నారాయణ రావు భావవిప్లవం

నారా (వెల్చేరు నారాయణ రావు) పరిశోధనలన్నిటికీ తొలిమెట్టు “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” అని నా అభిప్రాయం. కనక ముందుగా కవితా విప్లవాల గురించి మాట్లాడి తర్వాత మిగతా రచనలకి దానితో ఉన్న సంబంధం గురించి వివరిస్తా.

కవితా విప్లవాలు

కవితావిప్లవాల గురించి నారా పరిశోధనలు, పరిశీలనలు జగద్విదితాలు. విప్లవాత్మక కవితల రూపం, విషయం, వ్యక్తీకరణ – ఈ పార్శ్వాలన్నీ ఆ కవిత పుట్టిన సందర్భాన్ని ప్రతిబింబిస్తాయని ఈ సిద్ధాంతసారం. దీన్నుంచి కొన్ని విప్లవాత్మకమైన ఉపలక్ష్యాలు కూడా వస్తాయి. (అ) కవులు విప్లవాలను తీసుకురారు, (ఆ) తామున్న సమాజ సందర్భాన్ని అర్థం చేసుకున్న కవులు ఆ సందర్భానికి అనుగుణంగా కవిత్వం రాస్తారు, (ఇ) అలాటి వారిలో సమర్థులైన వారు ఆ కవితావిప్లవానికి నాయకులుగా గుర్తింపబడతారు, (ఈ) సమర్థులైనా సందర్భాన్ని అర్థం చేసుకోలేని వారూ, లేదా ఆ సందర్భాన్ని తాము మార్చగలమనుకునే వారూ రాసే కవిత్వం నిలబడటానికి, వారి సమర్థత పాలు సందర్భానికి అనుగుణంగా రాసే వారి కన్నా ఉన్నతమైనదై వుండాలి.

ఈ సిద్ధాంతాన్ని ఇంకొంచెం లోతుగా పరిశీలిద్దాం.

సందర్భంలో పెనుమార్పులు అరుదుగా వస్తయ్. తెలుగులో కవితావిప్లవాల స్వరూపం అన్న గ్రంథంలో నారా గుర్తించిన విప్లవాలు అయిదు.

అ) ఆశుకవిత్వం నుంచి పురాణ విప్లవం,
ఆ) పురాణ కవిత్వం నుంచి ప్రబంధ విప్లవం,
ఇ) ప్రబంధ కవిత్వం నుంచి భావకవితా విప్లవం,
ఈ) భావ కవిత్వం నుంచి అభ్యుదయ విప్లవం,
ఉ) అభ్యుదయ కవిత్వం నుంచి దిగంబర విప్లవం.

వెయ్యేళ్ళ తెలుగు కవిత్వ చరిత్రలో ఇంతకన్నా విప్లవాలు లేవా? ఈ పట్టికలోని ఐదింట్లో మూడు ఒక్క ఇరవైయ్యో శతాబ్దంలో వచ్చినవే కావటం కూడ ఈ సిద్ధాంతం ఎన్నుకున్న విప్లవ భావన మరీ స్థూలమైందేమో అన్న అనుమానం కలిగించక మానదు.

ఇక పైనిచ్చిన ఐదు విప్లవాలకి కారణభూతాలైన మార్పులు చూస్తే అవి – (అ) మౌఖిక కవితా నిర్మాణం నుంచి రాసింది చదివి ఒక వ్యక్తి వివరించటం, (ఆ) రాసిందాన్ని పదుగురు కూర్చుని విశ్లేషించి చర్చించటం, (ఇ) అచ్చొత్తిన దాన్ని ఎవరికి వారే చదువుకుని తనదైన అనుభూతిని పొందటం, (ఈ) ఎవరికి వారో లేక గుంపుగానో చదివి సామూహికానుభూతిని పొందటం, (ఉ) సంప్రదాయ వాసనలు మచ్చుకైనా లేని సామూహికానుభూతిని ఎవరికి వారే చదువుకుని పొందటం, అని నా అభిప్రాయం. చివరి మూడు సరిగ్గా దానికి ముందున్న విప్లవమార్గానికి తిరుగుబాటుగా వచ్చిన విప్లవాలు కావటం గమనించదగ్గది.

మొదటి మూడు విప్లవాలకు ఉన్న కారణాలు చాలా పెద్దవి. చదవటం, రాయటం, అంతకుముందున్న దశతో పోలిస్తే మహావిప్లవాలు. అలాగే తాటాకుల మీద ప్రతులు తయారు చేసుకోవటం నుంచి అచ్చువేసిన ప్రతిని కొనుక్కోవటం అన్నదీ మహావిప్లవమే. ఒక పౌరాణికుడు చెప్పింది వినటం నుంచి కొంతమంది పండితులు కలిసి చర్చించుకోవటం వరకు జరిగేది అంత పెద్ద విషయం కాదు. పురాణ దశలో కవి రాసినదాన్ని పౌరాణికుడు శ్రోతలకి అందిస్తే ప్రబంధ దశలో కవి స్వయంగా కొందరు శ్రోతలకి వినిపించటం జరిగింది. కేవలం ఈ మార్పు ఒక్కటే పురాణాల నుంచి ప్రబంధాలకి దారితీసిందని నమ్మటం కొంచెం కష్టమే. ఇలా కొన్ని లోపాలున్నట్టు అనిపించినా, తొలి ప్రయత్నంగా తెలుగులో కవితావిప్లవాల స్వరూపం ఉన్నతమైన పరిశోధనని చాటుతుంది. తొలి రచనతోనే ఒక రంగాన్నంతటినీ ఆమూలాగ్రంగా పరిశీలించటం బహుశ ఏ రంగంలోనూ జరగదు కదా.

ఐతే నారా ఈ లోపాల్ని గుర్తించారనటానికి, వాటిని పూరించటానికి తర్వాత ఆయన చేసిన రచనలే తార్కాణం. ఒక విధంగా చూస్తే, ఆ గ్రంథం తర్వాత వచ్చిన రచనలన్నీ దాన్ని మరిన్ని వివరాలతో పూరించటానికి చేసిన ప్రయత్నాలుగా భావించొచ్చు. ఈ రచనలు కవితావిప్లవాలు హఠాత్తుగా జరగవని, ఒక దశ నుంచి మరో దశకి జరిగే ప్రయాణంలో ఉన్న మైలు రాళ్ళని గుర్తించవచ్చనీ చూపిస్తాయి. ఉదాహరణకి, శ్రీనాథుడి గురించిన పరిశోధన, పురాణ దశ నుంచి ప్రబంధ దశకి జరిగిన పరిణామక్రమంలో, ఒక ముఖ్యమైన మజిలీగా గుర్తించటం. చాటుపద్యాల గురించిన పరిశీలనలు, ప్రబంధ దశకి పట్టుగొమ్మలైన పండితబృందాలు కవిత్వాస్వాదనని ఒక అద్భుతమైన వ్యవస్థగా ఎలా తీర్చిదిద్దాయో, ప్రబంధ కవితా విప్లవాన్ని ఎలా నిలబెట్టాయో చూపిస్తాయి. కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం మీద జరిగిన పరిశోధనలు బహుశా ప్రబంధ విప్లవానికి ఒక ముఖ్య కారణం అప్పటి సమాజంలో ఊపిరిపోసుకుంటున్న “ఆధునికతా” భావనలు కావొచ్చునని ప్రతిపాదిస్తాయి. నాయకరాజుల కాలంనాటి కవిత్వం గురించిన శోధనలు ప్రబంధ సాహిత్యం అంతా ఒకే మూస లోది కాదని, దానిలోనూ అనేక “చిరువిప్లవాలు” ఉండొచ్చునని చూపే ప్రయత్నంగా చూడొచ్చు. ఇలా, స్థూల వర్గీకరణతో ప్రారంభమైన నారా సుదీర్ఘ ప్రయాణం ఒక్కో స్థూలాంశాన్ని దాని సూక్ష్మ విభాగాలుగా విడదీసి ఒక్కో సూక్ష్మాంశానికున్న ప్రత్యేకతల్ని గుర్తిస్తూ, అది దాని స్థూల మాతృకలోని ఇతర సూక్ష్మాంశాలతో ఎలా సంబంధితమైందో వివరించే నిరంతరాయ ప్రయత్నాల సముదాయంగా నాకనిపిస్తుంది.

విప్లవ సిద్ధాంతాన్ని తిరగేస్తే …

సామాజిక సందర్భం కవితా విప్లవాలకి దారితీస్తే, ఒక విప్లవదశకి చెందిన రచనా సమూహం నుంచి వాటికి దారి తీసిన సందర్భాన్ని గుర్తించొచ్చా? అనేదొక ఆలోచించాల్సిన ప్రశ్న. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఒక సందర్భం నుంచి వచ్చిన విప్లవంలో ఒక వెయ్యి రచనలు వచ్చాయనుకుంటే, వాటిలో ఒక యాభై రచనల్ని చూసి ఆ సందర్భంలోని ఏయే విషయాలు ఆ రచనలకి దారితీశాయో చెప్పొచ్చా? గణితంతో పరిచయం వున్నవాళ్ళకి చాలా పరిచితమైన ప్రాధమిక ప్రశ్న ఇది. దీన్ని సాహిత్య విమర్శా సందర్భంలో వెయ్యగలగటం అనేది కవితా విప్లవ సిద్ధాంతానికున్న శాస్త్రీయ స్థాయిని ప్రతిబింబిస్తుందని అనుకోవచ్చు కూడ. ఏమైనా, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ప్రయత్నం జరిగింది సార్థకప్రతీకలు (Symbols of substance) అన్న రచనలో. విశాలమైన ప్రబంధ విప్లవ దశలో ఒక కాలభాగాన్ని తీసుకుని, అందులో వచ్చిన రచనల ఆధారంగా ఆ కాలంలో ఉన్న సామాజిక సందర్భాన్ని అంచనా వెయ్యటానికి జరిగిన ఈ ప్రయత్నం అభినందనీయం.

“నేనొప్పుకోను”

నారా రచనలన్నిటినీ విహంగవీక్షణంతో చూస్తే నాకనిపించేది, వాటన్నిటికీ ఉన్న ఒక సామాన్యాంశం (common thread) ఆయన తెలుగు సాహిత్యాన్ని గురించి మరెవరు చెప్పిన సిద్ధాంతాల్నీ విధేయంగా ఒప్పుకోకపోవటం అని (ఇది కొన్ని విషయాల్లో తెలుగు సాహిత్యం నుంచి దక్షిణ భారతీయ సాహిత్యం అంతటికీ విస్తరించింది). ఇది పరిశోధకుడికి ఉండవలసిన ఒక ముఖ్యలక్షణం అని నా నమ్మకం. ఇతరులు చెప్పిన దాన్ని వాళ్ళు పెద్ద వాళ్ళనో, పేరున్న వాళ్ళనో, మరే కారణం వల్లనో తార్కికంగా ఖండించి చూడకుండా బుద్ధిగా తలూపి ఒప్పేసుకోవటమే తెలుగు సాహిత్య విమర్శ హీనస్థితికి మూలదౌర్భాగ్యం. (ఇలా ఆలోచించే నేను నారా ఆలోచనల్ని ఎందుకు ఒప్పేసుకుంటున్నానని సూక్ష్మగ్రాహులు ప్రశ్నించొచ్చు – దానికి నా సమాధానం నాకు తార్కికంగా కనిపించే వాటినే ఒప్పుకుంటాను, అన్నిటినీ కళ్ళు మూసుకుని ఒప్పుకోవటం జరగదని; కవితా విప్లవాల గురించి నేను పైనన్న మాటలే ఇందుకు తార్కాణాలని.)

ఇందుకు ఎన్నో ఉదాహరణలివ్వొచ్చు. కవితా విప్లవ సిద్ధాంతానికి మూలం బహుశా 1970ల్లో కొందరు కవులు “ఇక్కడినించి కవిత్వం నా వెనకనే నడవబోతున్నది”, “నేనీ యుగకవిని”, “రాబోయే కవిత్వాన్ని నేను శాసిస్తాను” లాటి స్వోత్కర్ష పరాకాష్టలైన ప్రకటనలు చెయ్యటం అయుండొచ్చు. లేకుంటే ఆ గ్రంథంలో ఉన్నంత తీవ్రంగా వాళ్ళ ప్రకటనలకి వ్యతిరేకమైన ప్రతిపాదన చెయ్యటం జరిగేది కాదేమో!

కన్యాశుల్కం సందర్భంలోనూ మనం ఇది చూస్తాం. ఇంతకు ముందున్న విమర్శకులంతా దాన్ని సంఘసంస్కరణా సాహిత్యంలో శిఖరాయమానంగా భావిస్తే నారా దాన్లో అసలు సంఘ సంస్కరణ అనేదే లేదని, నిజానికి గురజాడ దృష్టిలో సంఘం చక్కగా వున్నదని, ఎవరూ వచ్చి దాన్ని సంస్కరించాల్సిన పనిలేదనీ ప్రతిపాదించారు. అన్నిటికన్నా పెద్ద ఉదాహరణ ప్రబంధ కాలపు తెలుగు సాహిత్యాన్ని స్వర్ణయుగం, క్షీణయుగాలుగా విభజించిన సాంప్రదాయ ధోరణిని ఆయన తిరస్కరించిన తీరు. క్షీణయుగం అనేది లేదని, అది కేవలం పాశ్చాత్య (విక్టోరియన్) భావాల ప్రభావం వల్ల, సమాజం మీద పెద్ద ప్రభావం వెయ్యగలిగిన కొందరు వ్యక్తులు ఇచ్చిన వైయక్తిక, అతార్కిక, అనాలోచిత తీర్పు మాత్రమే అని నిరూపించటానికి ఆయన చేసిన, చేస్తున్న సుదీర్ఘ పోరాటం. ఈ పోరాటం ఇంకా విస్తరించి భారత సాహిత్యం గురించిన పాశ్చాత్య భావాలన్నిటినీ అనుమానాస్పదాలు చేసింది. దీన్లో రెండు ప్రధాన పార్శ్వాలు, (అ) రచనకీ దాని రచయితకీ ఉన్న సంబంధం గురించిన భావాలు, (ఆ) ఆధునికత అనేది ఏమిటి, అది ఎప్పట్నుంచి మొదలైంది అన్న మీమాంస.

రచన – రచయిత

రామాయణం, మౌఖిక సాహిత్యం, చాటు సాహిత్యం, శతక సాహిత్యం, ఇలా అనేక సాహితీధోరణుల గురించి అర్థం చేసుకోవటానికి (రామాయణం అనేది ఒక గ్రంథం కాదని, అదీ ఒక సాహితీధోరణిగా లేక ఇంకా విశాలమైన ఒక ‘భాష’గా చూడాలనీ నారా ప్రతిపాదన) రచనలూ వాటి రచయితల గురించిన పాశ్చాత్య భావాలు ప్రతిబంధకాలై ఎన్నో తరాల పరిశోధకులని అగమ్య మార్గాలు పట్టించాయని నారా విశ్వాసం. పాశ్చాత్యుల దృష్టిలో ఒక రచన వుంటే దానికి ఒక రచయిత(లు) ఉండాలి. ఒకే కథ వివిధ రచనల్లో వుంటే వాటిలో ఒకటి మాతృక, మిగిలినవి దాని పుత్రికలై వుండాలి. ఒక రచనలోని ఒక భాగం మరో రచనలో వుంటే ఆ ఇద్దరు రచయితల్లో ఒకరు రెండవ వారి నుంచి తస్కరించి వుండాలి. ఏ రచయితా ఇష్టపూర్వకంగా తన రచనకి మరో రచయిత కర్తృత్వం ఆపాదించడు.

భారతీయ రచనల విషయంలో ఇలాటి పాశ్చాత్య భావాలు ఏవీ వర్తించవని గుర్తించటం నారా వెలుగు లోకి తెచ్చిన అంశాల్లో ముఖ్యమైంది. ఒకసారి ఈ భావనని గ్రహిస్తే కర్తృత్వం విషయంలో ఎప్పటినుంచో రాజుకుంటున్న ఎన్నో వివాదాల్ని తేలిగ్గా తేల్చెయ్యొచ్చు. ఉదాహరణకి: (అ) రామాయణాన్ని వాల్మీకి రాశాడా? అసలు ‘ఒక’ రామాయణం అనేది లేదు, ఎన్నో వున్నయ్. వాటిలో ఒకదాన్ని వాల్మీకి అనే కవి రాసుండొచ్చు, ఔననీ కాదనీ చెప్పలేం. కాని, అన్ని ఇతర రామాయణాలకీ మాతృక ఐన ఒక రామాయణం వుందని, దాన్ని వాల్మీకి రాశాడని అనుకోవటం మాత్రం పొరపాటు. (ఆ) మౌఖిక కావ్యాలు ఎవరు రాశారు? అసలీ ప్రశ్నే అర్థరహితం. ఏ కావ్యానికైనా మొదలు రాతతో కానక్కర్లేదు. మౌఖికంగా వందల, వేల ఏళ్ళనుంచి వస్తున్న కథలు ఎన్నో వున్నయ్. వాటిలో కొన్నిటిని ఎవరన్నా రాసి వుండొచ్చు గాని అంత మాత్రాన వాళ్ళు ఆ కథకి కర్తలు కారు. (ఇ) ఫలానా చాటు పద్యం ఎవరు రాశారు? ఎవరినా అయుండొచ్చు, వాళ్ళూ ‘రాసి’ వుండక్కర్లేదు. అది ఎవరి పేరుతో చలామణి ఔతుందో వాళ్ళకా పద్యంతో ఎలాటి సంబంధమూ ఉండకపోవచ్చు. ఇలా ఎన్నో కొరుకుడు పడని ప్రశ్నలకి సూటైన సమాధానాలు ఇవ్వవచ్చు.

పురాణాలు, అనేక ఇతర రచనలు ఎవరి కర్తృత్వంతో ప్రచారంలో వున్నాయో వాళ్ళు రాసినవు కావని ఖచ్చితంగా చెప్పొచ్చు. నిరపేక్షగా రచనలు చేసి ఎవరో పెద్దవారి పేరు మీద వాటిని ప్రచారం చెయ్యటం అచ్చు యంత్రానికి ముందు సర్వసాధారణ విషయం. కవిగా పేరు తెచ్చుకోవటమే గాని ‘ఫలానా రచనకి రచయితగా’ పేరు తెచ్చుకోవటం అప్పట్లో అంత గొప్ప విషయంగా కనిపించదు. ముఖ్యంగా రాజాస్థానాల్లోనో, పెద్ద దేవాలయాల్లోనో ఆశ్రయం లేని వాళ్ళకి.

కనక, ఒక రచనని తీసుకుని, దీన్ని రాసింది ఫలానా వాళ్ళా కాదా? అని సిగపట్లు పట్టుకోవటం సమయం వృథా చేసుకోవటానికి తప్ప సాహిత్య చరిత్రకి ఉపయోగపడే పని కాదు. అంతకన్నా, ఆ రచనని కూలంకషంగా విశ్లేషించి దాన్నుంచి ఆ రచనని సాధ్యం చేసిన సందర్భాన్ని అంచనా వెయ్యటానికి ప్రయత్నించటం ఉత్తమ మార్గం.

ఆధునికత

చాలామంది పాశ్చాత్యులు, కొందరు భారతీయులూ కూడ ముస్లిం దండయాత్రలకి ముందు వరకు భారతదేశంలో ఉన్నత సంస్కృతి ఉండేదని, ముస్లిం పరిపాలనా కాలంలో అది దిగజారిపోయిందని, బ్రిటీష్ వారి పాలనలో పూర్వపు ఔన్నత్యం ఆధునికతా అలంకారాలతో మళ్ళీ పునరుద్ధరించబడిందని సిద్ధాంతీకరించారు. ఈ భావన ప్రకారం బ్రిటీష్ వారి పాలనలో లేని ప్రాంతాల్లో, కాలాల్లో భారతీయ సంస్కృతి క్షీణదశలో వుంది. బ్రిటీష్ పాలనే ఆధునికతకి నాంది.

ఇది దోషభూయిష్టమైన సిద్ధాంతం అని నారా వాదన. నాయకరాజుల కాలంలో వచ్చిన అనేక కావ్యాల ఆధారంగా ఇప్పుడు మనం ఆధునికతా లక్షణాలుగా లెక్క వేసేవి ఎన్నో అప్పటి సమాజంలో ఉండేవని నిరూపించారు. అంతకన్నా ముందు వచ్చిన కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం ఆధునికతకి పెద్దపీట వేశాయని చూపించారు. ఇంకా ముందున్న అన్నమయ్య ఎంతో ఆధునికుడని నిశ్చయించారు. శతక కవులు ఆధునికతని పుణికి పుచ్చుకున్నారని చూపారు. శ్రీనాథుడి సుకుమారుడి కథ ఈనాటి నవలికల్తో పోల్చదగిందని, కళాపూర్ణోదయం అచ్చమైన నవల అని నిర్ధారించారు. ఇలా అనేక విధాలుగా ఆధునికతని వందల ఏళ్ళ వెనక్కి తీసుకెళ్ళి వలస సంస్కృతికీ ఆధునికతకీ జనక జన్య సంబంధం లేదని ఢంకా మోగించి చాటారు.

కొత్త చూపు

ప్రతి విషయాన్ని ఒక కొత్త దృష్టితో చూడటానికి ప్రయత్నించటం నారాలో కొట్టొచ్చినట్టు కనిపించే మరో గుణం. ఇది ఆయన రచనలన్నిటా సర్వవ్యాపకంగా వుంటుంది. కవితా విప్లవాలని గుర్తించటంలో, అదివరకు పరిశోధకుల వివరణల్ని పూర్వపక్షం చెయ్యటంలో, ఆ గ్రంథాన్ని వాడుక భాష వంటి సాంకేతిక భాషలో ఎంతో పటిష్టంగా రాయటంలో మొదటగా కనిపించిన ఈ లక్షణం తర్వాతి అన్ని రచనల్లోనూ స్పష్టంగానే వుంది. ముఖ్యంగా చాటుపద్యాల గురించిన పరిశోధన ఆయన లోచూపుకి మహోన్నత శిఖరాయమానం అని నా అభిప్రాయం. అప్పటి వరకు తెలుగు సాహిత్యం మీద అభిరుచి వున్న వాళ్ళందరికీ తెలిసిన పద్యాలే ఇవి. ఎందరో పెద్దలు, ఉద్దండులు వాటితో కుస్తీ పట్లు పట్టిన వారే, వాటి ఆధారంగా కథలల్లి పుస్తకాలు రాసిన వారే. నారా వాళ్ళెవరికీ కనపడని లోతుల్ని, కోణాల్ని చూశారు. బహుశా పదిహేడో శతాబ్ది ప్రాంతంలో దక్షిణ భారతంలో చాటుపద్య వ్యవస్థ ఒకటి రూపు దిద్దుకున్నదని, కవిత్వపు లోతుల్ని తీక్షణంగా చూడగలిగిన రసగ్రహణ పారీణులు ఇందులో భాగంగా వున్నారని ప్రతిపాదించారు. తెలుగు, సంస్కృత, తమిళ సంప్రదాయాల్నుంచి చాటు రచనలని, వాటికి అనుబంధంగా వున్న కవుల కథల్ని విశ్లేషించి వీటన్నిటికీ ఎన్నో సామాన్య సారూప్య లక్షణాలున్నాయని గుర్తించి వాటిని విశదీకరించారు. వాటినుంచి చాటు వ్యవస్థ రూపురేఖలని, ఎదుగుదలని వివరించి ఈ సిద్ధాంత బలంతో చాటు పద్యాల్ని ఎలా విశ్లేషించవచ్చునో చూపారు. నారా పరిశోధనల్లో ఒక్కదాన్ని అన్నిటికన్నా మిన్నగా ఎత్తిచూపాలంటే అది ఇదే, నా దృష్టిలో.

కన్యాశుల్కం విషయం లోనూ ఆయన విశ్లేషణ ఆశ్చర్యం కలిగిస్తుంది. గత వందేళ్ళలో కన్యాశుల్కం గురించి మాట్లాడని లేదా రాయని తెలుగు కవి గాని విమర్శకుడు గాని బహుశా లేరు. ఐనా వాళ్ళెవరూ చూడని పార్శ్వాల్ని చూడగలటం, వాటిని సహేతుకంగా చర్చించి పాఠకుల చేత నిజమే అనిపించటం అసాధారణ విషయాలు. ఇంతకుముందు వరకు అందరూ కన్యాశుల్కం ఆశించిన ప్రయోజనం సంఘసంస్కరణ అని ఒప్పేసుకున్న సందర్భంలో దాన్లో సంఘసంస్కరణ మచ్చుకైనా లేకపోవటమే కాదు, అది సంఘసంస్కరణ భావాలకే వ్యతిరేకం అనే సాహసం బహుశా ఆయనొక్కడే చెయ్యగలడు.

ఆమూలాగ్ర దృష్టి

ఒక కావ్యం చదువుతుంటే దాదాపు అందరి దృష్టీ ఉండేది ప్రస్తుతం చదువుతున్న ఒక్కొక్క పద్యం మీద. ఆ పద్యం గురించి కొందరు తీవ్రంగా ఆలోచిస్తారు, లోతుగా విశ్లేషిస్తారు, దాన్లోని పదాల్ని, పదబంధాల్ని, వాటి సంబంధాల్ని, శబ్దస్వభావాన్ని, శబ్దార్థ సంయోజనాన్ని – ఇంకా ఓపికుంటే రసాల్ని, అలంకారాల్ని చూస్తారు, నచ్చితే మెచ్చుకుంటారు. మొదటి నుంచి చివరి వరకు కలిసి ఒకే ఒక అవిభాజ్య మొత్తంగా ఆలోకించేవారు, ఆలోచించేవారు అరుదు. అలాటి అరుదైన వారిలో ఒకరు నారా. కాకుంటే మరెవరు “ఆముక్తమాల్యదలో తొలికథ ఖాండిక్య కేశిధ్వజులదైతే, చివరి కథ మాలదాసరిది ఎందుకైంది? ఆ రెంటిని అలా వుంచి కృష్ణరాయలు ఏం చెప్తున్నాడు?” అని అడగ్గలరు?

అలా చూడగలగటం వల్లనే కళాపూర్ణోదయాన్ని నవలగా, సుకుమారుడి కథని నవలికగా గుర్తించటం సాధ్యమైందనుకుంటాను. కన్యాశుల్కంలో సంస్కరణ లేదనటానికి, క్రీడాభిరామం బాఖ్తిన్ (Mikhail Bakhtin) కార్నివల్ సిద్ధాంతానికి విరుద్ధమైన ఉదాహరణ అని చెప్పటానికి ఇలాటి ఆమూలాగ్రదృష్టి అవసరం. శ్రీనాథుడి శృంగార నైషధాన్ని శ్రీహర్షుడి మూలంతో పోల్చి ఎక్కడ శ్రీనాథుడు మూలాన్ని మించాడో చెప్పాలన్నా, భీమేశ్వర స్థలపురాణం చాలాభాగం శ్రీనాథ సృష్టి అని గుర్తించాలన్నా అది లేకుండా సాధ్యం కాదు.

కల్పన, నిజం

చాలాకాలం ఒక రంగంలో పనిచేసిన వాళ్ళు ఆ దీర్ఘానుభవం వల్ల సాధారణ విషయాలుగా అనిపించే అసాధారణ సత్యాల్ని చాలా సునిశితంగా, సరళంగా చెప్పగలుగుతారు. నారా ‘సూక్తుల్లో’ అలాటిదొకటి, “నిజానికి ఎన్నో రూపాలుంటయ్ కాని కల్పనకి ఒకటే రూపం” అనేది. అంటే, ఒక సంఘటనని ఒక్కొకరు ఒక్కో రకంగా చూస్తారు, వాళ్ళ భాషలోకి తర్జుమా చేస్తారు. అలా వచ్చిన అనేక రుపాంతరాఅన్నీ సమానంగా ‘నిజాలు’, వారి వారి దృష్టి నుంచి. అదే ఒక కల్పనని చూస్తే అది ఒక వ్యక్తిది కనక దానికి ఒకటే రూపం వుంటుంది. దీన్ని తిరగేస్తే, ఒకే రూపం వున్న ఒక రచన కల్పన కావటానికి అవకాశం చాలా ఎక్కువ. అలాగే, అనేక రచనల్లో వున్న వస్తువుకి ఎంతో కొంత ‘వాస్తవం’ మూలం అయే అవకాశం ఎక్కువ. ఇలాగే మరోటి: “మనక్కావల్సింది స్వార్థపరులు; త్యాగాలు చేసి ఇతరులకి మంచి చేస్తామనే వాళ్ళు ఏ పనీ చెయ్యరు,” అనేది. ఇది ‘ధనస్వామ్య మంత్రం’ సూక్ష్మరూపం అనొచ్చునేమో.

నారాతో నా పరిచయం – స్వోత్కర్ష

‘తెలుసా’ రోజుల్లోనో దానికి కొంచెం ముందు SCIT రోజుల్లోనో నారాయణ రావు గారితో ఈ-మెయిల్ పరిచయం జరిగిన గుర్తు. ఐతే 1998లో ఈమాటని ప్రారంభించటం గురించి ఆలోచిస్తున్న సమయంలో ఆయనతో కొన్నిసార్లు ఫోన్లో మాట్లాడాను. అప్పటికి ఆయన చేసిన పరిశోధనల గురించి ఏమీ తెలీదు, విస్కాన్సిన్ యూనివర్సిటీలో తెలుగు పాఠాలు చెప్తారని, తెలుగు సాహిత్యం మీద పుస్తకాలేవో రాశారనీ వినటం తప్ప ప్రత్యక్షంగా ఏమీ చదవలేదు. ఆరోజుల్లో ఆస్టిన్‌లో కొందరు మిత్రులం కలిసి తెలుగు సాహిత్యం గురించి చర్చిస్తుంటామని ఆ ఫోన్ కాల్స్‌లో చెప్పిన గుర్తు. అలాగే కనకప్రసాద్ ఆయనకి అప్పటికే తెలుసు, అతను కూడ ఆస్టిన్ లోనే వుండేవాడు. మొత్తానికి హఠాత్తుగా ఒకరోజు తను ఫలానా రోజు ఆస్టిన్ కి వస్తున్నానని ఆయన ఫోన్లో చెప్తే డల్లాస్ నుంచి కన్నెగంటి చంద్రని, నందివాడ ఉదయభాస్కర్‌ని కూడ ఆహ్వానించాను. అలా 1998 ఆగస్ట్ ప్రాంతంలో అని గుర్తు, ఒక శనివారం నాడు ఆయన ఆస్టిన్ వచ్చారు. ఆ రోజంతా మా ఇంట్లో సాహిత్యగోష్టి జరిపాం. కొంపెల్ల భాస్కర్, విష్ణుభొట్ల లక్ష్మన్న, చంద్ర, ఉదయభాస్కర్ ఉన్నాం, కొలిచాల సురేశ్ కూడ కొంతసేపు ఉన్నట్టు అనుమానం (అప్పటికతను అట్లాంటా ఆస్టిన్‌ల మధ్య తిరుగుతూండేవాడు). రోజు గడిచింది, రాత్రయింది. ఐనా ఆ చర్చ అలాగే కొనసాగింది. అందరం మా లివింగ్ రూంలో పక్కలేసుకుని ఏ మూడింటికో పడుకున్నాం. అదో మర్చిపోలేని అనుభవం. మళ్ళీ ఎప్పుడూ అలా జరగలేదు.

ఆ చర్చలో ఎన్నో విషయాలొచ్చినయ్. నేను స్పష్టంగా గమనించిన ఒక సంగతి – ఆయన సాహిత్యాన్ని కూడ చాలా సైంటిఫిక్‌గా చూస్తారని. అది ఆశ్చర్యకరమైంది. సామాన్యంగా సాహిత్యానికీ సైన్స్‌కీ చుక్కెదురు. సాహిత్యచర్చల్లో సైంటిఫిక్ పద్ధతులు సాధారణంగా కనిపించవు – ఏదో నాకు తోచింది నేను చెప్తా, అదే సిద్ధాంతం అనే తరహా సాహిత్య విమర్శే తెలుగులో సార్వత్రికం గనక ఆయన పాటించే పద్ధతి మాకు నచ్చింది – అక్కడ వున్న వాళ్ళందరం వృత్తిరీత్యా సైంటిస్ట్‌లి, ఇంజనీర్లు కావటం వల్ల. ఇందుకో చిన్న ఉదాహరణ – క్షేత్రయ్య పేరుతో వున్న పదాలు రాసిన వ్యక్తి పురుషుడా స్త్రీనా అన్న మీమాంస. ఎటూ చెప్పటానికి ఆధారాలేవీ లేవని, కనక అతను పురుషుడే అని ఎలాటి అనుమానమూ లేకుండా చెప్పటం సాధ్యం కాదనీ నారా వాదన. అందుకు భాస్కర్ అదే వాదన కాళిదాసుకీ ఇతర పూర్వకవులు చాలామందికీ వర్తిస్తుంది కదా అని ప్రతివాదన చెయ్యటం ఇంకా బాగా గుర్తు. మరొకరైతే అలాటి ప్రతివాదనకి కోపం తెచ్చుకునే వారేమో కాని ఆయన మాత్రం “అది నిజమే, కాని కాళిదాసు స్త్రీ ఐనా పురుషుడైనా అది క్షేత్రయ్య గురించిన ప్రశ్నకి సమాధానం చెప్పటానికి పనికిరాదు గదా!” అనటం ఇప్పటికీ బాగా గుర్తు. మొత్తానికి వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యాన్నీ ఆ పది గంటల్లో చుట్టొచ్చాయి మా సంభాషణలు. సమకాలీన సాహిత్యం, ముఖ్యంగా కవిత్వం, ఆయనకి చాలా ఇష్టమైన అంశం అని కూడ అర్థమైంది. అప్పటికే కన్యాశుల్కం అనువాదం ప్రారంభించారు, ఆ నాటకం గురించి కూడ ఆసక్తికరమైన చర్చ జరిగిందా రోజు. అందులో,

నదమా పొక్కిలి జాంబూ
నదమా మైచాయ కోకనదమా పదమా
పదమా జడ నడుము వియత్
పదమా …

అన్న పద్యాన్ని సరిగా విడగొట్టటానికి శ్రమ పడటం ఇంకా గుర్తుంది.

ఆ తర్వాత గత పద్నాలుగేళ్ళలో నాలుగైదు సార్లు కలవటం తటస్థించింది గాని ఎప్పుడూ అంత విపులమైన చర్చలకి అవకాశం కలగలేదు. ఈమాట ప్రారంభించాక ఆయనచేత వ్యాసాలు రాయించటానికి చాలాసార్లు ఫోన్లో మాట్లాడాను. వెయ్యి గుళ్ళ పూజారి, ఎప్పుడూ ఎన్నో ప్రాజెక్టులు సాగుతూ వుంటాయి గనక ఆయన చేత రాయించటం అంత తేలికైన విషయం కాదని తొందర్లోనే అర్థమైంది. ఐతే వెంటబడి వదలకుండా విసిగిస్తే చివరికి మాట నిలబెట్టుకుంటారనీ తేలింది. అలా వచ్చినవే పఠాభి గురించి, అజంతా గురించి ఈమాట తొలిరోజుల్లో ఆయన రాసిన వ్యాసాలు.

నేను ఈమాట సంపాదక బాధ్యతల్ని వేలూరి గారికి అప్పగించాక నారాయణ రావు గారు ఎప్పుడో హఠాత్తుగా ఫోన్ చేసి ఏదో పద్యం తనకి నచ్చిందని దాన్ని గురించి చెప్పటం, ఏవన్నా పదాలకి అర్థాల గురించిన సందేహాల్ని చర్చించటం పరిపాటి అయింది. సంజయ్ సుబ్రహ్మణ్యం అన్నట్టు తనతో మాట్టాడుతున్న వాళ్ళందర్నీ తన సమకాలికులగానే చూడటం, అదే భావం వాళ్ళలో కలిగేట్టు చూడటం ఆయన ప్రత్యేకత అనిపిస్తుంది. ఆయనకి ఎనభై ఏళ్ళు నిండాయంటే ఆశ్చర్యం కలక్కమానదు.

ఈ సందర్భంగా ఒక చిన్న పిట్టకథ. 2002లోనో 2003లోనో శాన్ ఏంటోనియోలో స్టటిస్టీషియన్గా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సి. ఆర్. రావు గారి ఎనభయ్యో జన్మదిన సందర్భంగా ఆయన శిష్య ప్రశిష్యులు ఒక సింపోజియం ఏర్పాటు చేశారు. మేం ఆ వర్గంలో లేకపోయినా నేను యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ లో పనిచేస్తున్నప్పుడు ఆయన కూడ అక్కడ పనిచెయ్యటంతో చాలా సోషల్ అకేషన్స్‌లో కలుసుకున్న పరిచయాన్ని పురస్కరించుకుని నేనూ, నాతో పాటు భాస్కర్, లక్ష్మన్న వెళ్ళాం (అలాటి సింపోజియం ఒకటి 2010 లో నారాయణ రావు గారి గౌరవార్థం మేడిసన్ లో జరిగిందని పరుచూరి శ్రీనివాస్ చెప్పారు). సి. ఆర్. రావు గారి గురించి అక్కడందరూ ముక్తకంఠంతో చెప్పిన ఒక విషయం నారాకీ వర్తిస్తుంది – అరవై ఏళ్ళు దాటాక ఆయన ఇరవై ఏళ్ళ కుర్రవాడిలా పనిచేస్తున్నాడని, ఇప్పటికీ ఆయన రాస్తున్న పుస్తకాలైతేనేం పేపర్లయితేనేం ఆయన వయస్సులో సగం వున్న వాళ్ళకీ సాధ్యం కాని పనులని. గత పది పదిహేనేళ్ళలో నారాయణ రావు గారు చేసిన పని చూస్తే వయసు దృష్ట్యా యువకులంతా సిగ్గు పడక తప్పదు.

ముగింపు

తెలుగు సాహిత్యానికి ప్రపంచ వేదిక మీద పటిష్ట స్థానం ప్రతిష్టించటానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు నారా. ఆయన అన్ని భావాలతో అందరూ అంగీకరించకపోవచ్చు, కొందరు కొన్నిటితోనైనా ఏకీభవించకపోవచ్చు. కాని తెలుగు సాహిత్యానికి అంతర్జాతీయంగా ఇంతటి గుర్తింపు తెచ్చినవారు ఇప్పటివరకు ఇంకెవరూ లేరు. సమీప భవిష్యత్తులో ఇంకెవరూ కనిపించటం లేదు.

తెలుగు భాష దీర్ఘకాలపు మనుగడ మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. ఓ పదేళ్ళ క్రితం లెక్కలు కట్టి 140 సంవత్సరాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ శాతం వుంటారని ఒక వ్యాసం రాశాను. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది బహుశా ఆశావహమైన అంచనాయేమో అనిపిస్తుంది. ఐనా కాకపోయినా, తెలుగు చదివే, రాసే వాళ్ళ శాతం ఒక తరాన్నుంచి మరో తరానికి తగ్గిపోవటం ప్రత్యక్ష సత్యం. ఇదిలాగే ముందుముందు సాగుతుండే అవకాశాలు చాలా అధికం, సాగకుండా పెరిగే అవకాశాలు స్వల్పం కనక తెలుగు సాహిత్యాన్ని రక్షించుకోవటానికి ఎక్కువ వ్యవధి లేదు. ఇంకా ఆగితే దాన్ని అర్థం చేసుకుని ముందుతరాలకి అందించగలిగే వాళ్ళు మచ్చుకి కూడా దొరక్కపోవచ్చు.
తెలుగు సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించాల్సిన బాధ్యత ఈ తరం వాళ్ళది. ఈ సౌధనిర్మాణానికి నారా గట్టి పునాదులు వేశారు. అందుకు నడవవలసిన దారి సుగమం చేశారు. సొంతంగా తలనెత్తుకున్న బాధ్యతని ఇతోధిక ఉత్సాహంతో నెరవేరుస్తున్నారు. ఆయన బాగానే చేస్తున్నార్లే అని పక్కన నిలబడి చోద్యం చూడటం సమంజసం కాదు. అందరూ తమ వంతు సాయం అందించాలి. ఎవరికోసమో కాదు, ఎవరికి వారే వారి స్వార్థం కోసం నారా పుస్తకాలు కొనండి. చదవండి, పిల్లలకి అందుబాటులో వుంచండి, ఎప్పుడన్నా ఏమీ తోచకపోతే చదువుతారు వాళ్ళు. తెలుగు సాహిత్యాన్ని గురించి కొంతైనా తెలుసుకుంటారు.