ప్రాసక్రీడాశతకము

మించగ కోరికల నదులు, యెల-
మించగ భావముల దాటు, కుసు-
మించగ సోయగపు విరులు, మిసి-
మించగ నెనరు, ధర స్వర్గమే …69

(ఎలమించు = ఉత్సహించు)

మితములు లేనిదిగ మన ప్రేమ
స్మితములు తమ్మి పూలవలె కుసు-
మితములు, యీడేరు నింక కా-
మితములు విస్మితమ్ముగ బ్రియా … 70

మోదము డెందముల నిండె ప్రథ-
మోదము చిన్కులై రాల, యా-
మోదము నివ్వగా నింగి, యను-
మోదముతో విప్పె శిఖి పురుల్ … 71

(ప్రథమోదము = తొలకరి; ఆమోదము = అంగీకారము; అనుమోదము = సంతోషము)

మోహములో బడితి, నాకు ది-
ఙ్మోహము కల్గెనే, యిదొక వ్యా-
మోహము, మోహనాస్త్రముల స్మర-
మోహము హెచ్చెనే వెచ్చగా … 72

(దిఙ్మోహము = దిక్కులు తెలియని పరిస్థితి)

యోగము నీదు దర్శనము, దు-
ర్యోగము నీ వియోగము, నీ ని-
యోగము లుద్యోగములగు, సం-
యోగము నాదు సౌభాగ్యమౌ … 73

(నియోగము = ఆజ్ఞ)

రంగని దలవంగ, రసన లూ-
రంగను, వలపుతో దనువు కో-
రంగను, పరుగుతో వాని జే-
రంగను నే దురంగ మయితిన్ … 74

రంగము నాటకపు మేడ, సా-
రంగము వృక్షముల నీడ, ష-
డ్రంగముపైన నిర్వురము, చద-
రంగమును విరించి యాడునో … 75

(సారంగము = ఏనుగు, జింక; షడ్రంగము = డెల్టా)

రంగముపై పాడ, యాశా త-
రంగముపై యాడ, స్వర్ణ సా-
రంగమువలె నెగయ, నా యంత-
రంగము రంగులన్ నిండెగా … 76

రకములు ప్రేమలో నెన్ని, కా-
రకములు ప్రేమ కింకెన్ని, కో-
రకములు ప్రేమ కింకెన్ని, ప్రే-
రకములు ప్రేమ కింకెన్నియో … 77

రజముల దెచ్చె పవనములు, నీ-
రజముల కళ్ళదాన, మఱి యా-
రజముల దాచకుము, కజ్జల శి-
రజముల దాన, స్రజముల గొమ్ము … 78

(రజము = పుప్పొడి; ఆరజము = ఇంపు; శిరజము = వెండ్రుక; స్రజము = పూలదండ)

రణములు ప్రేమలో సబబె, కా-
రణములు లెక్కించ నగునె, ప్రే-
రణములు గల్గ సరసి గల వా-
రణములు గర్జించకుండునే … 79

రతియా, విద్యలను నేర్పు భా-
రతియా, మనసులో గల్గు యభి-
రతియా, మంగళమ్మునకు హా-
రతియా, ప్రేమ కొక్క ప్రతియా … 80

(అభిరతి = ప్రీతి)

రమ్మనె నేత్రములు నన్ను, గో-
రమ్మనె నాశలకు తెన్ను, నే-
రమ్మనె నిస్పృహ నిరాశ, జే-
రమ్మనె నింగిలో తారనే … 81

రవములు పికములకు హెచ్చు, కా-
రవములు కాక యన వచ్చు, కల-
రవములు నీకు ఘన తిచ్చు, కై-
రవములు శశి జూచి విచ్చుగా … 82

(కారవము = కాకి; కాక = బాధ; కైరవము = కలువ)

రసముల పుట్టయే యునికి, ష-
డ్రసముల తట్టయే మనికి, నవ
రసముల బుట్టయే నటన, కా-
రసముల కట్టయే ఘటనలా … 83

(కారసము = బాధ)