మా పీకల మీదుంచిన కత్తులు తీయండి

1.
మేం అడిగేవి చాలా సులువైన ప్రశ్నలు
ఎవరు కాల్చమన్నారు?
మీరేమో, చచ్చేముందు ఆ శవం తిన్నదాన్ని గురించి మాట్లాడుతున్నారు.

మేం అడిగేవి చాలా సూటి ప్రశ్నలు
ఆ పసిపిల్లాడు ఉగ్రవాదా?
మీరేమో, ఆ శవం ఎలా మరణించిందని చెవులు కొరుక్కుంటున్నారు.

మా ప్రశ్నల్లో ఎలాంటి సంక్లిష్టతా లేదు
ఎంతమందిని చంపారు?
మీరేమో, ఒకప్పుడు ఆ శవం ఊపిరి తీస్తూండేదని రుజువు చెయ్యాలని చూస్తున్నారు.

ఎవరికి కావాలి
మీ శవపురాణాలు?
ఎవరికి కావాలి
మీ పుచ్చిపోయిన నిజాలు?

మొహం చితికి చచ్చిపోయింది, మా చెల్లాయి
ఆమెనెందుకు చంపారు?

ఇంకా సరిగా బతకడమే మొదలెట్టని మా తమ్ముళ్ళు
వాళ్ళనెందుకు చంపారు?

మేం దీన్ని ప్రశ్నిస్తాం
దీన్ని మాత్రమే ప్రశ్నిస్తాం
దీన్ని మాత్రమే, ప్రశ్నిస్తూనే ఉంటాం
మీ చెవులు చిల్లులు పడేవరకూ
మీ అధికారం శవమయ్యే వరకూ

2.
అయ్యా! మీ దయకు ధన్యవాదాలు
ఫ్యాక్టరీ మూసెయ్యడానికి ఇంత త్వరగా ఒప్పుకున్నందుకు
పాతికమందని అంటున్నారు
పదమూడని అంటున్నారు
ఎంతమందయితే ఏమిట లెక్క?

గోసంరక్షణం ఘనంగా జరిగే దేశంలో
ఈ అల్పమైన మానవుల్ని ఇంతటితో వదిలేశారు, అదే పదివేలు
ఓ పాలకులారా దండాలు
ఓ యజమానులారా దండాలు
ఓ నాయకులారా దండాలు
ఓ రాజుల్లారా దండాలండీ దండాలు

కాల్మొక్కుతాం సాములూ
మా వట్టకాయల మీంచి మీ బూటుకాళ్ళను తియ్యండి
మా పీకల మీదుంచిన ఆ కత్తులను కిందకు దించండి
బలికి గొర్రెలెప్పుడు సిద్ధం కావాలో ఆజ్ఞాపించండి
దయగల ప్రభువులు మీరు,
ఒక్కటే మా వేడుకోలు
కాస్త నొప్పి లేకుండా చంపండి.

3.
ఉద్యమాల జోలి మీకెందుకు చెప్పండి?

మీకోసమే కదా ఐపిఎల్ ఉన్నది
మీకోసమే కదా సినిమాలున్నది
మీకోసమే కదా వైన్‌షాపులున్నది
మీకోసమే కదా ఫేసుబుక్కు ఉన్నది
మీకోసమే కదా యూట్యూబు ఉన్నది
మరి?

ఇక్కడ పార్కులన్నింటికీ మేమేం తాళాలు వేశామా?
ఉద్యమాలకు ఊరేగమని మీకు చెప్పింది ఎవరు?
బీచ్‌లను పోరాటవేదికలుగా మార్చింది ఎవరు?

గాలి కలుషితం అవుతోంది
నీరు కలుషితం అవుతోంది
నేల కలుషితం అవుతోంది
కేన్సర్ వస్తోంది
అవును బాధే, కాదనం.

అందుకేగా గుళ్ళున్నాయి
మీ గురించి దేవుడికి సిపార్సు
చెయ్యడానికి పూజారులున్నారు
ఆయుధాలు చేతబట్టిన దేవుళ్ళున్నారు.
ఎంచక్కా,
ప్రార్థనలు చెయ్యవచ్చు
తలనీలాలివ్వవచ్చు
శూలాలు గుచ్చుకోవచ్చు
ఊరేగింపు రథాలు లాగవచ్చు
దేవుడి కావడి మొయ్యవచ్చు
గిరి ప్రదక్షిణ చెయ్యవచ్చు
చెయ్యడానికి ఎన్నిలేవు? (మంచి భక్తులుగా మారి)

అర్జీలు పెట్టొచ్చు
దేబిరించవచ్చు
ఫేసుబుక్కులోకి పోయి స్టేటస్ పెట్టొచ్చు
ఏడ్చి అలమటించవచ్చు
రొప్పుతూ రోజుతూ బతుకు గడిపేయొచ్చు
రక్తం కక్కుకుంటూ చచ్చిపోనూ వచ్చు
చెయ్యడానికి ఎన్నిలేవు? (గొప్ప దేశభక్తులుగా మారి)

ఉద్యమాల జోలి మీకెందుకు చెప్పండి?
కాల్పులకి కారణం మేమా?
ఉసిగొలిపింది మీరు
పోరాడారు
కాల్చాము.

(ఆంగ్లానువాదం; తమిళ మూలం, తెలుగు లిపిలో)