ఆ రోజు మేము కుంభకోణం బస్‌స్టాండ్ చేరుకునే సరికి ఉదయం ఆరున్నర దాటింది. తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచాం కాబట్టే ఇంత పెందరాడే రాగలిగాం. బస్సు దిగేటప్పుడు కాళ్ళు తిమ్మిరెక్కిపోయాయని చెప్పింది అమ్మ. నీళ్ళమీద నడుస్తున్నట్టు ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తోంది. బస్‌స్టాండ్‌లో ఉన్న టీ షాపు నించి నాయన మాకు కాఫీలు ఇప్పించి తనకు టీ తీసుకున్నాడు. కాఫీ ఒక్క గుక్క తాగంగానే అమ్మ ఎడం చెయ్యి దానంతటకదే వెనక్కి నడుము మీదికి వెళ్ళిపోయి గీరుకోడం మొదలెట్టింది. అమ్మ ఏదైనా వేడిగా తాగిందంటే వెంటనే చెమట్లు పట్టేస్తాయి, చెమట్లు పట్టగానే దురద మొదలైపోతుంది. మాకు ఇది అలవాటైపోయినా టీ షాపులో ఉన్న వాళ్ళు అమ్మను తేడాగా చూడటం నాకు ఇబ్బందిగా అనిపించింది. మేము తాగడం పూర్తయ్యేటప్పటికి తిరునాగేశ్వరానికి పొయ్యే బస్సు తయారుగా నిల్చుని ఉంది. అందులో ఎక్కి ముత్తుపిళ్ళై మండపం కాడ బస్సు దిగాం.
ఏసు తిరుహృదయ ఆసుపత్రి కాంపౌండ్ లోపలికి వెళ్ళాం. అక్కడ రకరకాల పేషంట్లున్నారు. సగం తినేసిన వేళ్ళున్నవాళ్ళు, చర్మం పాలిపోయి ఒంటిమీద పెచ్చులు పెచ్చులుగా చర్మం పొరలూడిపోతున్నవాళ్ళు, మోకాళ్ళ మీద కారుతున్న రక్తం, చీముని దూదితో తుడుచుకుంటున్నవాళ్ళు, ముక్కు నొక్కుకుపోయి క్రమంగా ముఖాల ఆకారం మారిపోతున్నవాళ్ళు, వొళ్ళంతా ఉబ్బిన మచ్చలున్నవాళ్ళు, చర్మమంతా చీరుకుపోయి ఒళ్ళు ఎర్రగా అయిపోయినవాళ్ళు. ఇలా ఏ దిక్కు చూసినా కుష్టు రోగులు. అమ్మ అదంతా చూడంగానే వణుకుతున్న చేతులతో చీర కొంగు చుట్టుకుని నోటికడ్డం పెట్టేసుకుంది.
నాయన రిసెప్షన్లో కూర్చుని ఉన్న నర్సు దగ్గర వివరాలు కనుక్కోడానికి పొయ్యాడు.
“తల్లీ, సొక్కమ్మా చూడు నన్ను ఎక్కడికి తీసకొచ్చి పడేసావో… నేను ఎవరికీ ఏ కీడూ చేసెరగనే… సామీ, వడక్కుమల దేవడా… నా ముగ్గురు బిడ్డలు దిక్కులేనోళ్ళైపోతారు సామీ…” కళ్ళ నీళ్ళు జారిపోతూంటే అమ్మ సన్నగా గొణుగుతూ ఏడుస్తోంది.
‘ఏడవబాకమ్మా,’ సముదాయిస్తూ చెప్పాను నేను. అక్కడొస్తున్న మందుల వాసన, రోగుల మూలుగులు, అప్పుడే తుడిచిన నేలమీదనుండి వస్తున్న ఫినాయిల్ వాసనా అన్నీ కలిపి నా కడుపులో తిప్పేస్తోంది. నా గుండె దడ దడ కొట్టుకుంటోంది. మా ఎదురుగా కూర్చోనున్న ఒకాయనకు కుడి చేతికి మూడు వేళ్ళు లేవు – ఆ చేతికి గుడ్డ చుట్టుంది. అతని పక్కనే కూర్చోనున్న ఆడమనిషి అట్ట ముక్కతో ఆ చెయ్యి మీద విసురుతోంది. అమ్మ చూపు వాళ్ళమీదకు వాలి భయంతో వెనక్కి తిరిగింది.
అప్పుడే నాయన వెనక్కొస్తున్నాడు. “పాపిష్టి ముండాకొడుకు… నాకు ఈ గతి పట్టించాడే… పాపిష్టోడు” నాయన్ను చూడంగానే అమ్మ కన్నీళ్ళు కోపంతో ఎరుపెక్కినై.
మా ముందున్న కొన్ని టోకెన్ నంబర్లు ఒక దాని తర్వాత ఒకటి పిలుస్తున్నారు. కొంచెం సేపట్లోనే మా వొంతు వచ్చింది. తెల్ల కోటు, కళ్ళద్దాలతో డాక్టరమ్మ వయసు పైబడ్డ మేరీ మాత లాగుంది. నాయన చెప్పిందంతా విని ఆమె ఏదో గొణిగింది.
“అసలు ఒక్క సంవత్సరం పాటుగా చూపించుకోకుండా ఎలా ఉన్నారు? ముందే వచ్చి ఉండొచ్చుగా?” కాయితం మీద రాస్తూ అంది. డాక్టరమ్మ వెనక, గొర్రెల మంద మధ్యలో ఒళ్ళో నల్ల గొర్రె పిల్లను పెట్టుకొని దాని తల మీద చేత్తో రాస్తూ ఉన్న ఏసు క్రీస్తు పటం ఉంది. నీళ్ళు నిండిన అమ్మ కళ్ళు, ఆ పటం మీదే ఉన్నాయి.
“ఇప్పుడు రక్త పరీక్ష చేయిద్దాం… దాన్ని బట్టి వైద్యం మొదలుపెడతాం. ప్రస్తుతానికి కొన్ని మందులు రాస్తున్నాను. అవి వేసుకుని వారం తర్వాత రండి. ఫారిన్ నించి ఒక పెద్ద డాక్టరు వస్తున్నారు. మీరేం దిగులు పడొద్దు. నయమౌతుంది” డాక్టరమ్మ ఆ మాట అనంగానే చాలా రోజులుగా నీళ్ళతో నిండి ఉండే అమ్మ కళ్ళల్లో ఆశ మెరవడం చూశాన్నేను.
నర్సు చేతి నరం నించి రక్తం తీస్తూంటే అమ్మ పళ్ళు బిగబట్టేసి కళ్ళు మూసింది. ఎప్పుడూ రెండు దినాలకు మించి నలతగా ఉండటం ఎరగని అమ్మ, ఈ మధ్య ఒంటి మీద ఏదన్నా చిన్నగా తగిలినా నొప్పెడుతుందేమోని భయం పెట్టేసుకుంటోంది మనసులో.
డాక్టరమ్మ చెప్పిన మాటలు, ఆమె కళ్ళల్లో కనపడ్డ ధైర్యం, చివరిగా కళ్ళు మూసుకుని దేవుణ్ణి తల్చుకుంటూ అమ్మకోసం ఆమె చేసిన ప్రార్థన అన్నీ నాకూ నాయనకూ నమ్మకాన్ని కలిగించాయి. బస్సులోకెక్కంగానే నాయన భుజం మీద తల పెట్టి నిద్రపోయింది అమ్మ.
సరిగ్గా ఓ ఏడాదిన్నర క్రితం కోతలప్పుడు ఒక రోజు రాత్రి నాయన అన్నం తినేటప్పుడు అమ్మకు చెప్పాడు, “ఈ సారి మనం పొలం దున్నొద్దు, పొలమంతా పత్తి నాటేద్దాం. మనకోసం ఇత్తనాలు పక్కన పెట్టమని తిన్నండియూర్ పత్తి యాపారస్తుడికి చెప్పి పెట్టాను” అమ్మ సమాధానం కోసం ఆగాడాయన.
ఉట్టిలో ఉన్న కుండలోంచి మజ్జిగ తీసి అన్నంలో పోస్తూ, “విత్తనాల వడ్లు ఉన్నాయి కదా? నేల ఎండిపోయి పగుళ్ళు వచ్చిన రోజుల్లోనే మనం ఒళ్ళు వంచి గుప్పెళ్ళతో నీళ్ళు తెచ్చి పెట్టినాం. ఇప్పుడు నీళ్ళు ఏరులై పారతా ఉన్నాయి కదా?” అమ్మ నిద్రపోతున్న తమ్ముడు లేస్తాడేమోనని గొంతు తగ్గించి సమాధానం ఇచ్చింది.
“నాట్లేసి రాత్రనకా పగలనకా ఒళ్ళిరుసుకున్నాం. దానొల్ల ఏం లాభం వొచ్చిందీ? పెద్దోణ్ణి కాలేజీలో చేర్చాల… మిగిలిన అప్పులన్నీ తీర్చెయ్యాల. నేను పొయ్యేలోపల ఇల్లు ఒకటి కట్టుకోవాల. ఇప్పుడు పత్తి ఏస్తే, డబ్బులు మిగల్తాయి అని ఈ మాట అంటన్నా. రేపు ఇయన్నీ మెళ్ళో ఏసుకుని పొయ్యేది నేనా?” కోపం కట్టలు తెంచుకుని నాయన గొంతు పైకి లేచింది. నాయన అన్నం తినకుండా లేచిపోతాడని అమ్మ గమ్మునుండిపోయింది. మాగన్నుగా నిద్రపోతున్న తమ్ముడు ఉలిక్కిపడి లేచి తల గోక్కున్నాడు. అమ్మ వాణ్ణి మెల్లగా తడుతూ నిద్ర పుచ్చింది.
అమ్మకు ఈసారి పత్తి వెయ్యడం ఇష్టంగా లేదు. రెండు నెల్ల క్రితం అయ్యనారు గుడి తాటి చెట్టు కింద అమ్మ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మాయవరంలో ఉండే నారాయణన్ డాక్టరు పరీక్షించి అమ్మకు రక్తపోటు ఉందని చెప్పాడు. అప్పట్నుంచి అమ్మ ఎండలో ఎక్కువసేపు ఉండకుండా, కష్టమైన పనులు ఏమీ చెయ్యకుండా జాగర్తగా ఉంటోంది. కానీ అట్లా ఒక వారం మాత్రమే ఆగగలిగింది. కోతల సమయం వచ్చేటప్పటికి అమ్మే పనంతా చూసుకునే భారం నెత్తినేసుకుంది – అలా చేస్తేగానీ ఆమెకు తృప్తుండదు. కోతల చివరి రోజు, తూర్పార పడుతూంటే విపరీతంగా ఆయాసం వచ్చి మళ్ళీ పడిపోయింది. ఈసారి మర్రి చెట్టు కిందికి తీసుకెళ్ళి లావుపాటి చెట్టు వేర్ల మీద తల పెట్టి అమ్మను పడుకోబెట్టారు.
ఇంకో విషయం ఏందంటే పత్తి వేస్తే రెండింతలు ఎక్కువ కష్టపడాలి. పనంపల్లి ఊరోళ్ళ పశువుల మందలొచ్చి చేల మీద పడకుండా చూసుకోవాలంటే గొంతు తడారిపోయి నాలుక బయటికొచ్చేస్తుంది. కానీ క్రితంసారి పత్తి వేసినప్పుడు, మేం ఇంటికి గ్రైండర్ కొనుక్కుని, శీర్కాళి కో-ఆపరేటివ్ సొసైటీలో మూడేళ్ళ ముందర కుదవ పెట్టిన చెవి కమ్మలు కూడా వెనక్కి తెచ్చుకున్నాం. ఇప్పుడు అయ్యనార్ చెరువు నిండా నీళ్ళున్నాయి. డీజిల్ పంపుసెట్టు గూడా మంచి కండిషన్లో ఉన్నాది. ఇబ్బందేం ఉండదు. నీళ్ళకూ కరువు లేదు కాబట్టి రాబడి బాగా రావొచ్చు.
అమ్మ బుర్రలో ఆలోచనలు, పిల్లలు పక్కిళ్ళ చుట్టూ తిరక్కుండా ఇంట్లో టీవీ కొని పెట్టుకోడం దగ్గరినించీ, కట్టెల పొయ్యి పొగ తప్పించుకోడానికి గాసు పొయ్యి కొనేసే దాకా తిరుగుతున్నాయి. ఒళ్ళు బాలేదన్న విషయం గమనంలో ఉండే నాయన చెప్పినదానికి ఒప్పుకోకుండా అమ్మ గమ్మునుంది.
కానీ నాయన అప్పటికే పత్తే వెయ్యాలని గట్టిగా అనుకునేసి ఉన్నాడు. యాబై వేలు పెట్టుబడి పెట్టి పత్తి వేసి నాలుగు నెల్లు కష్టపడితే మూడింతలు అవుతుంది. తిరునండ్రియూర్ నించి పత్తి గింజలు తెచ్చుకున్నాడు. మరుసటి రోజు, వేళ బావుంది. నాయన కేలండర్ చూసి పక్క రోజే విత్తనాలు వేస్తే మంచిది అని చెప్పాడు. అమ్మే తన చేత్తో విత్తనాలను ఆవు పేడతో కలిపిన నీళ్ళల్లో నానబెట్టింది. ఏదో ఒక నిర్ణయానికి వచ్చేదాకా అమ్మ ఏం పట్టించుకోనట్టు ఉంటుంది. ఏదైనా ఇంట్లోకి వచ్చిందీ అంటే అదంతా తనదిగా చేసుకుంటుంది. విత్తనాలు పేడ నీళ్ళల్లో నానుతూంటే నాయన వెళ్ళి చేలో పారతో అచ్చు గీతలు మొదలుపెట్టేశాడు. ఈ మధ్యే వరి వేసిన పొలం కాబట్టి ఆయనకు మళ్ళీ చదును చెయ్యాల్సిన అవసరం రాలేదు. ఆ ఖర్చు తప్పిందని అమ్మ కొద్దిగా ఊరటపడింది.
అచ్చు గీతలకు ఆ చివరా ఈ చివరా చిన్న గుంజలు పాతి వాటికి గట్టిగా తాడు వేసి కట్టాము. తాడు వెంబడే ప్రతి మూడు అడుగులకూ గుంతలు తవ్వాము. అమ్మ నేను తమ్ముళ్ళతో కల్సి విత్తులు వేసాము. నాలుగో రోజు పొద్దున్న మొలకలు తలెత్తినాయి. అప్పుడే పుట్టిన బిడ్డను చూసుకుని తల్లి ఎలా మురిసిపోతుందో అమ్మ అలా ఆనందపడింది. మొలకలెత్తని విత్తనాల దగ్గర మళ్ళీ విత్తనాలు తెచ్చి వేసాం. మామూలుగా ఎక్కడైతే మంచి విత్తనాలు పడలేదో అక్కడ గుర్తుగా కాయితం చుట్టిన కర్రలు పాతుతారు. అమ్మకు మాత్రం ఆ అవసరం లేదు. ఏ వరసలో ఏ గుంటలో పాడైన విత్తనం ఉంటుందో ఆమెకు బాగా గుర్తుంటుంది. ఎలాగో తెలీదు కానీ నేల గురించి ఆమెకు తెలీని విషయం లేదు. ఒకసారి మా తాత నాకెప్పుడో చెప్పాడు, ‘మీ అమ్మకు ఇలాంటి ఇషయాలన్నీ బుర్రలో పడి ఉండిపోతాయి. ఏదీ మర్చిపోదు.’ ఆయన చెప్పిన మాటలు ఎన్నో సార్లు నిజమవ్వడం నేను కళ్ళారా చూసాను.
ఏడో దినం నీళ్ళు పెట్టేటప్పుడు అమ్మ పెద్ద ఇబ్బంది పడలేదు ఎందుకంటే నాయన పక్కనే ఉన్నాడు. మళ్ళీ పదహైదో దినం నీళ్ళు పెట్టేటప్పుడు పొరుగూళ్ళో ఎవరిదో బంధువుల పెళ్ళి ఉందని వెళ్ళాడు. మేము కూడా స్కూలుకు వెళ్ళాం. అమ్మ ఎవరికో చెప్పి డీసెల్ తెప్పించి ఇంజిన్‌లో పోసి ప్రతి మొక్కకూ నీళ్ళు అందేలా చూసింది. అదే ఊపుతో ఒక్కడంటే ఒక్క మనిషి సాయంతో రెండు ఎకరాలకూ యూరియా ఎరువు సగం రోజులో చల్లించింది. తరవాత కొన్ని రోజులకు కలుపు తీసే సమయం వచ్చింది. అమ్మ పనికని కొంతమందిని పిల్చుకువచ్చింది. వాళ్ళకు టీలు చేసి ఇవ్వడం, వడలు తెచ్చి పెట్టడమే కాక కలుపు తీయకుండా తప్పిపోయిన చోట తనే ఒక చెయ్యి వేసి పని మొత్తం పూర్తి చేసింది. ఒళ్ళు విరిగేలా శ్రమపడుతూ నొప్పులొచ్చినప్పుడు ‘దేవుడా… ఈ పక్కటెముకల్ని విరిచి పక్కన పారెయ్యాలనిపిస్తా ఉండాది’ అని నొచ్చుకుంటు ఉండేది. కానీ పక్కరోజే గాలికి ఊయలలు ఊగుతున్న పత్తి మొక్కలు చూసి తన నొప్పులన్నీ మరిచిపోయేది.
‘ఈ పత్తి మొక్కలు పాలు చీకే పసిబిడ్డల్లా ఉంటాయి, వాటిని చూస్తే ఈ నొప్పులే గుర్తుకురావు’ అనేది. గొంతులో ఉమ్మి చేరినా మొక్కల దగ్గర ఊసేసి వేళ్ళను తడి చేసేది.
ప్రతి రోజూ ఉదయం పశువులు మేతకొచ్చే సమయానికి చేను దగ్గరకెళ్ళి కాపలా కాయాలి. లేదంటే పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. పశువుల కాపర్లు వాటిని వొదిలేసి ఏ మఱ్ఱిచెట్టు కిందో కూర్చుని తూగుతూనో, గుడి మంటపం దగ్గర కూర్చుని పులీ-మేక ఆట ఆడుతూనో, ఈత పళ్ళు ఏరుకుంటూనో ఉంటారు. వాళ్ళకు తెలీకుండా పశువులు ఏపుగా పెరిగిన పత్తి చేల మీదికి వచ్చేస్తాయి. అది జరిగినప్పుడు పొలికేకలు పెట్టుకుంటూ నాలుగు దిక్కులా వాటి వెనక పరిగెడుతూ, అరి కాళ్ళకు గుచ్చుకుని చర్మాన్ని చీల్చేసే పల్లేరుకాయల ముళ్ళను కూడా పట్టించుకోకుండా పశువుల్ని అక్కడినించి తరమాల.
ఈ పశువుల మందలతో పాటు పత్తి పంటకు పురుగులు, క్రిములు బద్ధ శత్రువులు. ఆకు రంగులో ఉండే క్రిములు, పాలిపోయిన ఎరుపు రంగులో ఉండే పురుగులు పత్తి పంటను నాశనం చేస్తాయి. మందులు పిచికారి చేసినా అదుపు చెయ్యలేం. అంతకంటే పరిస్థితిని ఇంకా దారుణంగా మార్చేది చేల చుట్టూ ఉండే చెట్లు. మద్ది, సీమ తంగేడు, గంగరావి చెట్లు మా చేను చుట్టూ ఉన్నాయి. వాటి వల్ల మా చేను అంతా పురుగు పట్టింది. వీటన్నిటికంటే మమ్మల్ని బాగా దెబ్బతీసింది – మా అమ్మకు ఇదంతా ఒంటి మీదకొచ్చి తగులుకున్నప్పుడు. పురుగు పట్టిన మొక్కల సంగతి ఏవైందో అని చూస్తున్నప్పుడు అమ్మకు కుడి చేతి మీద ఏదో కుట్టినట్టనిపించింది. పెద్దగా పట్టించుకోకుండా చేత్తో రుద్దుకొని వదిలేసింది అమ్మ.
మొదటి రోజు అదేదో మామూలు పురుగు కుట్టిందనుకొని ఉప్పునీళ్ళు పోసుకుంది. వాపు తగ్గక పోతే పసుపు రాసి, కొబ్బరి నూనెలో సున్నం కలిపి రాసి ఇంటి వైద్యాలేవో చేసింది. అవి కూడా పనిచేయకపోతే మా ఊళ్ళో ఆరెంపీ డాక్టర్ దగ్గరికెళ్ళి సూది వేయించుకుంది. అప్పుడు తగ్గింది వాపు. కానీ కుట్టిన చోట మొదలైన దురద, రోజులు గడిచేకొద్దీ విపరీతంగా ఎక్కువైపోయింది. కడుపుతో ఉన్న అమ్మాయి పొట్ట మీద ఉన్నట్టు, వొళ్ళంతా పురుగులు పాకుతూ కుడుతున్నట్టు, ఎంత గీరుకున్నా తనివి తీరని ఆగని దురద. అమ్మ ఎంత గట్టిగా గీరుకునేదంటే ఆమె గోళ్ళల్లో రక్తపు మరకలుండేవి. అట్టా గీరుకోవడం వల్ల దురదలు ఒళ్ళంతా పాకిపోయినాయి. కొద్ది రోజుల్లోనే ఆమె ఒళ్ళంతా దద్దులొచ్చి తామర పాకినట్టు ఒంటి మీద చర్మమంతా అట్ట గట్టుకు పోయినట్టైంది. కొంతమంది గజ్జి అంటే, కొంతమంది తామర అన్నారు. ఎదురొచ్చిన ప్రతివాడు డాక్టరు కింద తయారయ్యాడు.
ఇంటి వైద్యం పని చెయ్యక పొయ్యేటప్పటికి కొంతమంది చర్మ వ్యాధులకు నాటు వైద్యం పని చేస్తుందని సలహా ఇచ్చారు. అందుకని శీర్కాళిలో ఉండే ఒక నాటు వైద్యుడి దగ్గరకు పరిగెత్తాం. దురదలు రాకుండా ఉండాలంటే వంకాయలు, ఎండు చేపలు, పాలు కలిపిన కాఫీ, టీ వీటన్నిటికి దూరంగా ఉండాలని చెప్పాడాయన. ఒళ్ళంతా పూసుకోడానికి ఆ నాటు వైద్యుడు తైలం ఏదో ఇచ్చి, పొద్దునా రాత్రీ తినే ముందర వేసుకోడానికి మాత్తర్లు ఇచ్చాడు. ఆయన వైద్యం ఏ మాత్రం పని చెయ్యలేదు. అది కాక ఒంటిని మండించే ఎండాకాలం మొదలైపోయి అమ్మకిబ్బంది ఇంకా ఎక్కువైపోయింది. ఇదంతా నాయన మీద కోపం కిందకి మళ్ళింది.
“నన్ను పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్ళాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందని ఆలోచిస్తున్నావు గదా? అందుకని గదా నన్ను అక్కడా ఇక్కడ తిప్పుతూ ఏడిపిస్తున్నావు?” ఆ ప్రశ్నతో నాయన నాటు వైద్యం కాడికే ఇంక వెళ్ళలేదు.
మూడు నెల్లల్లో కాయలు విచ్చుకుని పత్తి కొయ్యడానికి తయారైంది. తన పరిస్థితి అలానే ఉన్నా అమ్మ మళ్ళీ చేలోకి అడుగుపెట్టింది. “విచ్చుకున్నవేవీ వదిలిపెట్టొద్దురా. జాగర్తగా పనిచేయండి. మీ ఇల్లు చల్లగుండా” అంటూ గట్టు మీద కూర్చుని, కోసేవాళ్ళకు చెప్పేది.
పొలం పని జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడా ఒక్క అరగంట స్థిమితంగా కూర్చునేది కాదు. చేనులోకి దిగి కొన్ని కాయలైనా తన చేత్తో కొయ్యకుండా ఆగేది కాదు. చెంగులోకి అవ్వన్నీ ఏరేది. పత్తి పనులన్నీ అయిపోయాక ఇంట్లో పొయ్యికి నాలుగు నెలలు సరిపడా కట్టెలు దొరికాయి కానీ ఇప్పుడు అదొక విషయం కాదు, ఎందుకంటే అమ్మకు వంటింట్లో పొయ్యి దగ్గరకు పోవడానికి కూడా జంకు మొదలైంది.
పొయ్యి వేడి అమ్మ చర్మానికి తగలంగానే ఆమెకు చెమటలు పట్టేసి దురదలు మొదలయ్యేవి. ఆమె వంట పూర్తి చెయ్యంగానే ఒళ్ళంతా మండుతున్నట్టు మెలికలు తిరిగిపోయేది. మొదట్లో అనిపించేది కాదు కానీ రాను రాను ఆమెను కాఫీయో టీయో అడగడానికి కూడా మేం ఇబ్బంది పడేవాళ్ళం. వీటన్నిటికంటే, చేతుల మీద పాదాల మీదా ఎక్కడైతే చీరతో దాచుకోలేదో అలాంటి చోట్ల ఉన్న పుళ్ళ గురించి ఎవరైనా అడిగితే అమ్మకు విపరీతమైన బాధవేసేది.
ఇరుగు పొరుగువాళ్ళు, చుట్టాలు అమ్మ పరిస్థితి చూసి దూరంగా ఉండటం మొదలుపెట్టారు. ఒకసారి మా పిన్నమ్మ వాళ్ళ అత్తగారు చచ్చిపోతే అమ్మ మా పిన్నమ్మతో, దగ్గర బంధువులతో కల్సి శవం దగ్గర కూర్చుని ఏడుస్తూంటే ఆమె ఎక్కడ వచ్చి తగులుతుందో అని ఒకరి తర్వాత ఒకరు అందరూ అమ్మకు దూరంగా జరిగారు. అదే పనిగా ఆ సంఘటనని తలచుకుని బాధపడేది. అప్పట్నుంచీ అసలు అలా అందరూ కలిసే చోట్లకు వెళ్ళకుండా దూరంగా ఉండేది. వెళ్ళడం ఇంక తప్పనిసరైతే ఆమె బాధలు, బస్సులో ఎక్కి కూర్చోవడంతో మొదలయ్యేవి. చెమట, వేడి ఆమె దురదల్ని ఇంకా ఎక్కువ చేసేవి. ఒక్కోసారి దగ్గర ఏదుంటే అది పట్టుకుని, బాధ తగ్గించుకోవడానికి దాంతో గీరేసుకునేది. మధ్య రాత్రిలో కూడా అమ్మ గోళ్ళతో గీరుకుంటోన్న శబ్దం మాకు వినిపించేది. రాత్రంతా నిద్ర పోకుండా విసనకర్రతో గీరుకుని తెల్లవారు ఝామునెప్పుడో తూగి తూగి నిద్ర పోయేది.
ఆ రోజు కూడా లేచినప్పుడు పూర్తిగా అలిసిపోయి అమ్మ కళ్ళు ఉబ్బిపోయున్నాయి. అప్పటికే ఆలస్యం అయిపోయిందని గబగబా వంటింట్లోకి పరిగెత్తింది. నాయన పదకొండు గంటలకు భోజనానికి కూర్చున్నాడు. అన్నంలో పులుసు వేసుకుని కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకోంగానే ఆయనకు అర్థం అయ్యింది, అందులో ఏ రుచీ లేదనీ, ఉప్పూ, కారమూ పడాల్సిన దినుసులూ ఏవీ పడలేదని. లేచి పులుసు గిన్నెను కాల్‌తో తన్ని నోట్లో పెట్టుకున్నది బయటికి ఉమ్మేసి, “ఛీ! ముదనష్టం, దీన్ని నోట్లో కూడా పెట్టుకోలేం…థూ” అంటూ అరిచాడు. గడప పక్కనే కూర్చొని ఉన్న అమ్మ ఎవరో కొప్పులోంచి జుట్టు పట్టుకుని లాగినట్టు సివంగిలాగా లేచింది. దొర్లుతూ తన వైపు వస్తున్న పులుసు గిన్నె పట్టుకుని శక్తినంతా ఉపయోగించి గోడ మీదకు ఒక్క ఉదుటున విసిరేసింది. గిన్నెలో మిగిలి ఉన్నదంతా నేల మీదా గోడల మీదా పడింది. “ఒళ్ళంతా పుళ్ళొచ్చి నేను కూర్చోలేకా, నిలబడలేకా అవస్థపడతా ఉంటే నీ నోటికి రుచి తగలడం లేదని నీ పొగరంతా నా దగ్గర చూపిస్తున్నావా? లండీ కొడకా! నేను రోగంతో మూల పడుంటే గుక్కెడు నీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళుండరు… అది కాక నేను చేసిన పులుసు నా మొహాన ఇసరతావా?” అని భగ్గున మండిపోతూ అన్నం గిన్నె వీధిలోకి విసిరేసింది. ఈ గోలకు ఇరుగు పొరుగువాళ్ళంతా వీధిలోకి వచ్చారు. అమ్మను తందామని అనిపించినా ఆమె ఉగ్రస్వరూపం చూసి నాయనకు ఒంట్లో వణుకు పుట్టింది. అంత కోపంగా అమ్మను ఎప్పుడూ చూడలేదు ఆయన.
అమ్మకు రోజూ రెండుసార్లు స్నానం చేసే అలవాటుండేది. కనీసం ఐదు బక్కెట్ల నిండా చల్ల నీళ్ళు పోసుకొని నిదానంగా స్నానం చెయ్యడం అంటే ఆమెకిష్టం. ఆమెకెప్పుడైతే ఒంటి నిండా పుండ్లు వచ్చాయో అప్పటినించీ ఇదంతా తగ్గిపోయింది. చేసినా గబగబా రెండు ముంతలు వేణ్ణీళ్ళు ఒంటి మీద పోసుకుని వచ్చేసేది. నీళ్ళ వల్ల పుండ్ల చుట్టూ ఉండే చర్మం మెత్తబడిపోయేది. ఒళ్ళు తుడుచుకుంటున్నప్పుడు, అమ్మకు మానని ఆ గాయాల మీదంతా సూదులతో పొడిచినట్టు ప్రాణం పోయేంత నొప్పి కలిగేది. అందుకని రోజులు, రోజులు స్నానం చేసేది కాదు.
అప్పటికింక నాయనకు నాటు వైద్యం మీద నమ్మకం పూర్తిగా పోయి మైలాడుతుఱైలో ఉండే చర్మవ్యాధులు నయం చేసే డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళాడు.
అమ్మ రోజూ చేతుల నిండా సిరంజిలు, మాత్రలు, ఆయింటుమెంట్లు పట్టుకుని తిరుగుతూండేది. కొద్ది రోజుల్లోనే పుళ్ళ మీది చర్మం ఊడటం మొదలైంది. గాయాలు మానకుండా లోపల్నించి చీము కారుతూ అలానే ఉండిపోయేవి. ఆందోళన పడుతూ మేం వేసే ప్రశ్నలన్నిటినీ కొట్టిపారేస్తూ డాక్టరు, ఇలా రసంతా కారిపోతే మాత్రమే అంతా మానిపోతుందని సమాధానం చెప్పాడు. ఎండ వేడి ఎక్కువైన కొద్ది అమ్మ ఒళ్ళంతా పచ్చి పుండైపోయింది. రాత్రి పూట కరెంటు తీసేసినప్పుడు అమ్మ నొప్పితో కేకలు పెట్టేది. మేం ఉలిక్కిపడి లేచి, అమ్మ మంచంలో అటూ ఇటూ దొర్లుతూ విలవిలలాడిపోవడం చూస్తూ ఉండేవాళ్ళం. మా తమ్ముళ్ళు భయంతో నన్ను గట్టిగా పట్టుకునేవాళ్ళు. అమ్మ అరుపులకీ ఏడుపులకీ చిన్న తమ్ముడు భయపడిపోయి ఏడిచేవాడు. నెమ్మదిగా ఆమె చేసే శబ్దాలు తగ్గినకొద్దీ మేం కూడా చిన్నగా నిద్రపోయి ఆమె ఏడుపులకి మళ్ళీ లేచేవాళ్ళం. ‘సొక్కాయమ్మా! ఈ బాధ తట్టుకోలేకుండా ఉన్నానమ్మా. నన్ను చూస్తే నీకు జాలెయ్యడం లేదా? నీ కళ్ళు మూసుకుని పోయినాయా, తల్లీ!’ చెంపదెబ్బలు కొట్టుకుంటూ ఇంటి ముందు గది తలుపు దగ్గర కూర్చుని కోపంతో కేకలు పెట్టేది. చూస్తూంటే కడుపు మెలితిరిగిపోయి మాకు ఒళ్ళంతా వణుకు పుట్టేది.
పొద్దున మేం లేచేటప్పటికి అమ్మ నిద్రపోతూ కనిపించేది. నాయన మమ్మల్ని స్కూలుకు తయారుచేసి పంపించే బాధ్యత తీసుకున్నాడు కాబట్టి ఆమెకు వంటిల్లు బాధ తప్పింది. ఆ రోజుల్లో ఎప్పుడూ అమ్మ ఒంటి మీద నాయన పంచ కప్పుకుని ఉండేది. ఎందుకంటే అది కాకుండా ఇంకే బట్ట ఆమె ఒంటికి తగిలినా పుండ్లకు రాచుకుని రసి బయటికొచ్చి అంతా తడి తడిగా మారిపోయేది. ఇల్లంతా కుళ్ళుతున్న చర్మం వాసన కొట్టేది. కొన్ని రోజుల తర్వాత నాయన మాకు ఇంటి వెనక పొయ్యి దగ్గర కూర్చుని తినడం అలవాటు చేసాడు. అక్కడే పడుకుని నిద్ర పొయ్యేవాళ్ళం. ఎప్పుడైనా మేం ఇంట్లోకి అడుగుపెడితే అమ్మ చేతికి ఏది దొరికితే అది తీసుకుని మా మీదకు విసిరేసి, ‘పోండిరా ఇక్కణ్ణించీ,’ అంటూ కేకలు పెట్టేది.
సోళచక్కరనల్లూరు దగ్గర బస్సు కండక్టరు విజిల్ వెయ్యంగానే నేను ఉలిక్కిపడి లేచాను. కన్నీళ్ళు మొహం మీద చారలైనాయి.
ఇంటికి రాంగానే అమ్మ ఏం మాట్లాడకుండా మా ఇంటి దేవుడి పటం ముందు మౌనంగా కూర్చుంది. ఆమె నిశ్శబ్దం మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. ఆమె ఆ రోజంతా మాట్లాడ్డానికి ఇష్టపడకపోవడంతో మా ఆందోళన ఇంకా ఎక్కువైంది. ఆ పక్క రోజునించీ రక్త పరీక్షలో ఏం బయటపడుతుందోనని అమ్మకు విపరీతమైన భయం మొదలైంది. ఆగని కన్నీళ్ళతో ఆమె మొహం ఉబ్బిపోయింది. ‘ఎవరు శాపం పెట్టారో, ఏ తల్లిని ఇబ్బంది పెట్టానో… ఇదంతా నా కాళ్ళ చుట్టూనే తిరుగుతోంది. నేనెవరినీ ఎప్పుడూ చెయ్యి చాచి అడిగింది లేదు. నా చేతులు ఇట్టా కరిగిపోతూంటే నేను చూస్తూ ఉండిపోవాలా? నా పిల్లల గతి ఏంది? దిక్కులేని వాళ్ళు అయిపోతారు గదా?’ గుండెలు బాదుకుంటూ ఏడిచింది.
నాయన మాటలు కొంత ఊరటనిచ్చాయి. ‘అది కుష్టు నయం చేసే ఆస్పత్రి. నిజమే. కానీ నీకారోగం తగులుకుందని నువ్వెందుకు అనుకోవాల? మనం వైద్యం కోసం తిరగని చోటు లేదు. మనకు అక్కడికి పొమ్మని చాలామంది చెప్పారు. దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ముందుకు పోదాం. అంతా బావుంటుంది.’
నేను పెరట్లో కూర్చుని ఉన్నప్పుడు మా చిన్న తమ్ముడు నా దగ్గరకొచ్చి నిల్చున్నాడు. వాడెప్పుడూ అమ్మ పక్కనే పడుకుని నిద్రపోయేవాడు. అమ్మ చేత్తో తినిపిస్తే మాత్రమే తినేవాడు. అమ్మకు ఎప్పుడైతే ఈ ఇబ్బంది వచ్చిందో వాడు బెంగ పెట్టుకుని సగమైపొయ్యాడు.
“పెద్దన్నా, అమ్మకెప్పుడు బాగవుతుంది?” అడిగాడు. “తొందరగానే” అన్నాను. చెప్తున్నప్పుడు కూడా ఆస్పత్రిలో చూసిన రకరకాల మొహాలు, కాళ్ళు, చేతులు గుర్తుకొస్తున్నాయి. అమ్మకు అలా అయిపోతుందేమోనని అనిపించినప్పుడల్లా తల విదిలించేస్తున్నాను.
అమ్మకు పూర్తిగా నయం అయితే మమ్మల్నందరినీ తీసుకుని పళని కొండకు ఎక్కి వస్తానని నాయన మొక్కుకున్నాడు. ప్రతి రోజూ పొద్దున నేను, మా తమ్ముళ్ళు మా ఇంటి దేవుడికి, మా ఊరి వినాయకుడికి దణ్ణం పెట్టుకునేవాళ్ళం.
చాలా రోజుల తర్వాత అమ్మ మమ్మల్నందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని అన్నంలో పులుసు వేసి కలిపి ముద్దలు చేసి చేతిలో పెట్టింది. దాదాపు మూడు నెలలుగా అమ్మ పొయ్యి దగ్గరికే పోలేదు. నాయనే వడ్డించేవాడు. అందుకు ఒక కారణం ఉంది. మా ఇంటికి చూడ్డానికని వచ్చిన ముసలామె ఒకామె మా పక్కింటామెతో, ‘ఈమె ఆ చేతుల్తో పిండి రుబ్బుతోంది. పిల్లలకు అన్నం వండి వడ్డిస్తోంది. పిల్లలకు ఆ రోగం పట్టుకుంటే ఏం చేస్తుంది? ఇంటి ఆడమనిషి ఇవన్నీ ఆలోచించాల గదా?’ అంది. ఆ మాట తనదాకా రాంగానే అమ్మ గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. కొంచెంసేపటి తర్వాత కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది, ‘అమ్మ చేతులు పిల్లలకు చెడు చెయ్యవు. నేనెవ్వరికీ కీడు చెయ్యలా. నా పిల్లలకు ఏం కాదు. పెద్దమ్మ తల్లీ, నా పిల్లలకు ఏం కాకుండా కాపాడు.’
పక్క రోజు మంగళవారప్పూట నాయన, అమ్మ వైదీశ్వరన్ కోవెలకు పొయ్యారు. తైయల్ నాయకి అమ్మవారి గర్భగుడి ముందర నిల్చుని అమ్మ నాయన్ను అడిగింది, “ఇక్కడ దణ్ణం పెట్టుకుని నేరుగా ఆస్పత్రికి పోదామా?”
“ఎందుకిప్పుడే? ఇంకా ఐదు రోజులు ఉందిగా, అప్పుడు పోదాం” అన్నాడు ఆయన. అమ్మ వదిలిపెట్టలేదు. “వాళ్ళు ఆ పరీక్షలో ఏం చెప్తారో, ఏందో నాకొద్దు. నన్ను పోనీ. ఆ డాక్టరమ్మను నేనే అడుగుతాను. నేనక్కడే ఉంటాను, చెట్లకు నీళ్ళు పెడతాను. ఏం దొరికితే అది తిని పడుంటాను. అక్కడే ఉండి పోనీగూడదా?” అమ్మ బతిమాలాడింది.
అప్పటిదాకా ఒక్క కన్నీటి చుక్కా రాల్చని నాయన ఇంక తట్టుకోలేకపోయాడు. చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చాడు. మళ్ళీ అమ్మ ఇంక ఆ విషయం గురించి మాట్లాడలేదు.
మరుసటి వారం మేమంతా తిరుహృదయం ఆస్పత్రికి మళ్ళీ పొయ్యాం. కొంతమంది డాక్టర్లు విదేశాల్నుంచి వచ్చారు. పురుగు కాటు వల్ల వచ్చిన ఈ చర్మ వ్యాధికి ఇంగ్లీషు పేరేదో, అది నాయనకు చెప్పారు. వైద్యం మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంతకుముందు అమ్మ కట్టే పూనమ్, పాలియెస్టర్ చీరలు కట్టకూడదని చెప్పారు.
మూడు రోజుల తర్వాత నాయన అమ్మకు నాలుగు కొత్త చీరలు తెచ్చిచ్చాడు. సూది మందు వెయ్యడానికి వచ్చిన నర్సు ఆసక్తిగా అడిగింది, “ఇవే రకం చీరలమ్మా?” ఆ ప్రశ్నకు సమాధానం చెప్పింది నాయన, “ఇవన్నీ అచ్చం నూలు చీరలు నర్సమ్మా!” అప్పుడే పుట్టిన బిడ్డ జుట్టులా అతి మెత్తగా ఉన్న బట్టను అమ్మ వేళ్ళు స్పర్శిస్తున్నాయి. ఎక్కడో ఆలోచిస్తూ ఒక్కసారిగా తన ముఖం ఆ కొత్త చీరల్లో దాచేసుకుని ఏడవడం మొదలుపెట్టింది అమ్మ.
(మూలం: మళైక్కణ్ , జూన్ 24, 2021)
రచయిత గురించి: సెంధిల్ జగన్నాథన్, తమిళనాడులోని మైలాడుతుఱై జిల్లాలోని పనంపల్లి గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం మద్రాసులో ఉంటూ తమిళ సినీ పరిశ్రమలో సహాయ దర్శకుడిగా, రచయితగా పనిచేస్తున్నారు. ఈయన మొదటి కథ 2018వ సంత్సరంలో ఆనంద వికటన్ పత్రికలో వచ్చింది. అనేక పత్రికల్లో వీరి కథలు ప్రచురితమయ్యాయి.
