భారతీయ సంస్కృతిలో అక్షరం
“అక్షరాణాం అ-కారో ఽస్మి ద్వంద్వః సామాసికస్య చ
అహం ఏవాక్షయః కాలో ధాతాహం విశ్వతో-ముఖః”
— భగవద్గీత, 10.33
“శ్రోత్రోపలబ్ధిర్ బుద్ధినిర్గ్రాహ్యః ప్రయోగేణాభిజ్వలిత ఆకాశదేశః శబ్దః”
— పతంజలి, మహాభాష్యం, నిర్ణయసంగ్రహం 1.87
“లిపిష్వేవాక్షరబుద్ధిర్ అబుద్ధానాం”
— మహాభాష్య ప్రదీప వ్యాఖ్యానాని 1.21
పాశ్చాత్య ప్రపంచంలో రాత పరిణామక్రమం ఐదు దశలుగా జరిగిందని ఇంతకు ముందు వ్యాసంలో చూశాం. చిత్రలిపులతో మొదలయి, పూర్తి స్థాయి ధ్వన్యలిపుల (అక్షరసమామ్నాయం) దిశగా అక్కడ లిపులు, రాత పరిణామం సాగింది. కానీ, భారత ఉపఖండంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా, ముందుగా ధ్వనిశాస్త్రం అభివృద్ధి చెందింది. ఇక్కడ అక్షర సమామ్నాయం (అక్షరమాల) పూర్తిగా ధ్వనిరూపకంగా క్రీ,పూ 700 నాటికే ఏర్పడింది. ఆ తరువాతే దానికి లిపితో అనుసంధానం జరిగింది. పాణినికి చాలా పూర్వమే అక్షర సమామ్నాయం ప్రసక్తి వేదాంగాలైన ప్రాతిశాఖ్యలలో కనిపిస్తుంది. ఋగ్వేద ప్రాతిశాఖ్యలోనూ, కృష్ణ యజుర్వేదానికి చెందిన తైత్తిరీయ ప్రాతిశాఖ్య, శుక్ల యజుర్వేదానికి చెందిన వాజసనేయి ప్రాతిశాఖ్యలోనూ భారతీయుల ధ్వనిశాస్త్రానికి పునాదులు ఉన్నాయి. ప్రాచీన భారత సంస్కృతిలో అక్షరం అంటే ధ్వనిరూపకమేగానీ, దృశ్యరూపకం కాదు. అందుకే, నాగేశ భట్టుడు మహాభాష్య ప్రదీప వ్యాఖ్యానాని అన్న గ్రంథంలో “లిపిశ్వేవాక్షరబుద్ధిర్ అబుద్ధానాం” (పామరులు అక్షరం అంటే లిపి అని పొరబాటు పడతారు) అంటాడు. పతంజలి, తన మహాభాష్యంలో, అకాశరూపకమైన శబ్దం (భాషాభివ్యక్తి) పలికేవాడి మాట రూపంలో వ్యక్తీకరించబడి, శ్రోత బుద్ధి చేత గ్రహించబడుతుంది, అని తీర్మానించాడు. పతంజలి, కాత్యాయనులిద్దరూ కూడా అష్టాధ్యాయిలో శివసూత్రాలలో మొదటి సూత్రం అ, ఐ, ఉణ్ అనే శబ్దాలు, ఆ స్వరాల అన్ని రకాల ఉచ్చారణలకీ సాధారణ శబ్దస్వరూపాలే అంటారు (generic phonetic shape). దీనినే పతంజలి, “అవర్ణాకృతిర్ ఉపదిష్టా స్వరమ్ అవర్ణకులం గ్రహీష్యతి, తథేవర్ణాకృతిః తథోవర్ణాకృతిః” (శివసూత్రాలలోని అకారం అకార ఉచ్చారణలన్నిటిని సూత్రీకరించే శబ్ద స్వరూపం, మహాభాష్యం 1:87, నిర్ణయసంగ్రహం) అంటాడు. ఇంతే కాకుండా, ప్రాచీన వైయాకరుణులు, భాష విషయంలో వాడిన ‘ఆకృతి,’ రూపం,’ ‘సరూపం,’ ‘అదర్శనం,’ వంటి పదాలు కూడా ధ్వనిరూపకాలు గానే వాడారు కానీ, దృశ్యరూపకాలుగా కాదు. పాణిని, పతంజలి, కాత్యాయనుడు — వీరంతా కూడా దృశ్యరూపకమైన వర్ణనలతో శబ్దరూపాలని వివరిస్తారు. ఉదాహరణకి, రూపం అంటే శబ్దరూపం, సరూపం అంటే ఒకేరకమైన శబ్దాలు, ఆకృతి అంటే అక్షరం యొక్క శబ్దచిత్రం. పాణిని, వ్యాకరణ వస్తువు లుప్తం అవడాన్ని ‘అదర్శనం’ (deletion) అని వ్యవహరించాడు. ఈ వాడుకలన్నీ శబ్ద-దృశ్యాలే తప్పించి, వీటీకి రాతకి ఎటువంటి సంబంధం లేదు.
ఉతత్వః పశ్యన్ నదదర్శ వాచం ఉతత్వః శృణ్వన్ నశృణేత్యేవామ్ (కొందరు మాటను – వేదవాక్కును – చూచీ చూడరు, కొందరు వినీ వినరు) (10-71-4); అక్షరేణా మిమతేసప్తవాణీ (1-164-24); తతోవా అష్టాక్షరా గాయత్ర్యభవ దేవాదేశక్షరాత్రిష్టుప్ (ఇది ఐతిరేయ బ్రాహ్మణంలో అక్షర ప్రస్తావన.)
ఋగ్వేదంలో ఈ శ్లోకాలని చూపించి, తిరుమల రామచంద్ర తన లిపి-పుట్టుపూర్వోత్తరాలులో, అక్షరమాల ప్రస్తావన వేదకాలం నుంచే కాబట్టి, అప్పటినుండే లిపి ఉందని వాదించారు. అయితే, వేదంలో గానీ, అష్టాధ్యాయిలో గానీ అక్షరం అంటే అది ధ్వనిరూపకమే గానీ లిపిరూపకం కాదు.
వేదాంగాలైన శిక్ష, ఛందస్సు, నిరుక్తము; వ్యాకరణాలలో శిక్ష, ప్రాతిశాఖ్యలు, ప్రత్యేకంగా ధ్వనిశాస్త్రానికి సంబంధించిన ఉపాంగాలు. ఋగ్వేదంలో ప్రాతిశాఖ్య, తైత్తిరీయ ప్రాతిశాఖ్యలోని ముఖ్యమైన భాగాలు పాణినికి ముందునాటివి. పాణినికి వీటి గురించి బాగాతెలుసు. వేదోచ్చారణకి సంబంధించిన సూక్ష్మమైన, ప్రత్యేకమైన సూత్రాలు, విశ్లేషణ వీటిల్లో ఉంటుంది. వేదాలను మౌఖికంగానే కల్పించి, మౌఖిక రూపం లోనే వాటి అస్తిత్వాన్ని ఉంచబట్టి, క్రీ.పూ. 700 నాటికే ధ్వనిశాస్త్రం భారత సంస్కృతిలో అభివృద్ధి చెందింది. శబ్ద స్వరూపాలని అధ్యయనం చెయ్యడానికి అవసరమైన శాస్త్రీయ విశ్లేషణ పరికరాలన్నీ కూడా అప్పటికే ఏర్పడ్డాయి. క్రీ.పూ ఏడవ శతాబ్ది నాటికి వేదభాషకి, వ్యవహారికమైన, సాహిత్యపరమైన సంస్కృతానికి, ఇతర దేశభాషలకి మధ్య ఉచ్చారణలో ఎంతో వైవిధ్యం ఏర్పడింది. అందువల్ల, వేదోచ్చారణలో తప్పులు దొర్లడం, కొన్ని శబ్దాల ఉచ్చారణ పూర్తిగా లుప్తమై పోవడంతో వేదోచ్చారణని ప్రమాణీకరించవలసి వచ్చింది. క్రీ.పూ 100 దరిదాపుల్లో వచ్చిన మహాభాష్యం మొదటి అధ్యాయం లోనే ధ్వనిశాస్త్రాన్ని శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చెయ్యడం, వేదోచ్చారణలో లోపాలు రాకుండా, వేదోచ్చారణ పరిరక్షించడానికే అని చెప్పవచ్చును. సరైన ఉచ్చారణని నేర్పడం కోసం వర్ణం, స్వరం, మాత్ర, బలం, సామం, సంతానం, అని ఆరు రకాలుగా ధ్వనిని అధ్యయనం చేసేవారని తైత్తిరీయోపనిషత్తు ద్వారా మనకి తెలుస్తోంది. స్వరాలు, వ్యంజనాలని వేరుగా గుర్తించడం, వ్యంజనాలని స్పర్శ, అంతస్థాలు, ఊష్మాలని మూడు రకాలుగా వర్గీకరించడం ఆనాటి నుండీ ఉంది.
స్థూలంగా, పాశ్చాత్య ప్రపంచంలో రాత పుట్టుక ఒక మార్గంలో జరిగింది; బొమ్మని, భాషని కలుపుకోవడానికి వారికి ‘అక్షరాలు’ అవసరమయ్యాయి. అందుకే, ఎద్దు బొమ్మ కాలక్రమంలో ఆ పదంలోని మొదటి శబ్దం ‘ఏ’ని సూచిస్తూ, కాలక్రమంలో, ఆ చిత్రమే మార్పులకి లోనవుతూ, అది వస్తు ప్రపంచంతో సంబంధాన్ని పూర్తిగా తెంచుకొని, ఒక ధ్వని-సమూహానికి దృశ్య చిహ్నంగా మారింది. అందుకే, లాటిన్ వర్ణమాలాక్రమం (ఎ, ఎ తరువాత బి, బి తరువాత సి) ధ్వనిశాస్త్ర వర్గీకరణ కాదు. అయితే, వారి చిత్రలిపుల నుంచి పాశ్చాత్య అక్షర సమామ్నాయం ఎలా వచ్చింది అనేదీ ఇప్పటికీ తేలని ప్రశ్న. ఏమయినప్పటీకీ, ఈనాటి పాశ్చాత్య అక్షరమాల ‘పిక్చర్ – ప్రిన్సిపల్స్’ నుండి వచ్చిందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.
కాని, భారత సంస్కృతిలో రాత పుట్టుక వేరే విధంగా జరిగింది. ఇక్కడ అక్షర సమామ్నాయం (అక్షరమాల) పూర్తిగా ధ్వనిరూపకంగా ఏర్పడిన తరువాతే దానికి లిపితో అనుసంధానం జరిగింది. ముఖ్యంగా, అజంత రూపాలుగా లిఖితాక్షరాలు రాయడం, దానివల్ల గుణింతాల అవసరం భారతీయ భాషాలిపులకి ప్రత్యేకం. అందుకే, ధ్వన్యాక్షరాలని లిఖితరూపం లోకి తేవడంలో ఇక్కడ కొన్ని ప్రత్యేక సమస్యలు వచ్చాయి. అయితే, ఈ రెంటి సంస్కృతులలో రాత పరిణామంలో వచ్చిన ఈ తేడాలని సమగ్రంగా అర్థం చేసుకోకపోవడం వల్ల, రాత చరిత్ర అధ్యయనంలో ఎన్నో అనవసరమైన వివాదాలు తలెత్తున్నాయి. రాత చరిత్రని మిగిలిన ఎన్నో చారిత్రక అంశాలతో కలిపివేసి చూస్తున్నాం. ఉదాహరణకి, సింధు నాగరికతకి, ఆర్య-ద్రవిడ సిద్ధాంతాలకి మధ్య సంబంధాలు; వైదిక సంస్కృతి ఎప్పుడు వచ్చింది; ఉత్తరాది-దక్షిణాది భాషలు, సంస్కృతుల మధ్య తేడాలు; ఇవన్నీ కూడా భారత సంస్కృతిలో రాత చరిత్రని అధ్యయనం చెయ్యడంలో భాగమైపోయాయి. కానీ, ఈ వ్యాసంలో ప్రతిపాదిస్తున్నట్టుగా భారత సంస్కృతిలో మౌఖికమైన, పూర్తిగా శబ్ధపరమైన అక్షర సమామ్నాయం అభివృద్ధి చెందాకే దానికి లిపితో సంపర్కం జరిగిందనే అవగాహనతో ఇక్కడి రాత చరిత్రని పరిశీలిస్తే చాలా ప్రశ్నలకి సమాధానాలు కొత్తగా వెతకవచ్చు. అంతే కాకుండా, ఈ రకంగా చూస్తే సింధు నాగరికతలో దొరికిన లిఖిత సంజ్ఞలు అక్షర లిపులా, కాదా అనే వివాదం ఒకరకంగా పూర్తిగా అనవసరం. నిజానికి, విట్జెల్ (Michael Witzel), ఫార్మర్ (Steven Farmer) ప్రతిపాదించినట్టుగా ఆ సంజ్ఞలు భాషని రాయడానికి ఉపయోగించిన లిపి వ్యవస్థ కాదనుకున్నా, భారత సంస్కృతిలో రాత చరిత్రకి వచ్చిన నష్టం ఏమీ ఉండదు. పైగా, మన లిపులలో సంయుక్తాక్షరాలు, గుణింతాలు మొదలైన వాటి పుట్టుకని సులువుగా తార్కికంగా అర్థం చేసుకోవచ్చు.
ప్రాచీన భారత సంస్కృతి ప్రధానంగా మౌఖిక సంప్రదాయం అనేది నిర్వివాదాంశం. ఋగ్వేదం నుండి ఉపనిషత్తులు, సూత్రాల కాలం వరకు (~ క్రీ.పూ. 1200-500) పాణిని వ్యాకరణంతో సహా, అన్నీ మౌఖిక పుస్తకాలే (oral texts). అశోకుని కాలానికి ముందు రాత గురించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం మనకు కనబడుతున్న దాఖలాలతో క్రీ.పూ. మూడవ శతాబ్దంలో అశోకుని శాసనాలతోనే రాత ప్రారంభమయ్యింది. భారత ఉపఖండంలో శబ్దోచ్చారణకున్న ప్రాధాన్యత, ఉచ్చారణ ఆశువుగా నేర్చుకోవడానికి ఏర్పరచిన కఠినమయిన నియమాలు, మరింక ఏ ప్రాంతం లోను కనపడవు. ఈ పరిస్థితి భారత ఉపఖండానికి ప్రత్యేకం. ఈ నేపథ్యం లోంచే బలమైన ధ్వనిశాస్త్రం అభివృద్ధి చెందింది. అయితే, వేద వాఙ్మయం ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా దాని ఉచ్చారణని యథాతథంగా ఈనాటికీ పరిరక్షించుకుందనే నమ్మకం పూర్తిగా నిజం కాదు.
క్రీ.పూ 700 నాటికి, ప్రాచుర్యంలో ఉన్న సంస్కృతానికి, వేద సంస్కృతానికి మధ్య ఎంతో తేడా వచ్చింది. అప్పటికే వేదోచ్చారణలో ఎన్నో మార్పులు వచ్చాయి. వేదోచ్చారణని పరిరక్షించడానికి, అది నష్టపోకుండా భద్రపరచడానికి అప్పటినుండీ ఎన్నో రకాల ప్రయత్నాలు జరిగాయి. ఇటువంటి ప్రయత్నమే పాణిని అష్టాధ్యాయి విషయం లోనూ జరిగింది. అష్టాధ్యాయి కూడా మౌఖిక రచనే. అది మౌఖికం గానే ఎన్నో శతాబ్దాల పాటు ప్రాచుర్యంలో ఉంది. ఆ ప్రక్రియలో, అష్టాధ్యాయిని అర్థం చేసుకోవడం లోనూ, వ్యాఖ్యానించడం లోనూ ఎన్నో వైవిధ్యాలు, వైరుధ్యాలు వచ్చాయి. అష్టాధ్యాయికున్న వ్యాఖ్యానాలు, వార్త్తికలని చారిత్రకంగా పరిశీలిస్తే మౌఖిక పుస్తకాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. రాత ప్రాచుర్యం లోకి వచ్చాక కూడా, అది — మౌఖిక సంప్రదాయమే ప్రబలంగా ఉండి — అప్రధానమైన పాత్రనే పోషించింది. ఇదే సమయంలో బౌద్ధం ప్రాబల్యం లోకి రావడంతో హిందూ/వైదిక సంప్రదాయానికి, బౌద్ధానికి మధ్య ఘర్షణ మొదలైంది. ఈ సంఘర్షణలో మౌఖిక, లిఖిత సంప్రదాయాలు కూడా తమ వంతు పాత్రని పోషించాయి. బౌద్ధ సంప్రదాయం రాయడానికి ప్రాధాన్యత నిచ్చింది. హిందూ/వైదిక సంప్రదాయం మౌఖిక పద్ధతులనే బలంగా నమ్ముకుని, రాత పట్ల విముఖతని ప్రదర్శించింది. వేదాన్ని రాసినవాడు నరకానికి పోతాడనే నమ్మకం ప్రచారం లోకి వచ్చింది. పతంజలి, కాత్యాయనుడు మొదలైన పండితులు కూడా వైదిక సంప్రదాయానికి కొమ్ము కాసి, భాషలో ధ్వనిశాస్త్రానికే ప్రాధాన్యం ఇచ్చారు. మాధవ్ దేశ్‌పాండే మాటల్లో చెప్పాలంటే:
“The fact of writing known to us from other sources, is in the deep background, unacknowledged and perhaps unappreciated while orality is in the foreground of this educational setup”.
వాయువ్య ప్రాంతాలకీ ఉత్తర/తూర్పు ప్రాంతాలకి మధ్య రాత మూలంగా వచ్చిన ఒత్తిడి
వాయువ్య ప్రాంతాలైన గాంధార, పంజాబు, సింధు ప్రాంతాలలో పశ్చిమానికి చెందిన గ్రీకుల, పర్షియన్ సంస్కృతుల ప్రభావం ఎక్కువగా ఉండేది. కోసల, మగధ ప్రాంతాలలో బౌద్ధుల, హిందూ/వైదిక సంస్కృతుల ప్రభావం ఉండేది. భారతీయ సంస్కృతి రాత పరిణామంలో ఇదొక ముఖ్యమైన చారిత్రక అంశం. వాయువ్య ప్రాంతాలలో పర్షియన్ల సంపర్కంతో అభివృద్ధి చెందిన ఖరోష్టి లిపి, గ్రీకుల ద్వారా వచ్చిన అరమయాక్ లిపి, మౌర్యుల కాలంలో మగధ, కోసల ప్రాంతాలలో అభివృద్ధి చెందిన బ్రాహ్మీ లిపి — అతి ముఖ్యమైన లిపులు. బ్రాహ్మీ లిపి నుంచే ఈనాటి భారతీయ భాషల లిపులన్నీ వచ్చాయి. ఖరోష్టి, అరమయాక్ లిపులు లిపి వాయువ్య ప్రాంతానికి మాత్రం పరిమితమై కాలక్రమంలో మరుగున పడిపోయాయి.
అలెక్జాండర్ దండయాత్ర (~ క్రీ.పూ 326) తరువాత (క్రీ.పూ. 305) మౌర్యులు గాంధార (ఆఫ్ఘనిస్తాన్) ప్రాంతాన్ని తమ ఆధీనం లోకి తెచ్చుకున్నారు. ఆ తరువాత (~ క్రీ.పూ. 150) ఈ ప్రాంతాన్ని మౌర్యుల నుండి బాహ్లిక (బాక్ట్రియా) పాలకులైన గ్రీకులు ఆక్రమించుకున్నారు. దాంతో గాంధార, పంజాబు, సింధు, ముఖ్యంగా బాహ్లిక (బాక్ట్రియా) ప్రాంతాల్లో సాంస్కృతికంగా కూడా గ్రీకుల ప్రభావం పెరిగింది. మిలిటరీ పదాలైన, ఖలీన (గుర్రపు కళ్ళెము, గ్రీకు: khalinos), కేణిక (గుడారము, skẽnḗ), పరిస్తోమ (ఏనుగు మీద పరిచే ఎర్ర కంబళి, perístrōma), సురుంగ (సొరంగము, Surinx); అలాగే రాతకు సంబంధించిన మేల (సిరా), కలమ (కలము, గ్రీకు kalamos నుండి, రెల్లు కాడల నుండి చేసినది) పదాలు వచ్చాయి. గ్రీకులు కొందరు బౌద్ధ మతాన్ని — మౌర్యులపై దండయాత్రల్లో ముఖ్యుడైన మెనాండ్రోస్ (Menandros) తరువాత మిళిందుడయ్యాడు — కొందరు వైష్ణవ మతాన్ని (ఉదా: గ్రీకు రాయబారి హీలియోడరస్, Heliodoros) అవలంబించారు.
క్రీ.శ. ఒకటవ శతాబ్ది నాటికి వాయువ్య ప్రాంతం నుండి సాకేత (అయోధ్య), మాధ్యమిక (ఉజ్జయిని) ప్రాంతాల వరకు గ్రీకులు అక్కడి ప్రాకృత భాషల్లో ఖరోష్టి, బ్రాహ్మీ (కొన్ని సార్లు గ్రీకులో కూడా) లిపుల్లో రాస్తే, వైదిక/హిందూ మతాన్ని బలంగా ఆచరించిన శుంగులు (ఉదా. బ్రాహ్మణ రాజైన పుష్యమిత్రుడు) బ్రాహ్మీ లిపిలో రాసేవారు. సంస్కృతానికి దగ్గరగా ఉన్న తొలి శాసనాలు కూడా శుంగుల కాలం నాటివే. మౌర్యుల బౌద్ధానికి, శుంగుల వేద మతాలకి భిన్నంగా తూర్పు (ఈనాటి ఒరిస్సా) ప్రాంతపు రాజైన ఖారవేలుడు తనను జైన మతస్తునిగా చెప్పుకున్నాడు. అతని శాసనాలు, బ్రాహ్మీకి దగ్గరగా వున్న లిపిలో రాయబడినా, అశోకుని మాగధికి భిన్నంగా, తూర్పు ప్రాంతపు భాష కాని పశ్చిమ ప్రాంతపు ప్రాకృతంలో (శాతవాహునులు వాడినది; మధ్య, దక్షిణ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యంలో వున్నది) వుంటాయి. శుంగులనుండి క్రీ.పూ. 130 నాటికి పశ్చిమ ప్రాంతాన్ని (నేటి గుజరాత్, సింధు) పర్షియా నుండి వచ్చిన శకులు ఆక్రమించుకున్నారు. క్రీ.శ. 150 నాటికి పశ్చిమ దేశమంతా (రాజస్థాన్, నర్మద నదీ లోయ, దక్కను ప్రాతాలు కూడా) శకుల పాలన క్రిందకి వచ్చింది. వీరిలో ముఖ్యుడైన రుద్రదమనుడు సౌరాష్ట్ర లోని జునాగఢ్‌లో రాయించిన శాసనం సంస్కృతంలో రాయబడిన తొలి పొడవైన శాసనంగా పేరు గాంచింది. దీనిలో వాడబడిన కవితాత్మకమైన భాష, ప్రశస్తి అప్పటి వరకు రాయబడుతున్న శాసనాలకు పూర్తిగా భిన్నమైనది. దీనితో నాలుగు వందల ఏళ్ళుగా ప్రాకృత భాషలలోనే రాసే సాంప్రదాయానికి తెరపడినట్లయ్యింది.
వైదిక, బౌద్ధ మతాలపై రాత ప్రభావం
వైదిక సంప్రదాయంలో రాతని ఎక్కువగా పట్టించుకోలేదు. రాత గురించి పాణిని కాలం నాటినుంచే అవగాహన ఉన్నప్పటికీ, ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ కొత్త పరిణామాన్ని అడ్డుకోవడానికే ఎక్కువగా ప్రయత్నాలు జరిగాయి. దీనికి కారణాలు అనేకం. సాంకేతికమైన మార్పులు వచ్చినప్పుడు, సమాజంలో కొన్ని సమీకరణాలు కూడా మారిపోతాయి. ఆ మార్పులు సమాజంలో అప్పటికే పాతుకుపోయి ఉన్న కొన్ని వృత్తులని, అధికారాలని, సంబంధాలని సవాలు చేస్తాయి. అటువంటి పరిస్థితులలో మార్పును అడ్దుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. రాత అటువంటి ఒక కొత్త సాంకేతిక పరిణామం.
ఇది భారత సంస్కృతికి ప్రత్యేకం కాదు. పర్షియన్ సామ్రాజ్యాల ప్రాబల్యంతో అరమయాక్, ఖరోష్టి లిపులు వచ్చాక, వైదిక సంప్రదాయాన్ని మౌఖిక పద్ధతిలోనే అభ్యసించడానికి అలవాటుపడ్డ బ్రాహ్మణులకి అది పెద్ద సమస్యనే తెచ్చిపెట్టింది. ఈ కొత్త సాంకేతికతో వేదాలని రాయడానికి జరిగిన ప్రయత్నాలు, వేదపండితులకి సంఘంలో ఉన్న స్థానం, పలుకుబడి, వారి ఆర్థిక స్థోమతలని సవాలు చేశాయి. దీనికి స్పందనగా వైదిక సంప్రదాయం మౌఖికం గానే వేదాలని అభ్యసించే పద్ధతులని మరింత ఉధృతం చేసిందని చెప్పుకోవచ్చు. ఈ కాలం లోనే, మౌఖికమైన ధారణ పద్ధతులని ప్రామాణీకరించడం విదేహ ప్రాంతాలలో జరిగింది. ఇటువంటి ప్రయత్నమే పాణిని వ్యాకరణం సూత్రీకరించడం లోనూ కనిపిస్తుంది. రాతని నిరాకరించే ప్రయత్నాలు మనకి మహాభాష్యం లోనూ, మహాభారతం లోనూ కూడా కనిపిస్తాయి. (వేదవిక్రయిణశ్చైవ వేదానాం చైవ దూషకాః వేదానాం లేఖకాశ్చైవ తే వై నిరయగామినః — వేదాలని విక్రయించేవారు, దూషించేవారు, రాసేవారు తప్పకుండా నరకానికి వెళ్తారు: మహాభారతం 13.24.70; పుస్తకస్థా తు యా విద్యా పరహస్తగతం ధనం — పుస్తకాలలో ఉన్న జ్ఞానం పరుల సొమ్ము వంటిది).
మౌఖిక సంప్రదాయాన్ని మరింత కట్టుదిట్టం చెయ్యడానికి కారణం పర్షియన్ చక్రవర్తుల పాలన. ప్రత్యేకంగా అన్నిరకాల మత, ధర్మశాస్త్రాలని లిఖిత రూపంలోకి తెచ్చి వాటిని భద్రపరచడం డారియస్ చక్రవర్తి (King Darius) కాలంలో చాలా ఎక్కువగా జరిగింది (క్రీ.పూ. 464-435). ఇదే కాలంలో, కొన్ని రకాల మౌఖిక సాహిత్యం కూడా స్థిరపడి, ప్రామాణీకరించబడింది. పర్షియన్ ప్రభావం భారత సంస్కృతిలో మౌఖిక, లిఖిత రూపాల మధ్య ఒత్తిడిని మరింత పెంచింది. అంతే కాకుండా లిపి రెండు రూపాల లోనూ ఉన్న రచనలు స్థిరపడడానికి ఒక ఉత్ప్రేరకంగా పనిచేసింది. విట్జెల్, ఫార్మర్, ఇద్దరూ గాంధార ప్రాంతంలో పర్షియన్ పాలన వల్ల వచ్చిన మార్పులని అధ్యయనం చేసి, వేదం స్థిరపడి పాదపాఠాలు ఏర్పడటం, పాణిని వ్యాకరణం వంటి శాస్త్రీయమైన విశ్లేషణలు జరగడం వంటివి ఇక్కడ కొత్తగా వస్తున్న లిఖిత సంస్కృతికి స్పందనలుగా జరిగినవే అంటారు. ఇదీ వైదిక సంప్రదాయం రాత తాకిడికి స్పందించిన తీరు.
ఇక బౌద్ధం విషయానికి వస్తే, మౌర్యులు బౌద్ధ మతాన్ని అవలంబించారు. మనకి మౌర్యుల కాలం నుంచే రాయడంపై ప్రత్యేకమైన శ్రద్ధ కనిపిస్తుంది. బ్రాహ్మీ లిపి మౌర్యుల కాలం లోనే అభివృద్ధి చెందింది. అశోకుడికి ముందు మనకి ఎటువంటి లిఖిత సాహిత్యం కాని, శాసనాలు కానీ లేవు. రాతని ప్రత్యేకంగా భారతీయులు అభివృద్ధి చేసింది బౌధ్ధులైన మౌర్యుల కాలం లోనే. దీనివల్ల బౌద్ధ గ్రంథాలు రాతరూపంలో ముందుగా వచ్చాయి. బౌద్ధ జాతక కథలలోనూ — వినయపీఠిక, లలితవిస్తరం, కటక జాతక, మరుజాతక, మాహావగ్గ జాతక కురుధమ్మ జాతక కథలు — రాత ప్రస్తావన ఉంది. వైదిక సంప్రదాయం వేదాన్ని రాయడం నేరంగా పరిగణిస్తే, బౌద్ధులు రాతని తలకెత్తుకున్నారు. బుద్ధుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే అరవైనాలుగు లిపులలో రాయడం నేర్చుకున్నాడట! వాటి పేర్లు కూడా లిపిశాలసందర్శనమ్ పుస్తకంలో పేర్కొన్నారు. ఆ అరవైనాలుగు లిపుల పేర్లు:
1. బ్రహ్మీ, 2. ఖరోస్తి, 3. పుష్కరసారి, 4. అంగలిపి, 5. వంగలిపి, 6. మగధలిపి, 7. మాంగల్యలిపి, 8. అంగుళీయలిపి 9. సకారిలిపి, 10. బ్రహ్మవలిలిపి 11. పారుష్యలిపి, 12. ద్రావిడలిపి, 13. కిరాటలిపి, 14. దాక్షిణ్యలిపి, 15. ఉగ్రలిపి, 16. సంఖ్యాలిపి 17. అనులోమలిపి, 18.అవమూర్ధలిపి, 19. దారడలిపి, 20. ఖాశ్యలిపి, 21. చీనలిపి, 22. లూనలిపి, 23. హూణలిపి, 24. మధ్యాక్షరవిస్తారలిపి, 25. పుష్పలిపి, 26. దేవలిపి, 27. నాగలిపి, 28. యక్షలిపి, 29. గంధర్వలిపి, 30. కిన్నెరలిపి, 31. మహోరగలిపి, 32. అసురలిపి, 33. గరుడలిపి, 34. మృగచక్రలిపి, 35. వాయసరుటలిపి, 36. భౌమదేవలిపి, 37. అంతరిక్షదేవలిపి, 38. ఉత్తరకురుద్వీపలిపి, 39. అపరగౌడానీలిపి, 40. పుర్వవిదేహలిపి, 41. ఉత్క్షేపలిపి, 42. నిక్షేపలిపి, 43. విక్షేపలిపి , 44. ప్రక్షేపలిపి, 45. సాగరలిపి, 46. వజ్రలిపి, 47. లేఖాప్రతిలేఖనలిపి, 48. అనుద్రుతలిపి, 49. శాస్త్రావర్తాలిపి, 50. గణనావర్తలిపి, 51. ఉత్క్షేపవర్తలిపి, 52. నిక్షేపావర్తలిపి, 53. పాదలిఖితలిపి, 54. ద్విరుత్తరపదసంధిలిపి, 55. యావద్దశోత్తరపదసందిలిపి, 56. మధ్యాహారిణిలిపి, 57. సర్వరుటసంగ్రణిలిపి 58. విద్యానులోమావిమిశ్రితలిపి, 59. ఋషితపస్తప్తా రోచమానాలిపి, 60. ధరణీప్రేక్షిణీలిపి, 61. గగణప్రేక్షణీలిపి, 62. సర్వౌషదినిష్యందనాలిపి, 63. సర్వసారసంగ్రహాణిలిపి, 64. సర్వభూతరుతగ్రహాణిలిపి.
ఈ లిపుల పేర్లు ఒక్కో పుస్తకంలో ఒక్కోలా ఉంటాయి. ఇన్ని లిపుల పేర్లు ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ ఒకానొక కాలంలో ప్రచారంలో, వాడుకలో ఉండేవని అనుకోడానికి వీలు పడదు. లలితవిస్తరమనే బౌద్ధగ్రంథం ప్రాచీనమైనదని తెలిసినప్పటికీ, ఈ గ్రంథంలో కాలానుగతిలో ఎన్నో ప్రక్షిప్తాలు చేరి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా, హూణలిపిని (హూణులు వాడే లిపి) పేర్కొనడం వల్ల ఈ చిట్టా క్రీ.శ నాలుగో శతాబ్దం నాటిదని అంచనా వెయ్యొచ్చు. అలాగే వంగలిపి, అంగలిపి, పూర్వవిదేహలిపి వంటి ప్రాదేశిక నామాలని బట్టి అప్పటికే బ్రాహ్మీ లిపి ప్రాదేశిక రూపాంతరాలు చెందిందని చెప్పవచ్చు. ఇంకొక సమస్య ఇందులో చెప్పిన చాలా లిపులను అంచనా వెయ్యడం. బ్రాహ్మీ, ఖరోస్తి వాడుకలో ఉండేవని, వాటి అక్షర స్వరూపాలు ఏవి అని, మనకి ఖచ్చితంగా తెలుసు. మిగిలిన వాటి పేర్లను బట్టి అవి ప్రాదేశిక రూపాంతరాలుగా అనుకోవచ్చు. కొన్ని లిపుల పేర్లు, అవి రాసే పద్దతిని, ఆ లిపిలో అక్షరాల సౌష్టవాన్ని సూచిస్తాయి. ఇవి ఈనాటి ఫాంట్ల పేర్ల వంటివే కాని, ప్రత్యేకమైన లిపులు కాకపోవచ్చును. దేవలిపి, నాగలిపి, యక్షలిపి వంటివి కేవలం ఊహాగానాలు కావొచ్చును (బుద్ధుడికి మనుష్యల భాషలే కాకుండా సర్వప్రాణికోటి భాషలు, సర్వభువనాలలోని దేవతల, యక్షుల, రాక్షసుల, పిశాచగణాల లిపులూ తెలిసుండాలి.) అప్పటి సంప్రదాయంలో అరవైనాలుగుకి ఎంతో ప్రాముఖ్యం ఉండేది కాబట్టి – కొన్ని పేర్లు ఊహించి రాసినవి అయే అవకాశమూ లేకపోలేదు. అరవైనాలుగు సంఖ్యకి ఎట్లాంటి ప్రాముఖ్యత ఉందో, అదే విధంగా పద్దెనిమిది సంఖ్యకి కూడా ప్రాచీన సంప్రదాయాలలో అంతే ప్రాముఖ్యత ఉంది – జైన గ్రంథాలలో పద్దెనిమిది లిపుల పట్టికలున్నాయి. ఇంతకుమించి, లిపుల వైవిధ్యం పైనా, వాటి పేర్లు వగైరా ప్రస్తావన సంస్కృత వాఙ్మయంలో మనకు కనిపించదు.
భారత సంస్కృతి: రాత పరిణామంలో ప్రత్యేకమైన సమస్యలు
రాత ప్రభావం సాంఘికంగా, సాంస్కృతికంగా ఎటువంటిదో ఇప్పటి వరకూ చూశాం. ఈ వ్యాసం మొదట్లో చెప్పినట్టుగా, భారతీయ సంస్కృతిలో రాత చరిత్ర అధ్యయనం మరెన్నో చారిత్రక అంశాలతో కలగాపులగమై పోయింది. మనది ఎంతో అభివృద్ధి చెందిన మౌఖిక సంస్కృతి అనీ, మనకి రాత అవసరమే లేకుండా సంక్లిష్టమైన వేదాలని కూడా పూర్తిగా మౌఖికంగా పరిరక్షించుకోగలిగామనీ, నిజానికి వేదాలని రాయడానికి అనువైనవి కావనీ, ఉచ్చారణ బట్టి వాటి అర్థం మారిపోతుందని — మనకి ఎన్నో కథలు ఉన్నాయి. లిపిని గానీ, రాతని గానీ ఈ సంస్కృతి పాశ్చాత్య/పర్షియన్ సంస్కృతుల నుంచి దిగుమతి చేసుకోలేదనీ, ఆ సంస్కృతులతో ఎటువంటి సంపర్కం లేకుండా స్వతంత్రంగా మన లిపుల కల్పన, పరిణామం జరిగాయని వాదనలు కూడా ఉన్నాయి. ఈ రెండూ ఒకదానితో ఒకటి పొంతనలేని వాదనలు.
ఈ వాదనలని క్రోడీకరిస్తే, వాటిని ముఖ్యంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు:
- సింధు నాగరికతలో దొరికిన ఆధారాల వల్ల, సింధు నాగరికతలో రాత/లిపి ఉండేది కాబట్టి దాని ఆధారంగా భారతీయ భాషల లిపులు వచ్చాయి అనేది ఇప్పుడు ఒక వాదం. సింధు లోయలో దొరికిన సంజ్ఞాలిపి గత పదేళ్ళలో చాలా పెద్ద వివాదస్పదమైన అంశంగా మారింది. దీని గురించి ఈ వ్యాసం చివర్లో పరిశీలిద్దాం.
- మన వాఙ్మయంలో (అది వేద వాఙ్మయం కానివ్వండి, పాణిని వ్యాకరణం కానివ్వండి,) లేదా బౌద్ధ జాతక కథలు మొదలైన వాటిల్లో కొంత వరకూ ఉన్న రాత ప్రసక్తి ఆధారంగా కొంతమంది ఔత్సాహికులు, పాత తరం పరిశోధకులు భారత సంస్కృతిలో రాత మౌర్యుల కంటే చాలా పురాతనమైనది అని వాదిస్తారు. పాణిని మౌఖిక-లిఖిత సంస్కృతుల సంధియుగానికి చెందినవాడు. అష్టాధ్యాయి నిర్మాణం ప్రధానంగా మౌఖిక సంప్రదాయం ప్రాతిపదికనే జరిగింది. అయితే, పాణిని విషయంలో ముఖ్యమైన ప్రశ్నలు: రాత గురించి, పుస్తకాల గురించి తెలిసి కూడా పర్షియన్ పాలనలో నివసిస్తున్న పాణిని తన వ్యాకరణాన్ని ఎందుకు రాయలేదు? ప్రతి వివరమూ రాత పూర్వకంగా పదిలపరచాలి అనే బలమయిన పట్టుదల ఉన్న పర్షియన్ పాలకుల వత్తిడిలో కూడా వేదపాఠాలకు రాత రూపం ఎందుకు ఏర్పడలేదు? నిజానికి ఇదే కాలంలో ఈజిప్టు, ఇజ్రాయిల్, అనతోలియా, పర్షియా ప్రాంతాలలో మతధర్మ నియమాలు రాత రూపంలోకి రావడం ముమ్మరంగా జరిగింది. ఇక్కడ భిన్నమైన మార్గంలో ‘భారతీయులు’ ఎందుకు వెళ్ళారు?
- ఇవి కాకుండా, కొన్ని పురావస్తు ఆధారాలు – ముఖ్యంగా భట్టిప్రోలు శాసనం, కొన్ని తమిళ బ్రాహ్మీ శాసనాలు, శ్రీలంకలో అనురాధపురం దగ్గర దొరికిన శాసనాల ఆధారంగా ఇక్కడ మౌర్యుల కంటే చాలా ముందే లిపి ఉందని కొందరి వాదన. ఈ విషయాలు బ్రాహ్మీ లిపి చరిత్రలో ముఖ్యమైన అంశాలు.
పాణిని అష్టాధ్యాయి, మౌఖిక-లిఖిత సంస్కృతులు
భారతీయ లిపుల గురించిన చర్చల్లో పాణిని అష్టాధ్యాయి చాలా ముఖ్యమైనది. దీనికి కారణం, పశ్చిమం నుంచి — అంటే పర్షియా నుంచి నేరుగా గానీ లేదా పర్షియా మార్గం ద్వారా గానీ — ఎటువంటి ప్రభావాలకి ఇక్కడి సంస్కృతి లోనయ్యిందో తెలిపే ఆ కాలం నాటి రచనలు మనకి అష్టాధ్యాయి తప్పించి లేవు. బౌద్ధ గ్రంథాలన్నీ తూర్పు ప్రాంతాలైన విదేహ-కోసల ప్రాంతాల నుంచి వచ్చినవి. మహాభారతంలో వాయువ్య ప్రాంతాల ప్రస్తావన ఉన్నప్పటికీ ఆ కాలానికి ఇంకా మహాభారతం ఒక రచనగా మారలేదు.
పాణిని ‘గాంధార’ దేశంలో కాబూల్ నదికి తూర్పుగా, సింధు నదికి పశ్చిమంగా వున్న శలాతుర (ఈ నాటి లాహుర్) అన్న ప్రాంతం వాడు. పాణిని కాలాన్ని గురించి మనకి కచ్చితంగా తెలియదు. పాణిని భాష వేదాలలో వాడబడిన సంస్కృతానికి దగ్గరగా ఉన్నందున క్రీ.పూ. 500 కాలం నాటి వాడని, తన వ్యాకరణంలో (2.120) ‘రూప్యం’తో వున్న నాణాల ప్రస్తావన ఉంది కనుక క్రీ.పూ. నాలుగవ శతాబ్దం వాడని కొన్ని వాదనలు జరిగినా, క్రీ.పూ 500-350 మధ్య కాలంలో జీవించాడని మాత్రం అందరూ అంగీకరించే విషయం. పాణిని జీవితకాలం మరింత కచ్చితంగా తెలిస్తే భారతీయ సాంస్కృతిక చరిత్రని మరింత బాగా అర్థం చేసుకోవచ్చని పరిశోధకుల అభిప్రాయం. ఆనాటికి గాంధార ప్రాంతం అకీమనిడ్ (Achaemenid) సామ్రాజ్యం లోని భాగం.
పాణిని ‘లిపి/లిబి’ (3.2.21) అన్న ప్రాచీన పర్షియన్ పదాన్ని వాడాడు. (ఈలమైట్: టిప్పి, tablet > పురాపర్షియన్: దిపి > తూర్పు ఇరానీ: లిపి/లిబి > పాణిని: లిపి/లిబి.) అలాగే ‘గ్రంథ’ అన్న పదాన్ని కూడా వాడాడు కాబట్టి అతనికి లిపిని గురించి, బహుశా ఆనాడు గాంధార దేశం పరిపాలనలో వాడబడుతున్న అరమయాక్ గురించి తెలుసునని అర్థమవుతుంది. అశోకుడు గ్రీకు భాష, లిపితో పాటుగా ఈ భాషని, లిపిని కూడా వాడాడు. కానీ పాణినికి స్వయంగా రాయడం వచ్చునా లేదా అన్నది మనకు తెలియదు. మరొక సూత్రంలో (4.1.49), స్త్రీలింగ రూపాన్ని వివరిస్తూ యవనాని అన్న మాటని వాడతాడు. కాత్యాయనుని వార్తిక ప్రకారం (యవనాల్ లిప్యాం), ఈ రూపం యవనుల (గ్రీకుల) లిపిని గురించినది.
పాణిని కాలానికి ఏదో ఒక విధమైన రాత ఉండేదని తెలుస్తోంది. పర్షియన్ల పాలనలో ఉన్న గాంధార ప్రాంతం అదే కాలంలో పుట్టిన ఆర్యన్ లిపి ద్వారా ప్రభావితమయినదనుకున్నా, ఇక్కడి అవసరాలకు ఇక్కడే తయారయిన ఖరోష్టి లిపి, సెమైటిక్ అక్షరమాల అయిన అరమయాక్ ఆధారంగా తయరయ్యింది. ఈ అరమయాక్ భాష, లిపితో సహా క్రీ.పూ. ఆరవ శతాబ్దపు రెండవ అర్ధభాగంలో పర్షియన్ రాజుల ఆక్రమణతో అధికారిక భాషగా ప్రవేశించింది. పరిపాలనా వ్యవహారాలన్నీ ఈ భాషలోనే జరిగేవి. పర్షియన్ ప్రభావం రెండున్నర వేల ఏళ్ళ క్రితమే సంస్కృత భాషపైన కనపడుతుంది. కర్ష (weight), దివిర (writer), పుస్తక, బందీ (female slave), ముద్ర, పీలు (ఏనుగు) మొదలైన పదాలు దీనికి ఉదాహరణ.
రాత గురించి, పుస్తకాల గురించి తెలిసీ పర్షియన్ పాలనలో నివసిస్తున్న పాణిని తన వ్యాకరణాన్ని ఎందుకు రాయలేదు? ఈ ప్రశ్నకి ఒక సరళమైన సమాధానమంటూ లేదు. పాణిని వ్యాకరణాన్ని లిఖిత రూపంలో రాయకపోవడానికి రెండు కారణాలున్నాయి.
1. ఖరోష్టి, అరమయాక్ లిపుల పరిమితులు
అప్పటికి వాడుకలో ఉన్న అరమయాక్ లిపిలో గానీ, లేదా ఖరోష్టి లిపిలో గానీ సంస్కృత అక్షర-సమామ్నాయాన్ని రాయగలిగే సౌలభ్యం లేదు. అరమయాక్‌లో దీర్ఘాచ్చులు లేవు. ఖరోష్ఠి లిపినే అరపచన లిపి అని కూడా అంటారు. ఈ లిపిలో అ ర ప చ న ల ద బ డ ష వ త య ష్ట క స మ గ స్థ జ శ్వ ధ శ ఖ క్ష స్త జ్ఞా ర్థ (హ) భ ఛ స్మ హ్వ త్స ఘ ఠ ణ ఫ స్క య్స శ్చ ట ఢ అనే ధ్వనులు ఉండేవి.
ఈ లిపి కచ్చితంగా ఎప్పుడు రూపం తెచ్చుకుందో మనకు తెలియదు. నిజానికి ఆ పేరు (‘గాడిద పెదవి’) కూడా వింతయినది. బహుశ అది గాంధార ప్రాంతం లోని ప్రజలకి/లిపికి ఉన్న మారుపేరు (ఎగతాళి) కావచ్చును. (చూ: మహాభారత 8.30.11 పన్చానాం సింధుషష్ఠానాం నదీనాం యేఽన్తర్ 16–17 హసంతి గాంతి నృత్యంతి స్త్రీభిర్ మత్తా వివాససః … మత్తావగీతైర్ వివిధైః ఖరోష్ట్రనినదోపమైః). ఇక్కడ గమనించవలసిన ముఖ్య పరిణామమేమంటే అచ్చుల కోసం (కానీ దీర్ఘాచ్చులు లేవు) ప్రత్యేకమైన గుర్తులు ఏర్పాటు చేసుకోవటం. దీనితో ఆనాటి ప్రాంతీయ భాషని (Middle Indo-Aryan) సందిగ్ధత లేకుండా స్పష్టంగా రాసుకునే వీలు కలిగింది.
ఖరోష్టి లిపి వేదాలను రాయడం కోసం తయారయినది అన్న వాదన ఉన్నా, అది సరయినది కాదు. వేద పాఠాలను రాయడానికి ఈ లిపి కంటే మరింత పరిణితి చెందిన లిపి అవసరం. ఖరోష్టి లిపిలో దీర్ఘాచ్చులు లేవు. ఉదాహరణకి, అ (తత-తండ్రి), ఆ (తాత – పుత్రుడు) ల మధ్య ముఖ్యమైన భేదాన్ని ఇది గుర్తించలేదు. ఈ లిపిలోను (ఆ తరువాతి అశోకుని నాటి బ్రాహ్మీ లిపిలోనూ) సంస్కృతంలో ముఖ్యమైన ఋ, ఌ లు, అలాగే మూర్ధన్య అంతస్థ వర్ణం (ఴ — ఋగ్వేద 1.1.1 అగ్నిం ఈఴె ≅ అగ్నిమీళే), పూర్ణానుస్వార బిందు ( ం), విసర్గ ( ః) లాంటి వివరాలు, ఇంకా వేదోచ్చారణకు అతిముఖ్యమైన ఉదాత్త, అనుదాత్త, స్వరిత వంటివి సూచించడానికి కావలసిన సంకేతాలు లేవు.
అందువల్ల ఖరోష్టి, అరమయాక్ లిపులు రెండూ కూడా భారతీయ ధ్వనిమాల లోని అచ్చులు, హల్లులను పలకడానికి సరిపోవు. కానీ క్రీ.పూ. రెండవ శతాబ్దం నాటి తమిళ బ్రాహ్మీ శాసనాల లాగా, కొన్ని అదనపు గీతలు, చుక్కలు కలుపుకుని — ఐరావతం మహదేవన్ (2003) అభిప్రాయపడినట్టుగా — తేలికగానే వర్ణమాలలో లేని ధ్వనులని రాయవచ్చు. వేదాలను లేక పాణిని వ్యాకరణాన్ని కూడా ఇలాంటి తేలికైన మార్పులతో ఖరోష్టి లోనో లేక అరమయాక్ లోనో రాసి వుండవచ్చని ఊహించగలిగినా అటువంటి రాతలేవీ ఇంత వరకు బయటపడలేదు.
2. ఉచ్చారణ ప్రధానమైన వ్యాకరణ సూత్రాలు
క్రీ.పూ. 700 నాటికే ధ్వనిశాస్త్రం అభివృద్ధి చెందిందని, వేద సంస్కృతిలో ఉచ్చారణ ఎంతో ముఖ్యమని తెలుసుకున్నాం. వేదాలలోఉచ్చారణ ప్రాముఖ్యత పైన శతపథ బ్రాహ్మణంలోని “ఇంద్రశత్రు” కథ (శతపథ బ్రాహ్మణం1.6.3.8) అందరికీ బాగా తెలిసినదే: త్వష్టృడనే రాక్షసుడు ఇంద్రుడిని జయించగలిగే పుత్రునికోసం తపస్సుచేసి, చివరకి వరమడిగే సమయంలో “ఇంద్రశత్రు”అన్న పదంలో అనుదాత్త ఉదాత్త స్వరాలు సరిగ్గా ఉచ్చరించలేక పోయినందుకు “ఇంద్రుడిని చంపగలిగే కొడుకు” కాకుండా “ఇంద్రుడే చంపగలిగే కొడుకు” పుట్టాడట. కాబట్టి వేదానికి ఉపాంగంగా వచ్చిన వ్యాకరణం కూడా ఉచ్చారణ ప్రధానమైనదిగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. వేదం చదవడానికి ముఖ్యమైన ఉదాత్త, అనుదాత్త, స్వరిత మొదలైన ఉచ్చారణలని సూత్రీకరించడం వ్యాకరణం ప్రధాన లక్ష్యం కాబట్టి, ఈ వ్యాకరణాన్ని రాయడానికి వీలవదు. ఒక్క అ-కారానికే పద్దెనిమిది రకాల ఉచ్చారణలు ఉండేవని తెలుస్తోంది. అందుకని, ఈ వ్యాకరణాన్ని రాయడానికి వీలవదని మాధవ్ దేశ్‌పాండే నిరూపించారు. పతంజలి, కాత్యాయనుల కాలానికే, అష్టాధ్యాయిలో ఉచ్చారణకి సంబంధించిన సూత్రాలు పాణిని కాలంలో ఎలా పలికేవారో తెలియకపోవడం వల్ల, భాష్యకారులు కొంత సందిగ్ధానికి లోనవడం, వాటిని పరిష్కరించడానికి మార్గాలు చూపించడం జరిగింది కూడా.
పతంజలి, పాణిని అష్టాధ్యాయిని ఎలా ‘రచించాడో’ ఎంతో హృద్యంగా వర్ణించాడు -“ప్రమాణభూత ఆచార్యో దర్భపవిత్రపాణిః శుచావకాశే ప్రాణ్ముక ఉపవిశ్య మహతా ప్రయత్నేన సూత్రాణి ప్రణయతిస్మ తత్రాశక్యం వర్ణేనాప్యై అనర్థకేన భవితుమ్, కిం పునర్ ఇయతా సూత్రేణ” మహాభాష్యం, 1.143, నిర్ణయ సంగ్రహం”
(అధికారుడైన ఆచార్యుడు పవిత్రమైన ధర్బ ధరించి, శుచి అయిన ప్రదేశంలో తూర్పుదిక్కుగా ఆసీనుడై, వ్యాకరణ సూత్రాలని సృజించాడు. అందులో సూత్రమే కాదు ఒక్క శబ్ధం కూడా నిరర్థకం కాదు. ).
ఈ వర్ణనలో ‘రచన’కి ఆస్కారమే లేదు. పాణిని వ్యాకరణం, మౌఖికమైన వేద సంప్రదాయంలో అంతర్భాగం. అందుకే, పతంజలి, ఈ వ్యాకరణాన్ని తప్పుగా ఉచ్చరించిన విద్యార్థిని గురువు ఎలా సరిదిద్దేవాడో కూడా చెప్పాడు. ఉచ్చరిత స్వరాలు (accents), అనునాసికాలు (nasals) గురించి పతంజలి – భేదకా ఉదాత్తాదయః కథమ్ పునర్ జ్ఞేయతే భేదకా ఉదాత్తాయ ఇతి? ఏవమ్ హి దృశ్యతే లోకే, య ఉదాత్తే కర్తవ్యేనుదాత్తం కరోతి ఖండికోపాధ్యాయాయస్తస్మై చపేటాం దదాతి, అన్యత్ త్వం కరోశ్తి, మహాభాష్యం, నిర్ణయసంగ్రహం 1.152 (“ఉదాత్తాలు ఎన్నో రకాలు. అవి మనకి ఎలా తెలుస్తాయి? అవి వాడుక ద్వారానే మనం గ్రహించగలం. అనుదాత్తం ఉపయోగించవలసిన చోట ఉదాత్తం ఉపయోగిస్తే, గురువు విద్యార్థిని చేత్తో తట్టి తప్పు దిద్ధుతాడు.”) అంటాడు. దీనిని బట్టి మనకి వేదం, దానితో బాటుగా వ్యాకరణం కూడా ముఖతః నేర్చుకొనేవారని, లిఖిత పాఠాలు జ్ఞాపకోపకరణాలుగా ఉండేవని మాత్రం ఊహించవచ్చు. లిఖిత పాఠకుడిని అందరికంటే అధముడిగా (గీతీ శీఘ్రీ శీరఃకంపీ తథా లిఖితపాటక అనర్థజ్ఞోల్పకణ్ఠశ్చ శడేతే పాఠకాధమాః) వర్ణించడం బట్టి కొంతమందైనా లిఖిత పాఠాన్ని ఉపయోగించేవారని తెలుస్తుంది. బహుశా, ఆధునిక కాలంలో కాశ్మీరులో వేదాలను ఉర్దూలో రాస్తున్నట్టు, ఇటువంటి లిఖిత పాఠాలను జ్ఞాపకం ఉంచుకోడానికి సులువైన పద్ధతిగా ఉపయోగించి ఉండవచ్చు.
మౌర్యుల (అశోకుని) కాలం: బ్రాహ్మిలిపి, శాసనాలు
బ్యూలర్ (Georg Bühler, 1837-98) వందేళ్ళ క్రితం రాసిన On the Origin of Indian Brahma Alphabet అనే పుస్తకానికి పూర్తిగా కాలదోషం పట్టినా, అది ఇంకా చాలా మంది ఔత్సాహిక పరిశోధకులని, కొంతమంది పాత తరం పరిశోధకులని ఇప్పటికీ ప్రభావితం చేస్తోంది. ఆ పుస్తకంలో బ్యూలర్, భారతదేశంలో రాత అతి ప్రాచీనకాలం నుండే ఉండేదని అభిప్రాయపడ్డాడు. అయితే, బ్రాహ్మీ లిపి ఫెనీషియాలిపి నుండి వచ్చిందని ప్రతిపాదించాడు. ఆయన తరువాతి తరం పరిశోధకులు, బ్రాహ్మీ అంత పురాతనమైనది కాదని, అది అరమయాక్ నుంచి వచ్చి వుండవచ్చని మరికొంత గట్టి ఆధారాలతో నిరూపించారు. గడిచిన శతాబ్దంలో, భారత సాహిత్య చరిత్ర, భాషాశాస్త్రం, శాసనశాస్త్రం (epigraphy), రూప్యశాస్త్రం (numismatics) మొదలైన పరిశోధనా రంగాలు ఎంతో అభివృద్ధి చెందాయి. అందువల్ల, ఇంతకు ముందు తెలియని ఎన్నో కొత్త విషయాలు, పరిశోధనాపద్ధతులు అందుబాటు లోకి రావడం వల్ల, సింధు నాగరికత, ఆఫ్గనిస్తాన్-పాకిస్తాన్లలో అశోకుడి కాలం నాటి అరమయాక్, గ్రీకు శాసనాలు, వేదాలు/పాళీ గ్రంథాల కాలనిర్ణయంలో ఎంతో స్పష్టత వచ్చింది. అయినప్పటికీ, గడిచిన శతాబ్ధంలో మౌర్యుల కాలం కంటే పురాతనమైన శాసనాలు గానీ, బ్రాహ్మీ లిపికి సంబంధం లేని పురాతన భారతీయ లిపి గానీ బయటపడలేదు. ముఖ్యంగా సింధు లోయలో దొరికిన ముద్రలు ఏ లిపివో, ఏ భాషవో ఇంతవరకూ తెలియదు. ఇప్పుడు అది అసలు లిపే కాదనే వాదం బలపడుతోంది.
ఇంతకు ముందు ఇండాలజీలో పనిచేసే పరిశోధకులకి, సెమైటిక్ సంస్కృతి, రాత చరిత్ర పైన పనిచేసే పరిశోధకులకి మధ్య అనుసంధానం ఉండేది కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా పాశ్చాత్య సామ్రాజ్యం ఒక ప్రణాళికతో భారత చరిత్రని కావాలని చిన్నచూపు చూసిందనే ప్రబలమైన నమ్మకం చరిత్రకారులలో ఉండేది. ఈ పరిస్థితి కూడా ఇప్పుడు చాలా వరకు మారింది. బ్రాహ్మీ లిపిపై ఫాన్ హిన్యూబర్ (Oskar von Hinüber), ఫాల్క్ (Harry Falk) ఆధునిక పరిశోధనా పద్ధతులని ఉపయోగిస్తూ, బ్రాహ్మీ లిపి చరిత్రని కూలంకషంగా పరిశోధించారు. ముఖ్యంగా, ఫాల్క్ వందేళ్ళనాటి బ్యూలర్ ప్రతిపాదనలలోంచి బయటపడి ఇప్పటివరకూ వచ్చిన పరిశోధనలన్నిటినీ విశ్లేషణాత్మకంగా సమీక్షించి వ్యాఖ్యానించాడు. వాయువ్య ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉండిన ఖరోష్టి లిపి బ్రాహ్మీ కంటే పురాతనమైనదనే ఈ ఇద్దరు పరిశోధకులు తేల్చారు. చంద్రగుప్తుని కాలంలో గానీ, అశోకుడి కాలంలో గానీ ప్రత్యేకంగా శాసనాలు రాయడం కోసం బ్రాహ్మీ లిపి తయారు చెయ్యబడిందనే అభిప్రాయాన్ని ఈ కొత్త పరిశోధనలు బలపరిచాయి. ముఖ్యంగా:
- అశోకుడికి ముందు ఎటువంటి రాతలు/ శాసనాలు/ గ్రంథాలు ఎంత ప్రయత్నించినా లభ్యం కావటం లేదు.
- మెగస్తనీస్ వంటి గ్రీకు రచయితలు భారతీయులకి రాత లేదని చెప్పారు.
- భారతీయుల వ్యాకరణం, ధ్వనిశాస్త్రం లిపుల నిర్మాణంపై చూపిన ప్రభావం వల్ల కూడా ఇక్కడ లిపి వేదకాలం నాటిది కాదని తెలుస్తోంది.
- అశోకుడి కాలం నాటి బ్రాహ్మీ లిపి పరిశీలిస్తే అది అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్నట్టు తెలుస్తుంది. అందువల్ల కూడా అశోకుడికి ముందే ఇక్కడ రాత అభివృద్ధి చెందిందని చెప్పడానికి కుదరదు.
ఈ కారణాలే ఎస్. ఆర్. గోయల్, అశోకుడికి ముందు భారత భూభాగంలో రాత గాని, లిపులు గానీ లేవని తీర్మానించడానికి ఆధారాలుగా చూపించారు.
బ్యూలర్ పుస్తకంలో బౌద్ధ సంప్రదాయానికి చెందిన వినయపీఠిక లోని లేఖ పదాల ప్రస్తావన ఉంది. హిన్యూబర్ వినయపీఠికని లోతుగా అధ్యయనం చేసి, అందులోని లిఖ పద సమూహానికి, రాతకి ఎటువంటి సంబంధమూ లేదని తేల్చాడు. అంతే కాకుండా, ఎన్నో భారతీయ గ్రంథాల లాగానే వినయపీఠిక కూడా ఒక్కసారే పూర్తిగా అల్లబడినది కాదని, అందులో ఎన్నో స్తరాలు ఉన్నాయని, పురాతన స్తరాలలో రాత ప్రస్తావన లేదని కూడా తేల్చాడు. ఈ పరిశోధనల వల్ల, ఇంతకు ముందు వచ్చిన వ్యాసాలు, పుస్తకాలు, పరిశోధనలలో — చాలా వరకూ విషయసామాగ్రిని శాస్త్రీయంగా పరిశోధించకపోవడం, ఎన్నో అశాస్త్రీయమైన అభిప్రాయాలు చోటుచేసుకోవడం వంటి సమస్యలున్నాయని తేలింది.
ఇప్పటికీ అంతు తేలని సింధు నాగరకత లోని రాతముద్రల నుంచి బహుశా ఏదో లిఖిత రూపంలో, పూర్తి భాషని కాకపోయినా, కొన్ని సమాచార సంకేతాలని రాయడం క్రీ.పూ. రెండో సహస్రాబ్ది నాటికే ఉండేదని ఊహించవచ్చు. కాని, ముఖ్యమైన సమస్య కొన్ని చెదురు మదురు అవశేషాలు మినహాయించి, సింధు నాగరకతకి మౌర్యుల కాలానికీ మధ్యనున్న వెయ్యేళ్ళ కాలంలో ((క్రీ.పూ. 1756-260) రాతకి సంబంధించిన ఎటువంటి ఆధారాలు దొరకకపోవడం.
- దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో మెగాలితిక్, చాకోలితిక్ కాలంనాటికి చెందిన కొన్ని కుండలు, మట్టిపాత్రల అవశేషాలు దొరికాయి, వాటిమీద కొన్ని సంకేతాలు సింధులోయ లోని ‘లిపి’కి పోలికలున్నాయని బి. బి. లాల్ ప్రతిపాదించారు. అయితే ఆయనే వీటిని అక్షరాలని గాని, శబ్దసంకేతాలని గాని నిర్ణయించలేమని అభిప్రాయపడ్డారు.
- విక్రమ్‌ఖోల్ (Vikramkhol) దగ్గర దొరికిన పురాతనమైన రాత వంటి కొన్ని గుర్తులు సింధులోయ లిపికి, బ్రాహ్మీకి మధ్య వారధిగా ఉన్నాయని కొంతమంది అభిప్రాయం. కాని ఈ ప్రయత్నాలు ఇంతకు ముందు చెప్పినట్టుగా పనిగట్టుకుని సింధులోయ లోని సంకేత చిహ్నాలకి, బ్రాహ్మీకి మధ్య సంబంధాన్ని ఎలాగైనా నిరూపించాలని చేసిన ప్రయత్నాలే తప్పించి, శాస్త్రీయమైన పరిశోధనలు కావు. విక్రమ్‌ఖోల్ రాతి-సంజ్ఞలని లిపిగా ఎవరూ గుర్తించలేదు.
- రాతి మీద శాసనాలు ఏవీ దొరకలేదు కాబట్టి, వాఙ్మయంలో లిపి/రాత గురించిన ప్రస్తావనపై (వ్యాసం మొదట్లో ప్రస్తావించినట్లుగా) చాలా పరిశోధనలే జరిగాయి.
- గ్రీకు, లాటిన్ రచయితలు భారతీయుల గురించి చెప్పిన మాటలు కూడా కొంత ఆధారం. క్రీ.పూ.325లో భారతదేశం పర్యటించిన నెయర్కస్ (Nearchos) భారతీయులు గుడ్డల మీద రాస్తారని అన్నాడు. ఇది ఖరోష్టి అని కొందరు, అరమయాక్ అని మరికొందరు అంటారు. నెయర్కస్‌కి రెండు దశాబ్దాల ముందు మెగస్తనీస్ (Megasthenes) భారతీయులకి రాత తెలీదన్నాడు. మెగస్తనీస్ రాత అనేది లేదన్నాడా లేదా రాజ్య వ్యవహారాల్లో రాతని ఉపయోగించరు అన్నాడా అనేదానిపై పరిశోధకుల మధ్య కొంత వివాదం ఉంది.
- మౌర్యుల కాలానికి ముందున్న పురావస్తు ఆధారాలు పరిశీలిస్తే శ్రీలంక లోని అనూరాధపురం దగ్గర దొరికిన రాతి మీది సంకేతాలు ఈ మధ్య పరిశోధకులలో చాలా ఆసక్తిని రేకెత్తించాయి. ఈ రాతలు చాలా చిన్నవి, పొట్టివి – బహుశా ఎవరో కొందరి వ్యక్తుల పేర్లు అయ్యుండవచ్చని, ఇవి క్రీ.పూ. ఆరు నుంచి నాలుగో శతాబ్దానికి చెందినవై ఉండొచ్చని అంచనా. రెండవది భట్టిప్రోలు శాసనం – కేవలం కాలపరిమితి విషయం లోనే కాకుండా, భారత లిపుల పరిణామంలో ఒక విలక్షణమైన పద్ధతిగా కూడా దీనిని చూడాలి.
భట్టిప్రోలు శాసనం
భట్టిప్రోలు శాసనం మన లిపి చరిత్రకి సంబంధించిన అతి ముఖ్యమైన ఆధారం. భట్టిప్రోలు దగ్గర బౌద్ధస్థూపంలో బయటపడిన ఈ శాసనం, ఇందులో వాడిన లిపి, అక్షరాలని రాసిన పద్ధతిలో ఉన్న నవ్యత మూలంగా చాలా మంది పరిశోధకులని ఆకర్షించింది. దీనిని రాసిన పద్ధతి మిగిలిన అశోకుడి శాసనాలకంటే విలక్షణంగా ఉండటం వల్ల కొంతమంది పరిశోధకులు, ముఖ్యంగా ఎస్. ఆర్. రావ్, పరబ్రహ్మశాస్త్రి మొదలైన వారు ఇది అశోకుడి కాలం కంటే ముందుదని వాదిస్తారు. పరబ్రహ్మశాస్త్రి తెలుగులిపి పుస్తకం నుంచి: “చంద్రగుప్తుడు రాజ్యానికి రావడానికి ఎన్నో శతాబ్దాలకి పూర్వమే భారతీయులకి రాత తెలుసునని నమ్మే నావంటి పరిశోధకులకి భట్టిప్రోలు శాసనం ఎంతో తోడ్పడుతుంది.”
భట్టిప్రోలు శాసనంలో విలక్షణత ఇందులో కొన్ని అక్షరాలకి ప్రత్యేకంగా ‘అ’ కారాన్ని సూచించేటందుకు తలకట్టు వంటి ఒక గుర్తు ఉండడం. భారతీయ లిపులలో, హల్లులన్నీ అజంతాలే. అంటే, ‘క’ అని రాసినప్పుడు, అందులో ‘క్’ అనే వ్యంజన స్వరమూ, ‘అ’కార స్వరమూ కలిసి ఉన్నాయి. దీని మూలంగా మనకి ‘తవ,’ ‘త్వ’ అనే శబ్దాల తేడాలని రాయడానికి సంయుక్తాక్షరాలు అవసరమవుతున్నాయి. లాటిన్, ఇంగ్లీష్ లిపుల మాదిరిగా హల్లులన్నీ హలంతాలైతే అయితే ఈ లిపులలో కూడా, ‘తవ’ అని రాయాలంటే ‘త-అ-వ-అ (tava) అని రాసుకోవచ్చు. కానీ, హల్లుల శబ్దాలు, వాటి అక్షరాలు అజంతాలవ్వడంతో ఈ లిపులని రాయడంలో కొన్ని ప్రత్యేకమైన సమస్యలు వచ్చాయి. మన లిపులలో అక్షరానికి మూడు భాగాలు ఉన్నాయి:
- హల్లు/అచ్చు శబ్దం – క్, గ్, ర్, వంటివి. ఇవి మూల-శబ్దాలు అనుకోవచ్చును.
- గుణింతం. మూల శబ్దానికి అ-కారం కాకుండా మరొక అచ్చుని కలపడానికి మనకి గుణింతం అవసరమయ్యింది. అందుకోసం, ప్రతి అచ్చుకి ఒక గుణింత చిహ్నం – ఇ-కారానికి గుడి, ఉ-కారానికి పక్కన పెట్టే వడి – అవసరమవుతుంది.
- సంయుక్తాక్షరాలని రాయడానికి, అంటే రెండు/మూడు హల్లులని కలపడానికి, మనకి ప్రతి హల్లు శబ్ధానికి కూడా ఒక ప్రత్యేకమైన చిహ్నం అవసరం. క-వత్తు, గ-వత్తు, ర-వత్తు ఈ కోవలోకి వస్తాయి.
నిజానికి, ఇంత సంక్లిష్టంగా లిపిని రాయవలసిన అవసరం లేదు. ప్రతి హల్లు కూడా హలంతమే అయితే, ‘స్త్రీ’ అని రాయడానికి ‘స్-త్-ర్-ఈ’ అని రాసుకోవచ్చును. ఈ పద్ధతిని బ్రాహ్మీ లిపిలో అనుసరించి ఉంటే రాయడం ఎంతో సులువై ఉండేది. హలంతాలతో రాసినప్పుడు రాత ఒక దిశ లోనే ఉంటుంది. అదే, అజంతాలు, గుణింతాలు, సంయుక్తాక్షరాలతో రాసినప్పుడు అక్షరానికి పైన, కింద, పక్కన కూడా మార్చుకుంటూ చేర్చుకుంటూ రాసుకోవాలి. అంతే కాకుండా, మనం స్త్రీ అనే పదంలో ఏ శబ్దాన్నైనా ముందు/వెనక రాసుకోవచ్చు. ఉదాహరణకి, ముందు క్రావడి రాసి, అటుపైన సకారం రాసి, దానికి గుడి దీర్ఘం పెట్టి, చివర్లో త-వత్తు రాసుకోవచ్చు. లేదా స రాసి, గుడిదీర్ఘం పెట్టి, త-వత్తు రాసి, ఆఖర్లో క్రావడి పెట్టుకోవచ్చు. కానీ పలికేటప్పుడు మాత్రం దాన్ని ‘స్-త్-ర్-ఈ’ అనే పలకాలి. అంటే, చేతికొక తర్కం, నోటికొక తర్కం అవసరం అవుతాయి. దీనివల్ల, రాసినప్పుడు అచ్చుతప్పులు రావడానికి అవకాశం ఎక్కువ.
భట్టిప్రోలు శాసనంలో అ-కారానికి ప్రత్యేకమైన గుర్తు ఉండటం వల్ల, సంయుక్తాక్షరాల అవసరం లేకపోయింది. ఇటువంటి అ-కారాన్ని సూచించే తలకట్టు మిగిలిన అశోకుడి శాసనాలలో లేదు. ఈ శాసనాన్ని పరిశీలించిన బ్యూలర్ ఇది క్రీ.పూ. 200 నాటివని అభిప్రాయపడ్డాడు. డి.సి. సర్కార్ కూడా ఇది క్రీ.పూ రెండో శతాబ్దానివే అన్నాడు. రిచర్డ్ సాలమన్ (Richard Salomon) కూడా వీటిని తమిళ బ్రాహ్మీ లిపి వర్గం లోనివే అని అభిప్రాయపడ్డారు. ఈ మధ్య ఈ శాసనాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేసిన శ్రీనివాస రిట్టి (Srinivasa Ritti) కొన్ని అక్షరాలకి మాత్రమే తలకట్టు ఉండి, మరికొన్ని అక్షరాలలో ఎటువంటి ప్రత్యేకత లేదని, మొత్తం మీద 23 అక్షరాలు అశోకుడి శాసనాలలోని అక్షరాలని పోలినవే ఉన్నాయనీ, అందువల్ల, ఈ ఒక్క శాసనం సాయంతో ఈ లిపి అశోకుడి బ్రాహ్మీకంటే పురాతనమైనదని చెప్పడానికి సాధ్యం కాదని అభిప్రాయపడ్డాడు. అ-కారాన్ని సూచించే తలకట్టు ఈ శాసనంలో నవ్యతని సూచిస్తుందే కానీ బ్రాహ్మీ కంటే పురాతనమైనదని చెప్పడానికి వీలు లేదని, అలాగే సంయుక్తాక్షరాలు లేవన్న సంగతి ఈ శాసనానికి ప్రత్యేకమే అయినా దాని సాయంతో ఏమీ సిద్ధాంతీకరించలేం అని, “There is no particular ground to hold that the Bhattiprolu inscriptions are earlier than Asokan edicts,” అని నిర్ధారించాడు.
కానీ, పరబ్రహ్మశాస్త్రిగారు మాత్రం ఓ పక్కనుంచీ “The orthography of Mauryan Brahmi was not fully established” అంటూనే, మరోపక్కనుంచీ “భట్టిప్రోలు శాసనం పరిశీలిస్తే, అది అశోకుడి లిపికంటే శాస్త్రీయమైనదీ, పురాతనమైనదీ, దానికంటే భిన్నమైనదీ అని కచ్చితంగా చెప్పవచ్చు. అంతేకాదు, మనదేశంలోనే పురాతన లిపి ఒకటి ఉండేదని, దాన్నే అశోకుడి బ్రాహ్మిలిపితో సామ్యం తేవడానికి మార్చారని చెప్పవచ్చు” అనడం ఏదోరకంగా ఇక్కడ కూడా ఒక స్వతంత్రమైన లిపి ఒకటి ఉందని చెప్పడానికి చేసే ద్రావిడ ప్రాణాయామమే తప్పించి మరొకటి కాదు.
భారత లిపులలో హల్లులు అజంతాలు ఎందుకు అయ్యాయి అనేది ఒక చారిత్రక పరిణామం. సంస్కృతంలో అ-కారం చాలా ముఖ్యమైన, అతి ఎక్కువగా వచ్చే శబ్దం. అందువల్ల, దీనిని హల్లులో అంతర్గతం చెయ్యడంలో సౌలభ్యం ఉంది అంటారు రిచర్డ్ సోలమన్. ఉచ్చారణా నియమాలు చాలా కఠినంగా ఉండటం కూడా మరొక ముఖ్యకారణం కావొచ్చు, సంయుక్తాక్షరాలకి (దాన్లో ఎన్ని వ్యంజనాలున్నా) పలకడానికి ఒక నిర్ణీత సమయం కేటాయించడం, చంధస్సు సూత్రాలలో గురు-లఘువులని, నోటితో సులువుగా లెక్కించుకోడానికి కూడా బహుశా సంయుక్తాక్షరాల అవసరం అయ్యుండవచ్చు. అంటే, భాషని పలికే పద్ధతిని యథాతథంగా రాయడంలోకి తేవడం వల్ల వచ్చిన సమస్య అయిండవచ్చు.
ఈ కారణాల వల్ల, అజంతాలగా హల్లులని రాయడం, గుణింతాలు, సంయుక్తాక్షరాలతో కూడిన భారత లిపులని పాశ్చాత్య-లిపుల వర్గీకరణ పద్ధతులో వర్గీకరించడానికి కుదరదు. పాశ్చాత్య లిపులని logography, syllabic, alphabetic అని మూడువర్గాలుగా విభజిస్తారు, కానీ భారత లిపులు ఇందులో ఏ వర్గానికి లొంగవు.
అక్షరం అంటే సిలబెల్ (పదాంశం) కాబట్టి వీటిని సిలబెక్ లిపులనవచ్చు. కానీ, ఇందులో ప్రతి అక్షరంలోనూ విడి విడి అంకాలని (గుణింత చిహ్నాలని) రాసినప్పుడు కలుపుతాం, అందువల్ల ఇది సిసలైన సిలబెక్ వ్యవస్ఠ కాదు. ఈ లిపులలో అచ్చులకి ప్రత్యేకమైన గుర్తులు ఉన్నాయి కాబట్టి Alphabetic అని కూడా అనుకోవచ్చు, కానీ గుణింత చిహ్నాల మూలంగా, ప్రతి హల్లులోనూ అచ్చు శబ్దం కలిసిపోయి ఉంటుంది. అచ్చులని మనం వాటీని ప్రత్యేకమైన అక్షరంగా రాసినప్పుడు మాత్రమే వాడతాం. అందువల్ల సిసలైన alphabetic కాదు. అందుకే ఈ రకం లిపులకి రక రకాల వర్గీకరణలు సూచించారు – neo-syllabary, pseudo-alphabet మొదలైనవి, కానీ ఈ విషయంలోనూ ఏకాభిప్రాయంలేదు. రిచర్డ్ సోలమన్ ఈ లిపులని “diacritically (or alphabetically) modified consonant syllabary” అని నిర్వచించారు.
కానీ, మొదట్లో, మౌర్యుల కాలంలో శాసనాలన్నీ ప్రాకృతంలోనూ, ప్రాదేశిక భాషల్లోనే ఉండేవి. అందుకే, భట్టీప్రోలు శాసనాలలోనూ, తమిళ బ్రాహ్మి శాసనాలలోనూ హలంత-హల్లుల ఉపయోగం ఉండేది. తమిళ బ్రాహ్మిలిపిపై పరిశోధనలు చేసిన ఐరావతం మహదేవన్, ఆ లిపిలో హల్లులు హలంతాలుగా రాయడం ఆ భాషకి ప్రత్యేక లక్షణం వల్ల వచ్చిన సౌలభ్యం అంటారు.
బ్రాహ్మీ లిపి స్వరూపం
బ్రాహ్మీ లిపిలో మొదట్లో ఆరు అచ్చులు (అ, ఆ, ఇ, ఉ, ఎ, ఒ) ముప్పైరెండు హల్లులు, అనుస్వరం, ఎనిమిది గుణింతం గుర్తులు (అ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఒ, ఐ) ఉండేవి. ఈ, ఊ కారాలు లేకపోవడం బహుశ వాటి వాడకం భాషలో అతి తక్కువ కాబట్టి అవి మనకి దొరికిన శాసనాలలో ఉండక పోయివుండచ్చు. సంస్కృతానికి ఈ లిపిని వాడడం ప్రారంభించడం ముందు ఋ, ౠ, ఉ, ఔ లు ఉండేవి కావు.
శుంగుల కాలం (క్రీ.పూ 200-100)
ఎప్పుడైతే, సంస్కృతంలో రాయడం ప్రాచుర్యంలోకి వచ్చిందో, ఆ భాషని రాయడానికి హల్లులు అజంతాలగా రాయడం స్థిరపడిపోయింది. మొట్టమొదటి సంస్కృత శాసనాలు క్రీ.పూ ఒకటవ శతాబ్దం చివరిలోనే కనిపించినా (అయోధ్య శాసనం- SI 1.94-5) సంస్కృతాన్ని రాయడం విదేశీయులైన శకులు పరిపాలించిన ప్రాంతాలలో, ముందుగా మధుర తరువాత పశ్చిమాన నేటి గుజరాతులలో ఎక్కువగా కనిపిస్తుంది. తొలి సంస్కృత శాసనాలు బ్రాహ్మణులు రాయించినవి. (ఉదా: క్రీ.శ తొలి శతాబ్దం నాటి:స్వామిస్య మహాక్షత్రపస్య శోండాసస్య గంజవరేణ బ్రాహ్మణేన శేగ్రవ-సగోత్రేణ [2] రణి ఇమాషాం యమడ-పుష్కరణీనాం పశ్చిమా పుష్కరణి ఉద్పానో [3] [శిలా]పట్టో చ) సంస్కృత లిపుల గురించిన సాంస్కృతిక చరిత్రను తరువాయి భాగంలో వివరంగా చర్చిస్తాం.
మౌర్యుల తరవాత బ్రాహ్మీ లిపి దేశమంతా విస్తరించింది. మెల్లమెల్లగా, ఉత్తరాది లిపికి, దక్షిణాది లిపికి మధ్య తేడాలు కనిపించడం మొదలయ్యింది. ఇంతకు ముందు భారత లిపులలో, హల్లులో అకారాన్ని అంతర్గతం చెయ్యడానికి తలకట్టు, పైన గీత వంటి ఒక గుర్తు ప్రతి హల్లు బేసి రూపానికి ఉంటుందని అనుకున్నాం కదా. ఈ పద్ధతి మౌర్యుల కాలం తర్వాత వ్యవస్థీకృతం అయ్యింది. ఒరియా లిపిలో గొడుగు, తెలుగులో తలకట్టు, నాగరి లిపిలో పైన అడ్డంగా గీసే గీత – ఇవన్నీ హల్లుకి అ-కార సంపర్కాన్ని తెలియజేసేవే. అందుకే కాబోలు, దక్షిణాది ఉత్తరాది లిపుల మధ్య తేడాలు కూడా ఈ కాలంలోనే ప్రస్ఫుటమైన ముద్రతో వచ్చాయి. నిలువు గీతలున్న అక్షరాల్లో గీత పరిణామం ఒకే పొడుగుకి చెయ్యడం, క, గ అక్షరాల్లో నిలువుపాటి గీతలను కాస్త సాగతీసి వాటిని గుండ్రంగా చెయ్యడం, ఇవన్నీ ఈ కాలంలో లిపి స్వరూపంలో వచ్చిన మార్పులు.
ఉత్తరాది లిపులకంటే దక్షిణాది లిపులలో ఎన్నో మార్పులు వచ్చాయి. భట్టిప్రోలు శాసనాల లిపిలో ప్రత్యేకత హల్లు నుంచి అంతర్గతమైన అ-కారాన్ని తీసేసి, అకారాన్ని సూచించడానికి మిగిలిన అచ్చుల లాగానే ఒక ప్రత్యేకమైన గుర్తుని హల్లుకి జత చెయ్యడం. అంటే భట్టిప్రోలు శాసనలిపిలో ‘క’ మిగిలిన లిపులలో ‘క్’ అనే వ్యంజన రూపానికి సమానమైనది. ఇది కాక, ఘ, జ, మ, ల స (శ) లకు కూడా బ్రాహ్మీ కంటే వేరు రూపాలున్నాయి.
ఈ కాలంనాటి దక్షిణాది లిపులలో ముఖ్యంగా చెప్పుకోవలసినది తమిళ బ్రాహ్మీ శాసనలిపులు. ఈ శాసనాలన్నీ కూడా నాలుగైదు వాక్యాల దానాల పట్టాల వంటివి. ఇవి ఏ కాలానికి చెందినవనే విషయంపై ఇంకా ఏకాభిప్రాయం లేదు. ఈ తమిళ బ్రాహ్మీ లిపికి కూడా రెండు ప్రత్యేకతలున్నాయి: 1. నాలుగు కొత్త అక్షరాలు (న, ఱ, ఴ, ళ) – ఇవి బహుశ ద్రావిడ భాషల లోని శబ్దాల కోసం అవసరమై ఉండొచ్చు. 2. అచ్చులని రాసే పద్ధతి భట్టిప్రోలు శాసనాలలో లాగానే, బ్రాహ్మీ లిపికి వేరుగా ఉంటుంది.
తెలుగు లిపి (పల్లవ సింహవర్మన్ 4-5వ శతాబ్దం)
తమిళ బ్రాహ్మీ లిపులపై పరిశోధనలు చేసిన ఐరావతం మహదేవన్ (Iravatam Mahadevan), ఈ లిపులని విశ్లేషించి క్రోడీకరించారు. తమిళ బ్రాహ్మీ లిపిలో, హల్లుల రూపాలన్నీ హలంతాలే. అంటే అందులో అంతర్గత అ-కారం లేదు. అ- గాని, ఆ- గాని చేర్చవలసి వచ్చినపుడు వాటికి ఒక గుర్తు (diacritic) కలిపేవారు. తమిళ బ్రాహ్మీ లిపి అందువల్ల అచ్చు లేని హల్లు లిపి (pure alphabet system) అవుతుంది. మహదేవన్ ఈ లిపులు ప్రత్యేకంగా ద్రావిడ భాషలని రాయడం కోసం పరిణామం చెందినవని వాదిస్తారు. పదం/వాక్యం చివర హల్లుతో అంతమవడం ద్రావిడ భాష లక్షణమని, ప్రాకృతభాష లక్షణం కాదని ఆయన వాదన.
గుణింతాలు, సంయుక్తాక్షరాల అవసరం లేకుండానే రాయగలిగే సౌలభ్యం – భట్టిప్రోలు, తమిళ బ్రాహ్మీ శాసనలిపులలో మొదటిసారి కనిపించినా, ఎందుకో అది ప్రాచుర్యం లోకి రాలేదు. దీనికి కొన్ని కారణాలు ఈ వ్యాసంలో మేం ప్రతిపాదించాం. మహదేవన్, “ఈ మార్పు/సౌలభ్యం ప్రాచుర్యం లోకి రాకపోవడానికి కారణం, మిగిలిన ప్రదేశాలలో అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న పాతపద్ధతిని ఈ విప్లవాత్మకమైన మార్పు తొలగించలేకపోవడమే,” అని అభిప్రాయపడ్డారు.
క్రీ.శ 1 – 6 శతాబ్దాలు
క్రీస్తు శకం నాటికి రాత చాలా ప్రాచుర్యం లోకి వచ్చింది. ఈ కాలం లోనే ప్రాదేశికమైన తేడాలు ప్రస్ఫుటంగా లిపులలో చోటు చేసుకోవడం మనం గమనించవచ్చు. కౌశాంబి, మధుర, పశ్చిమ, తూర్పు, దక్కను శైలులు ఈ కాలంలోనే పుట్టుకొచ్చాయి.
అక్షర స్వరూపాలలో ముఖ్యంగా వచ్చిన మార్పులు
ర (ఱ, ఋ), ఔ, ఞ, ః, హలంతాలు విరివిగా వాడకం లోకి వచ్చాయి. ఇవన్నీ సంస్కృతంలో రాయడం ప్రాచుర్యం లోకి రావడం మూలంగా లిపి స్వరూపంలో మౌలికంగా మార్పు చెందింది. రాళ్ళ పైనే కాకుండా, భూర్జపత్రాలు, తాళపత్రాల మీద రాయడం, కేవలం శాసనాలే కాకుండా, వాఙ్మయం రాత రూపం లోకి రావడం మొదలైన మార్పులు లిపి రూపంలో మౌలిక మార్పుకి కారణం అనుకోవచ్చు. ప్రత్యేకంగా కొన్ని అక్షరాలలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. డ, త, న, భ, స వంటి అక్షరాలు రాయడంలో అంతకు ముందున్న గీతలు పోయి, అవి గుండ్రంగా మారాయి.
కలం, సిరాలతో రాయడం వచ్చాక, కాలిగ్రఫీ కూడా మొదలైంది. అక్షరాలని అందంగా చెక్కడం, వాటికి అలంకారాలు చేర్చడం ఈ కాలం నుండీ మనం గమనించవచ్చు. నాగార్జునకొండ, అమరావతి, జగ్గయ్యపేటల దగ్గర దొరికిన శాసనాలలో ఈ కాలిగ్రఫీ ప్రత్యేకంగా అభివృద్ధి చెందింది.
ఉత్తరాదిన గుప్తుల కాలం నాటికి కౌశాంబి, మధుర, మాల్వ శైలులు అభివృద్ధిలోకి వచ్చాయి
క్రీ.శ. 7 – 10 శతాబ్దాలు: ప్రాదేశిక లిపుల పరిణామం
సిద్ధమాతృక లిపి (యశోదవర్మన్-విష్ణువర్ధన్)
(533 సా.శ., గుప్తయుగం)
ఆరవ శతాబ్దం చివరకి గుప్తుల శైలి పూర్తి లిపిగా మారింది – ఇదే సిద్ధమాతృక లిపిగా వ్యవహారం లోకి వచ్చింది – ఉత్తరాదిన, తూర్పు ప్రాంతాల్లోను, దక్షిణాదిన పట్టడవల్ శాసనాలలోను కూడా సిద్ధమాతృక లిపి వాడబడింది. నాగర లిపి సిద్ధమాతృక లిపి నుండే పుట్టింది. సంస్కృతం రాయడం బాగా ప్రాచుర్యం లోకి వచ్చింది. ఆ ప్రభావం అక్షరాల ఆకృతిపై పడింది. ప్రధానంగా సిద్ధమాతృక లిపిలో అక్షరాలు కోణాకృతిలో (angular form) ఉంటాయి.
వాయువ్యంలో మూల-శారద లిపి (Proto Saarada) ఈ కాలంలోనే వచ్చింది. ఊర్ధ్వ ద్రవిడ దేశంలో, ఇప్పటి తెలుగు-కన్నడ లిపుల ప్రత్యేక పరిణామానికి ఈ కాలం ప్రారంభ దశ అని చెప్పవచ్చు. దక్షిణాదిన గ్రంథ లిపి, వట్టెఴుట్టు తమిళ లిపులు పరిణమించాయి. గ్రంథ లిపి సంస్కృతం రాయడానికి, మిగిలిన లిపులు తమిళం రాయడానికి ఉపయోగించేవారు.
క్రీ.శ. 10వ శతాబ్దం నుండి ఆధునిక లిపుల పరిణామం
సిద్ధమాతృక లిపి నుంచి దేవనాగరి లిపి పరిణామం ఎనిమిదవ శతాబ్దం నాటికే మొదలైంది. పదకొండవ శతాబ్దం నాటికి నాగరి లిపి పూర్తిగా వాడకం లోకి వచ్చి శాసనాలు, సాహిత్యం రెంటికీ ఆ లిపినే వాడటం పరిపాటి aయింది. నాగరి లిపికి ఇప్పటి ఆధునిక రూపం, అక్షరాల పైన గీత వంటి లక్షణాలు కూడా ఈ కాలం లోనే మొదలయ్యాయి. క్రీ.శ 1000 నాటికి దేవనాగరి రమారమి ఒక లిపిగా స్థిరపడిపోయి సంస్కృతం రాయడానికి ప్రధానమైన లిపిగా స్థిరపడింది. మొన్న మొన్నటివరకూ నాగరి సొసైటివారి ప్రాబల్యం పెరిగి, సంస్కృతాన్ని నాగరిలిపిలో రాయాలనే ఉద్యమం బలపడిందిగానీ, స్వాతంత్రానికి ముందు సంస్కృత పండితులందరూ సంస్కృతాన్ని వారి వారి ప్రాదేశిక లిపులలోనే రాసేవారు.
తెలుగు లిపి (పెద్దపలకలూరు 14వ శతాబ్దం)
సిద్ధమాతృక నుంచి, ఈశాన్య ప్రదేశాలలో గౌడి లిపి, దాని నుండి బెంగాలి, ఒరియా, మైథిలి లిపులు 14వ శతాబ్దానికల్లా వేరు పడ్డాయి. కాశ్మీరు మిగతా పర్వతప్రాంతాల్లో శారద లిపి, దాని నుండి పంజాబీల గురుముఖి వచ్చాయి. 14 – 15 శతాబ్దానికి తెలుగు, కన్నడ లిపులు ఈనాటి స్వరూపాలని సంతరించుకున్నాయి. ఈ రెండు లిపులకి ఈనాటికీ పెద్ద వ్యత్యాసం లేదు; ఈ రెంటి మధ్య పెద్ద తేడా తలకట్టు రూపం. దక్షిణాన, గ్రంథ లిపి నుండి తమిళం, మలయాళం వేరుపడ్డాయి.
కేవలం మన దేశం లోనే కాక, బ్రాహ్మీ లిపి దక్షిణ-ప్రాచ్య ఆసియాలో ఎన్నో లిపులకి మాతృక. టిబెట్, కాంబోడియా, థాయ్, లావోస్ లిపులన్నీ బ్రాహ్మీ నుంచి వచ్చినవే!
సింధు నాగరికత లిపి: పరిష్కారాలు, వివాదాలు
కన్నింగ్‌హమ్ (Alexander Cunningham) 1872-73 ప్రాంతాల్లో హరప్పా అవశేషాలను కనుగొన్నాడు. అటుపైన ఓ యాభై యేండ్లకి జాన్ మార్షల్ (John Marshall) హరప్పా, మొహంజొదారోల నాగరికతని ప్రపంచానికి తెలియపరచడంతో, ఒక్కసారిగా భారత సంస్కృతి మరో రెండువేల సంవత్సరాలు పురాతనమైపోయింది. దీనితో భారత చరిత్ర రచనలో ఒక కొత్త శకం ఆరంభమయ్యింది. తొలినాళ్ళలో సింధు నాగరికతా చరిత్ర పరిశోధన ఆనాటి వలసవాద రాజకీయ సిద్ధాంతాలతో ముడిపడి ఉంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది భారత జాతీయవాదంతో ముడిపడి ఉంది.
సింధు నాగరికత గురించి తెలియక పూర్వం ఆర్యులనేవారు పశ్చిమ ప్రాంతాల నుంచి వచ్చి భారత భూభాగాలని ఆక్రమించుకున్నారనే వాదన బలంగా ఉండేది. సింధు నాగరికత వెలికి వచ్చిన తర్వాత, చాలా మంది ఇక్కడ కూడా ఒక స్వతంత్రమైన, ఇక్కడికే చెందిన నాగరకత ఒకటి ఉందని వాదించటం మొదలుపెట్టారు. మొదటిది ఆక్రమణ సిద్ధాంతం అనీ, రెండవది అంతర్గత సిద్ధాంతం అనీ పిలుస్తారు. ఈ రెండు అతివాద వాదనల మధ్య కొంతమంది మితవాదులు, ఆర్యులనేవారు నెమ్మదిగా భారతావనిలోకి వలస వచ్చారని ప్రతిపాదించారు. కానీ మూడు వాదాలలో ఏది సరైనదో చెప్పడానికి అవసరమైన సమాచారం – పురాతత్వశాస్త్ర పరంగా కానీ, భాషాశాస్త్ర పరంగా కానీ ఈనాటికీ అందుబాటులో లేదు.
ఇక లిపి విషయానికి వస్తే, 1920 ప్రాంతాలలో ఈ లిపి బయట పడినప్పటినుండీ దీనిని పరిష్కరించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూనే ఉన్నాయి. 1950-60 ప్రాంతాలలో ఫిన్లండ్‌కి చెందిన పరిశోధకులు ఈ లిపిని శాస్త్రీయ పద్ధతులలో సాధించటానికి తీవ్రంగా ప్రయత్నించారు. రెండో ప్రపంచ యుద్ధంలో రహస్య సందేశాలని భేదించడానికి ఎన్నో శాస్త్రీయమైన పద్దతులు అభివృద్ధి చెందాయి. వీటి సాయంతో ఇంతకు ముందు మనకి తెలియని లిపులని చదవడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఈ మార్గం లోనే జాన్ ఛాడ్విక్ (John Chadwick) లీనియర్-బి లిపిని, మైఖేల్ కో (Michael D. Coe) మాయన్ లిపిని పరిష్కరించారు.
గాడ్ – స్మిత్, హేరాస్, హంటర్, లాంగ్డన్, బార్టన్ మొదలైన వారెందరో ఈ లిపిని సాధించామనే చెప్పుకున్నారు. డి.పి. శర్మ పరిశోధనల ప్రకారం 2000 నాటికి సుమారుగా రెండువేల పరిశోధన పత్రాలు, వందకి పైగా పుస్తకాలు, ముప్పైకి పైగా పరిష్కారాలు ప్రచురించబడ్డాయి. కానీ ఇప్పటి వరకూ ఏ పరిష్కారమూ పూర్తిగా పని చెయ్యలేదు.
సింధులోయ లిపి పరిష్కారాలు కూడా ఆర్య-ద్రావిడ సిద్ధాంతాలలో ఏదో ఒకదానిని బలపరిచే దిశగానే ప్రతిపాదించబడ్డాయి. ఆర్యుల ఆక్రమణ తర్వాత సింధులోయ ప్రజలు దక్షిణానికి వలస పోయి ద్రావిడులయ్యారనే ఒక సిద్ధాంతం – దీనిని బలపరిచేవారు, సింధు నాగరికత లిపికి, ద్రావిడ భాషలకి లంకె చూపించాలని ప్రయత్నిస్తారు. అస్కో పర్పోలా (Asko Parpola), ఐరావతం మహదేవన్ ఈ మార్గంలో సింధు లిపిని పరిశోధిస్తున్న వారిలో ప్రముఖులు. మరికొందరు సింధు నాగరికతకి, వైదిక సంస్కృతికి సంబంధం చూపించాలని ప్రయత్నిస్తారు. ఎస్. ఆర్. రావు (S. R. Rao), ఝా (D. N. Jha), కక్ (Subhash Kak) మొదలైనవారు సింధులోయ లిపికి, వైదిక సంస్కృతానికి లేదా ఆర్య భాషలకి మధ్య సంబంధం ఉందని నిరూపించడానికి ప్రయత్నిస్తారు.
గడచిన 130 సంవత్సరాలలో, ఈ ప్రాచీన సంస్కృతి గురించి పూర్తి అవగాహనకి రావడానికి ఈ లిపిని పరిష్కరించడం ప్రధానమైన మార్గంగా భావించి ఎందరో పరిశోధకులు ఈ లిపిని సాధించడానికి ప్రయత్నించారు. ఈ లిపిని బ్రాహ్మీకి మూలం గాను, చైనాకి చెందిన లోలో లిపితోనూ, సుమేరియన్, ఈజిప్షియన్, ఈస్టర్ ద్వీపానికి చెందిన రొంగోరొంగో లిపితోనూ, ప్రోటో-ఈలమైట్, ప్రోటో-ముండా, వైదిక-సంస్కృతం, మూల-ద్రావిడ భాషలకి చెందిన లిపులతోనూ సంబంధం ఉండవచ్చనే ఊహాగానాలు, ఆ దిశగా దీనిని సాధించే ప్రయత్నాలు జరిగాయి.
ఎంతోకాలం పాటు చరిత్రకారులందరూ సింధులోయ రాయడం, చదవడం నేర్చిన నాగరికత అనే విశ్వాసం తోనే పరిశోధనలు చేశారు. సింధు నాగరికత ప్రాచీన నాగరకతల్లో భౌగోళికంగా అతి విశాలమైనది. ఇది అక్షరాస్యతని కనుగొన్న నాగరికతే అయిన పక్షంలో, ప్రాచీన ప్రపంచంలో అతి పెద్ద లిఖిత సంస్కృతి అవుతుంది. అందువల్ల, సింధు నాగరికత లిఖిత సంస్కృతి అవునా, కాదా అనేది తేల్చడం ఒక్క భారత దేశ చరిత్రకి మాత్రమే కాదు, యావత్ ప్రపంచ చరిత్రకి కూడా చాలా ముఖ్యమైన అంశం.
ప్రధానంగా, 1960 ప్రాంతాలలో, మాయన్ లిపిని పరిష్కరించడానికి తోడ్పడిన యూరి క్నోరోజోవ్ (Yuri Knorozov) అనే రష్యన్ పరిశోధకుడు, అస్కో పర్పోలా నాయకత్వంలో ఫిన్లండ్‌కి చెందిన కొందరు పరిశోధకులు, అప్పట్లో ప్రాచుర్యంలోకి వస్తున్న కాంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్, స్టాటిస్టికల్ విశ్లేషణ పద్ధతులని ఉపయోగించి ఈ లిపి ద్రావిడభాషా లిపి అని ప్రకటించారు. ఈ ప్రకటనతో, ఆర్యుల ఆక్రమణ సిద్దాంతానికి బలం చేకూరింది. తమిళ ద్రావిడ జాతీయవాదులు ఈ పరిశోధనలని తలకెత్తుకున్నారు. కానీ, ఈ పరిష్కారంలో ఎన్నో సమస్యలు బయటకి వచ్చాయి. ఇప్పటికీ ఈ దిశలోనే ఐరావతం మహదేవన్ ఇంకా ప్రయత్నిస్తున్నారు.
సింధులోయ లిపి (ఎస్. ఆర్. రావు వర్గీకరణ)
సింధులోయ లిపికి, ద్రావిడ భాషా లిపులకి సంబంధం నిరూపించలేక పోవడంతో, మరికొందరు పరిశోధకులు (రావ్, మిశ్రా, కక్) ఈ లిపిని వైదిక సంస్కృత లిపిగా నిరూపించడానికి ప్రయత్నించారు. రావ్, వైదిక సంస్కృతంలో ఉన్న సుమారుగా 20 అక్షరాలు ఈ లిపిలో ఉన్నాయని చూపించడానికి ప్రయత్నించాడు. కానీ, ఈ ప్రతిపాదనలు కూడా ఎక్కువకాలం నిలవలేదు. వీరి పరిశోధనల ధ్యేయం ఇండో-ఆర్యన్ నాగరకత భారతావనిలో పుట్టింది గానీ, మధ్య ఆసియా నుంచి వచ్చింది కాదని నిరూపించడం. కానీ, చారిత్రక భాషాశాస్త్రంలో గత 150 సంవత్సరాలలో జరిగిన అధ్యయనాలన్నిటికీ ఇది విరుద్ధం. ఈ పరిష్కారాలు చాలా వరకూ అశాస్త్రీయమైన ఊహాగానాలే.
ఈ లిపి ఇప్పటివరకూ పరిష్కారం కాకపోవడానికి కొన్ని కారణాలు:
ఇప్పటి వరకూ దొరికిన ముద్రలు సుమారుగా 5000 వరకూ ఉంటాయి. ఇవన్నీ — కుండలు, రాగిరేకులు, పూసలు, దంతాలు, కొమ్ములు మొదలైన రకరకాల వస్తువుల మీద చెక్కిన ముద్రలు. కానీ, ఈ ముద్రల్లో ఉన్న మొత్తం లిపి చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకూ దొరికిన అతి పెద్ద ముద్రలో 17 సంజ్ఞలు మాత్రం ఉండగా, 10 సంజ్ఞలు ఉన్న ఏకవాక్య ముద్రలు వందకి తక్కువగా ఉన్నాయి. ఎక్కువ ముద్రలలో సగటున 4 కంటే సంజ్ఞలు లేవు. ఇంత పొట్టిగా ఉన్న ముద్రల నుంచి భాషని, లిపిని గుర్తించటం సుమారుగా అసాధ్యమే. ఈ ముద్రలు చెక్కినది కుడి నుండి ఎడం వైపుకి, అయితే వీటిని ‘చదవటం’ కూడా కుడి నుండి ఎడమకేనా, లేక ఎడమ నుండి కుడివైపుకి కూడా చదవొచ్చా అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు కొన్ని ముద్రలు కుడివైపు నుంచీ, మరికొన్ని ఎడమవైపు నుంచీ చదవటానికి కూడా ప్రయత్నించారు.
సింధులోయ ప్రజలు ఏ భాష మాట్లాడేవారో మనకి తెలియదు. అది సంస్కృతం అని కొందరు, ద్రావిడభాష అని కొందరు వాదిస్తారు. సంస్కృతం అని వాదించేవారు అందులో సంస్కృతం చూడటానికి ప్రయత్నిస్తారు, ద్రావిడ భాష అని నమ్మేవారు అందులో ద్రావిడ భాషని చూడటానికి ప్రయత్నిస్తారు. మరి కొందరు, అది బ్రాహ్మీ లిపికి మాతృక అని నమ్మి, బ్రాహ్మీ లిపికి సింధు లోయ చిహ్నాలకి మధ్య సారూప్యం సాధించటం ద్వారా ఆ లిపిని పరిష్కరించాలని ప్రయత్నిస్తారు. మరికొందరు, అది చైనా లిపిలా లోగోగ్రఫీ అని, ఆ పద్ధతిలో ఈ లిపిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు.
ఈ సమస్య సరిగ్గా పరిష్కారం కావాలంటే – సింధు లోయలో పెద్ద పెద్ద రాత ముద్రలు దొరకాలి, అంటే శాసనాలలో లాగా ఇరవై, ముప్పై వాక్యాలైనా ఉన్న ముద్రలు, లేదా రాతి మీద, పలకల మీద రాసిన ఏదైనా పెద్ద రచన గానీ దొరకాలి. లేదా, రొసెట్టా ఫలకంలా (Rosetta Stone) సింధు లిపి, మరేదైనా మనకి తెలిసిన లిపిలో ఉన్న ఒక సందేశం దొరకాలి. లేదా, సింధు లోయ నాగరకతకి, వైదిక సంస్కృతికి, లేదా ద్రావిడ సంస్కృతికి మధ్య ఒక బలమైన లంకె దొరకాలి. ఇటువంటి ఆధారాలేవీ ఇప్పటివరకూ దొరకలేదు.
ఇదిలా ఉండగా, సుమారుగా 2000 సం.లో ఫార్మర్, విట్జెల్, మరికొందరు పరిశోధకులు అసలు సింధు లోయలో లిపి భాషని నిక్షిప్తం చేసే లిపి కాదని, అది భాషకి సంబంధం లేని ఒక సంకేత వ్యవస్థ అని సంచలనాత్మకమైన ప్రకటన చేశారు, అటుపైన వారు 2004లో ఒక పరిశోధనాపత్రం ప్రచురించారు.
ఫార్మర్, విట్జెల్ వ్యాసంలో ముఖ్యమైన అంశాలు:
- సింధులోయలో మనకి దొరికిన ‘రాత’ అవశేషాలు చాలా చిన్న, చిన్న ముక్కలు. అతి పెద్ద అవశేషంలో కేవలం 23 సంజ్ఞలు ఉన్నాయి, చాలా వరకు దొరికిన ముద్రలలో మూడు, నాలుగు కంటే ఎక్కువ సంజ్ఞలు లేవు. ప్రపంచంలో భాషని నిక్షిప్తం చేసే ఇంకే లిపి కూడా ఇంత సంక్షిప్తంగా లేదు.
- ఒకవేళ సింధులోయ లిపి, భాషాలిపి అయిన పక్షంలో, వారికి రాత రూపంలో ఏవో గ్రంథాలు ఉండాలి. అవి పోయినా, అటువంటి గ్రంథాలు ఉండేవన్న సంగతి ఇప్పటి వరకూ దొరికిన ఏ పురావస్తు అవశేషాలలోనూ కనిపించలేదు, దాని ప్రసక్తి ఎక్కడా లేదు. సింధులోయలో ప్రజలు రాసేవారనే సంగతి వేరే సంస్కృతులలో కూడా ఎక్కడా ప్రస్తావనకి రాలేదు.
- ఇప్పటి వరకూ దొరికిన ముద్రల లోని చిత్ర-సంజ్ఞలలో ఎక్కువగా కనిపించే సంజ్ఞలేవీ ఒక ముద్రలో పునరావృతం కాలేదు. ఇది ధ్వనిలిపి లక్షణం కాదు.
- ఒకవేళ సిలబిక్ లిపి అయిన పక్షంలో, సంజ్ఞలు ఒకే వరుసలో రాకుండా ‘రాండమ్’గా ఉంటాయి, అటువంటి లక్షణం కూడా ఎక్కడా కనిపించదు.
- పురావస్తు తవ్వకాలలో కొత్త ముద్రలు దొరుకుతున్న కొద్దీ, ఇంతకు ముందు వాడని కొత్త సంజ్ఞలు బయట పడుతున్నాయి. భాషాలిపికి ఈ లక్షణం ఉండదు.
- సింధులోయలో దొరికిన ‘రాత’ భాషని నిక్షిప్తం చేసే లిపి కాదు, అది ఐతిహాసిక, మతపరమైన ప్రతీకలని చూపించే సంకేత-లిపి.
- సింధులోయలో వాడిన చిహ్నాలను ఒక్కో సందర్భంలో ఒక్కో అర్థంలో ఉపయోగించి వుండడానికి ఆస్కారం ఉంది.
- ఇవి ఎక్కువుగా వ్యవసాయానికి సంబంధించిన క్రతువులకి సంబంధించినవి. వ్యాపార లావాదేవీలు నమోదు చెయ్యడానికి ఉపయోగించినవి కావు.
ఫార్మర్, విట్జెల్ ప్రతిపాదన, భారత చరిత్ర అధ్యయనంలో అది పెద్ద వివాదానికి దారితీసింది. ఈ వ్యాసంలో వారు సింధు నాగరికతను నిరక్షర సమాజం (illiterate society) అన్నారు. వారు వాడిన ‘ఇల్లిటరేట్’ అన్న మాట భారత జాతీయవాదులని చాలా కలవరపరిచింది. ఇంటర్నెట్‌లో దీనిపై ఎన్నో గొడవలు జరిగాయి. ఇప్పటికీ, వారానికొకరు సింధులోయ లిపిని పరిష్కరించామని ప్రకటిస్తుంటారు, వీరిలో ఔత్సాహికులే ఎక్కువ. బహుశా, వారు నిర్లిఖిత (non-literate) అనే పదం వాడి వుంటే ఇంత గొడవ జరగకపోయేదేమో. ఈ వివాదంతో, ఎలాగో ఒకలా మాకూ రాత ఉంది, మా సంస్కృతిలోనూ రాత వ్యవస్థలు ఉన్నాయి, అవి వేరే సంస్కృతుల సంపర్కం ద్వారా రాలేదు అని నిరూపించటానికి కొంతమంది ఔత్సాహిక పరిశోధకులు తిమ్మిని బమ్మి చెయ్యడానికి కూడా వెనుకాడలేదు.
దురదృష్టవశాత్తూ, మన యూనివర్శిటీలనూ, బయటా పనిచేసే పరిశోధకులకీ ఇప్పటీకీ సులభంగా దొరికే సమాచారం స్వతంత్రం రాక పూర్వం వలసపాలన కాలంలో అచ్చయిన పుస్తకాలే. వాటిపై వచ్చిన కొన్ని వివాదస్పదమైన వ్యాసాలు చదివి, చాలా మంది ఔత్సాహికులు చాలా మంది, రాతే సర్వస్వం అనీ, అది ఎంత పురాతనమైతే మన సంస్కృతి అంత గొప్పది అనే భ్రమలో వాదిస్తున్నారు. పాశ్చాత్య పరిశోధకులు కూడా వారి సంస్కృతులు ఎలా అభివృద్ధి చెందాయో, అదొక్కటే సరైన మార్గం అని, అవే మార్పులు ఇక్కడా ఉండాలనే విధంగానే చూస్తారు. ఉదాహరణకి, ఫార్మర్ వాడిన “ఇల్లిటరేట్” అనే పదం ఎంతో వివాదానికి దారితీసింది.
ఫార్మర్, విట్జెల్ వ్యాసంతో రేగిన అనవసరమైన వివాదం వల్ల తెలుస్తున్నది మనం నిర్లిఖత (non-literate) సమాజాల అధ్యయనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామని. ఇది చాలా దురదృష్టకరం. ఉదాహరణకి, ఇటువంటి సమాజాలలో జ్ఞాపక శక్తిని పెంపొందించుకోడానికి ఎటువంటి సాధనాలు ఉండేవి, చంధస్సు, క్లుప్తంగా గుర్తుంచుకోడానికి వీలుగా లయబద్ధంగా పద్యాలు, శ్లోకాల అల్లిక పద్ధతులు ఎలా ఉండేవి, ఈ సమాజాలలో వ్యాఖ్యాత, కథలు/సాహిత్యాన్ని చెప్పేవారి పాత్ర ఎలా ఉండేది మొదలైన విషయాలు అధ్యయనం చెయ్యడానికి కొత్త దారులు వేసుకునేవాళ్ళం. మనది కూడా అనాదిగా ‘లిఖిత’ సమాజమే అనే ఏకపక్ష వాదన మూలంగా ఒక గొప్ప అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం అని అనిపించక మానదు.
ముగింపు
బ్రాహ్మీ లిపి అశోకుడి కాలం నుండే ప్రాచుర్యం లోకి వచ్చింది అని అనుకున్నా, అప్పటి వరకూ యావద్భారత సంస్కృతి పూర్తిగా మౌఖికం గానే అభివృద్ధి చెందిందా అనేది ముఖ్యమైన ప్రశ్న. అంటే, క్రీ.పూ. 300 వరకూ, అప్పటికే ఎంతో కాలం నుంచీ ఈజిప్టు, చైనా, మెసపటేమియాలతో సంపర్కం ఉన్నప్పటికీ, ఎందువల్ల రాత ఈ ప్రాంతం లోకి ప్రవేశించలేదు? మౌర్యులకి పూర్వంకూడా ఇక్కడ ఎన్నో చిన్న రాజ్యాలు ఉండేవి. సంక్లిష్టమైన రాజ్యవ్యవహారాలు, చంధస్సు, గణితం, సాహిత్యం ఇవన్నీ కూడా మౌఖిక మాథ్యమం ద్వారా సాధ్యమా అనేది చాలామందిని తొలిచే ప్రశ్న. ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతూ, గత ముప్పై సంవత్సరాలుగా, రిచర్డ్ సాలమన్, మాధవ్ దేశ్‌పాండే, మైఖేల్ విట్జెల్, స్టీవెన్ ఫార్మర్ మొదలైన పరిశోధకుల ప్రతిపాదనలని సమీక్షిస్తూ, మా ప్రతిపాదనలు కూడా ఈ వ్యాసంలో చేశాం.
మౌఖిక-లిఖిత సంప్రదాయాలు ఈ సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన రీతిలో ఒకదాన్నొకటి ప్రభావితం చేసుకున్నాయని ఈ వ్యాసంలో ప్రదర్శించాం. భౌగోళిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సాంకేతిక శక్తులు ఏ విధంగా రాత పరిణామాన్ని నిర్దేశించాయో ఈ వ్యాసంలో చర్చించాం:
- అశోకుడికి ముందు ఎటువంటి రాత ఆనవాళ్ళు ఇక్కడ లేవు.
- వాయువ్య ప్రాంతమైన గాంధార ప్రాంతాల్లో, పాశ్చాత్య/పర్షియన్ ప్రభావం వల్ల అరమయాక్, ఖరోష్టి లిపులు మౌర్యులకి ముందే, పాణిని కాలానికే ఉండేవి. ఖరోష్టి లిపి ప్రత్యేకంగా అక్కడి ప్రాంతీయ భాషలని రాయడానికి అభివృద్ధి చెందిందని చెప్పవచ్చును.
- పాణిని కాలం నాటికే, వేదాల్లో ఉచ్చారణ దోషాలు ప్రవేశించడం, కొన్ని వేద పాఠాల ఉచ్చారణ పూర్తిగా కోల్పోవడం జరిగింది. ఈ ప్రక్రియ పతంజలి/కాత్యాయనుల కాలం వరకూ కొనసాగింది. ఈ కాలంలోనే, వేదాలని, మిగిలిన వాఙ్మయాన్ని స్థిరపరుచుకుని, ప్రామాణీకరించుకునే ప్రయత్నాలు చాలా పట్టుదలగా జరిగాయి.
- రాత తాకిడిని తట్టుకోడానికి వైదిక సంప్రదాయం మరింతగా మౌఖిక-సంప్రదాయాలని బలపరచుకునే ప్రయత్నం చేసింది.
- తూర్పు ప్రాంతాలైన విదేహ, కోసల, మగధ ప్రాంతాల్లో ఇందుకు భిన్నంగా బౌద్ధం ప్రాచుర్యం లోకి వచ్చింది. వైదికమతంకన్నా, బౌద్ధ మతంలో ముందుగా లిఖిత గ్రంథాలు వచ్చాయి.
- అయితే, వైదిక సంప్రదాయం పూర్తిగా రాతని నిరాకరించలేదు. ఏదో రకంగా రాయడం ఎక్కడో ఒక నేపథ్యంలో, మౌఖిక సంప్రదాయానికి ఒక తోడుగా, ఉపకరణంగా ఉండేదని తెలుస్తుంది. వేదాలని మాత్రం, వాటికున్న ఉచ్చారణ ప్రాధాన్యత దృష్ట్యా, రాయడానికి ఒప్పుకోలేదు.
- భారతావనిలో ధ్వనిరూపకమైన అక్షర సమామ్నాయం క్రీ.పూ 700 నాటికే ఏర్పడింది. ధ్వనిశాస్త్రం శాస్త్రీయంగా అభివృద్ధి చెందింది. ఉచ్చారణలో ఎంతో ఆధునికత ఉండేది. ఈ కారణాల వల్లనూ, ఉదాత్త, అనుదాత్త స్వరాలని, ఒక్కో అక్షరానికి ఉండే ఎన్నో రకాల ఉచ్చారణని రాయడానికి సౌలభ్యం లేకపోవడం వల్లనూ, రాత ఆలస్యంగా పుంజుకున్నది.
- బ్రాహ్మీ లిపి అశోకుడి కాలంలో శాసనాలు రాయడానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన లిపి – బహుశా, అరమయాక్, ఖరోష్టి లిపులు బ్రాహ్మీ రూపకల్పనని ప్రభావితం చేసి ఉండవచ్చు.
- భారత లిపులలో హల్లులని కూడా అజంతాలుగా రాయడం వల్ల, మనకి గుణింతాలు, సంయుక్తాక్షరాలు అవసరమయాయి. ఇవి లేకుండా హలంతాలుగా రాయడం కొన్ని చోట్ల జరిగింది కానీ అవి ప్రయోగాలు గానే మిగిలిపోయాయి.
ఈ కారణాల వల్ల రాతతో భారతీయ సంస్కృతికి ఉన్న అనుబంధం, మెసపటేమియా, ఈజిప్టు, చైనా సంస్కృతుల కంటే చాలా విభిన్నమైనది. రాతని, ముందు మత, సాంస్కృతిక, సాహిత్య వ్యవహారాలలో నిర్లక్ష్యం చేసినా, రోజువారీ రాజ్య వ్యవహారాలలో, వ్యాపార లావాదేవీల కోసం వాడి ఉంటారని కొంతమంది అభిప్రాయం. కానీ, దీనికి కూడా ఎలాంటి ఋజువులు మనకి ఈనాడు దొరకడం లేదు. “సాంస్కృతిక వ్యవహారాల లాగానే, భారతీయులు వారి అద్వితీయమైన జ్ఞాపకశక్తి తోనే వ్యాపార వ్యవహారాలు కూడా నడిపించేవారని అనుకోవడమే ఉత్తమం,” అంటాడు రిచర్డ్ సాలమన్.
సింధు నాగరికత ద్వారా కానీ, వైదిక సంస్కృతి ద్వారా కానీ మనం పాండిత్యానికి అక్షరాస్యత అవసరం లేదు అని కచ్చితంగా చెప్పవచ్చును. ముద్రా మాధ్యమం విరివిగా రాకముందు, మన కవులు, పండితులు రాసేవారు కాదు. వారికి రాయడానికి లేఖకులు ఉండేవారు. ఈ సంస్కృతిలో నిరక్షరకుక్షి, పొట్ట పొడిచినా అక్షరం ముక్కలేదు అనే నానుళ్ళకి అర్థం – చూచి చదవటం రాదని కాదు. అక్షరం అంటే ధ్వనిరూపకమే, ధ్వని కడుపు లోంచి వస్తుంది కాబట్టి ఆ వ్యక్తికి చదువు రాదనే అర్థంలో ఈ సామెతలు పుట్టాయి. ఈ వ్యాసంలో చూపినట్టుగా, సాంస్కృతిక, సామాజిక, నాగరికతా వికాసానికి రాత అవసరం లేదు. రాత లేకపోవడం మూలంగా ఒక సంస్కృతి ఏ విధం గానూ తక్కువైపోదు. ఇది మనం అర్థం చేసుకోగలిగితే, సింధు నాగరికతని గానీ, పాణిని/వైదిక సంప్రదాయాన్ని గానీ వేరే విధంగా పరిశీలించే అవకాశం ఉంది. ఈ వ్యాసంలో ప్రతిపాదించినట్టుగా, ఇక్కడ పాశ్చాత్య సంస్కృతికి భిన్నంగా, శబ్ధరూపకం గానే అక్షర సమామ్నాయం ముందు నుంచీ ఉండేదని, దానికి లిఖిత రూపం చాలా కాలం వరకూ అవసరం లేకపోయిందనే మార్గంలో చూస్తే — మనకి సింధు నాగరికత లిపిని సంస్కృతానికి గానీ, బ్రాహ్మీ లిపికి గానీ, ద్రావిడ లిపులకి గానీ కలపవలసిన అవసరం లేదు. ఫార్మర్ ప్రతిపాదించినట్టుగా అది అసలు లిపి కాదనుకున్నా వచ్చే నష్టం కూడా ఏమీ లేదు.
శాసనాలతో ప్రారంభం అయి, మౌఖిక సంప్రదాయానికి వెనుకగా ప్రారంభమైన లిఖిత సంస్కృతి, సాహిత్యం రాయడంతో గ్రంథ సంస్కృతిగా పరిణతి చెందింది. మహాభారతం,రామాయణం రాత రూపం లోకి రావడం చాలా పెద్ద మార్పు. ఎప్పుడైతే రాయడం అనే సాంకేతిక పరిజ్ఞానం సాహిత్యాన్ని, మిగిలిన సమాచార వ్యవస్థలనీ ప్రభావితం చేసిందో అప్పుడు లిఖిత సంస్కృతి ఈ మౌఖిక సమాజం నేపథ్యం లోంచి తప్పుకుని, సమాజాన్ని ప్రభావితం చేసే ప్రధానమైన శక్తిగా మారింది. ఈ మార్పు మన సంస్కృతిలో ఎన్నో ఒత్తిడులకి కారణం అయ్యింది – ఇక్కడ కొత్త వృత్తులు వచ్చాయి, కొత్త సమాజాలు ఏర్పడ్డాయి, కొత్త అధికార కేంద్రీకరణలు జరిగాయి.
గ్రంథ సంస్కృతి సామాజిక, సాంస్కృతిక చరిత్రని తరువాతి భాగంలో చూద్దాం.
(ఇంకా ఉంది.)
గ్రంథసూచి
- తిరుమల రామచంద్ర; మన లిపి పుట్టు పూర్వోత్తరాలు; హైదరాబాద్; విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్; 1990
- మల్లంపల్లి సోమశేఖరశర్మ; తెలుగు లిపి; తెలుగు విజ్ఞాన సర్వస్వము; సం. 3-4 – చరిత్ర, సంస్కృతి; తెలుగు భాషాసమితి; మద్రాసు, 1959-60
- Bühler, Georg (1898); On the origin of the Indian Brahma alphabet (2nd ed.); Strassburg: Karl J. Trübner; 1898
- Deshpande, Madhav M.; Ancient Indian Phonetics, in E. F. K. Koerner & R. E. Asher, ed., Concise History of the Language Sciences: From the Sumerians to the Cognitivists, Elsevier, Oxford, New York, Tokyo, pp. 72-77; 1995
- Deshpande, Madhav M; From Orality to Writing: Transmission and Interpretation of Panini’s astadhyayi in The International Symposium:The Book; Éditeur Bibliotheque de Bucarest; Bucarest; 2011; ISSN 2068 – 9756; pp. 57-100
- Falk, Harry; Schrift im alten Indien; Tübingen; Gunter Narr Verlag, 1993
- Farmer, Steve; Sproat, Richard and Witzel, Michael; The Collapse of the Indus-Script Thesis: The Myth of a Literate Harappan Civilization; in: Electronic Journal of Vedic Studies 11-2, 2004, pp. 19-57
- Glass, Andrew. A Preliminary Study of Kharoṣṭhī Manuscript Paleography.
MA Thesis. University of Washington, 2000 - Glass, Andrew: in Yahoo discussion group
- Hinüber, Oskar von; Der Beginn der Schrift und frühe Schriftlichkeit in Indien; Abhandlung der Akademie der Wissenschaften und Literatur, Mainz, nr.11; Wiesbaden, 1989
- Joshi S.D. and Roodbergen J.A.D; Patañjali’s Vyākaraṇa-Mahābhāṣya, Paspaśāhnika, with introduction, text, translation and notes; Publications of the Centre of Advanced Study in Sanskrit, class C, no. 15; University of Pune, Pune; 1986. (see esp. the discussion in page 40-42.)
- Mahadevan, Iravatham; Early Tamil Epigraphy: From the Earliest Times to the Sixth Century A.D.;Harvard Oriental Series 62; Cambridge; 2003
- Mahadevan, Iravatham; What do we know about Indus Script? Neti Neti (‘Not this Nor That’); Presidential AddressSection V; Proceedings of the Indian History Congress, Forty Ninth Session, Karnataka University, Dharwad; 1988
- P.V. Parabrahma Sastry, N.S. Ramachandra Murthy; Telugu script:Origin and evolution (3rd c. BC – 16th c. AD); Hyderabad; Andhra Pradesh Government Oriental Manuscripts Library & Research Institute; 2009
- Parpola, Asko; Deciphering the Indus Script; Cambridge: Cambridge University Press; 1994
- Pollock, Sheldon; The Language of the Gods in the World of Men: Sanskrit, Culture and Power in Premodern India; Berkeley: University of California Press, 2006
- Rath, Saraju (Ed); Aspects of Manuscript Culture in South India; Brill; Leiden; 2012
- Ritti, Srinivas H.; “The Telugu Kannada Script: Its connotation and development; in:Researches in Archeology, History & Culture in the New Millennium, Dr. P.V. Parabrahma Sastry Felicitation Volume, Volume-II, Delhi; Sharada Prakashan; 2004; Pages: 136-146
- Salomon, Richard; On the Origin of the Early Indian Scripts; in: Journal of the American Oriental Society, Volume 115 No. 2; 1995; pp. 271-279
- Salomon, Richard ; Indian Epigraphy: a guide to the study of inscriptions in Sanskrit, Prakrit, and the other Indo-Aryan languages; Oxford University Press, New York; 1998
- Scharfe, Hartmut; A new perspective on Panini; in Indologica Taurenensia, 35, 2009, pp. 1-270
- Witzel, Michael; Gandhāra and the formation of the Vedic and Zoroastrian canons; in:The International Symposium:The Book; Éditeur Bibliotheque de Bucarest; Bucarest; 2011; ISSN 2068 – 9756; pp. 490-532
- Witzel, Michael; The Development of the Vedic Canon and its Schools: The Social and Political Milieu; in: Inside the Texts, Beyond the Texts. New Approaches to the Study of the Vedas (M. WITZEL, ed.); Harvard Oriental Series, Opera Minora, vol. 2; Cambridge;1997, pp. 257-345