సన్మానానికి రెండు సీ.వీ.లు

(ఈ రచయితల పాత్రలు కేవలం కల్పితం. ప్రస్తుతం బ్రతికివున్న లేదా కీర్తిశేషులైన ఏ రచయితలనీ ఉద్దేశించి వ్రాసినవి కావు. ఈ కరిక్యులమ్ వీటేలు నిజజీవితంలో ఎవరివైనా పోలివుంటే అది కేవలం కాకతాళీయం మాత్రమేనని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. – అనా.)

మొదటి సీ.వీ.

“ఓ పిల్లా! చక్కదనం కాదు, చదువు ముఖ్యం,” అని అమ్మ ఎప్పుడూ ఎచ్చరిక చేస్తూ ఉండేది. చిన్నప్పుడు, ఈ వాక్యం ఒక వెయ్యిసార్లన్నా విని ఉంటాను. ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడుపడితే అప్పుడూ, అమ్మ ఈ ఎచ్చరిక చేసేది కాదు. అద్దం ముందు నిలబడి, తల దువ్వుకొనేటప్పుడో, పాండ్స్‌ స్నో మొహాన పులుముకొనేటప్పుడో, చీర సింగారించుకొని కుచ్చిళ్ళు సర్దుకొనేటప్పుడో, ఊసుపోక సినిమా పాటలు విందామని రేడియో ముందు కూర్చున్నప్పుడో చురక పెట్టినట్టు, “చదువు ముఖ్యం. చక్కదనం కాదు,” అని వంటింట్లోకి వెళ్ళిపోయేది. నాన్న అమ్మ మాటలకి సై అంటే సై అన్నట్టు అభినయించేవాడు, మీర జాలగలడా నాయానతి మొగుడికి మల్లేనే. ఇది దగ్గిర దగ్గిర నలభై ఏళ్ళ క్రిందటి మాట!

హైస్కూలు రోజుల్లో, కాలేజీ కెళ్ళేటప్పుడు, అమ్మ చెప్పిన మాటలు నన్ను వెంటాడుతూనే వున్నాయి. అమ్మ అంచనాలో నేను అనాకారినని, అమ్మాయిని చూడగానే మోహించి పెళ్ళాడేసే అబ్బాయి రాడని అమ్మ ఉద్దేశం అని నేను దృఢంగా నమ్మాను. యూనివర్సిటీ చదువు మొదలు పెట్టింతర్వాత, ధైర్యం చేసుకొని ఒకసారి అమ్మని అడిగేశాను, “అమ్మా! నేను నిజంగా అనాకారినా?” అని. “అదేం ప్రశ్నే?” అన్నది అమ్మ.

“మరి నువ్వెప్పుడు చదువు ముఖ్యం, చక్కదనం కాదు అనే దానివిగా.”

“అయితే, నా సలహా నీ బుర్రకెక్కనేలేదన్న మాట! నువ్వు అందగత్తెవే! కానీ ఇంత తెలివితక్కువ దానివని నేనెప్పుడూ అనుకోలేదు,” అన్నది అమ్మ.

చాలా కాలంపాటు తెలివిగలవాళ్ళు అందంగా ఉండరని, అందంగా ఉన్న ఆడవాళ్ళు ఖచ్చితంగా తెలితక్కువ దద్దమ్మలనే అభిప్రాయం నాలో నాటుకోపోయింది. చిన్నప్పటినుంచీ తెగ చదివేదాన్ని. లైబ్రరీలో ఉన్న రొమాన్స్ కథలు, నవలలూ చదివేదాన్ని. ఇంగ్లీషు బాగా అర్థం అయ్యేది కాదు. అయినా ఇంగ్లీషులో ఉన్న ప్రేమ కథలంటే గొప్ప సరదాగా ఉండేది. తెలుగులోకి తర్జుమా అయిన శరత్ బాబు నవలలు అన్నీ చదివిపారేసిన కాలేజీ పిల్లని బహుశా నేనే నేమో! అయితే, చదివిందంతా బుర్రకెక్కలేదని ఇప్పుడిప్పుడే తెలుస్తూన్నది. అప్పట్లో, అంటే కాలేజీ రోజుల్లో, యూనివర్సిటీ రోజుల్లో నేను చాలా తెలివిగల దానిననీ, వివేకిననీ గర్వపడేదాన్ని. మిగిలిన ఆడపిల్లలని దగ్గరకు రానిచ్చేదాన్ని కాదు. వాళ్ళంతా పరమ శుంఠలనే భావం బాగా పాతుకపోయింది.

అగ్నిలో ఆజ్యం పోసినట్టు, కాలేజీలో ఉండే రోజుల్లో వరసగా బోలెడు కథలు రాశాను. అప్పట్లో నెలనెలా విజయవాడనుంచి ప్రచురితమయ్యే ఒక పత్రిక నా కథలు రెంటిని అచ్చు వేసింది. దానితో నేను కథకురాలినయి పోయాను. ఇప్పుడు చెప్పుకుంటే సిగ్గు! ఆ రెండుకథలూ శరత్‌ బాబుని, ఇంగ్లీషు రొమాన్సులనీ విపరీతంగా చదవబట్టే రాయగలిగాను. నా కథల్లో హీరో హీరోయిన్లు మాత్రం పేరుకు మాత్రం తెలుగు వాళ్ళు. అంటే తెలుగు మాట్లాడేవాళ్ళు. ప్రవర్తనలో అచ్చంగా శరత్‌ కథల్లో హీరోలు, ఇంగ్లీషు రొమాన్సుల్లో హీరోయిన్లూనూ! ఆ రెండింటినీ కలిపి రంగరించి తెలుగు కథల్లోకి దిగుమతి చేశాను. రెండు కథలూ అచ్చవంగానే మగపిల్లలతో పరిచయం బాగా పెరిగింది. ఆ దెబ్బతో ఆడపిల్లలు మాట్లాడటం పూర్తిగా మానివేసారు. నా కథలు మరికొన్ని ఆ పత్రికలో ప్రచురించాను.

యూనివర్సిటీకి రావడంతో పూర్తిగా మగపిల్లలతోనే పరిచయం. ఆడపిల్లలు నాకు స్నేహితులు కాలేదు. మగపిల్లలతోపాటు రాజకీయాలతో పరిచయం పెరిగింది. అప్పట్లో నాకు తెలిసిన విద్యార్థి రాజకీయ నాయకులంతా వామపక్షీయులే! తెలుగులో మార్కిస్ట్ సాహిత్యం, ముఖ్యంగా తెలుగు నినాద కవిత్వం, చదవడం మొదలుపెట్టాను. వాళ్ళలాగా కవిత్వం రాయడం ప్రారంభించాను. విచ్చలవిడిగా వచన కవిత్వం రాశాను. నేను రాసిన ప్రతి వచన కవితా పీడిత ప్రజల ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయేది. ఆ కవితలన్నీ కమ్యూనిస్టు పత్రికల్లో అచ్చయినాయి. చే గువేరా, బ్రెక్ట్‌, లక్సెంబర్గ్, ఒకళ్ళేవిటి, అందుబాటులో ఉన్న పాశ్చాత్య ‘మార్క్సిస్ట్‌’లందరినీ చదివాను. ఆ రోజుల్లో వీళ్ళు నాకు దేవతల్లా కనిపించేవాళ్ళు. అప్పుడే అనుకరణ కవిత్వం రాయడం కాస్త తగ్గింది.

అనుకోకండా ఒకసారి లైబ్రరీలో కేట్ మిల్లెట్, సిమోన్‌ బొవియే పుస్తకాలు నా కంట పడ్డాయి. వాటి ప్రభావంలో బహుశా ఒక అయిదేళ్ళూ మునిగిపోయాను. ఆరోజుల్లో స్త్రీవాద కవిత్వం రాయటం ఫేషన్‌. బహుశా ఒక పాతిక స్త్రీవాద కవితలు రాసి ఉంటాను. ప్రాచీన సాహిత్యంలో మగ రచయితలు స్త్రీపాత్రలని ఎంత నిర్దాక్షిణ్యంగా చిత్రించారో కళ్ళకు కట్టేట్టు కవితలు రాశాను. పాత సాహిత్యాన్ని హేళన చెయ్యడం మార్క్సిస్ట్‌ మిత్రులకి బాగానే నచ్చింది కానీ, ఆ హేళనతో స్త్రీవాదం కలపడం వాళ్ళకి అంతగా నచ్చినట్టు లేదు. అప్పుడే మార్క్సిస్ట్‌ మిత్రులు మెల్లిమెల్లిగా దూరం అవడం మొదలుపెట్టారు.

ఎం.ఏ. ప్యాసైన మూడేళ్ళ తరువాత అనుకుంటాను. ఉద్యోగం సద్యోగం ఏమీ లేదు, ఒక నవల రాద్దామన్న కోరిక విపరీతంగా పెరిగింది. నా అదృష్టం బాగుండి ఆ ఒక్క పొరపాటూ చెయ్యలేదు. అందుకు కారణం, డాస్టొయెవిస్కీ రాసిన క్రైమ్‌ అండ్ పనిష్మెన్ట్‌. ఆ పుస్తకం కనీసం మూడుసార్లన్నా చదివి ఉంటాను; క్లిష్టతతో సతమతమవుతున్న పాత్రలని డాస్టొయెవిస్కీ ఎంతో అద్భుతంగా చిత్రించాడు. ఆ చిత్రణలో వక్రోక్తి ఉంది; దూషణ, తిరస్కృతి ఉంది; పాఠకుణ్ణి ఆకట్టుకొనే సరసత్వం ఉంది. అంత చక్కగా నేను ఈ జన్మలో రాయలేనని తెలిసిపోయింది. కొంతమంది గొప్ప రచయితల ప్రభావం విచిత్రంగా ఉంటుంది. వాళ్ళ రచనలు నీ చేతకానితనాన్ని ఎత్తి చూపిస్తాయి. నామీద డాస్టొయెవిస్కీ ప్రభావం అటువంటిది.

తరువాత కాఫ్కా, బోర్హెజ్, మార్క్వెజ్‌ లని చదివాను. రాయడం కన్నా చదవడంలో ఉన్న ఆనందం ఏమిటో అప్పుడే తెలియటం మొదలు పెట్టింది. వీళ్ళు ఎంత సున్నితంగా రాయగలరు! అదే మాట పదిమందికీ చెప్పబోయాను. తెలుగు మార్క్సిస్ట్‌ సాహితీకారులు నన్ను రివిజనిస్టు అని నిరసించారు.

గుస్టావ్‌ ఫ్లాబే రాసిన మేడం బోవరి చదవడంతో స్త్రీ వాద సాహిత్యం మీద అసహ్యం వేసింది. అసహ్యం అనడం తప్పేమో! జాలి వేసింది అనడం నిజం. స్త్రీ మానసిక స్థితిని సూటిగా పరితాపంతో వర్ణించడం ఒక్క ఫ్లాబే కే చేతనవును! తమాషా ఏమిటంటే, ఫ్లాబే కి ఒక్క స్త్రీతో కూడా పరిచయం లేదు! సరిగదా, తాను స్త్రీ కూడా కాదు! అతని మేడం బోవరీ చదివింతర్వాత, ఇది పురుష రచన అని, అది స్త్రీ రచన అనీ బేరీజు వెయ్యడం హాస్యాస్పదం. సాహిత్యానికి లింగబేధం ఆపాదించడం హీనమైన పాపం అని నాకు పూర్తిగా అర్థమయింది.

నన్ను స్త్రీ వాద కవయిత్రి అని అనకండి. కథా రచయిత అని అసలే అనకండి.

మంచి పుస్తకాలలో మాటలు నాకు ప్రపంచపు వెలుగు చూపించాయి. అందుకు నన్ను అభినందించి సన్మానించితే నాకు అభ్యంతరం లేదు.

రెండవ సీ.వీ

ఏ మాటకి ఆమాట సూటిగా చెప్పితీరాలి. అది నా మోటో.

మీ అంతర్జాతీయ సంస్థ ఈ సంవత్సరం మీ ఉత్సవాలలో నాకు సన్మానం చేయడానికి నిశ్చయించుకున్నదన్న వార్త నాకు ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. సరిగదా, “అమ్మయ్య! చివరికి!” అనిపించింది. ఇది నిజం. కొన్ని సంవత్సరాలుగా ఎన్నో రకాల స్థానిక సాంస్కృతిక సంస్థలు – ఇటు ఆంధ్రాలోను, అటు అమెరికాలోనూ – నన్ను అభినందిస్తూ రకరకాల ఫలకాలు అందించాయి. దుశ్శాలువలు కప్పాయి.

అయితే ఆ సంస్థలన్నీ ఒక ఎత్తు; మీ సంస్థ మరొక ఎత్తు. మీ సంస్థ మన సంస్థ. నా అభిమాన సంస్థ. మన సంస్థ ప్రారంభించినప్పటినుంచీ పకడ్బందీగా మన వాళ్ళ చేతికిందే ఉన్న ఏకైక అంతర్జాతీయ సంస్థ. మనవాళ్ళని మనం ఆహ్వానించుకొని, మనం సన్మానించుకోవలసిన అవసరం ఉన్నదని పబ్లిగ్గా నమ్మిన సంస్థ మనది. అయినా, మన సంస్థవారు నన్ను సన్మానించడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు వృధాగా కాలయాపన చేశారా అన్న యక్ష ప్రశ్న నన్ను వేధించి బాధించిన మాట వాస్తవం (అప్పటికీ నేను సున్నితంగా సూచిస్తూనే ఉన్నా). మనల్ని మనం కాకపోతే ఎవరు గుర్తిస్తారు? నిజం చెప్పొద్దూ! అంతకన్నా ఎక్కువ బాధ కలిగించింది, నా గురించి నాలుగు ముక్కలు నేనే రాసి పంపించవలసిందని మీ అధ్యక్షులవారి తాఖీదు లాటి విన్నపం. ఇది నిజంగా నా హృదయాన్ని తొలిచివేసి గుండె పోటు తెప్పించిందంటే నమ్మండి.

కారణం: నేను మూడేళ్ళ క్రితం నా ఆత్మకథ అచ్చు వేయించాను. అరవయ్యారు పేజీల బొమ్మలతో, వెరసి ఆరు వందల అరవయ్యారు పేజీల గ్రంధం, నా ఆత్మకథ (వెల యాభై డాలర్లు. విశాలాంధ్ర, నవోదయ లాంటి మంచి పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది). ఆ గ్రంధంలో నా గురించి అన్ని వివరాలు పూసగుచ్చినట్టు తేదీలవారీగా ఇచ్చాను. ఇది ఎలా సాధ్యం? అని మీరు ఆశ్చర్యపోతారేమో! అయ్యా! నేను సుమారు యాభయ్యయిదు సంవత్సరాల డైరీలు దాచిపెట్టుకున్నాను. చిన్నప్పటినుంచీ, డైరీలు రాయటం, దాచిపెట్టటం నా హాబీ.

సరే! మీరు నా ఆత్మకథ (వెల యాభై డాలర్లు. విశాలాంధ్ర, నవోదయ లాంటి మంచి పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది) చదవలేదు కాబట్టి, మీరడిగినట్టుగా నా గురించి ఏవో ఒక ‘నాలుగు మాటలు’ చెప్పుకుంటాను.

మా తాతగారు సంస్కృతం, తెలుగు బాగా చదువుకున్నారు. ప్రతిరోజూ మా ఇంట్లో గీతాపారాయణం చేసేవారు. సాయంత్రం తాతగారు బిగ్గరగా భాగవతం చదివేవారు. నాకు చిన్నప్పుడే, అంటే పదేళ్ళ వయస్సు రాకముందే భగవద్గీత కంఠతా వచ్చింది. భాగవతంలో పద్యాలు, కనీసం మూడు వందల పద్యాలు నాకు కంఠోపాఠం. ఈ విషయమై నేను నా ఆత్మ కథ (వెల యాభై డాలర్లు. విశాలాంధ్ర, నవోదయ లాంటి మంచి పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది) లో వివరంగా సుమారు యాభై పేజీల్లో రాశాను. మా ఇంట్లో కాశీ మజిలీ కథలు వగైరా లాంటి తెలుగు కథల పుస్తకాలు ఉండేవి. అల్లాగే గోరా కుంభార్‌, తులసీదాస్‌ వగైరా లాంటి ఉత్తరదేశ కథల పుస్తకాలు కూడా చాలా ఉండేవి. ఇవి కాకండా, ఎన్నో బొమ్మలతో నీతికథల పుస్తకాలు ఉండేవి. ఈ పుస్తకాలన్నీ నేను చిన్నప్పుడే చదివేశాను, మా అమ్మగారి సాయంతో. మా అమ్మగారు నా చేత ఈ కథలు ఎలాచదివించేవారో నేను నా ఆత్మకథ (వెల యాభై డాలర్లు. విశాలాంధ్ర, నవోదయ లాంటి మంచి పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది) లో వివరించాను.

హైస్కూలు విద్యార్థిగా ఉండే రోజుల్లోనే నేను పత్రికలకి కథలు రాయడం మొదలుపట్టాను. ఆ తరువాత కాలేజీ లోను, యూనివర్సిటీ లోనూ విద్యార్థిగా ఉన్నరోజుల్లో విరివిగా కథలు రాశాను. హైస్కూలు, కాలేజీ రోజుల్లో కథలు రాస్తున్నప్పుడు, ప్రతి కథకీ నీతి ఉండాలనేది నా దృఢనమ్మకం. ఇప్పుడు, ప్రతి కథకీ సాంఘిక దృక్పథం, సందేశం, సామాజిక నేపథ్యం ఉండాలని నా నమ్మిక. నేను మూడువందల ఇరవై కథలు రాశాను. నా ఆత్మకథ (వెల యాభై డాలర్లు. విశాలాంధ్ర, నవోదయ లాంటి మంచి పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది) లో నా కథల జాబితా మొత్తం – ఏ కథ ఎక్కడ ప్రచురించబడిందో, ఏ కథ ఏ సంకలనంలో వెలువడిందో వివరంగా పట్టిక రూపంలో ఇచ్చాను.

గణితశాస్త్రంలో ఎం.ఏ. పట్టా కోసం యూనివర్సిటీలో చేరాను. లెక్కలు కట్టడం వంటపట్టలేదు కాని వేషాలు కట్టడం మీద మోజు పెరిగింది. నాటకాలు వెయ్యడమే కాదు, నాటకాలు రాయడం కూడా మొదలుపెట్టాను. నాటికలు, దృశ్య నాటికలు, శ్రవ్య నాటికలు ఎన్నో రాశాను. నేను రాసిన శ్రవ్యనాటికలు రేడియోలో రావడంతో యూనివర్సిటీలో పాప్యులారిటీ స్టాక్ విపరీతంగా పెరిగింది. లెక్కల్లో స్టాక్‌ సున్నా! చావుతప్పి కన్ను లొట్టపోయిందన్నట్టు అక్కడనుంచి బయట పడ్దాను. అయినా, మా ప్రొఫెసర్‌ గారికి నేనంటే ఎంతో గురి. నన్ను లెక్కల్లో రీసెర్చ్‌ చెయ్యమని మరీ మరీ బలవంతం చేశారు. నేను కాదంటే కాదని, యూనివర్సిటి వదిలి పెట్టి వచ్చేశాను. ఈ ఉదంతం నేను నా ఆత్మకథ (వెల యాభై డాలర్లు. విశాలాంధ్ర, నవోదయ లాంటి మంచి పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది) లో చాలా టూకీగా అరపేజీలో చెప్పాను.

నా కథలు కొన్ని సినిమాల వాళ్ళు కాపీ కొట్టి సినిమాలు తీశారు. ఇది రుజువు చెయ్యడం, అందులోనూ తెలుగు సినిమా పరంగా రుజువు చెయ్యడం బ్రహ్మతరం కూడా కాదు. అప్పట్లో రేడియోలో మనవాళ్ళ ధర్మవాఁ అని, నాకు రేడియోలో పాటలు రాసే ఉద్యోగం వచ్చింది. పాటలు రాయటం బాగా అలవాటు పడ్డ వాడికి, ఎడాపెడా వచన కవిత్వం రాయడం నల్లేరు మీద బండి నడక లాంటిది. రెండు వందల పైచిలుకు పాటలు, కవితలూ రాశాను. నా కవితా ప్రక్రియ మీద, నేను రాసిన పాటల మీద, వచనకవితల మీదా, నా ఆత్మకథ (వెల యాభై డాలర్లు. విశాలాంధ్ర, నవోదయ లాంటి మంచి పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది) లో కూలంకషంగా చర్చించాను.

పత్రికాధిపతులు కొందరు నన్ను బలవంతం పెట్టి నాచేత నవలలు రాయించేరు. మొత్తం ఆరు నవలలు రాశాను. అందులో నాలుగు నవలలు కలిపేసి కొద్ది మార్పులతో రెండు సినిమాలు తీశారు. మిగిలిన రెండు నవలలకీ అంతర్జాతీయ సంస్థలపోటీల్లో బహుమతులు వచ్చాయి. నా నవలలు, వాటి ప్రేరణ గురించి నా ఆత్మకథ (వెల యాభై డాలర్లు. విశాలాంధ్ర, నవోదయ లాంటి మంచి పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది) లో ఉదహరించాను.

నా సాహితీ వ్యాసంగం గురించి ఒక్క మాట చెప్పాలి. నేను రేడియోలో పాటలు రాసే రోజుల్లో ఎందరో మహాకవులు వాళ్ళ రచనలు నాకు చూపించి నా సలహాలు తీసుకునేవారు. ఇది చాలామందికి ఈర్ష్య కలిగించిందని వేరే చెప్పనక్కరలేదు. నా ఆత్మకథ (వెల యాభై డాలర్లు. విశాలాంధ్ర, నవోదయ లాంటి మంచి పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది) లో ఈ విషయం చూచాయగా చెప్పుకున్నాను.

ప్రస్తుతం నేను ఇంగ్లీషులో కవితలు రాస్తున్నాను. త్వరలోనే నా ఇంగ్లీషు కవితల సంకలనం అమెరికాలో పేరుమోసిన ఒక తెలుగు సంస్థ ద్వారా ప్రచురించబడుతుంది.

ఆఖరిగా మరొక్క మాట. నన్ను సాహితీ సభలకి పిలిచి మాట్లాడమన్నప్పుడు, సభానిర్వాహకులు నాకోసం ఎదురు చూస్తారు. సాధారణంగా నాకు ఒక ఘంటకు పైగానే సమయం ఇస్తారు. ఇది మామూలు. అంతే కాదు. ప్రతిసభ లోనూ, నేను మొదటి ఉపన్యాసం ఇవ్వడం ఆనవాయితీ.

ఇన్నాళ్ళకి నన్ను గుర్తించి సన్మానిస్తున్న మన సంస్థ వెయ్యేళ్ళు ఇలాగే వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నాను.