మాయలాంటి మనం

నేను, నువ్వు తలో చోటా నడుస్తుంటాం
నీ దారిలో నేనుంటానో లేనో
నా దారిలో, నాలో నీవుంటావు.
ఈ దేహంలో, ఇదే మనసుతో
బ్రతకలేక బ్రతుకుతూ నేను
నైరూప్య లోకంలో నీవు
నేనే నీ వైపు నడిచి వస్తున్న భ్రమలాంటి సత్యం.

మన ఊసులదొక అవ్యక్త భాష
స్వరం, లిపి లేనిదది.
నిరుపయోగమనిపించే యాగమది.
సద్దు లేని మౌనప్రాంగణమది.

బోసి నవ్వుల కేరింత, పసి కబుర్లు,
కౌమారపు గారాలు
అన్నీ అకస్మాత్తుగా ఆగాక,
ప్రాణంపై తీపి మాయమై
దగా పైన కూడా దయ పరుచుకుంటుంది

నా ఎదుట లేని నీకోసం
కుమిలిపోయే ఈ తల్లి గుండె
నువ్వే ఉంటే ఏమి చేద్దువో,
ఏమేం చెప్పుదువోనన్న ఎదురు చూపుతో
రంగుల కలలు గీసుకుంటుంది.

ఇప్పటికైతే ఇంతే.
నిప్పు కణిక లాంటి నిజం
కలలు ఖాళీ చేసిన కళ్ళలో
ఎర్రగా మెరుస్తూనే ఉంటుంది.
అస్తిత్వతీరం నుండి
దూరంగా ఈదలేక ఈదలేక
అయిష్టంగానే
పచ్చిగాయంపై
జ్ఞాపకాల లేపనం పూసి
రాజీపడుతూ రోజులు దాటించాలి.

అసలు మనం ఎందుకు కలిసి నడిచామో
ఏ తెలియని రూపాలలో ఎదురుపడతామో!
జన్మలే నిజమైతే ఈసారి నిన్ను మరింత ప్రేమిస్తాను.