యదభిముఖముగ జెప్పిరో అల్ల దాని
దదభిముఖముగ జూచిన ధర్మ మొప్పు
అపముఖమ్ముగ జూచిన అఖిల దోష
కలితముగ దోచు ధర్మ సంఘాతమెల్ల
– (రామాయణ కల్పవృక్షము, అయోధ్య, పాదూ ఖండము.)
విశ్వనాథని తలచుకోకుండా కోవెలవారి సంస్మరణ సంపూర్ణం కాదు. సంపత్కుమారగారికి విశ్వనాథతో ఉన్న అనుబంధం అల్లాంటిది. విశ్వనాథ విషయంలో కోవెల సంపత్కుమారగారు ఒక విమర్శకుడు కాదు, వ్యాఖ్యాత. విశ్వనాథశారద విరాడ్స్వరూపాన్ని సమగ్రంగా దర్శించి, తన విశ్లేషణా సామర్థ్యంతో, స్పష్టమైన సరళమైన రచనాశైలితో వివిధ వ్యాసాల రూపంలో సహృదయులకి పరిచయం చేశారు సంపత్కుమార. ఇంచుమించుగా ఆ వ్యాసాలన్నిటినీ సమీకరించి, ‘విశ్వనాథ సాహిత్య దర్శనం’ అనే పుస్తకం ప్రచురించారు. ఈ పుస్తకానికి ఆముఖంగా పై పద్యముంటుంది. ఇది సంపత్కుమారగారి విమర్శ దృక్పథాన్ని ప్రతిఫలించడమే కాకుండా, అసలు సహృదయులైన పాఠకులు సాహిత్యాన్ని, అందులోనూ కవిత్వాన్ని, ఎలా చదివి ఆస్వాదించాలో కూడా సూచించే పద్యం. దాని వివరణ సంపత్కుమారగారి మాటల్లోనే:
“కవి ప్రతిపాదిస్తున్న విషయం గూర్చి పాఠకునికి ఉండే అభిప్రాయభేదాలను బట్టి కూడా కావ్యం అర్థమవడం కాకపోవడం ఉంటుంది. ప్రతిపాదింపబడ్డ విషయం పాఠకుడికి అనిష్టమవుతే, అది ఆధారంగా సాగిన రచన సమస్తమూ తదభిముఖంగానే ఉంటుంది. కాబట్టి, మొత్తమూ అనిష్టం అయ్యే ప్రమాదం ఉన్నది. అందుకని ఆ విషయమందు పాఠకుడికి సానుభూతి ఉండటం అవసరం. అప్పుడే కావ్యగతమైన సర్వరచనా శిల్పమూ, రసనిర్వహణా, తద్విషయానికి సంబంధించిన సంప్రదాయానుసరణమూ పాఠకునికి కావ్యానందాన్ని కలుగజేస్తవి.”
కల్పవృక్షంలో విశ్వనాథ ధర్మపరంగా చెప్పిన విషయాన్ని సంపత్కుమార కావ్యానికి చక్కగా అన్వయించారు. ఇది నిజానికి ఏ కవిత్వానికైనా అన్వయించుకో దగిన సూత్రమే. సంపత్కుమార చేసిన విశ్వనాథ సాహిత్య విశ్లేషణ అంతటికీ యీ సూత్రం ఆధారం. అందుకే అది విశ్వనాథని సక్రమంగా అర్థం చేసుకోవడానికి కరదీపిక. ఒక్క విశ్వనాథనే కాదు, ఎవరి కవిత్వాన్ని ఆస్వాదించేందుకైనా అవసరమైన కొన్ని మౌలిక సూత్రాలు సంపత్కుమారగారి వ్యాసాలలో మనకు దొరుకుతాయి. వారు చూపించిన ఆ దారిని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, నా అవగాహన మేరకు పాఠకులకు దాన్ని పరిచయం చేయడానికి ఇక్కడ ప్రయత్నిస్తాను. నిజానికిది సంపత్కుమార గురించిన వ్యాసం కాదు. వారి పేరు చెప్పుకొని, వారి మాటల్లో, విశ్వనాథ సాహిత్యాన్ని మరోమారు, మరికొంత లోతుగా అవగాహన చేసుకొనే ప్రయత్నమే!
ఒక సాహిత్య రచనని, అందులోనూ కవిత్వాన్ని సరిగాను, సమగ్రంగాను అర్థం చేసుకోడం ఎలా? ఇది సాహిత్యాభిమానులైన పాఠకులకి తరచూ తలెత్తే ప్రశ్న. నాకు తెలిసి దీనికి చిటికలో సాధ్యమయ్యే చిట్కాలాంటిదేదీ లేదు. సాహిత్యం సంగీతంలా ఆపాతమధురం కాదు, ఆలోచనామృతం. సాహిత్యమనే పాలసముద్రాన్ని మన మనసనే మంథరంతో మథించగా మథించగా పుట్టే అమృతం. సాహిత్యాన్ని మథించడమంటే? ఒక రచనలో ఉండే అభివ్యక్తి, అంతస్సారం – రెండిటినీ బాగా పరిశీలించి, అవగతం చేసుకొని, వాటి సమన్వయంలోంచి పుట్టే అనుభూతిని హృద్గతం చేసుకోవడమే ఆ మథనం. అంతే కాని Love at first sight అన్న మాదిరి చదవగానే మనసుకి హత్తుకొని గొప్ప అనుభూతిని కలిగించెయ్యాలనుకోవడం అత్యాశే. కొన్ని కొన్ని రచనలు అలా హత్తుకోవచ్చు. కాని అన్నీ అలాగే అవ్వాలనుకోవడం సమంజసం కాదు. గాఢమైన, శాశ్వతమైన అనుభూతి మిగిల్చేవి మాత్రం అలాంటి మథనాన్ని అపేక్షించే రచనలే అని నేననుకుంటాను. విశ్వనాథ సాహిత్యం ఆ కోవకి చెందుతుంది. విశ్వనాథ సాహిత్యంలోని అంతర్బహిస్స్వరూప స్వభావాలని సమగ్రంగా దర్శించినవారు సంపత్కుమార. ఆ అభివ్యక్తి అంతస్సారాల సమన్వయ దర్శనం ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం.
1. అభివ్యక్తి
చెప్పదలుచుకున్న విషయానికీ, వస్తువుకి రచయిత కల్పించే విలక్షణమైన ఆకృతి అభివ్యక్తి. ఇది రసవ్యంజకంగా ఉన్నప్పుడే అది మంచి రచన అవుతుంది. అలా చెయ్యగలగడమే కవి ప్రతిభ. “కవి ప్రతిభలోన నుండు కావ్యగత శతాంశములయందు తొంబదియైన పాళ్ళు” అని విశ్వనాథ అనడంలో ఉద్దేశం అదే. రచనా సంవిధానం, శైలి, భాష మొదలైన అంశాలు రచనకి విలక్షణ రూపాన్ని ఇస్తాయి. విశ్వనాథ రచనాభివ్యక్తిలోని వైవిధ్యాన్ని, వైశిష్ట్యాన్ని పరిశీలించాలంటే దానికి రకరకాల మార్గాలున్నాయి.
1అ. ఆలంకారిక మార్గం
ప్రాచీన కావ్యాల గురించి అభివ్యక్తి పరమైన విచారం మన అలంకారశాస్త్రంలో సర్వేసర్వత్రా కనిపిస్తుంది. విశ్వనాథ కావ్యాలు ప్రధానంగా ఆ సంప్రదాయాన్ని అనుసరించినవే కాబట్టి అలంకారశాస్త్రాధారంగా వారి రచనల్లోని అభివ్యక్తిని విశ్లేషించవచ్చు. అలంకారశాస్త్రంలో సంపత్కుమారగారికి గొప్ప పాండిత్యం ఉన్నది. అది విశ్వనాథ సాహిత్య వివేచనకు ఎంతగానో ఉపయోగపడింది. ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము – తులనాత్మక పరిశీలన’ అన్న వ్యాసంలో దీనికి ఒక మంచి ఉదాహరణ కనిపిస్తుంది. కావ్య నాయకునిగా రాముని పాత్ర వాల్మీకం, తులసీదాస రామాయణం, కల్పవృక్షాలలో ఏ రకంగా ఉన్నదీ; కావ్యంలో ఉండాల్సిన రసౌచిత్యం దృష్ట్యా తులసీదాస రామాయణం కన్నా కల్పవృక్షం ఎలా ఉత్తమమార్గాన్ని అవలంబించిందీ చక్కగా విశ్లేషించి చూపారు.
“వాల్మీకిని రామునిలోని మహాపురుషత్వం, మర్యాదావధిత, పూర్ణ మానవభావం తద్గాథాగానంలో ప్రేరేపించినాయని తెలుస్తుంది. రామాయణారంభంలో నారద వాల్మీకుల సంభాషణ ద్వారా ఇది స్పష్టమవుతున్నది… అందువల్లనే తన రామాయణమందంతటా రాముని ఆ విధంగానే చిత్రించినాడు కాని దేవత్వాన్ని అతనియం దారోపించలేదు. తులసీదాస్ మరొక విధముగా ప్రేరణ పొందినాడు. ఆయనను రామునిలోని పరబ్రహ్మత్వం ఆకర్షించింది. అతనికి రామతత్వముపాస్యమైనది… అందువల్ల అతనికి మహాపురుషుడైన రాముడు గాక పరబ్రహ్మగా రూపొందిన రాముడే ముఖ్యుడయినాడు. పురాణాదులలోకి వెళ్ళేప్పటికి ఈ గాథ, అవతారవాదము ప్రబలి రాముడు ఎల్లాగూ పరబ్రహ్మగా మారిపోయినాడు. ఆయా పురాణాలు ఆధ్యాత్మిక దృష్ట్యా రామాదులను సంకేతములుగా తీసుకొని వేదాంతబోధ చేసినవి. అల్లాంటి వివిధ పురాణాదులను మనోదఘ్నంగా తులసీదాసు అధ్యయనం చేసినాడు. స్వయముగా ఆజన్మతః భక్తుడయిన తులసీదాసు వాటితో ప్రభావితుడయినాడు…
మరి విశ్వనాథ దాకా వస్తే విశ్వనాథ అద్వైతి… ఈయనకూ రాముడు బ్రహ్మస్వరూపమే. ఈయనా భక్తుడే… తాను మహాభక్తుడు కావచ్చును. మరేమయిననూ కావచ్చును. కాని కావ్యరచనా సందర్భంలో వీటన్నిటినీ మించి రసమార్గము ఉన్నది. ఆ రసనిర్వహణ కొరవడినట్లయితే రచన ఉత్తమకావ్యంగా గణ్యం కాకుండాపోతుంది. అందుకనే “ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి రెట్లు గొప్పది, నవకథాదృతిని మించి” అంటాడు విశ్వనాథ. లోచనకర్త కూడా, “రస ఏవ వస్తురాత్మా, వస్త్వలంకారద్వ్హనీతు సర్వధా రసం ప్రతిపర్యవస్యేతే” అని నిక్కచ్చిగా వచిస్తాడు. అందువల్ల తనకు రాముడు పరబ్రహ్మ అయినా, రసౌచిత్యం కొఱకు, కథౌచిత్యం కొఱకు, యథా వాల్మీకంగానే, అంటే రాముడు పూర్ణపురుషుడు గానే రామాయణ రచన సాగవలసి వస్తుంది. అందుకనే విశ్వనాథ ఇక్కడ ఉత్తమ మార్గమును అనుసరించినాడు. రాముని మహామానవునిగా చిత్రిస్తూ తత్కాలీనులలో అతనియందలి పరబ్రహ్మ భావన వ్యక్తం చేయించాడు. దీనివల్ల రసాద్యౌచిత్య భంగ రహితంగా ఉభయథా భవ్యరచన అవుతున్నది.
మరొకటి, రామగాథలో కన్న కృష్ణగాథలో భక్తిరసం నప్పుతుంది. ఎందుకంటే, రాముడు ‘అదివ్యనాయకుడు’. కృష్ణుడు ‘దివ్యాదివ్య నాయకుడు’… అదివ్యనాయకుని యందు దివ్యత్వం ఆరోపించడము వల్ల ఔచిత్యభంగం కలుగుతుంది. వీటన్నిటి దృష్ట్యానే కావచ్చు, అలంకారికులు సర్వసమ్మతంగా ‘భక్తిరసం’ ఒప్పుకోలేదు… రాముడు భగవంతుడే అన్న విషయాన్ని స్వయంగానూ, రామునిద్వారానూ తులసీదాసు చెప్పిస్తాడు. విశ్వనాథ అల్లా కంఠోక్తిగా చెప్పక ఇతరపాత్రల ద్వారా వ్యక్తీకరింపజేస్తాడు. ఈయన రాముని పరబ్రహ్మముగా చిత్రించలేదనడానికి ఉదాహరణ ఒకటి ఉంది. పరబ్రహ్మయందు లోపమని ఏదీ ఉండగూడదు. ఉంటే పూర్ణత్వానికి లోపం వస్తుంది. కాని విశ్వనాథ రామునియందు ‘హాస్యశీల’ మనే ఒక లోపం ఉన్నదని మారీచునిచే రావణునికి చెప్పిస్తాడు. దీనివల్ల రామ పాత్రను మానవునిగానే చిత్రించినట్లవుతుంది… అయితే తత్కాలీనులు, తత్సన్నిధానులచే దివ్యత్వం చెప్పించవచ్చును… అన్య పాత్రలచే రాముని భగవత్తత్వాన్ని స్ఫురింపజెయ్యడంవల్ల, పూర్ణమానవునియందు లోకం భగవద్భావన నెరపడం జరగవచ్చుననే సత్యం నిర్ధారితమవుతున్నది. రామ భగవత్తత్త్వాన్ని ఒప్పుకొనడములో తులసీవిశ్వనాథలు సమార్గులే అయినా, కావ్యగౌరవం దృష్ట్యా విమార్గులయినారు. విశ్వనాథ వాల్మీకి ననుసరించి ఉజ్జ్వలత్వాన్ని సంపాదించాడు.”
కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టు, రసౌచిత్యం చెడకుండా రాముని భగవత్తత్వాన్ని విశ్వనాథ తన కల్పవృక్షంలో ఎలా నిరూపించారో మనకీ విశ్లేషణ ద్వారా చక్కగా బోధపడుతుంది.
1ఆ. శిల్పానుశీలన
అయితే, విశ్వనాథ సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికి అలంకారశాస్త్రం ఒక్కటీ సరిపోదు. దానికి కొన్ని పరిమితులున్నాయి. ఒకటి – అలంకారశాస్త్ర ధ్యేయం చాలావరకూ సాధారణీకరణ. రకరకాల కావ్యాలలోని సాహిత్యాంశాలను పరిశీలించి వాటిలో సమాన లక్షణాలని గుర్తించడం అక్కడ ప్రధానం. ఒక కావ్యాన్ని లోతుగా అర్థం చేసుకోడానికి అంతగా ఉపయోగపడదు. రెండు – ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించినా విశ్వనాథ తన కావ్యనాటకాలలో ఎన్నో కొత్త పోకడలను కూడా పోయారు. వాటిని అర్థం చేసుకొని ఆస్వాదించాలంటే ప్రాచీన అలంకారశాస్త్రం సరిపోదు. దీనికి పరిష్కారమార్గం కూడా విశ్వనాథవారే చూపించారు. విశ్వనాథ సాహిత్య విమర్శలో కూడా కొత్త మార్గాన్ని తొక్కారు. తెలుగు విమర్శలో ‘శిల్పానుశీలనం’ అనే కొత్త విధానాన్ని వారు ప్రచారంలోకి తెచ్చారు. శిల్పాన్ని గురించి విశ్వనాథ అభిప్రాయం ఇది, “కావ్యము శిల్పముతో కూడినది. శిల్పశక్తి తగ్గని యే కావ్యమైనా పరిగ్రాహ్యమే యగును. పాశ్చాత్య మహాకావ్యములు శిల్పభూము లగుటచేతనే యచ్చటి మత సంప్రదాయాది విషయములు మనవి కాకపోయినను వానిని పరిగ్రహించుచున్నాము. రచయితల కా శిల్పబుద్ధి తగ్గనిచో కావ్యము కావ్యమగును. శిల్పము అక్షరము నొద్దనుండి కావ్య మహార్థాంతము అనుస్యూతమైన విషయము.” ఇంతకీ ఈ శిల్పమంటే ఏమిటి? కోవెల వారిచ్చిన వివరణ ఇది:
“కవి తాను గాఢంగా భావించి, అనుశీలించి పొందిన అనుభవవిశేషాన్ని, తద్విశేష స్ఫోరకంగా ప్రయోజనవంతమూ, అధికార్థ సంగ్రహణ శీలమూ అయిన రచన ద్వారా సహృదయునిలో ఆ విశేషానుభవం కలిగే విధంగా అతనితో అనుశీలింపజేసి, తద్ద్వారా అతడిని ఉత్పథాలలో, ఉన్నతమార్గాలలో విహరింప జేయటానికి కవిపరమయిన వ్యాపారవిశేషం కావ్య శిల్పం. ఈ శిల్ప లక్షణం కావ్యగత సర్వాంశాలకూ వర్తిస్తుంది. అందుకనే ప్రత్యంశాన్నీ విడివిడిగా – పద్యశిల్పం, అలంకారశిల్పం, కథనశిల్పం, నిర్మాణశిల్పం – ఇత్యాది శిల్పపదానుసంధానంతో వ్యవహరించటం ప్రచారానికి వచ్చింది. అయితే, ఇవన్నీ శిల్పం యొక్క పరిచ్ఛిన్న రూపాలు. ఈ అన్నింటి సమష్టిలోని ఏకీకృత సౌందర్యమే సమగ్రమయిన కావ్యశిల్పం.”
సంపత్కుమారగారు ఈ శిల్పానుశీలనని విశ్వనాథ కావ్యాల అనుశీలనకే తిరిగి ప్రయోగించడం విశేషం. ఇతరుల కవిత్వంలో శిల్పాన్ని వెతికిన విశ్వనాథ తన కావ్యాలలో ఎంతగా దాన్ని ప్రయోగించి ఉంటారో మనం ఊహించవచ్చు. అంచేత వారి కావ్యానుశీలనంలో శిల్పదృష్టి ఎంతగానో ఉపయోగపడుతుంది. విశ్వనాథ కవిత్వాన్ని విశ్లేషించే ప్రతి వ్యాసంలోనూ సంపత్కుమార ఈ శిల్పదృష్టిని పాటించారు. పద్యశిల్పం నుండి కావ్యశిల్పం వరకూ వారు పైన పేర్కొన్న వివిధ శిల్పాల నిర్వహణని విశ్వనాథ కవిత్వంలో, ముఖ్యంగా ‘సర్వశిల్పభూమి’ అయిన రామాయణ కల్పవృక్షంలో వారు దర్శించి మనకి దర్శింపజేశారు. ‘మనీషి – కావ్యర్షి శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు’ అనే వ్యాసంలో పద్యశిల్పాన్ని, శ్రీమద్రామాయణ కల్పవృక్షము – తులనాత్మక పరిశీలన’ అనే వ్యాసంలో పాత్రనిర్వహణ శిల్పాన్ని, ‘విశ్వనాథ సాహితి: కిన్నెరసాని పాటలు’ అన్న వ్యాసంలో నిర్మాణ శిల్పం, ‘రామాయణ కల్పవృక్షచ్ఛాయలో అగస్త్యుని కథ’ అనే వ్యాసంలో కథన సంభాషణాశిల్పాలు, ‘రామాయణ కల్పవృక్షం – శిల్పావతారిక’ అనే వ్యాసంలో ఈ వివిధ రకాలైన శిల్పరూపాలన్నిటినీ కూడిన సమస్త కావ్యశిల్పము – ఇలా వివిధ వ్యాసాలలో విశ్వనాథ సాహిత్యశిల్ప మార్గాన్ని సమగ్రంగా దర్శింపజేశారు సంపత్కుమార. వీటిలో ఒక్క చిన్న ఉదాహరణ మాత్రం ఇక్కడ ఇస్తాను. శబరి పాత్రచిత్రణ గురించి విశ్లేషిస్తూ సంపత్కుమార ఒక ప్రశ్న వేస్తారు. “అసలు రామాయణం ‘అల్లా జరిగింది కాబట్టి అల్లా వ్రాయబడింది’ అనే దృష్టితోగాక కావ్యదృష్టితో చూస్తే శబరి పాత్రయొక్క అవసరం ఏమిటి కథకు?” అన్నది ప్రశ్న. ఇలాంటి దృష్టి చాలా ఆశ్చర్యకరమైనది, ఆధునికమైనది. ఏ కావ్యాన్ని అనుశీలించేటప్పుడైనా, అది రామాయణమైనా సరే, సహృదయుడైన పాఠకుడు ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాలి. అప్పుడే మనకి కావ్య పరమార్థం చక్కగా బోధపడేది, అని దీని ద్వారా మనకి మార్గం చూపించారు. ఇంతకూ ఆ ప్రశ్నగురించి వారు చేసిన ఆలోచన, ఇచ్చుకున్న సమాధానం ఇది:
“సుగ్రీవుని కలవమని కబంధుడు చెప్పనే చెప్పినాడు కాబట్టి శబరికి ఆ ప్రయోజనమూ లేదు. శబరికి చివరకి ఏ శాపమూ లేదు. వాల్మీకి దీనికి జవాబుదారీ వహించలేదు. ఆయన సమాధానం ఇవ్వపూనుకోలేదు. అది విశ్వనాథ చేసినాడు. సర్వరామాయణ కర్తలలో శబరీపాత్ర ప్రయోజనం సంపూర్ణంగా గ్రహించింది విశ్వనాథ అన్నది నిజమవుతుంది.
శబరీపాత్రకు ప్రయోజనం ఉన్నది. విశ్వనాథ దాన్ని వివరించాడు. రాముడు సీతావియోగ దుఃఖభారంలో ఉన్నాడు. ఆ దుఃఖభారం కొంతయినా ఉపశాంతి పొందవలసిన అవసరం ఎంతయినా ఉన్నది. దుఃఖభార స్థాయి ఏ విధంగా ఎక్కువ కాలముండడము అవాంఛనీయ విషయము. దీనికి ఈ భారోపశమనానికి సీత మాత్రమే సమర్థమయింది. లేక సీతవంటి మరొక జీవి అయినా సమర్థమవుతుంది. శబరి నల్లాంటి సీతా సమాన లక్షణ లక్షిత అయిన జీవిగా విశ్వనాథ కావ్యములో ప్రవేశపెట్టినాడు. రాముని చూచి చూడడము తోనే శబరి ‘అయోధ్యావీథులన్ నిన్ను నావలె కన్గొనగు వారలెందరు?’ అని అంది. ఇల్లాంటి మాట అనడానికి సీతలాంటి స్థాయిలేని వ్యక్తికి సాధ్యం కాదు. దానికి రాముడు కూడా, ‘అచ్చో నినువంటి వారు కలరా?’ అన్న ప్రశ్న రూప సమాధానం చెబుతాడు. ఆ మాట, దాని కిల్లాంటి సమంజసమైన సమాధానము సీతారాములయందే జరగవీలున్నది. ఆపైన వారిద్దరి సంభాషణ, శబరి ఆత్మీయత, స్తుతి ఇవన్నీ నిర్భరదివ్యార్థములయి ఉన్నవి.
మధుర భక్త్యాత్మక అయిన శబరి తత్సందర్భంలో కల్పిత అయి అతనికి ఉపశమనం కలిగించకుంటే ముందు జరుగబోయే పనిలో స్థైర్యము కలుగడం దుర్లభ విషయం. సీత తనయందు నెరపిన భావమే శబరి నెరపినట్లు రాముడు భావించినాడు కాబట్టే అతనికి ఉపశాంతి కలిగింది. ఈ విషయాన్నే సుందరకాండ చివరి ఖండంలో లక్ష్మణునితో ‘దళముగ గుండె వ్యాజరహితంబగు ప్రేమను గోరుచుండు, నిశ్చలమతి సీతయున్ శ్రమణి సాగెద రాగతి…’ అంటాడు. ఇంకా ‘- మదవతీ మద్విప్రయోగ వ్యధాభారమెల్లన్ శ్రమణీ సమాగమముచే బాధాపనోదంబుగా బరగెన్’ అని కంఠోక్తిగా అంటాడు. ఇతరులది సవ్యాజప్రేమ. సీతది శబరిది అవ్యాజప్రేమ. అనగా అచ్చమైన దన్నమాట. రాముడా అచ్చమైనదానినే వాంఛిస్తాడు. అదే అతనికి ప్రీతికరం. ఇది శబరీపాత్ర ప్రయోజనం.”
అదీ విశ్వనాథ సృష్టి, ఇదీ సంపత్కుమారగారి దృష్టి!
అయితే, శిల్ప విషయమై కొన్ని ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. శిల్పానికి నేరుగా రసాన్ని వ్యంజింపచేసే శక్తి ఉందా? శిల్పాన్ని గురించి తెలిసి చదివిన పాఠకులకే అందులోని విశేషానుభవం స్ఫురిస్తుందా, లేక తెలియకపోయినా అప్రయత్నంగా ఆ అనుభవం కలుగుతుందా? అన్న ప్రశ్నలు. మచ్చుకి పద్యాలలో సమాసాల విషయమై సంపత్కుమారగారిచ్చిన ఒక ఉదాహరణ చూద్దాం:
“అరణ్యకాండ జటాయుః ఖండంలో రావణుడు సీతతో మాట్లాడుతూ తన గొప్పదనాన్ని చెప్పుకుంటూ,
ఓహో మూడవవాని జూపుము సమస్తోర్వీభరంబున్ ఫణా
వ్యూహంబందు నటో యిటో యొరుగగా నూనంగనైనట్టి శే
షాహిం దక్కగ, వింశతి ప్రభుభుజాహంకార సంభార రే
ఖా హేలాధృత శైవపర్వత భుజా స్కంధున్ ననున్ దక్కగన్అన్న పద్యం. ఇందులో దాదాపు ఉత్తరార్ధమంతా దీర్ఘసమాసంగా కఠినబంధంగా ఉంది. పూర్వార్ధంలో శైథిల్యం ఉంది. ఆ శిథిలబంధం, శేషాహి భారాన్ని వహించడంలోని అగచాట్లనూ, కఠినబంధం, సమాసంలోని దీర్ఘత్వం తాను కైలాసపర్వతాన్ని ఎత్తడంలోని శక్తీనీ హేలనూ సూచిస్తున్నవి.”
ఇక్కడ రెండో సగంలో కఠినబంధమూ (దీర్ఘ సమాసం), మొదటి సగంలో శిథిలబంధమూ (విడివిడి పొడి మాటలు) ఉన్నాయని తెలుసున్న మీదట సంపత్కుమారగారు వివరించిన విశేష భావస్ఫూర్తి కలుగుతుందా, అలా తెలియకుండా అప్రయత్నంగా పద్యం చదివినంతనే ఆ విషయం ధ్వనిస్తుందా? ఇది కొంచెం తికమక పెట్టే విషయం. అప్రయత్నంగానే ధ్వనించాలని అనుకొనే అవకాశం ఉంది. చేరా అలాగే అనుకున్నట్టున్నారు. ‘అక్షర రమ్యత అంటే ఏమిటి?’ అన్న వారి వ్యాసంలో విశ్వనాథవారు చెప్పిన అక్షరశిల్పాన్ని గురించి ఇలా అంటారు:
“‘ఆ దుష్యంతుడనంత సత్వుడు సమస్తాశాంత మాతంగ మర్యాదాలంకృతమైన భూవలయ మాత్మాయత్తమై యుండగా’ అనే చోటకాని ఇంకా ఇతరత్రా పెద్ద సమాసాలను అర్థంలో భూవలయం వంటి పెద్ద వస్తువులకు చిన్న సమాసాలు చిన్న విషయాలకు అని చాలా చోట్ల వ్యాఖ్యానించారు విశ్వనాథ. భాషకూ భాషేతర ప్రపంచానికి సారూప్య సంబంధం దాదాపు ఉండదు. ధ్వన్యనుకరణాల వంటి వాటికి ఉన్నట్టు కనిపించినా అది ఒక్కో భాషా సమాజం విడివిడిగా ఏర్పరచుకున్నదే కాని స్వతస్సిద్ధం గాదు. ధ్వనుల్లో ఉచ్చారణ క్లిష్టత ఉచ్చారణ సులభత ఉంటాయి. కొన్ని ధ్వనులకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది… అంత మాత్రం చేత కఠినాక్షరాలున్న మాటలు ప్రపంచంలో కఠినాంశాలనో, క్లిష్టాంశాలనో సూచిస్తాయని చెప్పలేము.”
పెద్ద సమాసాలు పెద్ద వస్తువులనీ, కఠినాక్షరాలు ప్రపంచంలోని కఠిన విషయాలనూ సహజసిద్ధంగా సార్వత్రికంగా సూచించవు అని ఇక్కడ చేరా అంటున్నారు. అది నిజమే. అందులో అనుమానం లేదు. అయితే విశ్వనాథ ఉద్దేశ్యం ఇదా? కాదని సంపత్కుమారగారి వివరణ గమనిస్తే నాకు తోచిన సమాధానం. ఈ విషయంలో చేరా కొద్దిగా పొరబడ్డారేమో అని నాకనిపిస్తోంది. పెద్ద సమాసాలు పెద్ద వస్తువులని సహజంగా స్ఫురింపజేయక పోవచ్చు. అన్ని చోట్లా సూచించకపోవచ్చు. కాని పెద్ద విషయాలని చెప్పే చోట్ల ఎక్కువగా పెద్ద సమాసాలను కవులు ప్రయోగిస్తే, అది దానికి ఒక సూచికగా, గుర్తుగా మారవచ్చు. సందర్భాన్ని బట్టి చదివే పాఠకుడు దాన్ని గుర్తిస్తే ఆ పాఠకునిలో అధిక భావస్ఫూర్తి కలిగే అవకాశం ఉంది. శిల్పం సాధించే ప్రయోజనం ఇది. అన్ని శిల్పభేదాలకూ ఇదే వర్తిస్తుంది. శిల్పాన్ని తెలిసిన పాఠకుడే దాని ద్వారా అధిక స్ఫూర్తిని పొందగలుగుతాడు కాని, అప్రయత్నంగా అసంకల్పితంగా అది జరగదు అని నేను అర్థం చేసుకున్నాను.
1ఇ. పాశ్చాత్య ధోరణులు
శిల్పానుశీలనే కాకుండా మరికొన్ని అభివ్యక్తి పరమైన విశేషాలను సంపత్కుమార విశ్వనాథ రచనలో గుర్తించి వివరించారు. ఇందులో ముఖ్యంగా పాశ్చాత్యసాహిత్య ప్రభావంతో విశ్వనాథ చేసిన ప్రయోగాలు రెండున్నాయి. నాటక రచనలో ప్రాచీన సంప్రదాయాన్ని పాటించకుండా పాశ్చాత్య పద్ధతులని ప్రవేశపెట్టడం ఒకటి. నర్తనశాల గురించిన వ్యాసంలో దీన్ని సంపత్కుమార వివరించారు. అయితే, ఈ వ్యాసంలో ఎక్కువగా రససిద్ధాంత పరమయిన విశ్లేషణే చెయ్యడానికి వారు ప్రయత్నించారు. పాశ్చాత్య ధోరణులను గుర్తించి ఊరుకున్నారు. ఇది నాకు కొంత అసంతృప్తిని మిగిల్చింది. నర్తనశాల నాటకానికి రససిద్ధాంతాన్ని అన్వయించ బూనడం పెద్ద ప్రయోజనకారి కాదని నా అభిప్రాయం. పాశ్చాత్య నాటక ప్రభావం దీని మీద చాలా ఉంది. దానినే మరికొంత వివరిస్తే బాగుండుననిపించింది. బహుశా ఇతరత్రా కొందరు ఈ రకమయిన విశ్లేషణ చేసి ఉండడం వల్ల సంపత్కుమారగారు చేసి ఉండకపోవచ్చు.
పాశ్చాత్యసాహిత్యం నుండి విశ్వనాథ స్వీకరించిన మరొక అంశం, భావ్యర్థ సూచన. ‘ప్రస్తావన’లో మాత్రమే నాయకుడినీ నాటకవస్తువునూ సూచించటం మన భారతీయ నాటక సంప్రదాయం. అయితే విశ్వనాథవారి నాటకాలలోనూ, కావ్యాలలోనూ కూడా పాత్ర సంభాషణలలో చాలా చోట్ల, జరగబోయే దాన్ని సూచించడం మనకి కనిపిస్తుంది. ప్రఖ్యాతమైన కథని చెప్పేటప్పుడు ఇలాంటి సంవిధానం ద్వారా పాఠకుల మనస్సులో ఒక కొత్త అనుభూతి కలుగుతుందని సంపత్కుమార అభిప్రాయపడ్డారు.
అంతస్సారం
ఏ రచనకయినా అభివ్యక్తి కేవలం ఉపరితలమే. రచనలోని అంతస్సారాన్ని గ్రహించకుండా అందులోని అభివ్యక్తిని మాత్రమే చూసి ఊరుకుంటే ఆ దర్శనం అసమగ్రమే. అంతస్సారమే అసలైన సారం. అభివ్యక్తి అంతస్సారాన్ని ఆవిష్కరించే పద్ధతి. అందుకే అభివ్యక్తికి సంబంధించిన విశ్లేషణ అంతస్సారాన్ని గ్రహించే దిశగా సాగాలి. విశ్వనాథ సాహిత్యంలో అంతస్సారాన్ని సంపత్కుమార ఎలా దర్శించారో ఇప్పుడు చూద్దాం. విశ్వనాథ తత్త్వస్రవంతిని రెండు పాయలుగా చూడవచ్చు. ఒకటి సామాజికత, రెండు ఆధ్యాత్మికత. నిజానికి రెండిటి మూలం ఒకటే.
2అ. సామాజికత
విశ్వనాథ సామాజిక దృక్పథం ఆయన సర్వ సాహిత్యంలోనూ అక్కడక్కడా ప్రతిఫలిస్తూనే ఉంటుంది. కాని వారి నవలలలో అది సంపూర్ణంగా ద్యోతకమవుతుంది. ‘విశ్వనాథ నవలలు: సామాజిక దృక్పథం’ అన్న వ్యాసంలో సంపత్కుమార దీన్ని సమగ్రంగా ఆవిష్కరించారు. విశ్వనాథ సామాజిక దృక్పథానికి ప్రాతిపదిక దేశీయత అని వారు గుర్తించారు. దేశీయత అంటే ఏమిటి?
“ఒక దేశం, ఆ దేశంలో జీవితాన్ని అనుభవిస్తున్న జాతీ, జీవితాన్ని గూర్చి జీవిత పరమార్థాన్ని గురించీ ఆ జాతి చేసిన విచారణా, వేసుకున్న ప్రశ్నలూ, అనుభవాల ద్వారా స్పష్టపరచుకొంటున్న ఆలోచనా, దాని నుంచి పొందిన సమాధానాలూ, వాటినుంచి ఎప్పటికప్పుడు రూపుదిద్దుకొనే ఆచరణ విధానమూ ఒక ప్రత్యేకమయిన తరహాలో ఉంటుంది… అన్ని దేశాల్లోనూ మట్టి ఉంటుంది; గాలీ, నీరూ, చెట్లూ, చేమలూ వగైరాలన్నీ ఉంటాయి; మనుషులూ ఉంటారు; పశువులూ, పక్షులూ, జంతువులూ, అడవులూ, కొండలూ, వాగులూ, వరదలూ, పాడీపంటా ఆయా దేశాల భౌగోళికతను బట్టి ఉండనే ఉంటాయి. కాని, దేశ దేశానికీ కొన్ని కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. ఆ దేశీయమయిన జాతి తన అవసరాలూ, అనుభవాలూ, ఆలోచనా నైశిత్యాన్ని బట్టి, విచారణాదక్షతనుబట్టి సంపాదించుకొన్న, రూపొందించుకొన్న జ్ఞాన విజ్ఞానాదులూ మొదలయిన వాటినిబట్టి జీవితానికి సంబంధించి ఒక ప్రత్యేకమయిన దృక్పథాన్ని ఏర్పరుచుకొంటుంది.”
ఇది దేశీయతకు సంపత్కుమారగారి నిర్వచనం. అది విశ్వనాథ అంతరంగానికి ప్రతిధ్వని. నేడు ప్రభంజనంలా వ్యాపిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ దేశీయత గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతయినా ఉంది. రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం మాత్రమే స్వాత్రంత్ర్యమా? సాంస్కృతిక స్వాతంత్ర్యం అవసరం లేదా? అదిప్పుడు మనకి ఎంతవరకూ ఉన్నది? సాంస్కృతిక స్వాతంత్ర్యం రాజకీయార్థిక స్వాతంత్ర్యాలని ఎలా ప్రభావితం చేస్తుంది? మొదలయిన ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి.
“ఈనాడు దేశీయ – దేశీయేతర భావజాల ప్రవృత్తుల మధ్య సాగుతున్న సంఘర్షణలో సంప్రదాయం, సమాజం మొదలయిన పదాలే కాదు, మొత్తం సమాజమే సతమతమయి నలిగిపోతున్నది.” అని అంటారు సంపత్కుమార. ప్రస్తుతం అలాంటి సంఘర్షణ కూడా కనిపించదు! సంప్రదాయం, సమాజం, ఆధునికత మొదలైన ఎన్నో విషయాల గురించి విశ్వనాథవారి దృక్పథం సంపత్కుమారగారి మాటల్లో మనకీ వ్యాసంలో కనిపిస్తుంది. మన భారతీయ సమాజ పూర్వ స్వరూపాన్ని ఏ రకంగా విశ్వనాథ తన నవలల్లో చిత్రించారో మనకీ వ్యాసంలో రూపుకట్టించారు. భారతీయమైన కుటుంబ ఆర్థిక రాజ్య వ్యవస్థలు, మత వ్యవస్థ, వీటన్నిటికీ అంతస్సూత్రంగా నిలిచిన ధర్మము – ఇవన్నీ విశ్వనాథ వారి రచనలన్నింటిలోనూ వ్యాపించి ఉన్నాయి. ఆ ఆలోచనా సర్వస్వాన్ని గుదిగుచ్చి సంపత్కుమార తన వ్యాసంలో మనకి దర్శింపజేశారు.
“మర బియ్యముతో ప్రాణము పోవుచున్నది. తిన్నవారికి నాయుర్దాయము క్షీణించుచున్నది. పేదలకు దంచిన కూలినూకలు వచ్చుటలేదు. బస్తావడ్లు నలుగురు పేదవాండ్రు దంచెదరు. నలుగురకు నారోజు తిండికి బియ్యము దొరుకును. పెట్టుబడి పెట్టి మిల్లులు పెట్టిన సాహుకారిట్టి వంద నలుగురి నోళ్ళలో దుమ్ముకొట్టి తాను ధనవంతుడగు చుండెను. వానికి తిండి చాలకయా? అమిత ధనాభిలాష! అయ్యో; జనుడు ధనముతో నేమి చేయును? దుర్వ్యసనములు పెంపొందించుకొనును. నూటిలో తొంబది తొమ్మిది మందికి తిన తిండి లేకుండ జేసి ఒక్కడే ధనమంతయు ప్రోగుచేసి మేడలు కట్టును. మోటారులు కొనును. దుష్టవస్తువులను కొనుటకు ఉపయోగించును. భోగము దానికిచ్చిన డబ్బు మోటారులు కొన్న దానికన్న చెడిపోయినదా? ఇది యేదో యొక పేదజీవి బ్రతుకుటకుపయోగ పడినది. మోటారు కొన్న డబ్బు అమెరికాలోని కోటీశ్వరులు ఫోర్డు, రాక్ ఫెల్లర్లను బాగు చేయుచున్నది”
అని వేయిపడగలలో ధర్మారావు అంటాడు. ఇవి ఛాందస భావాలా? విప్లవాత్మక భావాలా? హోదా కోసం మోటారు కార్లు కొనడం ఎంతటి దుర్వ్యసనమో చెప్పడానికి భోగంవారి గురించిన ప్రస్తావన కాని దానిని పట్టుకొని విశ్వనాథ భోగపు వ్యవస్థని సమర్థించాడని అంటే అది సమంజసమా? పెట్టుబడిదారీ వ్యవస్థని విశ్వనాథ ఎంతగా వ్యతిరేకించారో దీనిబట్టి మనం తెలుసుకోవచ్చు. అలాగే ‘సముద్రపు దిబ్బ’ నవలలో నేతవృత్తివారు కూడా పెట్టుబడిదారీ వ్యవస్థకి ఎలా బలి అవుతున్నారో వివరిస్తారు. ఇదంతా సామ్యవాద భావాలు కావా? వీటిని అర్థం చేసుకుంటే, మౌలికమైన సిద్ధాంతాలలో విభేదాలున్నా, విశ్వనాథ దృక్పథానికీ కమ్యూనిజానికీ గమ్యం ఒకటే అని అనిపించక మానదు.
విశ్వనాథ సాహిత్యమంతా చదవలేకపోయినా సంపత్కుమార వ్యాసాలు చదివితే వక్రీకరణలు లేని ఆయన సామాజిక దృక్పథం మనకి విస్పష్టంగా దర్శనమిస్తుంది.
2ఆ. ఆధ్యాత్మికత
అద్వైతాన్ని ఆత్మగతం చేసుకున్నవారు విశ్వనాథ. అది అతని సర్వ కవిత్వంలోనూ ప్రతిఫలిస్తూనే ఉంటుంది. రామాయణాన్ని పూర్వ వ్యాఖ్యాతలు విశిష్టాద్వైత పరంగా వ్యాఖ్యానించారు. విశ్వనాథ కల్పవృక్షం అద్వైత పరమైన వ్యాఖ్యానం. దీని ఆధారంగా కల్పవృక్షంలో రామాయణ తత్త్వాన్ని విశ్వనాథ ఎలా దర్శించారో ఇలా వివరించారు సంపత్కుమార:
“నిజానికిది రఘువరచరితమా? సీతామహచ్చరితమా? అసలు కా ‘చరిత’లు రెండు కావు – ఒకటే. రెండుగా భాసించవచ్చుగాని, ఒకరు లేకుండా మరొకరిదనిపించే చరిత లేదు. కారణం, సీతారామచంద్రులు అభిన్నులు కావటమే. ఇద్దరూ ఒకే వెలుగు.
ఇరువురము నొక్క వెలుగున
చెరిసగమును, దీని నెరుగు శివుడొకరుండే,
పురుషుడవీవైతివి నే
గరితనుగానైతి…అని, అగ్నిప్రవేశం చేయబోతూ కల్పవృక్ష సీత చెప్పిన చివరి రహస్యమిది… అయితే ఒకే వెలుగు స్త్రీ-పుం రూపంగా వివర్తమానం కావటమెందుకు? రావణవధార్థం. వాల్మీకి వాక్యాల్లో రఘువరచరిత మన్నప్పుడు, సీతామహచ్చరిత మన్నప్పుడు కూడా వెనువెంటనే తప్పనిసరి అంశంగా, ఫలభూతంగా చెప్పబడింది దశ శిరస్క – పౌలస్త్య వధ. ఆ దశశిరస్కుడూ, పౌలస్త్యుడూ భిన్నులు కారు. రఘువరుడు, సీత కూడా కాదు… ఈ అభేదాన్ని రామాయణం గర్భీకరించుకొంది. ‘కావ్యం రామాయణం కృత్స్నం’ అంటే ఆ ‘కృత్స్నత’ ఇది. ఈ కృత్స్నమయిన రామాయణానికి ఫలం రాముడు సీతను పునర్లభించుకోవటం కాదు. ఈ అంశం కల్పవృక్ష రావణునికీ అర్థమయింది. అందుకనే –
సీతం గొంచును బోవ నీతడిట వచ్చెన్నాగ వ్యాజంబు, వి
ఖ్యాతిన్ దానవవంశ నాశనము కార్యం బీ శివాద్వైతికిన్
సీతం గైకొని పోవ వేవిధములం జేయంగ వచ్చున్, మహా
దైతేయోన్మథనంబు ముఖ్యము సముద్రాంభోవ్యధాకారికిన్అనుకుంటాడు… దశశిరస్కత మానవ సృష్టిలోని ప్రకృతి వైపరీత్యానికి ప్రతీక. పౌలస్త్యం మానవుని ఉదాత్తత్వానికి సూచిక. ఆ స్థాయిలో ఈ వైపరీత్యం సృష్టి వ్యవస్థా భంజక మయింది. ఆ భంజకమయినదాన్ని ఉన్మూలించటం సృష్టి యొక్క సుస్థితికి అభీష్టం. ఈ సుస్థితిని రక్షించటం ఆదిమ మహస్సులోని వైష్ణవీయతా లక్షణం. కాబట్టి రావణవధ రామాయణ ఫలం.”
భారతీయ సాహిత్యంలో ప్రతీకాత్మకతకూ, అనేక పొరలలో దాగుండే తత్త్వ రహస్యాలకూ ఎంతో ప్రాముఖ్యముంది. భారతీయ దర్శనాల ఆధారంగా వాటిని విశ్లేషించినప్పుడే ఇలాంటి లోతైన చింతనకు ఆస్కారముంటుంది. అలా కాకుండా, పైపైననే మనకి తోచిన సిద్ధాంతాలని ప్రయోగించి వ్యాఖ్యానిస్తే వెగటుదనమే మిగులుతుంది. ఈ వ్యాసం మొదట్లో ఉటంకించిన పద్యాన్ని ఇక్కడ మళ్ళీ అనుసంధానం చేసుకోవాలి.
సంపత్కుమారగారు విశ్వనాథ అద్వైత చింతనని ఎంతగా ఆకళించుకున్నారంటే, కిన్నెరసాని పాటలలో కూడా అద్వైతపరమైన ఒక విచారధార వారికి కనిపించేంత!
2ఇ. జీవునివేదన – బ్రాహ్మీమయత
ఆత్మగతం చేసుకున్న అద్వైత సిద్ధాంతమే విశ్వనాథలో ‘జీవునివేదన’గా పరిణమించింది. వారి కవిత్వంలోని అతిముఖ్యమయిన తాత్త్వికాంశం జీవునివేదన. “చేసిన తండ్రి బాసయును జీవునివేదన, రెండు నేకమై” తాను కల్పవృక్షం వ్రాస్తున్నానని విశ్వనాథ చెప్పినా, ‘భ్రష్ట యోగి’ నుండి ‘రామాయణ కల్పవృక్షం’ దాకా అతని కవిత్వమంతటా ఆ జీవునివేదన వ్యాపించి ఉంది. దీనిని సంపత్కుమారగారు ‘అత్యాధునికమూ, మౌలికమూ అయిన ఒక సాహిత్య దార్శనిక సిద్ధాంతం’గా అభివర్ణించారు. తనలోని ద్వంద్వాలను అధిగమించి పూర్ణమైన అద్వైత స్థితి పొందేందుకు ఆత్మపడే వేదనే యీ జీవునివేదన. ‘విశ్వనాథ’ అనే వ్యాసంలో విశ్వనాథ వేదన లోతులని తడుముతారు సంపత్కుమార.
“ఈ కెలన శరత్పూర్ణిమావృత శశాంక
లలితరోచిర్వితాన, మా కెలన ఘోర
ఘనత రాంధకారచ్ఛటాక్రాంత భూమి
అందు సగ మిందు సగముంటి…ఒకవైపు రమణీయమైన వెన్నెల – మరొకవైపు కరాళమైన చీకటి. తనలో ఈ రెండు సమానస్థాయిలో ఉన్నవి. ఈ రెండూ ప్రకృతితః విరుద్ధాలయినవి. జ్ఞానాజ్ఞాల కూడలి. ద్వంద్వమయమయి లోకం వలె ఉన్నాడన్న మాట. తనలో ఉన్న ఈ విరుద్ధ శక్తులకు తాను తట్టుకొని మహావేదనతో కాలాన్ని తోస్తున్నాడు.”
మరి ఈ వేదనకి పర్యవసానం ఏమిటి? తన వేదనని అధిగమించడానికి విశ్వనాథ చేసిన సాధన ఏమిటి? ఇక్కడే కవిగా విశ్వనాథ విలక్షణత గోచరమవుతుంది. ఈ విలక్షణత ఏమిటో సంపత్కుమారగారి మాటల్లో:
“ఈ ఆంతరికమైన వేదన – ఘర్షణ – సర్వవైశ్వనాధిక సాహితిలో దృగ్గోచరమవుతుంది. ఈ ఆంతరికమైన జీవ వేదనతో ‘సకలోహవైభవ సనాథంగా’ కవితను తపస్సుగా స్వీకరించినాడు. అందుకే రామాయణ కల్పవృక్షారణ్యకాండలో –
కవితారూప తపస్సు చేసెదను శ్రీకంఠా! మనస్సంయమా
ది విధానంబుల చేతగాని తనమైతిన్, మూర్త సంవిత్కళా
యువతీభోగ! హరింపజేయుటకు మారోడ్తున్ జుమీ యింద్రియా
ది వికారంబులు భావనావిమల వాక్తీర్థంబు లేపారగన్అని అంటారు.”
అంటే విశ్వనాథ కవిత్వాన్నే తపస్సుగా భావించి, ఆ తపస్సు ద్వారా ముక్తిపొందాలని తపన చెందారన్న మాట. ఈ తపస్సు గురించి ‘విశ్వనాథ సత్యనారాయణగారి బ్రాహ్మీమయత’, ‘విశ్వనాథ’ మొదలైన వ్యాసాలలో అద్భుతంగా విశ్లేషించారు సంపత్కుమార. మనస్సంయమాది విధానములు చేతగాలేదు విశ్వనాథకు. అందుకే కవిత్వ రూపంలో తపస్సుని సాగించారు. దీనికి బీజం కవిత్వం ప్రారంభించిన తొలి రోజుల్లో ఆయన వ్రాసిన ‘భ్రష్టయోగి’లోనే మనకి కనిపిస్తుంది! ఒక భక్తునిగా రాముడినీ, శివుడినీ, కృష్ణుడినీ ఆరాధించినా ఒక కవిగా వాక్కును, శబ్దబ్రహ్మాన్ని, శారదాదేవిని ఆరాధించారు. ఇది విశ్వనాథలోని విలక్షణత. దీని గురించి సంపత్కుమార చాలా లోతైన విశ్లేషణ చేశారు. కొద్దిగా సుదీర్ఘమయినా దానిని ఇక్కడ కొద్దిగా రుచి చూపించక తప్పదు:
ఈ మహాసంధ్యలో శారదామయూరి
రమ్య కింకిణి కిణకిణ రభస పాద!
మంజుల విలాసనృత్య సామ్రాజ్య లక్ష్మి!
యగుచు కచ్ఛపీ మృదుగీతులనుసరించునన్నారు. ఈ జపాశోణసంధ్య ఆ సంధ్యాదేవియే. అర్చిర్గూఢమయిన శబ్దం ఆవిష్కృతం కావాలి. వాక్కుకు అగ్ని అధిష్ఠానదేవత. కవిలోని అగ్ని జీవునివేదన. కార్యకారణాలకు అభేదభావన చేస్తే వాగగ్నులు అభిన్నమయినవి. నిత్యప్రజ్వల జ్జీవుని వేదన వాక్కుగా అభివ్యక్తమవుతుంది. అట్లాంటివాడు కవి. మరి, నిజానికి కావ్యవాక్కు అంటే అది. సాధారణవాక్కు కవి వేదాగ్నిలో పుఠం పెట్టబడి కావ్యవాక్కుగా ప్రజ్వలిస్తుంది. అదట్లా ఉంచి –
మన్మహాయోగ నిష్ఠాసమాధి నుండి
బ్రహ్మ బదులుగ వాక్స్వరూపంబు నెంచి
బ్రహ్మకును వాక్కునకభిన్న భావమెంచి
భ్రష్టయోగిని కవిజన్మ బడసినాడనన్నారు సత్యనారాయణగారు. వాక్కును – శబ్దాన్ని బ్రహ్మముగా భావించి ఉపాసించటం భారతీయ కవి సంప్రదాయం. ఆ ఉపాసనలో అనంతమయిన అంతరువులు ఉండవచ్చు. పరాకాష్ఠ దశకు చెందిన ఆ ఉపాసన ఆ కవికి బ్రహ్మీభావాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ‘శబ్దబ్రహ్మ స్తుతి’ చివరి పద్యంలో –
మానుగ నాకాశంబున
ప్రాణములన్ మలచి తన్మయత్వము పొందున్
నేనే శబ్దబ్రహ్మ
మ్మై నాలో నాకె నందనాదికమయ్యెన్అని చెప్పబడింది.”
ఈ కవితారూప తపస్సు గురించి ఆలోచిస్తూ ఉంటే, జెన్ కవిత్వ తత్త్వంతో దీనికి కొంత పోలిక ఉన్నట్టుగా అనిపించింది నాకు. జెన్ కవికి ధ్యానంనుండే కవిత్వం పుడుతుంది. పూర్తిగా ధ్యానమగ్నుడయిపోతే మిగిలేది నిశ్శబ్దం. మరి నిశ్శబ్దం నుండి కవిత్వమెలా పుడుతుంది? విశ్వనాథ వాక్కునుండి బ్రహ్మను వెతికినట్టు జెన్ కవులు శబ్దంనుండి నిశ్శబ్దాన్ని వెతుకుతారు. “అస్మదీయ కంఠమున యందాడుచుండె, నొక ఏదోగీతి బయటకు నుబికి రాదు. చొచ్చుకొని లోనికింబోదు వ్రచ్చిపోయె నా హృదయమీ మహాప్రయత్నమందు” అని తన వాక్కుకున్న పరిమితిని, అనిర్వచనీయమైన లోపలి గీతిని వ్యక్తపరిచడంలోని అశక్తతని చెప్పుకుంటారు విశ్వనాథ. జెన్ కవులలాగే విశ్వనాథకు కూడా వాక్కు పరిమితులు తెలుసు. తేడా ఏమిటంటే, జెన్ కవులు వాక్కు నిష్ప్రయోజకత్వాన్ని తెలుసుకొని దాని విచ్ఛిత్తినుండి నిశ్శబ్దాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు. విశ్వనాథ వాక్కు యొక్క పరిపూర్ణ శక్తిని తెలుసుకొని, అనుభవించి దాని ద్వారా వాగతీతమైన పరబ్రహ్మాన్ని చేరాలని ఆకాంక్షిస్తారు. ఈ పోలిక కేవలం అనాలోచితంగా స్ఫురించిన ఒక భావన. దీని గురించి లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
అది అలా ఉంచితే, సత్యనారాయణగారు కవిగా శబ్దాన్ని ఉపాసించి, సిద్ధిపొంది ‘బ్రాహ్మీమయమూర్తి’ అయ్యారని సంపత్కుమారగారి నిశ్చయం. అందుకే అసలు కవిత్వం చెప్పకుండా విశ్వనాథ బతకలేరని అంటారు వారు.
“అలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి” అని కల్పవృక్షావతారికలో తనని తాను చెప్పుకోవడం విశ్వనాథ అహంభావానికి పరాకాష్ఠగా ప్రచారం జరిగింది. కవి వాక్కును అర్థం చేసుకోవాలంటే అతని కవిత్వసర్వస్వాన్నీ గాఢంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. కల్పవృక్షానికి ఎంతో ముందుగానే వ్రాసిన ‘శబ్దబ్రహ్మ స్తుతి’ అనే ఖండ కావ్యంలోనే తాను శబ్దబ్రహ్మమయినానని చెప్పుకున్నారు కదా విశ్వనాథ. ఆ శబ్దబ్రహ్మమే యీ బ్రాహ్మి. ఈ ‘బ్రాహ్మీమయత’ గురించి సంపత్కుమార,
“ఈ ‘బ్రాహ్మీమయ మూర్తి’కి ముందు – ‘అలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోహల’ అని దీర్ఘసమాసరూప విశేషణం ఉంది. మనో బుద్ధ్యహంకార చిత్తరూపం అంతఃకరణం. ధిషణ (బుద్ధి) – అహంకారాలు మనస్సును అధిగమించిన స్థాయిల్లోని అహంకారాన్ని ‘రస’మన్నాడు భోజుడు. కాగా, ‘స్వాదురసావతారం’ కావ్యప్రపంచంలో అవతరించే పరమేశ్వర తత్త్వం.”
అని వివరించారు. అంటే కావ్యంలో, బుద్ధి అహంకారాలని అధిగమించిన రసస్థాయి బ్రాహ్మీమయత అన్న మాట. అందుకే రసానందానికి బ్రహ్మానంద స్థాయిని ఇచ్చారు మన అలంకారికులు.
కవి తపస్సంతా ఆ రసస్థాయిని చేరుకోడానికే. అది లభించినప్పుడే కవి జన్మకి సాఫల్యం. అదే విశ్వనాథ చెప్పిన బ్రాహ్మీమయత.
విశ్వనాథ బ్రాహ్మీమయతని దర్శింపజేసే దిశగానే సంపత్కుమార పరిశీలనంతా సాగింది. అయితే ఇది కేవల మూఢభక్తిగా కాకుండా, విషయ వివేచనతో, తార్కిక విశ్లేషణతో సాగడం విశేషం. విశ్వనాథ కవిత్వ పటుత్వం పూర్తిగా తెలుసుకున్నాకనే విశ్వనాథని ‘మహాకవి’గా నిరూపించే వ్యాసాన్ని కూడా ప్రకటించారు. ఇది కూడా కేవలం పొగడ్తలతోనూ నినాదాలతోనూ కాకుండా శాస్త్రీయ పద్ధతిలోనే ఉంటుంది. మహాకవికి ఆనందవర్ధనుడు చెప్పిన నిర్వచనం ఆధారంగా తీసుకొని, దాన్ని విశ్వనాథవారే తన విమర్శలో నిర్వచించిన కవుల స్థాయీభేదాలకి అన్వయించి, విశ్వనాథ చేసిన కవితారూప తపస్సుకి అనుసంధానం చేస్తూ విశ్వనాథని ‘మహాకవి’గా నిరూపించారు సంపత్కుమార.
అతిశయం లేని అచ్చమయిన సద్విమర్శకు సంపత్కుమారగారి వ్యాసాలు మచ్చుతునకలు. విశ్వనాథ సాహిత్య విరాడ్స్వరూపాన్ని స్థూలరూపంలో దర్శించేందుకు అనువైన కోవెల సంపత్కుమార!
సర్వపూర్వర్షి హృన్నిష్ఠ
భావనాపూర్ణరూపిణీ
రసాత్మికా సా జయతి
విశ్వనాథ సరస్వతీ
– (విశ్వనాథ గురించి సంపత్కుమారగారు చెప్పిన శ్లోకం)