సుదూర ప్రాంతాలకి ప్రయాణం అంటే, ప్రవరుడు చూసిన మహిమలతో బాటు నామదిలో మెదలాడేది బిషప్ కురిపించిన ప్రశ్నల వర్షం:
There are too many waterfalls here; the crowded streams
hurry too rapidly down to the sea,
and the pressure of so many clouds on the mountaintops
makes them spill over the sides in soft slow-motion,
turning to waterfalls under our very eyes.
…
What childishness is it that while there's a breath of life
in our bodies, we are determined to rush
to see the sun the other way around?
The tiniest green hummingbird in the world?
…
Oh, must we dream our dreams
and have them, too?
And have we room
for one more folded sunset, still quite warm?
…
and then a sudden golden silence
in which the traveller takes a notebook, writes:
“Is it lack of imagination that makes us come
to imagined places, not just stay at home?
Or could Pascal have been not entirely right
about just sitting quietly in one's room?”“Questions of Travel,” by Elizabeth Bishop (1956).
ప్రేరణ, ప్రకృతిలో పరవశం
ఖాట్మండు విమానాశ్రయంలో దిగిన వెంటనే, దాని పేరు ‘త్రిభువన్’ అని చూసిన వెంటనే ఈ రచయిత రవీంద్రకి ఓ తెలుగు కవిత గుర్తొచ్చింది:
త్రిభువనమ్ములలో రసోద్దీపనమ్ము
వెల్లివిరియించు ప్రణయ రూపిణివి నీవు
నీ దరస్మితరోచిఃప్రసాదకాంక్ష
కొనలు సాగిన ముగ్ధభిక్షకుండ నేను
— నీవు నేను, సౌభద్రుని ప్రణయయాత్ర, నాయని సుబ్బారావు
ఇతర భావకవుల ప్రేయసి వారి ఊహలలో మాత్రమే. సౌభద్రుని (సుభద్ర కొడుకు అభిమన్యు) ప్రణయగీతి వత్సలపై (శశిరేఖ) అయినా, అది నాయని తన మేనమామ కూతురైన, తదుపరి భార్యపైనే. రవీంద్ర తనకి ప్రేరణ ఇచ్చినది తన సహధర్మచారిణి సరోజినియే అంటాడు:
భాషణమే భూషణమైన సుభాషిణీ
చెరగని చిరునవ్వుల విభూషణీ
సహృదయంబున భరణీ
సహనంబున ధరణీ
సరోజిని, కూతురు వర్ష, 2019 వేసవి సెలవులలో టాంజానియాలోని కిలిమంజారోని అధిరోహించిన ప్రేరణతో రవీంద్ర తను కూడా శిఖరారోహణ చెయ్యాలని కుటుంబ సమేతంగా జూన్ 9, 2022 న ఖాట్మండు చేరాడు. అక్కడ చూసిన ఊళ్ళు, ప్రకృతి దృశ్యాలు, జనులు, జంతువులు, బస చేసిన చోట్లు, ఒకటేమిటి, ప్రతి దాని మీదా, తను స్పందిస్తూ, తనవీ, ఇతరులవీ కవితలని గుర్తు చేసుకుంటూ యాత్ర సాగించాడు:
23 జూన్ 2022 న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్ర ముగిసింది. హిమాలయాల అద్భుతానికి పరవశుడై రవీంద్ర తిరిగి 2023లో తను ఒక్కడే అన్నపూర్ణ సర్క్యూట్ యాత్ర కూడా చేశాడు. ఎన్నిసార్లు వెళ్ళినా తనివి తీరదంటాడు.చల్ల చల్లని గాలిలో మేను పులకరించే
పచ్చ పచ్చని పర్వతశ్రేణులు కళ్ళు పలకరించే
పక్షుల కిచకిచ ధ్వనులు శ్రవానందము కలిగించే
విరిసీ విరియని కుసుమం సుగంధ గంధమలరించేతేనీటి ఆస్వాదన అమృతమై అలరించె
అందీ అందని మేఘమాల మనసు తిలకించె
మెట్ల పొలమును చూసి మది చిగురించె
ముప్పొద్దులూ పనిచేసే పెద్దలు స్ఫూర్తిని రగిలించెమట్టిలో ఆడుతున్న పిల్లల వదనంలో
సమస్త సౌందర్యం తాండవించె
ప్రకృతి పురుష సంయోగంలో
ఆనందాల హరివిల్లు ఉదయించె
హిమాలయాలలో నిమ్మగడ్డ విస్తృత ట్రెకింగ్ అనుభవాలని చక్కని తెలుగులో అందించిన దాసరి ఈమాట వ్యాసాలు, మాచవరపు ఆదినారాయణ “భూభ్రమణ కాంక్ష” లోని సంక్షిప్త వ్యాసం “అన్నపూర్ణా పర్వత గ్రామాల్లో పాదయాత్ర,” చదివాను. ఎవరి అనుభవాలు వారివే; రవీంద్ర గ్రంథం వాటికన్నా రెండు గుణాలలో విలక్షణంగా ఉంది: దాదాపు ప్రతి అధ్యాయంలోనూ తనకు కలిగిన అనుభూతిని తనదో మరొకరిదో కవిత ద్వారా వెలిబుచ్చడం, చూసిన జనుల జీవనరీతికి స్పందించి తన బాల్యపు పల్లెటూరి అనుభవాలకి అన్వయించుకోవడం.
జన్మభూమి జ్ఞాపకాల పరంపర
నాయని పుట్టిన ఊరు ప్రకాశం జిల్లా పొదిలి. పద్య రచన మొదలెట్టిన నుండీ తన ఊరిపై ఓ కావ్యం రాయాలని కోరిక ఉండేది. హైద్రాబాదు ఆకాశవాణిలో పనిచేస్తుండగా, మిత్రుడు త్రిపురనేని గోపీచంద్ తన పర్యవేక్షణలో ఉన్న ఓ మాసపత్రికకి నెలా నెలా పద్యాలు రాయమని కోరడంతో నాయని “జన్మభూమి” కావ్యం కార్యరూపం దాల్చింది. జీవిక కోసం ఎన్నో ఊళ్ళు తిరిగినా పుట్టిన ఊరిపై మమకారం పోలేదంటాడు:
ఇతర జనపదముల నేను ప్రవాసినై
మరచియైన, మేను మరచియైన
కన్నతల్లి పొదిలె యున్న దిక్కున కాళు–
లుంచి యెపుడు పవ్వళించలేదు.
జన్మభూమి (అవతారిక, 14వ పద్యం)
మూడు దశాబ్దాలకి పైగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా స్థిరపడిన రవీంద్ర స్వగ్రామం ప్రకాశం జిల్లాలోని రావినూతల. ఆఊరుతో బాటు చుట్టు పక్కల అనేక గ్రామాల బాగోగులకోసం, ముఖ్యంగా ప్రజారోగ్యం మీదా, బడుల మీదా, పేద ఆడపిల్లల చదువు మీదా, రవీంద్ర, సరోజిని తమ కొందరి ఆప్త మిత్రుల సాయంతో శ్లాఘనీయమైన పనులు చేపట్టారు.
“జీవితం జ్ఞాపకాలతో ఉన్నప్పుడే గొప్పది. జ్ఞాపకం జీవితం కంటే గొప్పది,” అన్న కవి భూసురపల్లి మాటల స్ఫూర్తితో, రవీంద్ర ఈ పుస్తకంలో అనేక సార్లు తన సొంత ఊరిని గుర్తు చేసుకున్నాడు. హిమాలయాలలో వ్యవసాయపు పనులూ, ఆహారపు రుచులూ, పిల్లల ఆటపాటలూ రవీంద్రకి తన బాల్యాన్ని పదేపదే కళ్ళముందుకు తెచ్చాయి. అవి చదువుతుండగా నాకు రెండు పుస్తకాలు జ్ఞప్తికొచ్చాయి.
తెగిన జ్ఞాపకాలు
ఒకటి, నేను యుక్త వయసులో నరసరావుపేట జిల్లా గ్రంథాలయంలో చదివిన పుస్తకం సంజీవదేవ్ రాసిన “తెగిన జ్ఞాపకాలు.” “గుండెలలో గూడు కట్టుకున్న విషాదం — దేశాటనకై నాలో చెలరేగిన ఆరాటం,” అన్న అధ్యాయంలో, “మానసంలోని తమస్సు”ను తొలగించుకోడానికి హిమాలయాలకి వెళ్ళాలని సంజీవదేవ్ నిశ్చయించుకున్నానని రాశాడు. అందుకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కనుక ఎవరికీ తెలియకుండా వెళ్ళాలి. మరి ప్రయాణానికి డబ్బు ఎలా? తను నాలుగేళ్ళ పిల్లవాడుగా ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. అమ్మమ్మ దగ్గర అమ్మ బంగారపు నగలు ఉన్నాయి. వాటిని ఈ పవిత్ర కార్యానికి వాడితే తప్పేముంది? అలా ఆలోచిస్తుండగా, అమ్మమ్మకి జబ్బుగా ఉంది, తనని చూడాలనుంది, అని కోనాయపాలెం నుండి కబురొచ్చింది. అమ్మమ్మ అనారోగ్యం కలవరపెట్టినా, తన ఆలోచనలకి అనుగుణంగా పరిస్థితులు కలిసి వస్తున్నాయని తలంచి అమ్మమ్మ గారి ఊరు వెళ్ళాడు. అమ్మమ్మ చనిపోయిన కొన్ని రోజులకి మరలా హిమాలయాలు మనసులో మెదిలి, అమ్మ సొమ్ములని ఎలా సంపాదించాలా అని ఆలోచనలో పడ్డాడు. పెద్దమ్మ వాళ్ళతో, అమ్మ నగలు తుమ్మపూడి వారికిచ్చేస్తే మర్యాదగా ఉంటుందని సూచించాడు. వారందుకు సంతోషంగా సమ్మతించి, నగలని తననే తీసుకెళ్ళమన్నారు. ఇంకేం, తన పథకం పారింది. బెజవాడలో రైలు ఎక్కాడు. లక్నోలో ప్రేంచంద్‌ను కలిసి చివరకి మాయావతి చేరుకున్నాడు. ఎక్కడి తుమ్మపూడి, ఎక్కడి మాయావతి?
హిమవన్నగ సౌందర్య శోభ, మాయావతి ప్రకృతి సౌందర్యం, ఎగుడు దిగుళ్ళ పర్వత ప్రయాణంలో సాధక బాధకాలు, కంచర గాడిదతో అనుభవాలు, హిమాలయ పర్వత ప్రజల వృత్తులు, ప్రవృత్తులు, పరిచయమయిన విదేశీయులు, వారితో సంభాషణలు, సంజీవదేవ్ వర్ణించినవన్నీ చాలావరకు నాకు మరలా రవీంద్ర రచనలో కనపడ్డాయి. రవీంద్రలా విస్తృతంగా కాక అరుదుగా సంజీవదేవ్ కూడా శ్లోకాన్నో, కవితనో, తత్వవేత్తనో ఉల్లేఖిస్తాడు. రవీంద్ర అంత్యప్రాసలతో కూడిన తన స్వీయ కవితలని వల్లిస్తే సంజీవదేవ్ అప్పుడప్పుడే తను మొదలెట్టిన రెండు ఆంగ్ల అంత్యప్రాసల కవితలని రాస్తాడు.హిమాలయ పర్యటన నాటికి సంజీవదేవ్‌కి పదహారేళ్ళు.
శస్త్రకారుని సూక్ష్మపరిశీలన
రవీంద్ర, వర్ష, సరోజిని ఉన్న పక్క ఫొటోని చూస్తే — నిద్రించే కుక్కలు, దండానికి వేలాడే రంగు రంగుల జండాలు, బొమ్మల్లాంటి ఇళ్ళు — నేను అయిదారేళ్ళ క్రితం చదివినదొకటి (Admissions: Life as a Brain Surgeon) గుర్తొచ్చింది.
బ్రిటన్‌కి చెందిన హెన్రీ మార్ష్ (Henry Marsh) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన న్యూరో సర్జన్. 2015లో తన అరవై అయిదో ఏట ఉద్యోగానికి రాజీనామా చేసి, ఓ రోజు Thames నది పక్క పరుగెడుతూ, విరామ సమయం ఎలా గడపాలా అని ఆలోచిస్తుండగా, కొద్ది రోజుల ముందరే తనకి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చిన నేపాలీ యువతి గుర్తొచ్చింది. వెన్నెముకలో పెరిగిన ఒక గడ్డ కారణంగా ఆమె కాళ్లు మెల్లగా చచ్చుబడిపోతుంటే, మార్ష్ ఆపరేషన్ చేసి నయం చేశాడు. నేపాల్ వంటి పేద దేశాల్లో మాత్రమే ఈవ్యాధి ఉంది. “ఆ! నేను నేపాల్ వెళ్లి, మిత్రుడు దేవ్‌తో (Devkonda Upendra) కలిసి పనిచేస్తాను. అప్పుడు హిమాలయాలను కూడా చూడవచ్చు,” అన్న ఆలోచన తట్టింది. మార్ష్ అనుభవం, తెలుగులో:
పక్షుల కిలకిలారావాలు తప్ప మరే శబ్దమూ లేని, గడపల వద్ద ముదురు ఎరుపు, మెజెంటా రంగులతో జలపాతాల్లా వేలాడుతున్న బోగన్‌విలియా పూలుగల ఇళ్లను, వాటి కప్పుల మీద బట్టలు ఆరవేసే తాడుపై ఉన్న రంగురంగుల రుమాలుల్లా కనిపిస్తున్న బౌద్ధ ప్రార్థనా పతాకాలను దాటుకుంటూ నేను మౌనంగా ముందుకు సాగేవాడిని. చక్కని రంగులతో ఆ ఇళ్లన్నీ ఇటుకలు, సిమెంట్‌తో కట్టినవి. బాల్కనీలు, రూఫ్ టెర్రస్‌లు, అక్కడక్కడా అదనపు కొరింథియన్ స్తంభాలతో అవి ఒకదానిపై ఒకటి పేర్చిన అగ్గిపెట్టెల్లా కనిపిస్తాయి. కొన్నిసార్లు బీటలు వారిన, ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్డు పక్కన పెరిగిన పల్చని గడ్డిని మేస్తున్న రెండు ఆవులను ఒక పల్లెటూరి మహిళ కనిపెట్టుకుని ఉంటుంది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం, వాసన కొట్టే మురికి కాలువలు కనిపిస్తాయి. రాత్రంతా మొరిగి అలసిపోయాయేమో అన్నట్లు కుక్కలు రోడ్డుపై నిద్రపోతుంటాయి. కొన్నిసార్లు నుదుటి మీదుగా బిగించిన పట్టీల సాయంతో వీపుపై ఇటుకలతో నిండిన పెద్ద బుట్టలను మోస్తూ, దగ్గరలోని నిర్మాణ స్థలానికి వెళ్తున్న మహిళలను దాటుకుంటూ వెళ్తుంటాను. ఆ ఇళ్ళ తర్వాత ఎన్నో చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయి. అవన్నీ ముందు వైపు తెరిచి ఉంటాయి. వాటిలోకి చూడటం అంటే ఒక కథల పుస్తకాన్ని తెరిచినట్లుగానో, లేదా ఒక బొమ్మరిల్లులోకి తొంగి చూస్తున్నట్లుగానో ఉంటుంది.
ఇక్కడ జీవితమంతా వీధుల్లోనే. ఒకచోట మంగలి కత్తితో ఒకరికి క్షవరం చేస్తున్నాడు; మరొకతను తన వంతు కోసం ఎదురుచూస్తూ వార్తాపత్రిక చదువుతున్నాడు. పక్కనే మాంసం కొట్టులో తాజాగా కోసిన మాంసం ముక్కలు; వాలిపోయిన చెవులతో దీనంగా కనిపిస్తున్న తెగిన మేక తల నన్ను విషాదంతో చూస్తున్నట్లుగా ఉంది. అక్కడ నేలమీద కాళ్లు మడుచుకుని ఒక చెప్పులు కుట్టేవాడు రబ్బరు షీట్ల నుండి చెప్పుల అడుగులని కోస్తున్నాడు; గోడ పక్కన జిగురు డబ్బాలు పేర్చి ఉన్నాయి. చెప్పులు కుట్టేవారు దళితులు — హిందూ కుల వ్యవస్థలో అంటరానివారు; వారికన్న కింద ఉండేది ఊడ్చి శుభ్రం చేసేవాళ్ళే. ప్రపంచమంతా నాతో పాటు వచ్చిన నా బ్రోగ్ బూట్లను అతను ఒకసారి చక్కగా బాగు చేశాడు. శస్త్రచికిత్సలు చేయడం తప్ప, నేపాల్‌లో ఉన్నప్పుడు నేను ప్రతిరోజూ ఉదయాన్నే శ్రద్ధగా చేసుకునే ఏకైక పని ఆ బూట్లను పాలిష్ చేయడం. అతను దళితుడని నాకు తెలిసిన తర్వాత నాకు అర్థమైంది — ప్రతిరోజూ ఉదయం నేను అతని దుకాణం ముందు నుండి వెళ్తూ మర్యాదగా పలకరించినప్పుడు, అతను మొదట ఎందుకు అంత ఇబ్బందిగా, సిగ్గుగా కనిపించాడో.
నీలిరంగు నిప్పురవ్వల మధ్య ఒక లోహకారుడు వెల్డింగ్ చేస్తున్నాడు. ఇంకొకవైపు దర్జీ స్త్రీ — ఆమె దుకాణం ముందుభాగంలో బట్టలు వేలాడుతుండగా, ఆమె మాత్రం వెనుక కూర్చుని పని చేస్తోంది. నేను దాటి నడుస్తుంటే ఆమె కుట్టుమిషన్ గిరగిరల శబ్దం వినిపిస్తుంది. స్కూల్ యూనిఫాంలో వెళ్తున్న పిల్లల మధ్య నుండి మోటార్ బైకులు దూసుకుపోతున్నాయి. ఆ పిల్లలు నన్ను కొంచెం వింతగా చూస్తారు — ఎందుకంటే విదేశీయులు సాధారణంగా వచ్చే ప్రాంతం కాదు ఇది. నేను వారిని చూసి నవ్వితే, వారు కూడా అంతే సంతోషంగా నవ్వి ‘గుడ్ మార్నింగ్’ చెబుతారు. ఇంగ్లాండ్‌లో అయితే నేను పిల్లలను చూసి అలా నవ్వే ధైర్యం చేయలేను. ఇక్కడి జీవితంలో ఒక రకమైన సహజత్వం, సూటితనం ఉన్నాయి; గాఢమైన, అద్భుతమైన రంగులు ఉన్నాయి. ధనిక దేశాలు ఈ జీవనస్పందనని ఎప్పుడో కోల్పోయాయి.
మెయిన్ రోడ్డు చేరడానికి నేను ఈ సుపరిచితమైన దృశ్యాలన్నింటినీ దాటుకుంటూ వెళ్తాను. అక్కడ కార్లు, ట్రక్కులు, బాటసారుల మధ్య ఒక పెద్ద గందరగోళం కనిపిస్తుంది. వాటి మధ్య కాలుష్య మేఘాల మధ్య మోటార్ బైకుల గుంపులు హారన్లు కొడుతూ అటూ ఇటూ వంపులు తిరుగుతూ దూసుకుపోతుంటాయి. మురికి కాలువలు చెత్తాచెదారంతో నిండి ఉంటాయి. వాటి పక్కనే సైకిల్ చక్రాల బండ్ల మీద యాపిల్స్, నారింజ పండ్లను అమ్మే వ్యాపారులు ఉంటారు.
అక్కడ పాతబడిన రంగురంగుల దుకాణాలు పొడవైన వరుసలలో ఉంటాయి. ఎక్కడ చూసినా వందలాది మంది ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉంటారు. వారిలో చాలా మంది ముఖానికి మాస్కులు ధరిస్తారు, కానీ వాహనాల నుండి వచ్చే విషపూరిత పొగ ముందు అవి ఏమాత్రం పనికిరావు. విద్యుత్ తీగలు స్తంభాల నుండి చిక్కుబడ్డ నల్లటి సాలెగూళ్లలా వేలాడుతుంటాయి. ఆ స్తంభాలు తాగుబోతుల్లా ఒక పక్కకు వంగిపోయి ఉంటాయి. తరచుగా, తెగిపోయిన తీగలు ఫుట్‌పాత్ మీదకు వేలాడుతూ కనిపిస్తుంటాయి. అసలు అక్కడ మరమ్మతు పనులు ఎలా జరుగుతాయో నేను ఊహించలేను.
ఆ దుర్భరమైన పేదరికాన్ని మరపించేది, తమ అందమైన ముఖాలతో, నుదుటి మీద నుంచి వెనక్కు చక్కగా దువ్విన నల్లని జుట్టు, అద్భుతమైన రంగురంగుల దుస్తులు, బంగారు ఆభరణాలు ధరించిన అక్కడి మహిళలే.
విమర్శ
సమీక్షలో ఇంత విస్తారంగా వేరే పుస్తకాలని ప్రస్తావించడం పొరబాటే అయినా అవి నాకు రవీంద్ర రచనని విమర్శించడానికి తోడ్పడ్డాయి. ప్రకృతినీ, పరిసరాలనీ, ప్రజలనీ రవీంద్ర కూడా సంజీవదేవ్, మార్ష్‌ల లాగే నిశితంగా పరిశీలించాడు, సరళమైన వచనం వాడాడు. కాని రవీంద్ర తన రచనని రెండు విధాలగా మెరుగుపరచవచ్చు:
మొదటిది, రవీంద్రకి కవిత్వంపై ఉన్న మోహం వచనం మీద లేదు. సంజీవదేవ్, మార్ష్‌ల రచనలని చూస్తే వచనంలో కూడా బిగువూ, సొగసూ ఉన్నాయని తెలుస్తుంది. కవిత్వాన్ని కాస్త తగ్గించి, వచనం ఎక్కువ వాడితే ఇలాంటి రచనలింకా శోభిస్తాయి.
రెండోది, కళ్ళ ముందు ఉన్న దానిని వర్ణించబోయి, అంతలోనే, తన జ్ఞాపకాల దొంతరలోకి వెళ్ళిపోవడం. తాతోపనీ బడి పిల్లల్ని చూడటంతోటే తన ఉన్నత పాఠశాల గుర్తుకు రావడం, ‘గోరక్ షేప్’లో వాలీబాల్ ఆడుతున్న షెర్పా పోర్టర్లని చూసి తన బాల్యపు ఆటలపోటీలని స్మరించడం, దాదాపు అధ్యాయమంతా ఆ జ్ఞాపకాలని నెమరువేసుకోవడం. “గత శైశవ రాగమాలికల ప్రతిధ్వనుల”ను విస్మరించమని కాదు; గత స్మృతులు వర్తమాన విశేషాలని ముంచి వెయ్యకూడదు.
అభినందన
“యాత్రా సాహిత్యానికి అందమైన కొత్త చేర్పు,” అని కవి, రచయిత గంటేడ గౌరునాయుడు, “స్వర్గమే మహిమాలయమా?” అని చిత్రకారుడు, రచయిత చందనపల్లి గోపాలరావు, “360 డిగ్రీల్లో సాగిన యాత్రా కథనం,” అని కౌముది సంపాదకుడు కిరణ్ ప్రభ, “హిమగిరుల వైభవం అక్షర సాక్షాత్కారం,” అని సినీ గీత రచయిత భాస్కరభట్ల శ్లాఘించారు. “రవీంద్రుడు రాహులుడైన వేళ,” అని సాంకృత్యాయన్‌తో పోల్చారు ‘సరస్వతీపుత్ర,’ ‘కళారత్న’ భూసురపల్లి వెంకటేశ్వర్లు. తమ ప్రచురణలన్నిటినీ సామాజిక బాధ్యతగా పరిగణించే పార్వతీపురంకి చెందిన స్నేహకళాసాహితి సంస్థ ప్రచురణ ఇది. చక్కని ఫొటోలతో మేలిమైన కాగితంపై అట్ట బౌండుతో నాణ్యంగా ముద్రించారు.
తన మొదటి రచనతోటే ఇందరి మన్ననల్ని అందుకున్న రవీంద్రని అభినందిస్తూ, తెలుగు పాఠకులు ఈ విభిన్న యాత్రాకథనాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ, రవీంద్ర సాహితీ యానం జీవితాంతం కొనసాగాలని కోరుకుంటున్నాను.
పుస్తకం: మహిమాలయం: యాత్రాకథనం
రచయిత: పూనాటి రవీంద్రబాబు
ప్రచురణ: స్నేహకళాసాహితి ప్రచురణలు
పేజీలు: 190
వెల: ₹500. $25.
ప్రతులకు:
- Navodaya Book House, Kachiguda, Hyderabad (navodayabookhouse@gmail.com)
- www.telugubooks.in
- logili.com
- ebay.com
- amazon.com




