ఏకవీర: విశ్వనాథ కథన కౌశలం అనే పుస్తకాన్ని డా. వై. కామేశ్వరి రచించగా, ముదిగొండ వీరభద్రయ్యగారి పీఠికతో, ఎమెస్కో వారు 2010 అక్టోబరులో అచ్చువేశారు. మూడు సంవత్సరాలనుండి కాపీలు మార్కెట్లో లేకపోగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మరి రెండు వ్యాసాలతో ఈ పుస్తకం రెండవ ముద్రణగా వెలువడింది. దీనికి తుమ్మపూడి కోటేశ్వరరావుగారి ముందుమాట తోడయ్యింది. విమర్శగ్రంథం రెండవ ప్రచురణకు వచ్చిన అరుదైన నేపథ్యంలో రచయిత్రి డా. వై. కామేశ్వరితో దేవులపల్లి ప్రభాకరరావుగారి ముఖాముఖి.
కామేశ్వరి: నమస్కారమండీ ప్రభాకరరావుగారూ. మీబోటి పెద్దలకు నా పుస్తకం నచ్చటం, నాతో ముఖాముఖిగా మాట్లాడాలని తలచటం నా అదృష్టమండీ.
దేవులపల్లి ప్రభాకరరావు: అలాకాదమ్మా. ఈ పుస్తకంలో విశేషం కనిపించటం చేతనే నేనీ ప్రయత్నం చేశాను.
విశ్వనాథ రచనలు లెక్కలేనన్ని ఉన్నాయి. వాటిలో ఏకవీరనే పరిశీలనకు ఎందుకు ఎన్నుకున్నారు?
ఏకవీర నవల మాకు బి.ఎ. ప్రత్యేక తెలుగు కోర్సులో నవలా ప్రక్రియకు పాఠ్యగ్రంథంగా ఉండేది. దాన్ని ఆదర్శ నవలగా చదివాము. ఆ కాలంలో నాకు అది ఎంత ప్రియమైనదంటే ఒక్కక్షణం కూడా ఆ పుస్తకాన్ని వదలి ఉండలేకపోయేదాన్ని. నిద్రపోయేటప్పుడు కూడా అది నా దిండుక్రిందే ఉండేది. ప్రణయగాథలను ఇష్టపడే టీనేజిలో విఫల ప్రణయగాథ నన్ను ఎందుకు ఆకర్షించిందా అనే ఆలోచన వచ్చింది. అదీ కాక ఆ నవలను విశ్వనాథ స్వయంగా వ్రాశారు. నెలకొక నవల వ్రాసే విశ్వనాథ, ఈ నవలను వ్రాయటానికి మూడు సంవత్సరాలు తీసుకున్నారు. వారి నవలల్లో చలనచిత్రంగా వచ్చినది ఏకవీర మాత్రమే. ఇన్ని కారణాలు నన్ను ఏకవీర నవలపై విమర్శను చేసేందుకు పురికొల్పాయి.
సాహిత్య విమర్శ కావలసిన మీ పుస్తకంలో చలనచిత్రంతో నవలను పోల్చిన ఒక వ్యాసం ఎందుకు చేర్చారు?
చిత్రం నన్ను నిరాశ పరచటమే కాదండి, చిత్ర వైఫల్యాన్ని నవలా వైఫల్యంగా స్థిరపరచే, చిత్రీకరించే ప్రయత్నం సాహిత్యరంగంలో పలుమార్లు జరుగుతోందని నా దృష్టికి వచ్చింది. అందుచేత నిజంగా చిత్ర వైఫల్యానికి కారణమేమిటా అని చూశాను.
చలనచిత్రం ఎందుకు విఫలమైందంటారు?
నవల, చలనచిత్రం రెండూ విభిన్నమైన ప్రక్రియలు. ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మార్చటమనేది ఒక పెద్ద అధ్యయన విషయం. దాన్ని పట్టించుకోకుండా ఏదో ఒకలాగా తీసెయ్యటమే చిత్ర వైఫల్యానికి మూలకారణం. అంతేకాదు, ఇప్పుడు కొత్త బంగారులోకం సినిమా ఉంది. దాన్ని హిట్ పెయిర్ కదా అని శ్రీదేవి, చిరంజీవులతో తీశారనుకోండి. ఒకరోజైనా ఆడుతుందా చెప్పండి? టీనేజి లవ్ స్టోరీని మధ్యవయస్కులతో తీస్తే ఎలాగండీ? ఇవేకాదు లెక్కలేనన్ని లోపాలున్నాయి ఆ చిత్రంలో. ఆ నవలలో చిత్రంగా తీయటానికి అనువుగా ఉన్న విషయాలను సస్పెన్స్, రాజకీయ వ్యూహాలు, గొప్ప చారిత్రక వైభవం, నాటకీయ పరిణామాలు వంటి విషయాలు అన్నింటినీ చిత్రంలో వదిలేశారు. కథలో ఉన్న మానసిక వేదనే ప్రముఖమైపోయింది. ఆ ఆవేదన కూడా చిత్ర దర్శకులకు అర్థంకాలేదనే అనిపిస్తుంది. లేకపోతే అద్భుతమైన నాలుగు పాత్రలను చంపేస్తారా? నాయిక ఏకవీర మరణం సహజంగా జరిగింది. దానికి ఆమె శారీరక స్థితి, మానసిక స్థితి కారణాలు. మిగిలిన మూడు పాత్రలను కూడా చంపేయటంలో ఏమీ లాజిక్ లేదండి. ఇంకా ఎన్నో లోపాలు నాదృష్టికి వచ్చాయి. వాటన్నింటిని పుస్తకంలో చెప్పాను.
ఇందాక టీనేజిలో విఫల ప్రణయగాథ ఎందుకు ఆకర్షించిందా అని చూశాననన్నారు? ఎందుకు ఆకర్షించిందనే విషయం మీకు తెలిసిందా?
నిజమేనండి టీనేజివారిని ఆకర్షించే మంత్రం అందులో లేకపోలేదు. ప్రేమలేని పెళ్ళిళ్ళలో ఎన్నెన్ని దురాగతాలో జరిగే అవకాశం ఉంది. ప్రేమ ఉన్న వివాహాల్లోనే, ఇంకా ఆమాటకు వస్తే ప్రేమలోనే అబ్బాయి, అమ్మాయి గ్రామర్ పాయింట్ మీద దెబ్బలాడుకోవటం, హత్యలకు ఆత్మహత్యలకు తెగబడటం, ఇప్పటి సినిమాల్లో, కథల్లో, నవలల్లో కనిపిస్తోంది. కానీ ఎంతో ఘర్షణకు లోనౌతున్నా, ఏకవీర నవలలో పాత్రలు ఎంత ఉదాత్తమైనవంటే ఒకరినొకరు నొప్పించుకోవటం వారికి ఎంతమాత్రం ఇష్టం ఉండదు. అంతేకాదు, ఎదుటివారికి దుఃఖం కలిగిస్తున్నామని బాధపడతారు. అలాగని తమ మనోధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించరు. అది ఎంత అద్భుతమైన విషయమండీ! ఆ పాత్రల జీవనఘర్షణలో ఆకర్షణ అలా వచ్చిందే! అంత సున్నితత్వం ఉన్న పాత్రల జీవితం ఆకర్షిస్తుంది మరి. స్త్రీపురుషుల మధ్య అంతటి ఆదర్శానుబంధం ఎవరినైనా మోహింపజేస్తుంది.
నవల గొప్పతనం చెప్పారు, చిత్రంతో పోల్చారు, బాగానే ఉంది. మరి అటు పాశ్చాత్య, ఇటు భారతీయ ప్రాచీన, ఆధునిక సాహిత్యాలతో పోల్చవలసిన అవసరం ఏమిటి?
ఈ సందర్భంలో అధ్యయనం చేస్తుంటేనే ‘నా రచన ఏకవీరపై ఈ యీ ప్రభావాలున్నాయి’ అంటూ విశ్వనాథవారే స్వయంగా చెప్పిన వాక్యం ఒకటి నాకంట పడింది. వాటిని అంతకుముందే చదివినప్పటికీ, నాకెక్కడా ఏకవీరపై ఆ ప్రభావం కనిపించలేదు. ఏకవీర మౌలికంగానే అనిపించింది. దానితో ఆ ప్రభావాలు ఎలా ఉన్నాయా అని చూస్తే ఆశ్చర్యకరంగా ఎన్నో విషయాలు కనిపించాయి. తులనాత్మక అధ్యయనం చేసే విద్యార్థులకు ఉత్తమమైన ప్రభావం ఎలా ఉంటుందో చూపించేందుకు నాకు చక్కని అవకాశం దొరికింది. పోలికలే కాక ఆ రచనలతో ఆయన రచనకు ఉన్న భేదాలను కూడా చెప్పాను. ఇందువల్ల విశ్వనాథ రచనల మౌలికతే కాక, ఆయన పాండిత్యం కూడా వెల్లడయింది. ఒక ఉత్తమ రచనపై ఎన్ని ప్రభావాలున్నా, రచయిత మౌలిక ప్రతిభ ఎలా నిలుస్తుందో చూపడానికి ఏకవీర ప్రత్యక్ష ఉదాహరణ.
మొదటి ప్రచురణలో లేని విధి ప్రభావాన్ని వివరించే అధ్యాయాన్ని రెండో ప్రచురణలో ఎందుకు వ్రాశారండీ?
మొదటి ప్రచురణ ఆవిష్కరణ సభలో నా స్నేహితురాలు మృణాళిని ఒక వ్యాఖ్య చేశారు. ఏమనంటే ‘ఒక నవలను పూర్తిగా విశ్లేషించాలంటే అందులో విధి పోషించిన పాత్రను కూడా అంచనా వెయ్యాలి. ఈ పుస్తకంలో అన్ని కోణాలనూ పరిశీలించినా, విధి ప్రభావాన్ని వివరించలేదు. అందువల్ల విశ్లేషణ పూర్తికాలేదు’ అని. సరే అదీ చూద్దామని ప్రారంభించాను. ఆంగ్ల నవలలను విశ్లేషించి చూపేటప్పుడు, నవలలో పాత్రల ప్రయత్నాలు విధి కారణంగా విఫలమైతే, ఎంత గొప్పదైనా ఆ నవలను రెండో తరగతి నవలగా అంచనా వేస్తారు. ఇప్పటిదాకా ఏకవీర నవలను ఎవరు విమర్శించినా విధి ప్రభావం వల్ల పాత్రలు ఓడిపోయాయని అంటూ వచ్చారు. నాకు ఆ వాదన సరికాదనిపించింది. అసలు విధి అనేది ఒక నమ్మకం. అది ఒక్కొక్క మతంలో ఒక్కోవిధంగా ఉంటుంది. హిందూ మతం చెప్పే విధి, క్రైస్తవ మతం చెప్పే విధి ఒకటికావు కదా? మరి ఆ ప్రమాణంతో హిందూమత ప్రాధాన్యమున్న ఏకవీరను ఎలా అంచనా వెయ్యగలం? అలా ఆ సందేహానికి జవాబుగా ఆ అధ్యాయం రూపుదిద్దుకుంది. విశ్వనాథ సత్యనారాయణగారి ప్రతిభ ఎటువంటిదంటే, మీరు ఏ రకమైన విశ్లేషణ చెయ్యండి, ఆయన రచన ప్రథమ శ్రేణిలోనే పాసౌతుంది.
ఏకవీర నవలకు ఆ పేరు ఎందుకు పెట్టారో వివరించే అధ్యాయం చాలా విచిత్రంగా ఉంది. జానపద గేయగాథలనుండి దశమహా విద్యలదాకా ఎన్నో కథలు, ఆ కథలతో ఏకవీర నవలా కథకు ఉన్న సంవాదాన్ని నిరూపించారు. ఈ చిత్రమైన వ్యాసం ఎందుకు వ్రాశారు?
ఆ విషయం తలచుకొంటే నాకూ ఆశ్చర్యంగానే ఉంటుందండి. ఇందులో నా ప్రతిభ ఏదో ఉందని నేను అనుకోవటంలేదు. ఒక కావ్యానికో, నవలకో ఆ పేరు ఎందుకు పెట్టారు అనే ఆలోచన ఏమీ కొత్తది కాదు. కానీ ఆ పరిశీలన పరిశోధనగా మారి ఒక ఎకౌంటు బుక్‌లో బాలెన్సు టాలీ అయినట్లుగా, ఒక పజిల్ పూర్తి చేసినట్లుగా, ఒక శాస్త్రీయ సమీకరణం నిరూపితమైనట్లుగా అలా ఆ కథలన్నీ ఏకవీర నవల కథతో అన్వయం పొందటం ఉందే – అదే విచిత్రం! దాన్ని రచయిత ప్రతిభకు నిదర్శనంగా చెప్పాలి తప్ప పరిశోధకులదేం ఉందండీ!
ఈ రచన ద్వారా మీరు ఏమి ప్రయోజనం సాధించారని అనుకుంటున్నారు?
అనువాదం నాకు ఎంతో ఇష్టమైన అంశం. ఇక్కడ నేను చేసింది కొంత విమర్శ. కొంత పరిశోధన, కొంత వ్యాఖ్య. వీటన్నింటికీ ఒక సామాన్య ఫలితం ఉంటుంది. అది ఏమిటంటే, ఏ కళారూపాన్ని వస్తువుగా తీసుకున్నామో, ఆ కళారూపపు గొప్పదనం, ఆ రచయిత ప్రతిభ బహిర్గతమౌతాయి. ఎంతమంది అనువాదం చేసినా రవీంద్రనాథ ఠాకూరు గీతాంజలికి కీర్తి పెరిగిందేకాని, అనువాదకులకు కాదు. విశ్వనాథ రచనలో గొప్పదనం ఉండటంవల్లే నేను ఆ చిన్ని నవలపై ఇంత వ్యాఖ్య చెయ్యగలిగాను. ఇది రచయిత గొప్పదనమే కాని నా గొప్పదనం అనుకోను. జగమెరిగిన కవి విశ్వనాథకు నేను కొత్తగా పేరు తెచ్చేది ఏముంది! కానైతే ఈ పరిశ్రమ వల్ల సాహిత్యవిద్యకు ఒక మేలు కలిగింది. ఒక నవలను ఎలా అధ్యయనం చెయ్యాలి, తులనాత్మక అధ్యయనం ఎలా ఉండాలి, అనే సమస్య ఉన్న సాహిత్య విద్యార్థులకు ఒక మాదిరి దొరికింది. అలాగే నవలలను వ్రాసే రచయితలకు ఒక కళాఖండంగా, క్లాసిక్‌గా, కలకాలం నిలిచే రచన ఎలా ఉండాలి అనే అంశం తెలిసి వస్తుంది. అనుభవించిన రుచిని అందరికీ అందించాననే తృప్తి నాకు దక్కింది.
ప్రభాకరరావు: మంచిదమ్మా. విశ్వనాథవారి రచనా ప్రతిభను సవివరంగా తెలియజేశారు.