అంబఖండి నుంచి అట్లాంటా దాకా వచ్చిన నారాయణ రావు ఒక్కొక్క సారి ఇంకా అంబఖండి లోనే ఉన్నట్టు ఉంటాడు; అమాయకంగా! అంటే లౌకిక విషయాల గురించి అతను అడిగే ప్రశ్నలు అలాగనిపిస్తాయి. నిజం చెప్పాలంటే, అంబఖండి గురించి, అక్కడి నారాయణ రావు గురించి నాకయితే యేమీ తెలీదనుకోండి; అంబఖండి ఒక చిన్న పల్లెటూరు అని తప్ప.
వెల్చేరు బి.ఏ. రెండో ఏడు, 1953-54
ఏలూరు సి. ఆర్. ఆర్. కాలేజి
ఏలూరు కాలేజీలో చదువుకుని అక్కడే తెలుగు ట్యూటరుగా చేరినప్పటి నుంచీ మాకు ఆయనతో బాగా స్నేహం. నేనింకా కాలేజీలో విద్యార్థినే. మరో ఇద్దరు: పెన్మత్స సూర్యనారాయణ రాజు, పోణంగి రామకృష్ణారావుతో కలిపి, వెరసి మేం ముగ్గురం ఆయన స్నేహితులం. మాకెవ్వరికీ ఆయనెప్పుడూ క్లాసులో పాఠం మాత్రం చెప్పలేదు. అయినా ఆయన్ని మేష్టారూ ఆనే అనేవాళ్ళం; ముఖ్యంగా ఆయన మీద కోపం వచ్చినప్పుడు!
ఏలూరులో అప్పట్లో ఆరు సినిమా హాళ్ళుండేవి. ఎండాకాలం సెలవల్లో సుమారుగా ప్రతిరోజూ రెండో ఆట సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఒక్కొక్కసారి చూసిన సినిమాయే చూడాల్సి వచ్చేది, ఖర్మ! ప్రతీసారీ ఆయన్ని గూడా మాతో లాక్కెళ్ళే వాళ్ళం. నా ఉద్దేశంలో తెలుగు సినిమా చూడటం చేతకాని తెలుగు మేష్టారు నారాయణ రావే. సాధారణంగా, అప్పటి ప్రతి సాంఘిక సినిమాలోనూ ముప్ఫై నిమిషాల్లో హీరోయిన్ హీరోతో, ‘నన్నపార్థం చేసుకుంటున్నారు, నామాట నమ్మండి’ అని కళ్ళనీళ్ళు పెట్టుకొని, హీరో కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతూ ఉంటే, ‘ఛీ! ఛీ! నీచురాలా,’ అని కాళ్ళు విదుల్చుకుంటూ హీరో గొంతు చించుకొని అదేపనిగా అరుస్తాడు. వెంటనే, “ఆవిడ అసలు విషయం చెప్పచ్చుగా? ఇలా అపార్థం, అపార్థం అనే బదులు, నిజం చెప్పితే గొడవే లేదు!” అని నారాయణ రావు అడిగేవాడు. “అయ్యా! ఇప్పుడే నిజం చెప్పేస్తే, మూడు గంటల నిడివి వుండాల్సిన సినిమా ముప్ఫై నిమిషాల్లో అయిపోతుంది. మీరు ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు వెయ్యకండి,” అనే వాళ్ళం.
అంతే. నారాయణ రావు గుర్రుపెట్టి నిద్ర పోయేవాడు. ఇంటర్వెల్లో నిద్దర లేపితే, మాతోపాటు స్ట్రాంగ్ టీ తాగేవాడు. మళ్ళీ ఆట మొదలవగానే గుర్రంలా గుర్రు పెట్టి నిద్ర పోయేవాడు. పక్కవాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని, అప్పుడప్పుడు ఆయన్ని లేపే వాళ్ళం. రెండు కప్పుల కషాయం లాంటి టీ తాగి హాయిగా నిద్రపోగల సినీరసజ్ఞుడు నారాయణ రావు. అమెరికా వచ్చిన తరువాత అమెరికా అల్లుడు అనే అమెరికన్-తెలుగు సినిమా తీయించిన ఖ్యాతి నారాయణ రావుకే దక్కుతుంది.
నారాయణ రావుకి పేకముక్కలు తెలియవు. ఆఠీను రాణీకి డైమన్ రాణీకి భేదం ఆయనకి తెలుసునని నేనిప్పటికీ నమ్మను. అయినా, ఏలూరు క్లబ్బులో మేం రమ్మీ ఆడుతూంటే మాపక్కన భక్తిగా చేరేవాడు, కిబిట్జరుగా. పదమూడు ముక్కలు చేత్తో పట్టుకోటం మాత్రం చేతకాలేదు కాని, పేకాట జనం మాట్లాడే ప్రత్యేక భాష మాత్రం బాగా వంటపట్టింది. మీకు తెలుసో తెలీదో, నారాయణ రావు మిడిల్ డ్రాప్ అని ఒక కవిత రాశాడు. అప్పట్లో అది మా క్లబ్బులో పెద్ద హిట్.
నారాయణ రావు రోజుకో కవిత రాసేవాడని చెపితే మీరు నమ్మరు. రాజు, నేను ఆ కవిత చదవటం; ‘చెత్త, చింపెయ్యండి,’ అని అనడం మామూలు. తరువాత ఎవరో చెప్పారు, స్మైల్ కొన్ని కవితలు పోగుచేసి దాచుకున్నాడని! నవ్యకవితలతో పాటు, విశ్వనాథనీ, పోతననీ, శ్రీనాథుణ్ణీ వప్పచెప్పేవాడు. సంప్రదాయ కవిత్వం వల్లించినప్పుడు మాత్రం మాకు చిరాకేసేది; నిజం చెప్పొద్దూ! అవి మనకి అవసరం అని ఆయన ఆ రోజుల్లో అనేవాడు. ఇప్పుడు కదూ తెలిసింది అదెంత నిజమో!
ఒక సారి పవర్ పేట రైల్వే స్టేషన్లో జరిగిన కథ చెప్పాలి. ఒక పాసింజెర్ బండి నుంచి ఒక పన్నెండు పదమూడేళ్ళ పాప, ఆ పాప తాతో తండ్రో కాబోలు, బండి దిగారు. ఆ ఇద్దరే, అక్కడ దిగిన పాసింజెర్లు. రాత్రి పది దాటి వుంటుంది. ఆ పాప గట్టిగా ఏడవటం, స్టేషన్కి ఇవతల వైపున నారాయణ రావు అద్దెకున్న ఇంట్లో ఉన్న మాకు ఆ పాప ఏడుపు వినిపించింది. మేము గేటు దూకి, ప్లాట్ ఫారమ్ మీది కెళ్ళాం. అతను కదలటల్లేదు; చనిపోయినట్టున్నాడు. ఆ పాప గొల్లున ఏడుస్తుంటే, స్టేషన్ మేష్టరు ఆ విషయం పట్టించుకోనే లేదు. దగ్గిరకి గూడా రాలేదు. నారాయణరావు, వాడి దగ్గిరకెళ్ళి, ఇంగ్లీషులో గట్టిగా గదమాయించాడు: ‘నువ్వు ఇక్కడి అధికారివి. వెంటనే తగిన చర్య తీసుకోకపోతే, ఇరవైనాలుగు గంటల్లో రైల్వే మంత్రికి ఫోను చేసి నీ ఉద్యోగం ఊడగొట్టిస్తాను, ఏమనుకుంటున్నావో!’ అని అనేటప్పటికీ, వాడు గజగజ వణికిపోయి ఆ శవాన్ని తీసుకొని పోవటానికి, పోలీసులని పిలిపించాడు. నారాయణరావు ఆ పాప చేతిలో ఇరవై రూపాయలు పెట్టాడు. తరువాత మూడు రోజుల పాటు మేము పోలీసు స్టేషన్ చుట్టు తిరగాల్సి వచ్చింది; అది వేరే విషయం. నారాయణ రావు ఉదారతకి, జనాసక్తికి ఇది నాకు గుర్తున్న ఒక ఉదాహరణ. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేను యం.యస్.సీలో చేరటానికి మొదటి నలభై రూపాయలూ ఇచ్చినది నారాయణ రావే. అప్పుడు అతని జీతం నెలకి నూటపదిహేను రూపాయలు.
ఒకసారి రావి శాస్త్రి ఏలూరొచ్చాడు; పుర్రచేతి కమ్యూనిస్టుల సభల్లో వక్తగా. ఆయనకి మా స్నేహితుల ఇంటిలో విందు, మందు, ఏర్పాటు చేయించింది నారాయణ రావు, నేను. ఆ స్నేహితులు దక్షిణహస్త కమ్యూనిస్టులు. అప్పట్లో వాళ్ళని ముద్దుగా మితవాదులనేవాళ్ళు. ఇప్పుడు, వాళ్ళకీ కాంగిరేసుకీ భేదం లేదనుకోండి. ఆ రాత్రి, చిన్న రొయ్యల వేపుడు చేయించాను. వేయించి, ఉప్పూ కారం జల్లిన చిన్న చిన్న రొయ్యలు చూడటానికి అచ్చంగా జీడిపప్పుల్లా ఉంటాయి. నారాయణ రావు, రావి శాస్త్రీ విశాఖ ‘శాఖా’హారులు. అసలు విందు ముందు ఫలహారంగా ఈ రొయ్యలు పెడితే, ” ఇవేవిటీ?”, అని వాళ్ళిద్దరూ అడిగారు. ఆలోచించకండా, “వేయించిన జీడిపప్పులు. తినండి,” అన్నాను. అది పాపం! అయితే ఆ పాపం నాది; ఆ అమాయకులది కాదు.
వీఎన్నార్, 1972లో
నారాయణ రావు 1972లో విస్కాన్సిన్ వచ్చాడు. డిసెంబర్లో చలి భరించలేక, అట్లాంటా వచ్చాడు, సత్యసాయిబాబా లాగా తలనిండా జుట్టుతో! అప్పట్లో నేను థీసిస్ రాసుకుంటున్నాను. ఆయన్ని వెంటనే, మంగలి షాపుకి తీసికెళ్ళి, ఐదు డాలర్లిచ్చి, ఒక చక్కని అమెరికన్ తెల్లమ్మాయి చేత క్షవరం చేయించిన అదృష్టం నాకే దక్కుతుంది.
శ్రీశ్రీని సతీ సమేతంగా తానా సభల పేరుతో అమెరికా రప్పించడానికి నారాయణ రావు చేసిన కృషి నాకు బాగా తెలుసు. వాళ్ళ టికెట్ల కోసం కావలసిన పైకం సంపాదించడానికి ఎంతమందిని అర్థించాల్సి వచ్చిందో! మరి వాళ్ళు సినిమా యాక్టర్లు కాదుగా!
మాకు సంస్కృతం చెప్పే స్కూలు మేస్టరు ఆచారి ఒకాయన బాగా తెలుసు. ఆయన, నారాయణ రావు సంస్కృత వ్యాకరణం గురించి మాట్లాడుకోవటం వినడానికి తమాషాగా ఉండేది. ఆ ఆచారి గారు మాట్లాడే ఒక్క మాట కూడా నాకు బోధ పడేది కాదు. ఆయన్ని ముద్దుగా ‘మృగ్యమానం’ ఆచారి గారనేవాడిని. ఆయనకి ఉన్న ఒక చాదస్తం: హస్తసాముద్రికం. మా అరిచేతులు పరీక్షగా చూసి, ఆయన మాకు మా భవిష్యత్తు చెప్పాడు: నారాయణ రావుకి, నాకు, పరదేశయానం లేదని చెప్పాడు. మా ఇద్దరి చేతుల్లోనూ సముద్రయాన గీతలు లేవు అని అన్నాడు. అప్పుడే అన్నాను: “మేం విమానం ఎక్కి విదేశాలకి పోతామండీ; అందుకని మాకు సముద్రయానం గీతలు లేవు” అని! రాజుతో చెప్పాడు: వెంకటేశ్వర రావుతో కలిసి వ్యవసాయం చెయ్యవద్దని. రాజుకి నేను దున్నపోతులు కొని పెట్టటానికి సాయం చేశాను, ఆ రోజుల్లో! ఆయన వ్యవసాయం దున్నపోతుల వ్యవసాయమే అయ్యింది, చివరకి.
1956లో ననుకుంటాను; నారాయణరావు, నేను — ఇద్దరం ఒక సైకిల్ మీద కాలేజీకి వెళ్తున్నాం. ఆయన సైకిల్ బార్ మీద కూచున్నాడు; నేను సైకిల్ తొక్కుతున్నాను. మమ్మల్ని పోలీసు పట్టుకున్నాడు. ఆరోజుల్లో సైకిల్ మీద ఇద్దరు ఎక్కడం నేరం. నేరస్తులుగా ట్రాఫిక్ కోర్టు కెళ్ళాలి; మేజిస్ట్రేటు ఒక్క రూపాయి జరిమానా వేస్తాడు. ఇది మామూలు. ఆయన, నేను ట్రాఫిక్ కోర్ట్ కెళ్ళాం, మరుసటిరోజున. అక్కడ మాట్లాడకండా జరిమానా చెల్లిస్తే గొడవే వుండేది కాదు. నారాయణరావు ఆ మేజిస్ట్రేటుకి ఇంగ్లీషులో ఉపన్యాసం ఇచ్చాడు. ‘ఒక సైకిల్ మీద ఇద్దరు మనుషులు సురక్షితంగా వెళ్ళ గలరు. సైకిల్ ఖరీదు నూట యాభై రూపాయలు. ఒక్కడే సైకిల్ మీద వెళ్ళాలనడం, economic waste,’ అని. మేజిస్ట్రేట్ అంతా శ్రద్దగా విని, మాకు రెండు రూపాయలు జరిమానా వేశాడని గుర్తు. ఒక రూపాయి మామూలు; మరో రూపాయి వాడికి ఆర్థిక శాస్త్రం ‘పాఠం’ చెప్పినందుకు.
నారాయణ రావు చరిత్ర, ఆర్థికశాస్త్రం ముఖ్య అంశాలుగా తీసుకొని బి.ఏ. పాసయ్యాడు. తెలుగులో బంగారు పతకం రాబట్టి, తెలుగు ట్యూటరు అయ్యాడు. ఆ రోజుల్లో ఇల్యూజన్ అండ్ రియాల్టీ, కాడ్వెల్ పుస్తకం, క్షుణ్ణంగా చదవటం చూసి, ఆయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రైవేటుగా ఇంగ్లీషు ఎమ్.ఏ. పరీక్షకి చదువుతున్నాడని అనుకున్న వాళ్ళలో మేమూ ఉన్నాం. కాని, తరువాత తెలిసిన అసలు విషయం ఏమిటంటే, ఒకరిద్దరికి చదువు చెప్పటం కోసం అని! నాకు తెలిసి కనీసం నలుగు విద్యార్థులు ఎం.ఏ. పాసయ్యారు, ఆయన ధర్మఁవా అని! వాళ్ళు ఇంగ్లీషు లెక్చరర్ లయ్యారు, ఆయన మాత్రం ట్యూటర్ గానే ఉండి పోయాడు! కొంత మందికి తెలుగు పిఎచ్. డి. థీసిసులు కూడా ఆయనే రాశాడని ఎవరన్నా అంటే, అది అబద్ధం అని నేను అనటానికి నాదగ్గిర రుజువుల్లేవు.
నేను, కోవెల, వీఎన్నార్ – మాఇంట్లో
అడపా తడపా నారాయణ రావు హైదరాబాదు వెళ్ళేవాడు, విస్కాన్సిన్ నుంచి. అప్పుడప్పుడు, నేనూ ఆయన్ని హైదరాబాదులో కలవటం జరిగేది. అయితే, ఆయన్ని చూడటానికి బోలెడు మంది ‘కౌ’లు వచ్చేవాళ్ళు. అడగని వ్యక్తిది పాపం; వాళ్ళ కవితా సంకలనాలకి ముందు మాటో, వెనకమాటో రాసి పెట్టేవాడు, నారాయణరావు. కొన్ని కవితలు కూడా ఎవరికో రాసిపెట్టే ఉంటాడు. ఇదేమిటీ, అని అంటే, సంకలనంలో అన్ని కవితలూ గొప్పగా ఎప్పుడూ ఉండవు; ఒకటో రెండో మంచి పద్యాలుంటే, ఎప్పుడో, ఎవరో చదివి అనుభవిస్తారు, తప్పేవిఁటీ, అనేవాడు. (నో ఆర్గ్యుమెంట్!) అంటే, ఆయన ఉదారత ఒక్కొక్కసారి అవసరమైన దానికన్నా ఎక్కువే అవుతుందన్న మాట! వెయ్యి దోసెలు వెస్తే, ఒక్క దోసెన్నా గుండ్రంగా రాదా అన్న నా సిద్ధాంతం బహుశా నిజమేనేమో!
పారిజాతాపహరణం నుంచి, హరవిలాసం నుంచీ, విశ్వనాథ రామాయణం నుంచీ, పోతన భాగవతం నుంచీ, నారాయణ రావు ఏకధాటిగా పద్యాలు చదివి, రకరకాల కథలు చెప్పుతూ వుంటే, అప్పుడు వేళాకోళం చేసేవాళ్ళం. ఇప్పుడు, మేడిసన్ లోను, షికాగో లోను, జెరూసలెం లోను, బుడాపెస్ట్ లోనూ, అట్లాంటా లోనూ అతని కథలు విని, పరిశోధనా వ్యాసాలు రాస్తున్నారు; ఏమో! ఏ పుట్టలో ఏ పామున్నదో ఎవరికెరుక? తన కథలు విని, తన పుస్తకాలు చదివి, మరో జాయిస్సో, మరో ఫిలిప్పో, మరో సింథియావో, తెలుగు సాహిత్యానికి, తెలుగు సాంస్కృతిక చరిత్రకీ మరింత పేరు తెచ్చిపెట్టరని సందేహం రావడానికి ఆస్కారం లేదు. అందుకు దోహదంగా, కనీసం అరడజను అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో తెలుగు బోధనకి, తెలుగు సాహిత్య, తెలుగు చరిత్ర పరిశోధనకీ అమెరికా తెలుగు వాళ్ళు కృషి చేస్తే బాగుండును! (ఇది తీరని కోరిక కాకపోతే మరీ బాగుండును!)