ప్రాసక్రీడాశతకము

దమ్ములు డెందమును జిలికె, నా-
దమ్ములు గాలిలో పలికె, మో-
దమ్ములు బ్రదుకులో జెలగె, వే-
దమ్ములు ప్రేమలో వెలిగెనా … 41

(దమ్ము = ఊపిరి)

దేశము సుపవిత్రభూమి, ని-
ర్దేశము భక్తితో పూజ, యుప-
దేశము సత్యశోధనలు, ది-
గ్దేశమున, స్వదేశమున సదా … 42

(నిర్దేశము = ఆజ్ఞ; దిగ్దేశము = పరదేశము)

దేహములోనుండు వేఱొక వి-
దేహము, పేరేమొ నెఱుగ సం-
దేహము, మనసు తద్ధర్మసం-
దేహములను దీర్చు నిక్కమై … 43

(విదేహము = అశరీరము)

ధనములు భూమిపై నీవె, యిం-
ధనములు సృజనలో నీవె, సా-
ధనములు నావి నీవలన, బం-
ధనములు త్రుంచ వీలవదుగా … 44

(ఇంధనము = వంటచెఱకు)

ధరముల జూడుమా, నింగి గం-
ధరముల జూడుమా, నీట గం-
ధరముల జూడుమా, యీ వసుం-
ధరపయి ధరలేని దృశ్యముల్ … 45

(ధరము = కొండ, కంధరము = మేఘము, శంఖము)

ధారల సడి చెవుల బడె ధూమ-
ధారల పరదాల మధ్య, హయ-
ధారల సడి దోచె మది, సోమ-
ధారల జలకాల నాడుదాం … 46

(ధూమధార = పొగమంచు; హయధార = అశ్వగతి; సోమధార = ఆకాశగంగ)

నగుచును వచ్చినావు, నెలక-
న్నగుచును విచ్చినావు, వలపు వె-
న్నగుచును గరిగినావు, జతగ పె-
నగుచును మురిసినావు, తెలుసా … 47

(నెలకన్ను = చంద్రుడు)

నదములు పారంగ, తెల్లని వ-
నదములు తేలంగ, సుందర ని-
నదములు మ్రోగంగ, పలు కోక-
నదములు బూయంగ, సొగసులే … 48

(వనదము = మేఘము; కోకనదము = కెందమ్మి)

నదిగా పారనా, కొంటె చి-
న్నదిగా నాడనా, వలపు గొ-
న్నదిగా పాడనా, నీకె య-
న్నదిగా జూడనా, కూడనా … 49

నయముల దనువు గోరెను, నీ వి-
నయముల మనసు గోరె, జిఱు యభి-
నయముల కనులు గోరె, బలు యా-
నయముల నీయవా ప్రియతమా … 50

(నయము = మృదుత్వము; ఆనయము = తెచ్చుట, పొందుట)

నిధియయి రా మనికిలో, కళా-
నిధియయి రా నింగిలో, పయో-
నిధియయి రా మణులతోడ, ప్రతి-
నిధియయి రా ప్రేమ కీవేళ … 51

(కళానిధి = చంద్రుడు; పయోనిధి = సముద్రము)

నెలలో, చందురుని వెల్ల వె-
న్నెలలో, పౌర్ణమీరాత్రి వ-
న్నెలలో, గోకులములోని క-
న్నెలలో, యెన్నెన్ని కృష్ణులో … 52

పతి యనగా భర్త యగును, వా-
క్పతి యనగా బ్రహ్మ యగును, శ్రీ-
పతి యనగా విష్ణువు, గిరిజా-
పతి యనగా శంకరుడు భువిన్ … 53

పదముల చందములు, రాయంచ
పదముల యందములు, జలరుహా-
స్పదముల కెరటములు, కైవల్య
పదముల కర్థములు నిత్యములు … 54