుస్వామి, “చనిపోయింది కోతే అయినా దాని వివరాలని మనం రిజిస్టర్‌లో నమోదు చెయ్యాలి,” అంటూ, వయసు పైబడటంవల్ల కోతి చనిపోయిందని రాసి, సాక్షులుగా చక్కయ్య, శేఖర్, ద్రవ్యం పేర్లు రాసుకున్నాడు. తన వంతుగా ఇరవై రూపాయలు ఇచ్చాడు.

ప్రయాణికుల్లో తెల్ల పంచె, తెల్ల చొక్కా వేసుకున్న ఒకతను మాత్రం, “కోతి చనిపోయి పడి ఉండటం వ్యాధుల వ్యాప్తికి కారణమవుతుంది, కాబట్టి తక్షణమే దీన్నిక్కడినుండి తొలగించండి,” అని స్టేషన్ మాస్టర్‌పై అరిచాడు.

“ఆ కోతి చాలా కాలంగా ఇక్కడే ఉంది, సార్” అన్నాడు స్టేషన్ మాస్టర్.

“అంతమాత్రాన చనిపోయిన కోతిని పెట్టుకుని పూజలు చేస్తారా?” అని ఎద్దేవా చేస్తూ అరిచాడు ఆ తెల్ల పంచె.

“అరగంటలో అంత్యక్రియలకు తీసుకెళ్ళిపోతారు,” అని స్టేషన్ మాస్టర్ హామీ ఇచ్చాక ఆ తెల్ల పంచె వెళ్ళిపోయాడు.

చనిపోయిన వాళ్ళకి స్నానం చేయించినట్టు వానరూకి కూడా స్నానం చేయించాలా అని చక్కయ్యకు సందేహం వచ్చింది. ద్రవ్యం అవన్నీ వద్దని చెప్పి వానరూను ఎత్తి సిమెంట్ బెంచి మీద పడుకోబెట్టాడు. శేఖర్ తెచ్చిన పట్టు తువ్వాలును దాని తలకు చుట్టాడు. చక్కయ్య వసూలు చేసిన డబ్బుతో గంధం, అగరబత్తీలు, గులాబీ పూలదండలు తెచ్చాడు. గంధాన్ని తన చేతులతోనే వానరూ ఒంటికి పూశాడు. వెంట్రుకలు ఉన్న కోతి శరీరానికి గంధం కొద్దిగా మాత్రమే అంటింది. తర్వాత గులాబీ పూలదండ వేశాడు. చూడటానికి వానరూ రూపం ఇప్పుడు వింతగా ఉంది.

కొందరు ప్రయాణికులు సిమెంట్ బెంచిపై ఉంచిన వానరూకు నివాళులు అర్పించారు. ద్రవ్యం పాడె సిద్ధం చేశాడు.

చక్కయ్య ఒక మంగలిని పిలిపించాడు. ఆయన ప్లాట్‌ఫారమ్ వారగా కూర్చోబెట్టి చక్కయ్యకు గుండు గీశాడు. గుండు తలతో చక్కయ్య వచ్చి నిలబడటం చూసిన స్టేషన్ సిబ్బంది పార్వతి కళ్ళు చెమ్మగిల్లాయి.

“అక్కా… దీనికి నుదుటి మీద కాసు పెట్టాలా?” అని పార్వతిని అడిగాడు చక్కయ్య.

పెట్టాలన్నట్టు తలూపింది పార్వతి. రూపాయి నాణేన్ని దాని నుదుటిపైన అంటించడానికి ప్రయత్నించాడు. అది నిలబడలేదు. గంధం రాసి ఆ నాణేన్ని అంటించాడు.

ఇది ఒంటరి కోతి. ఎక్కడినుండో ఆ రైల్వే స్టేషన్‌కు వచ్చి చేరింది. వీళ్ళందరితో సహజీవనం మొదలుపెట్టి ఇక్కడే తన జీవితాన్ని ముగించుకుంది. చనిపోయిన తర్వాత మనిషి, కోతి అన్న తేడా లేదు! ‘చనిపోయిన మనిషిని గుర్తుంచుకోవడానికి ఆ మనిషి కుటుంబమైనా ఉంటుంది. చనిపోయిన జంతువులకు అది కూడా ఉండదు’ అనుకుంది పార్వతి.

ఉత్తరాదినుండి వచ్చే ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చి ఆగింది. రైలు పెట్టెనుండి అలసిపోయిన ముఖాలతో, నలిగిన బట్టలతో, ఎప్పటికంటే రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు దిగారు. క్షణాల్లో ప్లాట్‌ఫారమ్ సందడిగా మారిపోయింది. సిమెంట్ బెంచీమీద పడుకోబెట్టిన వానరూ శరీరాన్ని ఎవరూ పట్టించుకోలేదు.

శేఖర్, చక్కయ్య పాడె ముందు భాగం పట్టుకున్నారు. వెనుక భాగంలో పట్టుకోవడానికి ద్రవ్యంతోబాటు ఇంకొకరు కావాల్సి వచ్చినప్పుడు పార్వతి తాను మోస్తానని ముందుకు వచ్చింది. వాళ్ళు నలుగురు కలిసి ఆ పాడెను ప్లాట్‌ఫారమ్ మీదుగా బయటకి మోసుకెళ్ళారు. అల్లరి చేష్టలను వదిలేసిన వానరూ ఆకాశం వైపు చూస్తూ పాడెపై వెళ్తోంది. వాళ్ళు చనిపోయిన బిడ్డను తీసుకెళ్తున్నట్టుగా నెమ్మదిగా నడిచారు.

రైల్వే ప్లాట్‌ఫారమ్ దిగి తూర్పు వైపు నడవడం మొదలుపెట్టినప్పుడు నాలుగో ప్లాట్‌ఫారమ్ వైపుకు ఒక గూడ్స్ రైలు వచ్చే శబ్దం వినిపించింది. వాళ్ళు శ్మశానంలో వానరూను పూడ్చిపెట్టి తిరిగి వచ్చేసరికి సమయం మూడయింది. తమ కుటుంబసభ్యుల్లో ఒకర్ని ఖననంచేసి వస్తున్నామన్నట్టు వాళ్ళు ఆకలిని మరిచి బాధ కమ్మేసిన ముఖాలతో తిరిగి వచ్చారు. క్యాంటీన్ గణేశం వాళ్ళను భోజనం చేసి వెళ్ళమన్నాడు. కానీ వాళ్ళెవరికీ తినాలని అనిపించలేదు.

ప్లాట్‌ఫారమ్ మీద పడున్న గులాబీ రేకుల్ని ఒక కాకి ముక్కుతో పొడుస్తోంది.

రేపు మంగమ్మ వచ్చి వానరూ లేదని ఎంతలా ఏడుస్తుందో! తాను లేనప్పుడు చనిపోయాడే అని తల బాదుకుంటుంది. ప్రాణానికి ప్రాణమైన వానరూని కోల్పోవడాన్ని వింటే మంగమ్మ ఎలా తట్టుకుంటుందో అని అలోచిస్తూ చక్కయ్య తన ఇంటి వైపు నడిచాడు.

గుండు కొట్టించుకుని వచ్చి వాకిట్లో నిలబడ్డ చక్కయ్యను చూసిన అతని భార్య అయోమయంగా అడిగింది – “ఏంటి ఇట్లా వచ్చి నిలబడ్డారు, పనికి వెళ్ళలే?”

“తెలిసినాయన పోయారు. అందుకే కార్యాలవి చేసి వస్తున్నా”.

“దానికి మీరెందుకు గుండు గీసుకున్నారూ?”

“ఆయనకు బంధువులంటూ ఎవురూ లేరు” అంటూ స్నానానికి వెళ్ళాడు.

చక్కయ్య భార్య కోపంగా తిట్టుకోవడం వినిపిస్తోంది. చక్కయ్య తలపై చన్నీళ్ళు పోసుకున్నప్పుడు వానరూ అల్లరి చేష్టలు మనసులో మెదిలి మాయమయ్యాయి. ‘సాయంత్రం ఆరు గంటల ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ వచ్చేలోపే స్టేషన్‌కు వెళ్తేనేగానీ కనీసం వంద రూపాయలైనా దొరకవు. లేదంటే ఎవర్నో అప్పడగాల్సి వస్తుంది’ అనే ఆలోచన కూడా మనసులో కలిగింది.

వానరూ ఇలా ఎవరినీ అప్పు అడగలేదు. ఎవరి ముందూ చేయి చాచలేదు.

“ఏమి బతుకు రా… మనషి బతుకు!” అని తనలో తాను బాధపడుతూ చక్కయ్య గబగబా స్నానం చేయడం మొదలుపెట్టాడు.


మూలం: తంగళ్ పొఱుప్పు, 20 మార్చ్ 2026


అవినేని భాస్కర్

రచయిత అవినేని భాస్కర్ గురించి:

తమిళ తెలుగు అనువాదక రచయిత అవినేని భాస్కర్. ప్రధానంగా తమిళం వంటి ఇతర భారతీయ భాషలలోని ఉత్తమ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయడంలో ఆయన విశేష కృషి చేస్తున్నారు. అలాగే, తెలుగు కథలను తమిళంలోకి కూడా తన అనువాదం ద్వారా అందజేస్తూ, దక్షిణ భారతీయ భాషల మధ్య సాహిత్య వారధిగా నిలుస్తూ, అవినేని భాస్కర్ గారు తెలుగు-తమిళ సాహిత్య రంగాల్ని సుసంపన్నం చేస్తున్నాడు.

 ...


ఎస్. రామకృష్ణన్

రచయిత ఎస్. రామకృష్ణన్ గురించి:

ప్రస్తుత తమిళ సాహిత్య ప్రపంచంలో ఎస్. రామకృష్ణన్ ముఖ్యమైన రచయిత. గత ముప్పై ఐదేళ్ళుగా కథలు, నవలలు, వ్యాసాలు, నాటికలు, బాలల సాహిత్యం, అనువాద రచనలూ రాస్తున్నారు. సినిమాలకు కూడా రచనలు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్, టీవీ మాథ్యమాల్లోనూ రచయితగా తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటివరకు ఈయన రచనలు వందకు పైగా పుస్తకాలుగా వెలువడ్డాయి. ఉపపాండవం, యామమ్, ఉఱుపసి, తుయిల్, నిమిత్తం, చంచారం, ఇటక్కై, పదిన్ వంటివి ప్రసిద్ధమైన కొన్ని నవలలు. భారత దేశమంతా తిరిగి ఆ జీవితానుభవాలతో ‘దేశాంతరి’ అన్న శీర్షికతో రాసిన వ్యాసాలు అతి ముఖ్యమై రచనల్లో ఒకటి. ఎనదు ఇందియా, మఱైక్కప్పట్ట ఉణ్మైగళ్ వంటివి ఈయన రాసిన చారిత్రక గ్రంథాలు. తుణైయెళుత్తు, కథావిలాసం, కేళ్విక్కుఱి, సిఱుదు వెళిచ్చం వంటివి లక్షలాది పాఠకులని ఆకట్టుకున్న రచనలు. బాలలకోసం పదిహేనుకు పైగా పుస్తకాలు రాశారు. ‘ఇయల్’ సాహిత్య సంస్థవారి జీవినసాఫల్య పురస్కారం, ఠాగూర్ పురస్కారం, పెరియార్ పురస్కారం, మాక్సిమ్ గోర్కీ పురస్కారం, తమిళనాడు ప్రభుత్వం అందించే ఉత్తమ నవలా రచయిత పురస్కారాలు ఈయన అందుకున్న పురస్కారాల్లో కొన్ని. ఈయన రాసిన ‘చంచారం’ నవలకుగానూ 2018వ సంవత్సరం సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

 ...