5.1 ఒడిస్సియస్, పెనలొపీల ప్రేమగాథ
వృక్షసంపదతో దట్టంగా నిండిన ద్వీపంలో, సముద్రపుటొడ్డున ఇథకా రాజ్యానికి రాజైన ఒడిస్సియస్ నెమ్మదిగా, ఏకాంతంగా నడుస్తున్నాడు. జలనిధిలోని కెరటాలు జోరుగా వచ్చి ఒడ్డును తాకుతూ ఉంటే ఒడిస్సియస్ మనస్సులో చెలరేగుతూన్న ఆలోచనా తరంగాలు ఆయనని తన స్వదేశానికి మోసుకుపోతున్నాయి. ఆయన తన ఇథకా ద్వీపాన్ని కానీ, తన భార్య పెనలొపీని కానీ, తన కొడుకు టెలెమాకస్‌ని కానీ చూసి ఇరవై ఏళ్ళు కావస్తోంది. ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం ట్రోయ్ యుద్ధంలో పాల్గొనడానికి ముందు చూసాడు – భార్యని, ఆమె పొత్తిళ్ళలో ఉన్న పసి బాలుడు టెలెమాకస్‌తో. యుద్ధం ముగిసి పదేళ్ళవుతోంది. వాళ్ళు ఎప్పుడు తన కళ్ళబడతారో? తన దురదృష్టానికి ఎంత వగచి ఏమి లాభం?
… మూడొంతులు తను భార్యతోనూ, బిడ్డతోనూ ఇప్పుడు ఇథకాలో ఉండి ఉండేవాడేమో… తన సహచరులైన గ్రీకు యోధులు అథీనా దేవతను రెచ్చగొట్టి, ఆమెకు కోపం తెప్పించకుండా ఉండి ఉంటే. అప్పుడు ఆమె ఆ గ్రీకు యోధుల పడవలను తుఫానులో దారి తప్పేలా చేసేది కాదేమో… అప్పుడు తను ఇథకాలోనే ఉండేవాడేమో… తను సముద్రాలకు అధిదేవత అయిన పొసైడన్ కొడుకు సైక్లాప్స్ కన్ను పొడిచి గుడ్డివాడిని చేసుండకపోతే నేడు తన పరిస్థితి ఇంత దయనీయంగా ఉండేది కాదేమో… తన పడవల మీద పని చేసే సరంగులు వాయుదేవుణ్ణీ, సూర్యదేవుణ్ణీ గౌరవించి ఉండవలసిందేమో…
ఇలా ఆలోచిస్తూ ఒడిస్సియస్ నిరాశతో నిట్టూర్పు విడిచేడు. ఇప్పుడు తన సిబ్బంది, కళాసులు – అందరూ – హతమార్చబడ్డారు. ఏ నేరం ఎరగని ఆ అమాయకపు ప్రాణులు ఏమి పాపం చేసేరని? ఆగ్రహించిన దేవతలు వారిని శిక్షించేరు. వారి కినుకనుండి తప్పించుకున్నది తానొక్కడే. ఇది కూడా మరొక రకంగా శిక్షే కదా. అయినా తన ధైర్యసాహసాలతో యుద్ధంలో మరణించకుండా బ్రతికి బయటపడడమే కాకుండా, గత ఏడేళ్ళ పైబడి చుక్కాని లేని నావలా ఈ సముద్రంలో తిరుగాడుతూ, ఈ ఇసుక తిన్నెల మీద నిలబడి ఇంటి గురించి ఆలోచించగలుగుతున్నాడంటే తను అదృష్టవంతుడే అయి ఉండాలి.
ఇదంతా ఒక పీడ కలేమో… ఏడేళ్ళపాటు సముద్రదేవత కలిప్సో బంధించిన ద్వీపంలో గడిపేడు. ప్రతి దినమూ కలిప్సో తేనె వంటి తన తియ్యటి మాటలతో అతన్ని మురిపించి అతని గతాన్ని మరిపించడానికి విశ్వప్రయత్నం చేసింది. ఏ వరం కావలిస్తే ఆ వరం కోరుకోమంది. తనను వరించి వివాహమాడితే కోరినవన్నీ ఇస్తానంది. తనతో ఉండిపోతే అమరత్వం ప్రసాదిస్తానని ఆశ పెట్టింది. కలిప్సో ఎంతగా ప్రేమాభిమానాలు చూపెట్టినా ఒడిస్సియస్ ఇథకాను మరచి, పెనలొపీని విడచి ఉండలేకపోయేడు. తనకు భార్య ఉండడమే కాకుండా ఒక కొడుకు కూడా ఉన్నాడనిన్నీ, వారిని ఇప్పుడు విడిచి వేరొకరిని వివాహమాడడం ధర్మసమ్మతంగా ఉండదనిన్నీ ప్రాధేయపడ్డాడు. కలిప్సో ఈ వేడికోళ్ళన్నిటినీ పెడచెవిన పెట్టింది. అప్పుడు దేవత అథీనా కలుగజేసుకుని, జూస్ చేతమ్ హర్మీజ్ ద్వారా కలిప్సోకు హితోపదేశం చేయించింది. తత్ఫలితంగా కలిప్సో ఒక పడవను, ప్రయాణానికి కావలసిన సరకులను ఏర్పాటు చేసి ఒడిస్సియస్‌ని తన శుభాకాంక్షలతో ఇంటికి సాగనంపింది….
“ఇప్పుడు నా సంసారం ఎలా ఉందో?” ఆలోచనలో పడ్డాడు ఒడిస్సియస్.
తను మృతుల లోకానికి వెళ్ళినప్పుడు అక్కడ తన తల్లి యొక్క ప్రేతాత్మ చెప్పిన మాటలు అకస్మాత్తుగా జ్ఞప్తికి వచ్చేయి: “నీ కుటుంబం అంతా విచారసముద్రంలో మునిగి ఉన్నారు. నీ భార్య నీ కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తూంది. ఇరవైనాలుగు గంటలూ నీకోసం కంటికి మంటికి ఏకధారగా రోదిస్తూంది. నీ కొడుకు చిన్నవాడైనా ధైర్యంగా ఉన్నాడు. నీ ఇంటిని, నీ భూములనీ, నీ పశుసంపదనీ దక్షతతో కాపాడుతున్నాడు. నీ కొడుకూ, నీ ముసలి తండ్రీ నీ కోసం నిత్యం ఎదురుచూస్తూ ఉన్నారు”.
తన తల్లి ప్రేతాత్మ ఈ మాటలతో ధైర్యం చెప్పి చాలా కాలం అయింది. తన తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా? ఏమో తన కొడుకు సంగతి ఏమిటి? ఒడిస్సియస్ ఇథకాను వదలిపెట్టిన సమయానికి టెలెమాకస్ పొత్తిళ్ళలో బిడ్డ. ఇప్పటికి ఇరవై ఏళ్ళు నిండి ఉంటాయి.
పెనలొపీ మాటేమిటి? తనను ధార్మిక శీలత్వంతో ఇంకా ప్రేమిస్తున్నదా? పరాకాష్ఠలో ఉన్న పరువపు ఒత్తిడికి లోనై వేరొకరిని ఎవరినైనా వివాహం చేసుకుందా?
దిక్చక్రానికి ఆవలివైపు, సుదూరంలో ఎక్కడో ఉన్న ఆ సముద్రపు ఆవలి ఒడ్డున ఇథకాలో ఉన్న రాజభవనపు మేడ బురుజులలో ఉన్న ఒక కిటికీ దగ్గర నిలబడి రాణి పెనలొపీ దిగువన ప్రాంగణంలో అల్లరి చేస్తూన్న రాకుమారుల మూక వైపు చూస్తోంది.
వారి చేష్టలు చూసి పెనలొపీ భయకంపితురాలయింది. నాలుగేళ్ళబట్టి ఈ రాకుమారులు దేశం నాలుగు మూలలనుండి వచ్చి తనను పరిణయమాడడానికి శతధా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆమె వారినీ, వారి చేష్టలనీ ఈసడించుకుంటోంది. ఆమెకు తెలుసు. వారికి కావలసినది తను కాదు. వారి ప్రేమ ఒడిస్సియస్ రాజ్యం మీద, ఒడిస్సియస్ సంపదల మీద.
ఈ ఉపసర్పకుల (suitors) కోతిమూక తన వెంటపడ్డప్పుడు వారి పీడనుండి తప్పించుకుందుకని పెనలొపీ ఒక చక్కని, గహనమైన పన్నాగం పన్నింది. వృద్ధుడైన రాజపిత ప్రస్తుతం ఆధ్యాత్మికచింతతో వానప్రస్థంలో ఉన్నాడనిన్నీ, ఆయన మరణానంతరం జరిగే అంత్యక్రియలలో వాడడానికి తాను స్వయంగా ఒక ఉన్ని దుప్పటిని అల్లే దీక్షా వ్రతం చేస్తున్నాననిన్నీ, ఈ దీక్ష పూర్తయేవరకూ తాను స్వయంవరం విషయం తలపెట్టకూడదనిన్నీ వారికి నచ్చజెప్పింది. పగలల్లా దుప్పటి అల్లుతూనే రాకుమారులకు కనిపించేది. రాత్రి అవగానే, చీకటి ముసుగులో, పగటిపూట అల్లిన అల్లికలన్నిటిని విప్పేసేది.
ఇలా మూడేళ్ళపాటు మోసపూరితమైన ఈ నాటకం నిరాటంకంగా కొనసాగింది. ఈ మూడేళ్ళూ నిమిషాలు, గంటలు, రోజులు లెక్కపెట్టుకుంటూ ఒడిస్సియస్ రాక కోసం ఎదురుచూసింది. నాలుగవ ఏట నమ్మకస్తురాలనుకున్న ఒక దాసి మోసం చేసి ఈ రాచ రహస్యాన్ని ఆ కోతిమూక ఉపసర్పకుల చెవిని పడేసింది.
ఇంకేముంది? అష్టోత్తరశతనామాలతో ఉన్న ఆ కోతిమూక అగ్గిమీద గుగ్గిలం వేసినట్లు భగ్గుమన్నది. తమలో ఎవరినో ఒకరిని వెంటనే వివాహం చేసుకోవలసిందని పెనలొపీని నిర్బంధించేరు. కానీ పెనలొపీ లొంగలేదు. తన ఒడిస్సియస్ ఎక్కడ? వీళ్ళెక్కడ? ఒడిస్సియస్‌కి వీరికి మధ్య హస్తిమశకాంతరం!
ఇన్నేళ్ళ ఎడబాటు తరువాత కూడా ఆమె ఒడిస్సియస్ విగ్రహాన్ని తన కళ్ళెదుట ఊహించుకోగలదు. ఆ విశాలమైన వక్షస్థలం. తీక్షణంగా కదలాడే ఆ నయనద్వయం. ఆ ఠీవి. ఆ రాజసం. మనిషి ఎదురుగా లేకపోయినా ఆ ఇంట్లో ఏ మూల చూసినా ఆ వ్యక్తి ముద్ర కనిపిస్తూనే ఉంటుంది. తమ శయ్యాగారంలో ఒడిసియస్ తన చేతులతో నిర్మించిన తమ పందిరి పట్టెమంచం ఉంది. దాని ప్రత్యేకత? వారి పెరట్లో పెరుగుతూన్న జిత వృక్షం కొమ్మలు నరికి, ఆ కొమ్మలను మూడు కాళ్ళు గానూ, ఇంకా సజీవంగా ఉన్న మానును నాలుగో కాలుగానూ అమర్చి మంచాన్ని నిర్మించేడు. దానిచుట్టూ శయ్యాగారాన్ని నిర్మించేడు ఈ రహస్యం వీరిద్దరికీ తప్ప మూడో కంటివాడికి తెలియదు.
పెనలొపీ తన భర్త ఒడిస్సియస్ రాకకోసం తీవ్రమైన నైరాశ్యంతో ఎదురుచూస్తోంది. వచ్చి ఈ దుండగుల అత్యాచారాలకు స్వస్తి వాచకం పలికి తనకు ఊరట కలిగిస్తాడని ఆమె ఆశ. ఒడిస్సియస్ తండ్రి వార్ధక్యం వల్ల ఏ విధమైన సహాయం అందించలేకపోతున్నారు కదా. కొడుకు యుద్ధంలోకి వెళ్ళిన దగ్గరనుండి ఆ ముసలాయన క్రుంగి, కృశించి, ఊరు బయట అడవులలో తిరుగుతున్నాడు తప్ప రాజప్రాసాదానికి రావడమే లేదు.
ఒడిస్సియస్ కొడుకు టెలెమాకస్ మాట అంటారా? కోతిమూక నుండి తల్లిని రక్షించడానికి అతని ఇరవై ఏళ్ళ వయస్సు సరిపోదు. అందంలో తండ్రి పోలికలు ఉన్నాయి కానీ, శారీరకబలంలోనూ, బుద్ధికుశలతలోనూ అతను ఇంకా వికసించలేదు.
కోట బయట కోతిమూక అల్లర్లు శ్రుతి మించుతున్నాయి. పెనలొపీ కిటికీ తలుపులు మూసేసి, లోపలికి వచ్చి, యథాప్రకారం అల్లిక మొదలుపెట్టి భర్తతో పునస్సమాగమం కోసం ప్రార్థన చెయ్యడం మొదలుపెట్టింది.
5.2 ఒడిస్సియస్ కుమారుడు
పెనలొపీని పట్టి పీడిస్తూన్న రాకుమారులను తలుచుకుంటేనే టెలెమాకస్‌కి చిర్రెత్తుకొస్తోంది. వాళ్ళు ఆహ్వానం లేకుండానే తన తండ్రి ఒడిస్సియస్ రాజ్యంలో జొరబడ్డారు. వాళ్ళు తన తండ్రి గొర్రెలని, మేకలని, పందులని, కోళ్ళను చంపుకు తినేస్తున్నారు. వాళ్ళు తన తండ్రి మక్కువతో దాచుకున్న ద్రాక్ష సారా పీపాలను ఖాళీ చేసేస్తున్నారు. తన తండ్రి సేవకబృందాన్ని తమ సొంత మనుష్యుల్లా వాడేసుకుంటున్నారు. వాళ్ళను పొమ్మని టెలెమాకస్ ఎప్పుడు చెప్పినా అతని మాటను ఖాతరు చెయ్యకుండా ఉపేక్షిస్తున్నారు.
వాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారు? మండువాలో కూర్చుని పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటున్నారు, పాచికలతో జూదాలాడుతున్నారు. తాగుతున్నారు. తందానాలాడుతున్నారు.
…మా నాన్నగారు ఇక్కడ ఉండుంటేనా? వీళ్ళంతా తోకలు ముడిచేవారు కదా. వీళ్ళ పప్పులు అప్పుడు ఉడికేవి కావు. ఆయన ఉంటే రాజ్యంలో క్రమశిక్షణ ఉండేది…
ఇలా కర్తవ్యం తోచక కోపోద్రిక్తుడై చిటపటలాడుతూన్న టెలెమాకస్, గుమ్మంలో నిలబడ్డ మనిషిని చూడనే లేదు. ఆ ఆగంతకుడు ధరించిన పాదరక్షలు! అవి కెంపులతో తాపడం చేసిన బంగారపు రక్షలలా ధగధగ మెరుస్తున్నాయి. అతని చేతిలో రాజదండం! చూడడానికి దేవదూతలా ఉన్నాడు. అతన్ని చూడగానే టెలెమాకస్ గభాల్న లేచి నిలబడ్డాడు.
“నమస్కారం మహాశయా! మిమ్మల్ని చూసుకోనే లేదు. క్షమించండి.”
ఆగంతకుడు మాట్లాడకుండా మెరుస్తూన్న ధూసర వర్ణపు నయనద్వయంతో టెలెమాకస్ వైపు తీక్షణంగా చూస్తూనే ఉన్నాడు.
“లోపలికి దయచేయండి. మా అతిథి సత్కారాలు స్వీకరించండి. ఎవరు మీరు? ఎక్కడనుండి వస్తున్నారు? ఏ కార్యోన్ముఖులై ఇలా దయచేసేరు? ఇక్కడ సుఖాసీనులు కండి” అంటూ కూర్చుందుకు ఆసనం చూపించి, తగిన అతిథి మర్యాదలు చేసేడు.
పరిచారికలు మాంసం, మదిర, రొట్టెలు, పళ్ళు పళ్ళేలలో పట్టుకొచ్చి ఎదురుగా పెట్టేరు.
“అయ్యా! తమరు ఎవరు? ఎక్కడనుండి వస్తున్నారు? మా తండ్రిగారికి మీరు పరిచయస్తులా? ఏ పని మీద వచ్చేరు?”
“నా పేరు మెంటోర్ (Mentor; MEN-tor). నేను టాఫోస్ (TA-fohss) రాజ్యానికి అధిపతిని. నీ తండ్రి, నేను స్నేహితులం. అతను ట్రోయ్ యుద్ధానికి వెళ్ళిన తరువాత మేము కలుసుకోలేదు. నీ తండ్రి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేడన్న వార్త విన్నాను. ఆ సంతోషంతో చూసి పోదామని వచ్చేను”.
టెలెమాకస్ విచారంతో తల దించుకుని, “అంత అదృష్టమా? ఆయన ఇంకా తిరిగి రాలేదు. ఆయన క్షేమసమాచారాలే తెలియడం లేదు. ఎక్కడున్నారో? ఎలా ఉన్నారో? ఏమి కష్టాలు పడుతున్నారో? మళ్ళా మేము ఆయనను చూస్తామో చూడమో?”
“దిగులు చెందకు. దైవనిర్ణయం ఎలాగుందో”. మెంటోర్ ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. “మూడొంతులు ఏదైనా ద్వీపంలో బంధితుడై ఉన్నాడేమో? నేను జోస్యం చెప్పలేను, కానీ నా అంతరాంతరాలలో ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడన్న నమ్మకం నాకు ఉంది. అధైర్యపడకు. ఒకటి గుర్తు పెట్టుకో. మీ నాన్న ధీరోదాత్తుడు. అరివీరభయంకరుడు. అతనిని ఇనప గొలుసులతో బంధించి కారాగారంలో పడేసినా, తప్పించుకుని బయటపడగల సమర్థుడు. రేపో, మాపో ఇంటికి వస్తాడు”.
టెలెమాకస్ నిరాశతో నిట్టూర్చేడు. తండ్రి రాకకై ఎన్నోసార్లు ఆశలు పెంచుకుని ఎదురు చూసేడు. ఇప్పుడీ ఓదార్పు మాటలతో ఆయన తిరిగి వస్తాడా? ఆశలు రేకెత్తించడం తప్ప.
మండువాలో కోతిమూక రాకుమారుల గోల ఎక్కువైంది. వాళ్ళు పాటలు మొదలెట్టేరు. అసలే కోతులు, కల్లు తాగేరు, నిప్పు తొక్కేరు అన్నట్లు అసభ్యంగా గెంతులు వేస్తున్నారు.
“ఎవరు వీళ్ళంతా? ఎందుకిలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు?” మెంటోర్ అడిగేడు.
“మహాశయా! మా తండ్రిగారు ఉన్నప్పుడు ఆయన ఆస్థానం అంతా సంస్కారవంతులతో నిండి సురక్షితంగా ఉండేదని మా తల్లిగారు చెబుతూ ఉంటారు. ఆయన ఇంటి దగ్గర లేని అదను చూసి, ఈ చుట్టుపట్ల ఉన్న చిల్లర మల్లర రాజకుమారులు ఇక్కడ తిష్ఠ వేసి నానా రభస చేస్తున్నారు. మా ఆస్తులు తినేస్తున్నారు. పైపెచ్చు వారిలో ఒకరిని పెళ్ళి చేసుకోమని మా అమ్మను బలవంతం చేస్తున్నారు”.
మెంటోర్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. “ఒడిస్సియస్ త్వరగా ఇంటికి రావాలి,” అని మంద్రస్వరంతో కొనసాగించేడు. “నీ తండ్రి శక్తియుక్తులు నాకు పరిచయమైనవే. అతనే ఇక్కడ ఉండి ఉంటే వీళ్ళ భరతం పట్టేవాడు కదా”.
“నిజమే. అందుకనే ఆయన రాకకోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాను. నేను ఎంత చెప్పినా ఈ కోతిమూక నా మాట వినటం లేదు. పైగా, నన్ను హతమార్చడానికి కుట్ర పన్నుతున్నారని కూడా విన్నాను.”
“నాయనా! నువ్వు ధైర్యం కూడగట్టుకోవాలి. ప్రయత్నం లేకుండా ఫలితం దక్కదు. పాతికమంది బలిష్ఠమైన సైనికుల్ని కూడగట్టుకో. రేపే ఈ కోతిమూకను బయటకు తరిమెయ్. వెంటనే ఒక మంచి పడవను బెత్తాయించి మీ తండ్రిని వెతకడానికి బయలుదేరు.”
“వెతికే అనుభవం నాకు లేదే ఎలా?”
“ముందస్తుగా పైలోస్ (Pylos) పట్టణానికి పడవలో వెళ్ళు”. మెంటోర్ ఉపదేశిస్తున్నాడు. “పైలోస్‌కి రాజు నెస్టర్ (Nestor; NES-tor). అతని రాజభవనానికి వెళ్ళు. అతను నీ తండ్రి మంచిని కోరే వ్యక్తి. వీరిద్దరూ ట్రోయ్ యుద్ధంలో కలసి పని చేసేరు. నీ తండ్రిని ఎలా కనుక్కోవాలో అతనిని అడుగు. అతనికి తెలియకపోతే ఇంకెవరిని సంప్రదించాలో అతనే చెబుతాడు.”
“ఆ తరువాత?”
“ఒడిస్సియస్ మరణించేడని అతను ధ్రువపరిచేడనుకో. వెంటనే తిరిగి ఇంటికి వచ్చెయ్. నీ తండ్రి అంత్యక్రియలు ఘనంగా జరిపించు. తరువాత మళ్ళా వివాహం చేసుకోమని నీ తల్లిని ఒప్పించు. ఆ వివాహం ఘనంగా జరిపించు. అప్పుడు నీ సవతి తండ్రికి సహాయంగా నిలిచి కోతిమూకలందరినీ దేశంనుండి తరిమేయ్. వాళ్ళంతట వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళను చంపెయ్”.
ఈ కఠోరమైన కార్యక్రమాన్ని తాను నిర్వర్తించగలడా? టెలెమాకస్ భయకంపితుడయ్యాడు.
టెలెమాకస్ మనస్సును మెంటోర్ సులభంగానే గ్రహించగలిగేడు. దగ్గరగా జరిగి, టెలెమాకస్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నెమ్మదిగా, రహస్యం చెప్పినట్లు అన్నాడు: “టెలెమాకస్! నీ కాళ్ళమీద నిలబడడం నేర్చుకో. నువ్వు చిన్నపిల్లాడివి కాదు, పెద్దవాడివి అవుతున్నావ్. ఎన్నాళ్ళని అమ్మకీ, నాన్నకీ ముద్దుబిడ్డలా ఉంటావ్? నీదంటూ ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకో. నీవంటూ పేరు ప్రతిష్టలు సంపాదించుకో”.
ఈ హితోపదేశం విని టెలెమాకస్ మనస్ఫూర్తిగా సంతోషించేడు. “నేను తల్లి చాటున పెరిగిన బిడ్డని. ఇంతవరకు నాకు ఇలా ధైర్యం చెప్పినవాళ్ళు లేరు. మీరు నాకు తండ్రివంటి వారు. మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మీరు చెప్పిన విధంగా చేస్తాను.”
మెంటోర్ లేచి నిలబడ్డాడు. “ఇహ నేను వెళ్ళాలి. నా పడవ బయలుదేరే వేళ అయింది”.
“నా ఆతిథ్యం తీసుకోకుండా వెళ్ళిపోతారా?”
“మరొకసారి. ఇప్పటికి వెళ్ళాలి” అంటూ ఎలా వచ్చేడో అలానే వెళ్ళిపోయేడు.
5.3 ధూసర నయనాల దేవత
మెంటోర్ చెప్పిన ఉత్తేజితమైన మాటలతో స్ఫూర్తి పొందిన టెలెమాకస్, తన తల్లిని వేధిస్తూన్న ఉపసర్పకులను చీల్చి చెండాడాలని నిశ్చయించుకున్నాడు.
మండువాలో ఉపసర్పకులు చేస్తూన్న సద్దు కాస్త మణిగింది. ఒక గాయకుడు ఏదో తంత్రీవాద్యంతో ట్రోయ్ యుద్ధపు వీరగాధల మీద పాటలేవో పాడుతున్నాడు. అథీనా యొక్క ధూసర వర్ణపు కళ్ళు కోపంతో ఎలా ఎర్రబడ్డాయో చెబుతున్నాడు. ఆమె శాపంవల్ల యుద్ధంలో విజయం పొందిన గ్రీకు సైనికుల నావలు తుపానులో చిక్కుకుని కాగితం పడవల్లా ఎలా చెదిరిపోయాయో చెబుతున్నాడు.
ఆ పాటలు విని కాబోలు టెలెమాకస్ తల్లి పెనలొపీ, మేడమెట్లు దిగి కిందికి వస్తోంది. ఇద్దరు పరిచారికలు ఆమె వెంట వస్తున్నారు. మేలి ముసుగుతో ముఖాచ్ఛాదనము చేేసుకొని, గోడవారగా నీడలో నిలబడి పాట వింటూన్న ఆ స్త్రీమూర్తి నయనద్వయంనుండి అశ్రుబిందువులు రాలడం టెలెమాకస్ చూసేడు.
గాయకుడి పాటను మధ్యలో ఆపి, “అయ్యా! మరేదైనా పాట పాడండి. ఈ పాట వింటూ ఉంటే నా గుండె బద్దలవుతోంది,” అందామె.
వెంటనే స్పందిస్తూ టెలెమాకస్ తల్లి సరసకు చేరేడు. అప్పుడే మెంటోర్ చెప్పిన స్ఫూర్తిదాయకమైన మాటలు అతను ఇంకా మరచిపోలేదు. సరసమైన మెత్తని మాటలతో అతను తల్లిని ఇలా సముదాయించేడు:
“అతనిని ఆ పాట పాడనియ్యి, అమ్మా! నిన్ను క్షోభ పెడుతూన్నది అతని పాట కాదు. మనం ఎదుర్కొంటూన్న గడ్డు రోజులు. జూస్‌కి మన మీద కోపం వచ్చినట్లుంది. ఈ కష్టాలు కలకాలం ఉండవు. నువ్వు మేడమీద నీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఇటు పైన మన సంసారపు బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను. నేనేమీ చిన్నపిల్లాడిని కాదు”.
ఈ రకపు పెద్దరికపు మాటలు టెలెమాకస్ మాట్లాడుతూ ఉంటే పెనలొపీ ఆశ్చర్యపోయింది. “నీ మాటలు వింటూ ఉంటే నీ తండ్రి జ్ఞాపకం వస్తున్నారు. ఎంతలా ఎదిగిపోయావు?” అంటూ పెనలొపీ భోరుమని ఏడ్చేసింది.
వెంట ఉన్న పరిచారికలు పెనలొపీని పడకగదిలోకి తీసుకువెళుతూ ఉంటే దూరం నుండి చూస్తూన్న కోతిమూక ఊరుకోలేక, “మాలో ఒకరిని వివాహం చేసుకుంటే నీకు ఈ ఇబ్బందులు ఉండవు కదా,” అని మరొకసారి రెచ్చగొట్టేరు.
టెలెమాకస్ ఉగ్రుడయి పళ్ళు పటపట కొరికేడు. “మీరు సిగ్గులేని కుక్కలు! ప్రస్తుతానికి పాట విని ఆనందించండి. తెల్లారేసరికి తోకలు ముడిచి పారిపోవాలి. పోక పోయారా? డొక్కలు చీల్చి డోళ్ళు కడతాను”.
టెలెమాకస్‌లో వచ్చిన మార్పుకు అందరూ ఆశ్చర్యపోయారు. ఏమి తిన్నాడబ్బా, ఉమ్మెత్త పువ్వు కానీ తిన్నాడా? పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నాడు. నిశ్చేష్టులై నాలుగు నిమిషాలు స్థాణువులలా నోట మాట లేకుండా నిలబడ్డారు. అప్పుడు వారి నాయకుడు, పెద్ద కోతి, ఎంటినోయిస్ (Antinous; an-TIN-oh-us), ముందుకొచ్చి, వెటకారంగా, “ఆహా ఏమి ధైర్యం? ఏమి ప్రగల్భాలు? ఓ దేవదేవా! ఓ జూస్! ఇథకాకి ఈ కుర్రకుంకను మాత్రం రాజును చెయ్యకు సుమీ”.
టెలెమాకస్ తగ్గలేదు. చిరునవ్వు నవ్వుతూ, “ఎంటినోయిస్! నాయనా! నా చిట్టితండ్రీ! ఆ జూస్ సహాయంతోటే ఈ రాజ్యాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను. మిమ్మల్నందరినీ కుక్కల్ని కొట్టినట్లు తరిమి కొడతాను”.
“అలాగే చూద్దాం. దైవనిర్ణయం ఎలా ఉంటుందో చూద్దాం. అవును కానీ, ఇందాకా వచ్చిన పెద్దమనిషి ఎవరు? ఏ దేశంనుండి వచ్చేడు? మీ నాన్న సంగతులేమైనా చెప్పేడా? ఇలా వచ్చేడు, అలా వెళ్ళిపోయేడు. మాకు మాట్లాడడానికైనా అవకాశం చిక్కలేదు,” అన్నాడు ఎంటినోయిస్.
“ఆ వచ్చినాయన పేరు మెంటోర్. మా నాయనగారి స్నేహితుడు. మా నాన్న తిరిగి వచ్చేడని విని పలకరించడానికి వచ్చేడు. ఈవేళ కాకపొతే రేపో, మాపో వస్తాడని ఆయన అంచనా… ”
ఉపసర్పకులు ఈ సమాధానంతో ప్రభావితులవలేదు. ఇలాంటి పనికిమాలిన కబుర్లతో కాలహరణం చెయ్యడం ఎందుకని కాబోలు, కోతిమూక దృష్టి తిరిగి తాగుడు మీదకి, పాటల మీదకి మళ్ళింది. ఒడిస్సియస్ కొడుకును పట్టించుకోవడం మానేశారు.
టెలెమాకస్ తన పడకగదిలోకి దారి తీసాడు. అతని చిన్ననాటి ఉపచారిక, యూరిక్లేయా (Euryclea; yoor-ih-KLAY-ah) రెండు కాగడాలు పట్టుకుని దారి చూపించింది. గదిలోని పడక సదుపాయాలన్నీ సరిచూసి ఆమె అతనిని ఏకాంతంగా వదలి వెళ్ళిపోయింది.
టెలెమాకస్ పట్టు పరుపు మీద పడుకుని దీర్ఘాలోచనలో పడ్డాడు. అతని మస్తిష్కంలో ఒక ప్రశ్న అదే పనిగా తొలిచేస్తూంది. నిజంగా ఈ మెంటోర్ ఎవరు? మారువేషంలో వచ్చిన అథీనా దేవత కానీ కాదు కదా?
టెలెమాకస్‌కి చిన్నప్పుడు విన్న కథ ఒకటి జ్ఞాపకం వచ్చింది. అథీనా గ్రీకుల మీద కోపగించి అలగక పూర్వం, ఆమె ఎప్పుడూ ఒడిస్సియస్ మీద ఎక్కువ అభిమానం చూపించేది. ట్రోయ్ యుద్ధంలో అథీనాయే కదా కర్రగుర్రం ఉపయోగించి శత్రుగణాలను మట్టుపెట్టమని సలహా ఇచ్చినది?
పాత కాలపు అభిమానం ఎక్కడకు పోతుంది? అందుకనే వేషం మార్చి, మెంటోర్ రూపంలో వచ్చి, మళ్ళా సహాయం చెయ్యడానికి వచ్చిందా? తాను మెంటోర్‌ని మొదట చూసినప్పుడు ఆయన ధరించిన పాదరక్షలు కెంపులతో తాపడం చేసినవిలా ధగధగ మెరిసేయి. ఆయన చేతిలో రాజదండం! ఆ ధూసర వర్ణపు నయనద్వయం!
తన జీవితంలో మొదటిసారి ఆశ చిగురించింది. మెంటోర్ మరెవరో కాదు; మారువేషంలో వచ్చిన అథీనా!
5.4 ఎత్తిన లంగర్లు, లేపిన తెరచాపలు
మరునాడు ఉదయం తెల్లవారక ముందే టెలెమాకస్ నిద్ర లేచేడు. కాలకృత్యాలు కానిచ్చి, స్నానపానాదులు ముగించిన తరువాత రాజరికపు దుస్తులు ధరించేడు. పాదరక్షలు తొడుక్కుని, మొలలో కరవాలం అమర్చేడు. అద్దం ముందు నిలబడి తన విగ్రహం చూసుకున్నాడు. ఒలింపస్ పర్వతం మీద ఉండే దేవుడిలా అందంగా, శక్తిమంతంగా కనిపించేడు. తాను నిజంగా ఇంత బాగుంటాడా? లేక, రాత్రికి రాత్రి అథీనా తనను మార్చేసిందా?
తన పరివారాన్నీ, ఇథకాలో ఉన్న తన ప్రజలనీ – కోతిమూక రాకుమారులతో సహా – అందరినీ మహాసభామందిరంలో సమావేశపరచేడు. కుడిచేతితో రాజదండం పట్టుకుని, ఎడం పక్క రెండు వేటకుక్కలను వెంటపెట్టుకుని సమావేశానికి వెళ్ళడానికి బయలుదేరేడు.
టెలెమాకస్ ఠీవిగా, రాజసం ఉట్టిపడుతూ నడుస్తూ ఉంటే, ప్రజలు – పిన్నలు, పెద్దలు అనే విచక్షణ లేకుండా – ఇటూ అటూ తప్పుకుని గౌరవప్రపత్తులతో దారి ఇస్తున్నారు. టెలెమాకస్ తండ్రి కూర్చునే సింహాసనంమీద ఆసీనుడయ్యాడు. అక్కడ చేరిన వారందరినీ సింహావలోకనం చేసేడు. సద్దుమణిగిన తరువాత, లోపల కోపోద్రేకాలు పొంగిపొరలుతూ ఉండగా, లేచి నిలబడ్డాడు.
“పురజనులందరికీ నమస్కారం. సావధానంగా వినండి. ఇక్కడ ఉన్న రాకుమారులందరూ మా ఆహ్వానం మీద వచ్చినవారు కాదు. మా తండ్రిగారు దేశంలో లేకపోవడం అదునుగా చూసి, దైనందినం, తమలో ఒకరిని వివాహం చేసుకోమని, మా అమ్మగారిని ఇబ్బంది పెడుతున్నారు. హింస పెడుతున్నారు. పైపెచ్చు ఇక్కడ తిష్ఠ వేసి మన ప్రజల ఆస్తులన్నీ కొల్లగొట్టి తింటున్నారు. తాగుతున్నారు. సభ్యతను మీరి అల్లరి చేస్తున్నారు. మా తండ్రిగారు ఇక్కడ ఉండి ఉంటే ఈ అరాచకపు పనులు జరిగేవి కావు…”
టెలెమాకస్ ఇలా మాట్లాడుతూ ఉండగానే అతని మేకపోతు గాంభీర్యం క్రమంగా సడలిపోయింది. రాకుమారులను ఉద్దేశించి, “మీరంతా మీ మనస్సాక్షిగా ఆలోచించి చూసుకోండి. మీ ప్రవర్తన తప్పో, ఒప్పో మీ అంతరాత్మను అడిగి చూడండి,” అంటూ ఇంకేమి చెప్పాలో తోచక, రాజదండంతో నేలను తాటించి, గద్గదస్వరంతో మాట్లాడలేక, కూర్చున్నాడు.
అక్కడ సమావేశమైన కొందరు రాకుమారులు టెలెమాకస్ సంకటస్థితిని చూసి జాలిపడ్డారు. అప్పుడు వారి నాయకుడు, ఎంటినోయిస్ ముందుకొచ్చి, “ఇక్కడ తప్పంటూ ఎవరిదైనా ఉంటే అది మీ తల్లిగారిదే. ఆమె మమ్మల్ని మోసం చేసింది. మీ తాతగారి అంతిమయాత్రకు అవసరమైన ప్రేతవస్త్రాన్ని నేస్తున్నానంటూ, ఆ పని పూర్తి అయేవరకూ పెళ్ళి ప్రసక్తి తీసుకురావద్దని మమ్మల్ని మభ్యపెట్టింది. అదంతా కేవలం ఒక నాటకమని తర్వాత మాకు తెలిసింది. కనుక ఇప్పుడు ఆమె మాలో ఒకరిని ఎంచుకుని వివాహం చేసుకోవాలి.”
“అది జరగని పని. మా తండ్రిగారు – ఇథకా రాజు – ఒడిస్సియస్ త్వరలోనే తిరిగి వస్తున్నారు. మీరంతా ఇంక మీ ఊళ్ళకు వెళ్ళవచ్చు.”
టెలెమాకస్ ఇలా మాట్లాడుతూ ఉండగా ఆకాశంలో రెండు డేగలు రకరకాల విన్యాసాలు చేసి అందరిని ఆసక్తికరంగా ఆకట్టుకున్నాయి. అందరూ ఈ వింత చూస్తూండగా ఆ రెండూ పోట్లాడుకొని, దూరంగా ఎగిరిపోయాయి.
“ఈ వైపరీత్యం దేనికి సంకేతం?” ప్రజలలో గుసగుసలు మొదలయ్యాయి. “దేవదేవుడు జూస్ ఏదో చెబుతున్నాడు”.
జనసందోహంలోంచి తల నెరిసిన వృద్ధుడొకడు ముందుకొచ్చాడు. “ఇథకా పురజనులారా! వినండి, నా మాట. ఈ డేగల ద్వారా దేవతలు మనకు ఒక సందేశం పంపుతున్నారు. త్వరలోనే మన రాజు ఒడిస్సియస్ తిరిగి వస్తున్నాడు. మన రాణి పెనలొపీ పాణిగ్రహణానికి పరితపిస్తూన్న రాకుమారులంతా, తమంత తాముగా, స్వచ్ఛందంగా వెళ్ళిపోయారా, శుభం! కాదు, కూడదు అంటారా, ఇక్కడ మారణ హోమం తథ్యం! కనుక అవశ్యం అందరూ ఎవరి దేశాలకు వారు వెళ్ళిపొండి”.
రాకుమారులు ఈ మందలింపును ఖాతరు చెయ్యలేదు.
“ముసలాయనా! మమ్మల్ని వెళ్ళమనడానికి నువ్వెవరివి? నువ్వు ఇంటికి వెళ్ళవయ్యా. డేగలు వస్తూ ఉంటాయి, పోట్లాడుకుంటూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి వెనక అంతరార్థాలు పీకమని నీకెవరు పెత్తనం ఇచ్చారయ్యా? ఒడిస్సియస్ ఎప్పుడో చచ్చిపోయాడు. అతని కొడుకు వచ్చి నాలుగు ప్రగల్భాలు పలికితే మేము భయపడి పారిపోతామా?”
టెలెమాకస్‌కి ఒళ్ళు మండింది. “దేవుళ్ళకు నా కథ తెలుసు. మీరు నాకొక పడవను, ఇరవైమంది నావిక సిబ్బందిని ఇవ్వండి. నేను వెళ్ళి మా నాన్నగారిని వెతికి ఆచూకీ తెస్తాను. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడని మనకు రుజువు దొరికితే, అప్పుడు మనం అందరూ ఆయన రాక కోసం ఎదురు చూద్దాం. ఆయన బ్రతికి లేడని నిర్ధారణ అయితే, మా తల్లిగారు మీలో ఒకరిని వివాహం చేసుకుంటారు.”
ఉపసర్పకులకు ఈ పథకం నచ్చలేదు. పైపెచ్చు, వారు టెలెమాకస్‌ని వెటకారం చేసేరు.
నిరుత్సాహంతో ఏమి చెయ్యాలో తోచక టెలెమాకస్ ఒంటరిగా సముద్రపుటొడ్డుకు వెళ్ళేడు. నురుగులు కక్కుతూన్న కెరటాలలో కాళ్ళు, చేతులు కడుక్కుని, చేతులెత్తి దారి చూపమని అథీనాను ప్రార్ధించేడు:
“దేవీ! నిన్న నువ్వే వచ్చి నాకు కనబడ్డావు. ఒక పడవలో వెళ్ళి మా నాన్న ఉనికి వెతకమని సలహా ఇచ్చేవు. ఇప్పుడు ఏమి చెయ్యాలో చెప్పు. నన్ను వెటకారం చేసేవాళ్ళే తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు కనబడడం లేదు.”
మెరుపు మెరిసిన చందంగా మెంటోర్ ఎదురుగా కనబడ్డాడు. ధూసర వర్ణంతో అతని కళ్ళు మెరుస్తున్నాయి.
“టెలెమాకస్! ఈ ఉదయం రాజసభలో నీ ప్రసంగం వింటూ ఉంటే నీలో నీ తండ్రి పోలికలు కనబడ్డాయి. నీకు నేను సహాయం చేస్తాను. ఆ ఉపసర్పకుల మాటలకు భయపడకు. వారి కాలం చెల్లింది. వారి ప్రవర్తనకు పణం చెల్లించే రోజులు దగ్గర పడుతున్నాయి. తక్షణం తిరిగి ఇంటికి వెళ్ళి మదిర, మాంసం, సరకులు, సరంజామా సిద్ధపరచుకో. నేను నీకు కావాల్సిన నావికులను సిద్ధపరుస్తాను. నేను చెప్పినట్లు పైలోస్ ద్వీపానికి వెళ్ళు. అక్కడ నెస్టర్ మహారాజును కలుసుకో”.
టెలెమాకస్ ఇంటికి తిరిగి వచ్చేడు. తనను చిన్నప్పటినుండి పెంచి, పెద్దచేసిన యూరిక్లేయా సహాయంతో ప్రయాణానికి కావలసిన సామగ్రి అంతా సంచులలో సర్ది సిద్ధం చేసేడు.
“నేను నెస్టర్ సహాయం అర్ధించడానికి ఈ రాత్రే ప్రయాణం అయి వెళుతున్నాను. ఈ మాట మాత్రం పది రోజులు పోయేవరకు అమ్మకు చెప్పకు. చెబితే వెళ్ళొద్దంటుంది”.
ఈ మాటలు విని యూరిక్లేయా మొర్రోమంది. “వెళ్ళకు, నాయనా. నువ్వు మీ నాన్నగారిని వెతికి తీసుకురాడానికి వెళ్ళేవని తెలిస్తే ఈ రాకుమారులు నిన్ను వదిలిపెట్టరు. వెతికి పట్టుకుని, చంపేస్తారు”.
“అధైర్యపడకు. నాకు ప్రమాదం ఏమీ లేదు. సాక్షాత్తు ఆ అథీనా దేవతే నాకు అండగా ఉంది,” అన్నాడు టెలెమాకస్.
ఈ సంభాషణ ఇలా ఒక పక్క జరుగుతూ వుండగానే మరొక పక్క టెలెమాకస్ వేషంలో అథీనా, ప్రయాణానికి కావలసిన సరంజామాలన్నీ సమకూర్చింది. చీకటి పడగానే, రేవులో పడవను సంసిద్ధం చేసేసింది.
అప్పుడు మెంటోర్ వేషంలో రేవు దగ్గర నిలబడి, పడవను సరంగులకు అప్పజెప్పి, సామానులు పడవలో ఎక్కించి, అంతా తయారయిన పిమ్మట త్వరగా రాజభవనానికి వెళ్ళి, అక్కడ అందరూ నిద్రలోకి వెళ్ళేలా మంత్రం వేసి, టెలెమాకస్‌తో, “త్వరగా నడు, పడవ ప్రయాణానికి సిద్ధంగా ఉంది” అని చెప్పేడు.
అప్పుడు, ఆ చీకట్లో, ప్రయాణంలో అవసరమవుతాయని మూటలు కట్టిన ఆహారపదార్థాల మూటలను చడీ చప్పుడూ లేకుండా రాజభవనంనుండి రేవుకు తరలించారు.
పడవను సిద్ధం చేసేరు. మెంటోర్, టెలెమాకస్ – ఇద్దరూ పడవ ఎక్కి, వెనక తట్టు భాగంలో వారికి కేటాయించిన ఆసనాలలో కూర్చున్నారు.
అథీనా ధూసరవర్ణపు నయనద్వయంనుండి పడమటి గాలి వీచడం మొదలెట్టింది.
“తెరచాపలు లేపండి” టెలెమాకస్ ఉత్తర్వు జారీ చేసేడు. సరంగులు తెరచాప కొయ్యను ఎత్తి, తెరచాపలు లేపేరు.
పడవ సముద్రంలోకి దిగి పరుగులు తియ్యడం మొదలెట్టింది. సంతోషంతో సరంగులు ద్రాక్ష పానీయపు పాత్రలను పైకెత్తి, “జూస్ కుమార్తె అథీనా దేవికి, జై” అని అరిచేరు.
వారికేం తెలుసు? ఆ అథీనా దేవే స్వయంగా ఈ పడవను నడుపుతోందని?
5.5 అన్వేషణ
టెలెమాకస్ పడవ రాత్రల్లా ప్రయాణం చేసి, తెల్లారేసరికల్లా నెస్టర్ మహారాజు ఉండే పైలోస్ దీవి చేరుకుంది.
సముద్రపుటొడ్డున ఏదో ఉత్సవం జరుగుతూన్నట్లు ఉంది. జనసందోహం గుమిగూడి సముద్రాలకు అధిపతి అయిన పొసైడన్‌ని తృప్తిపరచడానికి ఏవో పూజలు చేస్తున్నారు.
సరంగులు తెరచాపలు దించి, పడవను ఒడ్డుకు చేర్చేరు. అందరినీ పడవలోనే ఉండమని చెప్పి, మెంటోర్ ఒక్క టెలెమాకస్‌ని మాత్రం పడవ దిగి తనతో రమ్మన్నాడు.
ఇద్దరూ నడక ప్రారంభించేరు. మెంటోర్ తన హితోపదేశం మొదలుపెట్టేడు. “రాజు ఎదుట భయపడకు. ధైర్యం ప్రధానం. ప్రణామాలు అయిన తరువాత, కాలహరణం చెయ్యకుండా, వచ్చిన పని ఏమిటో సూటిగా చెప్పు. నీ తండ్రి సమాచారం ఏమయినా ఆయనకు తెలుసా? నీ తండ్రి చనిపోయాడా? చనిపోతే ఆయన సమాధి ఎక్కడ ఉంది? ఇవీ అడగవలసిన ప్రశ్నలు. ఆయన వివేకి, జ్ఞాని, శక్తిమంతుడు, ఉత్తముడూను”.
ఈ మాటలు వినగానే టెలెమాకస్ బెదిరిపోయాడు. నెస్టర్ మహారాజు నేల మీద యుద్ధంలో మహారథుడు. సముద్రం మీద యుద్ధంలో అద్భుతమైన నావికుడు, గుర్రపు సవారీలో తిరుగులేనివాడు.
“భయపడకు. నువ్వు కేవలం నిమిత్తమాత్రుడవు. నువ్వు ఎప్పుడు ఏమి మాట్లాడాలో ఆ విధి నిర్ణయిస్తుంది. దేవుడి మీద భారం వేసి, అడుగు ముందుకు వెయ్యి,” మెంటోర్ ధైర్యం చెబుతున్నాడు.
టెలెమాకస్ ధైర్యం సంతరించుకున్నాడు. వారిద్దరూ సముద్రపుటొడ్డున గుమిగూడిన ప్రజల దగ్గరకు వచ్చేరు. అక్కడ తన ఏడుగురు కొడుకులు పరివేష్టించి ఉండగా నెస్టర్ మహారాజు కనిపించేడు.
ఆగంతకులను చూడగానే ఏడుగురు కొడుకులలో ఇద్దరు గభీమని లేచి వచ్చి, ఇద్దరినీ ఆహ్వానించి, గొర్రె చర్మంతో చేసిన మెత్తని ఉచితాసనాలు చూపించి, కూర్చోబెట్టేరు. పరిచారికలు ఇద్దరికీ బంగారు పాత్రలలో మాంసం, మదిర ఇచ్చి గౌరవించేరు.
టెలెమాకస్, మెంటోర్ అతిథి సత్కారాలు స్వీకరించి, తృప్తులయిన తరువాత, నెస్టర్ మహారాజు వారిని సమీపించి, “భోజన పానీయాలతో సత్కారాలు పూర్తి అయిన తరువాతే అతిథుల రాకకై కారణం అడగటం మా కులమర్యాద. ఇప్పుడు చెప్పండి. మీరు ఎవరు? ఎక్కడనుండి వస్తున్నారు? వర్తకవాణిజ్యాలు చేసేవారా? ఏ కార్యార్థం వచ్చేరు?”
టెలెమాకస్ వైపు చూసి మెంటోర్, ధైర్యంగా మాట్లాడమని మౌనంగా ప్రోత్సహించేడు.
“మేము ఇథకా ద్వీపం నుండి వస్తున్నాం. అరివీరభయంకరుడైన ఒడిస్సియస్ మా దేశపు రాజు. ఆయన జాడ తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడకు వచ్చేము. ట్రోయ్ యుద్ధం అయిన తరువాత ఆయన పడవలు ఏమయ్యాయో ఆచూకీ లేదు. ఆయన గురించి మీకు ఏమయినా తెలిస్తే చెప్పమని ప్రార్ధిస్తున్నాను. నేను ఆయన కుమారుడిని కనుక, మంచి వార్త అయినా, చెడ్డ వార్త అయినా నిర్ద్వంద్వంగా తెలుసుకోవాలనే నా కోరిక.”
నెస్టర్ అత్యంత ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. “నాయనా! నువ్వు ఎవరివో చెప్పిన తరువాత నీలో నీ తండ్రి ఒడిస్సియస్ పోలికలు స్పష్టంగా చూడగలుగుతున్నాను. అతని గురించి నాకు తెలిసినదంతా చెబుతాను. విను.
“యుద్ధం ముగిసిన తరువాత మేము ట్రోయ్ నుండి బయలుదేరే సందర్భంలో కొంతమంది గ్రీకు వీరులు అక్కడ ఉన్న అథీనా ఆలయంపై విధ్వంసకకృత్యాలు చేసేరు. మలినపరచేరు. ఆమె కినుక వహించింది. తండ్రి జూస్‌తో జరిగిన అపచారం గురించి చెప్పింది. జూస్ ఆగ్రహించి, సముద్రంలో పెద్ద తుపాను పుట్టించి, గ్రీకు నౌకాదళంలో ఉన్న పడవలన్నిటిని చెల్లాచెదరు చేసేడు. నా అదృష్టం బాగుండి నేను ఇల్లు చేరుకోగలిగేను. కానీ నా మిత్రులు, సహచరులు ఏమయ్యారో తెలియలేదు. ఎవరు గట్టెక్కారో, ఎవరు మునిగిపోయారో తెలియదు. తరువాత ఆనోటా ఈనోటా విన్నది తప్ప నికరంగా ఏ సమాచారమూ నా చెవిన పడలేదు. నీ తండ్రి సంగతి – మంచిగా కానీ, చెడ్డగా కానీ – నేను ఏమీ వినలేదని చెప్పడానికి చింతిస్తున్నాను”.
టెలెమాకన్ నిరాశతో నిట్టూర్చేడు. తన తల్లిని ఉపసర్పక రాజకుమారులు ఎలా వేధించుకు తింటున్నారో, కోటలో తిష్ఠ వేసి తమ ఆస్తిని ఎలా దోచుకు తింటున్నారో చెప్పి విలపించేడు.
నెస్టర్ ఈ మాట విని కాసేపు దీర్ఘాలోచనలో పడి నిశ్శబ్దంగా ఉండిపోయేడు. అప్పుడు తల పంకించి, అనునయంగా చెప్పేడు:
“ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో చెబుతాను, విను. మహారాజు మెనలెయస్, మహారాణి హెలెన్ నివసించే రాజభవనానికి వెళ్ళు. ట్రోయ్ యుద్ధం అయిన తరువాత అందరికంటే ఆఖరున ఇంటికి వచ్చిన వ్యక్తి ఆయన. ఆయనను ఆశ్రయించు. నీకు తప్పక సహాయం చేస్తాడు.
“మీరిద్దరూ నా ఆతిథ్యం స్వీకరించి ఈ రాత్రికి మా రాజభవనంలో విశ్రాంతి తీసుకోమని అర్థిస్తున్నాను”.
“మన్నించాలి. నేను పడవలోకి వెళ్ళి మా సిబ్బంది మంచి చెడ్డలు చూసుకోవాలి. మా ఇద్దరి తరఫున, మీ కోరిక ప్రకారం, టెలెమాకస్ ఈ రాత్రి ఇక్కడే ఉంటాడు. రేపు మీ గుర్రాల్లో ఒక మేటి గుర్రాన్నీ, ఒక మంచి రథాన్ని టెలెమాకస్‌కి అరువుగా ఇవ్వండి. వాటిని ఉపయోగించి మెనలెయస్ నగరానికి వెళతాడు,” అని మెంటోర్ అడిగేడు.
ఈ మాటలు చెబుతూ అథీనా – మెంటోర్ రూపంలో కాకుండా – తన నిజస్వరూపం ప్రదర్శిస్తూ – అనగా తన ధూసరవర్ణపు కళ్ళు, రెక్కలు, వగైరా ప్రదర్శిస్తూ ఒక బ్రహ్మాండమైన డేగను వాహనంగా చేసుకుని అక్కడనుండి నిష్క్రమించింది.
ఈ ‘దైవ ప్రదర్శన’ చూసిన వారంతా నిర్ఘాంతపోయి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయేరు. నెస్టర్ మహారాజు ఒక్కసారి ఎగఊపిరితో టెలెమాకస్ చెయ్యి పట్టుకున్నాడు. “మిత్రమా! నీ సహచరి సాక్షాత్తూ ఆ దేవదేవుని కుమార్తె అథీనా!” అంటూ విస్తుపోయాడు.
నెస్టర్ ఒక పడ్డను అథీనాకు బహుమానంగా బలి ఇస్తానని మొక్కుకున్నాడు. తరువాత ఆయన టెలెమాకస్ చెయ్యి పట్టుకుని మేడ మీద పడకగదిలోకి స్వయంగా తీసుకెళ్ళేడు.
మరునాడు టెలెమాకస్ లేచిన తరువాత పరిచారికలు అతనిచేత అభ్యంగన స్నానాదులు చేయించి, నూతన వస్త్రాలతో అలంకరించేరు. టెలెమాకస్ ఆ రాజప్రాసాదాన్ని వదలి ప్రయాణానికి సిద్ధం అయ్యాడు.
అత్యుత్తమమైన రథానికి వాయువేగంతో పరిగెట్టే గుర్రాలను అమర్చి సిద్ధం చేసేరు. దారిలో అవసరాలకు అన్నపానాదులను పరిచారకులు రథంలో అమర్చేరు. నెస్టర్ కనిష్ఠపుత్రుడు పిసిస్ట్రేటస్ (Pisistratus) రథం ఎక్కి, కళ్ళెం పట్టుకుని ఝళిపించేడు.
గుర్రాలు పరుగు లంకించుకున్నాయి. రోజల్లా ప్రయాణించి చీకటి పడగానే ఇద్దరూ విశ్రమించేరు.
మరునాడు రోజల్లా ప్రయాణించి, చీకటి పడే వేళకు గమ్యం చేరుకున్నారు.
5.6 సముద్రపు పాలికాపు
రథం రాజప్రాసాదం ముందు ఆగింది. గ్రీకుల సాంప్రదాయ పద్ధతిలో కొత్తగా వచ్చిన అతిథులకు సేవక బృందం ఆహ్వాన వచనాలు పలికేరు. సుగంధద్రవ్యాలు పూసి, కొత్త వస్త్రాలు ఇచ్చి అతిథులకు రాచమర్యాదలు చేసేరు. బాటసారులను ఈ రకంగా గ్రీకులు మర్యాదలు చేస్తారని టెలెమాకస్‌కి తెలుసు. అది వారి సంప్రదాయం. మనమే మరొక దేశంలో బాటసారులుగా తిరుగుతున్నప్పుడు మనం కూడా అతిథి సౌకర్యాల కొరకు ఎదురుచూస్తాము కదా.
నెస్టర్ కొడుకునీ, టెలెమాకస్‌నీ మహారాజు సన్నిధిలో కూర్చోబెట్టేరు. అక్కడ వారిని భక్ష్య, భోజ్య, పానీయాలతో సత్కరించారు.
“మా రాజ్యానికి స్వాగతం, సుస్వాగతం!” అని మహారాజు మెనలెయస్ పలకరించేడు. “విందు ఆరగించిన తరువాత సావధానంగా మీరు ఎవరో, ఎక్కడనుండి వస్తున్నారో, ఏ పని మీద వచ్చేరో చెప్పండి.”
విందు భోజనం భుజిస్తూ టెలెమాకస్ ఆ భవనాన్ని నాలుగు పక్కలా తేరిపార చూసేడు. ఆహా, ఏమి ఈ భవనం! ఏమి దీని సౌందర్యం! ఎక్కడ చూసినా వెండి, బంగారం, వజ్రాలు, రత్నాలు, తృణస్ఫటికాలు! టెలెమాకస్ అక్కడ ఉన్న వైభవం, ఐశ్వర్యం, రాజభోగాలు చూసి ఆశ్చర్యపోయేడు.
“ఈ భవనాన్ని చూస్తూ ఉంటే సాక్షాత్తూ ఆ దేవేంద్రుడు జూస్ నివసించే భవనంలా లేదూ?” అని అతి నెమ్మదిగా, మంద్రస్వరంతో, పక్కనే కూర్చున్న నెస్టర్ కొడుకు పిసిస్ట్రేటస్‌తో అన్నాడు టెలెమాకస్.
అనడం అతిమంద్రస్వరంతో అన్నాడు కానీ ఆ మాటలు మెనలెయస్ పాము చెవులకు వినిపించేయి.
“అంత మాట అనొద్దు. నేనెక్కడ? ఆ దేవేంద్రుడెక్కడ? పోల్చడానికి పోలికే లేదు. ట్రోయ్‌లో యుద్ధం ముగిసిన తరువాత నేను చాలా ప్రదేశాలు సందర్శించేను. అక్కడనుండి పట్టుకొచ్చినవే మీరిద్దరూ చూస్తూన్న ఐశ్వర్యం అంతా. ఇంత ఐశ్వర్యం కూడబెట్టి ఏమి లాభం? ఆ యుద్ధంలో నా బంధుమిత్రులను ఎంతమందినో పోగొట్టుకున్నాను; కొందరు ట్రోయ్ వీరుల చేతిలో చచ్చిపోయేరు, కొందరు తిరుగు ప్రయాణంలో సముద్రంలో మునిగి ప్రాణాలు విడచేరు, మరికొందరు జాడ లేకుండా పోయారు.
“వీరందరిలో ఒక వ్యక్తి గురించి తలుచుకుంటే మాత్రం గుండె చెరువై పోతూంది. అతను ఏమయ్యాడో తెలియక అతని సంసారం అష్టకష్టాలు పడుతోందని విన్నాను. అతని గురించి బెంగ పెట్టుకుని అతని తల్లి ప్రాణాలు విడిచిందిట. అతని తండ్రి రాజ్యం వదలి, అడవుల పాలయ్యేడుట. అతని భార్య అతని రాక కోసం నిత్యం ఎదురు చూస్తోందని విన్నాను. అతను ట్రోయ్ యుద్ధానికి వెళ్ళినప్పుడు అతని కొడుకు తల్లి పొత్తిళ్ళలో ఉన్న పసిపాప”.
ఈ మాటలు వింటూ ఉంటే ఉబికి వస్తూన్న కన్నీటిని కనబడనీయకుండా టెలెమాకస్ రెండు చేతులతో ముఖాన్ని కప్పుకున్నాడు. మెనలెయస్ చెబుతూన్నది తన తండ్రి ఒడిస్సియస్ గురించే.
అదే సమయంలో సర్వాలంకార భూషితురాలైన మహారాణి హెలెన్ ఆమె అంతఃపురం నుండి బయటకు వచ్చింది. ఆమె అందం వర్ణనాతీతం. ఆమె భువనైక సుందరి.
“ఎవరీ సందర్శకులు? ఎక్కడనుండి వచ్చేరు? ఈ ఇద్దరిలోనూ ఒక అబ్బాయికి ముమ్మూర్తులా మన ఒడిస్సియస్ పోలికలు లేవూ?” అని భర్తను అడిగింది హెలెన్.
దానికి సమాధానం నెస్టర్ కొడుకు పిసిస్ట్రేటస్ చెప్పేడు. “అవును మహారాణీ! నిజమే! ఇతను ఒడిస్సియస్ కొడుకు. ఒడిస్సియస్ ఏమయిపోయాడో తెలియక ఇతను, ఇతని తల్లి, ఇథకాలో నానా ఇబ్బందులు పడుతున్నారు. తండ్రిని వెతకడానికి సహాయం కావాలని ఇతను మా తండ్రి నెస్టర్ వద్దకు వచ్చాడు. మా తండ్రి అటువంటి సహాయం మీరొక్కరే అందించగలరని ఇక్కడకు పంపేరు”.
ఈ సంగతి తెలియగానే మెనలెయస్ చకితుడయ్యాడు.
“నీ తండ్రి అరివీరభయంకరుడు. నేను బందీగా ఉన్నప్పుడు నీ తండ్రి ధైర్యసాహసాలు కళ్ళారా చూసేను. అతని మూలంగానే నాకు విముక్తి లభించింది,” అని హెలెన్ మరొకసారి ఒడిస్సియస్‌ని కొనియాడింది.
“అవును. కర్రగుర్రాన్ని నిర్మించి దాని సహాయంతో కోటలో ప్రవేశించాడు. కోట ద్వారాలు తెరచి గ్రీకు సైనికుల్ని లోపల ప్రవేశపెట్టి ట్రోయ్ నగరాన్ని భస్మం చేసేడు,” మెనలెయస్ వంత పలికేడు.
“మహారాజా! మీరన్నట్లు మా తండ్రి మహావీరుడే కానీ ఏమి లాభం? అతని ధైర్యసాహసాలు అతడిని అతని కర్మ నుండి తప్పించలేకపోయాయి,” అన్నాడు డస్సిపోయిన టెలెమాకస్. దిగులుగా, మౌనంగా కూర్చుండిపోయాడు. కొంత తడవు తరువాత, “కాసేపు నిద్రపోతే ఈ దుఃఖం నుండి ఉపశమనం దొరుకుతుందేమో?” అన్నాడు.
“ప్రయాణపు బడలికతో ఉన్నారు. మన అతిథులకు పడక ఏర్పాట్లు చెయ్యండి,” అని రాణి హెలెన్ తన పరిచారికలతో చెప్పింది.
తెల్లారగానే రాజా మెనలెయస్ అతిథుల పడకగదికి వెళ్ళి, టెలెమాకస్‌ని తట్టి, లేపి, అతని పడక పక్కనే కూర్చుని, “ఇప్పుడు చెప్పు. నా దగ్గరనుండి నీకు ఏమి కావాలి? నేను ఏ విధంగా నీకు సహాయం చెయ్యగలను?” అని అడిగేడు.
“మా తండ్రిగారి గురించి మీకు ఏమి తెలిసినా చెప్పండి. మంచి వార్త కానీ, చెడ్డ వార్త కానీ, సంశయించకుండా చెప్పండి.
“నాకు తెలిసినంతమట్టుకు చెబుతాను,” అని మెనలెయస్ మొదలుపెట్టేడు. “ఈజిప్టుకు సమీపంలో, సముద్రంలో ఒక దీవి ఉంది. చాలామంది నావికులు విశ్రాంతి తీసుకోడానికో, సరుకులు కొనుక్కోడానికో అక్కడ ఆగుతూ ఉంటారు. ట్రోయ్ యుద్ధం అయిన తరువాత, తిరిగి వస్తూ, దారి తప్పి, నేను అక్కడ ఆగడం తటస్థపడింది. యుద్ధంలో నేనొక్కడినే బ్రతికి బయట పడ్డానో, తిరుగుదారిలో ఎవరెవరు బ్రతికేరో, ఎవరెవరు చచ్చిపోయారో నాకు తెలియదు. నేనొక్కడినీ దారీతెన్నూ తెలియక ఆ దీవిలో తిరుగుతూ ఉంటే ఒక జలకన్య కనబడింది. సముద్ర ప్రయాణంలో ఎవరేమయ్యారో తెలుసుకోవాలంటే ఆమె తండ్రిని అడగమని చెప్పింది”.
“ఎవరా తండ్రి?”
“అతనిని ‘సముద్రపు పాలికాపు’ అంటారట. అతను సముద్రదేవుడు పొసైడన్ దగ్గర పశువుల కాపరిగా పని చేస్తూ ఉంటాడట. సముద్రంలో తిరుగాడే సీల్ జంతువుల సంరక్షకుడు. అతను రోజుకొక్కసారే, ఒక నిర్దిష్ట సమయంలో, సముద్రపు లోతుల్లోంచి బయటకు వస్తాడు – పశువుల్ని లెక్కపెట్టుకోడానికి. అప్పుడు అతన్ని త్వరగా పట్టుకోవాలి. ఆలస్యం చేస్తే అతని రూపు మారిపోతుంది. సముద్రంలో తిరుగాడే ఏదో ఒక జంతువు రూపంలోకి మారిపోతాడు. అప్పుడు గుర్తించడం కష్టం. అతను మనిషి రూపంలో ఉన్నప్పుడు పట్టుకోగలిగితే మన ప్రశ్నలకు సమాధానం చెబుతాడు”.
“మీరు పట్టుకోగలిగేరా?”
“అతను సముద్రపు నీటినుండి బయటకు వచ్చేవరకు ఓపికగా వేచి ఉండి, బయటకు రాగానే వాటేసి పట్టుకున్నాను. అప్పుడు నేను ఇంటికి వెళ్ళడం ఎలా అని అడిగేను. మంచి సలహా ఇచ్చేడు.
“అప్పుడు కనబడకుండా పోయిన నా స్నేహితుల గురించి అడిగేను. అప్పుడు ఎవరెవరు ఎలా చచ్చిపోయారో వివరంగా చెప్పేడు. దుఃఖం ఆపుకోలేక నేను ఏడుస్తూ ఉంటే, ఓదార్పు మాటగా మరొక విషయం చెప్పేడు. ఒక్క నావికుడు మాత్రం అన్ని కష్టాలను ఎదుర్కొని ఇంకా బ్రతికే ఉన్నాడనిన్నీ, అతని పేరు ఒడిస్సియస్ అనిన్నీ చెప్పేడు. కానీ ఇప్పుడు అతను కలిప్సో దేవత అధీనంలో, ఒక ద్వీపంలో, బందీగా ఉన్నాడని చెప్పేడు. అతని ఇష్టానికి వ్యతిరేకంగా కలిప్సో అతడిని ఆ దీవిలో ఉంచింది అని చెప్పేడు”.
టెలెమాకస్ ఆనందానికి అవధులు లేవు. తన తండ్రి బ్రతికే ఉన్నాడు.
మెనలెయస్ మరిన్ని విషయాలు ముచ్చటించి టెలెమాకస్‌ని ఒంటరిగా గదిలో వదిలేసి వెళ్ళిపోయాడు.
“నా తండ్రి బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? నా తండ్రి కొరకు కలిప్సో ఉన్న దీవికి వెళ్ళడమా? లేక తిరిగి ఇంటికి వెళ్ళి ఈ శుభవార్తను తల్లితో పంచుకోవడమా? అదీ ప్రశ్న”.
5.7 కలిప్సో ద్వీపం
ఎంతో దూరంలో, సముద్రంలో మరో మూల, కలిప్సో దేవతకు చెందిన ద్వీపంలో, ఒక రాయి మీద ఏకాంతంగా కూర్చుని, దోసిట్లో ముఖాన్ని దాచుకుని, దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఒడిస్సియస్. అతని కళ్ళనుండి కారే కన్నీళ్ళు ఇంకా ఆగలేదు. గత ఏడేళ్ళబట్టీ ఈ ద్వీపంలో చిక్కడిపోయి ఏడుస్తూనే ఉన్నాడు. తన భార్యనీ, పిల్లాడిని, తండ్రిని తలుచుకోని క్షణం లేదు.
అతని ముఖం పైకెత్తి, కంటిలోని అశ్రుబిందువులని తుడుచుకుని చూసి ఉంటే ఎదురుగా కెరటాల మీద సయ్యాటలాడుతూన్న కాంతి కిరణాలు అతనికి కనిపించి ఉండేవి. అవి కేవలం పరావర్తనం చెందిన సూర్యకిరణాలు కావని ఆతను గ్రహించి ఉండేవాడు. ఇంతలోనే ఇంతింతై, మరింతై, ఒక చేతిలో సువర్ణ శూలం, మరొక చేతిలో తంబూరా, పాదాలకు రెక్కలున్న సువర్ణ పాదరక్షలతో మానవ రూపం సంతరించుకున్న హర్మీజ్ ఎదురుగా కనబడి ఉండేవాడు.
హర్మీజ్ గాలిలోనే సంచరిస్తూ, ఆ దీవిలో పుష్పవనాలు వెదజల్లే సువాసనలను ఆఘ్రాణిస్తూ, అలవోకగా కలిప్సో దేవత నివసించే గుహ ద్వారం వైపు ప్రయాణం కొనసాగించేడు. ఆ గుహకు వెళ్ళే దారిలో, బాటకు ఇరుపక్కలా, అందమైన చెట్లు బారులు తీరి ఉన్నాయి. ఆ చెట్ల కొమ్మలలో రకరకాల పక్షుల గూళ్ళు కనిపించాయి. ఆ గుహ ద్వారం లతలతో కప్పబడి ఉంది. కొన్ని లతలనుండి ద్రాక్ష గుత్తులు వేలాడుతున్నాయి. దేవదారు, మంచిగంధం చెక్కలు కాలుతూన్న సువాసనలు ఆ ద్వారం దగ్గర వ్యాపించి ఉన్నాయి గుహ ద్వారాన్ని ఆచ్చాదించిన లతలను పక్కకు తొలగించి లోపల ప్రవేశించాడు, హర్మీజ్.
లోపల పొయ్యిలో మండుతూన్న పెద్ద మంట దాపున కలిప్సో కూర్చుని, పాట పాడుతూ, మగ్గం మీద ఏదో నేత నేస్తూంది. ఆమె గుహ ద్వారం ద్వారా లోపలికి వస్తూన్న హర్మీజ్‌ని చూసి పలకరింపుగా తియ్యని చిరునవ్వు నవ్వింది.
“హర్మీజ్! నువ్వు వచ్చి నా ఇంటిని పావనం చేసేవు. కూర్చో. నువ్వు తినడానికి, తాగడానికి ఏదైనా పట్టుకొస్తాను,” అంటూ లేచింది.
దేవతలు తినే అంబ్రోజియా, దేవతలు తాగే అమృతం బంగారు పాత్రలలో పెట్టి కలిప్సో తీసుకువచ్చింది.
ఆహారాన్ని చవి చూసి ఉపశమించిన తరువాత, తన రాకకై కారణం చెప్పడం మొదలుపెట్టేడు, హర్మీజ్.
“ఈ దినం, ఒలింపస్ పర్వతం మీద అథీనా దేవత ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆమె ఇథకా రాజైన ఒడిస్సియస్ గురించి చాలా ఆరాటపడుతోంది. అతడు అతని భార్యనుండి, సంసారంనుండి విడివడి చాలా రోజులు – నిజానికి సంవత్సరాలు – అవుతోందని ఆమె ఆరాటానికి కారణం. పైగా, అతని శత్రువులు అతని కొడుకును హతమార్చడానికి పన్నాగాలు పన్నుతున్నారు. కలిప్సో, విను! దేవరాజు జూస్ తన కూతురు అథీనా మాటలు బాగా విన్నాడు. విని స్పందిస్తున్నాడు. ఈ సందర్భంలో నువ్వు నీ బందీగా ఉన్న ఒడిస్సియస్‌కి విముక్తి ప్రసాదించడం సర్వత్రా మంచిదేమో.”
ఈ మాటలు వినగానే కలిప్సోకు కోపం వచ్చింది. కానీ హర్మీజ్ ఆమె ప్రతిస్పందనను లెక్క చెయ్యకుండా, చెపుతూన్న మాటలను చెప్పసాగేడు. “ఒడిస్సియస్ ఎవ్వరి సహాయం లేకుండా కేవలం తన శక్తియుక్తుల మీద ఆధారపడి తిరిగి గృహోన్ముఖుడవాలని జూస్ తీర్మానం. దేవతలు ఎవ్వరూ అతనికి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఉపకారం కానీ, అపకారం కానీ చెయ్యకూడదని కూడా ఆ తీర్మానంలో ఉంది. తన స్వశక్తితో పడవ నిర్మించుకుని, ఆ పడవను తన భుజబలంతో తోలుకుని సముద్రంలో ఇరవై రోజులు ప్రయాణం చేస్తే స్కెరీయా (Scheria; SKER-ee-ah) దీవి చేరుకుంటాడు. అక్కడనుండి ఇథకా చేరుకొని, అప్పుడు తన సంసారానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటాడు”.
“ఒలింపస్ కొండ మీద ఉన్న దేవుళ్ళకు నా మీద కోపంగా ఉంది. ఒక దేవకన్య ఒక సామాన్య మానవుడిని ప్రేమించి, పెళ్ళి చేసుకోవడం వారికి ఇష్టం లేదు. నేను ఒడిస్సియస్ ప్రాణాలు కాపాడేను. అతన్ని ప్రేమించే హక్కు నాకు ఉంది అనుకున్నాను,” కొంచెం కోపంగానే అంది కలిప్సో.
“నాకు తెలుసు. జూస్ ఇష్టానికి వ్యతిరేకంగా వెళితే ఏమవుతుందో నాకు తెలుసు. ఒడిస్సియస్ ఇంటికి వెళ్ళిపోతానంటే నాకు ఇటుపైన ఏ అభ్యంతరమూ లేదు. అతని తిరుగు ప్రయాణానికి నేను అడ్డుపడను,” హామీ ఇచ్చింది కలిప్సో.
హర్మీజ్ నమస్కారం చేసి, లేచి వెళ్ళిపోయాడు.
ఒడిస్సియస్ ఎక్కడ ఉన్నాడో వెతకడానికి కలిప్సో బయలుదేరింది.
సముద్రపుటొడ్డున ఒక రాయి మీద కూర్చుని కనిపించేడు. అతని కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. అతని పక్కనే కూర్చుంది. అతని చేతిని తన చేతిలోకి తీసుకుని, నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది.
“నువ్వు ఇటుపైన ఇక్కడ ఉండక్కరలేదు; నీ సంసారం కోసం బెంగపెట్టుకున్నట్లు ఉన్నావు. నిన్ను మీ ఇంటికి పంపేస్తాను. వెళ్ళి కావలసిన చెట్లు కొట్టుకొని ఒక పడవనో, బల్లకట్టునో తయారు చేసుకో. దారిలో తినడానికి, తాగడానికి నీకు కావలసిన రొట్టెలు, బట్టలు, నీళ్ళు, సారా నేను ఇస్తాను”.
ఇన్నాళ్ళు తనను ఈ ద్వీపం మీద నొక్కిపెట్టి అట్టేపెట్టింది. ఇప్పుడు మనస్సు మార్చుకుని వెళ్ళనిస్తానంటోంది. ఈమె మాట నమ్మవచ్చా? “మంచి అనుభవం ఉన్న వడ్రంగులు కట్టిన పడవ కూడా ఈ భీకరమైన సముద్రపు ధాటికి తట్టుకోలేదు,” అన్నాడు ఒడిస్సియస్. “నేను సముద్రంలోకి వెళ్ళిన తరువాత నువ్వు మనస్సు మార్చుకుని నాకు అపకారం చెయ్యనని దేవుని సాక్షిగా మాట ఇస్తావా?”
ఒడిస్సియస్ చేతిని తన చేతిలోకి తీసుకుని, “దేవుని సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా, ఈ సముద్రం సాక్షిగా నీకు అపకారం చెయ్యనని ప్రమాణం చేసి చెబుతున్నాను” అంది కలిప్సో.
అలా ప్రమాణం చేసిన వెంటనే కలిప్సో తన గుహ వైపు కదలి వెళ్ళిపోయింది. ఒడిస్సియస్ ఆమెని వెంబడించేడు. గుహ లోపలికి వెళ్ళి, తన పరిచారికలని పిలిచి, భోజనానికి ఏర్పాట్లు చేయమని చెప్పింది. వారు కలిప్సో తినడానికి అంబ్రోజియా, తాగడానికి అమృతం సిద్ధం చేసారు. మానవుడైన ఒడిస్సియస్ తినడానికి మాంసం, రొట్టెలు, ద్రాక్ష సారా, వగైరాలు కలిప్సో స్వయంగా అమర్చింది.
“ఒడిస్సియస్! నువ్వు నన్ను పెళ్ళి చేసుకుని నాతో ఉండిపోయి ఉంటే నీకూ తినడానికి అంబ్రోజియా, తాగడానికి అమృతం ఇచ్చి ఉండేదానిని. అప్పుడు నువ్వు నాతోపాటు మరణం లేకుండా ఉండి ఉండేవాడివి”.
“దేవతా స్వరూపిణీ! నేను నా భార్యనీ, కొడుకునీ వదలి ఇక్కడ – మరణం లేకుండా – కలకాలం ఉండిపోతానని ఎలాగనుకున్నావు?”
“నీ భార్య నాకంటే అంత అందంగా ఉంటుందనా అంతలా తాపత్రయం పడుతున్నావు?”
“దేవీ! కోపగించుకోకు. నిజం చెబుతున్నాను. నా భార్య కంటే నువ్వు ఎన్నో రెట్లు అందంగా ఉన్నావు. కాదనను. నా భార్య నీలా జరామరణాలు లేని వ్యక్తి కాదు; ఆమె జర, మృతి ఉన్న మానవి. అయినా సరే గత ఏడేళ్ళు ఆమె పొందు కోసం నిత్యం ఆమెనే స్మరిస్తున్నాను. ఆమె ఒక మానిని కూడా”.
ఎలాగైనా ఒడిస్సియస్ మనస్సు మార్చాలని ఆమె చిట్టచివరి అస్త్రం ప్రయోగించింది. “నువ్వు సముద్రప్రయాణం అన్నావంటే నీకు ఇడుములు తప్పవు. దేవుళ్ళు నీ ప్రయాణానికి ఏమీ సహాయం చెయ్యరు, సరికదా నీ శక్తియుక్తులనూ, నీ సామర్ధ్యాలను, నీ ఓపికను, పట్టుదలను పదేపదే పరీక్షిస్తారు.”
“దేవుళ్ళు నన్ను ఏమి చెయ్యగలరు? నా పడవను ముంచేస్తారా? ముంచెయ్యనీ. అప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కుంటాను. చంపేస్తారా? చంపెయ్యనీ. అప్పుడు ప్రాణం లేని కట్టెని వారు తీసుకోవచ్చు. కానీ అకారణంగా విధేయత చూపించమంటే మాత్రం చూపించను”.
కలిప్సో నిరాశతో నిట్టూర్చింది. తన ప్రయత్నం తాను చేసింది. ఇక ఒడిస్సియస్‌కి స్వతంత్రత ఇచ్చి విడిచిపెట్టడమే ఉభయత్రా శ్రేయస్కరం అన్న నమ్మకానికి వచ్చింది.
మరునాడు కలిప్సో ఒక పదునైన కంచు గొడ్డలిని ఇచ్చి ఆ ద్వీపం ఉత్తర దిక్కున ఉన్న అడవిలోకి తీసుకెళ్ళింది. అక్కడ పొడుగైన, నిటారుగా ఉండే దేవదారు వృక్షాలను, ఏస్పెన్ వృక్షాలను చూపించి,
“నీకు కావలసినన్ని చెట్లను తెగనరికి పడవను నిర్మించుకో,” అని చెప్పింది.
తరువాత కొన్ని రోజులపాటు ఒడిస్సియస్ ఇరవై చెట్ల వరకు కంచు గొడ్డలితో నరికి, పడవ నిర్మాణానికి కావలసిన కలపను సిద్ధం చేసుకున్నాడు. కర్రలను దగ్గరగా పెట్టి అతకడానికి తడపలు, గడియలు, చిడతలు, చీలలు, కర్ర మేకులు తయారు చేసుకున్నాడు. ముందు ఒక బల్లకట్టు నిర్మించేడు. తరువాత చుక్కాని తయారు చేసేడు. తరువాత ఒక నిటారు కొయ్యను తెరచాప కొయ్యగా రూపుదిద్దేడు. కలిప్సో ఇచ్చిన నారబట్టతో తెరచాప తయారయింది. కర్ర దుంగల సహాయంతో పడవను నీళ్ళలోకి నెట్టగలిగేడు.
హర్మీజ్ వచ్చి వెళ్ళిన ఐదోనాటికి పడవ సిద్ధం అయింది. నావికుడికి కలిప్సో కొత్త బట్టలు ఇచ్చింది ప్రయాణానికి అవసరమైన తిండి, నీళ్ళు, మదిర, వగైరాలన్నీ సరఫరా చేసింది. నడి సముద్రంలో దారి తెలియడానికి, ఆకాశంలో ఏ నక్షత్రాలను ఎలా గుర్తుపట్టాలో చెప్పింది.
ఒడిస్సియస్ పడవ ఎక్కుతూ ఉంటే పొంగిపొర్లుతూన్న తన దుఃఖాన్ని ఎంతో కష్టం మీద అదుపులో పెట్టుకుంది.
చిట్టచివరి కానుకగా ఒడిస్సియస్ సముద్రయానానికి అనుకూలమైన గాలి వీచేలా వరం ఇచ్చింది, కలిప్సో.
5.8 సముద్రంతో కుస్తీ
చుక్కాని కాడను చేత్తో గట్టిగా పట్టుకుని, చాకచక్యంతో తన బల్లకట్టును సముద్రపు కెరటాల మీద సవారీ చేయిస్తున్నాడు ఒడిస్సియస్. రాత్రి నిద్రపోలేదు. రాత్రల్లా కలిప్సో సూచించిన కృత్తికల వైపు, పెద్ద ఎలుగుబంటి వైపు మార్గదర్శకాలుగా చూస్తూ బల్లకట్టును నడుపుకొచ్చేడు.
రోజు విడచి రోజు, రాత్రి విడచి రాత్రి, నిరంతరం, నిద్ర లేకుండా, పద్దెనిమిది రోజులు ఏకాంతంగా ఆ బల్లకట్టు మీద ప్రయాణించిన తరువాత దూరంగా, దిక్చక్రం మీద, మసకమసకగా ఒక కొండ ఆకారం అతనికి కనబడింది.
ఒడిస్సియస్ అత్యంత సామర్థ్యంతో తన బల్లకట్టును ఆ దిశలో తెడ్లు వేసి నడపడం మొదలుపెట్టేడు. ఇంతలో, ఎక్కడనుండి వచ్చేయో, నల్లటి మేఘాలతో ఆకాశం కప్పుకుపోయింది. నిశ్చలంగా ఉన్న నీటి మీద కెరటాలు లేవడం మొదలు పెట్టేయి. గాలి జోరందుకుంది. ఇంతలో పెనుగాలిగా మారింది.
…పొసైడన్ నా తెప్ప ఉనికిని కనుక్కున్నాడా? నా మీద పగ తీర్చుకోడానికి ఇది చిట్టచివరి అవకాశం కాబోలు…
చాలా ఏళ్ళబట్టి ఒడిస్సియస్ మీద సముద్రాలకు అధిపతి అయిన పొసైడన్ పగ పట్టినట్లున్నాడు.
పొసైడన్ కొడుకైన ఒంటికన్ను సైక్లాప్స్ కంటిని ఒడిస్సియస్ పొడిచి గుడ్డివాడుగా చేసేడు. ఇప్పుడు ఒడిస్సియస్‌ని సర్వనాశనం చేసే అవకాశం పొసైడన్‌కి వచ్చింది. గాలి నాలుగు పక్కలనుండీ విసురుగా వీస్తోంది. చీకటి పడిపోతూంది. ఈ దెబ్బతో, ఈ నడిసముద్రంలో, ఈ సుడిగాలిలో, ఒడిస్సియస్ ఏకాంతంగా దిక్కులేని చావు చావవలసిందేనా? అతని పని అయిపోయినట్లేనా?
అకస్మాత్తుగా, ఆ చీకట్లో, ఒక పేద్ద కెరటం, కొండంత ఎత్తు కెరటం వచ్చి ఒడిస్సియస్ బల్లకట్టు మీద విరుచుకు పడింది ఆ దెబ్బకు ఒడిస్సియస్ సముద్రంలో పడిపోయేడు. నీటి లోపలికి లాగేసింది, సముద్రం. పైకి తేలడం కోసం, గాలి కోసం ఒడిస్సియస్ అవస్థలు పడుతున్నాడు. లోపలికి ఎలా వెళ్ళేడో అలాగే ఒక్క పెట్టున నీటి పైకి తేలేడు. విరిగిపోయిన తెప్ప దూరంగా కొట్టుకు పోతూంది. నరనరాల్లో అడుగంటిపోతూన్న శక్తిని కూడగట్టుకుని, ఆ తెప్ప వైపు ఈదుకుంటూ వెళ్ళి, దానిని పట్టుకున్నాడు. పట్టుకుని దాని మీదకు ఎగబాకేడు.
ఎగబాకగానే సుడిగాలి వచ్చి ఆ తెప్పను గిర్రున తిప్పింది. అప్పుడు ఒడిస్సియస్ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసేడు. ఎదురుగా, ఆ చీకటిలో, సముద్రపు దేవత నీళ్ళపైన తేలుతూన్న హంసలా కనిపించింది. చుట్టూ చెలరేగుతూన్న తుపాను ఆ దేవతను ఏ విధంగానూ ఇబ్బంది పెడుతూన్నట్లు లేదు. ఆమె ఒడిస్సియస్ తెలియాడుతూన్న తెప్ప పైకి ఎక్కి కూర్చుంది.
“భయపడకు వత్సా! నేను ఐనో (Ino; EYE-noh). ధవళదేవతను. తుపానులో చిక్కుకున్న నావికులకు దారి చూపించి సహాయం చెయ్యడం నా బాధ్యత. నీ మీద పొసైడన్ ఎందుకు కోపంగా ఉన్నాడో నాకు తెలియదు. నిన్ను ఇన్నిన్ని కష్టాలు పెడుతూన్నా నిన్ను చంపే ఉద్దేశం మాత్రం ఆయనకు లేదు. బ్రతకాలంటే ఈ తెప్పను తక్షణం వదలిపెట్టి, అక్కడ ఉన్న ఒడ్డుకు ఈదుకుంటూ వెళ్ళిపో. ఇదిగో, నా మేలిముసుగును నీకు ఇస్తున్నాను. ఇది నీ వద్ద ఉన్నంతసేపూ నీకు ఏ హాని జరగదు. కానీ నువ్వు ఒడ్డుకు చేరగానే దీనిని సముద్రంలోకి విసిరేయాలి”.
ఇలా చెప్పి, ఆ ధవళదేవత అదృశ్యమైపోయింది.
అదే క్షణంలో భీకరాకారమైన కెరటం ఒకటి మీద విరుచుకు పడింది. ఆ దెబ్బకు అంతవరకూ రక్షణ ఇచ్చిన తెప్ప విరిగి ముక్కలై, ఏ ముక్కకాముక్క, నలు దిశలలోనూ, సముద్రంలో కొట్టుకుపోతున్నాయి. తెప్పలో విరిగిన ఒక కర్ర ముక్కను పట్టుకుని, ధవళ దేవత ఇచ్చిన పల్చటి వస్త్రం పట్టుకుని, ఒడిస్సియస్ నీట ములుగుతూ, తేలుతూ, బుడకలు వేస్తూ ఉన్నాడు.
ఒక్కపెట్టున తుపాను గాలులు శాంతించేయి. సముద్రం ప్రశాంతంగా అయింది. ఉత్తరపు గాలి నెమ్మదిగా వీస్తోంది. రెండు రోజులపాటు కర్రముక్కను పట్టుకుని, ధవళదేవత ఇచ్చిన వస్త్రం పట్టుకుని, ఒడిస్సియస్ సముద్రంలో ఈదేడు. మూడవ రోజున, దూరంలో ఒడ్డు కనిపించింది. ఒక్క పెట్టున శరీరంలో అట్టడుగున మిగిలి ఉన్న శక్తినంతటినీ కూడగట్టుకుని రాళ్ళతో నిండిన గట్టును చేరడానికి ఈదడం మొదలెట్టేడు.
ఇంతలో వాతావరణం మళ్ళా తిరగబడింది. పెనుగాలితో పెద్ద పెద్ద కెరటాలు పుట్టుకొచ్చి ఘోషతో సముద్ర జలాలు మీద పడ్డాయి.
ఆగ్రహించిన కెరటాల మధ్య పడి ఒడ్డును చేరలేక సతమతమవుతున్నాడు ఒడిస్సియస్.
… విలయతాండవం ఆడుతూన్న కెరటాల మధ్య గట్టుకు చేరడానికి ప్రయత్నిస్తే మధ్యలో ఉన్న రాళ్ళకు తల గుద్దుకుని ప్రాణమే పోవచ్చు….
ఈ సంకట పరిస్థితిలో అథీనాను తలుచుకోకుండా ఉండలేకపోయేడు ఒడిస్సియస్. ఇంతలో మరొక భయంకరమైన కెరటం వచ్చి ఒడిస్సియస్‌ని పైకెత్తి, రాళ్ళ ముందుకు తోసి, ఇసక దిబ్బల మీద పడేసింది. గట్టు మీదకు పాకురుదామని ప్రయత్నించేలోగా మరొక కెరటం వచ్చి ఒడిస్సియస్‌ని వెనక్కి లాగేసింది.
ఈ కుమ్ములాటలో ఒడిస్సియస్ శరీరంలో శక్తి పూర్తిగా నశించిపోయింది. సముద్రంతో కుస్తీ పట్టే ఓపికా లేదు, కుస్తీ పట్టాలన్న ఇచ్ఛాశక్తి కూడా లేదు. అపస్మార స్థితిలోకి జారుకుంటున్నాడు. అప్పుడు ఐనో ఇచ్చిన వస్త్రం సంగతి జ్ఞాపకం వచ్చింది. దానిని తీసి సముద్రంలోకి విసిరేసాడు.
కాళ్ళూ, చేతులూ రక్తసిక్తం అయిపోయాయి. కండరాలు కదలమని పోరు పెడుతున్నాయి. ఎగఊపిరి వస్తోంది. ఇంతలో మరొక కెరటం వచ్చి అతని శరీరాన్ని అక్కడ ఒడ్డున ఉన్న దుబ్బులలోకి ఎత్తి కుదేసింది. మరొక కెరటం వచ్చి వెనక్కి పట్టుకుపోకుండా, ఒడిస్సియస్ నెమ్మదిగా పాకురుకుంటూ వెళ్ళి అక్కడ కనిపించిన జిత వృక్షం కింద కూలబడ్డాడు. జిత వృక్షం అథీనాకు ప్రీతిపాత్రమైన చెట్టు.
5.9 ఉపసంహారము
ఇథకాలో – తట్టిన తలుపు పెనలొపీ తెరచి ఎదురుగా నిలబడ్డ స్నేహితుడు మీడాన్‌ని (Medon; MEEdon) లోనికి రమ్మని ఆహ్వానించింది.
“నేను ఇప్పుడే ఘోరమైన వార్త విన్నాను. నిన్ను వేధిస్తూన్న రాకుమారులు – ఎంటినోయిస్ పర్యవేక్షణలో- నీ కొడుకును హత్య చేసే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు ఆస్టెరిస్ (Asteris; ahss-TER-iss) దీవి మీద కాసుకు కూర్చున్నారు. అతని పడవ ఆ దారిన వెళ్ళినప్పుడు మాటు వేసి చంపేస్తారు”.
ఈ వార్త వినగానే పెనలొపీ దుఃఖంతో నేలమీద కూలిపోయింది. తేరుకున్న తరువాత కంటికి మంటికి ఏకధారగా ఏడ్చింది. “నా కొడుకు ఎక్కడున్నాడు?” అంటూ విలపించింది. “ఎక్కడో మన రాజ్యంలోనే తిరుగుతున్నాడని అనుకుంటున్నాను”.
“కొద్ది రోజుల క్రితం, ఎవ్వరికీ చెప్పకుండా, రహస్యంగా, తండ్రిని వెతికే ప్రయత్నంలో పడవ మీద ఎక్కడికో వెళ్ళేడని మాత్రం తెలుసు. తిరిగి వచ్చే దారిలో తప్పకుండా ఆస్టెరిస్ పక్కనుండే రావాలి,” అన్నాడు మెడాన్.
పెనలొపీ నేల మీదనుండి లేవలేక ఏడుస్తూ ఉంటే చిరకాలపు పరిచారిక యూరిక్లేయా ఆమెను ఓదార్చడానికి ప్రయత్నం చేస్తూంది. “అథీనా దేవతను పిలచి సహాయం అందించమని వేడుకో. ఆమె నీ కొడుకును కాపాడుతుంది”.
యూరిక్లేయా చెయ్యవలసిన పరిచర్యలు చేసి, పెనలొపీ చేత స్నానం చేయించి, ఉతికిన బట్టలు కట్టించి, దగ్గర ఉండి అథీనా దేవత ప్రీత్యర్థం పూజ చేయించింది. “దేవదేవుడైన జూస్ కుమార్తె అయిన ఓ అథీనా! నా మొర ఆలకించు. నా కొడుకు ఆపదల పాలు కాకుండా రక్షించు.”
అదృష్టవశాత్తూ అథీనాకు ఈ మొర వినిపించింది. ఆమె ప్రభావంవల్ల కాబోలు నిద్రాదేవి వచ్చి పెనలొపీని ఆవహించింది.
(సశేషం)
