ఎవరికెవరు?

రూపలావణ్యం

లచ్చిమికి అరవయ్యేళ్ళుంటాయి. ఆ వయసులో చాలామంది కాయకష్టం చేసుకోదగిన స్థితిలోనే ఉంటారు. కానీ లచ్చిమిని చూడగానే ఎనభయ్యేళ్ళ ముసలి ఒగ్గు అనిపిస్తుంది. ఆమె హైదరాబాదు మాదాపూర్‌లో సగం సగం ఖాళీ జాగాలతో కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియాలో, గత కొన్నేళ్ళలోనే వచ్చిన విశాలమైన రోడ్లు కలిసే జంక్షన్‌లో ఉంటుంది. అవును. ఆ జంక్షన్‌లో అడుక్కుంటూ ఉంటుంది. నాలుగురోడ్ల కూడలిలో వేళలను బట్టి, ఒక్కో రోడ్డు వైపు మారుతూ రెడ్ లైటుకోసం ఆగిన వాహనాల వారి దగ్గర ముష్టెత్తుతుంటుంది.

మరీ అసహ్యంగా లేకుండా సాధారణమైన చీరల్లో, చెప్పాలంటే కొంచెం శుభ్రంగానే ఉంటుంది లచ్చిమి. ఆ సిగ్నల్ వద్ద తొలిసారి ఆగిన వాళ్ళకి, ఆమె కొత్తగా బిచ్చమెత్తుకోడానికి వచ్చినదేమో అనిపిస్తుంది. ఉదయం ఎనిమిదో గంటకల్లా దూరంనుంచి నడుచుకుంటూ ఆ జంక్షన్ దగ్గరికొస్తుంది. ట్రాఫిక్ రద్దీ అప్పటికి మొదలు కాదు. చెట్టుకింద పేవ్‌మెంట్ మీద కూలబడుతుంది. నెమ్మదిగా తొమ్మిది దాటుతుండగా రద్దీ మొదలవుతుంది. అప్పుడే లచ్చిమి పని కూడా షురూ అవుతుంది. మధ్యాహ్నం పేవ్‌మెంట్ చెట్టుకింద అమ్మే బిర్యానీ తింటుంది. సాయంత్రం ఎనిమిది దాటాక ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది.

ముష్టెత్తడానికి ఆమెకు ప్రత్యేకమైన ఏర్పాట్లేం ఉండవు. ఖాళీ చెయ్యి సాచి యాచిస్తుంది. వచ్చిన నోట్లని ఎడమ చేతిలో బిగియపట్టుకుంటుంది. సిగ్నల్ పడి వాహనాలు వెళుతుండగా పేవ్‌మెంట్ మీదికి చేరి, బొడ్డున దోపుకున్న ఒక తిత్తిలోకి ఆ మొత్తం చేరుస్తుంది.

‘వయసు మీరుతోంది కదా,’ తోటి బిచ్చగాళ్ళతో చెబుతుంటుంది. రోజులో అయిదారుసార్లు ఆ జంక్షన్‌కు కొంచెం ఎడంగా ఉండే ఖాళీ జాగాలో పిచ్చి తుమ్మచెట్లు, తుప్పలు ఉన్న చోటకు వెళ్ళి, చిన్న అవసరం తీర్చుకుని వస్తుంది ప్రతిసారీ. ఇదే లచ్చిమి దినచర్య.

మురుగడికి ముప్పయ్యేళ్ళుంటాయి. అరవవాడు. హైదరాబాదు ఎప్పుడొచ్చాడో, ఎందుకొచ్చాడో ఎవరికీ తెలియదు. ఒక అధ్వానమైన స్లమ్ ఏరియాలో, నికృష్టమైన ఒక చిన్న అద్దె గదిలో ఒంటరిగా ఉంటాడు. పగలంతా బలాదూరు తిరుగుతాడు. ఎప్పుడైనా వేరే గతిలేనప్పుడు, కూలిపనులకెళ్తాడు. తిండి తిన్నా తినకపోయినా ప్రతినెలా టంచనుగా ఆర్టీసీ బస్సు పాస్ మాత్రం కొంటాడు. వాడి జీవికకు రంగస్థలమే ఆర్టీసీ బస్సు! ప్రతి రోజూ కిక్కిరిసిన బస్సుల్లో జనాన్ని తోసుకుంటూ, తొక్కుకుంటూ అనేక ప్రయాణాలు చేస్తుంటాడు. వృత్తిధర్మం మరి. మురుగడు మంచి హస్తకళాకారుడు. అబ్బే అలాంటివేం కాదు. కానీ, ఒక వుడ్ కార్వింగ్ నిపుణుడు ఒక పొడవాటి చెక్కను రింగుల లంకెలతో సహా ఊగులాడే గొలుసుగా చెక్కేటప్పుడు అతని చేతివేళ్ళు ఎంత సునిశితంగా పనిచేస్తాయో.. మురుగడి చేతివేళ్ళకు కూడా అంతే లాఘవం ఉంది. సగానికి విరిచిన బ్లేడు ముక్కను వాడు ఆ వేళ్ళ మధ్యలో ఉంచితే, ఒట్టు, దాన్ని కనిపెట్టడం అసాధ్యం! ఎంతటి కౌశలం అంటే, ఇన్నేళ్ళలోనూ వాడి వేళ్ళకు ఒక్క గాటు కూడా పడలేదు. కానీ ఎదుటి వాడి జేబులు మాత్రం ఖచ్చితంగా, ఎంత తెగాలో అంతే తెగుతాయి. మీదికి, అక్కడ ఉండే పర్సును అవే వేళ్ళు ఒడిసిపట్టుకుని రెప్పపాటులో ముడుచుకుంటాయి. జాగ్రత్త చేస్తాయి.

ఆ మురికివాడలోని గదికి వాడు ప్రతిరోజూ వెళ్తాడనే గ్యారంటీ కూడా లేదు. తన వృత్తిలో భాగంగా నగరమంతా ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. రాత్రిళ్ళూ బయటే గడిపేస్తాడు. బాగా గిట్టిన రోజున పూటుగా తాగుతాడు. డ్రస్ మార్చుకోవాలని అనిపించినప్పుడు మాత్రం గదికెళ్ళి వస్తుంటాడు. అంతే. ఏ రాత్రికి ఎక్కడ పడుకుంటాడో, పడుంటాడో వాడిక్కూడా తెలియదు.
*
ఒంటేలు పోసుకోడానికని లచ్చిమి తుప్పలు మొలిచిన ఆ ఖాళీ జాగాలోకి వెళ్ళింది. కొంచెం దూరంగా అక్కడే పడున్నాడు మురుగడు. ఒళ్ళు సోయిలో లేదు. మొహం చొంగకారుతోంది. ఈగలు ముసురుతున్నాయి. పూటుగా తాగి ఉన్నాడని వాడి మీదుగా వీస్తున్న గాలి చెబుతోంది. లచ్చిమి తన చేతిలోని కర్రతో వాడిని కెలికి.. ‘చీచీ ఉచ్చల్లో పంటవా… లేచిపో యెదవా,’ అని గసిరింది. వాడు కదల్లేదు. కదల్లేడని ఆమె గ్రహించి.. ‘ముదనష్టపు ముండాకొడుకులు… గాలితిరుగుడు లమ్డీ కొడుకులు… పైసల్ దొరికితే తాగి తాగి సచ్చుడే,’ అనుకుంటూ దాటుకెళ్ళి తన పని కానిచ్చుకుంది.

మనస్తత్వం

లచ్చిమికి జనం ఎలా ప్రవర్తిస్తారో తెలుసు. దానికి తగ్గట్టుగా దోసిలి నిండుతుంటుంది. ముష్టెత్తుతున్నది కదాని, అత్యంత అసహ్యమైన వేషంలో ఉండదు లచ్చిమి. చాలామంది అడుక్కోవడానికి జాలిగొలిపే వేషాన్ని ఒక మార్కెటింగ్ ఎలిమెంట్‌గా అనుకుంటారు. చెత్తదిబ్బల్లోంచి పాత బ్యాండేజీ గుడ్డలు, విరిగిన చేతిని మెడకు వేళ్ళాడేసే మురికిపట్టిన సంచీల్లాంటివన్నీ తమ వేషధారణలో భాగం చేసుకుంటారు. ఎంత జుగుప్సాకరంగా కనిపిస్తే అంతగా ముష్టి రాలుతుందని భావిస్తారు. కానీ లచ్చిమి అలాకాదు. ఆమె ఖరీదైనవి కాదు గానీ, పాతవే ఉతికిన చీరలు కడుతుంది. మొహం మాత్రం దీనంగా ఉంటుంది. ట్రాఫిక్‌లో ఆగిన వారి వద్దకెళ్ళి ‘నీ అమ్మలాంటి దాన్ని బేటా/ బిడ్డా,’ అంటుంది. అది ఆమె మార్క్ డైలాగ్. నిజానికి ఇదే డైలాగుని, మురికి వోడుతూ తయారయ్యే ఇతర ముసలి బిచ్చగత్తెలు కూడా వాడుతుంటారు. లచ్చిమికి మాత్రం ఆ డైలాగ్ బాగా వర్కవుట్ అవుతుంది. అసహ్యంగా కనిపించే ఒక ముసల్ది వచ్చి ‘నీ అమ్మలాంటి దాన్ని,’ అంటే రద్దీవేళల్లో ఆఫీసులకు, పనుల మీద వెళుతూ సిగ్నల్ దగ్గర ఆగిన యూత్ చాలామంది డైజెస్ట్ చేసుకోలేరు. లచ్చిమి, వేషంలో శుభ్రంగానే ఉంటూ దీనంగా అదే మాటను అంటుంది. ‘అమ్మలాగానే ఉంది – బతికిచెడ్డ జీవితమేమో,’ అనుకుంటారు అవతలివాళ్ళు. అలా ఆమెకు బాగానే గిట్టుబాటు అవుతుంది.

జాలీ దయాగుణం అనండి, మంచితనం అనండి, దీనజనోద్ధరణ అనండి, పుణ్యాన్నీ మోక్షాన్నీ కొనుక్కోవడం అనండీ. ఈ ముష్టి వేయడానికి మీరు ఏ పేరైనా పెట్టండి. అన్ని రకాల మనుషులను చూపులతో స్కాన్ చేసి పసిగట్టగలదు లచ్చిమి. టార్గెట్ ఆడియెన్స్‌కు తగ్గట్టుగానే కద మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండాలి! అలాంటివి ఆమె బుర్రలో బోలెడుంటాయి. ఎవరి వద్ద వారికి తగ్గట్టుగా అడుగుతుంది. ‘నీ అమ్మ లాంటి దాన్ని బిడ్డా’ డైలాగు మొదటి కేటగిరీ ఎదుట పనిచేస్తుంది. రెండో కేటగిరీతో అయితే ‘నీ పిల్లాపాపలు సల్లంగుండాలి’ అంటుంది. అదే మూడో కేటగిరీకి అయితే ‘బుక్కెడు బువ్వకు పైసలియ్యి బిడ్డా.. ముసిలి పేణం నిలబడ్తాది’ అంటూ జాలిని సంధిస్తుంది. ‘దేవుడు నీకు పుణ్యమిస్తాడు బిడ్డా/ అల్లా ఖ్యాల్ రఖేగా బేటా’ చివరి కేటగిరీ మోక్షగాములకోసం అన్నమాట. అందరి మనస్తత్వాల్ని ఇంతగా చదివినది గనుకే లచ్చిమి బొడ్లో తిత్తి చాలా త్వరగా, రోజులో అయిదారుసార్లు నిండిపోతూ ఉండేది!

లచ్చిమి డిజిటల్ మనీ విప్లవాన్ని అందిపుచ్చుకున్న బిచ్చగత్తె. తాను టార్గెట్ చేసిన వ్యక్తుల వేషభాషలను బట్టి చేయి సాచాలో, మెడలో ఐడీ కార్డు ట్యాగ్ లాగా వేసుకున్న క్యూఆర్ కోడ్ బిళ్ళను చూపించాలో ఆమెకు తెలుసు. ఏర్పాటైతే ఉన్నదిగానీ.. నిజానికి ఆ ట్రాఫిక్ హడావుడిలో డబ్బు రూపంలో వచ్చిపడేదే ఎక్కువ, యూపీఐ కంటే!

మురుగడికి తాను ఎలా ప్రవర్తించాలో తెలుసు. దానికి తగ్గట్టుగా ఫలితం దక్కుతుంటుంది. రద్దీ వేళ్ళలో ఆర్టీసీ సిటీ బస్సు ఎక్కుతాడు. ఎక్స్‌రే కళ్ళతో అందరినీ స్కాన్ చేస్తాడు. ఏ జేబు విలువ ఎంతో వాడి అనుభవానికి గ్రహింపుకొస్తుంది. అసలు క్యాష్ ఉండే జేబులు ఏవో.. ప్లాస్టిక్ కార్డులతో మాత్రమే బతుకు వెళ్ళదీసే జేబులు ఏవో వాడు ఇట్టే పసిగట్టగలడు. డిజిటల్ విప్లవం వాడికి అందించిన జ్ఞానం అది. అలా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, షర్టు జేబు, ప్యాంటు పాకెట్‌లలో దేన్ని టార్గెట్ చేశాడనే దాన్ని బట్టి వాడి ఎత్తుగడ మారుతుంది. షర్ట్ జేబును టార్గెట్ చేస్తే.. దిగడానికి హడావుడి పడుతున్నట్టుగా, ఆ వ్యక్తి పక్కనుంచి వెళుతూ, దగ్గరికొచ్చాక చిన్న పొడి దగ్గు దగ్గుతాడు, చేతిని మూతికి అడ్డు పెట్టుకుని! ప్రతి దగ్గునీ అనుమానించే రోజులు కదా యివి! మూతి దగ్గరినుంచి గుండెల దాకా చేతిని జార్చి, నిమురుకుంటాడు. ఆలోగా, టార్గెట్ చేసిన వ్యక్తికి ఎదుటివైపునుంచి ఢీకొట్టినట్టుగా తగులుతాడు. సరిగా ఆ క్షణానికి, చాలా సహజంగా మురుగడి కుడిచేయి, ఎదుటి వాడి షర్ట్ జేబు హైట్ లోనే ఉంటుంది. ఢీకొనే ప్రక్రియలో లిప్తపాటున, రెండు దేహాల మధ్య గ్యాప్ కూడా ఉండదు. ఆ లిప్తలో ఆ చేయి పని పూర్తి చేసేస్తుంది. ‘సారీ సర్’ అనేసి ముందుకెళ్ళి.. బస్సు దిగేస్తాడు. ప్యాంట్ పాకెట్‌ని టార్గెట్ చేస్తే ఆ తరీకా వేరు. బస్సు డోర్ వైపు వెళుతున్నట్టుగా వెళ్తూ, ఆ వ్యక్తిని సమీపించేప్పుడు, కాలికి ఏదో తగిలినట్టుగా తూలి సగం ముందుకు పడబోతాడు. తాళుకోవడానికి సీట్లను పట్టుకుంటాడు. తూలినప్పుడు ఎదుటి వ్యక్తిని రాసుకుంటూ, నడుం దాకా వంగుతాడు. ఒక చేత్తో అతడినే ఆసరాగా, నడుము వద్ద పట్టుకుంటాడు. ‘అరె భాయ్’ అనీ, ‘జర సంభాల్‌కే’ అనీ ఒకటి రెండు స్వరాలు జాలిని ప్రదర్శిస్తాయి. ఈ లోగా ఆ చేయి, ఆ ప్యాంటు పాకెట్ పని ముగిస్తుంది. ఈసారి ‘థాంక్యూ’ చెప్పేసి ముందుకెళ్ళి బస్సు దిగేస్తాడు.
*
కర్రతో కెలికినప్పుడు, వాడిప్పట్లో లేవలేడని లచ్చిమి గ్రహించినది నిజమే. కానీ, ఆ కెలుకుడు కొంత పనిచేసింది. వాడు కళ్ళు కొంచెం తెరిచాడు. కారుతున్న చొంగ మీద ముసురుతున్న ఈగలు చిరాకెత్తిస్తున్నాయి. వాటిని తోలడానికి లేచిన చేయి గాల్లో ఎటో తిరిగి వాలిపోయింది. వాటిని నోటితోనే థూ అని తోలుతూ పెదవులు కదిలించి, వెల్లకిలా పడున్నవాడు కాస్తా పక్కకి ఒత్తిగిలాడు. మళ్ళీ మూతపడుతున్న కళ్ళకి, దూరంగా మసగ్గా, చెత్తదిబ్బ పక్కన గొంతుక్కూచున్న ముసల్ది కనిపించింది. అంతలోనే కళ్ళు మూతపడ్డాయి. మగతలోకి జారుకున్నాడు.

రహస్యం

లచ్చిమికి నిజానికి అతిమూత్ర వ్యాధిలాంటిదేంలేదు. అయితే ఆమె పొద్దున్నించీ సాయంత్రంలోగా అయిదారుసార్లు తుప్పల్లోకి వెళ్ళడం మాత్రం నిజం. విశ్రాంతి కోసం వెళుతుందని అనుకోవడానికి వీల్లేదు. అక్కడ ముళ్ళపొదలు, తుప్పలే తప్ప నీడనిచ్చేంత చెట్లుండవు. విరిగిన సిమెంటు పైపులుంటాయిగానీ, రాత్రిళ్ళు వాటి కంతల్లో దూరి తాగడానికి ఎవరైనా వస్తుంటారు. పగటి ఎండకు అవి మలమల మాడ్చేస్తాయి. ముసల్ది వాటి జోలికి కూడా వెళ్ళదు.

దీన్ని మించిన రహస్యం ఇంకోటి ఉంది. ముసల్ది, పొద్దున్న ఎనిమిది కొట్టేసరికి వస్తుంది. రాత్రి ఎనిమిది కాగానే నడుచుకుంటూ వెళుతుంది. ఎక్కడినుంచి వస్తుందో, ఎటు వెళ్తుందో ఎవ్వరూ ఎప్పుడూ పట్టించుకోలేదు. లచ్చిమి ఉండేది బోడుప్పల్ అవతల. ముందూ యెనకా ఎవరూ లేరు. ఆ ఏరియాలో తెలిసినవాళ్ళుంటారని మాదాపూర్ దాకా వొస్తుంది. రాత్రి ఎనిమిదయ్యాక నడుచుకుంటూ కొంతదూరం వెళ్ళి షేర్ ఆటో ఎక్కి రాయదుర్గం మెట్రోకు వెళుతుంది. మెట్రోలో ఉప్పల్ దాకా ప్రయాణించి, మళ్ళీ షేర్ ఆటోలో ఇల్లు చేరుతుంది. ముష్టి ఆమెకు అవసరం కాదు, సుఖమైన సంపాదనగనుక ఆ దారిలో సొమ్ము చేసుకుంటుందంతే.

మురుగడికి నిజానికి చైన్ స్నాచింగ్‌లాంటి పనులు శ్రేయస్కరం. ఎందుకంటే వాడు సన్నగా ఉంటాడు. అలాగని శక్తిహీనుడు కాదు. ఎప్పుడైనా కృష్ణుడు కరుణించిన రోజున, ఎంచక్కా హైటెక్ బావర్చీ నుంచి ఒక చికెన్ బిర్యానీ పార్సిల్ తెచ్చుకుని, సింగిల్‌గా ఒక్కడే లాగించేయగలడు. తోడేలు కడుపు వాడిది. కడివెడు తిన్నా కూడా.. కడుపు లోపలకు లాగి కుట్టేసినట్టే ఉంటుంది. కాబట్టి చైన్ స్నాచింగ్ చేస్తే, ఊచలాంటి మురుగడు రెప్పపాటులో మాయం కాగలడు. మిల్ఖా సింగ్ తరిమినా దొరక్కుండా పారిపోగలడు. అయినా సరే, వాడు చైన్ స్నాచింగ్‌ల జోలికెళ్ళడు. పూర్వం మదురైలో ఉండేటప్పుడు సిగ్నల్ దగ్గర ఒక మహాతల్లి మెడలో చెయిను లాగే ప్రయత్నం చేశాడు. మొగుడు నడుపుతున్న బండిమీద వెనకాల కూర్చుని ఉందామె. గ్రీన్ లైటు పడబోతున్నక్షణంలో, పక్కన డివైడరుపై నిల్చున్న వాడల్లా ఒక్క ఉదుటన ఉరికి మెడలో గొలుసు లాగాడు. చిన్నపాటి చేంతాడంత మందం ఉంది గనుక అది తెగలేదు. పిలియన్ హోల్డర్ హుక్‌ను గట్టిగా పట్టుకునే ఉంది గనుక ఆమె పడలేదు. మెడ కొంచెం ఒరుసుకుపోయిందంతే. ఆ చైను తెగి వాడి చేతిలోకి రాకపోగా, బండి కదలిన అదటుకు వాడు గాల్లోకి లేచి క్షితిజ సమాంతరంగా కిందపడ్డాడు. చుట్టూ జనం పోగయి దేహశుద్ధి చేశారు. అసలే అరవ పిడిగుద్దులు. ఒళ్ళంతా కుడుములుగా కుడుములుగా వాచిపోయింది. అదే మొదలు, అదే కడ. ఇంకెప్పుడూ నలుగురి దృష్టిలో పడే, దొంగతనమే కాదు, ఏ పనీ చేయకూడదని డిసైడయ్యాడు. పైగా వాడికి నరదిష్టి మీద నమ్మకం జాస్తి. అందువల్ల రెండో కంటికి తెలియనివ్వని తన హస్తలాఘవాన్నే నమ్ముకున్నాడు.

ఆర్టీసీ బస్సులతో వర్కవుట్ కాని రోజుల్లో ఎప్పుడైనా ఇలాంటి ట్రాఫిక్ జంక్షన్లలో నిలబడతాడు. అబ్బే, ముష్టెత్తడు. రెడ్ లైటు కోసం బండ్లు ఆగినప్పుడు, తన చూపుల్తో అందరినీ స్కాన్ చేస్తాడు. అనుకూలంగా ఏమైనా కనిపిస్తే, రోడ్ క్రాస్ చేస్తాడు. అనుకున్న బండి దగ్గరకెళ్ళాక కాలు మడత పడుతుంది. తూలి బండివాలా మీద పడబోయి, పడి అంతలోనే సారీ చెప్పి, తాళుకుని నిల్చుని రోడ్ క్రాస్ చేస్తాడు. ఈలోగా ఆ బండివాలా పర్సు వాడి చేతిలోకి, ఆ చేతికి కూడా తెలియకుండా వాడి జేబులోకి వెళ్ళిపోయి ఉంటుంది.

ఆ రోజు మురుగడి పరిస్థితి మరీ దీనంగా ఉంది. బస్సులు బంద్. ట్రాఫిక్ ఆశాజనకంగానే ఉంది. రోడ్డు క్రాస్ చేశాడు. ఒక జేబు తెగింది. పర్సులో ఆధార్ కార్డు మాత్రమే ఉంది. ఈ జంక్షన్లను నమ్ముకుంటే ఇదే చికాకు. ఒకసారి మాత్రమే రోడ్డు క్రాస్ చేయగలం. మళ్ళీ మళ్ళీ అటూ ఇటూ క్రాస్ చేస్తుంటే ఎవరికైనా డౌటొస్తుంది- అనుకున్నాడు. అసలే నలుగురి దృష్టిలో పడకూడదనే జాగ్రత్త తెలిసిన వాడు. ఆ సమయంలో లచ్చిమికి కనిపించాడు. ఆమె కర్రను గాలిలోనే తాటించి ‘చీ ముదనష్టపు యెదవా.. యీడీడ్నే తిరగతా సస్తావా’ అనేసి చక్కా పోయింది. వాడు తిట్లు పట్టించుకోలేదు. ఆమె మొహాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు మగతలోకి జారేముందు చూసినప్పుడు ఆమె చేస్తున్న పనిని కూడా. తాగినోడికి అప్పుడు గుర్తుండకపోవచ్చు.. కానీ దిగిన తర్వాత.. మొత్తం గుర్తుకురావడం మామూలే.
*
నేరుగా తుప్పల్లోని విరిగిన పైపుల వద్దకెళ్ళాడు. ముందురోజు తానెక్కడ పడుకున్నాడో గుర్తుచేసుకున్నాడు. మగత కళ్ళతో ముసల్దాన్ని ఎక్కడ కూర్చుని ఉండగా, ఏం చేస్తుండగా చూశాడో గుర్తు చేసుకున్నాడు. ఓ చెత్తదిబ్బ ఉందక్కడ. కార్పొరేషన్ వాళ్ళు ఇంకా గుర్తించని ఆ లొకాలిటీలో, వేసేవాళ్ళే తప్ప తీసేవాళ్ళుండకపోవడం చేత పేరుకున్న దిబ్బ. దాన్ని అటూ ఇటూ చేతులతోనే కెలికి ఓ చిరిగిపోయిన, చేతులు తెగిన బ్యాక్ ప్యాక్‌ప్యాక్‌లాంటి పాతబ్యాగు ఒక దాన్ని తీశాడు. తెరచి, చిద్విలాసంగా నవ్వుకున్నాడు. చిందరవందరగా చాలా ఉన్నాయి. తెలివైనవాడు గనుక, కోడి బతికి ఉంటేనే మరురోజు కూడా గుడ్డు దొరుకుతుందనే జీవితసత్యం తెలిసిన వాడు గనుక, కొన్ని నోట్లను మాత్రం జవురుకుని, ప్యాంటు జేబులో తురుముకున్నాడు.

ముగింపుకు ముందు

లచ్చిమి ఒంటేలికని వెళ్ళింది. మళ్ళీ రాలేదు. అలవాటుగా ఆ దిబ్బ దగ్గరకే వెళ్ళి కూచుంది. దిబ్బలో కెలికి ఒక పాత బ్యాక్‌ప్యాక్ బ్యాగ్ బయటకు తీసింది. తన బొడ్లో తిత్తిలో అప్పటిదాకా వసూలైన డబ్బును తీసి ఆ బ్యాగులో వేసింది. ఈ పని మొత్తం క్షణాల్లో ముగించింది. సాయంత్రం ఇంటికెళ్ళేదాకా వచ్చిందంతా అందులో పెట్టేస్తుందంతే. లెక్కపెట్టుకునేది ఇంటికి వెళ్ళాకే. అందుకే మురుగడు రోజూ పిడికెడు నోట్లు తస్కరిస్తున్నా ఆమెకు తేడా తెలియలేదు. ఆ రోజు వసూళ్ళ డబ్బు దాచేసిన తర్వాత, లేచి తిరిగి జంక్షన్ దగ్గరకు నాలుగు అడుగులు వేసింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రద్దీలేని వేళ. పేవ్‌మెంటు చెట్టుకింద ఉన్న ఇద్దరు ముష్టివాళ్ళు చూశారు. పరుగున వచ్చారు. ముసలిదాన్ని పిలిచి అరచి, కదిపి కుదిపి చూశారు. పెదవి విరిచారు. ‘ముసలి పేణం దాటుకున్నదే,’ అన్నారు.

బిచ్చగాళ్ళందరూ జంక్షన్ వదిలేసి ముసల్దాని చుట్టూ చేరారు. అయ్యోలు, ప్చ్‌లు ప్రవహించడం లేదు. అందరూ ప్రొఫెషనల్ రైవల్రీతో రగిలేవాళ్ళే. ఎవ్వరిలోనూ ఉద్వేగాలేం లేవు. కాసేపటికి పోలీసు కానిస్టేబులు కూడా వచ్చాడు. ముసల్దాని గురించి ఆరాలు తీస్తున్నాడు. ఎవ్వరూ సరిగా వివరాలు చెప్పలేకపోతున్నారు. లచ్చిమి మీద ఈగలు ముసురుతున్నాయి. పోలీసోడు పురమాయిస్తే ఎవరో ఆమె తిత్తి తీసి చూశారు. అందులో డబ్బుల్లేవు. ఏమైపోయాయో అడిగితే, ఎవ్వరూ చెప్పలేకపోయారు కూడా.

మురుగడు వచ్చాడక్కడికి. సుదీర్ఘకాలపు రెక్కీలో ముసిల్ది ఒంటేలికి వెళ్ళే రమారమి వేళల్ని కూడా వాడు పసిగట్టేశాడు. అప్పటినుంచి రోజూ వస్తూనేవున్నాడు.. ఆమె లేనప్పుడు. అత్యాశకు పోకుండా ఓ పిడికెడు జవురుకుని వెళుతున్నాడు. జల్సాలు చేసుకుంటున్నాడు. సాయంత్రంలోగా ఏదో ఒక జేబు కత్తిరించే తీరాలనే టెన్షన్ వాడికిప్పుడు లేదు. ఆ చింత లేకుండానే మూడు పూటలా తింటున్నాడు, అప్పుడప్పుడూ తాగుతున్నాడు. ఆ రోజు కూడా అందుకే వచ్చాడు. కానీ యిక్కడ సీన్ ఇంకోలా ఉంది. చుట్టూ ఉన్న బిచ్చగాళ్ళలో కలిసిపోయి నిల్చున్నాడు.

“తిత్తిలో డబ్బుల్లేకపోతే.. ముష్టెత్తుకున్నవి ఎటుపోయినట్టు” కానిస్టేబులు అడిగాడు.

“ముసల్దాన్ని ఎవులైనా కొట్టి గుంజుకు పోయిన్రేమో సార్” ఎవరో అన్నారు.

మిగిలినోళ్ళు మాటాళ్ళేదు. కానిస్టేబులు పురమాయింపు మీద, దేక్కుంటూ తిరిగే కాళ్ళులేని ముష్టివాడొకడు, ముసల్దాని శవం దాకా వెళ్ళి ఆమెను అటూ ఇటూ పొర్లించి పరికించి చూశాడు. “దెబ్బలేమీ తాకలేదు సార్,” అన్నాడు.

“ఆమెను తెలిసిన వాళ్ళున్నారా? మునిసిపాలిటీకి ఫోను చేయనా,” కానిస్టేబులు అడిగాడు. ఎవ్వరూ మెదల్లేదు.

పోలీసు ప్రశ్నార్థకంగా చూస్తుండగా.. చుట్టూ చెదరి ఉన్న చిన్న గుంపులోంచి, మురుగడు అడుగు ముందుకేసి “సార్” అన్నాడు.

*

మురుగడికి ఆరోజు అక్కడకు రావాల్సిన అవసరం లేదు. బస్సులో మంచి బేరం తగిలింది. వాడి జేబు ఇప్పుడు చాలా బలంగా ఉంది. వేల రూపాయలున్నాయి. కానీ వాడికి చాన్నాళ్ళుగా, ముసల్దాని రహస్యపు బోషాణంనుంచి ప్రతిరోజూ కొంత కాజేయడం ఒక అలవాటుగా, కాదు- వ్యసనంగా మారిపోయింది. అందుకే వచ్చాడు. తీరా ఇక్కడ పరిస్థితి ఇదీ! ఇన్నాళ్ళలో ముసల్దాని పట్ల మురుగడికి ఓ ప్రేమ ఏర్పడిపోయింది.

ఇదివరకటిలాగా కాదు. ఈ బోషాణం దొరికిన తర్వాత వాడు పస్తున్న రోజే లేదు. పైగా డిజిటల్ మనీ రోజులొచ్చాక, ఒక్కోసారి బ్లేడు కర్చులు కూడా రావడం లేదు. నీళ్ళు తాగి బతికిన రోజులున్నాయి. తన వృత్తి మొహం చాటేసిన రోజుల్లో కూడా ఈ ముసల్ది కూడు పెడుతోంది. అందుకే రోజూ వచ్చి పోతున్నాడు. తాగి పడి ఉండగా వాడిని అసహ్యించుకున్న లచ్చిమికి అప్పుడప్పుడూ పేవ్‌మెంట్ మీద కనిపించేవాడు. ఆమె పాత దృశ్యం గుర్తొచ్చి.. ‘చీ పో గాడిదా.. యీడ సావకపోతే ఏదైనా పన్జేసుకోరాదా’ అని వోడిని కసురుకునేది. వాడు చిద్విలాసంగా నవ్వుకునేవాడు.

ఇలా ముగిసింది

లచ్చిమికి, చచ్చాక, నడిచొచ్చే కొడుకు దొరికాడు.

మురుగడికి, చచ్చేలోగా, చివరియాత్రకు రెడీ అయి, విశ్రమించిన తల్లి దొరికింది.

“మా అమ్మ సార్,” అన్నాడు.

“నిజమేనా, రుజువేంది?” అన్నాడు పోలీసు.

“హో సక్తా… ఉస్కో గాలియా దేనా దేఖీ థీ మై…” ఆ ఎండలో, నల్ల బురఖాలో ఉన్న ఒక బిచ్చగత్తె కన్ఫర్మ్ చేసింది.

“మీ అమ్మ పేరేంది?”

“మీనాచ్చి సార్,” మదురై అనాథకి మరో పేరు తోచలేదు.

“లచ్చిమి అంటుండేదే,” కుంటోడు డౌటుపడ్డాడు.

“ఛిపా రఖా అస్లీ నామ్,” బురఖా మళ్ళీ కన్ఫర్మ్ చేసింది.

పోలీసోడు అనుమానంగానే చూస్తున్నాడు. ఆ అనుమానాన్ని తరిమేయడానికి…

“మా అమ్మ ముష్టెత్తిన డబ్బు దాచే చోటు కూడా నాకు తెలుస్సార్,” అంటూ రివ్వున ఊచలాగా దూసుకెళ్ళి దిబ్బలోంచి బ్యాక్ పాక్ బయటకు లాగి, జిప్ తెరిచాడు. దండిగానే డబ్బులున్నాయి.

కుంటోడు నోరెళ్ళబెట్టాడు. “బహుత్ జాదూ హై బుఢియా!” బురఖా, ముసుగు మీదనుంచే బుగ్గలు నొక్కుకుంది. పోలీసోడు నమ్మాడు. మురుగడు చకచకా ఆ డబ్బును పిడికిళ్ళతో జవిరి, “ఇన్నాళ్ళూ అమ్మకు తోడున్నారు మీరే తీస్కోండి,” అంటూ ఆ ముష్టోళ్ళందరికీ పంచేశాడు.

“తగలెట్టడానికి ఉంచుకో,” హెచ్చరించాడు పోలీసు.

“ఉన్నాయి సార్,” అన్నాడు మురుగడు జేబుమీద చేయి వేసుకుని.

*

“నేను కూడా వొస్తా, తగలబెట్టేదాకా వుంటా,” అన్నాడు పోలీసు. ప్రేమతో కాదు. మురుగడి వాలకం చూసి. ‘శవాన్ని తీసుకెళ్ళి అమ్మేసుకుంటాడేమో’ అనే అనుమానంతో.

‘కడన్ మట్టుం మిచ్చం ఇరుక్కుమున్ నినైచ్చేన్’ తనలో తాను గొణుక్కున్నాడు మురుగడు. పోలీసు పిలిపించిన వైకుంఠరథంలోకి లచ్చిమిని ఎక్కించి పడుకోబెట్టి పక్కనే కూచున్న తరవాత. పక్కన కూచున్న పోలీసోడికి అర్థం కాలేదు.

“ఏందిరా?”

“రుణం మాత్రమే మిగిలిపోతుందనుకున్నాను సార్,” అన్నాడు. అప్పుడు కూడా పోలీసుకు అర్థం కాలేదు. పైత్యంలో మాట్లాడుతున్నాడనుకుని వదిలేశాడు. వైకుంఠరథం కదిలింది.

లచ్చిమి అన్నం పెట్టింది. తనకు తెలియకుండానే!

మురుగడు కొరివి పెట్టాడు. కొత్త సత్యం ఒకటి తెలుసుకుని!

ఆ సత్యం ఏమిటి?


కె.ఎ. మునిసురేష్ పిళ్లె

రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్లె గురించి:

మౌలికంగా జర్నలిస్టు కావడంవల్ల రాయడం పట్ల కూడా ఆసక్తి, ప్రవేశం ఏర్పడిన మునిసురేష్ పిళ్ళే గారికి రాయడమే ఆసక్తి, అభిరుచి, బతుకుతెరువు. వీరు రచించిన మూడు కథా సంపుటాలు ‘పూర్ణమూ నిరంతరమూ’, ‘రాతితయారీ’, గారడీవాడు, రెండు నవలలు ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’ ‘పుత్రికాశత్రుః’, ఒక కవిత్వం సంపుటి ‘షష్ఠముడు’, ఒక సంపాదకీయ వ్యాసాల సంపుటి ‘మునివాక్యం’ ప్రచురణ అయ్యాయి. వీటిలో కొన్ని పుస్తకాలకు వివిధ పురస్కారాలు లభించాయి. అనువాద సాహిత్యంకోసం ప్రత్యేకించిన ‘కథావసుధ’ వెబ్ మేగజైన్ ను తన సంపాదకత్వంలో నిర్వహిస్తున్నారు.

 ...