అమ్మ ఇప్పుడు లేదు
నన్ను అక్షరంగా చెక్కిన
ఆ బుల్లి సీసపు ముద్దలు ఇప్పుడు లేవు
‘మా అమ్మ బంగారం’ అంటారందరూ
పోల్చడానికి ఈ ప్రపంచంలో
అంతకంటె విలువైనది మరొకటి లేదన్నట్టు
ఎందుకో, నాకు విలువైన బంధాన్ని
పసిడి ముద్దతో పోల్చాలనిపించదు
ఏం చేసుకోవాలి బంగారాన్ని?
ఒళ్ళంతా దిగేసుకుని తిరగనా?
ఏ ఇతర మూలకాలతో చర్యనొందని
‘నోబుల్’ లోహాన్ని ఎలా ప్రేమించాలి?
ఉన్నంతసేపు మాత్రమే నా విలువను హెచ్చవేసి
వంటి మీద ఉరువులుగా మెరిసి
జిగేల్మనే లోహం మీద నాకెందుకు మోహం?
తీసి పక్కన పెడితే
నన్ను నాకు లుప్తుడిగా చూపించే
భేషజ భూషణాలు నాకెందుకు?
నా మూలాల్లో, నా పునాదుల్లో
నిత్యంగా మిగిలిపోయిన శక్తిగా, పాఠంగా,
నాలోని విద్యగా, వికాసంగా,
నరాల్లో నెత్తురుగా
చేతుల్లో నైపుణ్యంగా
యింకిపోయిన సీసపు ముద్దే అమ్మ.
గూటెన్ బర్గ్ మేధస్సును పొదవుకున్న
లెటర్ ప్రెస్ సీసపు ముద్దల్తోనే* కదా
నా అక్షరాభ్యాసం.
సదాలోచనను కూర్చి,
సద్వివేచనను నేర్పిన అమ్మే కదా!
నా జీవితపు సజీవ అక్షర విన్యాసం
ఇంకు మరకల నల్లబారిన చేతులతో
ఆ సీసపు అక్షరాలు పేర్చుడే
ఒక్కొక్క మెట్టుగా నా జీవికకు శ్రీకారం
తన బుజ్జి గులాబీ రంగు చేతులను
నా బుద్ధి, బతుకు చుట్టూ అదృశ్యరక్షగా నిలిపిన అమ్మే
లోనికి కుటిలత్వాన్ని చొరబడనివ్వని దుర్గమ ప్రాకారం
ఒకడికి చేరడు నేలా
మరొకడికి పచ్చటి కొమ్మా
వేరొకడికి పశువుల తోలూ
యింకొకడికి రంగుల నూలూ
కొలిమి నిప్పుల రేపే తిత్తీ
చెలగి కల్లు తీసే కత్తీ
మట్టి ధరించి తిరిగే చక్రం
కత్తులు దాచి సాగే అడపం
లయబద్ధంగా ఆడే బాడిశ
పూటకూళ్ళను పొదవిన డేగిశ
విన్యాసాలతో ఉలీ కొడవలీ
విరామమెరుగని భుజాన నాగలి
కొండొకచో వెదురుల బద్దా
నా బతుకులో
సీసపు ముద్ద!
కడుపుకింత ముద్దందించే
జవసత్వాలు యివే కదా బతుకుకు!
నన్ను నన్నుగా తీర్చిన అమ్మకు
బంగారంతో పోలిక ఎందుకు?
‘నోబుల్ మెటల్స్’ మరెన్ని పుట్టినా
నాకు మాత్రం
అమ్మ ఒక సీసపు ముద్ద
(*ప్రింటింగ్ పరిశ్రమలో ఇప్పటి కంప్యూటరైజ్డ్ డిటిపి ప్రక్రియ రాకముందు లెటర్ ప్రెస్ పద్ధతి ఉండేది. అందులో సీసపు ముద్దలతో చేసిన అక్షరాలనే ప్రింటింగ్ కోసం వాడేవారు. సీసపు ముద్దలు పాతతరం ప్రింటింగ్ పరిశ్రమకు చిహ్నాలు. – రచయిత )
