డిసెంబర్ 2020

సాహిత్యం ఒక ఆయుధం కాదు సమాజాన్ని ఖండించడానికి; సాహిత్యం మన వాదభావరాజకీయావసరాలు తీర్చే, తీర్చగలిగే ఒక పనిముట్టు కాదు-ప్రత్యేకించి వాటిని వాడటం చేతకాని చేతులలో. అలా కావాలి అంటే ముందు సాహిత్యం పట్ల, సమాజం పట్ల, ఆ రెంటి సంబంధం పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. అది లేనప్పుడు, ఎన్ని వాదాలను సమర్థిస్తూ ఎన్ని నమూనా కథలు రాసినా వాటి ఫలితం శూన్యం. సమాజం ఒక అభాసరూపి; బహుముఖీన. నిర్వచనాలకు లొంగనిది. పాఠకులతో రచయిత జరిపే సాహిత్య సంభాషణ వ్యక్తిగతమైనది. సామూహికమైనది కాదు. అందువల్ల రచయిత చేయగలిగింది, చేయవలసింది తమ రచనల ద్వారా తమ ఆలోచనలను పాఠకులకు స్పష్టంగా చేర్చగలగడం, పాఠకులు తమ భావాలకు, ఆలోచనలకు స్పష్టతనిచ్చుకోవడంలో సహాయపడడం మాత్రమే. ఇలా తమ సాహిత్యం ద్వారా పాఠకులను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న రచయితలు తెలుగులో ప్రస్తుతం నూటికో కోటికో ఒక్కరు మాత్రమే కనిపిస్తున్నారు. కోట్లమంది తెలుగువారిలో సాహిత్యం చదివేవారు వేలమందిలోను, విమర్శనాత్మకంగా చదవగలిగినవారు వందల్లో మాత్రమే ఉన్నారనడం సత్యదూరం కాని విషయం. పాఠకుల సాహిత్యాభిరుచి ఈ స్థితికి రావడానికి కారణం రచయితలే. సాహిత్యం ఇలానే ఉండాలి, ఈ వాదాలనే సమర్థించాలి, ఈ రకమైన ముగింపులే ఇవ్వాలి అని నిర్బంధించి, సమాజంలోని ఎన్నో రంగుల జీవితాలను కేవలం నలుపు-తెలుపులలో చూపే ప్రయత్నాలను మాత్రమే రచయితలు, పత్రికలు కూడా సమర్థించడం వల్లనే. అందువల్ల, పట్టుమని పదిమంది కూడా చదవని తమ సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు తెస్తున్నామనుకోవడం, వారి సాహిత్యానికి అంత శక్తి ఉందనుకోవడం కేవలం రచయితల పగటికల మాత్రమే. వైయక్తికస్థాయిలోనైనా మార్పు తేగలిగినంత ప్రభావంతో తెలుగులో ఎవరూ రాయటంలేదు. కారణం? పాఠకులకంటే కూడా ముఖ్యంగా రచయితలకు సాహిత్యస్వభావం గురించి లేశమాత్రమైనా అవగాహన లేకపోవడం. తమచుట్టూ తమలాంటి ఒక పదిమందిని కూడగట్టుకొని తాము చూసిందే ప్రపంచమని, దాన్ని తాము మారుస్తున్నామని, ప్రశ్నిస్తున్నామని, తమ గొంతు వినిపిస్తున్నామని అపోహపడడం, అలా కాని సాహిత్యాన్ని నిందించడం, ఆపై సాహిత్యవ్యాసంగాన్ని తమ స్వప్రయోజనాలకు వాడుకొనడం. ఇదీ నేటి పరిస్థితి రచయితలది, కొండొకచో పత్రికలదీ. సాహిత్యం ద్వారా తమ వాదపక్షపాతాన్ని ప్రకటించడం, దాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నించడంలో ఏ తప్పూ లేదు. కాని, సాహిత్యం కేవలం మనకు నచ్చినట్టే ఉండాలని, మన ఇష్టాయిష్టాలను, మన అభిప్రాయాలను, అపోహలనూ మాత్రమే ప్రతిబింబించాలని అనుకోవడం, అలా కాని సాహిత్యం ప్రమాదమని, హేయమని దాడి చేయడం కేవలం మూర్ఖత్వం. మనం నచ్చని, మనకు నచ్చని ప్రజలు ప్రపంచంలో ఉన్నట్టే, మనకు నచ్చని కథాంశాలు, పాత్రలు, వాటి ప్రవర్తనలు ఉన్న కథలుంటాయి. కథను కథలాగానే చదవాలి. అర్థం చేసుకోవాలి. కథగానే విమర్శించాలి. ఈ సాహిత్య సంస్కారం ప్రస్తుతం పాఠకులకంటే రచయితలకు ఒక ముఖ్యావసరం కావడం బాధించే విషయం. రచయితలు ముందు తమ దృక్పథాన్ని విశాలం చేసుకోవాలి. నిష్పాక్షికంగా తమచుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా పరిశీలించాలి. అవధులు లేని దాని విస్తీర్ణతను బహురూపత్వాన్ని గుర్తించాలి. సాహిత్యసంస్కారంతో పాటు, భిన్నాభిప్రాయాల పట్ల నిరసనను కూడా గౌరవంగా తెలపగలిగే సాంఘిక సంస్కారమూ అలవర్చుకోవాలి. ఈ తక్షణావసరాన్ని గుర్తించకుంటే తెలుగు సాహిత్యం, రచయితలు కొత్తలోతులకు దిగజారగలరేమో కాని కొత్త ఎత్తులు ఎక్కలేరు.