రాముడికి సీత ఏమవుతుంది?

[ఆరుద్ర దేశదేశాల రామకథలను, రామాయణాలనూ పరిశోధించి వ్రాసిన వ్యాససంపుటి, రాముడికి సీత ఏమవుతుంది? అన్న పేరుతో పుస్తకంగా 1978లో ప్రచురితమయింది. ఇప్పటికీ ఎంతో ఆసక్తి కలిగించే రామాయణవ్యాసాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. ఇటీవల ఈమాటలో ఒక కథపై వచ్చిన అభిప్రాయాల నేపథ్యంలో ఈ పుస్తకాన్ని నేటి తరానికి పునఃపరిచయం చేస్తూ – ఈ పుస్తకానికి పురాణం సుబ్రహ్మణ్య శర్మ వ్రాసిన ముందుమాట (కొన్ని భాగాలు), ఆరుద్ర ఉపోద్ఘాతం ప్రచురిస్తున్నాం – సం.]

సీతమ్మతో ఆరుద్ర!

రాముడికి సీత ఏమవుతుంది? అనేది తెలివితక్కువ ప్రశ్న కాదు. ఈ ప్రశ్నను తరచి తరచి, సాంగోపాంగంగా చర్చిస్తే, ఎన్నెన్నో రామకథలు బయటపడ్డాయి. ఇన్ని రామాయణాలను చదివి చదివి వాటిలోని వావివరసల్ని విశ్లేషిస్తూ, కేవలం హరిదాసులు చెప్పే రామాయణాన్ని మాత్రమే విశ్వసించి, రామాయణ కథ తరతరాలుగా అనేక మార్పులకు, కూర్పులకు, చేర్పులకు లోనయివస్తూందనే సత్యాన్ని గుర్తించ నిరాకరించే వారికి, రామబాణం లాటి రచన రాముడికి సీత ఏమవుతుంది? అనే వ్యాస పరంపర!

రాముడికి సీత ఏమవుతుంది? అనే ప్రశ్నలోనే ఈ సమీక్షలో సీతకు ఎక్కువ ప్రాముఖ్యం వుంది అని వెల్లడి అవుతోంది. రామకథలన్నింటికి సీతమ్మ కేంద్ర బిందువు. సీతమ్మవారి జన్మ రహస్యాన్ని బట్టి, తీగలాగితే డొంకంతా కదలినట్టు, రామాయణంలోని వావివరుసల ప్రసక్తి, అందిన కథల మేరకు సవిమర్శకంగా, సాధికారికంగా ఈ వ్యాసపరంపరలో ఆరుద్రగారు చర్చించారు.

రామభక్తులకు, హరిదాసులకు నిజానికిన్ని రామాయణాలు వున్నవనే సంగతికాని, వాల్మీకికి ముందు రామకథల్ని అనేకమైన వాటిని, అనేక చోట్ల, అసంఖ్యాక రీతుల్లో గానం చేసేవారని, వాల్మీకి రామకథలను ఏకత్రం చేసిన ఆదికవిగానే కాక, ఆది ఎడిటర్‌గా కూడా పాత్రఃస్మరణీయుడని, మారుతున్న సమాజానికి అవసరమైన రీతిలో రామాయణం ఎప్పటికప్పుడు సంస్కరింపబడుతూ వచ్చిందనీ తెలియదు. భక్తికి విశ్వాసంతోనే గాని, జ్ఞానంతో పనిలేదు. జ్ఞానయోగం కంటె భక్తియోగం గొప్పది. కాని భక్తులయినా, రక్తులయినా భిన్న భిన్న రామాయణాల్లో సీతాదేవి పుట్టుక గురించి ఏమేమి చెప్పారో తెలుసుకోవడం వలన ఆనందంతోపాటు, ఆశ్చర్యంకూడా కలుగుతుందే కాని, రామాయణంపట్ల, రామకథలపట్ల నిరాదరణకాని, నిరసనకాని ఈ వ్యాసాలు కలుగజేయవని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.

ఇదివరకు ఎవరో కొంతమంది పండితులకు మాత్రమే తెలిసిన యీ సంగతులను ఏకత్రంచేసి ఆరుద్ర పామరజన రంజకంగా, రామాయణం గురించి మనవంటి సామాన్యులకుండే ఆలోచనాపరిధిని విస్తృతం చేశారు. హైందవ సంస్కృతిని, మానవజాతి సముజ్జ్వల చరిత్రలోని మానవీయ, మాననీయ అంశాలను పరంపరాగతంగా జాతికి అందించిన ప్రపంచ మహాకావ్యాలలో రామాయణానిదే అగ్రతాంబూలం! రామాయణ కథలలోని అనేక అంశాలు వివాదాస్పదమైనవి కావడం రామ కథలలోని వైవిధ్యాన్ని, వైరుధ్యాల్ని సూచిస్తుందేకాని, అవి రామాయణ విశిష్టతను కించపరిచేవికాని, దాన్ని అవమానపరిచేవికాని ఎంత మాత్రం కావనడానికి ఆరుద్రగారి వ్యాస పరంపరలోని వింతలూ, విడ్డూరాలూ, విశేషాలే సాక్ష్యం. సీత రాముడికి ఏమవుతుంది? అనే ప్రశ్న వలన వుత్పన్నమయే గందరగోళం ఏమయినా వుంటే అది ఆరుద్ర కల్పించినది మాత్రం కాదు. అందుకు ఆయన బాధ్యత కూడా లేదు.

రామాయణాలలోని ‘కన్ఫ్యూజన్’ను ఆరుద్ర వెల్లడించడం యిప్పుడు అవసరమా అనే ప్రశ్నకు, రామాయణాన్ని గురించిన ఆలోచనా పరిధిని విస్తృతం చేయడం మంచిది కదా అని జవాబు చెప్పవచ్చు. శ్రీరాముడు నిజానికి దశరథాత్మజుడు కాడా? ‘రామాయణం రంకు’ అనే సామెత జనం నోటిలో నానుతూ మన విశ్వాసాలను వెక్కిరిస్తోంది. సీత జానకి కాదా? భూమికన్య అని ఎలా వచ్చింది? పురాణాలు, మహాకావ్యాలు, ఇతిహాసాలు – యివి రామాయణంలోని పాత్రల వావివరసలను ఎందుకు మార్చేస్తూ వచ్చాయి. రామాయణం గురించి ఆరుద్ర వ్యాసాలు చదువుతున్నప్పుడు, ప్రాసంగికంగా హనుమంతుడి పూర్వాపరాలు తెలియడంతోపాటు, మానవ పరిణామ చరిత్ర, మానవ నాగరికత చరిత్ర గురించి కూడా చాలా సంగతులు తెలుస్తాయి. ఈ సంపుటిలో ఆరుద్రగారు చిక్కుముడిని విప్పుకుంటూ పోయారే కాని, చిక్కులను పేర్చి పీటముడి వేసి సంగతులన్నీ బిగుసుకుపోకుండా ‘ఓపెన్ డిస్కషన్’ చేశారు. పరిష్వంగం కంటె, గాఢ పరిష్వంగం గొప్పదయినట్టు రామాయణం గురించి మనకు వుండే అవగాహనను ఈ వ్యాసాలు ప్రగాఢం చేస్తాయి.

రాముడు లౌకిక భారాన్ని మోయడం కొరకై లోకహితార్థమై అమ్మవారిని అడవికి పంపాడు. కాని, సీతమ్మ ప్రకృతి భారాన్ని, ప్రకృతి ధర్మాన్ని సాకి, సంరక్షించి, ఫలశ్రుతిని లవకుశుల రూపంలో లోకానికి అందించింది. వాల్మీకి చెప్పిన రామకథను వారూ గానం చేశారు. చివరగా తల్లి కడుపు చలవ వలన ‘పుత్రాదిచ్ఛేత్ పరాజయం’ అన్న సూక్తికి శ్రీరామప్రభువు అంకితమయ్యాడు. ప్రభువుల శక్తికంటే, తల్లి మహత్తు గొప్పది. సీత రాముడితో రాజీ పడలేదు. శ్రీరాముడు తన జన్మ వృత్తాంతాన్ని గ్రహించకుండా సీతమ్మను లోకాపవాదానికి విడిచి పెట్టడం, సీత క్షమించిందా? సీత ఎటువంటి రాజీకి లొంగలేదు కదా!

రాముని కంటే కూడా రామభక్త హనుమానుణ్ణి విపరీతంగా ప్రేమించి ఆరాధించే తెలుగువారికి, హనుమసమానుడై విజృంభించిన ఆరుద్ర ‘రామునికి సీత ఏమవుతుంది?’ అనే ప్రశ్నకు చివరిలో ‘యద్భావం తద్భవతి’ అనే జవాబిచ్చారు.

ఈ వ్యాస సంకలనం తెలుగు సరస్వతికి అపూర్వాలంకారం కాగలదని భావిస్తూ – నమస్కారం. సెలవు!

పురాణం సుబ్రహ్మణ్యశర్మ
విజయవాడ
22.4.78

రాముడికి సీత ఏమౌతుంది?

వెనకటికి ఎవరో రామాయణం అంతా విన్నాక ‘రాముడికి సీత ఏమౌతుం’దని ప్రశ్నించాడట. ఇది సామెతగా నిలిచిపోయింది. అలా ప్రశ్నించినవాడు వెర్రివాడన్న భ్రాంతి కూడా జనుల్లో వ్యాపించింది. నిజానికి ప్రశ్న వేసినవాడు వెర్రివాడు కాదు. ఆ ప్రశ్నలో ఎంతో జిజ్ఞాస ఉంది.

రామాయణం కాకపోయినా రామాయణాలన్నీ విన్నాక ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉదయిస్తుంది. ఇవాళ మన దేశంలోనూ, ప్రపంచంలోను వాల్మీకి రామాయణం విశేష ప్రచారం పొందడం వల్ల అదే మూల రామాయణమని జనులు విశ్వసిస్తారు. కానీ, వాల్మీకి రచించడానికి ముందే రామకథలు ప్రచారంలో వుండేవి. ఈ సంగతి వాల్మీకి రామాయణంలోనే వుంది.

ఒకనాడు నారదుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. అతిథి సేవలు చేశాక వాల్మీకి నారదుణ్ణి ఇలా ప్రశ్నించాడు: “ఈ లోకంలో ఇప్పుడు గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవచనుడు, దృఢవ్రతుడు, చరిత్రవంతుడు, సర్వభూతహితుడు, విద్యావంతుడు, సమర్థుడు, ఏకప్రియ దర్శనుడు, జితక్రోధుడు, కాంతిమంతుడు, అనసూయాపరుడు, దేవతలనైనా యుద్ధంలో జయించగలవాడు ఎవడైనా ఒకడు ఉన్నాడా?” వాల్మీకి వేసిన ఈ ప్రశ్నలలోని సుగుణాలన్నీ వున్నవాడు శ్రీరాముడు ఒక్కడే అని నారదుడు రామకథను సంగ్రహంగా చెప్పాడు. వాల్మీకి ఆ కథను విపులంగా తర్వాత రచించాడు.

నారదుడు చెప్పిన రామకథకు మూలం ఏది? అదెక్కడ నుండి వచ్చింది? నారదుడు సహజంగా ప్రజలలో ప్రచారం పొందిన కథనే విని, ఆ కథ తెలియని వాల్మీకికి దానిని చెప్పివుండాలి. నారదుడు చెప్పిన కథను వాల్మీకి కొంత మార్చి వుండవచ్చు (శకుంతల కథను కాళిదాసు మార్చినట్టు). వాల్మీకి రాస్తున్నది కావ్యం – ఇతిహాసం కాదు, పురాణం కాదు.

పురాణ ఇతిహాసాలలో ప్రక్షిప్తాలను స్వలాభాలకోసం స్వార్థపరులు చేర్చడం మధ్యలో జరిగిందిగాని తొలిరోజుల్లో పురాణాలూ ఇతిహాసాలూ జనశ్రుతిలో వున్న కథలను ఏం మార్చలేదు. అందుకే ఇతిహాసమైన భారతంలోను, పురాణమైన భాగవతంలో కూడా రామోపాఖ్యానాలు వున్నాయి. ఒక్క భాగవత పురాణంలోనే కాదు, అష్టాదశ పురాణాల్లో చాలా పురాణాలు రామకథను చెప్తాయి. పద్మపురాణంలో చాలా విపులంగా మూడు ఖండాల్లో రామాయణగాథ కనబడుతుంది. వాల్మీకి రామాయణంలో లేని విషయాలెన్నో ఇందులో ఉన్నాయి.

అగ్ని పురాణం, కూర్మ పురాణం, దేవీ భాగవతం, బ్రహ్మవైవర్త బ్రహ్మాండ పురాణాలు, మార్కండేయ, శివ పురాణాలు కూడా రామకథను అంతో ఇంతో చెప్తాయి. వీటిలో వాల్మీకంలో లేని విషయాలు కూడా వున్నాయి. ఇవన్నీ ఎక్కడనుంచి వచ్చాయి? పవిత్రమైన గ్రంథాలలో ఎవరూ నోటికొచ్చినవి రాసి చేర్చరు. సంప్రదాయసిద్ధంగా జనులు చెప్పుకొనేవాటినే పురాణ ఇతిహాసాలలో చేర్చడం జరిగి ఉండాలి.

వాల్మీకిలాగే ఇతర ప్రాచీనులు కూడా రామకథను కావ్యాలుగా రాశారు. అద్భుత రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, ఆనంద రామాయణం వంటివి సుప్రసిద్ధాలు. భాసుడి ప్రతిమా నాటకం, కాళిదాసు రఘువంశం, భట్టికావ్యం అన్న పేరు మీద ప్రసిద్ధమైన భట్టి రాసిన రావణ వధ, భవభూతి ఉత్తర రామచరిత్ర, దిఙ్నాగుడి కుందమాల మొదలైనవన్నీ రామకథలే. వీటిలో వాల్మీకంలో లేని కల్పనలు ఉన్నాయి. వీరందరూ సీతారాములపై పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులు ఉన్నవారే. రామకథ మీద గౌరవం గలవారే. ఈ రచయితలందరికీ వాల్మీకి రామాయణమొక్కటే మూలం కాకపోవచ్చు.

వాల్మీకికి నారదుడు చెప్పిన రామకథ అప్పటికే జనంలో వ్యాపించి వున్న సంగతి మొదటే చెప్పుకున్నాం. అంతకుముందు ఎన్నో తరాలపాటుగా అది ప్రచారంలో వుండి వుండాలి. అది పరంపరానుగతంగా, సంప్రదాయ సిద్ధంగా జాతి వారసత్వంలో ఒక భాగమైంది. ఈ వారసత్వానికి వైదిక ధర్మపరాయణులలాగే బౌద్దులూ జైనులూ కూడా వారసులే. ఈ మూడు మతాల పూర్వీకులు ఒక్క కుదురులో నుంచి వచ్చినవాళ్ళే. వైదికుల్లాగే బౌద్ధులూ జైనులూ కూడా రామాయణాన్ని ఉపయోగించుకొన్నారు. బుద్ధుడిని వైదికులు దశావతారాల్లో కలుపుకొంటే, రాముడిని బౌద్ధులు బుద్ధుడి పూర్వజన్మలో ఒక జన్మగా చెప్పుకొన్నారు. వైదికులు రాముడిచేత బౌద్ధులను, నాస్తికులను తిట్టిస్తే; జైనులు రావణునిచే హింసాత్మకాలైన యజ్ఞయాగాదులను నాశనం చేయించారు. అహింసను ప్రబోధించారు.

భారతదేశంలోని మూడు ప్రధాన మతాలలోనే కాక, రమారమి అన్ని ప్రధాన భాషలలోనూ రామాయణాలు ఉన్నాయి. ప్రతి దాంట్లోను ఎక్కడో ఒక దగ్గర వాల్మీకంలో లేని ఒకటో అరో విషయం ఉండకపోదు. రాముడిమీద భక్తితోను, రామాయణంపైన గౌరవంతోను రాసిన వాటిలోనే ఈ వాల్మీకాలు ఎందుకు రావాలి? సంప్రదాయాన్ని విస్మరించలేకపోవడం వల్లనే!

మన ప్రాచీన భారతదేశానికి దూర ప్రాచ్యంలోని చాలా దేశాలతో వర్తక వాణిజ్య సంబంధాలు ఉండేవి. మన ప్రాచీనులు మతాన్ని కూడా ఎగుమతి చేశారు. రామకథ ఆసియా ఖండమంతా అలముకొంది. శ్రీలంక, తిబెత్తు, ఖోటాను, మంగోలియా, నైబీరియా, చైనా, జపాను, లావోస్, చంప, కాంబోడియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్, బర్మా దేశాలలో రామాయణ కథను కొన్ని చోట్ల జానపద గాథలుగా బహుళ ప్రచారంలోను, కొన్నిచోట్ల సాహిత్యంగా గ్రంథస్థమై వున్నాయి. ఈ కథలలో వాల్మీకి రామాయణంలో లేని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ రామాయణాలన్నీ పరికిస్తే రాముడికి సీత ఏమవుతుందన్న ప్రశ్న రాక మానదు.

బౌద్ధ, జైన రామాయణాలతోపాటు ఈ దేశదేశాల రామాయణాలు సీతారాములపైన గౌరవం కలవే. సీతారాములు ఆరాధ్యులే. అయితే, వాల్మీకి కన్నా చాలా తరాల ముందు ప్రచారంలో వున్న కథలు ఎగుమతి కావడం వల్ల వివిధ దేశాల రామాయణాల్లో బౌద్ధ, జైన రామాయణాలలోని అంశాలు కనబడతాయి. బౌద్ధ రామాయణంలో రాముడికి సీత చెల్లెలు. ఒక్క చెల్లెలు మాత్రమే కాదు, పెళ్ళాం కూడా. ఖోటాన్ రామాయణంలో రామలక్ష్మణుల ఇద్దరికీ భార్య. లావోస్ రామాయణంలో హనుమంతుడు రాముని కొడుకు. మలేషియా రామాయణంలో మండోదరి దశరథుని పెద్ద భార్య. కైకేయి స్థానంలో ఉన్న బాల్యాదారి ఉంపుడుకత్తె మాత్రమే. దశరథుని కొడుకు రావణాసురుని పుత్రికను పెళ్ళాడి రావణుని చంపుతాడు. ఆ పుత్రిక పుత్రకామేష్ఠిలో పవిత్రమైన ఒక అన్నం ముద్దవల్ల పుట్టినదే. విడ్డూరాలలాగ కనబడే ఈ విభిన్న రామాయణాంశాలను శ్రద్ధగా పరిశీలించాలి.

వైదిక మతాన్ని అపహాస్యం చేయడానికి బౌద్ధులూ, జైనులూ ఈ విడ్డూరాలను సృష్టించారన్న వాదం ఇంతకాలం సాగినా ఇకపైన సాగదు. జైన రామాయణం పైన మంచి వ్యాసం రాసిన సురవరం ప్రతాపరెడ్డిగారి మాటలు మనం జ్ఞాపకం చేసుకొనడం చాలా అవసరం: ‘మన మతమునకు విరుద్దములైన బౌద్ధమతమును, జైన మతమును, చార్వాక లోకాయత కాలవాదుల సిద్ధాంతములను మనము పాషండ మతముల పట్టీలో చేర్చి నాస్తికులనియు, వేద విరుద్ధులు, వేద బాహ్యులు వీరని నిందించియు నుపేక్షభావమును చూపినాము. అట్లిక మీద చేయుట అహంభావ చిహ్నమగును.’

సురవరంవారే జైన రామాయణంలో విశ్వసనీయ విషయాలు అనేకం ఉన్నాయని చెప్తూ ‘వాల్మీకి రామాయణమందు రాముని నాదర్శ పురుషునిగా జేయుటకై యేకపత్నీ వ్రతునిగా జేసియుందురు. మరియు రావణుని సర్వ దుర్మార్గునిగా జేయుటకై యితని గుణపోషణమందు చాలా పక్షపాతము చేసియుందురు. ఇది హిందూమత సంప్రదాయమే కానీ ఇలా చేయుట చరిత్రకు నష్టము. విద్వద్వరేణ్యులే జైన రామాయణము నింకను విమర్శించి యదార్థములు నిర్ణయింతురు గాక!’ అని తమ ఆకాంక్షను తెలియచేశారు.

విద్వద్వరేణ్యులు ఒక్క జైన రామాయణాన్నే కాక ఇతర దేశాల రామాయణాలను కూడా విమర్శించారు. వివిధ దేశాల పండితులు వివిధ పత్రికలలో, వివిధ గ్రంథాలలో విభిన్న రామాయణ విశేషాలను వివరించారు. పుసాల్కర్‌గారు భారతీయ పురాణ ఇతిహాసాలపై వ్రాసిన గ్రంథంలో రామకథల వివరాలన్నీ క్రోడీకరించారు. ఆచార్య వి. రాఘవన్‌గారు వివిధ దేశాలలోని రామాయణాలను మన దేశంలోని రామాయణాలను తులనాత్మకంగా పరిశీలించారు. మనకు మహాభారతం లాగ మహా రామాయణం లేదు గానీ, ఆచార్య రాఘవన్‌గారు మహత్తర రామాయణంగా మన రామాయణ సర్వస్వాన్ని గుర్తించారు. వివిధ దేశాల రామాయణాలను ‘మహత్తర భారతదేశంలోని రామాయణం’ అన్నారు.

ఎందరెందరో విద్వద్వరేణ్యుల పరిశోధనా ఫలితాలను, ఉడతా భక్తిగా నా పరిశోధనా ఫలితాలను మేళవించి, వివిధ దేశాల రామాయణ విశేషాలను వ్యాస పరంపరగా పాఠకులకు అందించదలిచాను. ఇది రామాయణ చరిత్రలో సత్యనిర్ణయానికి దోహదకారి కావాలన్న ఒకే ఒక ఆశయంతో చేపట్టిన కార్యం.