“ఈ సారి కుర్రాళ్ళు అందరూ చాలా గట్టిగా వున్నారు బాబాయ్. ఏం జరుగుతుందో అని భయంగా వుంది.” అన్నాడు ఆంజనేయులు సీతారామారావుతో.
“ఏం జరగదు లేరా! నువ్వు కంగారు పడకు. అది ఊరందరికీ సంబంధించిన విషయం. ఏ ఒక్కరో కాదు అంటే సరిపోతుందా ఏమిటి? అయినా నీ భయం కానీ దేశమంతా అలా జరిగినా మనూళ్ళో మాత్రం అట్లా జరగదులే! నువ్వు వూరికే కంగారుపడి మమ్మల్ని కంగారు పెట్టమాక!” అన్నాడు సీతారామారావు, ఆంజనేయులు ఆందోళనని పట్టించుకోకుండా!
చైత్రమాసం మొదలయి నాలుగురోజులు అయింది. కానీ వైశాఖం మాసంలో కాసే ఎండలా ఎండ తన ప్రతాపం చూపిస్తోంది. ఉదయం తొమ్మిదింటికే ఉక్కపోత మొదలు అయింది. మొహానికి పట్టిన చెమటను పై కండువాతో తుడుచుకుంటూ ఆంజనేయులు వంక చూసాడు సీతారామారావు. తాను చెప్పిన మాటలకి ఆంజనేయులు సమాధాన పడలేదని అర్ధం అయింది.
“సరే! ఒక పనిచేద్దామా? అలా గొడవ పెట్టే కుర్రాళ్ళు అందరినీ సర్పంచ్ గారి దగ్గరకు పిలిపించి మాట్లాడదాం!” అన్నాడు సీతారామారావు.
వెంటనే ఆంజనేయులు “వొద్దు బాబాయి! సర్పంచ్ కాసేపు కుర్రాళ్ళదే రైట్ అంటాడు. కాసేపు మనం చెప్పేదే రైట్ అంటాడు. ఆయనతో కాదు కానీ రామినాయుడు దగ్గరకు పిలిపిద్దాం. ఆయనైతే అటూ, ఇటూ కాకుండా సరిగ్గా చెప్తాడు. అయితే ఇందులో ఒక ఇబ్బంది వుంది. ఆ మెరక వీధి కుర్రాళ్ళు రామంటారు” అన్నాడు తన మాటలను సీతారామారావు కాస్త సీరియస్‌గా తీసుకున్నాడు అన్న విషయం అర్ధం కాగానే.
“రామంటే ఎలా కుదురుతుంది? రాకపోతే వాళ్ళకే నష్టం. రామినాయుడు చెపితే అందరూ ఒప్పుకుంటారు అంటే, అలాగే చేద్దాం. రామినాయుడు కు నేను చెప్తానులే!” అన్నాడు సీతారామారావు. సీతారామారావు భరోసా ఇచ్చేసరికి ఆంజనేయులు మన్సులోనుండి ఒక బాధ శాశ్వతంగా తొలగిపోయినట్టు అయింది.
చాలా చిన్న వూరు అది. అన్ని ఊళ్ళల్లో లాగే ఆ ఊళ్ళోనూ నాలుగయిదు రాజకీయ పార్టీలు వున్నా అందరూ కలిసికట్టుగా వుంటారు. ఎన్నికలప్పుడు ఎన్ని గొడవలు పడినా ఎన్నికల తరువాత మాత్రం గొడవల ఊసు ఎత్తరు. ఎన్నికల వేడిలో కేసులు పెట్టుకున్నా, ఎన్నికలు అయిపోయిన తరువాత కేసులు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగానే వదిలేసుకుంటారు. ఉగాది, సంక్రాంతి, రంజాన్ లాంటి పండుగలు వదిలేస్తే, శ్రీరామనవమి మాత్రం ఊరంతా కలిసికట్టుగా ఒక్క మాట మీద వైభవంగా జరుపుతారు.కానీ గత రెండేళ్ళుగా ఆ కలిసికట్టుతనం కుంటుపడుతున్నది.
రెండేళ్ళక్రితం ఇంతకుముందు లేని సణుగుడు, గొణుగుడు కొత్తగా మొదలు అయింది. ఈసారి అది గొణుగుడు స్థాయిని మించి, అరుపులు, కేకల స్థాయికి వచ్చింది. అందుకే ఆంజనేయులు భయపడుతున్నది.
శ్రీరామనవమి నాడు వూరు వూరంతా షేక్ చిన మస్తాన్ నాదస్వరంతో మేలుకుంటుంది. అబ్దుల్ ఖాదర్ భజన బృందం భజనలతో ఊరంతా మారుమోగిపోతుంది. అది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. భద్రాచలానికి రామనవమి నాడు ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్ళినట్టు, ఆ వూళ్ళో శ్రీరామనవమి నాడు స్వామి వారికి పట్టువస్త్రాలు ముస్లిం ప్రముఖులే తీసుకుని వస్తారు. బయటినుండి చూసేవారికి, నవమి వేడుకలలో ముస్లింల ప్రాతినిధ్యం చూస్తే, హిందువుల పండుగలో ముస్లింలు పాల్గొంటున్నట్టు కాక, ముస్లింలు చేస్తున్న హిందూ పండుగలాగా వుంటుంది.
కానీ రామనవమిలో ముస్లింల ప్రాతినిధ్యం వుండటం ఇప్పుడు కొంతమంది కుర్రాళ్ళకి నచ్చడం లేదు. వాళ్ళిప్పుడు ముస్లిం అనడానికి కూడా ఇష్టపడటం లేదు. ముస్లిం అనవలసి వచ్చిన ప్రతిచోటా, వేరే కొత్త పదాలు వాడుతున్నారు.మామూలు సంభాషణల్లో కూడా వాళ్ళూ, మేమూ అంటూ మాట్లాడటం సర్వసాధారణం అయింది. ఆంజనేయులుకు అందిన సమాచారం ప్రకారం ‘ఈసారి శ్రీరామనవమిలో షేక్ చిన మస్తాన్ నాదస్వరం కానీ, శోభా యాత్రలో అబ్దుల్ ఖాదర్ భజన కానీ వుంటే ఒప్పుకునేది లేదు. అసలు పండుగ నాడు ముస్లిం లు పాల్గొనటాన్ని వ్యతిరేకించాలని’ తీర్మానించుకున్నారట.
అది తెలిసినప్పటినుండి ఆంజనేయులు మనసు మనసులో లేదు. ఊళ్ళో గొడవలు అయిపోతాయేమో, వూరుకి వున్న మంచిపేరు పోతుందేమో అన్నది ఆంజనేయులు మనసులో బాధ. సీతారామారావు ఎంత చెప్తున్నా ఆంజనేయులుకి లోపల ఎక్కడో అనుమానంగానే వుంది. సీతారామారావుకీ, రామినాయుడుకీ వూళ్ళో జరుగుతున్న విషయాలు ఆంజనేయులుకి తెలిసినంత స్పష్టంగా తెలియవు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇల్లు కదలరు. ఆంజనేయులు ఇంటి ముఖం చూడడు. ఊళ్ళో ఏ మూల ఏ చిన్న విషయం జరిగినా అది క్షణాల మీద ఆంజనేయులుకు తెలియవలసిందే.
తూర్పు వీథి కుర్రాళ్ళు కాస్త చెపితే వింటారు కానీ ఆ మెరక వీథి వాళ్ళు మాత్రం, మాట అస్సలు ఖాతరు చేయరు. రాష్ట్రంలో వాళ్ళది మిత్ర పక్షం. కేంద్రంలో వాళ్ళది అధికార పక్షం. కనుక అధికారం అంతా తమ చేతిలోనే వున్నది అన్న భావన వాళ్ళలో చాలా ఎక్కువ.
అన్నీ తలచుకుని బలంగా నిట్టూర్చాడు ఆంజనేయులు. ఎలాగైనా ఈ గండం గడిస్తే చాలు అనుకున్నాడు. ఆంజనేయులు ఆలోచనల్లోకి జారుకోవడం చూసి సీతారామారావు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా వుండిపోయాడు. ఎండ మరి కాస్త చురుకు పెంచేసరికి ఇద్దరూ కండువాలు దులుపుకుని వేపచెట్టు కిందనుండి లేచి వెళ్ళిపోయారు.
2
“ఇంతకూ మీరు అనేదేమిటి?” రామినాయుడు కుర్రాళ్ళ వంక చూస్తూ సూటిగా ప్రశ్నించాడు. రామినాయుడుకు కుడివైపున సర్పంచ్, ఎడమవైపున సీతారామారావు, సీతారామచంద్ర స్వామి వారి కోవెల పూజారి, వైస్-సర్పంచ్ నాయుడు కూర్చునివున్నారు. కుర్రాళ్ళని రామినాయుడు రమ్మన్నాడు అన్న విషయం ఎలా తెలిసిందో, వూళ్ళో సగం జనం వచ్చి చేరింది. కుర్రాళ్ళకి ఒక పక్కగా షేక్ చిన మస్తాను, అబ్దుల్ ఖాదర్ భజన బృందమూ, ఆంజనేయులు, ఇంకా ఒకరిద్దరు వార్డ్ మెంబర్లు నిలబడి వున్నారు.
కుర్రాళ్ళు ఉత్సాహం ఉరకలెత్తుతున్నట్టు వున్నారు. అందరూ పదిహేను ఇరవై సంవత్సరాల మధ్య వున్నవాళ్ళే! ఇద్దరు మెడ మీదకు వేలాడే జులపాల జుట్టుతో ఉంటే మరో ఇద్దరు తల చుట్టూ ట్రిమ్ చేయించుకుని నడినెత్తిన గంపలా జుట్టును కటింగ్ చేయించుకుని వున్నారు. మొత్తం పదిమంది ఆ కుర్రాళ్ళు. అన్ని సామాజికవర్గాలకు చెందిన వాళ్ళు వున్నారు వాళ్ళలో.
“అనేదేముంది. ఈసారి షేక్ చిన మస్తాన్ నాదస్వరం వాయించడానికీ, అబ్దుల్ ఖాదర్ భజన చేయడానికి కుదరదండీ!” అన్నాడు ఒక కుర్రాడు. అతడు మిగతావాళ్ళకంటే మరింత ఎగ్రెసివ్‌గా వున్నాడు.
“నీ పేరేమిటి?ఎవరబ్బాయివి నువ్వు?” అని అడిగాడు రామినాయుడు కుదరదు అని చెప్పిన కుర్రాడి వంక తిరిగి.
“మా వాడేనండి రాంబాబు. నేను ఎంత చెప్పినా వినడం లేదు. తర తరాలుగా వస్తున్న సంప్రదాయం మనం ఎలా కాదంటాము అని ఎంత చెప్పినా వినడం లేదండి” అన్నాడు శంకర రావు రామినాయుడు వంక తిరిగి.
ఆమాటకి రామినాయుడు ఆ కుర్రాడి వంక చూసి “నువ్వు శంకర రావు కొడుకువా? సరేలే కానీ ఎందుకు కుదరదు? చెప్పు!” అన్నాడు.
“కుదరదు అని చెప్తున్నాం కదండీ! ఎందుకు కుదరదు అంటారేమిటి?” కొంచెం గొంతు పెంచి అన్నాడు రాంబాబు. అతడా మాట అంటూవుండగానే కుర్రాళ్ళు అందరూ “కుదరదు. కుదరదు. మస్తాన్ గుళ్ళోకి రావడానికి వీల్లేదు” అని గట్టిగా అరవసాగారు. వాళ్ళ అరుపులు పట్టించుకోకుండా.
“అదే! ఎందుకు కుదరదో చెప్పు. నువ్వు చెప్పేదాంట్లో న్యాయం వుంటే, నేను కూడా కుదరదు అనే చెప్తాను.” అన్నాడు రామినాయిడు.
“వాళ్ళు మనవాళ్ళు కాదు. మన గుళ్ళోకి ఎలా వస్తారు? మన రాముడు ఊరేగింపు ముందు ఎలా వుంటారు?” అన్నాడు రాంబాబు.
“మన వాళ్ళు కాదు అంటే, మన వూరు వాళ్ళు కాదా?”
“మన వాళ్ళు కాదు అంటే మన హిందువులు కాదు అని. వాళ్ళు తురకోళ్ళు ఎక్కడినుండో వచ్చారు? వాళ్ళు మనవాళ్ళు ఎట్టవుతారు?”
“వాళ్ళ తాతలు,తండ్రులు, అందరూ ఈ ఊళ్ళోనే పుట్టారు. ఈ ఊళ్ళోనే చనిపోయారు. వాళ్ళది ఈ వూరు కాకపోతే నీది మాత్రం ఈ వూరు ఎలా అవుతుంది. మీ నాన్న ఎక్కడి నుండో ఉత్తరాదినుండి ఇక్కడకు వచ్చాడు. అక్కడ ఉత్తరాదిలో ఏ వూరో కూడా నీకు తెలియదు.అట్లాగే చిన మస్తాన్ పూర్వీకులు ఎక్కడినుండి వచ్చారో మస్తానుకూ తెలీదు. నీది ఈ వూరైతే, మస్తాన్‌దీ ఈ వూరే. మస్తాన్ తాతలు, తండ్రులు అందరూ స్వామివారికి నాదస్వరంతో అర్చన చేస్తూ వచ్చారు. ఖాదర్ వాళ్ళూ అంతే! మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కుదరదు” అన్నాడు రామినాయుడు.
రామినాయుడు మాటలకి కుర్రాళ్ళలో కలకలం చెలరేగింది. గుంపులో నుండి ఎవరో గట్టిగా “ఆ మాట చెప్పడానికి నువ్వెవరు అసలు? నువ్వేమైనా సర్పంచ్‌వా? నీకేం అధికారం వున్నది అని మమ్మల్ని ఇక్కడకు పిలిచావు. నువ్వు పెదరాయుడు అనుకుంటున్నావా? పెద్ద తీర్పులు ఇస్తున్నావు?” అన్నారు.
ఆ మాటలు విన్న రామినాయుడు మొహం వెలతెలా పోయింది. వెంటనే తేరుకుని “నేను ఎవరో ఈ వూళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు. నేనెవరు అని అడుగుతున్నావు అంటే నీది ఈ వూరు కాదన్న మాట. అయితే చెప్తాను విను. మీరు మస్తాన్‌ని రావద్దు అంటున్న గుడి మా తాత కట్టించిందే! ఆ గుడికి నేను వంశ పారంపర్య ధర్మకర్తను. ఈ వివరం చాలా?” అన్నాడు రామినాయుడు.
అంతలో సీతారామారావు కలుగచేసుకుని, “సర్పంచ్ గారూ! వాళ్ళేదో అడుగుతున్నారు కదా! చెప్పండి. ఈ వూరు ఒక్కటిగా ఉండాలో వద్దో! వూరు కట్టుబాట్లు పాటించాలో వద్దో!” అన్నాడు. ఆ మాటలు విన్న సర్పంచ్ లేచి నిలబడ్డాడు. కానీ సర్పంచ్‌కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. ‘బయట పడ్డది పదిమంది కుర్రాళ్ళే! బయటపడని వాళ్ళు ఎంతమంది వున్నారో. సగం వూరు వాళ్ళనే సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. అంటే సగం ఓట్లు. ఇటు ఈ తురకోళ్ళు ఎంతమంది వున్నారు? పట్టుమని పది ఇళ్ళు లేవు. ఎటు తిరిగి ఎటు పోయినా నా మీదకే వచ్చేట్టుంది’ అనుకున్నాడు లోపల. లేచి నిలబడ్డాడు కానీ ఏమీ మాట్లాడలేదు. రెండు నిముషాలు అయ్యాక మెల్లగా గొంతు సవరించుకున్నాడు. “ఇదుగో ఇట్టా గొడవపడితే కుదరదు కానీ, పెద్దాయన రామినాయుడుగారు చెప్పేది వినండి” అన్నాడు కర్ర విరగకుండా పాము చావకుండా.
“వినేదేం లేదు. నాదస్వరం చిన మస్తానే వాయించాలా? మన జగదీశ్ గాడు కూడా సన్నాయి నేర్చుకున్నాడు. అసలు నాదస్వరం మంగలోళ్ళ పని. సన్నాయి తో తురకోళ్ళకేం పని? భజన కూడా మా వాళ్ళే చేస్తారు. రాములవారికి అన్నీ సక్రమంగా జరిపే బాధ్యత మాది” అన్నది కుర్రాళ్ళ గుంపు. వాళ్ళ మాటలకు ప్రతిస్పందనగా తలా ఒక మాటా అనసాగారు.
“నువ్వెవరివి? నీ పెద్దరికం ఏమిటి?” అని ప్రశ్నించాక రామినాయుడు ఏమీ మాట్లాడకుండా జరిగేది చూస్తూ కూర్చున్నారు. గుంపులోనుండి ఎవరో అంటున్నారు “తురకోళ్ళు, గొడ్డు మాంసం తినేవాళ్ళు గుళ్ళోకి ఎట్టా వస్తారు? అపవిత్రం అయిపోతుంది గుడి”
“ఊళ్ళో మాంసం తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా?”
“అసలు ఆ రాముడే మాంసం తిన్నాడు. మీకు తెలియదేమో!”
ఈ మాటలు అన్నీ విన్న చిన మస్తాను, అబ్దుల్ ఖాదర్ రామినాయుడు దగ్గరకు వచ్చి, “అంత ఇష్టం లేకపోతే వద్దు లెండి బాబూ! ఈ సారికి మేం పక్కగా వుంటాం.” అన్నారు.
“మస్తానూ, నీకర్ధం కావడం లేదు. ఇది రాములవారి సమస్య కాదు. ఇది ఇంతటితో ఆగదు. మీరేం మాట్లాడకుండా వుండండి” అన్నాడు రామినాయుడు.
కుర్రాళ్ళ ఆవేశం చూస్తుంటే రామినాయుడుకి ఆశ్చర్యం వేస్తోంది. మతతత్వం తమ ఊళ్ళోకి కూడా ఇంత వేగంగా వచ్చి చేరిందా? దీనికి ఇక్కడ కంట్రోల్‌లో పెట్టక పోతే ఎంత దూరం అయినా పోతుంది.
అర్ధగంట సేపు అక్కడ అంతా రణగొణ ధ్వని. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. మొదట్లో గుంపుగా వున్న వాళ్ళు పదిమంది ఉంటే అర్ధగంటలో వాళ్ళు వందమందికి పైగా అయిపోయారు. వాళ్ళను ఎప్పుడూ వూళ్ళో చూసిన గుర్తుకూడా రావడం లేదు రామినాయుడుకి. తరువాత అంతా సద్దుమణిగాక అందరూ రామినాయుడు వంకే చూడసాగారు ఏమి చెపుతాడా అని.
“ఒరే అబ్బాయి! ఏదైనా చెప్పడానికి నాకేం అధికారం వున్నది అని అడుగుతున్నావు కదా! నాకేదో అర్హత వున్నది అనే కదా రామినాయుడు దగ్గరకు రమ్మంటే నువ్వు వచ్చావు. నాకు అధికారం లేకపోవచ్చు. కానీ అధికారం ఉన్న మీ సర్పంచ్ గారు అడిగారు కనుక చెపుతున్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా చిన మస్తాను, ఖాదర్ మన వాళ్ళే! మన వూళ్ళో వాళ్ళే! నా సంగతి సరే! పక్కన పెట్టు రాంబాబూ…! మన ఊళ్ళో, మన రామాలయం లో మన చిన మస్తాను, మన ఖాదర్ నాదస్వరం వాయించవద్దనీ, భజన చేయొద్దనీ చెప్పడానికి నువ్వెవరు అసలు?”
రామినాయుడు అన్న ఆ మాట వినగానే రాంబాబు మొహం వాడిపోయింది. రామినాయుడు కొనసాగిస్తూ, “చేయమని చెప్పడానికి నాకు అధికారం లేకపోతే, చేయొద్దని చెప్పడానికి నీకూ అధికారం లేదు. అందుకే మధ్యే మార్గంగా శ్రీరామనవమి చిన మస్తాన్ నాదస్వరం తో మొదలవ్వాలో వద్దో, అబ్దుల్ ఖాదర్ భజన చేయాలో వద్దో ఈ వూరే నిర్ణయిస్తుంది. రేపు నేను వోటింగ్ పెట్టిస్తాను. సరేనా! ఊళ్ళో వాళ్ళు వద్దంటే, మస్తాన్ ఇప్పుడే కాదు, ఎప్పటికీ శ్రీరామనవమికి నాదస్వరం వాయించడు. అబ్దుల్ ఖాదర్ ఇప్పుడే కాదు ఎప్పటికీ భజన చేయడు. ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటే సర్పంచ్ గారు వోటింగ్ పెట్టిస్తారు” రామినాయుడు గట్టిగా అడిగేసరికి కుర్రాళ్ళకి, వాళ్ళ వెనుక వున్న వాళ్ళకీ ఏమి చేయాలో పాలుపోలేదు.
పదినిముషాల పాటు తర్జన భర్జన పడి “సరే!” అని ఒప్పుకుని వెళ్ళిపోయారు. ఎలా తెలిసిందో ఏమో మరునాడు దినపత్రికలలో ప్రధాన వార్తలలో ఆ వూరు ప్రముఖంగా చోటు చేసుకుంది.
3
మూడవరోజు ఉదయం ఎనిమిది గంటలు అయ్యేసరికి మండల స్థాయి కాదు జిల్లా స్థాయి విలేఖరులే కార్లలో దిగబడిపోయారు. జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో టెంట్ వేసి ఏర్పాట్లు చేశారు. వోటింగ్ అధికారిగా జిల్లాస్థాయిలో హిందూ దినపత్రికకు రిపోర్టర్ గా పనిచేస్తున్న చంద్రభాస్కర్‌ను నియమించారు.
మొదట చేతులు ఎత్తే పద్ధతి అనుకున్నారు కానీ కొంతమంది దాని వలన తమకు సమస్యలు వస్తాయి అనడంతో రహస్య పోలింగ్‌కి రాత్రికి రాత్రే బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. వివాదం లో వున్న రాంబాబు, అతని తోటివారిని కానీ, రామినాయుడుని కానీ, సర్పంచ్‌ని కానీ , సీతారామారావుని కానీ, ఇలా ఎవరినీ దగ్గరకు రానివ్వలేదు. తొమ్మిది గంటలనుండి మధ్యాహ్నం రెండు గంటలవరకు పోలింగ్. మూడు గంటలనుండి నాలుగు గంటలవరకు కౌంటింగ్. నాలుగున్నరకి ప్రకటన. అదీ షెడ్యూల్.
అంటే ఆ సాయంత్రం నాలుగున్నరకి శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రస్వామి వారికి షేక్ చిన మస్తాన్ నాదస్వరంతో తెల్లవారుతుందో లేదో తేలిపోతుంది. అబ్దుల్ ఖాదర్ భజనకి రిహార్సల్ చేసుకోవాలో వద్దో తేలిపోతుంది.
మొదట మందకొడిగా సాగిన పోలింగ్ పదకొండు గంటలకి ఊపు అందుకుంది. సరిగ్గా రెండు గంటలకి పోలింగ్ ముగిసింది. మూడింటికి కౌంటింగ్ మొదలు అయింది. వ్యతిరేకిస్తున్న వారి తరఫున శంకర్ రావు కొడుకు రాంబాబు, చిన మస్తాన్ తరఫున సీతారామారావు ఏజంట్లుగా కూర్చున్నారు. కౌంటింగ్ లో కూడా వాళ్ళిద్దరే మళ్ళీ ఏజెంట్లు.
మొత్తం ఏడువందల డెబ్భయ్ ఏడు ఓట్లు పోల్ అయినాయి. అందులో మూడు ఓట్లు చెల్లకుండా పోయినయ్. ఏడూ వందల డెబ్భయి నాలుగు ఓట్లు.
కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి ఐదు అయింది. సరిగ్గా, తూకం వేసినట్టు చిన మస్తాన్ నాదస్వరం వాయించాలి అన్న వాళ్ళు మూడువందల ఎనభయి ఏడు. శ్రీరామనవమికి చిన మస్తాన్ సేవలు వద్దు అన్న వాళ్ళు మూడు వందల ఎనభయి ఏడు. ఫలితం టై అయింది. చంద్రభాస్కర్ బయటకు వచ్చి టై అయింది అని చెప్పాడు. ఇప్పుడిక టాస్ వేయాలి.
ఈ పరిణామం రామినాయుడు కి రుచించలేదు. యాభయ్ కి మించి ఓట్లు రావు అనుకుంటే మూడు వందల డెబ్బయి ఏడా? తమ వూరు ఇక రెండుగా చీలిపోయినట్టే! ఎందుకిలా జరుగుతున్నది. అధికారం కోసం రకరకాల భావోద్వేగాలు రెచ్చగొడతాయి పార్టీలు సరే! కానీ తమ మనుషుల వివేకం ఏమయిపోతున్నది. తమ ఊళ్ళో వున్నదే ఐదారు ముస్లిం కుటుంబాలు. వాళ్ళు ఇంత శత్రువులు ఎప్పుడు ఎలా అయిపోయారు. వోటింగ్ అని లోలోపల ఎవరికీ కనపడకుండా ఉన్న దానిని తాను బట్ట బయలు చేశాడా? ఈ మేడి పండు పొట్ట విప్పకుండా ఉంటేనే బావుండేదేమో!
ఎన్నికల అధికారిగా చంద్రభాస్కర్ టాస్ వేయాలి. కానీ తాను వేయలేదు. చంద్రభాస్కర్ స్వయంగా శ్రీరామ భక్తుడు. బిస్మిల్లాఖాన్ షహనాయ్ అంటే చెవి కోసుకుంటాడు. సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుడే, ఆ లయకారుడే బిస్మిల్లా ఖాన్ షహనాయ్‌తో నిద్ర లేస్తాడు. ఇక్కడ ఈ చిన్న ఊళ్ళో శ్రీరాముడి కళ్యాణం రోజున ఒక చిన మస్తాన్ నాదస్వరం వూదితే ఈ స్థితికారుడు బాధ పడతాడా ఏమిటి? పిచ్చి కాకపోతే.
టాస్ ఎవరితో వేయించమంటారు అని రామినాయుడుని అడిగితే ఈ పరిస్థితికి కారణం అయిన శంకర్ రావు కొడుకు రాంబాబుతోనే టాస్ వేయించమన్నాడు. రాంబాబు బొమ్మ కోరుకున్నాడు. చిన మస్తాన్‌కి ఛాయిస్ లేదు కదా! బొరుసు.
ఆకాశం లోకి నాణెం ఎగర వేశాడు. రెండు క్షణాలు. నాణెం కిందకి దిగి అతడి చేతిలో. ఫలితం …?
అందరి కళ్ళల్లో ఉత్కంఠత. ఫలితం తెలుసుకోకుండానే రామినాయుడు వెళ్ళిపోయాడు. గెలుపు ఏదైనా సాంకేతికమే! మనుషులు చీలిపోయారు అది వాస్తవం అర్ధం అవుతోంది. మభ్యపెట్టుకోవడంలో ఆనందం వుందా?