ఢిల్లీకి రావడానికి ముందు ఆమె అంబాలా ఛావనీలో ఉండేది. అక్కడ ఆమెకు చాలామంది తెల్లవాళ్ళు కస్టమర్లుగా ఉండేవారు. వాళ్ళతో కలవడం మాట్లాడ్డంతో ఆమెకు కూడా పది పదిహేను ఇంగ్లీష్ ముక్కలు వంటబట్టాయి. ఆమె వాటినెప్పుడూ మామూలు పిచ్చాపాటి కబుర్లలో వాడేది కాదు కానీ ఢిల్లీ వచ్చాక అక్కడ వ్యాపారం నడవకపోయేసరికి ఒకసారి పక్కింటి తమంచాజాన్‌తో ‘దిస్ లైఫ్… వెరీ బాడ్’ అని అంది. అంటే ఈ జీవితం చాలా చెడ్డదని, కనీసం తినడానికి కూడా ఏమీ దొరకటం లేదని.
అంబాలా ఛావనీలో ఆమె దందా బాగా నడుస్తుండేది. ఛావనీలో తెల్లవాళ్ళు ఆమె దగ్గరకు తాగి వచ్చేవారు. ఒక మూడు నాలుగు గంటల్లో ఆమె షుమారు పదిమందిదాకా తెల్లవాళ్ళను తృప్తి పరచి ఇరవై ముప్ఫై రూపాయలదాకా పుట్టించేది. ఈ తెల్లవాళ్ళు దేశీలకన్నా మంచివాళ్ళు. వాళ్ళేం అంటున్నారో సుల్తానాకు అర్థం అయేది కాదు నిజమే కాని, వాళ్ళ భాష అర్థం కాకపోవటం అనేది ఆమెకి బాగా ఉపయోగపడింది. వాళ్ళు ఆమె చెప్పినదానికన్నా తక్కువ రేటుకి బేరమాడబోతుంటే తల అడ్డంగా ఊపుతూ అనేది: “సాహెబ్! నాకు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు!” అప్పుడప్పుడూ వాళ్ళు ఆమెతో కొంత మోటుగా సరసమాడితే వాళ్ళపై తన భాషలో తిట్లు మొదలుపెట్టేది. వాళ్ళకి అర్థం కాక హైరానాపడి ఆమె వైపు చూస్తే, వాళ్ళతో అనేది: “సాహెబ్! నువ్వో పెద్ద దద్దమ్మవి, తప్పబుట్టిన ముండాకొడుకువి… అర్థమైందా?” ఆ మాటలు చాలా గోముగా గొంతులో కరుకుతనం ఏమీ లేకుండా అనేది. తెల్లవాళ్ళు నవ్వుకునేవాళ్ళు, అలా నవ్వుతుంటే సుల్తానాకి వాళ్ళు అచ్చం దద్దమ్మల్లా కనిపించేవారు.
అదేమిటో కాని, ఈ ఢిల్లీకి వచ్చిన రోజు మొదలుకొని ఒక్క తెల్లవాడు కూడా ఆమె దగ్గరకి రాలేదు. ఇక్కడ ఒక పెద్ద లార్డ్ సాహెబ్ ఉంటాడట, ఆయన వేసవిలో సిమ్లాకి వెళ్ళిపోతాడట, ఆయనకు చాలా బలగం ఉందిట– ఇలాంటి కబుర్లేవో సుల్తానా విన్నది. కాని, ఇంత పెద్ద ఊర్లో కూడా ఈ మూడు నెలల్లో ఆమె దగ్గరకు కేవలం ఆరుగురంటే ఆరుగురు మగవాళ్ళు వచ్చారు. అంటే నెలకి ఇద్దరు. ఆ ఆరుగురు కస్టమర్లనుండి ఆమె, ఖుదా అబద్ధం చెప్పించడు, పద్దెనిమిదన్నర రూపాయలు వసూలు చేసింది. మూడు రూపాయలకన్నా ఎక్కువకు ఎవరూ ఒప్పుకోనేలేదు. సుల్తానా వాళ్ళల్లో ఐదుగురికి తన రేటు పది రూపాయలు అని చెప్పింది కానీ విడ్డూరంగా వాళ్ళలో ప్రతివాడూ కూడా ‘నేను మూడు రూపాయలకు మించి ఒక్క పైసా కూడా ఇవ్వ’ననే అన్నాడు. వాళ్ళకి ఆమె మూడు రూపాయలకంటే ఎందుకు ఎక్కువ ఖరీదు అనిపించలేదో మరి. చివరికి ఆ ఆరోవాడు వచ్చినప్పుడు, ఆమే చెప్పింది: “చూడూ, ఒక్కసారి చేసినందుకు మూడు రూపాయలు అవుతుంది. ఒక్క పైసా కూడా తగ్గించను. నువ్వు బేరం చేయకు. ఇక నీ ఇష్టం. ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళు.” ఆరోవాడు ఈ మాట విని ఎదురు చెప్పలేదు, ఆమె దగ్గరే ఉండిపోయాడు. అతడు పక్క గదిలో తలుపులు మూసుకొని తన కోటు విప్పుతున్నప్పుడు సుల్తానా అంది: “ముందు ఒక రూపాయి ఇవ్వండి, పాలకి…” అతడు ఒక రూపాయి ఇవ్వలేదుగానీ, మెరుస్తున్న ఆఠానా జేబులోంచి తీసి ఆమెకి ఇచ్చాడు, సుల్తానా కూడా గమ్మున తీసేసుకుంది, దక్కిందే చాలనుకొని.
పద్దెనిమిదన్నర రూపాయలు మూడు నెలల్లో! ఆమె ఇంటి అద్దె ఒక్కటే నెలకి ఇరవై రూపాయలు. ఇంటి యజమాని ఇంటిని ఇంగ్లీషులో ఫ్లాట్ అని అనేవాడు. ఆ ఫ్లాట్‌లో పాయఖానా పక్కన ఒక గొలుసు వేలాడుతూ ఉండేది. అది లాగితే చాలు, నీళ్ళు ఒక్కసారిగా పడి పెద్దగా చప్పుడు చేసుకుంటూ నిండి కసువు అంతా కింద తూములోకి మాయమైపోయేది. మొదట్లో ఆ చప్పుళ్ళు ఆమెను భయపెట్టేవి. మొదటి రోజు ఆమె ఆ పాయఖానాలోకి వెళ్ళినప్పుడు ఆమెకు బాగా నడుము నొప్పిగా ఉండింది. పని అయ్యాక లేవడం కష్టమయింది. ఆ గొలుసు చూసి ‘ఇలాంటి ఇళ్ళు మాలాంటి వారికోసమే కదా కట్టింది. అందుకనే మా ఇబ్బందులన్నీ తెలిసి లేచేప్పుడు ఆసరా కోసం వేలాడదీసుంటార’నుకుంది. అలా అనుకొని ఆ గొలుసు పట్టుకుని పైకి లేవబోయింది. ఇంకేముంది, పైన కటకటమని కొట్టుకొని, నీళ్ళు ఒక్కసారిగా పెద్ద చప్పుడు చేసుకుంటూ వచ్చేసరికి ఆమె హడలిపోయి ఒక గావుకేక పెట్టింది.
ఖుదాబక్ష్ పక్క గదిలో తన ఫోటోగ్రాఫీ సామానంతా సర్దుకుంటూ ఒక కడిగిన బాటిలులో హైడ్రోకోనైన్ పోస్తుండగా వినిపించింది సుల్తానా కేక. పరిగెత్తుకుంటూ బయటకొచ్చి, సుల్తానాని అడిగాడు: “ఏమయ్యింది? నువ్వేనా అరిచింది?”
సుల్తానా గుండె దడదడా కొట్టుకుంటూనే ఉంది: “థత్ తెరీకీ! ఇది పాయఖానానా ఇంకేమన్నానా? మధ్యలో రైళ్ళల్లో ఉన్నట్టు ఈ గొలుసులేంటి? నాకు నడుం నొప్పిగా ఉందని, దీన్ని ఆసరాగా పట్టుకోని లేవబోయాను. కానీ ఈ మాయదారి గొలుసు లాగానో లేదో ఎంత రచ్చయ్యిందో నేనేం చెప్పను నీకు…”
అది విని ఖుదాబక్ష్ గట్టిగా నవ్వాడు. సుల్తానాకి ఆ పాయఖానా గురించి వివరంగా చెప్పాడు; ఇది కొత్త ఫాషనని, గొలుసు లాగగానే కసువంతా నాలా లోకి వెళ్ళిపోతుందని.
ఖుదాబక్ష్‌కి, సుల్తానాకి ఎలా సంబంధం కుదిరింది అన్నది ఒక పెద్ద కథ. ఖుదాబక్ష్ రావల్పిండికి చెందినవాడు. ఎంట్రన్స్ పాస్ అయ్యాక అతడు లారీ నడపడం నేర్చుకున్నాడు. ఓ నాలుగేళ్ళ వరకూ అతడు రావల్పిండి-కశ్మీరు మధ్య లారీ నడిపేవాడు. ఆ తర్వాత అతడికి ఒక కశ్మీరీ అమ్మాయి పరిచయమయ్యింది. ఆమెను తనతో లేపుకువచ్చాడు. లాహోరులో అతడికి పనేం దొరక్కపోయేసరికి ఆమెనే వ్యాపారానికి కూర్చోబెట్టాడు. రెండుమూడేళ్ళు ఇలానే గడిచాయి. ఆ తర్వాత ఆమె ఇంకెవరితోనే లేచిపోయింది. ఖుదాబక్ష్‌కి ఆమె అంబాలాలో ఉందని చూచాయగా తెలిసింది. ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు, అక్కడ సుల్తానా దొరికింది. సుల్తానాకి అతడు నచ్చాడు. అలా వాళ్ళిద్దరి మధ్య సంబంధం కుదిరింది.
ఖుదాబక్ష్ వస్తూనే సుల్తానా వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుంది. ఆమెకు నమ్మకాలు అవీ కాస్త ఎక్కువ. ఖుదాబక్ష్ దేవుడు లాంటివాడనీ, అందుకే అతడు వచ్చాక వ్యాపారం ఇంతగా జోరందుకుందనీ అనుకునేది. అతణ్ణి గొప్ప అదృష్టంగా భావించేది. అలా అతగాడి విలువ ఆమె దృష్టిలో పెరిగిపోయింది.
ఖుదాబక్ష్ కష్టజీవి. రోజంతా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం అతడికి నచ్చేది కాదు. ఖాళీగా ఉండకుండా ఎలాగోలా ఒక ఫోటోగ్రాఫరుతో స్నేహం కట్టాడు. రైల్వే స్టేషను బయట ఉండి మినిట్ కెమేరాతో ఫోటోలు తీసి ఇచ్చే అతనికి దోస్తు అయ్యాడు. అతడి దగ్గర ఫోటోలు తీయడం నేర్చుకున్నాడు. తర్వాత సుల్తానా నుండి అరవై రూపాయలు అప్పు తీసుకొని కెమేరా కూడా కొన్నాడు. మెల్లిమెల్లిగా ఒక తెర చేయించాడు. రెండు కుర్చీలు, ఫోటోలు కడగడానికి కావాల్సిన అన్ని సామాన్లు సమకూర్చుకుంటూ మొత్తానికి తన పని మొదలుపెట్టాడు.
ఫోటోల పని బాగా నడిచింది. అతడు కొద్ది కాలానికే తన అడ్డాను అంబాలా ఛావనీలో కుదుర్చుకున్నాడు. ఇక్కడ అతడు తెల్లవాళ్ళ ఫోటోలు తీసేవాడు. ఒక నెల లోపే అతడికి అంబాలా ఛావనీలో లెక్కలేనంతగా ఉన్న తెల్లదొరలంతా పరిచయమైపోయారు. సుల్తానాని కూడా అక్కడికే తీసుకెళ్ళాడు. అలా ఛావనీలో ఖుదాబక్ష్ వల్ల తెల్లవాళ్ళంతా సుల్తానాకి రోజుఖాతాదారులయ్యారు.
సుల్తానా చెవులకి దుద్దులు చేయించుకుంది. ఐదున్నర తులాలవి ఎనిమిది గాజులు చేయించుకుంది. పది పదిహేను మంచి మంచి చీరలు కొనుక్కుంది. ఇంటిలోకి ఫర్నీచర్ వగైరా కూడా చేయించింది. ఒక ముక్కలో చెప్పాలంటే అంబాలా ఛావనీలో ఆమె జీవితం హాయిగా గడుస్తుండేది. కానీ ఉన్నట్టుండి ఎందుకో ఖుదాబక్ష్ మనసులో ఢిల్లీకి వెళ్ళాలన్న పట్టు మొదలయ్యింది. సుల్తానా కాదనలేదు కదా. ఖుదాబక్ష్ పక్కన ఉంటే చాలు వ్యాపారం ఎక్కడైనా జోరుగా సాగుతుంది. అందుకని ఆమె సంతోషంగానే ఒప్పుకుంది ఢిల్లీ వెళ్ళడానికి. పైగా అంత పెద్ద ఊర్లో, లార్డ్ సాహెబ్ లాంటివాళ్ళు ఉండే చోట, తన దందా ఇంకా బాగా నడుస్తుందని ఆమె అనుకుంది. ఆమె స్నేహితురాళ్ళు ఢిల్లీని పొగడ్డం ఆమె విన్నది. అక్కడ హజరత్ నిజాముద్దీన్ ఔలియా దర్గా కూడా ఉంది. ఆమెకు ఆ దర్గా అంటే బాగా నమ్మకం. అందుకని త్వరత్వరగా ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద సామాన్లన్నీ అమ్మేసి ఆమె ఖుదాబక్ష్‌తో పాటు ఢిల్లీకి వచ్చేసింది. ఇక్కడికొచ్చాక ఖుదాబక్ష్ నెలకి ఇరవై రూపాయల అద్దెకి ఒక ఫ్లాట్ తీసుకున్నాడు, దానిలో ఇద్దరూ ఉంటున్నారు ఇప్పుడు.
ఒకటే పొడుగాటి రోడ్డు. దానికానుకుని ఒకవైపు ఒకే రకం మూడంతస్తుల మేడలు వరుసాగ్గా ఒకదానికొకటి ఆనుకొని వుంటాయి. మొదటి అంతస్తులో అన్నీ దుకాణాలు, పైన రెండు అంతస్తుల్లో ఒక్కోదానిలో రెండేసి ఫ్లాట్‌లు. మునిసిపల్ కమిటీవారు ఈ ప్రాంతాన్ని వేశ్యలకని ప్రత్యేకంగా కేటాయించారు, వాళ్ళు నగరంలో ఎక్కడబడితే అక్కడ తమ అడ్డాలు మొదలుపెట్టకుండా ఉంటారని. అన్ని మేడలూ ఒకే రకంగా ఉండడంతో మొదట్లో సుల్తానాకి తన ఫ్లాట్ వెతుక్కోవడం చాలా కష్టమయ్యేది. కానీ కింద లాండ్రీవాడు ఇంటి ఎదురుగా బోర్డు వేలాడదీసేసరికి ఆమెకి ఒక బండ గుర్తు దొరికింది. ‘ఇక్కడ మురికి బట్టలు ఉతకబడును’ అన్న బోర్డు చదవగానే ఆమెకి తన ఫ్లాట్ తెలిసిపోయేది. ఇలానే ఆమె ఇంకా ఎన్నో గుర్తులు పెట్టుకుంది. పెద్ద పెద్ద అక్షరాలతో ‘బొగ్గుల దుకాణం’ అని రాసున్న చోట, ఆమె స్నేహితురాలు హీరాబాయి ఉంటుంది, ఆమె అప్పుడప్పుడూ పాటలు పాడడానికి రేడియో స్టూడియోకి వెళ్ళేది. ‘ఇక్కడ పురుషులకోసం భోజనం తయారు’ అని రాసున్న చోటున ఆమె ఇంకో స్నేహితురాలు ముఖ్తార్ ఉండేది. నవారు పట్టీలు తయారుచేసే కార్ఖానా పైన అన్వరీ ఉండేది, ఆమెను ఆ కార్ఖానా సేటే ఉంచుకున్నాడు; సేటు సాహెబు రాత్రి పూట కార్ఖానా చూసుకోవాల్సి రావడంతో అతడు అన్వరీ దగ్గరే ఉండేవాడు.
దుకాణం తెరిచిన కొత్తల్లో కస్టమర్లు కొద్దిమందే ఉంటారు. రానూ రానూ పెరుగుతారు. అదే అనుకున్న సుల్తానా ఒక నెల పాటు ఖాళీగానే ఉండాల్సి వచ్చినప్పుడు కుదురుగానే ఉంది. కాని, రెండు నెలలు గడిచాక కూడా ఎవరూ రాకపోయేసరికి ఆమెకు కొద్దిగా దిగులు పట్టుకుంది. మూడో నెలలో ఆమె ఖుదాబక్ష్‌తో అదే అంది: “బైట బజారు మందకొడిగా ఉందని తెలుసు కాని, మరీ నెలరోజుల్లో ఒక్క కస్టమరూ రానంత మందకొడిగా ఉందా? ఏమవుతోందంటావు?”
ఖుదాబక్ష్‌ని కూడా ఈ విషయం చాలా రోజులనుండి నమిలేస్తోంది గాని, అతడు దాని ఊసు ఎత్తలేదు ఇప్పటిదాకా. కానీ సుల్తానా అడిగినప్పుడు మాత్రం నోరు విప్పక తప్పలేదు. “నేను చాలా రోజులనుండి ఈ సంగతి గురించి ఆలోచిస్తున్నాను. ఒకటి అర్థమవుతోంది. యుద్ధం కారణంగా బాబూలు, అయ్యలు వేరే వ్యాపారాలు మొదలెట్టి మన ఇంటి దారి మర్చిపోయినట్టున్నారు… లేదూ, ఇంకో సంగతేంటంటే…” అతడింకా ఏదో చెప్పబోయేలోపే ఎవరో మెట్లు ఎక్కుతున్న అలికిడి అయ్యింది. ఖుదాబక్ష్, సుల్తానా అటువైపుకి చూశారు. కొద్దిసేపటికి తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. ఖుదాబక్ష్ ఒక్క అంగలో వెళ్ళి తలుపు తెరిచాడు. ఒక మగమనిషి లోపలికి వచ్చాడు. ఇతడే మొదటి కస్టమరు, మూడు రూపాయలకి బేరం కుదుర్చుకున్నవాడు. ఆ తర్వాత అదే నెలలో ఇంకో ఐదుగురు వచ్చారు. అంటే, మూడు నెలల్లో ఆరుగురు, వాళ్ళ నుండి సుల్తానా పద్దెనిమిదిన్నర రూపాయలు వసూలు చేసింది.
ఇరవై రూపాయలు ఫ్లాటు అద్దెకే వెళ్ళిపోతుంది; దానిపైన నీళ్ళ టాక్సు, కరెంటు బిల్లు. ఇవి కాకుండా ఇంట్లో ఖర్చులు; తిండి-నీళ్ళు, బట్టలు-గిన్నెలు, మందు-మాకు. ఆదాయం మాత్రం ఏమీ లేదు. పద్దెనిమిదిన్నర రూపాయలు మూడు నెలల్లో సంపాదిస్తే ఏమైనా అనండి కాని దాన్ని ఆదాయమని మాత్రం అనరు కదా! సుల్తానా పరేషానీ పెరుగుతూనే ఉంది. ఐదున్నర తులాల ఎనిమిది గాజులు, ఆమె అంబాలాలో చేయించుకున్నవి, మెల్లిమెల్లిగా అమ్ముడు పోయాయి. చివరి గాజు వంతు కూడా వచ్చేసరికి ఆమె ఖుదాబక్ష్‌తో అంది: “నా మాట విను. పద, అంబాలాకు వాపసు పోదాం. ఇక్కడేం ఖజానాలు ఉన్నాయని? ఉన్నా కూడా, ఈ నగరం మనకి అచ్చి రాలేదు. నీ పని కూడా అక్కడ బాగా నడిచేది. పద, అక్కడికే పోదాం. నష్టపోయినదంతా మన తలరాత అనుకుందాం. ఈ గాజుని అమ్ముకొని రా! సామాను గట్రా అన్నీ చుట్టి తయారుగా ఉంచుతాను. ఇవ్వాళ రాత్రి బండికే వెళ్ళిపోదాం…”
ఖుదాబక్ష్ ఆమె చేతి నుండి గాజు మాత్రం తీసుకున్నాడు. తీసుకొని, అన్నాడు: “లేదు జానేమన్, అంబాలా వెళ్ళం. ఇక్కడే ఢిల్లీలో ఉండి సంపాదిద్దాం. ఈ గాజులు అన్నీ ఇక్కడే తిరిగి వస్తాయి. అల్లా మీద నమ్మకముంచు. మనకి ఏదో ఒక దారి దొరక్కపోదు.”
సుల్తానా ఎదురు చెప్పలేదు. ఆఖరి గాజు కూడా చేతి నుండి తీసేసింది. మొండి చేతులు చూసుకుంటే ఆమెకు చాలా బాధేసింది, కానీ ఏం చేస్తుంది, ఏదో రకంగా పొట్ట నింపుకోవాలిగా.
ఐదు నెలలు గడచిపోయాక కూడా ఖర్చుతో పోలిస్తే వచ్చే ఆదాయం నాలుగోవంతు కన్నా తక్కువ ఉండడంతో సుల్తానా దిగులు ఇంకా పెరిగిపోయింది. ఖుదాబక్ష్ కూడా ఇప్పుడు రోజంతా ఇంటినుండి మాయమైపోతున్నాడు. సుల్తానాకి దీని గురించి కూడా బాధ. చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు ఆడ స్నేహితులున్నారామెకు. ఆమె వారితో సమయం గడపవచ్చు. కానీ రోజూ అలా వెళ్ళడం, వెళ్ళి గంటల తరబడి కూర్చోవడం ఆమెకి ఇబ్బందిగా అనిపించింది. రానురాను ఆ స్నేహితురాళ్ళని కలవడం, మాట్లాడ్డం మొత్తంగా తగ్గించేసింది. రోజంతా ఆమె తన ఇంట్లో కూర్చుని ఉండేది. వక్కలు దంచుతూ, చిరిగిపోయిన తన పాత బట్టలు కుట్టుకుంటూ ఉండేది. అప్పుడప్పుడూ బయటకొచ్చి బాల్కనీలో పిట్టగోడను ఆనుకుని నిలబడి, ఎదురుగా ఉన్న రైల్వేషెడ్‌లోకి వచ్చీ పోయే రైలు ఇంజన్లను గంటల తరబడి చూస్తూ ఉండేది.
రోడ్డుకి అవతల కుడివైపున ఆ మూల నుండి ఈమూల దాకా ఒక పెద్ద గోదాము ఉండేది. దాని ఇనుపకప్పు కింద పెద్దపెద్ద ఇనుపపిడులు, ఇంకా అన్ని రకాల సామానులు గుట్టలుగా పోసి ఉండేవి. ఎడమవైపంతా ఒక వెడల్పాటి మైదానం, దానిలో బోలెడన్ని రైలు పట్టాలు వేసి ఉండేవి. ఎండలో ఈ ఇనుప పట్టాలు మెరుస్తుంటే, సుల్తానా తన చేతుల వంక చూసుకునేది. వాటిపై నీలంగా నరాలు అచ్చంగా ఆ పట్టాలలానే ఉబ్బెత్తుగా ఉండేవి. ఆ పొడుగాటి మైదానంలో ఎప్పుడూ రైళ్ళూ, ఇంజన్లూ నడుస్తూ ఉండేవి, అటు కొన్నిసార్లు, ఇటు కొన్నిసార్లు. ఆ ఇంజన్లు, బండ్ల ఛక్-ఛక్ ఫక్-ఫక్ చప్పుళ్ళు ఎప్పుడూ ఇంట్లో తిరుగాడుతుండేవి. పొద్దున్నే ఆమె లేచి బాల్కనిలోకి వచ్చినప్పుడల్లా ఒక వింత దృశ్యం కళ్ళకి కనిపించేది. గోదాము మీద, మైదానం మీద పొగమంచు పట్టివుండేది. ఆ పొగమంచులో ఇంజను నోటినుండి చిక్కటి పొగ పైకి వెళ్తూంటే లావుపాటి మనుషులు ఆకాశం వైపు పోతున్నట్టు అనిపించేది. ఇంజన్ల తలనుంచి హడావిడిగా తన్నుకొచ్చే ఆవిరి, మేఘాల్లా పెరిగి రెప్పపాటులో గాలిలో కలిసిపోయేది. ఒక్కొక్కప్పుడు, ఇంజను ఒక చిన్న ధక్కా ఇచ్చి వదిలేసిన రైలు డబ్బా ఒంటరిగా పట్టాలపై పోతూ కనిపిస్తే ఆమెకి తనే గుర్తుకొచ్చేది: ఆమె జీవితాన్ని కూడా ఎవరో పట్టాలపై ఒక తోపు తోసి వదిలేశారు. ఆమె అలా వెళుతోంది. ఆమె జీవితపు బండిని ఇంకెవరో నెడుతున్నారు, ఆమె పట్టాలు మారుతూ పోతోంది, తన ప్రమేయం లేకుండా. ఎక్కడికో మరి? ఏదో ఒక రోజు వస్తుంది, ఆమెను తోసిన తోపు మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది, ఆమె ఎక్కడో ఆగిపోతుంది, ఆమె బాగోగులు కూడా పట్టించుకోడానికి ఎవరూ ఉండని ఏదో ఒక చోట.
సుల్తానా ఇలా ఊరికే గంటల తరబడి ఈ వంకర టింకర పట్టాలను, ఆగివున్నవి, నడుస్తున్నవి ఇంజన్లను చూస్తున్న కొద్దీ ఆమెకు ఏవేవో ఆలోచనలు వస్తుండేవి. అంబాలా ఛావనీలో ఉన్నప్పుడు కూడా స్టేషనుకి దగ్గర్లోనే ఆమె ఇల్లు ఉండేది గానీ, అప్పుడు వాటిని ఈ రకంగా చూడలేదు. ఇప్పుడేమో ఆమెకి ఇలా కూడా అనిపిస్తుంది: ఎదురుగా ఉన్న ఈ రైలు పట్టాలు ఒక వల. పైకి లేస్తున్న ఆ పొగ, ఆవిరి తానున్న సానివాడ. ఎన్నో బండ్లు ఉండేవి, వాటిని లావుపాటి పెద్ద ఇంజన్లు ధక్కా ఇస్తూ అటు ఇటు తోస్తూ ఉండేవి. అప్పుడామెకి అవి అంబాలాలోని సేట్‌జీల్లా అనిపించేవి. అప్పుడప్పుడూ ఆగివున్న రైలు డబ్బాల వరుసల మధ్య ఒక ఇంజను నిదానంగా వెళ్తూ ఉంటే, ఆమెకి తమ బజారులో పైకి చూస్తూ చిన్నగా నడిచి వెళ్తున్న మగవాళ్ళలా అనిపించేది.
సుల్తానాకి తెలుసు ఇలా ఆలోచించడం బుర్రను పాడు చేసుకోవడమేనని. ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయనే బాల్కనీ వైపు వెళ్ళడం మానేసింది. ఖుదాబక్ష్‌తో ఎన్నోసార్లు అంది: “చూడు, నా మీద కొంచెం జాలిపడు. ఇంట్లో ఉంటుండు కాసేపైనా. నేను రోజంతా జబ్బు పట్టినదానిలా ఇంట్లోనే పడుంటున్నాను.” కానీ అతడు ప్రతిసారి సుల్తానాను ఇలా సముదాయించేవాడు: “జానేమన్! నేను బయట ఏదైనా సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాను. అల్లా అనుకుంటే కొద్ది రోజుల్లోనే మనం గట్టెక్కిపోతాం.”
మొత్తం ఐదు నెలలు గడిచాయి, కానీ ఇప్పటి వరకూ సుల్తానా గట్టెక్కలేదు, ఖుదాబక్ష్ కూడా. మొహరమ్ నెల నెత్తిమీదకు వస్తుంది, సుల్తానా దగ్గరేమో నల్లబట్టలు కుట్టించుకోడానికి ఏమీ లేవు. ముఖ్తార్ చక్కగా లేడీ హామిల్టన్‌లా ఒక కొత్త కమీజ్ కుట్టించుకుంది, చేతులు జార్జెట్టుతో చేసినవి. దానికి మాచింగ్‌గా ఆమె దగ్గర కాటుకలా మెరిసిపోయే నల్ల సల్వారు ఉంది. అన్వరీ సిల్కు జార్జెటు చీర కొనుక్కుంది. ఆ నల్ల చీర కింద తెల్ల బొస్కీ పెటీకోటు వేసుకుంటానని ఆమె సుల్తానాతో చెప్పింది, ఇప్పుడు అదే ఫాషన్ అని. ఆ చీరతో పాటు వేసుకోడానికి వెల్వెట్ చెప్పులు కూడా తీసుకుంది. నాజుగ్గా ఉన్నాయవి. ఇవ్వన్నీ చూశాక సుల్తానాకి మొహరమ్‌కి ఇలాంటి బట్టలు కొనుక్కునే తాహతు తనకి లేదని అర్థమయ్యింది.
అన్వరీ, ముఖ్తార్‌ల దగ్గర వాళ్ళ బట్టలు చూసి ఆమె ఇంటికి వచ్చేసరికి మనసంతా దిగులుగా అయ్యింది. ఆమెకి తన లోపల ఏదో కణితి మొలిచినట్టు అనిపించింది. ఇల్లంతా ఖాళీగా ఉంది. ఖుదాబక్ష్ ఎప్పటిలానే ఇంట్లో లేడు. ఆమె చాలాసేపటి వరకూ తివాచీ పైన దిండు మీద తల పెట్టుకొని పడుకుంది. కాసేపటికి దిండు ఎత్తువల్ల మెడ పట్టేసినట్టయి లేచి, తన దిగులు పోగొట్టుకోవడానికని బయట బాల్కనీలోకి వచ్చి నుంచుంది.
ఎదురుగా పట్టాల మీద బండ్ల డబ్బాలు ఆగి వున్నాయి, కానీ ఇంజన్లు ఏమీ లేవు. సాయంకాలం అయింది. రోడ్లపై దుమ్ము రేగకుండా మునిసిపాలిటీ వాళ్ళు వచ్చి నీళ్ళు చల్లి వెళ్ళారు. బజారులో మగవాళ్ళు అటూ ఇటూ జాగ్రత్తగా చూసి తమ ఇళ్ళ వైపు వెళ్ళడానికి తయారవుతున్నారు. అలాంటి మగమనిషి ఎవరో తలపైకెత్తి సుల్తానా వైపు చూశాడు. సుల్తానా కూడా చూసి నవ్వి, అతని గురించి మర్చిపోయింది. ఎదురుగా పట్టాలపై ఒక ఇంజను వచ్చేసరికి, సుల్తానా శ్రద్ధగా దాని వైపు చూడ్డం మొదలెట్టింది. మెల్లిమెల్లిగా ఇంజను కూడా నల్ల బట్టలు వేసుకునుందని ఆమెకు ఒక ఊహ వచ్చింది. ఈ వింత ఊహను బుర్రలోంచి తీసేయడానికి ఆమె కళ్ళు తిప్పుకుని రోడ్డు మీదకు చూసింది. ఆ మనిషే ఎండ్లబండి దగ్గర నుంచొని కనిపించాడు, ఆమెను ఇందాక కోరికగా చూసిన మనిషి. సుల్తానా అతడికి చేతితో సైగ చేసింది. అతడు అటూ ఇటూ చూసి మళ్ళీ సైగ చేశాడు: ఎటునుండి రాను? సుల్తానా అతడికి దారి చెప్పింది. అతడు కొంతసేపు అక్కడే నిల్చొని ఉన్నాడు, కానీ తర్వాత వేగంగా పైకి వచ్చాడు.
సుల్తానా అతణ్ణి తివాచీపై కూర్చోబెట్టింది. అతడు కూర్చున్నాక, ఆమె మాటామంతీ మొదలెట్టడానికి అడిగింది: “మీరు పైకి రావడానికి భయపడ్డారెందుకు?”
అతడు ఆమె మాటలకి నవ్వాడు: “నీకెలా తెల్సూ? భయపడ్డానికేముంది?”
“ఎందుకన్నానంటే మీరు పైకి రాకుండా చాలాసేపు కిందనే నించొని ఉన్నారు. ఏదో ఆలోచించుకొని ఇక్కడికి వచ్చారు.”
అది విని అతడు మళ్ళీ నవ్వాడు: “నీకు తప్పుగా అర్థమయింది… నేను మీ పైన ఫ్లాటువైపు చూస్తూ ఉన్నాను. అక్కడ ఒక ఆడామె నుంచొని ఎవరో మగవాడికి నాలుక చూపి వెక్కిరిస్తోంది. నాకు అది నచ్చింది. అప్పుడే బాల్కనీలో ఆకుపచ్చ రంగు బల్బు వెలిగేసరికి నేను దాన్నే చూస్తుండిపోయాను. నాకు ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం. కంటికి బాగా అనిపిస్తుంది…” ఇది చెప్పి అతడు గదిని క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. తర్వాత లేచి నుంచున్నాడు.
సుల్తానా అడిగింది: “మీరు బయలుదేరుతున్నారా?”
అతను జవాబు ఇచ్చాడు: “లేదు. నేను మీ ఇంటిని చూడాలనుకుంటున్నాను. రా, నాకు అన్ని గదులు చూపించు…”
సుల్తానా అతడికి ఒక్కొక్కటిగా మూడు గదులూ చూపించింది. ఆ మనిషి మౌనంగా ఇల్లంతా జాగ్రత్తగా పరిశీలించాడు. వాళ్ళిద్దరు మళ్ళీ ఆ గదిలోకే వచ్చాక, అతడు ముందు కూర్చుండిపోయాడు. తర్వాత అన్నాడు: “నా పేరు శంకర్.”
సుల్తానా మొదటిసారిగా శంకర్‌ని నిశితంగా చూసింది. అతడు మామూలు పొడుగు, మామూలు మొహం ఉన్న మనిషి. కానీ అతడి కళ్ళు తెల్లగా, స్వఛ్ఛంగా ఉన్నాయి. అప్పుడప్పుడు ఆ కళ్ళల్లో ఒక వింతైన మెరుపు కనిపిస్తుంది. దట్టమైన, కసరత్తు చేసిన శరీరం. నుదుటి వద్ద జట్టు తెల్లబడుతోంది. ఊదా రంగు ఊలు పాంటు వేసుకున్నాడు. తెల్ల చొక్కా, కాలర్ మెడ మీద లేచి నుంచునుంది.
శంకర్ తివాచీపై కూర్చున్న పద్ధతి చూస్తే కస్టమరు అతడు కాదు, సుల్తానా అని అనిపిస్తుంది. అది గమనించి సుల్తానా తడబడింది. అది కప్పిపుచ్చుకోటానికి ఆమె శంకర్‌తో అంది: “చెప్పండి.”
శంకర్ కూర్చున్నవాడు కాస్తా ఇది విని తివాచీ మీదకు వాలి మోచేతి మీద ఆనుకుని అన్నాడు: “నేనేం చెప్తాను, నువ్వే ఏదో ఒకటి చెప్పు. నన్ను రమ్మంది నువ్వే కదా …”
సుల్తానా ఏమీ అనకపోయేసరికి అతడు లేచి కూర్చున్నాడు: “నాకు అర్థమయ్యింది… అయితే నేను చెప్పేది విను. నువ్వు ఏదైతే అనుకున్నావో, అది తప్పు. నేను అలాంటి మనిషిని కాను, ఏదోవొకటి ఇచ్చి వెళ్ళేవాళ్ళలా కాదు. డాక్టర్లలా నేను కూడా ఫీజు తీసుకుంటాను. నన్ను పిలిస్తే, నాకు ఫీజు ఇవ్వాల్సి వస్తుంది…”
సుల్తానా ఇది విని ఖంగు తిన్నది కానీ ఆమెకి ఆపుకోలేనంత నవ్వు కూడా వచ్చింది: “మీరేం పని చేస్తారు?”
శంకర్ బదులిచ్చాడు: “అదే, నీలాంటి వాళ్ళు చేసే పనే!”
“ఏంటి?”
“నువ్వేం చేస్తుంటావ్?”
“నే.. నేనా… నేనేం చెయ్యను.”
“నేను కూడా ఏమీ చేయను.”
“ఇదేం ముచ్చట! మీరు ఏదోవొకటి చేస్తుండచ్చు.”
శంకర్ చాలా నిదానంగా బదులిచ్చాడు: “నువ్వు కూడా ఏదో ఒకటి చేస్తుండచ్చుగా?”
“నేను కాలక్షేపం చేస్తుంటాను.”
“నేను కూడా కాలక్షేపం చేస్తుంటాను.”
“అయితే రా, ఇద్దరం కలిసి కాలక్షేపం చేద్దాం.”
“నేను తయారే! కాని కాలక్షేపానికి నేనెప్పుడూ ఖరీదు ఇచ్చుకోను.”
“మతుండే మాట్లాడుతున్నావా? ఇదేం లంగర్‌ఖానా కాదు.”
“నేను కూడా వాలంటీరును కాను.”
సుల్తానా ఆగిపోయింది. ఆమె అడిగింది: “ఈ వాలంటీరు అని ఎవర్ని అంటారు?”
“దద్దమ్మా!”
“నేనేం దద్దమ్మను కాను.”
“కానీ నీతో పాటుండే ఖుదాబక్ష్ ఖచ్చితంగా దద్దమ్మే!”
“ఎందుకు?”
“ఎందుకంటే, అతను కొన్నాళ్ళబట్టీ ఒక ఫకీరు దగ్గరకి తన జాతకం బాగుపడుతుందని వెళ్తున్నాడు, ఆ ఫకీరు జాతకమే తుప్పు పట్టిన తాళంలా మూసుకుపోయుంది.” శంకర్ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు.
“నువ్వు హిందువువి కాబట్టే మా ఫకీర్లను అలా మజాక్ చేస్తున్నావు.”
శంకర్ నవ్వాడు: “ఇక్కడ హిందూ లేదూ ఇస్లామ్ లేదూ. పెద్దపెద్ద పండితులు, మౌల్వీలు కూడా ఇక్కడకి వస్తే మర్యాదస్తులైపోతారు.”
“ఏం తలతిక్కవాగుడో ఏంటో… చెప్పు, ఉంటావా, ఉండవా?”
“ఉంటాను కాని, ముందు చెప్పిన షరతు మీదే!”
సుల్తానా లేచి నిలుచుంది: “అయితే వెళ్ళు, నీ దారి నువ్వు చూసుకో…”
శంకర్ తీరిగ్గా లేచి, పాంటుకు ఉన్న రెండు జేబుల్లో రెండు చేతులూ జొప్పించి, వెళ్తూ వెళ్తూ అన్నాడు: “నేను అప్పుడప్పుడూ ఈ బజారులో తిరుగుతుంటాను. నీకు ఏవైనా అవసరం పడితే నన్ను పిలిపించు. నేను పని బాగా చేస్తాను.”
శంకర్ వెళ్ళిపోయాడు. సుల్తానా నల్ల దుస్తుల గురించి మర్చిపోయి, చాలాసేపు అతడి గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. అతడి మాటలు ఆమె బాధను కొంతవరకూ తగ్గించాయి. అతడు ఒకవేళ ఆమె సంతోషంగా ఉన్నప్పుడు అంబాలాకి వచ్చుండుంటే, అతణ్ణి ఇంకో లెక్క మీద చూసుండేది. అతణ్ణి గెంటుతూ బయటకు పంపించే అవకాశాలే ఎక్కువగా ఉండేవి. ఇక్కడామె బాగా దిగులుగా ఉన్నందున శంకర్ మాటలు ఆమెకి బాగా నచ్చేశాయి.
సాయంత్రం ఖుదాబక్ష్ వచ్చినప్పుడు సుల్తానా అతణ్ణి అడిగింది: “నువ్వు రోజంతా ఎక్కడికి మాయమైపోతున్నావ్?”
ఖుదాబక్ష్ అలసిపోయి ఉన్నాడు: “పురానా ఖిలా దగ్గరనుండి వస్తున్నాను. అక్కడో ఫకీర్‌సాబ్ కొన్ని రోజులుగా ఆగున్నాడు. అతడి దగ్గరకే రోజూ వెళ్తున్నాను. మన రోజులు బాగుపడాలని…”
“ఆయన ఏమైనా చెప్పారా నీకు?”
“లేదు. ఇంకా ఏం చెప్పలేదు, ఆయన దృష్టి నా మీద పడలేదింకా. కానీ సుల్తానా, నేను ఆయనకు చేస్తున్న సేవ, అది ఉత్తిగా పోదు. అల్లా మనల్ని కరుణిస్తాడు. మనం బాగుపడతాం.”
సుల్తానా మదిలో మొహరమ్ చేసుకోవాలన్న ఆలోచన నిండిపోయి ఉంది. ఆమెకు ఏడుపొచ్చింది. ఖుదాబక్ష్‌తో ఏడుపు గొంతుతో అంది: “నువ్వు రోజు రోజంతా బయటకి మాయమైపోతావ్. నేనిక్కడ పంజరంలో ఖైదీలాగా ఉంటున్నాను. ఎక్కడికీ వెళ్ళలేను. ఎక్కడికీ రాలేను. మొహరమ్ నెత్తి మీదకొచ్చేస్తుంది. నాకు నల్లబట్టలు కావాలన్న ధ్యాసైనా ఉందా నీకు? ఈడ్చితంతే అణా లేదు ఇంట్లో. ఉన్న గాజులూ ఒక్కోటిగా అమ్ముకోవడం అయ్యింది. ఇప్పుడు నువ్వే చెప్పు, ఎలానో… ఇలా ఫకీర్ల వెంట ఎప్పటివరకూ తిరుగుతూ ఉంటావ్? ఈ ఢిల్లీలో ఖుదా కూడా మనమంటే మొహం చాటేస్తున్నాడు. నా మాట విని నీ పని మొదలెట్టు. ఎంతో కొంత ఆసరాగా ఉంటుంది.”
ఖుదాబక్ష్ తివాచీ మీద పడుకొని అన్నాడు: “కానీ ఆ పని మొదలెట్టడానికి కూడా ఎంతో కొంత డబ్బు కావాలిగా… ఖుదా కోసమైనా, ఇలాంటి ఏడుపుగొట్టు మాటలు అనకు. వీటిని తట్టుకోవడం నా వల్ల కాదు. అంబాలా వదిలిరావడం నేను చేసిన పెద్ద తప్పు అని ఒప్పుకుంటున్నాను. కానీ, ఏది చేసినా అల్లానే చేస్తాడు, మన బాగు కోసం చేస్తాడు. ఏమో ఎవరికి తెల్సు, కొంతకాలం ఈ కష్టాలు అనుభవించాకా…”
సుల్తానా మధ్యలోనే అతడి మాట అడ్డుకుంది: “ఆ అల్లా కోసం నువ్వేం కావాలనుకుంటే అది చేస్కో. దొంగతనం చేయి, దోపిడి చేయి. నాకనవసరం. నాకో సల్వారు మాత్రం పట్టుకొనిరా. నా దగ్గర తెల్లరంగు బోక్సీ కమీజ్ ఉంది, దానికి రంగేయిస్తాను. కొత్త తెల్లటి నైలాను దుపట్టా కూడా ఉంది నా దగ్గర. అదే, నువ్వు దీపావళికి నాకు తెచ్చిచ్చింది. దానిక్కూడా కమీజుతో పాటు రంగు వేయడానికి ఇచ్చేస్తాను. ఒక్క సల్వారుకి మాత్రమే కొరత. అది ఎలానోలా ఎక్కడినుంచైనా సరే పుట్టించుకొని రా… చూడు, నా మీద ఒట్టే! ఏదో ఒకటి చేసి పట్టుకొని రా…. లేకుంటే కడుపు నిండా తింటావ్ నా చేతుల్లో.”
ఖుదాబక్ష్ లేచి కూర్చున్నాడు: “నువ్వెందుకిలా మొండి చేస్తున్నావ్. తెమ్మంటే మాత్రం నేనెక్కడ నుండి తెస్తాను… గింజ తినడానికి కూడా ఒక పైసా లేదు నా దగ్గర.”
“ఏమైనా చేయి… కానీ నాకు మాత్రం నాలుగున్నర గజాల నల్ల సాటిను బట్ట తెచ్చివ్వు.”
“దువా చేయి, ఈ రాత్రికే ఇద్దరు-ముగ్గురు మనుషులు రావాలని.”
“నువ్వు మాత్రం ఏమీ చేయవు. నువ్వనుకుంటే తప్పకుండా కాసిని పైసలు పుట్టించగలవు. యుద్ధానికి ముందు ఈ సాటిను గజానికి పన్నెండు-పధ్నాలుగు అణాలు ఉండేది, ఇప్పుడు రూపాయిపావలా లెక్కన దొరుకుతుంది. నాలుగున్నర గజాలకి ఎంత ఖర్చైపోతుంది?”
“నువ్వు అంటున్నావు కాబట్టి నేను ఏదో ఒకటి చేస్తాను.” ఖుదాబక్ష్ లేచాడు: “సరే, ఇప్పుడీ సంగతి మర్చిపో. నేను హోటల్ నుండి భోజనం తెస్తాను.”
హోటల్ నుండి భోజనం వచ్చింది. ఇద్దరూ కలిసి మొక్కుబడిగా తిని, నిద్రపోయారు. తెల్లారగానే ఖుదాబక్ష్ పురానా ఖిలా ఫకీరు దగ్గరకు వెళ్ళిపోయాడు. సుల్తానా ఒంటరిగా ఉండిపోయింది. కొంచెంసేపు పడుకుంది, కొంచెంసేపు నిద్రపోయింది. కొంచెంసేపు అటూ ఇటూ గదుల్లో తిరిగింది. మధ్యాహ్నం భోజనం చేశాక తన తెల్ల నైలాను దుప్పట్టా, తెల్ల బోక్సీ కమీజు తీసి, కింద లాండ్రీవాడికి రంగు వేయడానికి ఇచ్చి వచ్చింది. బట్టలు ఉతకడంతో పాటు అక్కడ రంగులు వేసే పని కూడా చేస్తారు. ఈ పని అయ్యాక ఆమె మళ్ళీ పైకి వచ్చి కాసిని సినిమా పుస్తకాలు చదివింది. ఆమె చూసిన సినిమాల కథలు, పాటలు ఉన్నాయి వాటిల్లో. ఆ పుస్తకాలు చదువుతూ చదువుతూ అలాగే నిద్రపోయింది. లేచేసరికి నాలుగైపోయింది, ఎండ వాకిట్లోంచి మోరీ వరకూ వచ్చి ఉంది. శుభ్రంగా స్నానం చేసి ఊలు దుప్పటి కప్పుకొని బాల్కనీలో నిల్చుంది. దాదాపుగా ఒక గంటసేపు ఆమె అలా బాల్కనీలో నిల్చుంది. ఇంతలో సాయంకాలమయ్యింది. లైట్లు వెలగటం మొదలెట్టాయి.
కింద రోడ్డు మీద వెలుతురు పరుచుకుంది. చలి పెరిగింది గానీ ఆ సంగతి సుల్తానాకు కొంచెం కూడా తెలియలేదు. రోడ్డు మీద వస్తూ పోతున్న టాంగాలు, మోటర్ల వైపు ఎంతోసేపు అలా చూస్తూ ఉండిపోయింది. ఉన్నట్టుండి ఆమెకు శంకర్ కనిపించాడు. ఇంటి కిందకు వచ్చి మెడ ఎత్తి చూస్తూ, సుల్తానాని చూసి నవ్వాడు. సుల్తానా అప్రయత్నంగా చేత్తో సైగ చేసి, అతణ్ణి పైకి రమ్మంది.
శంకర్ పైకి వచ్చాక అతడికి ఏం చెప్పాలా అని సుల్తానా సతమతమయింది. నిజానికి ఆమె ఏమీ ఆలోచించకుండా సైగ చేసింది. శంకర్ మాత్రం అదేదో తన ఇల్లే అయినట్టు ఏ ఇబ్బందీ లేకుండా ఉన్నాడు. ముందటి రోజులానే దిండుపై తలవాల్చి పడుకున్నాడు.
సుల్తానా చాలాసేపటివరకూ ఏమీ అనకపోయేసరికి అతడే అన్నాడు: “నువ్వు నన్ను వందసార్లు పిలవచ్చు, వందసార్లు వెళ్ళిపోమనచ్చు… నేను ఇలాంటి విషయాలపై కోపం తెచ్చుకోను.”
సుల్తానాకి ఏమనాలో పాలుపోలేదు: “లేదు కూర్చో, నిన్ను వెళ్ళమని ఎవరన్నారు?”
దీనికి శంకర్ నవ్వాడు: “అయితే నా షరతులు నీకు మంజూరేనా?”
“ఏం షరతులు?” సుల్తానా నవ్వుతూ అంది: “ఏం, నిఖా గానీ చేసుకుంటున్నావా నన్ను?”
“నిఖా, పెళ్ళి, ఏంటవీ? నువ్వు జీవితాంతం ఎవరినీ పెళ్ళి చేసుకోలేవు, నేనూ చేసుకోలేను. ఈ సంప్రదాయాలన్నీ మనలాంటి వాళ్ళ కోసం కాదు. వదిలేయ్ ఈ ఊసుపోని కబుర్లు. ఏదైనా పనికొచ్చే మాట చెప్పు,”
“చెప్పు… ఏం మాట్లాడను?”
“నువ్వు ఆడదానివి… ఓ రెండు గంటలు మంచిగా హాయిగా ఏవైనా కబుర్లు చెప్పు. ఈ ప్రపంచంలో దందా ఒక్కటే దందా కాదు, ఇంకా వేరేవీ ఉన్నాయి…”
ఆమాట అనడంతో సుల్తానా మనసుకు శంకర్ నచ్చాడు. అడిగింది: “సూటిగా చెప్పు, నీకేం కావాలో?”
శంకర్ లేచి కూర్చున్నాడు: “వేరేవారికి కావాల్సిందే.”
“నీకూ, వాళ్ళకూ మధ్య తేడా ఏముంటుంది?”
“నీకూ నాకూ మధ్య ఎలాంటి తేడా లేదు. వాళ్ళకూ నాకూ నింగీ నేలకి ఉన్నంత తేడా ఉంది. చాలా విషయాలుంటాయి, వాటిని చెప్పకూడదు, అర్థం చేసుకోవాలంతే…”
సుల్తానా కాసేపు శంకర్ అన్న ఈ మాటను అర్థం చేసుకోడానికి ప్రయత్నించాక, అంది: “నాకు అర్థమయ్యింది.”
“అయితే చెప్పు, నీ ఉద్దేశ్యమేంటి?”
“నువ్వు గెలిచావ్. నేను ఓడిపోయాను. కానీ చెప్తున్నానుగా, ఇప్పటివరకూ ఇలాంటి మాట ఎవరూ ఒప్పుకొని ఉండరు.”
“నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఈ ప్రాంతంలోనే నీకు ఇలాంటి సాదాసీదా ఆడవాళ్ళు బోలెడంతమంది దొరుకుతారు, వాళ్ళెప్పటికీ ఒప్పుకోలేరు ఆడది ఇలాంటి నీచమైన పనికి ఒప్పుకుంటుందంటే, అదే నువ్వేమీ ఆలోచించకుండా ఒప్పుకునే పని. వాళ్ళు ఒప్పుకోకపోయినా మీలాంటి వాళ్ళు వేల సంఖ్యల్లో ఉన్నారుగా… నీ పేరు సుల్తానా కదూ?”
“సుల్తానానే.”
శంకర్ లేచి నించుని నవ్వడం మొదలుపెట్టాడు: “నా పేరు శంకర్. పేర్లు కూడా భలే అర్థంపర్థం లేకుండా ఉంటాయి. సరే పద, లోపలికి పద…”
శంకర్, సుల్తానా తివాచీ ఉన్న గదిలోకి వాపసు వచ్చేసరికి నవ్వుతూ ఉన్నారు, దేని గురించో మరి. శంకర్ బయలుదేరుతుండగా సుల్తానా అంది: “శంకర్, నేనొకటి అడగనా?”
“ముందు అడుగు.”
సుల్తానా కొంత మొహమాటపడింది: “నువ్వు నేను రేటు వసూలు చేస్తున్నాననుకుంటావేమో గానీ…”
“చెప్పు చెప్పు… ఆగిపోయావేం?”
సుల్తానా తెగించి అడిగింది: “సంగతేంటంటే… మొహరమ్ వచ్చేస్తుంది, నా దగ్గర కాలీ సల్వారు కొనుక్కునేంత డబ్బులు లేవు. ఇక్కడి కష్టాలన్నీ నీకు చెప్పుకొచ్చాను. కమీజు, దుపట్టా నా దగ్గరున్నాయి. వాటిని ఇవ్వాళ రంగు వేయించడానికి ఇచ్చాను.”
“నువ్వు నల్ల సల్వారు కుట్టించుకోడానికి కొన్ని రూపాయలు ఇవ్వమంటావ్,”
“లేదు, లేదు. నా ఉద్దేశ్యం అది కాదు. నీకు వీలైతే నాకో కాలీ సల్వారు తెచ్చిపెట్టు.”
శంకర్ నవ్వాడు: “నా జేబులో పొరపాటున కూడా ఎప్పుడూ ఏమీ ఉండదు. అయినా నేను ప్రయత్నిస్తాను. మొహరమ్ మొదటి రోజున నీకు కాలీ సల్వార్ దొరుకుతుంది. ఊఁ, ఇక నవ్వుతావా?”
సుల్తానా దుద్దులవైపు చూసి అడిగాడు: “నువ్వు ఈ దుద్దులు నాకివ్వగలవా?”
సుల్తానా నవ్వింది: “నువ్వు వీటిని ఏం చేసుకుంటావ్? వెండివి, మామూలు దుద్దులు. మహా అయితే ఐదు రూపాయలవి.”
“నేను నిన్ను దుద్దులు అడిగాను. వాటి విలువ కాదు. చెప్పు, ఇస్తావా?”
“ఇదిగో… తీసుకో.” సుల్తానా తన దుద్దులు తీసి శంకర్‌కు ఇచ్చేసింది. తర్వాత ఆమె కొంచెం అయ్యో అనుకుంది కాని, అప్పటికే శంకర్ వెళ్ళిపోయాడు.
సుల్తానాకి రవ్వంత కూడా నమ్మకం లేదు శంకర్ తన మాటను నిలబెట్టుకుంటాడని. కానీ ఎనిమిది రోజుల తర్వాత మొహరమ్ మొదటి రోజున ఉదయం తొమ్మిదింటికి ఎవరో తలుపు కొట్టిన చప్పుడు అయ్యింది. సుల్తానా తలుపు తెరిచింది. శంకర్ ఎదురుగా ఉన్నాడు. న్యూసుపేపరులో చుట్టిందేదో సుల్తానాకు ఇస్తూ అన్నాడు: “సాటిన్ కాలీ సల్వారు. చూసుకో, పొడుగవుతుందేమో. నేను వెళ్తానిక…”
శంకర్ సల్వారు ఇచ్చి సుల్తానాతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతడి పాంటుకి ముడతలు పడున్నాయి. జుట్టు చెదిరుంది. అప్పుడే నిద్రలేచి, వెంటనే ఇక్కడికి వచ్చినట్టు ఉన్నాడు.
సుల్తానా పొట్లాం తీసి చూసింది. నల్ల సాటిను సల్వారు. అచ్చం, ముఖ్తార్ దగ్గర చూసినదానిలా ఉంది. సుల్తానా సంబరపడిపోయింది. దుద్దులు ఇవ్వడం, అతడితో కుదుర్చుకున్న బేరం గురించిన విచారాన్ని సల్వారు, శంకర్ మాట నిలబెట్టుకోవడం దూరం చేశాయి.
మధ్యాహ్నం లాండ్రీవాడి నుండి రంగు వేయడానికి ఇచ్చిన కమీజు, దుపట్టా కూడా తెచ్చుకుంది. మూడు నల్ల రంగు బట్టలూ ఆమె వేసుకున్నాక తలుపు కొట్టిన చప్పుడు అయింది.
సుల్తానా తలుపు తెరవగానే ముఖ్తార్ లోపలకి వచ్చింది. ఆమె సుల్తానా వేసుకున్న మూడు నల్ల రంగుల బట్టలూ చూసి అడిగింది: “కమీజూ, దుపట్టా అంటే రంగు వేయించావని అర్థమవుతుంది. కానీ ఈ సల్వారు… ఇదెప్పుడు కుట్టించావు?”
సుల్తానా జవాబు ఇచ్చింది: “ఇవ్వాళే దర్జీ ఇచ్చి వెళ్ళాడు…” అంటుంటే ఆమె చూపు ముఖ్తార్ చెవుల మీద పడింది.
“ఈ దుద్దులు నీకెలా వచ్చాయి?”
“ఇవ్వాళే తెప్పించాను…”
ఆ తర్వాత కాసేపటి వరకూ వాళ్ళిద్దరు మౌనంగా ఉండాల్సి వచ్చింది.
(మొదటి ప్రచురణ: అదాబె లతీఫ్ పత్రిక, లాహోర్, 1942.)