శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము

పరిచయము

ఆది శంకరాచార్యులుఆది శంకరాచార్యులు క్రీస్తు శకము 805 లో ఇప్పటి కేరళలోని కాలడి గ్రామములో శివగురు ఆర్యాంబా దంపతులకు జన్మించెను. పది యేళ్ళకు ముందే సకల విద్యలను అభ్యసించి, బాలసన్యాసియై నర్మదాతీరములో గోవింద భగవత్పాదుల శిష్యుడయ్యెను. అతడు సుమారు ముప్పది యేళ్ళకు కొద్దిగా ఎక్కువగా జీవించెను. అంత స్వల్ప కాలములో అనల్పమైన ఖ్యాతి నార్జించి వైదిక మతమును పునరుద్ధరించి తత్త్వజ్ఞానియై అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించెను.

శంకరుడు నివసించిన కాలమును గమనిద్దామా? ఆ కాలములో భారతవర్షములో జైన, బౌద్ధ, వైదిక (హిందూ) మతములను ప్రజలు ఆదరించుచుండిరి. శంకరుని ప్రాంతములో బహుశా ఇప్పటి మలయాళ భాష పుట్టియుండలేదు. ఆ ప్రాంతములో తమిళ, కన్నడ, తుళుభాషలను ప్రజలు మాటలాడేవారు. శంకరుడు బహుశా అశ్వఘోషుని బుద్ధచరితమును, సౌందరనందమును, భాస, కాళిదాసుల నాటకములను చదివియుండవచ్చు. రఘువంశ, కుమారసంభవ, కిరాతార్జునీయ, శిశుపాలవధలు కూడ అతనికి పరిచితములై యుండవచ్చు. కాని అతని కాలము హర్షునికంటె ముందు, కావున సంస్కృతములోని పంచమహాకావ్యములలో ఒక్కటైన నైషధము ఇంకా వ్రాయబడలేదు. అతడు పింగళనాగుని ఛందశ్శాస్త్రమును, భరతుని నాట్యశాస్త్రమును, జయదేవ ఛందస్సును, జానాశ్రయిని వేదాంగములలో ఒక్కటైన ఛందస్సుకై చదివి యుండవచ్చును. కాని ముఖ్యముగా పింగళఛందస్సునే మౌలికమైన గ్రంథముగా చదివియుండును.

శంకరుడు లఘు స్తోత్రములనుండి బృహద్గ్రంథముల వరకు సుమారు నాలుగు వందల రచనలను సృష్టించెను. నేను అందులోని కొన్ని ప్రార్థనా స్తోత్రములను ఆధారము చేసికొని ఈ వ్యాసమును వ్రాయుచున్నాను. ప్రాచీన భారతీయ సాహిత్యములో ఎవరు ఏ పుస్తకమును ఎప్పుడు వ్రాసినారో అన్నది నిరూపించుట అంత సులభము కాదు. పరంపరా గతముగా కొన్నిటిని కొందరు వ్రాసినారని మనము ఊహించుచున్నాము. అవి సరియో, కాదో అన్నది అంత సులభముగా చెప్పుటకు సాధ్యము కాదు. కొందరు దేవీ అశ్వధాటిని శంకరులు వ్రాసినారందురు. కాని ఇది కాళిదాసకృతమని అధికుల ఊహ. నా ఉద్దేశ్యములో ఇది శంకరాచార్యవిరచితమని, ఎందుకంటే ప్రాసయతులు మున్నగు అలంకారములు కాళిదాసునకు పట్టవు.

ఈ వ్యాసమునకు ఆధారమైన రచనలు Sanksrit Documents వారి వెబ్‍సైటు, మరియు, కామకోటి పీఠాధిపతుల వెబ్‍సైటు నుండి ఎన్నుకొన్నాను.

శంకరులు జ్ఞాని, మతప్రవక్త మాత్రమే కాదు, గొప్ప కవి, పండితుడు కూడ. పద లాలిత్యము, అర్థసాంద్రత, భావగాంభీర్యము ఆచార్యుల పద్యములలో నాట్యమాడుతాయి. అంతెందుకు, సరస్వతీదేవి అతని నాలుకపై నృత్యము చేస్తుందని చెప్పుటలో అతిశయోక్తి లేదు. భారత, భాగవతములలో, పురాణములలో దైవ స్తోత్రములు ఉన్నవి. కవులు గ్రంథారంభములో ప్రార్థనా పద్యములను తమ ఇష్ట దేవతలపై వ్రాసియున్నారు. కాని అందరికీ అందుబాటులో ఉండేటట్లు అన్ని దైవములపై స్తోత్రములను వ్రాయు పద్ధతిని బహుశా ఆచార్యులే మొట్టమొదట ప్రవేశపెట్టినట్లున్నది.

శంకరాచార్యులు సుమారుగా ఇరవై రకములైన పద్యములను ఉపయోగించారు. కాళిదాసువంటి కవులు తమ నాటకములలో వ్రాసిన వృత్తముల సంఖ్య కూడ ఇట్టిదే. ఛందశ్శాస్త్ర రీత్యా కోట్లకొలది వృత్తములు వ్రాయుటకు వీలగును. కాని గొప్ప కవులు కూడ అందులో సుమారు ఇరువది నుండి ఏబది మాత్రమే ప్రయత్నించారు. క్షేమేంద్రుడు సువృత్తతిలకములో 26 రకములైన పద్యములను మాత్రమే పేర్కొనెను. అదియునుకాక ఒక్కొక్క కవికి ఒక్కొక్క వృత్తముపై ప్రత్యేకమైన మోజు. కాళిదాసు అంటే మేఘదూతములోని మందాక్రాంతము మనకు జ్ఞప్తికి వస్తుంది. భారవి వంశస్థమునకు, రత్నాకరుడు వసంతతిలకమునకు, భవభూతి శిఖరిణికి, రాజశేఖరుడు శార్దూలవిక్రీడితమునకు ప్రసిద్ధులని క్షేమేంద్రుడు తెలిపియున్నాడు. అలాగే తెలుగులో వేమన ఆటవెలదికి, శ్రీనాథుడు సీసమునకు ప్రసిద్ధులు. నా ఉద్దేశ్యములో ఆదిశంకరులు భుజంగప్రయాతమును వ్రాయుటలో అందెవేసిన చేయి. నేను ఈ వ్యాసములో ఉదహరించిన పద్యముల లక్షణములను మొదటి పట్టికలో చూడగలరు. ఇక్కడ ఒక విషయమును దృష్టిలో ఉంచుకోవాలి. సంస్కృత ఛందస్సులో అక్షరసామ్య యతి (తెలుగులోని వడి) లేదు. యతి అనగా పాదచ్ఛేదము మాత్రమే. పాదాంతములో తప్పక యతి ఉండును. ఈ పాదచ్ఛేదమును ఎల్లప్పుడు కవులు (శంకరాచార్యులతో సహా) అనుసరించలేదు. ఒకే పద్యమునకు కొన్ని వేళలలో సంస్కృత తెలుగు ఛందస్సులలో యతి ఒకటే కాదు. పద్యములను అకారాదిగా విదితము చేయుట బాగు. కాని మొదట వచ్చు వృత్తమును ఆచార్యులు విరివిగా వాడిరి అని అనుకొనరాదు. పేరులను కొన్ని చోటులలో సంస్కృతములో, మరి కొన్ని చోటులలో తెలుగులో ఉపయోగించుటలో సంశయములు రావు అనుకొంటాను (ఉదా- శిఖరిణీ శిఖరిణి, ఆర్యా ఆర్య, ఇత్యాదులు). మరొకటి గుర్తుంచుకోవాలి. పాదాంతమునందలి గురువుకు బదులు కొన్ని సమయాలలో సంస్కృతములో లఘువు వాడబడుతుంది. పాదాంతములో విరామము ఉండుటవలన ఇది గురువుతో సమానము. అన్ని పద్యములకు అర్థమును ఆ పద్యము క్రింద ఇచ్చినాను. నేనిచ్చిన తెలుగు అనువాదాలు స్తోత్రమునందలి ముఖ్యార్థమును తెలుపును, అవి ప్రతిపదానువాదాలు కావు. వీలైనంతవరకు అనువాదములను మాత్రాఛందస్సులో వ్రాసినాను. అవి ఏ ప్రత్యేక ఛందస్సునకు చెందినవి కావు.

ఉపజాతి (ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర)

సంస్కృతములో ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్రలను కవల పిల్ల లనవచ్చును. ఇదే విధముగా వంశస్థ-ఇంద్రవంశలు కూడ. ఇంద్రవజ్రకు గణములు- త-త-జ-గ-గ, ఉపేంద్రవజ్రకు గణములు- జ-త-జ-గ-గ. ఇంద్రవజ్రలో మొదటి అక్షరము దీర్ఘము, ఉపేంద్రవజ్రలో అది హ్రస్వము. ఈ రెంటికి తేడా ఇంతే. రెంటిని కలిపి వాడిన పద్యమును ఉపజాతి యందురు. ఈ మిశ్రణము 14 విధములుగా సాధ్యము. కాళిదాసువంటి మహాకవులు తమ కావ్యములలో సర్గములనే ఉపజాతిలో వ్రాసినారు. ఆచార్యులు ఉపజాతిని అర్ధనారీశ్వరస్తోత్రము, ద్వాదశలింగస్తోత్రము, కాశీపంచకము, కౌపీనపంచకము, శివస్తోత్రము,
సుబ్రహ్మణ్యపంచరత్నము, ఉమామహేశ్వరస్తోత్రము, యతిపంచకములలో ఉపయోగించినారు. క్రింద కొన్ని ఉదాహరణలు-

ఇంద్రవజ్ర

కస్తూరికా శ్యామల కోమలాంగీం
కాదంబరీపాన మదాలసాంగీం
వామస్తనాలింగిత రత్నవీణాం
మాతంగకన్యాం మనసా స్మరామి – త్రిపురసుందరీమానసపూజాస్తోత్రము (18)

కస్తూరివలె శ్యామల మృదుతర దేహను
కాదంబరిని త్రాగిన మదాలసవతిని
ఎడమ కుచమును తాకు వీణియను మీటెడు
మాతంగకన్యను మనసులో దలతు నేన్

ఉపేంద్రవజ్ర

నమోऽస్తు నాలీకనిభాననాయై
నమోऽస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోऽస్తు సోమామృతసోదరాయై
నమోऽస్తునారాయణవల్లభాయై – కనకధారాస్తోత్రము (12)

పద్మాననపు దేవీ నీకు నా నమస్సులు
క్షీరోదధికి పట్టీ నీకు నా నమస్సులు
శశికిని సుధకు నక్కా నీకు నా నమస్సులు
నారాయణుని దేవీ నీకు నా నమస్సులు

ఉపజాతి

షడాననం చందనలేపితాంగం
మహోరసం దివ్యమయూరవాహనం
రుద్రస్య సూనుం సురలోకనాథం
బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే – సుబ్రహ్మణ్యపంచరత్నము (1)

గంధ మలదికొను ఆఱు ముగములవాని
దివ్య మయూరము నెక్కిన దీర్ఘవక్షు
ఈశ కుమారుని సురసేనాధిపతిని
సుబ్రహ్మణ్యుని శరణని వేడుకొందు

ఔపచ్ఛందసిక

ఇది వైతాళీయ భేదమునకు చెందినది. ఈ పద్యములో బేసి పాదములకు మొదట ఆరు మాత్రలు, తరువాత ర-గణ, య-గణములు, సరి పాదములకు మొదట ఎనిమిది మాత్రలు, తరువాత ర-గణ, య-గణములు ఉండును. తాళవృత్తములకు వైతాళీయములు నాంది అని పరిశోధకుల భావన. శంకరులు శివానందలహరిలో, త్రిపురసుందరి మానసపూజా స్తోత్రములో దీనిని వాడినారు. అందులో ఒకటి క్రింద ఇచ్చుచ్చున్నాను-

అశనం గరలం ఫణీకలాపే
వసనం చర్మ చ వాహనం మహోక్షః
మమ దాస్యసి కిం కిమస్తి శంభో
తవ పాదాంబుజ భక్తిమేవ దేహి – శివానందలహరి (87)

తిండి విషము, సరము పాము,
బట్ట తోలు, బండి ఎద్దు
నాదు సేవ కొసగ దగిన
దేమి లేదు నీదు చెంత
నీదు పాద కమల భక్తి
నీయు మయ్య శంభు యెపుడు

కవిరాజవిరాజితము

తెలుగులో మనము కవిరాజవిరాజితము అని పిలిచే వృత్తమునకు హంసగీతి అని కూడ పేరు ఉన్నది. ఈ వృత్తములో మహిషాసుర మర్దిని స్తోత్రము చాల ప్రసిద్ధమైనది. దీని రచయిత రామకృష్ణకవి అని చెబుతారు, కాని ఇతనిని గురించిన మరే వివరాలు మనకు తెలియవు. కొందరు ఇది శంకరాచార్య కృతమని కూడ అంటారు. శంకరులు దీనిని వ్రాసినారో వ్రాయలేదో మనకు తెలియదు. కాని ఈ వృత్తములో యమునాష్టకములో ఎనిమిది పద్యములు ఉన్నవి. క్రింద ఉదాహరణ-

మధువనచారిణి భాస్కరవాహిని జాహ్నవిసంగిని సింధుసుతే
మధురిపుభూషణి మాధవతోషిణి గోకులభీతివినాశకృతే
జగదఘమోచిని మానసదాయిని కేశవకేలినిదానగతే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పాలయ మాం – యమునాష్టకము (2)

బృందావనవిహారీ సూర్యసుకుమారీ గంగాసహోదరీ సాగరకుమారీ
నందాత్మజభూషణి కృష్ణానందాత్మా గోకులాభయకారీ
పాపవినాశినీ అమల సరోవర కారిణీ రాసలీలమూలాధారా
జయజయ యమునా భయనాశిని దుఃఖవిదారిణి కాపాడవే

శంకరుల కాలములో కవిరాజవిరాజితము ఉన్నా, దాని ఇంకొక రూపమైన మానిని (లేక మదిరా) వాడుకలో లేనట్లుంది. ఉంటే శంకరులు
ఇట్టి వృత్తములో వ్రాయక ఉండియుండరు.

ద్రుతవిలంబితము

పేరుకు తగ్గట్లు ఇందులో మొదట దురిత (లఘువులు ఎక్కువ), తరువాత విలంబిత (గురువులతో) గమనములు రెండును గలవు. శివానంద లహరినుండి ఒక ఉదాహరణ-

సదుపచార విధీష్వనుబోధితాం
సవినయాం సహృదం సదుపాశ్రితాం
మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో
వరగుణేన నవోఢవధూమివ – శివానందలహరి (78)

బుధుల సేవ రీతి కొలది యెఱుగు దేను
మంచిగాను సహృదయమ్ము నిండగాను
నాదు బుద్ధి పెఱుగజేయు మయ్య నీవు
వధువు గుణము వరుడు బెంపు జేయు నటుల

పంచచామరము

పంచచామరము ఒక అందమైన వృత్తము. పాదమునకు ఎనిమిది ల-గములు గల ఈ వృత్తము తాళయుక్తము, పాడుటకు చక్కగా నుండును. ఇట్టి శిలాఫలకాన్ని చెక్కుట శంకరులవంటి శిల్పాచార్యకవికి కష్టము కాదు గదా? గణేశపంచరత్నము, కృష్ణాష్టకము, నర్మదాష్టకము, యమునాష్టకములు పంచచామరవృత్తముతో విరాజిల్లుచున్నవి. తన గురువైన గోవిందభగవత్పాదులను నర్మదాతీరములో మొట్టమొదట దర్శించెను. పిదప ఒకనాడు ఇతర సహాధ్యాయులతో ఒక గుహలో అభ్యాసము చేయుచుండగా నర్మదానదిలో వరద వచ్చింది. వరద నీళ్ళు గుహద్వారమును సమీపించింది. ఒక పాత్రను అక్కడ పెట్టి నర్మదానదిని ఆ పాత్రలో వెళ్ళమని నర్మదాష్టకమును ఆశుధారగా చెప్పెను. ఈ నర్మదాష్టకము పంచచామరవృత్తములో నున్నది. చామరకర్ణుడైన విఘ్నేశ్వరునిపై పంచ చామరములను పంచరత్నములుగా ఆచార్యులు వ్రాయుట వృత్తౌచిత్యమును తెలుపుతుంది. క్రింద ఒక ఉదాహరణ-

సమస్త లోక శంకరం నిరస్తదైత్య కుంజరం
దరేత రోదరం వరం వరేభ వక్త్ర మక్షరం
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం – గణేశపంచరత్నము (3)

లోకాల కంతటికి శంకరా
మదదైత్య కుంజరుల అంతకా
ఉదరమున గొప్ప గుహ నీ నాభి
మత్తమాతంగోత్తమము ముఖము
అక్షయా అక్షరా శాశ్వతా
దయాంబుధి క్షమాంబుధి ముదాంబుధి
కీర్తికిని స్ఫూర్తికిని కారణా
వెలుగుతో శోభించు గణదేవ
వందింతు విఘ్నేశ వందనీయా

పుష్పితాగ్ర

పుష్పితాగ్రావృత్తము అర్ధసమ వృత్తము. సరి పాదములలో 13 అక్షరము లుండును, బేసి పాదములకు ఒక అక్షరము తక్కువ. ఈ వృత్తమును మాయాపంచకములో, శివానందలహరిలో, త్రిపురసుందరీమానసపూజస్తోత్రములో ఆచార్యులు వాడిరి. శివానందలహరినుండి ఒక ఉదాహరణ-

బహువిధ పరితోష బాష్పపూర-
స్ఫుట పులకాంకిత చారుభోగభూమిం
చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం
పరమ సదాశివ భావనం ప్రపద్యే – శివానందలహరి (67)

ఎంత ఆనందమో, కళ్ళలో అశ్రువులు
పులకింతు నా స్వర్గ భూమిలో నే నెపుడు
పరమపద మను ఫలము సేవించ నా కోర్కె
పరమేశు శివు సదా నే నెంచి ధ్యానింతు

పృథ్వి

లయతో విరాజిల్లు వృత్తములలో పృథ్వీవృత్తము కూడ ఒకటి. మరాఠీ కవియైన మోరోపంత ఆ పేరుతో నున్న ఒక చిన్న పుస్తకమునే ఈ వృత్తములో రచించెను. త్రిపురసుందరి అష్టకమంతయు ఈ వృత్తములోనే వ్రాయబడినది. త్రిపురసుందరిమానసపూజస్తోత్రములో కూడ ఈ వృత్తాలు కొన్ని ఉన్నాయి. క్రింది పద్యము త్రిపురసుందరి అష్టకములో మాత్రమే కాదు, లలితాసహస్రనామములో ధ్యానశ్లోకముగా కూడ ఉన్నది.

సకుంకుమవిలేపనాం అలకచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం
అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధి స్మరామ్యంబికాం – త్రిపురసుందరీఅష్టకము (7)

కుంకుమము పూసితివి, తాకినవి కస్తూరి తిలకమును ముంగురులు,
రాజిల్లె చిఱునగవు మొగముపై, ఆయుధమ్ములను బలు దాల్చితివి,
లోకజన మోహినీ, అరుణ మాలా భూషణాంబర సుశోభినీ,
గులాబుల సొబగుతో వెలిగితివి, అంబికా నిను దలతు జపములో

ప్రహర్షిణి

ప్రహర్షిణీ వృత్తములను ధాన్యాష్టకములో శంకరులు ఉపయోగించిరి. క్రింద ఒక ఉదాహరణ-

తజ్జ్ఞానం ప్రశమకరం యదింద్రియాణాం
తజ్జ్ఞేయం యదుపనిషత్సు నిశ్చితార్థ
తే ధన్యా భువి పరమార్థనిశ్చితేహాః
శేషాస్తు భ్రమనిలయే పరిభ్రమంతః – ధాన్యాష్టకము (1)

ఇంద్రియమ్ములకు శాంతము నిచ్చెడి జ్ఞానమె జ్ఞానము
ఉపనిషదార్థము విపులము జేసెడు జ్ఞానమె జ్ఞానము
పరమార్థ మెఱుంగ దలచు వారే ధన్యులు భువిలో
మిగిలిన వారలు భ్రమలను సుడిలో చిక్కి చలింతురు

భుజంగప్రయాతము

ఆచార్యుల భుజంగప్రయాతమును పరిశీలిద్దామా? భుజంగప్రయాతాన్ని గురించి ఇప్పుడు ఒక కథ చెబుతాను. శేషనాగుడు (ఇతడు పింగళనాగుడో కాదో అన్నది వివాదాంశము) ఒక నాగరాజు, సముద్రములో నివసించేవాడట. అతడు ఛందస్సులో మహా జ్ఞాని. వసంతకాలములో సముద్రమునుండి బయటకు వచ్చి ఇసుక తిన్నెలపైన ఒళ్ళు వెచ్చ జేసుకొంటున్నాడు. ఆ సమయములో ఆకాశములో గరుత్మంతుడు ఎగురుచున్నాడు, అతనికి శేషనాగుడు కనబడ్డాడు. దిగివచ్చి శేషనాగుని పట్టుకొని కబళించ బోవుచుండగా, శేషనాగుడు గరుడుని ప్రార్థిస్తాడు ఇలా- నేను ఛందస్సుపై ఒక గొప్ప గ్రంథమును వ్రాయాలనుకొంటున్నాను. నన్ను నీవు తింటే, ఈ పనిని ఎవ్వరూ చెయ్యలేరు, ప్రపంచానికి అది ఒక తీరని నష్టము అవుతుంది. చనిపోవుటకు ముందు నీకు నేను దానిని వల్లిస్తాను. నీవు విని వ్రాయి. నేను నిన్ను మోసబుచ్చుట లేదు. నీతో చెప్పకుండా నేను ఇక్కడినుండి పారిపోను. ఇది విన్న గరుడుడు లోకకళ్యాణము కొరకై అంగీకరిస్తాడు. శేషనాగుడు ఛందస్సును గురించి వివరముగా గరుడునితో ముచ్చటలాడుతాడు. చివరకు హుజంగప్రయాతః భుజంగప్రయాతః భుజంగప్రయాతః భుజంగప్రయాతః అని అంటాడు. తరువాత సముద్రములో మాయమవుతాడు. గరుడుడు నీవు నన్ను ఏమార్చావు అంటాడు. శేషనాగుడు నీకు నేను చెప్పియే మాయమయ్యాను. భుజంగప్రయాతః అంటే పాము నడుస్తుంది అని అర్థము. నేను నాలుగు మారులు అలా
పలికాను. నీవు అభ్యంతరము తెలుపలేదు. అది సమ్మతి అనుకొని నేను నీతో చెప్పి మరలా సముద్రములోనికి వెళ్ళాను అంటాడు.

భుజంగప్రయాతపు గమనము పాము నడకలా వంకరటింకరగా ఉంటుంది. ప్రతి పాదములో నాలుగు య-గణములు, సంస్కృతములో యతి లేదు. శంకరులు ఈ వృత్తమును ఆత్మాష్టకము, భవాన్యష్టకము, భవానీస్తోత్రము, దశశ్లోకీ, దేవీస్తోత్రము, గుర్వష్టకము, నిర్వాణమంజరి, పాండురంగాష్టకము, రామస్తోత్రము, శారదాష్టకము, సుబ్రహ్మణ్యస్తోత్రము, స్వరూపానుసంధానాష్టకము, విష్ణుస్తోత్రములలో వాడినారు. తమిళనాడులో సముద్రతీరములోనున్న తిరుచెందూరులో (సింధుదేశము) సుబ్రహ్మణ్యస్వామి దేవాలయము ఒకటి ఉన్నది. ఆచార్యులు ఇక్కడికి వెళ్ళి
షణ్ముఖుని దర్శనము చేయుచుండగా వారి మనస్సంతా వెలుగుతో నిండినదట. అదే సమయములో స్వామిని పూజ చేయు ఆదిశేషుని చూచెనట. అతడు ఆశువుగా భుజంగప్రయాతములో 33 పద్యముల స్తోత్రమును రచించెనట. అందులో ఒకటి-

నమః కేకినే శక్తయే చాపి తుభ్యం
నమశ్ఛాగ తుభ్యం నమః కుక్కుటాయ
నమః సింధవే సింధుదేశాయ తుభ్యం
పునః స్కందమూర్తే నమస్తే నమోऽస్తు – శ్రీసుబ్రహ్మణ్యభుజంగము (31)

వేదముల మూర్తియగు ఓ మయూరమ్మా
అందుకో అందుకో నా నమస్సులను నీవు
ఆ శక్తి రూపమగు ఓ మహా శక్తీ
అందుకో అందుకో నా నమస్సులను నీవు
మాయాప్రపంచమున కానవాలగు మేక
అందుకో అందుకో నా నమస్సులను నీవు
అహమునకు గుర్తైన ఓ పుంజు కోడీ
అందుకో అందుకో నా నమస్సులను నీవు
ఆనంద రూపమగు ఓ మహా సింధువా
అందుకో అందుకో నా నమస్సులను నీవు
సింధుదేశములోని ఓ స్కంద స్వామీ
అందుకో అందుకో నా నమస్సులను నీవు
మఱలమఱలను జేతు వందనమ్ముల భక్తి
అందుకో అందుకో నా నమస్సులను నీవు
(సుబ్రహ్మణ్యస్వామి చేతిలోగల వేలాయుధమును శక్తి అంటారు.)

న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం
న కుబ్జం న పీనం న హ్రస్వం న దీర్ఘం
అరూపం తథా జ్యోతిరాకారకత్వాత్
తదేకోऽవశిష్టః శివః కేవలోऽహం – దశశ్లోకీ (6)

తెలుపు కాను నలుపు కాను
ఎఱుపు కాను పసుపు కాను
పొట్టి కాను పొడుగు కాను
కుఱుచ కాను నిడుద కాను
కాంతి వోలె రూపు లేదు
ఉన్న దదియె ఒక్కటదియె
శివము అదియె అదియె నేను

మత్తమయూరము

మత్తమయూరమునకు ప్రతి పాదమునకు 13 అక్షరాలు, అందులో తొమ్మిది గురువులు! అందువలన వ్రాయుట కష్టము. గౌరీదశకము, దక్షిణామూర్తివర్ణమాలాస్తోత్రములలో ఆచార్యులు ఈ వృత్తమును వాడిరి. క్రింద ఒక ఉదాహరణ-

చంద్రాపీడానందితమందస్మితవక్త్రాం
చంద్రాపీడాలంకృతనీలాలకభారాం
ఇంద్రోపేంద్రాద్యర్చితపాదాంబుజయుగ్మా
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే – గౌరీదశకము (3)

నీ చిఱునవ్వులు శశిశేఖరునికి మోదము
నీ నీలాలక లా శశిభూషణ శోభల యందము
ఇంద్రోపేంద్రాదులచే పదకమలములర్చితములు
తల్లీ గౌరీ సరసిజనేత్రీ నను రక్షించుమ

మాత్రాఛందస్సు

ప్రాకృత ఛందస్సు ప్రభావమువలన మాత్రాఛందస్సు సంస్కృత ఛందస్సులో చేరినది. సంస్కృత నాటకములలో ఇట్టి పద్యములు రంగస్థలముపై ప్రవేశపెట్టబడినవి. శంకరులు తమ స్తోత్రములలో మాత్రాఛందస్సును విరివిగా వాడిరి. జాతులైన ఆర్యా హనుమత్పంచరత్నము,
విష్ణుషట్పదులలో వాడబడినవి. ఇది మాత్రమేగాక శంకరునికి మిక్కిలి ఖ్యాతి నార్జించిన భజగోవింద స్తోత్రము కూడ చతుర్మాత్రాగణాన్వితమే. గంగాస్తోత్రము, గోవిందాష్టకము, లక్ష్మీనృసింహపంచరత్నము, సువర్ణమాలాస్తుతి చతుర్మాత్రాగణ శోభితమే. లింగాష్టకములో కూడ చతుర్మాత్రలే, కాని దీనిని శంకరులు వ్రాసినారో లేదో అన్నది వివాదాంశము. క్రింద ఉదాహరణలు-

ఆర్యా

దామోదర గుణమందిర
సుందరవదనారవింద గోవింద
భవజలధిమథనమందర
పరమం దరమపనయ త్వం మే – విష్ణుషట్పదీస్తోత్రము (6)

కం. దామోదర గుణమందిర
కోమల సరసిజ వదనపు గోవిందా ర-
మ్మీమనుగడకడలి జిలుక
నా మది జెడు ద్రోయవయ్య నందానందా

చతుర్మాత్ర

దినయామిన్యౌ సాయం ప్రాతః
శిశిరవసంతౌ పునరాయాతః
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః
తదపి న ముంచత్యాశావాయుః – భజగోవిందము (12)

దినము గడువగా రేతిరి వచ్చును
ఉదయము పిమ్మట సంధ్యయు వచ్చును
శిశిరము వెనుక వసంతము వచ్చును
ఆగని కాలము ఆటల నాడును
ఆటలలో నిక నాయువు మూడును
ఐనను వీడదు ఆశావాయువు

హరిపదపాద్య తరంగిణి గంగే
హిమవిధుముక్తా ధవల తరంగే
దూరీకురు మమ దుష్కృతిభారం
కురు కృపయా భవసాగర పారం – గంగాస్తోత్రము (3)

శ్రీహరి పదమ్ములకు పాద్యమగు గంగా
మంచు శశి ముత్తెముల తెలి యలల గంగా
దూరముగ చేయి నా పాపముల గంగా
జీవనపు జలనిధిని దాటించు గంగా

మాలిని

భాసుని కాలమునుండి మాలినీవృత్తము వాడుకలో నున్నది. మాలినికి మొదట ఆరు లఘువులు, తరువాత మూడు గురువులు, రెండు య-గణములు. పాదము ఎనిమిది అక్షరాలకు విరుగుతుంది. శివమానసపూజ, శివాపరాధక్షమాపణ స్తోత్రము, శివానందలహరి, త్రిపురసుందరీమానసపూజా స్తోత్రములలో మాలిని మనకు కనబడుతుంది. మాలినికి సామాన్యముగా అర్ధపాదములకు అంత్యప్రాస ఉంచుతారు. క్రింద ఒక ఉదాహరణ-

కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణనయనజం వా మానసం వాऽపరాధం
విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్త్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో – శివమానసపూజ (5)

చేతులు చేసిన పాపాల, కాళ్ళు చేసిన పాపాల
మాటలు చేసిన పాపాల, దేహము చేసిన పాపాల
చేతలు చేసిన పాపాల, చెవు లవి చేసిన పాపాల
కన్నులు చేసిన పాపాల, మన సది చేసిన పాపాల
అంగీకృతమగు పాపాల, అనంగీకృతమగు పాపాల
కరుణాసాగర గురుదేవా శంభో క్షమించు మన్నిటిని

రథోద్ధత

త్రిపురసుందరీమానసపూజాస్తోత్రములో కొన్ని రథోద్ధత వృత్తములు గలవు. అందులో నొకటి-

దృశ్యతే తవ ముఖాంబుజం శివే
శ్రూయతే స్ఫుటమనాహుతధ్వనిః
అర్చనే తవ గిరామగోచరే
న ప్రయాతి విషయాంతరం మనః – త్రిపురసుందరీమానసపూజాస్తోత్రము (114)

వదనసరోజము చూచుట తప్ప
నిజమగు మాటల వినుటయు తప్ప
అదృశ్య వాణికి అర్చన తప్ప
మనసుకు తోచదు మఱేమి నాకు

వసంతతిలక

వసంతతిలక సుమారు రెండు సహస్రాబ్దాలుగ వాడబడుచున్నది. సంస్కృత కవులకు ఇది మన ఆటవెలది, తేటగీతి వంటిది. ముఖ్యముగా హిందువుల ఇళ్ళలో గుడులలో వినబడే కొన్ని సుప్రభాతాలు ఈ వృత్తములో వ్రాయబడినవే. ప్రాతః స్మరామి వంటి పద్యాలు కూడ వసంతతిలకములే. శంకరులు లలితాపంచకము, కనకధారాస్తోత్రము, లక్ష్మీనృసింహ కరావలంబస్తోత్రములలో ఈ వృత్తమును వాడినారు. శంకరుల జీవితమునకు ఈ వృత్తములో
వ్రాయబడిన స్తోత్రములకు గల సంబంధమును చూద్దామా? శంకరులు విద్యాభ్యాసము చేయుచుండగా ఒక ద్వాదశి రోజు ఒక ఇంటిముందు నిలిచి భవతీ భిక్షాం దేహి అని అంటాడు. ఆ ఇంటిలో ఒక ముసలావిడ ఉన్నది. ఆమె నిరుపేద. ఏకాదశిరోజు ఉపవాసము చేసింది. ద్వాదశిరోజు ఇంటిలోని పొయ్యిలో పిల్లి కదలలేదు. ఆమెవద్ద తినుటకు ఏమియు లేదు. మరి బ్రహ్మచారి భిక్షకై వస్తే ఒట్టి చేతులతో పంపుట భావ్యము కాదు గదా. తాను తినవలె
ననుకొన్న ఒక ఉసిరికాయను తెచ్చి శంకరుని భిక్షాపాత్రలో వేసింది. బాలశంకరునికి స్థితి అర్థమయింది. అప్పుడు లక్ష్మీదేవిని ఉద్దేశించి కనకధారాస్తోత్రమును ఆశువుగా పాడగా, ఆ పేద ఇంటిలో నిజముగా కనకవృష్టి కురిసిందట. కనకధారాస్తోత్రములో ఎక్కువగా వసంతతిలకములే. బహుశా దారిద్ర్యము తొలగితే జీవితములో ఒక నవ వసంతము రావచ్చునని ఈ వృత్తమును ఎన్నుకొన్నారేమో?

నరసింహస్వామిపై వ్రాసిన కరావలంబస్తోత్రముపై రెండు కథలున్నాయి. ఒకప్పుడు ఒక కాపాలికుడు శంకరులను బలి ఇవ్వాలని తీసికొని వెళ్ళినప్పుడు వారి శిష్యుడు ఉగ్రనరసింహరూపము దాల్చి శంకరులను కాపాడినప్పుడు వానిని శాంతించుమని నరసింహస్తోత్రమును రచించెనట. మరొక కథ మండనమిశ్రుని కథకు సంబంధించినది. భారతీదేవితో శృంగారశాస్త్రముపై వాదించుటకై చనిపోయిన రాజు దేహములో పరకాయప్రవేశము చేసి రాజ్యము నేలుచు రాణివాసములో శృంగారముగురించి తెలిసికొనుచుండెను, రాజ్యమును చక్కగా పరిపాలించుచుండెను. రాజ్యములో కొందరు ఈ విషయమును గ్రహించి ఇలాగే కొనసాగితే దేశము సుభిక్షముగా బాగుంటుందని శంకరుల శిష్యులచే రహస్యముగా కాపాడబడుచున్న అతని పార్థివ శరీరమును దహించివేయవలయునని తీర్మానించిరి. ఇది తెలిసికొన్న శంకరులు తన దేహమును ప్రవేశించవలయునని త్వరత్వరగా వెళ్ళిరి. ఇంతలో దేహము సగముపైన కాలిపోయినదట. నరసింహస్వామిని ప్రార్థించి తన దేహమును తిరిగి సంపాదించుకొనెనట. నా చిన్నప్పుడు నాన్నగారు ఈ పద్యాలను వల్లించేవారు. క్రింద రెండు ఉదాహరణలు-

దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతే
కల్యాణగాత్రి కమలేక్షణ జీవనాథే
దారిద్ర్యభీతహృదయం శరణాగతం మాం
ఆలోకయే ప్రతిదినం సదయైరపాంగైః – కనకధారాస్తోత్రము (21)

దేవీ జగన్మాత విశ్వేశ్వరీ యొసగు
పద్మాక్షి మంగళగళా జీవసామ్రాజ్ఞి
దారిద్ర్య భయహృదయుడౌ నేను శరణంటి
ప్రతిదినము ననుజూడు కడగంటి దయతోడ

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం
శ్రీలక్ష్మీనృసింహ కరుణారస (కరావలంబన) స్తోత్రము (13)

లక్ష్మీపతీ జలజనాభ సురేశ విష్ణూ
యజ్ఞేశ యజ్ఞ మధునాశన విశ్వరూపా
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవా
లక్ష్మీనృసింహ చేయూత నొసంగు మయ్యా

శార్దూలవిక్రీడితము

అతి ప్రాచీన వృత్తములలో శార్దూలవిక్రీడితము ఒకటి. సంస్కృత కవులు ఈ వృత్తమును అధిక సంఖ్యలోనే వాడారు. కన్నడ తెలుగు సాహిత్యములలో విరివిగా కనిపించు సనాతన సంస్కృత వృత్తము ఇది ఒక్కటే. ఈ వృత్తము మాత్రమే నేరుగా సంస్కృతమునుండి ఏ మార్పు లేక ఈ భాషలలోనికి దిగుమతి చేసికొనబడినది. ఆచార్యుల వారు ఈ వృత్తములో కూడ సొంపుగా, ఇంపుగా సహజ గాంభీర్యము ఉట్టిపడేటట్లు రచించారు. శార్దూల చర్మముపై కూర్చుని శార్దూలచర్మాంబరధారిని స్మరించే యతిపుంగవులకు శార్దూలవిక్రీడితము కరతలామలకమే గదా! శార్దూలవిక్రీడితము కనబడే శంకరుని కొన్ని స్తోత్రములు- అన్నపూర్ణాష్టకము, ఏకశ్లోకీ, భ్రమరాంబాష్టకము, దక్షిణామూర్తిస్తోత్రము, గాయత్ర్యష్టకము, మణికర్ణికాష్టకము, మీనాక్షీపంచరత్నము, మీనాక్షీస్తోత్రము, సాధనపంచకము, శివమానసపూజ, శివాపరాధక్షమాపణాస్తోత్రము, ఉపదేశపంచకము. క్రింద రెండు పద్యములు-

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం – శివమానసపూజ (4)

దేవా శంభూ, దేవా శంభూ, నీవే ఆత్మ, దేవియె బుద్ధి
ప్రాణము నీ సహచరు లయ్యా, దేహము నీదు గేహము స్వామీ
అంగము లొసగెడు ఆనందములే నీ పూజకు నా సామగ్రి
రాతిరి కుంకులు నీ సమాధి స్థితి, నా పద సంచారము నీకు ప్రదక్షిణ
నా పలుకులు నీకగు స్తోత్రము, నా ప్రతి కార్యము నీ యారాధన

శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్జ్వలాం
శ్రీచక్రాంకిత బిందుమధ్యవసతీం శ్రీమత్సభానాయకీం
శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిం – మీనాక్షీపంచరత్నము (3)

శ్రీవిద్యన్, శివవామభాగనిలయన్, హ్రీంకారమంత్రోజ్జ్వలన్
శ్రీచక్రాంకిత బిందుమధ్యవసతిన్, శ్రీమత్సభానాయకిన్
శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననిన్, శ్రీమజ్జగన్మోహినిన్
మీనాక్షిన్ ప్రణుతింతు్ సంతతము నేన్, కారుణ్యవార్ధిన్ హృదిన్

శాలిని

ఆది శంకరులు కాశీలో నుండు సమయమున ఒక నాడు స్నానము చేసి విశ్వనాథుని ఆలయమునకు తడి బట్టలతో వెళ్ళుచుండె నట. ఆ సమయములో ఎదురుగా ఒక చండాలుడు వచ్చుచుండెనట. ఆ కాలపు వాడుక ప్రకారము శంకరులో లేక వారి శిష్యులో వానిని తొలగి పొమ్మనె
నట. నన్ను పోపొమ్మనిన మాత్రాన నేను దూరముందునా? అన్నమయమైన ఒక దేహము మరొక అన్నమయమైన దేహమునకు చెప్పు మాటలా ఇవి లేక ఒక ఆత్మ మరొక ఆత్మకు చెప్పు మాటలా ఇవి అని వాడు శంకరునకు ప్రత్యుత్తరము నిచ్చె నట. సూర్య కిరణములను అన్ని పాత్రలలోని నీరు ఒకే విధముగా ప్రతిఫలించ జేస్తుంది కదా. ఒక సూర్యుండు సమస్తలోకములకు తా నొక్కొక్కడై తోచునే యన్నట్లు ఒకే సూర్యుని ప్రతిబింబము మనకు గంగా నది నీటిలో, చండాలుని ఇంటి ప్రక్కన ఉండే నీటిలో కనబడుతుంది గదా? అదే విధముగా హేమ పాత్రలో నున్న నీటికి, మృణ్మయపాత్రలోని నీటికి ఏమి తేడా ఉంది? తక్షణమే శంకరులు తన కెదురుగా నున్నది శివశంకరుడే అని నిశ్చయించుకొని మనీష పంచకము అని ఐదు పద్యములను శార్దూలవిక్రీడితములో ఆశువుగా చెప్పెను. తుదకు శాలినీవృత్తములో వాని సారాంశమును తెలిపెను. శాలినీవృత్తమును అనాత్మశ్రీవిగర్హణలో, శివానందలహరిలో కూడ వాడెను. ఇక్కడ ఒకటి చెప్పాలి – శాలినీవృత్తము ఒక సంకుచిత మందాక్రాంత వృత్తము. శాలినీ వృత్తమునకు మనీషపంచకమునుండి ఉదాహరణ-

దాసస్తేऽహం దేహదృష్ట్యాऽస్మి శంభో
జాతస్తేంऽశో జీవదృష్ట్యా త్రిదృష్టే
సర్వస్యాऽత్మానాత్మదృష్ట్యా త్వమేవే-
త్యేత్వం మే ధీనిశ్చితా సర్వశాస్త్రైః – మనీషపంచకము (6)

దేహరూపములోన దాసుడను శంభూ
జీవరూపములోన భాగిని త్రినేత్రా
ఆత్మరూపములోన నీవుందు వెల్లరన్
సర్వశాస్త్రమ్ములు నేర్పినది నాకిదియె

శిఖరిణి

ఆచార్యులు చాకచక్యముతో, నైపుణితో వ్రాసిన మరొక వృత్తము శిఖరిణి. శంకరాచార్యులు ఈ రచనలలో శిఖరిణీవృత్తమును వాడారు- దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రము, జీవన్ముక్తానందలహరి, కృష్ణాష్టకము, యమునాష్టకము, సౌందర్యలహరి. ముఖ్యముగా సౌందర్యలహరియంతా ఈ వృత్తమే. ఇది వృత్తౌచిత్యమునకు ఒక ఉదాహరణ. సౌందర్యము అను పదమునకు సంపూర్ణతను, గరిష్ఠతను, ఔన్నత్యమును ఇచ్చు ఆ దేవీవర్ణనకు శిఖరిణి కాక మరే వృత్తము ఉచితమవుతుంది? సౌందర్యలహరిని గురించి ఒక కథ ఉన్నది. శంకరుడు ఒకప్పుడు (బహుశా స్వప్నావస్థలో) కైలాసమునకు వెళ్ళెనట. అక్కడ ఎన్నో శ్లోకాలున్న ఒక గోడను చూచెను. ఆ శ్లోకములను చదువ దొడగెను. దానిని గమనించిన గణపతి ఆ శ్లోకములను చదువుటకు దేవతలే అర్హులు, మానవులు అనర్హులని తలచి వాటిని తుడిచి వేసెనట. శంకరుడు 41 శ్లోకములను మాత్రమే చదివెను. తరువాత భూలోకమునకు వచ్చి (నిదుర మేల్కొని) మిగిలిన 59 శ్లోకములను పూరించెను. మొదటి 41 శిఖరిణీ వృత్తములను ఆనందలహరి యనియు, తరువాతి 59 వృత్తములను సౌందర్యలహరి యనియు పిలుచుట వాడుక. మొత్తము వంద పద్యములను సౌందర్యలహరి యందురు. ఇది తంత్రము, యోగము, భక్తి, శృంగారములతో నిండినది. ఇందులోని కొన్ని పద్యములను చదివిన తరువాత మనకు తోచేది ఏమంటే- శంకరులకు మండనమిశ్రుని భార్య భారతీదేవితో శృంగార విషయములలో వాదించుటకై పరకాయప్రవేశము ఎందులకో అనిపిస్తుంది. బహుశా సౌందర్యలహరి ఆ ఉదంతము తరువాతవ్రాయబడినదో ఏమో లేక దీనిని శంకరుడు వ్రాయలేదేమో? క్రింద ఒక శిఖరిణీ వృత్తము. ఇందులో పార్వతీదేవి కోపముతో శివునితన్నినదట. ఇట్టి వృత్తాంతము మనము పారిజాతాపహరణములో (లతాంతాయుధు కన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునన్ తొలగంద్రోసె లతాంగి …) ఈతగోవిందములో (మమ శిరసి మండనం దేహి పదపల్లవ ముదారం …) చదివి యున్నాము. బహుశా జయదేవుడు కూడ శంకరుని సౌందర్యలహరినుండి ఈ పాదతాడనోదంతమును గ్రహించెనేమో? క్రింద ఆ పద్యము శిఖరిణికి ఉదాహరణ-

మృషా కృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితం
లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే
చిరాదంతః శల్యం దహనకృత మున్మూలితవతా
తులాకోటిక్వాణైః కిలికిలిత మీశానరిపుణా – సౌందర్యలహరి (86)

తొందరలో మఱచేడు తప్పు పేరు చెప్పేడు
సవతి పేరు చెప్పేడు శివుడు తెల్లబోయేడు
భర్తపైన సవతిపైన కోపము నీకొచ్చింది
కెందామర పదములతో నుదుటిపైన తన్నేవు
మూడవకను తెఱచినపుడు దహనమైన రతిపతి కది
ముల్లువోలె మనసులోన బాధపెట్టె నెల్లవేళ
ముక్కంటిని అక్కడనే తన్నగాను తిన్నగాను
నవ్వె దాను కిలకిల మని కాలియందె సడులవోలె

శ్లోకము

తెలుగులో కంద పద్యమును వ్రాయనివాడు కవి కానేరడు అంటారు గదా? అదే విధముగా సంస్కృతములో శ్లోకము వ్రాయలేనివాడు కవి యవలేడు. పురాణేతిహాసాలలో కావ్యాలలో శ్లోకాలు ఎక్కువే. శ్లోకమంటే నేనిక్కడ ఎనిమిది అక్షరాల సౌలభ్య ఛందస్సును గురించి చెబుతున్నాను. శ్లోకమునకు బేసి పాదములలో ఐదు, ఆరు, ఏడు అక్షరములు య-గణముగా ఉండాలి. సరి పాదాలలో ఆ అక్షరాలు జ-గణముగా నుండాలి. మిగిలినవి హ్రస్వమైనా దీర్ఘమైనా సరియే. చివరి అక్షరము సామాన్యముగా గురువు. ఐదు, ఆరు, ఏడు అక్షరములు యజములైతే వల్లించుటలో ఒక లయ పుట్టుతుంది. కాశీపంచకము, శారదాప్రార్థనలలో శ్లోకములే. క్రింద శంకరుల శ్లోకము ఒకటి సరస్వతిపైన-

బ్రహ్మస్వరూపా పరమా
జ్యోతిరూపా సనాతనీ
సర్వవిద్యాధిదేవీ యా
తస్యై వాణ్యై నమోనమః – శారదాప్రార్థన (1)

శ్లో. బ్రహ్మరూపా పరంజ్యోతీ
పరమాత్మా పురాతనీ
సర్వవిద్యాధిసామ్రాజ్ఞీ
వాణీ యిత్తు నమస్సులన్

సుగంధి –

తెలుగు పద్యాలు చదివేవారికి ఉత్సాహ పరిచితమైనదే. ఉత్సాహలో పాదానికి ఏడు సూర్యగణములు (UI లేక III) చివర ఒక గురువు ఉంటుంది. అన్ని సూర్యగణాలు గ-లమైతే మనకు ప్రాప్తించే వృత్తమునకు సుగంధి అని పేరు. ఈ సుగంధి నిజముగా పంచచామరములోని మొదటి లఘువును తొలగించగా వచ్చిన వృత్తమే. కాలభైరవాష్టకము, శివపంచాక్షర నక్షత్రమాలాస్తోత్రములలో శంకరులు సుగంధివృత్తమును వాడినారు. దీనికి సంస్కృతములో తూణకము అని పేరు. శంకరుడు దక్షిణదేశవాసి, అతనికి తమిళ కన్నడములు తెలిసియుండవచ్చును. ద్రావిడ భాషలలో ప్రాస నియతము. సంస్కృతములో అవసరము లేదు. శివపంచాక్షర నక్షత్రమాలాస్తోత్రములో గల 27 పద్యాలకు ద్వితీయాక్షరప్రాసను వాడినారు.
క్రింద ఒక ఉదాహరణ-

జన్మ మృత్యు ఘోర దుఃఖహారిణే నమః శివాయ
చిన్మయైకరూపదేహధారిణే నమః శివాయ
మన్మనోరథావపూర్తికారిణే నమః శివాయ
సన్మనోగతాయ కామవైరిణే నమః శివాయ – శివపంచాక్షరీనక్షత్రమాల (8)

జననమరణముల వెతలను బాపెడు శివుడా నీకు నమస్సులు
జ్ఞానమునకు బ్రతిరూపము దాల్చిన శివుడా నీకు నమస్సులు
నా మన మందలి కోరిక దీర్చెడు శివుడా నీకు నమస్సులు
సజ్జనచిత్తనివాస స్మరాంతక శివుడా నీకు నమస్సులు

సురనర్తకీ (తరంగక)

సంగీతలయతో తాళబద్ధమై పాడుకొనుటకు వీలైన వృత్తములను ఎన్నియో ఆచార్యులవారు తమ స్తోత్రములకు ఎన్నుకొన్నారు. అట్టి వృత్తములలో సురనర్తకీ లేక తరంగక అను వృత్తము ఒకటి చాల అందమైనది, వినుటకు ఇంపుగా నుండును. ఈ వృత్తమునందలి ప్రతి పాదమునకు మూడు రగణ-నగణములు, చివర మరొక ర-గణము. దేవీ నవరత్నమాలికలోని నవరత్నాలు ఈ వృత్తమే. ఇందులో ద్వితీయాక్షర ప్రాస కూడ ఉన్నది. అందులో ఒకటి-

వారణానన మయూరవాహ ముఖ దాహ వారణ పయోధరాం
చారణాది సురసుందరీ చికుర శేకరీకృత పదాంబుజాం
కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం
వారణాంత ముఖ పారణాం మనసి భావయామి పరదేవతాం – దేవీనవరత్నమాలిక (6)

గజముఖుని షణ్ముఖుని దప్పికను వడి దీర్చు దివ్యామృతస్తనీ
చారణుల సుందరులు సిగపూలతోడ పదకమలముల దాకిరే
పంచ భూతమ్ములకు ప్రకృతికిని కారణా ప్రప్రథమ మాతృకా
గజాసురజీవహరశాంతినీ తలతు నిను మనసు బరదేవతా

స్రగ్ధర

స్రగ్ధర ఒక అందమైన వృత్తము. స్రగ్ధర అనగా మాలాధారిణి అని అర్థము. మహాకవులు స్రగ్ధరను ఆరంభశ్లోకముగా కూడ వాడిరి. కాళిదాసు అభిజ్ఞానశాకుంతల, మాళవికాగ్ని మిత్రములలో, నన్నెచోడుని కుమారసంభవములో మొదటి పద్యము స్రగ్ధరయే. కవులకు కూడ మూఢ నమ్మకాలున్నాయి. స్రగ్ధర మ-గణ, ర-గణములతో ఆరంభ మవుతుంది కనుక అది మరణయోగకారకమని నన్నెచోడుని తరువాతి తెలుగు కవులు తలచిరి. వారెవ్వరు స్రగ్ధరను కావ్యారంభములో నుపయోగించలేదు! పాదమునకు మూడు భాగములు, మొదట గురువులు, తరువాత లఘువులు, తరువాత గురు-లఘువులు. అందమైన స్రగ్ధరను వ్రాయుట శార్దూలవిక్రీడితముకన్నను కష్టమే. కాశీపంచకములోని చివరి పద్యము, శివాపరాధక్షమాపణా స్తోత్రము, శివానందలహరి, త్రిపురసుందరీ మానసపూజాస్తోత్రములలో కొన్ని పద్యములను స్రగ్ధరావృత్తములో వ్రాసినారు శంకరులు. నేను శివానందలహరిలోని చివరి పద్యములలో నొకటైన స్రగ్ధరను మీముందు ఉంచుచున్నాను-

సర్వాలంకారయుక్తాం సరలపదయుతాం సాధువృత్తాం సువర్ణాం
సద్భిఃసంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం
ఉద్యద్భూషావిశేషాముపగతవినయాం ద్యోతమానార్థరేఖాం
కల్యాణీం దేవ గౌరీప్రియ మమ కవితాకన్యకాం గృహాణ – శివానందలహరి (98)

పైపద్యములోని అలంకారములు శ్లేష, స్వభావోక్తి. శివానందలహరి అనే కావ్యకన్యకను
అందుకొనుమని శివుని ప్రార్థిస్తూ వ్రాసినది ఇది. ఇందులో కన్యకకు అన్వయించు విధముగా,
కావ్యమునకు అన్వయించు విధముగా పదములను ఆచార్యులు వాడినారు.

సర్వాలంకారయుక్తను (ఉపమాది అలంకారములు గల దానిని లేక హారాది అలంకారములు గల దానిని), సరళపదయుతను (సులభమైన పదములు గల దానిని లేక వంకర లేని తిన్నని అడుగులు గల దానిని), సాధువృత్తను (మంచి పద్యములు గల దానిని లేక మంచి నడవడిక గల దానిని), సద్భిఃసంస్తూయమానను (పెద్దలచే పొగడబడిన దానిని), సరసగుణయుతను (నవరసములతోడి గుణములు గల దానిని లేక చక్కని గుణములు గల దానిని), లక్షితను (గుర్తించబడిన దానిని), లక్షణాఢ్యను (కావ్యలక్షణములు గల దానిని లేక శుభ లక్షణములు గల దానిని), ఉద్యద్భూషావిశేషను (వేదాంతవిశేషములతో ప్రకాశించు దానిని లేక ప్రత్యేక భూషణములతో ప్రకాశించు దానిని), ఉపగతవినయను (రహస్యములు గల దానిని లేక వినయము గల దానిని), ద్యోతమానార్థరేఖను (అర్థవంతమగు ధార గల దానిని లేక ధనరేఖ గల దానిని), ఈ కల్యాణిని, నా కావ్యకన్యకను ఓ దేవా గౌరీప్రియా స్వీకరించుము. ఇందులోని పదములు శ్లేషార్థములో కవిత్వమునకు, స్వభావోక్తిలో కన్యకకు వర్తిస్తాయి.

స్రగ్విణి

లయతో పాడుటకు వీలుగానుండు వృత్తములలో స్రగ్విణి ఒకటి. స్రగ్విణి యంతా ర-గణ మయమే. అచ్యుతాష్టకములో నున్నది స్రగ్విణీ వృత్తమే. వనమాలాధారియైన కృష్ణుని వర్ణించుటకు స్రగ్విణీవృత్తము సబబే కదా! క్రింద ఒక ఉదాహరణ-

అచ్యుతం కేశవం రామ నారాయణం
కృష్ణ దామోదరం వాసుదేవం హరిం
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే – అచ్యుతాష్టకము (1)

అచ్యుతుని కేశవుని రామనారాయణుని
కృష్ణదామోదరుని వాసుదేవుని హరిని
శ్రీధరుని మాధవుని గోపికావల్లభుని
జానకీనాయకుని రామచంద్రుని గొలుతు

హరిణి

త్రిపురసుందరీమానసపూజస్తోత్రములో కొన్ని విశేష వృత్తములను ఆదిశంకరులు ఉపయోగించిరి. అందులో హరిణికి ఉదాహరణ.

కనకరచితే పంచప్రేతాసనేన విరాజితే
మణిగణచితే రక్తశ్వేతాంబరాస్తరణోత్తమే
కుసుమసురభౌ దివ్యోపధానసుఖావహే
హృదయకమలే ప్రాదుర్భూతాం భజే పరదేవతాం – త్రిపురసుందరీమానసపూజాస్తోత్రము (23)

బంగారు మయమైన ఆసనమ్మున శోభతో నుండు
మణిరాశి మధ్యలో ధవళారుణాంబరము పైన
సుమ సుగంధములతో దివ్యసుఖపీఠమున నెపుడు
హృదయకమలాన నుదయించు పరదేవతను గొలుతు

ముగింపు

శ్లోకరూపములో మాత్రమే కాదు, పలు వృత్తరూపములలో కూడ స్తోత్రములను వ్రాయ వీలగునని ఆదిశంకరాచార్యులు నిరూపించిరి. సుమారు 1200 సంవత్సరాలు గడచినా వారు వ్రాసిన మహోత్తమ వృత్తాలను ప్రజలు తమ గృహాలలో, ఆలయాలలో, సమారంభాలలో ఇంకా చదువుచున్నారు. సంగీతకారులు వాటికి క్రొత్త క్రొత్త రాగాలను కట్టుతూ ఉన్నారు. ఆ పద్యాలలో అందమైన శబ్దాలు, మనసుకు హాయి నిచ్చే లయలు, పరవశింపజేసే గతులు ఉన్నాయి. అందుకనే అవి అజరామరమయ్యాయి. ఆత్మ అంతరాత్మను అన్వేషించుటకు ఛందస్సు ఒక చక్కని సాధనమని ఆచార్యులు నిరూపించారు.

పట్టిక 1 – ఈ వ్యాసములో నున్న శంకరాచార్యుల పద్యముల వివరములు.

పట్టికలో క్రమముగా వృత్తనామము, అందులోని అక్షర సంఖ్య, ఛందస్సు పేరు, ఆ ఛందస్సులో ఆ వృత్తపు సంఖ్య, యతివిభజన ప్రకారము గురులఘువులు, తెలుగులో యత్యక్షర సంఖ్య తెలుపబడినవి.

శాలిని 11 త్రిష్టుప్ 289 (UUUU) (UIUUIUU) 7

ఇంద్రవజ్ర 11 త్రిష్టుప్ 357 (UUIUUIIUIUU) 8

ఉపేంద్రవజ్ర 11 త్రిష్టుప్ 358 (IUIUUIIUIUU) 8

రథోద్ధత 11 త్రిష్టుప్ 699 (UIUIIIUIUIU) 7

భుజంగప్రయాతము 12 జగతి 586 (IUUIUUIUUIUU) 8

స్రగ్విణి 12 జగతి 1171 (UIUUIUUIUUIU) 7

ద్రుతవిలంబితము 12 జగతి 1464 (IIIUIIUIIUIU) 7

ప్రహర్షిణి 13 అతిజగతి 1401 (UUU) (IIIIUIUIUU) 8

మత్తమయూరము 13 అతిజగతి 1633 (UUUU) (UIIUUIIUU) 8

వసంతతిలక 14 శక్వరి 2933 (UUIUIIIUIIUIUU) 8

మాలిని 15 అతిశక్వరి 4672 (IIIIIIUU) (UIUUIUU) 9

సుగంధి 15 అతిశక్వరి 10923 (UIUIUIUIUI) (UIUIU) 9

పంచచామరము 16 అష్టి 21846 (IUIUIUIU) (IUIUIUIU) 10

పృథ్వీ 17 అత్యష్టి 38750 (IUIIIUIU) (IIIUIUUIU) 12

హరిణి 17 అత్యష్టి 46112 (IIIIIU) (UUUU) (IUIIUIU) 12

శిఖరిణి 17 అత్యష్టి 59330 (IUUUUU) (IIIIIUUIIIU) 13

శార్దూలవిక్రీడితము 19 అతిధృతి 149337 (UUUIIUIUIIIU) (UUIUUIU) 13

స్రగ్ధర 21 ప్రకృతి 302993 (UUUUIUU) (IIIIIIU) (UIUUIUU) 8, 15

సురనర్తకీ 21 ప్రకృతి 765627 (UIUIII) (UIUIII) (UIUIII) (UIU)

కవిరాజవిరాజితము 23 వికృతి 3595120 (IIIIUII) (UIIUII) (UIIUII) (UIIU) 8, 14, 20

ఆర్యా- పూర్వార్ధము ఏడు చతుర్మాత్రలు, ఒక గురువు

ఉత్తరార్ధము ఐదు చతుర్మాత్రలు, లఘువు, చతుర్మాత్ర, గురువు

శ్లోకము 8 అనుష్టుప్ (5,6,7 అక్షరాలు)

బేసి పాదములు య-గణము, సరి పాదములు జ-గణము

అర్ధసమ వృత్తములు-
పుష్పితాగ్రా బేసి (IIIIII) (UIUIUU) సరి (IIIIUII) (UIUIUU)

ఔపచ్ఛందసిక బేసి (6 మాత్రలు) (ర-య) సరి (8 మాత్రలు) (ర-య)

సరిపాదములలో సరి మాత్రలు దీర్ఘముతో ఆరంభమవదు

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...