ఏకాంతద్వీపం

ఇది ఒక ఏకాంతద్వీపం!
ఇక్కడ నిశ్శబ్దమే పహరా కాస్తుంటుంది
కాస్త చెవి ఒగ్గి వినాలే కానీ
ఏవో యంత్రాల ఘోష నీచుట్టూ
ఒక ప్రవాహమై కదులుతుంటుంది
ఇక్కడ ఆకలిదప్పులే కాదు
నిద్ర కూడా నిన్ను పలకరించదు
పగలు రాత్రులంటూ భేదమేమీ ఉండదు
నిన్నంటిపెట్టుకున్న మెత్తని పడక
నిన్ను మరింకేమీ ఆలోచించనివ్వదు.

పాలనురుగు వస్త్రాల మరబొమ్మలు నీ కోసమేదో హడావుడి పడుతుంటాయి
గాజు తలుపులు, మెరుపు వెలుగులు నిన్ను పరివేష్టించి ఉంటాయి
నీ శరీరభాగాలన్నీ రకరకాల విన్యాసాలు చేస్తున్న భంగిమలో ఉంటాయి
నిన్నల్లుకుని నీలోకి ప్రాణవాయువుని తోడిపోసే ప్రాణంలేని తీగెలు
చూసేందుకు నువ్వు పోగేసుకున్న అనుబంధాల్లాగే కనిపిస్తాయి!

ఎప్పుడో ఎవరెవరినో ఇలాంటి సందర్భాల్లో చూసిన జ్ఞాపకం వణికిస్తుంది
కానీ కాస్త ఆలస్యంగానైనా ఇప్పుడు నీవంతేనన్నది స్ఫురించేస్తుంది
ఏ బాధా తెలియనట్టే ఉంటుంది, అంతా హాయిహాయిగా ఉన్నట్టే ఉంటుంది
కానీ ఊపిరి సలపనట్టూ ఉంటుంది
నువ్వే కేంద్రమన్నట్టుంటుంది కానీ
చిత్రంగా నీ ప్రమేయమేమీ ఉండదు!

పొడిబారిన నీ కళ్ళు ఎవరెవరికోసమో వెతుకుతూనే ఉంటాయి…
రోజులో ఏ ఒక్కసారో నువ్వు చూడాలని కలవరించే ముఖాలు కనిపిస్తాయి
ముఖంలో మెరుపు, పెదాలపై నవ్వూ చూపించాలనే అనుకుంటావు
కానీ నీచేతిలో మాత్రం ఏముందిలే!
నిశ్శబ్దాన్ని పాటించాలని తెలిసినవాళ్ళు
కళ్ళతోనే ధైర్యాన్ని సానుభూతిని అందించి
మళ్ళీ వస్తామంటూ వీడ్కోలు తీసుకుంటారు
కానీ వాళ్ళకి మనసులో శంకే
ఎదురుచూసే సహనం పాటించగలవో లేదోనని…
అయితే, నీకు కచ్చితంగా తెలుసు
ఆ ద్వీపాన్ని దాటి వెళ్ళాలన్న కోరిక నీకుందని!