పదేళ్ళ కిందటిమాట.
తొంభైల్లో ముచ్చటగా మూడు సార్లు ఆ ఊరి మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన మోటూరు సుబ్బయ్య నాయుడు కొత్త శతాబ్దం మొదలు కాగానే అగ్రహారం ఉత్తరాన ఉన్న దక్షిణపువీధి వార్డుకి కౌన్సిలరుగా ఎన్నికయ్యాడు. “భల్లూకపు పట్టంటే సుబ్బయ్యనాయుడిదే,” అన్నారు ఊళ్ళో జనం. సుబ్బయ్య నాయుడికే ఆశ్చర్యం వేసింది; అనుమానం కూడా వచ్చింది. “చూస్తూ ఉండండి, సుబ్బయ్య నాయుడే రికౌంటుకి దరకాస్తు పెడతాడు,” అని ఓడిపోయిన కాంగిరేసు వాళ్ళూ, కమ్యూనిష్టులూ, డిపాజిట్లు పోయిన ఇండిపెండెంట్లూ, ఒకళ్ళేవిటి – అన్ని రంగులవాళ్ళూ వేళాకోళం చేసారు. మూడు గ్రూపులుగా విడిపోయి హోరాహోరీ యుద్ధం చేస్తున్న కౌన్సిల్ మెంబర్లు – ఊరిలో పాత మోతుబరులు, మాజీ చైర్మన్లూ, – అందరూ చైర్మన్ పదవి ఎవరికి కట్టపెట్టాలో ఒక పట్టాన ఒప్పందానికి రాలేక తలకాయలు పగల గొట్టుకునేంత వరకూ వచ్చారు. మళ్ళీ మాజీ చైర్మన్ జోగి పంతులుని గనక చైర్మన్‌గా చేస్తే మునిసిపల్ ఆఫీసుకి అగ్గి పెడతానని ఒక పాత మోతుబరి టౌన్ హాల్లో పేకాడుతూ పబ్లిగ్గా పదిమందితో అన్నాడని వదంతి.
అందుకు కారణం లేకపోలేదు. ఆ ఊళ్ళో మునిసిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రేసు వాళ్ళూ, కమ్యూనిస్టులూ చైర్మన్ పదవికోసం కాట్లాడుకోవడం ఆనవాయితీ. పాతికేళ్ళనించీ, జోగి పంతులు అగ్రహారం వార్డునుంచి కౌన్సిలర్‌గా పోటీ లేకండా ఇండిపెండెంటుగా ఎన్నికయ్యేవాడు. మాణిక్యం కిళ్ళీకొట్టు కెదురుగుండా వంతెన గట్టు మీద కూర్చొని కేప్స్టన్ సిగరెట్లు కాలుస్తూ కూచునేవాడు, వచ్చేపోయే వాళ్ళనందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ! అన్ని గ్రూపులవాళ్ళూ కొట్లాడుకొని చివరికి జోగి పంతులునే చైర్మన్ చేసేవాళ్ళు. అయితే, ఈ సారి మటుకు మునిసిపల్ ఎన్నికల్లో ఒక షావుకారుగారిని ఊళ్ళో కూరగాయల వర్తకసంఘం వాళ్ళు పుల్లలు పెట్టి ఎక్కించి జోగి పంతులుకి ఎదురుగా ఇండిపెండెంటుగా పోటీ చేయించారు. జోగి పంతులు నెగ్గడమైతే నెగ్గాడు గానీ, బతుకుజీవుడా అన్నట్టు పాతిక వోట్ల మెజారిటితో నెగ్గాడు. అది ఆశ్చర్యమే మరి! “అగ్రహారం వోటర్లందరూ మనవాళ్ళే అనుకున్నాం సార్! ఈ మధ్యకాలంలో మనవాళ్ళే అనుకున్న వాళ్ళు కూడా తెలివి మీరి పోతున్నారు పంతులుగారూ” అని జోగిపంతుల్ని ఆయన అనూయాయులంతా సముదాయించారట!
చైర్మన్ పదవి గురించి కీచులాటలు మొదలై నెల దాటింది. ఈ గొడవలు ఇలా సాగుతూ పోతే, చివరకి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలని నిర్ణయించవచ్చు. ఇండిపెండెంట్లకే కాదు, కాంగ్రేసువాళ్ళకి, కమ్యూనిష్టులకీ ఆ భయం లేకపోలేదు. మళ్ళీ ఎన్నికలంటే, ఇప్పుడు నెగ్గిన వాళ్ళందరికీ బోలెడు డబ్బు ఖర్చు. పైగా, ఖర్చు పెట్టినా తిరిగి ఎన్నికవుతామన్న గ్యారంటీ ఏమిటి? వెంటనే ఎన్నికలొస్తే జోగిపంతులు సీటుకే ముప్పురావచ్చు.
ఈసారి సుబ్బయ్య నాయుడి సుడి తిరిగిందని చెప్పుకోవాలి. ఒంటిపిల్లిలా తటస్థంగా కూర్చున్న సుబ్బయ్య నాయుడుని మునిసిపల్ చైర్మన్‌గా చెయ్యడానికి మొత్తంమీద అన్ని వర్గాలవాళ్ళూ రాజీ పడ్డారు. జోగిపంతులే మధ్యవర్తిత్వం చేసి సుబ్బయ్య నాయుడి పేరు ప్రతిపాదించాడు. పిట్టపోరు, పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టు, అనుకోకండా కౌన్సిలరుగా ఎన్నికయిన మోటూరు సుబ్బయ్య నాయుడు ఉన్నట్టుండి ఆ ఊరికి మునిసిపల్ చైర్మన్ అయ్యాడు.
ఆ ఊరి గురించి మీకు కొంచెం విపులంగా చెప్పాలి.
సుబ్బయ్యనాయుడు దక్షిణపు వీధి నియోజకవర్గం నించి ఎన్నికయ్యాడని చెప్పాను కదూ! దక్షిణపు వీధి అనేది ఒక వీధి కాదు. ఊరిలో అదొక పేట. ఒక సబర్బు. అల్లాగే తూర్పు వీధి, పడమర వీధీ కూడా ఉన్నాయి. అవి కూడా ఆ పెద్దూరికి సబర్బులే. నిజం చెప్పాలంటే సబర్బులు లేకపోతే అసలు ఆ వూరే ఉండదు. మరి ఎందుకనో తెలియదు; ఉత్తరపు వీధే లేదు ఆ ఊళ్ళో!
దక్షిణపు వీధి లోకి మిమ్మల్ని తీసుకోవెళ్ళే మట్టి రోడ్డు జూటుమిల్లు కెదురుగా కాలవ మీద కర్ర వంతెన దాటంగానే మొదలవుతుంది. ఆ మట్టి రోడ్డు మహా అయితే మూడు వందల గజాల పొడవుంటుందేమో, అంతే! సడెన్‌గా ఆ రోడ్డు ఆగి పోతుంది. కారణం ఎదురుగుండా ఉన్న ఏడు గోరీలు. ముందున్న మూడు గోరీలు బహుశా మూడడుగుల ఎత్తు ఉంటాయి. వాటి వెనకాలే ఉన్న మూడు గోరీలు కాస్త పెద్దవి. అన్నింటికన్నా వెనకాల ఉన్న గోరీ ఐదడుగుల పైనే ఉంటుంది. అవేమిటో చెప్పేవరకూ కొత్త వాళ్ళెవ్వరికీ అవి గోరీలు అని తెలియవు. అవి గోరీల్లా కనపడవు. చూడటానికి అచ్చంగా మన పెరట్లలో సున్నంతో కట్టిన తులసి కోటల్లా ఉంటాయి; తులసి మొక్కలే లేవు, అంతే. ఆ గోరీల దగ్గిరే మట్టి రోడ్డు రెండు చీలికలైపోతుంది. ఒక రోడ్డు ఎడమ పక్కకి, మరో రోడ్డు కుడి పక్కకీ. ఈ మధ్యలో ఏడు గోరీలు! ఆ ప్రాంతాన్ని విమానం మీదనుంచి ఫొటో తీసి చూపిస్తే, అచ్చంగా – ఒకప్పుడు హిప్పీలు మెళ్ళో వేసుకునే పీస్ సింబల్ లాగానో బెంజి కారు హుడ్ మీద ఆభరణం లాగానో కనపడుతుంది. ఇంజనీరు డ్రాయింగు గీస్తే సున్నాలో ఇరికించిన ఇంగ్లీషు అక్షరం ‘వై’ లా ఉంటుంది. ఆ మట్టి రోడ్డు చివర ఎడమ పక్కన ఉన్న మండువా లోగిలి సుబ్బయ్య నాయుడి ఇల్లు. సుబ్బయ్య నాయుడి ముత్తాత కట్టిన ఇల్లు. మూడు తరాల మోటూరు వారి చరిత్ర ఉన్న ఇల్లు. ఇప్పుడు మునిసిపల్ చైర్మన్ గారి ఇల్లు. చైర్మన్ గారి ఇంటి దొడ్డిగుమ్మానికి ఎదురుగుండా ఏడు గోరీలు.
చైర్మన్ అయిన వారానికల్లా సుబ్బయ్య నాయుడు ఊరి వీధులన్నింటికీ కొత్త రాటబల్లలు – తెల్లటి అక్షరాలతో ఆకుపచ్చ రాటబల్లలు – కట్టించాలని తీర్మానించాడు. ఊరి జనం శబాష్ అంటే శబాష్ అన్నారు. కౌన్సిల్లో ఎవడు మాత్రం కాదనగలడు?
చైర్మన్‌గారి ప్రణాళికైతే బాగానే ఉన్నది కానీ, పురిట్లోనే సంధి కొట్టిందా అన్నట్ట్లు ఆరంభంలోనే ఇబ్బంది వచ్చి పడింది. ఆ ఊళ్ళో చాలా రోడ్లకి పెట్టిన పేర్లేవీ లేవు, అన్నీ కొండ గుర్తులే తప్ప. ఉదాహరణకి, జనానికి బాగా అలవాటయిపోయిన పెద్ద రోడ్లు – ఆస్పత్రి వీధి, స్టేషను వీధి, చేపల బజారు రోడ్డు, బస్సు స్టాండ్ వీధి, రైస్ మిల్లు వీధి, పవర్ ప్రెస్సు వీధి, క్లబ్బు వీధి, శివాలయం సందు, వగైరా! ఇలాంటి వీధుల పేర్లన్నీ మార్చాలని కొందరు కౌన్సిల్ మెంబర్లు పట్టుబట్టారు. ఈ రోడ్డులన్నింటికీ వాళ్ళకిష్టమైన రాజకీయ నాయకుల పేర్లు పెడదామని సూచించడం మొదలెట్టారు. చేపల బజారు వీధికి ఇందిరా గాంధీ వీధి అని, రైస్ మిల్లు వీధికి లెనిన్ వీధి అనీ, ఆస్పత్రి రోడ్డుని అంబేద్కర్ వీధిగానూ మార్చాలని రకరకాల మార్పులు సూచించడంతో కౌన్సిల్లో కలకలం మొదలయ్యింది. సుబ్బయ్య నాయుడు ఈ విషయంలో మాత్రం చాలా పెద్దమనిషి తరహాగా వ్యవహరించాడు. “మీరు ఏ పేరు పెట్టినా ఊళ్ళో జనం చేపలబజారు వీధిని చేపలబజారు వీధనే అంటారు. పైగా, ఆ వీధిలో ఉన్న ఇళ్ళవాళ్ళు మీరు చెప్పే మార్పుకి ఒప్పుకోకపోవచ్చు కూడాను!” అని నచ్చజెప్పబోయాడు. కానీ ఎవడూ సుబ్బయ్య నాయుడు మాట ఖాతరు చెయ్యలేదు. వాళ్ళ మంకుపట్టు వదల్లేదు. “ఊ! సరే, అట్లాగే కానియ్యండి,” అని పైకి ఒప్పుకొని ‘మీ ఖర్మ’ అని మనసులో అనుకొని సర్దుకున్నాడు.
దక్షిణపు వీధి కెళ్ళే రోడ్డు గురించి చెప్పాను కదూ! ఆ ఊరి జనాభా అంతటికీ, పిల్లాజెల్లా అందరికీ, అది ఏడు గోరీల సందుగా తెలుసు. మీరు తూర్పు వీధికి వెళ్ళాలన్నా, పడమర వీధికి వెళ్ళాలన్నా ఏడు గోరీల సందు మీంచే వెళ్ళాలి. రైలు స్టేషనులో పేసింజరు బండి దిగి “తూర్పు వీధికెళ్ళాలి. నీకు తెలుసా?” అని ఏ రిక్షా వాడినన్నా అడిగి చూడండి. “అదేటి బాబూ! ఏడుగోరీల సందుకి ఎడం పక్క కెళ్ళే రోడ్డే తూరుపీధికి తీసికెళ్తాది! అంతమాత్రం తెల్దా బాబూ!” అని అనకపోతే, ఆ రిక్షా వాడు ఆ ఊరు వాడు కాదన్న మాటే! అసలు విషయం ఏమిటంటే, ప్రతి రిక్షా వాడికీ ఆ ఊళ్ళో ఏడుగోరీల సందు తెలుసు. ఆటో రిక్షాల వాళ్ళయితే ఆగరు కానీ, సైకిల్ రిక్షాల వాళ్ళు మాత్రం ఆ గోరీల దగ్గిరకి రాగానే బండి దిగి నడిపించుకొని పోతారు; తూర్పు వీధి కెళ్ళాలన్నా, పడమర వీధి కెళ్ళాలన్నా!
సుబ్బయ్య నాయుడు చైర్మన్ కాకపోతే ఏడు గోరీల సందు ప్రసక్తే వచ్చేది కాదు. ఏడు గోరీల సందుకి ఏ పేరు పెట్టాలీ అని తర్జన భర్జన మొదలయ్యింది. మూడు తరాల మోటూరు వారు ఆ సందులోనే ఉన్నారు, అందులోనూ సుబ్బయ్య నాయుడు చైర్మన్ అయ్యాడయ్యె! అందుకని ఏడు గోరీల సందు పేరు మోటూరు వారి వీధి అని మారిస్తే బాగుంటుందని కొందరు కౌన్సిల్ మెంబర్లు ప్రతిపాదించారు. మోటూరు వారి వీధి అని పెద్ద ఆకుపచ్చ రాటబల్ల పెట్టాలని తీర్మానించారు. ఈ మార్పిడి సుబ్బయ్య నాయుడికి సుతరామూ ఇష్టం లేదు. “ఊళ్ళో మీరు ఏ వీధి పేరు మార్చుకున్నా నేను అభ్యంతరం పెట్టటల్లేదు. ఏడు గోరీల సందు పేరు ఏడు గోరీల సందుగా ఉంచాలిసిందే. మార్చడానికి నేను చచ్చినా ఒప్పుకోను,” అని పట్టు బట్టాడు. చాలా మంది కౌన్సిల్ మెంబర్లకి ఆశ్చర్యం వేసింది. తన ఇంటి పేరుతో సందు పేరు మారుద్దామనుకున్నా వద్దంటున్నాడేమిటా అని అనుమానం కూడా వచ్చింది.
ఏడు గోరీల గురించి మరి కాస్త పూర్వ కథ చెప్పాలి. ఎన్ని సంవత్సరాల నుంచీ ఆ గోరీలు అక్కడ ఉన్నాయో ఖచ్చితంగా ఎవడికీ తెలియదు. సుబ్బయ్య నాయుడు ముత్తాత ఇల్లు కట్టుకోక పూర్వంనుంచే అక్కడ ఏడు గోరీలు ఉన్నాయని వాదు. ఎందుకంటే అప్పట్లో దక్షిణపు వీధి అనే పేటే లేదు. జనాభా పెరిగింది, దానితోపాటు ఊరు తూర్పుకీ, పడమరకీ పెరిగింది. అటు వెళ్ళటానికి వేసిన రెండు రోడ్డులూ, అంటే తూర్పు వీధికెళ్ళే రోడ్డూ, పడమర వీధికెళ్ళే రోడ్డూ, ఆ గోరీల పక్కనుంచే వేశారు. అంతే కాదు. ఏడు గోరీల సందులో కాపరం ఉన్నవాళ్ళెవరో ఒకళ్ళు పనికట్టుకొని ఆ ఏడు గోరీల చుట్టూ గడ్డి కోయించడం, అడపా తడపా గోరీలకి వెల్ల వేయించడం చేసే వాళ్ళు. అప్పుడప్పుడు ముందు గోరీ ఎదురుగా ఒక ఆముదం దీపం కూడా వెలిగించి పెట్టే వాళ్ళట! విశేషం ఏమిటంటే, ఆ సందులో గాని, ఆ చుట్టుపక్కల గానీ ముసల్మాను ఇల్లు ఒక్కటి కూడా లేదు. అదీ విచిత్రం. ఇదంతా 9/11కి ముందు రోజుల కథ.
ఈ మధ్య కాలంలో ఆ గోరీల బాగోగులు పట్టించుకున్న వాడులేడు. అశ్రద్ధ కాకపోయినా భయం అయి ఉండాలి. గోరీలని ముంచేస్తూ నిలువెత్తున గడ్డి పెరిగి పోయింది. అన్ని గోరీల మీదా ఎండిన వాన చారికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి రెండు గోరీల గోడల పైన బీటలు కూడా పడ్డాయి. చూడటానికి అసహ్యంగా తయారయ్యాయి. చైర్మన్ గారి ఇంటి సందులో, ఆయన ఇంటికి ఎదురుగా పాడు పడ్డ గోరీలు ఏమిటి? దిష్టి పిడతల్లా? అని అక్కడనుంచి ఆ గోరీలు తవ్వి తీసేసి ఉత్తరాన ఏటి పక్కన పెడితే బాగుంటుదని లోపాయికారీగా ప్రచారం చేస్తున్న కౌన్సిల్ మెంబర్లు కూడా లేకపోలేదు. అందుకు బయటనుంచి మార్వాడీల మద్దతు కూడా వస్తున్నదని పుకారు! అలా గోరీలు తవ్వి తీసి మరోచోట కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డు పడుతుందేమోన్న భయం కూడా లేకండా ప్రచారం మొదలయ్యింది.
మోటూరు వారి వీధిగా ఏడు గోరీల సందు పేరు మార్చడానికి సుబ్బయ్య నాయుడు అభ్యంతరం పెట్టడంతో ఊరి జనాభాలో కొందరికి బాగా నచ్చింది. ముఖ్యంగా కుర్రకారుకి! వాళ్ళకి సుబ్బయ్య నాయుడి మీద గౌరవం పెరిగింది. “మా వోటు సుబ్బయ్య నాయుడికే” అని తెల్ల అట్టల మీద తారుతో రాసి, అక్కడక్కడ వీధుల్లో చెట్లకి కట్టారు కూడా! అయితే, వీళ్ళల్లో ఎవరికీ వోటుహక్కు ఉన్నట్టు లేదు. కానీ, ఆ సందు పేరు ఏడు గోరీల సందుగానే ఉంచాలని పట్టుబట్టిన సుబ్బయ్య నాయుడి తరహా పైచదువులు చదువు కున్న కొంతమందికి ఏ మాత్రం నచ్చలేదు. ఏడు గోరీల సందు పేరు తక్షణం మార్చాలని, ఆ పేరు ఉంచడం ఊరికే అప్రతిష్ట అని తెలుగు దిన పత్రికలకి, ఇంగ్లీషు దిన పత్రికలకీ ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిస్థితులని ఉదహరిస్తూ ఉత్తరాలు రాయడం మొదలు పెట్టారు. దాంతో పేరు మార్చాలని మంకుపట్టు పట్టిన కౌన్సిల్ మెంబర్లకి, గోరీలు అక్కడనించి ఎత్తేయాలని ప్రచారం చేస్తున్న జనానికి ఈ ఉత్తరాలు బాగా మద్దతిచ్చాయి. రభస పెద్దదయ్యింది; అగ్నిలో ఆజ్యం పోసినట్టు! అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆ ఊళ్ళో గోరీల అలజడి మొదలైయ్యింది. ఏడు గోరీల గురించి తెలుగు దేశమంతా తెలిసిపోయింది. గోరీలు ఉన్నచోటే ఉంచాలా వద్దా అని రాష్ట్ర వ్యాప్తంగా పత్రికల్లో వాదోపవాదాలు మొదలయ్యాయి. ఏడు గోరీలతో పాటు సుబ్బయ్య నాయుడు పేరు – సుబ్బయ్య నాయుడి బొమ్మతో సహా – సహా పేపర్లలోకి ఎక్కింది. సుబ్బయ్య నాయుడి అభ్యంతరాన్ని సమర్థిస్తూ ఒక ఇంగ్లీషు పత్రిక, సుబ్బయ్యనాయుడిని ఏకేస్తూ ఒక తెలుగు పత్రికా రంగంలోకి దిగటంతో గోరీల గోల జాతీయస్థాయికెక్కింది. కోతిపుండు బ్రహ్మరాక్షసి అయ్యింది.
సుబ్బయ్య నాయుడు ఊళ్ళో ఆడపిల్లల కాలేజిలో హిస్టరీ లెక్చరర్ లక్ష్మన్న గారితో మంతనాలు ప్రారంభించాడు. లక్ష్మన్న గారు ఆలిగర్ విశ్వవిద్యాలయంనుంచి డాక్టరేటు పట్టా సంపాదించాడు. ఈ గోరీలు ఊళ్ళో ఎన్ని సంవత్సరాలనుంచీ ఉన్నాయో పరిశోధన చెయ్యమని లక్ష్మన్న గారిని పురమాయించాడు, సుబ్బయ్య నాయుడు. అప్పటినించీ ప్రతిరోజూ సాయంత్రం, క్లబ్బు కెళ్ళటానికి బదులు లక్ష్మన్నగారు సుబ్బయ్య నాయుడి ఇంటికి రావడం మొదలెట్టారు. ఈ వార్త ఊళ్ళో గుప్పుమంది. పరిశోధన సంగతేమోకాని, సుబ్బయ్య నాయుడు మాత్రం ధైర్యం పుంజుకున్నాడు. “ఏడు గోరీలు ఆ ప్రాంతంలో కొన్ని వందల ఏళ్ళ నుంచీ ఉన్నాయని, కేంద్ర పురావస్తు శాఖవారు గనక పరిశోధిస్తే ఈ గోరీలు బహుశా ఔరంగజేబు కాలంలోనే ఈ ఊరిలో వెలిసి ఉంటాయని రుజువవుతుందనీ, ఇప్పుడు వాటిని కదిలించడం ధర్మం కాదనీ,” పత్రికల్లో రాయించాడు. ముఖ్యంగా ఇంగ్లీషు పత్రికల్లో! అంతటితో ఆగలేదు. “ఆ ఏడు గోరీలని బాగుచేసి, వెల్ల వేసి చుట్టూ శుభ్రం చేసి, అందంగా లింకుల గొలుసు ప్రాకారంగా కట్టడం మునిసిపాలిటీ బాధ్యత. ఏడు గోరీల సందు పేరు మార్చడం తప్పు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం, నైతికంగా అన్యాయం,” అని అని ప్రచారం చెయ్యడం ప్రారంభించాడు. చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్న స్థానిక పత్రికల వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూలిచ్చాడు. కోర్ట్ ప్రకటనలు తప్ప మరింకేమీ అచ్చు వెయ్యని ఒక స్థానిక పత్రికలో వరసగా వ్యాసాలు రాయించాడు.
“ఊరి మధ్య వెలిసిన ఏడు గోరీలు – ఔరంగజేబు కాలం నాటి గోరీలు!” అని రైల్వే స్టేషను లోను, బస్సుస్టాండు లోనూ బల్లలు పెట్టి, పత్రికల్లో వేస్తే మన ఊరికి టూరిజం ముమ్మరంగా పెరుగుతుంది. ఇంతకు ముందు మన ఊరికి ఎవడూ వచ్చేవాడు కాదు; ఇప్పుడు లక్షలకొద్దీ జనం వస్తారు. వ్యాపారం ఎంతగా పెరుగుతుందో ఆలోచించండి,” అని పబ్లిక్ మీటింగుల్లో, స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఉపన్యాసాలు ఇవ్వడంతో, గోరీలు ఎత్తెయ్యమనే ప్రచారానికి మద్దతిచ్చే వ్యాపారస్తుల గొంతుల్లో వెలక్కాయ పడిందనే చెప్పాలి. సుబ్బయ్య నాయుడు తన స్వంత ఖర్చుతో ఆ గోరీల చుట్టూ స్థలం బాగు చేయించడం మొదలెట్టేడు. ‘ఏడుగోరీల సందు’ అని మొట్ట మొదటి రాటబల్ల, ఆకుపచ్చ పెద్ద రాటబల్ల, కూడా తయారు చేయించాడు. ఊరిలో మొట్టమొదటి రాటబల్ల ‘ఏడు గోరీల సందు’ వచ్చే నెల పదిహేనోతారీఖున ప్రారంభోత్సవం చేస్తున్నాం అని ఊళ్ళో దండోరా కూడా వేయించాడు. అల్లా చూస్తూ ఉండగానే, సుబ్బయ్య నాయుడి పేరు అమెరికా దాకా పాకింది. హఠాత్తుగా సబ్బయ్య నాయుడు ఇంటర్నేషనల్ సెలిబ్రిటీ అయ్యాడు.
ఇలా వుండగా ఒక రోజు సాయంత్రం జోగిపంతులు వయసు మళ్ళిన ముగ్గురు మీసాలు లేని గడ్డపు సాయిబ్బులని వెంటపెట్టుకొని సుబ్బయ్య నాయుడి ఇంటికి వచ్చాడు. అసలీ సాయిబ్బులెవళ్ళు? ఎక్కడినించి వచ్చారు? జోగి పంతులుకీ ఈ సాయిబ్బులకీ స్నేహం ఏమిటి? అని లక్ష్మన్నగారు, సుబ్బయ్య నాయుడూ ఆశ్చర్యపోయారు.
“ఇదిగో సుబ్బయ్య నాయుడూ! వీళ్ళు ముగ్గురూ నీతో మాట్లాడతామని మా ఇంటికొచ్చారు. నేను వీళ్ళ కథంతా విన్నా. నువ్వు కూడా వినడం మంచిది,” అని జోగి పంతులు మొదలెట్టాడు.
“నాయుడుగారూ! మీరంటే మాకు శానా గౌరవం ఉన్నాది. మరి ఈ గోరీలు…,” వాళ్ళ మాట పూర్తి కాకముందే సుబ్బయ్యనాయుడు అందుకున్నాడు.
“మీరు తంగెళ్ళపాడు తోళ్ళషాపుల లబ్బీసాయిబ్బులు కాదూ! మీకూ ఈ గోరీలకీ సంబంధం ఏమిటి?” అని నిలదీసి అడిగాడు.
“ఆ గోరీలు మా పూర్వీకులవేనట బాబూ! శానాకాలం కితం తోళ్ళషాపులు మీ పొలిమేరల్లోనే ఉండేవంట. ఇటుపక్క మీ జనాభా పెరిగింది. అప్పుడు మా వోళ్ళకి ఏటికవతల తోళ్ళ షాపులు కట్టుకోడానికి మునిసిపాలిటీ స్థలం ఇస్తే, మావాళ్ళు అక్కడకి పొయ్యేరు. ఇప్పుడు పంతులుగారు పదిమందితో మాటాడి మాకు ఏటి ఎడం పక్కన ఏడు ఎకరాల నేల ఇప్పిస్తావన్నారు. మావోళ్ళ గోరీలు అక్కడికెత్తికెళ్ళిపోతే అందరికీ బాగుంటుంది. గొడవలెందుకు బాబూ!” అని చెప్పారు ముగ్గురూ ముక్తకంఠంతో.
“ఏమిటీ? ఏటి ఎడం పక్కన ఏడెకరాల స్థలం ఎక్కడుంది? అక్కడ రెండు కిరస్తానీ చర్చీలున్నాయి కదూ? మీరు లబ్బీ సాయిబ్బులు. మీరు నిజమైన ముసల్మానులు కారు. మిమ్మల్ని నకిలీ సాయిబ్బులంటారు, మావాళ్ళు. తెలియక అడుగుతున్నాను, చెప్పండి. మీ తంగెళ్ళపాడులో ఎన్ని గోరీలున్నాయి? లబ్బీ సాయిబ్బులకి గోరీలు కట్టడం నేను ఎప్పుడూ వినలేదు. అసలు కట్టిన గోరీలు ఎత్తెయ్యడానికి ఏ ముసల్మానూ ఒప్పుకోడు. మీ నాటకం నాకు బోధపడటల్లేదు. ఇదేదో మోసం, కుమ్మక్కు. ఈ ఏడు గోరీలు కనీసం నాలుగువందల ఏళ్ళనుంచీ ఈ వీధిలోనే, ఇక్కడే ఉన్నాయి. అవి ఇక్కడే ఉండాలి. కదిలించడానికి వీల్లేదు. ఏమండీ లక్ష్మన్న గారూ! అవునంటారా?” అని ఆయన వేపు చూసాడు, సుబ్బయ్య నాయుడు. లక్ష్మన్నగారు కిమ్మనకుండా కుర్చున్నాడు.
జోగిపంతులు, లబ్బీసాయిబ్బులూ వచ్చిన దోవనే వెళ్ళారు.
ఈ కథ విన్న కౌన్సిల్ మోతుబరులకి వళ్ళు మండిపోయింది. సుబ్బయ్య నాయుడు ఏ రాయబారాలకి లొంగేట్టు లేడు. మొండి ఘటం. దండోపాయం ఖాయం. వెంటనే మునిసిపల్ కౌన్సిల్ మెంబర్లందరూ ఎమర్జన్సీ సమావేశం వేసుకున్నారు. సుబ్బయ్య నాయుడి మీద విశ్వాస రాహిత్య తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించారు. సుబ్బయ్య నాయుడిని చైర్మన్ పదవినుంచి దింపేశారు. సుబ్బయ్య నాయుడి మూణ్ణాళ్ళ ముచ్చటా తీరిపోయింది.
అయితే, కౌన్సిల్ వాళ్ళకి కొత్త చైర్మన్‌ని ఎన్నుకోవడానికి రాజీ కుదరలేదు. మామూలేగా! నెల తిరగకండా రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్దార్జీని స్పెషల్ ఆఫీసర్‌గా వేసి కౌన్సిల్ని బర్తరఫ్ చేసింది. ఇప్పటికీ ఆ ఊరికి మునిసిపల్ ఎన్నికలు లేవు; రోడ్లకి కొత్త రాటబల్లలు రానేలేదు. సరిగదా, ఏడు గోరీల చుట్టూ తుమ్మపొదలు మాత్రం విపరీతంగా పెరిగి చిన్న అడివిలా తయారయ్యింది. ఇప్పుడు, ఒక్క గోరీ కూడా పైకి కనిపించదు. కాని, ఇప్పటికీ ప్రతి రిక్షా వాడూ ఏడు గోరీల దగ్గిరకి రాగానే దిగి రిక్షా నడిపించుకొనే పోతాడు, తూరుపు వీధికి, పడమర వీధికీ!