అద్దంలో జిన్నా
యం. ఏ. జిన్నా కోటు తొడుక్కొని అద్దం ముందు నుంచున్నాడు. అద్దంలో జిన్నా కనపడ్డాడు. అద్దంలో జిన్నా చాలా గొప్ప జిన్నాలా కనపడ్డాడు. అద్దంలో నిజానికి ఒక జిన్నా ఒక్కడే కనపడలేదు. జిన్నా వెనకాల ఎంతో మంది మహమ్మదీయులు వరసలు తీరి ‘జిన్నాకీ జై’ అంటు నిలబడ్డారు. అందరిలోనూ ఒక్కొక్క జిన్నా వున్నాడు. ప్రతి మహమ్మదీయుడూ ఒక అద్దం. అద్దంలో జిన్నా, అంటే విశాలమూ, వివిధమూ అయిపోయిన జిన్నా. వెడల్పూ పొడుగూ విస్తరించి మరీ రసాస్యమూ, మరీ ప్రకటితము అయిపోయిన జిన్నా.
జిన్నా గొప్పవాడు. కోటు గుండీలు పెట్టుకుంటున్నాడు. ‘పోర్టికోలో’ కారు ఆగింది. ఆ కారుమీద జిన్నా తన గృహావరణం దాటి వీధిలోకి వెళతాడు. పత్రికా విలేఖరులూ, అనుయూయులూ, భక్తులూ, రాజకీయవేత్తలూ, పోర్టికో స్తంభాన్ని ఆనుకుని నుంచున్నారు. ఆతృతతో, నమ్రతతో నుంచున్నారు. తన్ను దర్శించటానికి వచ్చారు. అవి రంజాన్ రోజులు కాబట్టి! తన్ను దర్శించడంలో మహత్తు వుంది. ఒక జగత్తు వుంది. తాను కోటు గుండీలు పెట్టుకునే సామాన్య ప్రాణి కాడు. తాను వారిలో అవ్యక్తంగా వున్న ఒక ఆశ. తన వ్యక్తతలో వాళ్ళందరూ మడతలు పడిపోయిన ఒక అవ్యక్తత.
తానొక రూపం కాదు. ఒక చిత్రం కాదు. ఒక విచిత్రం కాదు. తానొక పెద్దవయస్సు. తానొక పెద్ద భావం. మనసు కండరాలకన్నా కోటు గుండీలకన్నా పెద్దది. గొప్పది. ఆ మనస్సు తనలో వుంది. ఆ మనస్సు తనలో పెద్ద కాంతిలా వుంది. ఆ మనస్సు పరమాణువులా, ఆ పరమాణువు వుంది. తనచుట్టూ వలయాలు కల్పించుకుంటూ శక్తినీ, కదలికనీ ప్రేరేపిసుంది. ఆ కదలికలో కోటి మనస్సులలో వుండే కోటి పరమాణువుల్ని తాకుతుంది. తన మనస్సు రథికుడు. ఆ మనస్సు సృష్టించిన భావం ఒక రథం. ఆ రథాన్ని తాను నడిపిస్తున్నాడు. మహమ్మదీయులందరూ ఆ రథచక్రాలకి కట్టబడి వున్నారు. ఆ రథం అతివేగంతో నడుస్తుంది. వేగం రథంతో నడవలేదు. పంజాబ్, సింధు, బెలూచిస్తాన్, బెంగాల్, అస్సాం భూములమీద ఆ రథం నడుస్తుంది. ఆ చప్పుడుకి కాబూరు కైబరు కనుమలు ప్రతిధ్వనిస్తాయి. కైలాసం మీద మహేశ్వరుడికి బదులుగా ‘అల్లా’ని తాను ప్రతిష్ఠిస్తాడు. తన రథం వెనక మహమ్మదీయులందరూ వస్తారు. ఎందుకు వస్తారో వారికి తెలియదు. తెలిసికుంటే ఎవరూ ఏవిషయం ఏమీ చేయరు. అజ్ఞానం క్రియకీ కర్మకీ కారణం. జ్ఞానం సమాధికీ విధానానికి కారణం. ఆ అజ్ఞానాన్ని తను భద్రంగా కాపాడుతాడు. ఆ అజ్ఞానాన్ని తను భ్రమలతో, ఆశలతో పోషిస్తాడు.
తన మనస్సు తన భావాన్ని నిజానికి నమ్మలేదు. తనలో వుండే అధికార వాంఛ నిజానికి ఆ భావాన్ని తయారు చేసి ఇతరుల్ని నమ్మమంది. తానే నమ్మినట్టుగా నమ్మించింది. తాను నమ్మినట్టుగా వుండిపోవడం వలన ఒక్కొక్కసారి తాను నమ్మేశాడు. అలా నమ్మకపోతే పదికోట్ల జండాలమీద పదికోట్ల అర్థచంద్రరేఖ లెగరవు. పదికోట్లమంది యొక్క ఇరవైకోట్ల కళ్ళల్లోని భక్తినీ, విశ్వాసాన్నీ తాను చూరగొనలేడు. తనకే కాదు, స్వార్థం అందరికీ వుంటుంది. హిట్లర్, చర్చిల్, నెహ్రూ, గాంధీ – అందరికీ వుంటుందనుకున్నాడు జిన్నా. గాంధీ, నెహ్రూ తనలాగే అద్దంలో చూసుకుంటారు. సంతృప్తి పడతారు. తన స్వార్థం గొప్పది. తన స్వార్థం పవిత్రమైనది. తన స్వార్థం లేనిదే తాను ఏమీ కాడు. తాను ఏమీ కాకపోతే ముస్లిం జగత్తు అంతా ఏమీ కాదు. అర్థం లేనిదై పోతుంది. ఆకృతిలేనిదై పోతుంది. ఆశలేనిదై పోతుంది. అబద్ధమై పోతుంది. ఆవిరైపోతుంది.
జిన్నా కోటు గుండీలు పెట్టుకున్నాడు. పోర్టికోలోకి వచ్చాడు. జనం పాయలుగా విచ్చిపోయారు. జనం మిణుగురుల్లా ముడుచుకుపోయారు. నీటిమీద వేసిన తారాజువ్వలా జిన్నా ముందుకు సాగిపోయాడు. పైన అనంతమైన ఆకాశం వుంది. కింద ఎక్కడికో పరచుకున్న భూమి వుంది.
జిన్నా ఆకాశం అంచుకీ, భూమి చివరికీ వ్యాపించాడు. జిన్నాలో ‘అధికారం’ గాలిలో కలసి చెట్లల్లో పచ్చదనంగా మబ్బులలోని నీలిమలా అయిపోయింది. దూరంగా వేలకొలది మహమ్మదీయులు తన కారు చూసి చేయెత్తి సలాము చేశారు. వాళ్ళ కళ్ళు తనని చూడగానే జిగేలుమని మెరిశాయి. వాళ్ళ కళ్ళు ప్రకాశించాయి. వాళ్ళ కళ్ళు ఎర్రపడ్డాయి. వాళ్ళలోని తన భావం విద్యుత్తుతో చేసిన కొరడాలాగ ఒక చరుపు చరిచింది. వాళ్ళు పరిసరాల్నీ, నీతినీ దేహాన్నీ సర్వాన్నీ మరిచిపోయారు. వాళ్ళు తన ‘భావం’ అయిపోయారు. వాళ్ళు జలపాతం వంటి తన భావంతో మోదబడ్డారు. కల్లు వంటి తన భావంతో నింపబడ్డారు. కత్తులూ కర్రలూ పైకి తీశారు. జిన్నా కారు వీధిమలుపు తిర్గింది. తన వెనక కోటి మనస్సులు మలుపు తిరిగాయి. యావత్తు దేశం యొక్క భవిష్యత్తు మలుపు తిరిగింది.
జిన్నా తన కారు మీద తిరిగి వస్తున్నాడు. రోడ్ల మీద రక్తం కనపడింది. రక్తం పక్కన శవాలు కనపడ్డాయి. గాజుగుడ్ల శవాలు – చేష్ట వికృతీలేని శవాలు కనపడ్డాయి. శవాల పక్క తన ‘భావం’ కనపడింది. జిన్నా ఉలిక్కిపడ్డాడు. జిన్నా తన కోటుగుండీలు సరిచేసుకున్నాడు. ఉలిక్కిపడిన జిన్నాలో రక్తం చల్లబడింది. రక్తం నల్లబడింది. ఎదురుగా రోడ్ల మీద మానవుల రక్తం వుంది. ఎదురుగుఆ రోడ్ల మీద మానవుల రక్తం వుంది. హిందువుల రక్తం వుంది. ముస్లిముల రక్తం వుంది. ఆ రక్తంలో ఎర్రకణాలు చచ్చిపోయాయి. ఆ రక్తంలో రక్తం యొక్క గుణం పోయింది. ఆ రక్తానికీ ఏ జాతీ ఏ నీతీ లేదు. ఏ భేదమూ లేదు. ఆ రక్తం మనిషికన్న గొప్పది. మనసుకన్న గొప్పది. ఆ రక్తం ఒక పెద్ద నిజం. ఆ రక్తం ప్రపంచమంతా మానవులకిందా సింహాలకిందా బల్లులకిందా గొర్రెలకిందా హిందువులకిందా ముస్లిములకిందా అనేక రూపాలు ధరించింది. ఆ రక్తం ఒక పరమ సత్యాన్ని చాటుతోంది. ఆ రక్తం ఒక పెద్ద అమాయకత్వం. ఆ రక్తం ఒక పెద్ద కరుణ. ఆ రక్తం ఒక ఆర్తనాదం. ఆ రక్తం మానవుడు నీరసత్వాన్నీ బుద్బుదత్వాన్నీ తెలుపుతోంది. ఆ రక్తం మానవుడి పవిత్రతనీ, మానవుడి మానవత్వాన్నీ తెలుపుతోంది.
అనేకమంది రక్తం అది. అనేకులు తమకి తెలియకుండానే చచ్చిపోయారు. చచ్చిపోతామనుకోకుండా చచ్చిపోయారు చంపబడ్డారు. పిల్లలూ తల్లులూ వృద్ధులూ. విరిగిన కాళ్ళు, పొడిచిన కళ్ళూ, పేగులూ మాంసమూ – అందరూ ఆరిపోయిన ప్రమిదలలా, ఆడుకుని పారవేసిన మట్టిబొమ్మలులా వున్నారు. అందరూ అరుస్తూ చచ్చిపోయారు. చచ్చిపోయినా అరుపులు వినబడుతున్నాయి. అరుపులు దిక్కుల్ని చీలుస్తున్నాయి. ఆ అరుపులు గుండెల్ని చీలుస్తున్నాయి. ఆ అరుపులు పోలీసులని మాత్రం చీల్చడం లేదు.
జిన్నా కారు మలబారు హిల్సువైపు వెళ్ళసాగింది. కారు వెనకనే అరుపులు వెంబడించాయి. కారును వెంబడిస్తూ రక్తం ప్రవహించింది. కారులో జిన్నా వున్నాడు. జిన్నా చాలా గొప్పవాడు. జిన్నా తన భావాన్ని వెంబడిస్తున్నాడు. డ్రైవరు అతివేగంగా కారు నడుపుతున్నాడు. జిన్నా చేతిలో వార్తాపత్రిక వుంది. వార్తాపత్రికలో ఇలా వుంది:
‘కలకత్తాలో రెండువేల మంది మరణం’
వార్తాపత్రిక కలకత్తా అయిపోయింది. వార్తాపత్రికలో కలకత్తా వీధులూ గల్లీలూ కనపడ్డాయి. పిచ్చిగా మత్తుగా రేగిన జుట్టుతో ఒకరినొకరు ఆ వీధుల్లో పొడుచుకుంటున్నారు. ఒక భావం కోసం పొడుచుకుంటున్నారు. ఒక మాట కోసం పొడుచుకుంటున్నారు. ఒక మాట కోసం మాటలు మాటల్నీ పొడుచుకోవు. ఒక మాట కోసం మనుష్యులు మనుష్యుల్ని పొడుచుకుంటున్నారు. మాటలు చచ్చిపోవు. మనుష్యులు చచ్చిపోతారు. మనిషి మాటని సృష్టించాడు. మాట మనిషిని బంధించింది.
కలకత్తా, లక్నో, అలహాబాద్, అహమ్మదాబాద్, బొంబాయి, పంజాబ్ – ప్రతీ నగరంలో, ప్రతీ వీధిలో గల్లీలో తాను నిల్చున్నట్టు, ఎవరినో పొడిచినట్టు, ఎవరి చేతనో పొడవబడుతున్నట్టు ఊహించుకున్నాడు జిన్నా. అతని క్రాఫు రేగింది. అతని కోటు గుండీలు వదులైయ్యాయి. అతను దోషిలా బాధపడ్డాడు. మనిషిలా జాలిపడ్డాడు. సంఘంలా జలదరించాడు. విశ్వంలా విస్తుపోయాడు. తన భావం కోసం ఇంత ఘోరం జరిగింది. తనని లోకం అంతా చూస్తోంది. ప్రజలందరు ప్రశ్నిస్తున్నారు. చరిత్ర తన కోటు గుండీలు విప్పి తన లోపల పరీక్షిస్తుంది. కొందరు తనని శిక్షించారు. తనని ఖండఖండలుగా చీల్చివేశారు. కొందరు తనని హేళన చేశారు. తన కోటు తనకి తిరగేసి తొడిగారు. కొందరు తనని పొడిచారు. పూలమాలలు వేశారు.
‘అల్లాహో అక్బర్’ అన్నారు.
వరండా ముందు కారు ఆగింది. రాజకీయవేత్తలూ, భక్తులూ, పత్రికా విలేఖరులూ స్తంభాల్ని ఆనుకున్న స్తంభాల్లా వున్నారు. వాళ్ళ కళ్ళలో కంగారు వుంది. చీకాకు వుంది. ప్రశ్న వుంది. “నీ భావం మిమ్మల్ని ఎక్కడకు తీసుకువెళ్ళింది? తీసుకు వెళుతుంది? ఈ రక్తపాతానికీ నీభావానికీ సంబంధం ఏమిటి?అమాయకంగా సుఖంగా వెళ్ళే మా కుటుంబాలలో ఈ హఠాత్ మృత్యువూ భయమూ ఎన్నాళ్ళని భరించం?”
ఆ ప్రశ్న వాళ్ళ కళ్ళలో పెద్ద మౌనంగా వుంది. ఆ మౌనం భయంకరమైన శబ్దంలా వుంది. చచ్చిన జీవుల మౌనం. వాళ్ళ భార్యల చచ్చీ చావని ప్రాణాల మౌనం ఆ వరండాలో పోర్టికోలో పేరుకుంది. ఆ మౌనం ఎలుగుబంటిలా కూర్చుంది. పులిలాగ పంజా చరిచింది.
ఒక భావంతో పదికోట్లమందిని ఒకటిగా చేశాడు. ఒక భావంతో పదికోట్ల మందిని ముప్ఫైకోట్ల జనం నుండి వేరు చేశాడు. అందరూ ఇదే చేస్తారు. రాజకీయవేత్తల పని వేరు చేయడం. ఒక జాతి అంటే తక్కిన మానవ సంఘంతో వేరుపడిన ఒక సమూహం అన్నమాట. ఎంత బాగా వేరు చేస్తే అంత పెద్ద నాయకుడౌతాడు. ఫాసిజం అని ఒక దేశం వేరుపడింది. మరొక ఇజం అని ఇంకో దేశం వేరుపడింది. మతం, నీతి, విజ్ఞానమూ మనిషి మనిషినీ వేరుచేస్తున్నాయి. నక్షత్రాన్నీ నక్షత్రాన్నీ వేరుచేస్తున్నాయి. పువ్వునీ పువ్వురేకుల్నీ వేరు చేస్తున్నాయి. గుండెకీ గుండెకీ మధ్య ఒక అగాధం తను సృష్టించాడు. ఆ అగాధాన్ని తానిప్పుడు దాటలేడు; పూడ్చలేడు. నిజానికి ఆ అగాధంలోనే తానున్నాడు.
జిన్నా అద్దం ముందు నుంచున్నాడు. జిన్నా కోటు గుండీలు విప్పుకుంటున్నాడు. అద్దంలో మరొక జిన్నా కనపడ్డాడు. అద్దంలో జిన్నా ఇదివరకులాగే గొప్పవాడు. చాలా గొప్పవాడు. అద్దంలో జిన్నా అందరిలోనూజిన్నా! కోటు విప్పుకుని చొక్కా విప్పుకున్నాడు. జిన్నా ఉలిక్కిపడ్డాడు. అద్దంలో జిన్నా గుండె మీద రక్తపు మరక కనపడింది.
“ఆయా” అని పిలిచాడు.
“నా గుండె మీద ఈ రక్తం ఏమిటి” అన్నాడు.
“నాకు ఏం కనపడటం లేదు” అంది ఆయా.
కానీ రక్తపు మరక ఉంది. అక్కడ ఆ గుండె మీద ఆయాకి కనపడలేదు – తనకి కనపడింది. అది ఒక నిజం! అది ఒక చాలెంజి! ఆ రక్తపు మరక ఇలా అంది, ” నీ భావం అబద్ధం, నీ భావం అనవసరం”. తనే నిజం అంది. భావం కన్నా, మనుష్యుల కన్నా, ప్రభుత్వాలకన్నా సిద్ధాంతాలకన్నా తనే నిజం అంది. తనకోసమే ఇవన్నీ అంది. ఆ రక్తపు మరకను చూశాడు. తిరిగి జిన్నా కళ్ళు మూసుకున్నాడు.
అతని మనస్సుకి అతని మనస్సు కనపడింది. ఆ మనస్సులో ఒక పెద్ద విద్యుత్తు వుంది. అల్లిబిల్లిగా ల్లుకున్న తీగలు వున్నాయి. చక్రాలు గిర్రున తిరుగుతున్న డైనమో వుంది. మనిషిలో వుండే ‘అహం’ అది. నరుడి పతనానికీ, ఔన్నత్యానికీ, పరిశ్రమకి, పరిణామానికి కారణభూతమైన మూల శక్తి అది. అలెగ్జాండరునీ, గజనీనీ, నాదిర్షానీ, సముద్రాలూ, భూములూ, పర్వతాలూ దాటించిన బలీయ స్వభావం అది. జిన్నా మనసులో వున్న భయంకర పరమాణువుని చూసి ఇలా అన్నాడు.
“నీ భావం నాకు వద్దు. నీభావం అనేకమందిని చంపింది. నీ భావం అబద్ధం. కృత్రిమం. నిజమైనా నాకు వద్దు. నేను అందరితోనూ నిజం చెప్పేస్తాను. నాకు అలసట కలుగుతోంది. ఇంక నాకు శాంతి కావాలి, నాకు మైత్రి కావాలి”
పరమాణువుకు కోపం వచ్చింది. “అహం’ ఎర్రగా ఎదురు తిరిగింది. డైనమో చక్రాలు గిర్రున తిరిగాయి. తీగలు టకటకమని కదిలాయి. మనస్సు అంతా భరింపరాని వేడితో మంటతో నిండిపోయింది. జిన్నా హడలిపోయాడు. తల వంచాడు.
జిన్నా కళ్ళు తెరిచాడు. ఒక అబద్ధాన్ని నిజం అనిచెప్పి నమ్మించవచ్చు. తర్వాత ఆ అబద్ధం అబద్ధమేనర్రోయ్ అని చెప్పినా ఎవరూ నమ్మరు. ఇంక దారిలేదు. నాయకుడెప్పుడూ నాయకుడుగానే వుండాలి. అలా వుండకపోతే నాయకుడినే చంపేస్తారు. సాంఘిక మతపరమైన ఒక మూర్ఖతను తాను పురిగొల్పాడు. ఆ మూర్ఖతకి తానూ తల ఒగ్గాలి చివరికి. నాయకుడు అజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలి. అజ్ఞానం బలమైనది. జ్ఞానం చురుకైనది.
పత్రికా విలేఖరులు కిటికీల దగ్గర మూగి ‘సందేశం” ఇమ్మని ప్రార్థించారు. సంతృప్తి లేని ధీమాతో, అసహజమైన చిరునవ్వుతో జిన్నా ఇలా అన్నాడు: “నా భావం నశించదు. నా భావాన్ని రథంలా పరుగెత్తించండి.”
రథం పరుగెత్తింది. బెలూచిస్థాన్, పంజాబ్, బెంగాల్, అస్సాం భూముల మీద రథం పరుగెత్తింది. జిన్నా అద్దంలో చూసుకున్నాడు. అద్దంలో జిన్నా చాలా గొప్పవాడు. తన వెనకాల పదికోట్లమంది మహమ్మదీయులున్నారు. పదికోట్లమంది మహమ్మదీయుల మనస్సుల్లో తన భావం విద్యుత్తులా మెరిసింది. వానలా కురిసింది. కొండగుహలా ప్రతిధ్వనించింది. తానొక ప్రాణి కాదు. చిత్రం కాదు. విచిత్రం కాదు. ఒక మనస్సు.
“ఆయా” అని పిలిచాడు జిన్నా.
“చిత్తం ప్రభూ” అంది ఆయా”
“ఎవరివి ఈ అరుపులు? ఏమిటి యీ గదిలో నన్ను చుట్టబెట్టుకుంటున్నాయి?” అని అడిగాడు.
ఆయా మాట్లాడ్లేదు.
జిన్నా అద్దంలో తన గుండెని చూశాడు. మళ్ళీ “ఆయా’ అన్నాడు.
“చిత్తం ప్రభూ” అంది ఆయా.
“ఈ రక్తపు మరకను చెరిపెయ్యి” అన్నాడు గుండెను చూపిస్తూ.
“అది చెరగదు ప్రభూ” అంది ఆయా
జిన్నా ఉలిక్కిపడ్డాడు. “చెరగదా?” అని తిరిగి ప్రశ్నించాడు.
తొందరగా కోటు తొడుక్కున్నాడు. కోటు గుండీలు పెట్టుకున్నాడు. అద్దంలో జిన్నా కనపడ్డాడు. అద్దంలో జిన్నా చాలా గొప్పవాడు. చాలా గొప్పవాడికన్నా గొప్పవాడు. జిన్నా వెనక పదికోట్లమంది మహమ్మదీయులు. ఇరవైకోట్ల కళ్ళల్లో……