ద్రావిడ ఛందస్సులో ప్రాస అతి ముఖ్యమైనది. కన్నడ మలయాళ భాషలలో అక్షరయతి సామ్యమును అనుసరించకపోయినా ద్వితీయాక్షర ప్రాసను మాత్రము తప్పకుండ పాటిస్తారు. అందుకే ఆ భాషలలో జాతులు తప్ప ఉపజాతులు లేవు. ఉన్నట్లుండి ప్రాసతో ఆడుకోవాలనే ఒక సరదా పుట్టింది. దాని ఫలితమే ఈ పద్యాలు. ఈ పద్యపు ప్రతి పాదములో 14 మాత్రలు. నాలుగు, ఐదు, ఐదు మాత్రల స్వరూపము తీసికొంటే అప్పుడు అది సంపఁగి అనే పద్యములోని అర్ధ పాదము అవుతుంది (చూ. చంపకోత్పలమాలల కథ). కాని క్రింది పద్యాలలో ప్రాసకే ఎక్కువ ప్రాముఖ్యము. అది కూడ ఎక్కువగా ఒకే అక్షరాలతోడి ద్విప్రాస (2, 3 అక్షరాలు), త్రిప్రాస (2,3,4 అక్షరాలు). అందువల్ల పదాలను ఎల్లప్పుడు అలా విడదీయుట సాధ్యము కాలేదు. మొదటి పాదములో మొదట వచ్చే పదము, తరువాతి పాదములోని మొదటి అక్షరాలుగా ఉంటాయి. ఈ అక్షరాలకు ముందు ఉండే అక్షరము(ల)తో, అనగా ముందటి పాదములోని చివరి అక్షరము(ల)తో పదము ఏర్పడుతుంది. ఒకే పదమును ఉపయోగించినప్పుడు దాని అర్థము వేరుగా ఉంటుంది. అలంకార రీత్యా యిది యమకము. నా ఈ చిన్న ప్రయత్నమును పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. కొన్ని పదముల సేకరణకు ఆంధ్రభారతి సైటులోని నిఘంటుశోధన ఉపయోగపడినది. ఆ సైటు నిర్వాహకులకు నా ప్రశంసాపూర్వక కృతజ్ఞతలు.
శ్రీయన శ్రీదేవి సిరుల నిడు
శ్రీయన శ్రీవాణి చదువు లిడు
శ్రీయన శ్రీసతియు కాపాడు
శ్రీయన నా కవితలే పాడు … 1
వాణీ, సుందరతర వర గీ-
ర్వాణీ, వందనము లశరీర-
వాణీ, వేదవేణీ, కీర-
వాణీ, వరదాయి భారతీ … 2
కంటిని శ్రీశైలమందు ము-
క్కంటిని, మధురాపురిన్ మచ్చె-
కంటిని, శేషాద్రిపై దమ్మి-
కంటిని, కంటి సౌభాగ్యమై … 3
(ముక్కంటి = శివుడు, మచ్చెకంటి = మీనాక్షి, తమ్మికంటి = విష్ణువు )
కందము కవితలకు జెల్లు, మా-
కందము పికములకు నిల్లు, తెలి
కందము నింగిలో గను, మూల-
కందము బ్రదుకులో విను నీవె … 4
(కందము = పద్యము, మేఘము; మాకందము = మామిడి; మూలకందము = ఆధారము)
కంబు గళంబున స్వరంబు, లే-
కంబుగ హాయి గల్గించె, శో-
కంబు గతించె, నూత్నంబు లో-
కంబు, కనులముందు నాకంబు … 5
కతలను చెప్పనా, నీ కడ్డు-
కతలను చెప్పనా, పలు పిట్ట-
కతలను చెప్పనా, తందాన-
కతలను చెప్పనా, చెప్పవా … 6
కమ్మల జదివేవొ, బంగారు
కమ్మల నా రాణి, చాలు చిలు-
కమ్మలతో నాట, రమ్ము కన-
కమ్మయు దయ జూపు మనపైన …7
కలములు కవితలను వ్రాయు బు-
ష్కలముగ, వికలమగు మనసుల శ-
కలముల సకలముగ జేయు, కల-
కలమును గల్గించు వెల్గించు … 8
(శకలము = తునక)
కరములు వరములకు వార్ధు, ల-
క్కరములు కవిత కిడు హృదయ, మా-
కరములు తనువు సొగసులకు, భీ-
కరములు లేక నీవు రజనులు … 9
(అక్కరము = అక్షరము; ఆకరము = ఉనికి)
కలలో భయమేలకో, పీడ-
కలలో కెవ్వుమని యఱచేవు
కలకల మని నవ్వు, ముదము ని-
క్కలయగు కడు మోద మొందగా … 10
(నిక్కల = నిజమగు కల)
కలిలో, మాడుచుండు పెను యా-
కలిలో, వీడకుండు నొక తన-
కలిలో, జేయుచుండు చిఱు తె-
క్కలిలో, తప్పులేమి గలవో … 11
(తనకలి = చిక్కు; తెక్కలి = దొంగతనము)
కళికలు విరి మొగ్గలు, మఱి యు-
త్కళికలు పెద్ద యలలు, కళికో-
త్కళికలు రగడలను ఛందములు
కళికలు కలికి రతనమ్ములే … 12
కారము వాడి చూపులగు, నా-
కారము శ్వేతచంద్రికగు, సం-
స్కారము మందహాసములు, ప్రా-
కారము ప్రేమ సన్నిధి గదా … 13
కుందము నీనవ్వు, మఱియు నా
కుందము నాకు నిధి, నీదగు చె-
కుందము నా బలము, సరసున ము-
కుందము నీ మోము, నా ప్రియా … 14
(కుందము = మొల్ల, నిధి; చెకుందము = నిపుణత; ముకుందము = ఎఱ్ఱదామర)
కులములు ప్రేమికుల శాప, మా-
కులమును గల్పించు మదిని, వ్యా-
కులమును గల్గించు హృదిని, గో-
కులమున నా కృష్ణు వేదించు … 15
కొంటిని మల్లియల మాల, యను-
కొంటిని నీకె యవి యని, దలచు-
కొంటిని నీ కురుల సొగసు, చే-
కొంటిని నిను జూచు యత్నమును … 16
క్షణముల వేళలో, నీదు వీ-
క్షణముల మాయలో బడి, ప్రతీ-
క్షణములకోసమే నుంటి, కాం-
క్షణముల దీర్చగా రా సఖీ … 17
(ప్రతీక్షణము = ఎదురు చూచుట; కాంక్షణము = కోరిక)
గంగను గాంచ మది పొంగు, మును-
గంగను దేహ మది పొంగు, వెలు-
గంగను దీప మది లేచు, దొర-
గంగను శాంతి మది తోచుగా … 18
(తొరగు = పాఱు)
గడిలో పావయితి నేను, అం-
గడిలో సరుకయితి నేను, ని-
గ్గడిగా మాఱె నా ఱేడు, అ-
గ్గడియై యుంటినే నెందుకో … 19
(నిగ్గడి = కఠినమైన; అగ్గడి = సిగ్గులేనిది)
గణములు త్రివిధములు, నింగి నుడు-
గణము లగణితములు, జ్యోతిరిం-
గణములు రాత్రిలో, మన గృహాం-
గణమున నగె రంగవల్లికలు … 20
(ఉడుంగణము = నక్షత్రముల సమూహము; జ్యోతిరింగణము = మిణుగురుపురుగు)
గతము వెడలి పోయె, పలుకు స్వా-
గతమును భావికిన్, దెలియ మా-
గతమును మనికిలో, మనకు సం-
గతమే ముఖ్యమ్ము బ్రదుకులో … 21
(ఆగతము = రానున్నది; సంగతము = స్నేహము)
గతి నీవేగదా, ప్రీతి కు-
ద్గతి నీవేగదా, గీతి సం-
గతి నీవేగదా, ప్రేమ స-
ద్గతి నీవేగదా, జగతిలో … 22
(ఉద్గతి = పుట్టుక)
గళమున గీతికల నదము, ల-
ర్గళములు లేవింక నికపై, యు-
గళముగ నుండగా రమ్ము, మం-
గళముగ బ్రదుకౌను రమ్యమై … 23
(అర్గళము = అడ్డు; యుగళము = జంట)
గారముతో తల్లి నగుచు బం-
గారము నాకు నీవె యనె, శృం-
గారము నాకు నీవె యనె, నయ-
గారము మీఱగా శిశువుతో … 24
గాలము వేయకే సఖి, కొంటి-
గాలము నేను వల జిక్క, నిం-
గాలము నీవెగద, మన మారు-
గాలము మోదముల నుందమా … 25
(కొంటిగాలము = పోకిరి; ఇంగాలము = ఇంధనము; ఆరుగాలము = ఎల్లప్పుడు)
గిలి యది యెందులకు, చూడు జం-
గిలి యది యందులకు, నేడు గిలి-
గిలి యది యెందులకు, నీదు కౌ-
గిలి యది యందులకు, చాలునా … 26
(గిలి = భయము; జంగిలి = సింహపు గుంపు; గిలిగిలి = గిలిగింత)
గీతము పాడవా, ఒక తేట-
గీతము వ్రాయవా, నీదు సం-
గీతము వింటి, చిక్కితిని సిం-
గీతములో నొక్క చేపగా … 27
(తేటగీతము = తేటగీతి; సింగీతము = వల)
గ్రహమది నీవైన, నిక నుప-
గ్రహమది నేనౌదు, నొక యవ-
గ్రహమది నేనైన, నాకను-
గ్రహమది నీవౌదు నిజముగా … 28
(అవగ్రహము = అడ్డు)
చపలము కన్నులకు భ్రాంతి నిడ
చపలము త్వరితముగ నీదేను
చపలము మదిలోన దాగంగ
చపలగ నను జేరు చంచలా … 29
(చపల = మెఱపు, చేప, నిలుకడ లేని ఆశ, లక్ష్మి)
చలమున మాడెదవ దేల, య-
చ్చలమున నాడెదవ దేల, చం-
చలముగ మాఱెదవ దేల, యం-
చలమున స్వర్సీమ యున్నదో … 30
(అచ్చలము = కోపము; అంచలము = కొంగు)
చారములో నుంటి, నేమి గ్రహ-
చారములో నెఱుగ, నిక నిర్వి-
చారము వీలౌనె, తెలియ దప-
చారము నాదేమొ, చెప్పవా … 31
(చారము = చెఱ)
జలమున గంటి దామరను, క-
జ్జలమున గంటి రాతిరిని, ఖే-
జలమున గంటి నీరవత, ధ్రువ-
జలమున గంటి మన ప్రేమలను … 32
(కజ్జలము = కాటుక; ఖేజలము = మంచు; ధ్రువ జలము = జీవనది)
జాలములో నిన్ను గన, నింద్ర-
జాలములో బడితి, నది యేమి
జాలమో తెలియదే, నేను మా-
ర్జాలము నైతి నీ ప్రక్కలో … 33
(జాలము = కిటికీ, మాయ, కపటము; మార్జాలము = పిల్లి)
జితములు మానసమ్ము, లపరా-
జితములు మన యాశయములు, భ్రా-
జితములు మార్గములు, మధుర కూ-
జితములు మన గీతికలు గదా … 34
(జితము = స్థిరము; అపరాజియ్తము = జయింపబడనిది; భ్రాజితము = ప్రకాశించునది; కూజితము = కలనాదము)
జీవము నీవెగా, ప్రేమ రా-
జీవము నీవెగా, మనికి కా-
జీవము నీవెగా, రుజకు సం-
జీవము నీవెగా ధర సదా … 35
(రాజీవము = కమలము; ఆజీవము = ప్రాణము; సంజీవము = ప్రాణము నొసగునది)
తమ్ములు సరసిలో విచ్చు, వా-
తమ్ములు తావితో వీచు, చూ-
తమ్ములు పికములన్ బాడు, చే-
తమ్ములు యామనిన్ బూయుగా … 36
(తమ్మి = తామర; వాతము = గాలి; చూతము = మామిడి; చేతము = మనసు)
తరిగా నింగిలో తేలి చి-
త్తఱిలో కురియనా, ఆ పాల
తరిలో వెన్నగా తేలి బి-
త్తరిపై వ్రాలనా, త్రస్తరిగ … 37
(తరి = మబ్బు, చిలుకుట; చిత్తఱి = వానాకాలము; బిత్తరి = అందమైన స్త్రీ; త్రస్తరి = వేడుక)
తల్లివి యందఱికి, జగమున మ-
తల్లివి, నీవినుప గజ్జియల
తల్లివి, దీవించు యొక పిచ్చి
తల్లివి, ప్రేమింతు దల్లి నిన్ … 38
(మతల్లి = శ్రేష్ఠమైనది; ఇనుప గజ్జియల తల్లి = దారిద్ర్య దేవత)
తాపము లెన్నియో, యిటుల పరి-
తాపము లెన్నియో, మన మన-
స్తాపము కారణమయెను, విరహ
తాపము గాల్చుచుండెను గదా … 39
తెరలను దీయవా త్వరగ, వా-
తెరల నొసంగవా సఖి, తేనె-
తెరలను జూపవా నాకు, క-
త్తెరలను జల్లగా జేయవా … 40
(వాతెర = పెదవి, తేనెతెర = honeycomb, కత్తెర = ఎక్కువ ఉష్ణోగ్రతతో నిండిన కృత్తికా కార్తె)
దమ్ములు డెందమును జిలికె, నా-
దమ్ములు గాలిలో పలికె, మో-
దమ్ములు బ్రదుకులో జెలగె, వే-
దమ్ములు ప్రేమలో వెలిగెనా … 41
(దమ్ము = ఊపిరి)
దేశము సుపవిత్రభూమి, ని-
ర్దేశము భక్తితో పూజ, యుప-
దేశము సత్యశోధనలు, ది-
గ్దేశమున, స్వదేశమున సదా … 42
(నిర్దేశము = ఆజ్ఞ; దిగ్దేశము = పరదేశము)
దేహములోనుండు వేఱొక వి-
దేహము, పేరేమొ నెఱుగ సం-
దేహము, మనసు తద్ధర్మసం-
దేహములను దీర్చు నిక్కమై … 43
(విదేహము = అశరీరము)
ధనములు భూమిపై నీవె, యిం-
ధనములు సృజనలో నీవె, సా-
ధనములు నావి నీవలన, బం-
ధనములు త్రుంచ వీలవదుగా … 44
(ఇంధనము = వంటచెఱకు)
ధరముల జూడుమా, నింగి గం-
ధరముల జూడుమా, నీట గం-
ధరముల జూడుమా, యీ వసుం-
ధరపయి ధరలేని దృశ్యముల్ … 45
(ధరము = కొండ, కంధరము = మేఘము, శంఖము)
ధారల సడి చెవుల బడె ధూమ-
ధారల పరదాల మధ్య, హయ-
ధారల సడి దోచె మది, సోమ-
ధారల జలకాల నాడుదాం … 46
(ధూమధార = పొగమంచు; హయధార = అశ్వగతి; సోమధార = ఆకాశగంగ)
నగుచును వచ్చినావు, నెలక-
న్నగుచును విచ్చినావు, వలపు వె-
న్నగుచును గరిగినావు, జతగ పె-
నగుచును మురిసినావు, తెలుసా … 47
(నెలకన్ను = చంద్రుడు)
నదములు పారంగ, తెల్లని వ-
నదములు తేలంగ, సుందర ని-
నదములు మ్రోగంగ, పలు కోక-
నదములు బూయంగ, సొగసులే … 48
(వనదము = మేఘము; కోకనదము = కెందమ్మి)
నదిగా పారనా, కొంటె చి-
న్నదిగా నాడనా, వలపు గొ-
న్నదిగా పాడనా, నీకె య-
న్నదిగా జూడనా, కూడనా … 49
నయముల దనువు గోరెను, నీ వి-
నయముల మనసు గోరె, జిఱు యభి-
నయముల కనులు గోరె, బలు యా-
నయముల నీయవా ప్రియతమా … 50
(నయము = మృదుత్వము; ఆనయము = తెచ్చుట, పొందుట)
నిధియయి రా మనికిలో, కళా-
నిధియయి రా నింగిలో, పయో-
నిధియయి రా మణులతోడ, ప్రతి-
నిధియయి రా ప్రేమ కీవేళ … 51
(కళానిధి = చంద్రుడు; పయోనిధి = సముద్రము)
నెలలో, చందురుని వెల్ల వె-
న్నెలలో, పౌర్ణమీరాత్రి వ-
న్నెలలో, గోకులములోని క-
న్నెలలో, యెన్నెన్ని కృష్ణులో … 52
పతి యనగా భర్త యగును, వా-
క్పతి యనగా బ్రహ్మ యగును, శ్రీ-
పతి యనగా విష్ణువు, గిరిజా-
పతి యనగా శంకరుడు భువిన్ … 53
పదముల చందములు, రాయంచ
పదముల యందములు, జలరుహా-
స్పదముల కెరటములు, కైవల్య
పదముల కర్థములు నిత్యములు … 54
పర మది నాకేల, సఖి పర-
స్పర మిట మనముండ, కొండ కొ-
ప్పరమున వృక్షాలు, పైన ను-
ప్పరమున మేఘాలు చాలవా … 55
(పరము = మోక్షము; కొప్పరము = శిఖరము; ఉప్పరము = ఆకాశము)
పల్లవి బాడవా, ప్రేమ కను-
పల్లవి బాడవా లలితమై,
పల్లవిని యగు మానస మింక
పల్లవ మగు బ్రదుకు నవ్యమై … 56
(పల్లవిని = పూదీగ)
పాలకు వన్నె దెచ్చు హృది, పా-
పాలకు తావు లేని మది, మురి-
పాలకు మోము జూపు గది, జం-
పాలకు నిద్ర బోవు సుఖమై … 57
ప్రాసము కర్ణసుభగము, శత-
ప్రాసము విషమయము, పదునైన
ప్రాసము హృది జీల్చు, నిక ను-
త్ప్రాసము బాధించు మనసునే … 58
(శతప్రాసము = గన్నేరు, ప్రాసము = ఈటె, ఉత్ప్రాసము = వ్యంగ్యము)
బంధములను ద్రుంచవద్దు, యను-
బంధములను ద్రెంచవద్దు, సం-
బంధములను మఱచిపోకు, ప్రతి-
బంధములను నిలిపి గెలువుమా … 59
బకములు సరసులో తపసు, శా-
బకములు తొట్లలో నిద్దుర, స్త-
బకములు తీగలో నాట, యం-
బకములు ముఖములో మాటలా … 60
(శాబకము = శిశువు; స్తబకము = పూల గుత్తి; అంబకము = కన్ను)
బొమ్మను నేను వానికి, కీలు-
బొమ్మను నేను వానికి, గడ్డి-
బొమ్మను నేను, నన్నపరంజి
బొమ్మను జేయడెందుకు బొమ్మ … 61
(బొమ్మ = బ్రహ్మ)
భవములు రెంటిలో, మధుర సం-
భవముల పంటలో, మఱి పున-
ర్భవములు భావిలో, క్రొత్త యను-
భవముల తావిలో హాయియే … 62
(పునర్భవము = సంసారము)
భూతిగదా నీవు, నాకిల వి-
భూతిగదా నీవు, దివ్యాను-
భూతిగదా నీవు, మనసు కా-
భూతిగదా నీవు నా ప్రభూ … 63
(భూతి, విభూతి = ఐశ్వర్యము; అనుభూతి = అనుభవము; ఆభూతి = బలము)
మతములు మనకేల, మనికి సత-
మతములు బడనేల, ప్రేమ యను-
మతములు జాలవా, ప్రణయాభి-
మతములు దీరవా మీఱవా … 64
(సతమతము = ప్రయాస; అనుమతము = అంగీకారము, అభిమతము = కోరిక)
మతిలో నేమేమి తలపు, స-
మ్మతిలో నెంతెంత వలపు, బహు-
మతిలో మోదముల చెలిమి, శ్రీ-
మతిలో నాదముల కలిమియే … 65
మత్తులొ, ప్రేమభాషణల గ-
మత్తులొ, యామినీ చంద్రుని ద్యు-
మత్తులొ, వలపు కౌగిళ్ళ కీ-
మత్తులొ, చిత్తజా చెప్పవా … 66
(ద్యుమత్తు = కాంతి; కీమత్తు = వెల)
మనమిది మందిరము, నీ యాగ-
మన మతి సుందరము, నీతో గ-
మన మతి సంతసము, నీవుపశ-
మనముగ మందిరము నుందువా … 67
మానము మనకొక్క రక్ష, యను-
మానము మనకొక్క శిక్ష, స-
న్మానము నీవిడు ప్రశంస, బహు-
మానము చిఱునవ్వు కుప్పలే … 68
మించగ కోరికల నదులు, యెల-
మించగ భావముల దాటు, కుసు-
మించగ సోయగపు విరులు, మిసి-
మించగ నెనరు, ధర స్వర్గమే …69
(ఎలమించు = ఉత్సహించు)
మితములు లేనిదిగ మన ప్రేమ
స్మితములు తమ్మి పూలవలె కుసు-
మితములు, యీడేరు నింక కా-
మితములు విస్మితమ్ముగ బ్రియా … 70
మోదము డెందముల నిండె ప్రథ-
మోదము చిన్కులై రాల, యా-
మోదము నివ్వగా నింగి, యను-
మోదముతో విప్పె శిఖి పురుల్ … 71
(ప్రథమోదము = తొలకరి; ఆమోదము = అంగీకారము; అనుమోదము = సంతోషము)
మోహములో బడితి, నాకు ది-
ఙ్మోహము కల్గెనే, యిదొక వ్యా-
మోహము, మోహనాస్త్రముల స్మర-
మోహము హెచ్చెనే వెచ్చగా … 72
(దిఙ్మోహము = దిక్కులు తెలియని పరిస్థితి)
యోగము నీదు దర్శనము, దు-
ర్యోగము నీ వియోగము, నీ ని-
యోగము లుద్యోగములగు, సం-
యోగము నాదు సౌభాగ్యమౌ … 73
(నియోగము = ఆజ్ఞ)
రంగని దలవంగ, రసన లూ-
రంగను, వలపుతో దనువు కో-
రంగను, పరుగుతో వాని జే-
రంగను నే దురంగ మయితిన్ … 74
రంగము నాటకపు మేడ, సా-
రంగము వృక్షముల నీడ, ష-
డ్రంగముపైన నిర్వురము, చద-
రంగమును విరించి యాడునో … 75
(సారంగము = ఏనుగు, జింక; షడ్రంగము = డెల్టా)
రంగముపై పాడ, యాశా త-
రంగముపై యాడ, స్వర్ణ సా-
రంగమువలె నెగయ, నా యంత-
రంగము రంగులన్ నిండెగా … 76
రకములు ప్రేమలో నెన్ని, కా-
రకములు ప్రేమ కింకెన్ని, కో-
రకములు ప్రేమ కింకెన్ని, ప్రే-
రకములు ప్రేమ కింకెన్నియో … 77
రజముల దెచ్చె పవనములు, నీ-
రజముల కళ్ళదాన, మఱి యా-
రజముల దాచకుము, కజ్జల శి-
రజముల దాన, స్రజముల గొమ్ము … 78
(రజము = పుప్పొడి; ఆరజము = ఇంపు; శిరజము = వెండ్రుక; స్రజము = పూలదండ)
రణములు ప్రేమలో సబబె, కా-
రణములు లెక్కించ నగునె, ప్రే-
రణములు గల్గ సరసి గల వా-
రణములు గర్జించకుండునే … 79
రతియా, విద్యలను నేర్పు భా-
రతియా, మనసులో గల్గు యభి-
రతియా, మంగళమ్మునకు హా-
రతియా, ప్రేమ కొక్క ప్రతియా … 80
(అభిరతి = ప్రీతి)
రమ్మనె నేత్రములు నన్ను, గో-
రమ్మనె నాశలకు తెన్ను, నే-
రమ్మనె నిస్పృహ నిరాశ, జే-
రమ్మనె నింగిలో తారనే … 81
రవములు పికములకు హెచ్చు, కా-
రవములు కాక యన వచ్చు, కల-
రవములు నీకు ఘన తిచ్చు, కై-
రవములు శశి జూచి విచ్చుగా … 82
(కారవము = కాకి; కాక = బాధ; కైరవము = కలువ)
రసముల పుట్టయే యునికి, ష-
డ్రసముల తట్టయే మనికి, నవ
రసముల బుట్టయే నటన, కా-
రసముల కట్టయే ఘటనలా … 83
(కారసము = బాధ)
రాగము కంఠమం దుండ, యను-
రాగము డెందమం దుండగ, ప-
రాగము పవనమం దుండగ, వి-
రాగము లేలకో యోగినీ … 84
రాళ్ళను గంటి నట, మంచి యుం-
డ్రాళ్ళను దింటి నిట, నా మనుమ-
రాళ్ళను ముద్దాడితిని, నాల్గు
రాళ్ళను నే గడించితి నిందు … 85
రూపము లెన్నియో నీవి, యపు-
రూపము బహురూపములు, జాత-
రూపముకన్న మిన్నయె, విశ్వ-
రూపము జూపు, నా కిప్పుడే … 86
(జాతరూపము = బంగారము)
లేఖల వ్రాసినాము, యనంగ-
లేఖల పంచుకొన్నాము, శుభ-
లేఖల వారు పంపిరి, చంద్ర-
లేఖల మధురజని జూచితిమి … 87
(అనంగలేఖ = ప్రేమపత్రము; చంద్రలేఖ = చంద్రకళ)
వచనము కవిత, నిన్గనుచు ని-
ర్వచనుడనైతి నేన్, ప్రేమకు ప్ర-
వచనము జెప్పనా, ప్రేమ ని-
ర్వచనము జెప్పనా, ప్రియతమా … 88
వనమున సాంద్ర తరులతలు, సుక-
వనమున సాంద్ర భావములు, యౌ-
వనమున సాంద్ర కామనలు, జీ-
వనమున నీతోడ స్వప్నములు … 89
వనిలో కోమలత విరులు, జ-
వ్వనిలో కామలత మరులు, పా-
వనిలో భక్తిలత సిరులు, సుర-
వనిలో కల్పలత హరువులే … 90
(పావని = హనుమంతుడు)
వమ్ములు మౌన గీతికలు, భా-
వమ్ములు గళములో మధుర రా-
వమ్ములు గావలెను, రెండు జీ-
వమ్ములు ప్రేమతో పొంగగా … 91
వల్లిని గాంచితిన్, చిఱు దీప-
వల్లిని వెల్గించితిన్, రంగ-
వల్లిని మెచ్చితిన్, ఫణిరాజ-
వల్లిని గోరితిన్ వేగ రా … 92
(దీపవల్లి = వత్తి; ఫణిరాజవల్లి = తములపాకు)
వాదన లేలనో, యిది రసా-
స్వాదన వేళ, సుమధుర వేణు
వాదన వేళ, యొండొరుల కభి-
వాదన వేళ, కేళీవేళ … 93
వారము వారములు గడిచె, కూ-
వారమువోలె యెద యెగసె, కై-
వారము పెదవిపై కదిలె, నె-
వ్వారము మేము నిను గాంచగా … 94
(కూవారము = సముద్రము; కైవారము = స్తుతి)
వాసము నీ మనసులోన, ను-
చ్ఛ్వాసము నీ తలంపులగు, ని-
శ్వాసము నీదు నామమగు, నా-
శ్వాసము వ్రాయుచుంటి కవినై … 95
వించగరాని కన్బొమలు, త్ర-
వ్వించగరాని యోచనలు, చది-
వించగరాని కథ పుటలు, భా-
వించగరాని జీవితములా … 96
విచ్చెను పూలు వనిలో, గొంతు
విచ్చెను కోకిలలు తరుల, పురి
విచ్చెను నీలకంఠములు, సెల-
విచ్చెను మన్మథుడు, జాగేల … 97
విరులు చిఱునగవుల చిందు, సీ-
విరులు జడలిడు కన్విందు, లా-
విరులు కనుల నీటి సెగలు, కా-
విరులు విరహమందు రాత్రులా … 98
(సీవిరి = వింజామరము; కావిరి = నలుపు)
వేశము లేలకో, నీదు యా-
వేశము లేలకో, నీ కభిని-
వేశము లేదె నాపై, నీ ని-
వేశము జేరుట యెప్పుడో … 99
(వేశము = వేషము; అభినివేశము = కోరిక; నివేశము = ఇల్లు)
శీర్షము పద్యమగు, త్రిభుజిలో
శీర్షము లుచ్ఛబిందువులు, గో-
శీర్షము చందన, మ్మిక మార్గ-
శీర్షము మాధవుని మంచి నెల … 100
సంగము నీకు నాకెపుడొ, యా-
సంగము లెక్కువాయె, చిలిపి ప్ర-
సంగము లింక జాలు, మన యు-
త్సంగపు టుత్సవము వచ్చుగా … 101
(సంగము = కలయిక; ఆసంగము = కోరిక; ఉత్సంగము = కౌగిలి)
సములు గదా మనము, చిలిపి వే-
సములు మరెందుకో, వలపు దో-
సములు వలదు, మోహనార్ద్ర రా-
సములు సదా ప్రేమ బాసలే … 102
సరములు ప్రేమపూజకుల కవ-
సరములు, పొన్నలు పొగడలు కే-
సరములు రమ్యమౌ రుచిర వా-
సరములు ప్రేమామృతమయమే … 103
సరసను రమ్ము వేగ, నిజ మ-
ప్సరసవు నీవు నా మదిలో, ర-
సరసలు చాలు నిక, మధురమై
సరసము లాడవా రసధునీ … 104
(రసరస = గొడవ)
సవమా ప్రేమసంగమము, ఉ-
త్సవమా మన్మథరజనులు, ఆ-
సవమా బింబాధరమ్ములు, ప్ర-
సవమా ప్రణయలతికాంతములు … 105
(ఆసవము = పూదేనియ, ప్రసవము = పూవు)
సారము బ్రదుకులో నీవు, త్వచి-
సారము వేణువై పాడు, ఘన-
సారము తావితో నిండు, సం-
సారము నీతోడ భూమిపై … 106
(త్వచిసారము = వెదురు; ఘనసారము = కర్పూరము)
హారము గీతికలు, ప్రేమ కా-
హారము నర్మ భాషణలు, క-
ల్హారము లలి పరిమళింపు, లుప-
హారము తేనియల ముద్దులే … 107
(కల్హారము = కలువ)
హారము మేఘమాలికలు, నీ-
హారము మంచి ముత్యములు, అభి-
హారము చిత్త భావములు, సం-
హారము ఋతుయౌవనముగదా … 108
(నీహారము = మంచు; అభిహారము = దొంగతనము)
హాసము లాఱు నీలోన, పరి-
హాసము మన భాష, వల దట్ట-
హాసము మన మధ్య, గొప్ప యితి-
హాసము మన ప్రేమ వసుధపై … 109
మోహన రాగమ్ము బాడనా
మోహన విద్య నిక నేర్పనా
మోహన బాణమ్ము వేయనా
మోహనకముగ నిల మార్చనా … 110
(మోహనకము = చైత్రము)