కుందన్‌కి చాలా సంతోషంగా ఉంది. ఈ రోజంతా అతను తన ఇష్టం వచ్చినట్టు గడపడానికి అవకాశం దొరికింది. పిల్లలని బాగా తిప్పాలి. గార్డెన్‌కి, జూపార్క్‌కి…! ఏదైనా మంచి హోటల్లో భోజనం పెట్టించాలి. ఈ రోజు మారుతి వ్యాన్ నడుపుతుంటే అతనికో చిత్రమైన అనుభూతి కలుగుతోంది. రోజూ ఇదే వ్యాన్ నడుపుతాడతను, కానీ రోజూ నడపడానికి ఈ రోజు నడపడానికి తేడా ఉంది. రోజూ అతను డ్రైవరు, ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు. రియర్ వ్యూ అద్దంపై ఓ కన్నేసి ఉంచుతాడు. సేఠ్‌జీ ఎప్పుడు ఏమంటాడో, ఏదెప్పుడు అడుగుతాడో తెలియదు. అయితే ఈ రోజుకి మాత్రం కుందన్ ఆ బండికి యజమాని. సేఠ్‌జీనే స్వయంగా అతనికి బండిచ్చి ఈ రోజంతా వాడుకోమన్నాడు. “ఒకరోజెప్పుడో అడిగావుగదా పిల్లలని తిప్పడానికి బండి కావాలని? ఈ రోజు తీసుకెళ్ళు” అంటూ రెండు వందల రూపాయలు చేతిలో పెట్టాడు. సేఠ్‌జీ ఎంత మంచివాడో అని అనుకున్నాడు కుందన్. ఈ ఒక్కరోజుకైనా జీవితాన్ని మనసారా ఆస్వాదించాలనుకుంటున్నాడు. అది అతని కల.
యూనిఫాం, టోపీ ధరించి ఎప్పుడూ వినయంగా భయం భయంగా ఉండే అతని లోపలి మనిషి ఈ రోజు తుర్రుమంటూ ఎటో జారుకున్నాడు. ఈ రోజతను సఫారీ సూట్ వేసుకుని ఉన్నాడు. మనసు కూనిరాగాలు తీయసాగింది. స్టీరియో ఆన్ చేసాడు, ఏదో పాత పాట వస్తోంది. స్కూల్లో ఉన్న రోజుల్లో ఎప్పుడూ ఇదే పాట వచ్చేది రేడియోలో. అతనికి నవ్వొచ్చింది. డాష్‌బోర్డ్‌లో ఉన్న గడియారం వైపు చూశాడు. పది గంటలవుతోంది. ‘ఈ పాటికి అంతా సిద్ధంగా ఉండి ఉంటారు’ అని అనుకున్నాడు. నిన్న రాత్రి బండి తీసుకెళ్ళమని సేఠ్‌జీ చెప్పాక, అప్పుడే భార్య కుంతికి చెప్పాడు – మర్నాడు ఉదయం పదిగంటల కల్లా పిల్లల్ని తయారు చేసి, ఆమెని కూడా సిద్ధంగా ఉండమని! ఉదయం బండి తెచ్చుకోడానికి వెడుతున్నప్పుడు మరోసారి జ్ఞాపకం చేసాడు. ఇంకో అయిదు నిముషాలలో అతను ఇంటి గుమ్మం ముందు ఉండబోతున్నాడు.
వ్యాన్ వాళ్ళింటి సందు తిరగ్గానే, అక్కడ ఎప్పుడూ ఆడుకుంటూ ఉండే పిల్లలు వ్యాన్‌ని చుట్టుముట్టి గగ్గోలుగా అరవసాగారు. కుతూహలం ఆపుకోలేని వాళ్ళు కిటికిల్లోంచి తొంగి చూసారు. కుందన్ మొదటిసారిగా వ్యాన్‌ని ఇంటికి ఈ రోజే తెచ్చాడు. అరుపులు, కేకలు విని పిల్లలు – గప్పూ, సంజయ్, పింకీ బయటకి వచ్చారు. వాళ్ళింకా తయారవుతునే ఉన్నారు. గప్పూ స్కూలు యూనిఫాం వేసుకుని ఉన్నాడు, నలిగిన టై అతని చేతిలో ఉంది. సంజయ్ తనకున్న ఏకైక సఫారీ డ్రెస్ వేసుకున్నాడు, అతని కాళ్ళకి హవాయ్ చెప్పులు. కుందన్‌ని చూస్తూనే ముగ్గురూ ఒకేసారి “అమ్మా, నాన్న వచ్చాడే. నాన్న మారుతి వ్యాన్ ఎంత బావుందో?” అని అరిచారు. గప్పు చేతిలో టైతో వ్యాన్ వద్దకు పరిగెత్తి “జరగండి. ఇది మా బండి. జరగండి” అంటూ అక్కడున్న పిల్లల్ని గదమాయించడం మొదలుపెట్టాడు. “చూడు నాన్నా, సంజయ్ దువ్వెన లాక్కొన్నాడు” అంది పింకీ. చూస్తుంటే వారిద్దరి మధ్య గొడవ మొదలై చాలా సేపయినట్లుంది. పింకీ బాగా ముదురు రంగు గౌన్ వేసుకుని ఉంది. భార్యపై కోపం వచ్చింది కుందన్‌కి. “ఈవిడ ఎప్పుడూ ఇంతే. అస్సలు బుద్ధి లేదు. పిల్లల్ని సరిగా తయారు చేయడమే చేతకాదు” అనుకుంటూ పిల్లల్ని ఓ పక్కగా ఉండమని చెబుతూ, గదిలోపలికి వచ్చాడు.
అక్కడ… అంటే వంటింట్లో ఓ గోడ అడ్డంగా లేపి కట్టిన స్నానాల గదిలోంచి కుంతి చిర్రుబుర్రులాడడం వినిపిస్తోంది. “ఏంటిదంతా, నువ్వూ తయారు కాలేదు, పిల్లల్ని సిద్ధం చేయలేదు, తమాషాగా ఉందా? రోజంతా గుమ్మం దగ్గరే గడచిపోవాలా?” అంటూ అతను అక్కడి నుంచే అరిచాడు. “ఏం చేయను, నీళ్ళు రాలేదివాళ. వస్తాయేమోనని ఇప్పటిదాక ఎదురుచూస్తూ కూర్చున్నాను. ఎప్పటికే రాకపోయేసరికి రాజు వాళ్ళమ్మని అడిగి రెండు బకెట్ల నీళ్ళు తెచ్చుకున్నాను” అంటూ బాడీ, పెట్టీకోట్ ధరించి, చేతులతో తడి బట్టలు ఉంచుకుని బయటకు వచ్చింది. స్నానాల గదిలోంచి రోజు ఇలాగే బయటకి వస్తుంది కుంతి, కాకపోతే కుందన్ ఎప్పుడూ గమనించలేదు. భార్యని అలా చూసే సరికి అతని సౌందర్యోపాసనకి గట్టి దెబ్బ తగిలింది. “ఇదేం పద్దతి? కొంచెం కూడా సిగ్గు లేదా?” అంటూ అరిచాడు. అతని అరుపుల్ని కుంతి పట్టించుకోలేదు. అక్కడే నిలబడి తడి బట్టలని పిండసాగింది. కుందన్ భార్యకేసి మళ్ళీ మళ్ళీ చూసాడు. జుట్టుని ఆరపెట్టుకుంటూ, చేతులు రెండు వెనక్కి చాచి జాకెట్ వేసుకుంది. ఉన్నట్లుండి కుందన్ దృష్టి ఆమె తడి కురులపైకి మళ్ళింది. తల తిప్పుకుని, బయటి గదిలోకి వచ్చాడు.
అక్కడికొచ్చాక ఏం చేయాలో అర్థం కాలేదతనికి. ఏమీ తోచక, వేరే ఎవరింట్లోనో బలవంతంగా నిల్చున్నట్లుగా జేబులో చేతులు పెట్టుకుని నిలుచున్నాడు. ఇంతలో గప్పూ వచ్చి అతనిని అల్లుకుపోతూ, “నాన్నా, నేను తయారుగా ఉన్నాను. వెళ్ళి వ్యాన్‌లో కూర్చోనా?” అని అడిగాడు. ఏమీ మాట్లాడకుండా గప్పు కేసి చూసాడు కుందన్. సంజయ్, పింకీ ఇంకా గొడవ పడుతునే ఉన్నారు. తన మూడ్ పాడైపోతున్నట్లు కుందన్‌కి అనిపించింది. ఇంటికి వస్తున్నప్పుడు పిల్లలు రెడీ అయ్యుంటారని, శుభ్రంగా తయారై, పద్దతైన బట్టలు వేసుకుని ఉంటారని అనుకున్నాడు. తీరా వచ్చి చూస్తే… ఛ! విసుగ్గా గుమ్మం వద్దకి వచ్చి సిగరెట్ వెలిగించి, కీచైన్‌ని వేలితో తిప్పుతూ వీధంతా ఒకసారి తిరిగొద్దామని బయల్దేరాడు. సందులోని పిల్లలు ఇంకా వ్యాన్ చుట్టూ మూగి ఉన్నారు.
పిల్లల్ని తీసుకుని కుంతి వ్యాన్ ఎక్కడానికి వచ్చేసరికి కుందన్‌కి వాళ్ళు కార్టూన్ బొమ్మల్లా కనపడ్డారు. గప్పూ యూనిఫాం వదిలేసి, నిక్కరు బుష్ షర్ట్ వేసుకుని ఉన్నాడు. చొక్కా రంగు, లాగు రంగు ఏ మాత్రం పొసగడం లేదు. ఒకటి ఎరుపైతే, మరొకటి ఆకుపచ్చ. పింకీ జుట్టుని గట్టిగా దువ్వి పిలకలు వేసుకుంది. పింకీ ముఖమంతా బిగుసుకుపోయినట్లుగా ఉంది. సఫారీ డ్రెస్ వేసుకున్న సంజయ్ ఏదో కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లా ఉన్నాడు, కాని కాళ్ళకి ఉన్న హవాయ్ చెప్పులు వాడి దర్జా అంతా ఊదేస్తున్నయి. కుంతి కేసి ఓ సారి చూసాడు. బహుశా ఆమె తనకున్న అన్ని చీరల్లోంచి తళుకుబెళుకులున్న చీరని ఎంచుకుని కట్టుకుంది. నూనె అంటి దువ్విన తల, నుదుటన పావలా కాసంత బొట్టు, కట్టుకున్న చీరకి ఏ మాత్రం నప్పని లిప్‌స్టిక్. కరుగ్గా ఏదో అందామనిపించినా ఏం మాట్లాడకుండా కుందన్ చెప్పదలచుకున్నదంతా ముఖంలో చూపించాడు.
నాన్న వ్యాన్ తలుపు ఎప్పుడు తీస్తాడా అని పిల్లలు తపించిపోతున్నారు. వెనుక డోర్ తీస్తే అక్కడ కూర్చోడానికి ముగ్గురు పిల్లలు తహతహలాడిపోతున్నారు. అక్కడే దగ్గరే తచ్చాడుతున్నారు. సందులోని పిల్లలు ఇంకా వ్యాన్ చుట్టూ ఉన్నారు, మురికిగా ఉన్న చేతివేళ్ళని నోట్లో పెట్టుకుంటూ, ఈర్ష్య నిండిన కళ్ళతో చూస్తున్నారు. వాళ్ళందరిని గదమాయించి అక్కడ్నించి వెళ్ళమని చెబుతూ, అందర్ని వచ్చి మధ్య తలుపు తీసుకుని లోపల కూర్చోమన్నాడు. పిల్లలు ముఖం మాడ్చుకున్నారు.
వెనుక డోర్ తీసి పిల్లల్ని కూర్చోబెట్టచ్చు, కాని పిల్లలమాచింగ్ లేని బట్టలు చూడగానే అందరికీ తెలిసిపోతుంది; వాళ్ళు యజమాని పిల్లలు కాదని, డ్రైవర్ పిల్లలని. చేసేదేం లేక పిల్లలు వ్యాన్ ఎక్కి మధ్యలో కూర్చున్నారు. కుంతి ఆచారం ప్రకారం కొంగుని తల మీద నుంచి క్రిందకి లాక్కుని జాగ్రత్తగా ఎక్కి కుందన్ పక్క సీట్లో కూర్చుంది. వ్యాన్ స్టార్ట్ అవగానే పిల్లలు గెంతులేయడం మొదలుపెట్టారు. కుందన్ హఠాత్తుగా బ్రేక్ వేసాడు. అందరూ ఉలిక్కిపడ్డారు, ఏం జరిగిందో తెలియలేదు. కుందన్ కుంతికేసి కొద్దిగా వంగి ఆమె వైపు తలుపుని సరిగ్గా వేసి బండిని గేర్‌లో ఉంచాడు. కుందన్ మనసింకా మాములు స్థితికి రాలేదు. సేఠ్‌జీని అనవసరంగా బండి అడిగానని పదే పదే మనసులో అనిపిస్తోంది. ఈ పిల్లలు వ్యాన్‌లో తిరిగేందుకు అర్హులు కారనిపించింది. సేఠ్‌జీలా బండి నడపాలని, సేఠ్‌జీలా భార్యాబిడ్డలని వ్యాన్‌లో తిప్పాలనే కోరిక పోవడం మొదలయింది.
అతనూ ఒకప్పుడు గొప్పవాడవ్వాలనే కలలు కన్నాడు. ఖరీదైన వస్తువులు కొనుక్కోవాలని, గొప్పవాళ్ళలాగా బట్టలు వేసుకుని హోటళ్ళకి వెళ్ళాలని ఉవ్విళ్ళూరేవాడు. జీవితాన్ని నిర్లక్షంగా గడపాలనుకునేవాడు. తన భార్య చాలా అందంగా ఉండాలని, పిల్లలు పుట్టుకతోనే చక్కగా కుదురుగా ఉండాలని, ఇంగ్లీష్ గడగడా మాట్లాడాలని ఊహించుకునేవాడు. కుందన్ బాల్యం చాలా లోటుపాట్లతో గడిచింది. విలాసాల మాట అటుంచి, కనీసావసరాలు కూడా సరిగా సమకూరేవి కావు. మరి అతని కలలు ఎలా నెరవేరుతాయి?
చదువు మధ్యలోనే వదిలేశాడు. అక్కడా ఇక్కడా పని మనిషిగా పనిచేశాడు. ఓ మాములు ఆమెనే పెళ్ళి చేసుకున్నాడు. పిల్లలు కూడా ఏమీ ప్రత్యేకంగా లేరు. అతని కుటుంబంలో విశిష్టత ఏదీ లేదు. కోరుకున్నప్పటికీ వాళ్ళని తను అనుకున్న విధంగా ఉంచలేకపోయాడు. అదృష్టం కొద్దీ ఈ సేఠ్‌జీ వద్ద డ్రైవర్ ఉద్యోగం దొరికింది. సేఠ్‌జీని, అతని కుటుంబాన్ని చూసాక, కుందన్ మనసులో ఆ రకంగా బతకాలనే కోరిక మళ్ళీ రగిలి ఎప్పుడైనా ఓ రోజు పాటు తనకి వ్యాన్ ఇవ్వాల్సిందిగా సేఠ్‌జీని అడిగాడు.
ఇంతలో అతడి ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. గప్పూ సీట్‌పై నుంచి తండ్రిమీదకి ఒంగి, స్టీరియో పెట్టమని అడుగుతున్నాడు. కుందన్ మళ్ళీ చిరాకుగా మారిపోయాడు. స్టీరియో ఆన్ చేయలేదు. గప్పూ మళ్ళీ అడిగాడు. “పోనీ, ఆన్ చేయండి” అని కుంతి కూడా అంది. కుంతి కేసి కొరకొరా చూసి, ఒక్క ఉదుటున స్టీరియో ఆన్ చేసాడు. పాటకి అనుగుణంగా పిల్లలు గెంతసాగారు. “కాసేపు గోల చేయకుండా కూర్చోలేరా?” అని అరిచాడు కుందన్. నిజానికి కుందన్ అప్పుడు ఏ చిన్న శబ్దాన్ని కూడా భరించే స్థితిలో లేడు. తన లోకంలోనే ఉండిపోవాలనుకుంటున్నాడు. కానీ జరుగుతున్నదంతా అతని ఇష్టానికి వ్యతిరేకంగానే ఉంది. కుంతి అన్నీ గమనిస్తోంది. తన భర్త రోజూ ఉన్నట్టు ఈ రోజు లేడని ఆమె గ్రహించింది. కుందన్ తనని, పిల్లల్ని మాటిమాటికి చూడడంతో తాము ఇలా ఉండడం ఆయనకి నచ్చలేదని కుంతికి అర్థమైంది. కానీ తనకి, పిల్లలకి ఎటువంటి బట్టలు ఉన్నాయో ఆయనకేం తెలీదా? లేదా తన పిల్లలు సేఠ్‌జీ పిల్లల్లా లేకపోయేటప్పటికి ఆయనకి నామోషీగా, కోపంగా ఉందా? కుంతి రోడ్డు వైపు చూడసాగింది.
వ్యాన్ జూపార్క్ గేట్ వద్ద ఆగింది. పిల్లలు ఇంకా బిక్కుబిక్కుమంటునే ఉన్నారు. వాళ్ళు కుందన్‌తో కళ్ళు కలపడం లేదు. తలుపు తెరవగానే భయం భయంగా దిగారు. అనవసరంగా అరిచానేమో అని కుందన్ అనుకున్నాడు. బండిని పార్కింగ్‌లో ఉంచి, టికెట్లు తీసుకున్నాడు. పిల్లల్ని ఉత్సాహపరిచాడు. పిల్లలు ఆనందంగా అరుచుకుంటూ బోనుల వైపుకి పరిగెత్తారు. కుందన్, కుంతి మెల్లిగా నడుస్తున్నారు. కుందన్ గాగుల్స్ పెట్టుకుని చేతి వేళ్ళతో కీచైన్‌ని తిప్పుతూ నడుస్తున్నాడు. వాళ్ళిద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఈ రోజు సెలవు కాకపోయినా, జూపార్క్ రద్దీగానే ఉంది. పిల్లలు అలసిపోయి, అక్కడే ఆగి అమ్మానాన్నల కోసం ఎదురుచూస్తున్నారు. దాహం వేస్తోందని పిల్లలు అడిగితే, కుందన్ అందరికీ కూల్‌డ్రింక్స్ ఇప్పించాడు.
జూపార్క్ చూడడం అయిపోయాక, కుందన్ వాళ్ళని హాంగింగ్ గార్డెన్‌కి తీసుకువెళ్ళాడు. అక్కడ వేగంగా పరిగెడుతూ పింకీ కిందపడింది. మోచేతికి, మోకాలికి దెబ్బలు తగిలాయి. గౌను పాడయిపోయింది. పిల్లని పైకి లేపి సముదాయించడం మాట అటుంచి, కుందన్ మళ్ళీ విరుచుకుపడ్డాడు. “సరిగా నడవడం కూడా రాదా? ఎప్పుడు చూడు అల్లరి పిల్లల్లా గెంతులు, దూకుళ్ళు” అంటూ పాపని గదమాయించాడు. కుంతి గబుక్కున పాపని పైకి లేపింది. “కింద పడి దెబ్బతగిలిన పిల్లని పైకి లేపి సముదాయించడం పోయి ఈ అరుపులేంటి?” అని కసురుకుంటూ పాపని దగ్గరికి తీసుకుని, వీపు నిమరసాగింది. పాప కింద పడినప్పుడు కుందన్ పక్కనే ఉన్నాడు, నేల మీద వంగితే, తన సఫారీ డ్రెస్ పాడయిపోతుందేమోనని పాపని పైకి లేపలేదు.
హాంగింగ్ గార్డెన్ నుంచి చౌపాటీ వస్తున్నప్పుడు అందరూ మౌనంగా ఉండిపోయారు. పిల్లలు ముగ్గురికి ఆకలి వేస్తోంది, తినే వస్తువులు అమ్మే స్టాల్స్ చాలానే ఉన్నాయి. కాని తినడానికి ఏదైనా ఇప్పించమని అడగడానికి భయం వేసింది. రోడ్డు మీద కనపడుతున్న తినుబండారాల కేసి ఆశగా చూస్తూండిపోయారు. కుందన్ బండి నడుపుతునే ఉన్నాడు. పిల్లలకి ఏదైనా తినిపించాలని అతనికి తోచలేదు.
పెద్ద అక్వేరియంలో చేపల్ని చూడగానే పిల్లలు ఆకలి, అలసట మరచిపోయారు. పొద్దున్న బయల్దేరేముందు ఇంట్లో కాస్త తినే బయల్దేరారు. మధ్యలో ఒకొక్క కూల్ డ్రింక్ తాగారు. ఇక్కడ కూడా కుందన్‌కి తోచలేదు పిల్లలకి ఏదైనా తినిపించాలని. భర్త ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో కుంతికి ఏమీ అర్థం కావడం లేదు. ‘నిన్నటి వరకు బాగానే ఉన్నారు. పిల్లల్ని బయటకి తీసుకువెళ్ళి తిప్పాలని నిన్న రాత్రి ఎంత సరదా పడ్డారు? ఈ ఉదయం నుంచే కటువుగా మాట్లాడుతున్నారు. బట్టలు మురికిగా ఎందుకున్నాయి? టైముకి తయారు కావడం తెలీదా? ఎప్పుడూ ఏదీ చూడనట్టే, తిననట్టే ఏమిటా చూడ్డం? అంటూ. అసలు మీరెప్పుడైనా బయటకి తీసుకెళ్ళి చూపిస్తే కదా, తినిపిస్తే కదా తెలిసేది! కట్టుకోడానికి ఉన్న రెండు చీరలు తప్ప మరో జత చీరలు ఉన్నాయా పోనీ? పైగా బట్టలు సరిగా కట్టుకోడం రాదని అంటారా? ఇల్లెలా నెట్టుకొస్తున్నానో నాకే తెలుసు. ఒక్క రోజు కోసం మీకు బండి దొరికినంత మాత్రాన ఈయనేమో మహారాజు, మేమంతా మురికోళ్ళం అయిపోయామా. డ్రైవర్ పిల్లలు సేఠ్‌జీ పిల్లలు ఒకేలాగెలా వుంటారు? కానీ పిల్లలు పిల్లలేగా? మొదటిసారిగా బయటకి తీసుకొచ్చాం. రోజంతా హాయిగా గడపచ్చని అనుకున్నాం. ఇలా అరిచి కసురుకుంటూ మూడ్ పాడుచేసుకోడం ఎందుకు? ఈయన ఇలా ప్రవర్తిస్తారని ముందే తెలుస్తే…’ అన్యమనస్కంగా బైటికి చూడసాగింది కుంతి.
పిల్లలు కూడా ఏమీ ఆనందంగా లేరు. ఈ రోజు నాన్న మొదటిసారి వ్యాను తెచ్చారు, ఊరంతా తిరుగుదామనుకుంటే, ఊరికెనే తిడుతున్నారు. ఇంకెప్పుడు నాన్న వ్యాన్ ఎక్కకూడదు. ముగ్గురు కళ్ళలో నీళ్ళతో ఉన్నారు. ఈ సారి సంజయ్‌కి దెబ్బలు పడ్డాయి, తన చెప్పులతో సీట్ పాడు చేసినందుకు. నిజానికి పొద్దున్న అందరికంటే సంజయే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నాడు, ఇప్పుడు అందరికంటే ముభావంగా ఉన్నాడు. ఓ పెద్ద ఎయిర్‌కండిషన్డ్ హోటల్ ముందు కుందన్ వ్యాన్ ఆపేసరికి అందరూ కంగారు పడ్డారు. పొద్దున్నుంచి జరుగుతున్న లోటుని ఇక్కడ తీర్చేయాలనుకున్నాడు కుందన్. పిల్లలు హోటల్ లోపలి అలంకరణంతా అబ్బురంగా చూస్తున్నారు, కుంతి మాములుగా ఉండడానికి, ఇటువంటి ప్రదేశాలకి రావడం కొత్తేమీ కాదన్నట్లు ఉండడానికి ప్రయత్నిస్తోంది. కుందన్ కూడా ఇటువంటి హోటల్స్ తనకి కొత్తేమీ కానట్టు, రోజూ వచ్చిపోతూంటాననట్లు ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ స్పష్టంగా తెలిసిపోతోంది అతనిక్కడి రావడం అదే మొదటిసారని. చుట్టుపక్కల టేబుల్స్ వద్ద బాగా హడావుడిగా ఉంది. కొంతమంది గట్టిగా పకపకా నవ్వుతుంటే, మరి కొంతమంది లోగొంతుతో మాట్లాడుకుంటున్నారు. పిల్లలు ముగ్గురు తమలో తాము గుసగుసలాడుకుంటూ చుట్టూ తేరిపార చూస్తున్నారు.
మెనూ కార్డ్ చూస్తూనే కుందన్ గాభరా పడ్డాడు. మెనూలో రేట్లు అతను ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి. పైగా ఇంకో సమస్య ఏంటంటే మెనూ కార్డ్‌లో ఉన్న ఐటమ్స్ ఏమిటో అతనికి తెలియడం లేదు. ఆ పేర్లు కూడా వినలేదతను. టై ధరించిన వెయిటర్ ఆర్డర్ కోసం వీళ్ళ టేబుల్ దగ్గరే నిలుచుని ఉన్నాడు. ‘మాకు కొంత టైం కావాలి’ అంటూ అతన్ని పంపేసాడు కుందన్. కుంతివైపు వంగి “ఇక్కడ అన్నీ బాగా రేటెక్కువగా ఉన్నాయి. ఏం చేద్దాం?” అడిగాడు గుసగుసగా. “కాస్త రేటు తక్కువగా ఉన్న రొట్టెలు, కూర ఆర్డర్ చేయండి. పంచుకుని తిందాం” అని కుంతి సలహా ఇచ్చింది. కాసేపయ్యాక, ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని ఉన్న వాటిల్లోకెల్లా ధర తక్కువున్న రొట్టెలు, కూర నసుగుతూ ఆర్డర్ ఇచ్చి, కాస్త ఊపిరి పీల్చుకున్నాడు కుందన్. వెయిటర్ టేబుల్ మీద చెంచాలు, పోర్క్స్ వంటివి సర్దివెళ్ళాడు. వాటితో ఎలా తినాలో పిల్లలకి అర్థం కాలేదు. వాటిని పరీక్షగా చూస్తున్నారు చేత్తో పట్టుకుని.
ఆ రోజు మొదటిసారి కుందన్ భార్యాపిల్లల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోయాడు. నిజానికి, కుందన్ కూడా ఆ వాతావరణంలో ఇమడలేక పోతున్నాడు. ‘అబ్బా, ఈ రోజు బాగా వేడిగా ఉంది’ అంటూ మాటిమాటికి చెమట తుడుచుకుంటున్నాడు. కాసేపయ్యాక, ఆర్డర్ చేసిన పదార్ధాలు వచ్చాయి. అందరూ ఎలాగొలా భోజనమైందనిపించారు. మెల్లిగా, నిశ్శబ్దంగా. ఇప్పటికీ వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళలానే ఉన్నారు. భోజనం పూర్తయ్యాక, వెయిటర్ ఫింగర్ బౌల్స్ తెచ్చి వాళ్ళముందుంచాడు. ఏం చేయాలో వాళ్ళకి ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. గోరు వెచ్చని నీళ్ళలో తేలుతున్న నిమ్మకాయ ముక్క! అందరూ కుందన్‌కేసి చూసారు. అతను కూడా సందిగ్ధంలో ఉన్నాడు వాటితో ఏం చేయాలో తెలియక! సంజయ్ ఓ క్షణం ఆలోచించి, ఆ నీళ్ళలో నిమ్మకాయని పిండుకుని గటుక్కున తాగేసాడు. గప్పూ, పింకీ కూడా అలాగే చేయబోతుంటే, పక్క టేబుల్ దగ్గరున్న వెయిటర్ అది చూసి ఆ నీళ్ళు తాగడానికి కాదని, చెయ్యి కడుక్కోడానికని చెప్పాడు. కుందన్ ముఖం ఒక్కసారిగా నల్లబడింది. తనకన్నా తక్కువ స్థాయి వాడు తన స్థాయి ఏమిటో చెప్పడం! నడిరోడ్డు మీద తనని నగ్నంగా నిలబెట్టినంత అవమానంగా భావించాడు. తల పైకెత్తకుండానే చేతులు కడుక్కుంటూ బిల్ తెచ్చివ్వమన్నాడు.
తిని బయటకు వచ్చేసరికి అందరి మూడ్ మళ్ళీ పాడయిపోయింది. గప్పూ వెక్కిళ్ళు పెడుతున్నాడు. ఐస్‌క్రీం కొనివ్వమని అడిగితే నాన్న కొనలేదని గప్పూ ఏడుస్తుంటే కుందన్ ఆలస్యం చేయకుండా ఒక్క లెంపకాయ ఇచ్చాడు. “ఇలాంటి ఖరీదైన హోటల్‌కి తీసుకురావడం ఎందుకు? బోలెడు డబ్బులు పెట్టి అర్థాకలిలో తిరిగి వెళ్ళడం ఎందుకు?” అంటూ కుంతి ఫిర్యాదు చేస్తున్నట్లుగా అంది. కోపం పట్టలేకపోయాడు కుందన్. “ఇదంతా నా సంతోషం కోసం చేస్తున్నానా? మీ కోసమే కదా? మిమ్మల్ని బయట తిప్పుదామనే కదా సేఠ్‌జీని బతిమాలుకుంది? మీరేమో ఇట్లా…” అంటూ అరిచాడు.
“మాకేం తెలుసు, మీరు బండి తీసుకొచ్చి ‘ఇలా’ తిప్పుతారని తెలిస్తే, మేమసలు రాకపోదుం. చూడండి, పిల్లల ముఖాలు ఎలా మాడిపోయాయో” అంది కుంతి. గప్పూ ముందుకు వచ్చి అమ్మ వడిలో దూరాడు. “ఐస్‌క్రీం కొనుంటే ఏం పోయుండేది?” అంటూ కుంతీ గప్పూని ఓదార్చసాగింది.
“ఆ, కొంటా! దాని రేటెంతో చూసావా? మిగతా పదార్ధాల ఖరీదెంతో తెలుసా? బయటకి వచ్చాక అడిగుంటే, ఎక్కడో అక్కడ కొనిచ్చేవాడిని కదా? ఎప్పడూ ఐస్‌క్రీం మొహమే ఎరగనివాడిలా ఆ ఏడుపేంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారూ?” అన్నాడు కుందన్.
“ఆ, అనుకుంటారు. ఓ గొప్ప షావుకారు జాలిపడి తన డ్రైవర్ పిల్లల్ని ఊరంతా తిప్పుతున్నాడని. ఎవరైనా బాబ్డ్ హెయిర్ ఆడవాళ్ళని, టిప్‌టాప్ పిల్లల్ని వెంటేసుకు తిరగాలనే కోరికే ఉంటే మీ సేఠ్‌జీనే అడగాల్సింది వ్యాన్‌తో పాటు ఆయన పెళ్ళాం బిడ్డల్ని కూడా ఇవ్వమని. మా వెంబడి ఎందుకు పడ్డం? ఒప్పుకున్నాం, మేము బైతులమే. మాకు ఈ కార్లూ వద్దూ, ఈ తిరుగుళ్ళూ వద్దు. తిప్పింది చాలు. ఇక మమ్మల్ని ఇంటి దగ్గర దింపండి. అదే పదివేలు” అంది కుంతి, ఇక కోపం పట్టలేక. మాటామాటా పెరిగింది, నువ్వంటే నువ్వు నుంచి చెయ్యెత్తే దాక వెళ్ళింది. వాళ్ళని ఇంటి దగ్గరే దింపేయడమే ఉత్తమమని కుందన్‌కి అనిపించింది. వ్యాన్‌ని సేఠ్‌జీకి అప్పగించేసి ఎక్కడైనా కూర్చుని ఒంటరిగా తాగితే బాగుంటుందనిపించింది. టైం ఇంకా మూడే అయింది, బండిని రాత్రి ఏడు-ఎనిమిది గంటల మధ్య ఇవ్వమని సేఠ్‌జీ చెప్పాడు.
షాపు దగ్గర సేఠ్‌జీ కుందన్‌ని చూసి ఆశ్చర్యపడ్డాడు. “ఏం? ఇంత తొందరగా వచ్చేసావు? పిల్లల్ని బాగా తిప్పావా?” అని అడిగాడు. కుందన్ జవాబు చెప్పేలోపే ఆయనకేదో గుర్తొచ్చింది. “ఒక పని చెయ్. మా ఇంటికి వెళ్ళు. మేడం గారి చెల్లెళ్ళు వచ్చారు, పిల్లలతో సహా. అందరికీ వాళ్ళ కార్లు సరిపోవు. నువ్వు వ్యాన్ తీసుకెళ్ళు, వాళ్ళు ఎక్కడికి వెడదామంటే అక్కడికి తీసుకెళ్ళు. అందరిని బయట తిప్పి తీసుకురా. నేనిప్పుడే ఫోన్ చేసి చెబుతాను. సరేనా” అన్నాడు. కుందన్ మళ్ళీ డ్రైవర్‌గా మారిపోయాడు. ‘యస్ సార్’ అని మాత్రం అని బయటకి వచ్చేసాడు. ఇప్పటికీ కుందన్ ఇంకా మామూలు మనిషి కాలేదు. ‘ఎక్కడైనా కూర్చుని హాయిగా ఓ చుక్కేసుకుందామనుకుంటే మళ్ళీ డ్యూటీ. మళ్ళీ ఊరంతా తిరగాలి. బండి తీసుకుని సాయంత్రమే వచ్చుంటే బాగుండేది’ అనుకున్నాడు కుందన్.
సేఠ్‌జీ ఇంటికి వెళ్ళి చూస్తే ఎవరూ తయారై లేరు. డ్రైవర్ వచ్చాడనే కబురు లోపలికి పంపి, వ్యాన్‌లో కూర్చున్నాడు కుందన్. సిగరెట్లు తాగుతూ ఎదురుచూడసాగాడు. కనీసం ఓ గంట గడిచాక గానీ అందరూ కిందకి రాలేదు. ముగ్గురు ఆడవాళ్ళు, ఒకాయన, చాలామంది పిల్లలు. బహుశా ఏడెనిమిది మంది. ఒక పెద్ద అమ్మాయి. వ్యాను దిగి అందరికి నమస్కారం చేసాడు కుందన్. ఎవరూ బదులివ్వలేదు. మేడమ్ ఎస్టీమ్ స్వయంగా నడపడానికి సిద్ధమైంది. ఆమె చెల్లెళ్ళు, పెద్ద అమ్మాయి, ఒకరిద్దరు పెద్ద పిల్లలు ఎస్టీమ్ ఎక్కారు. మిగతా వాళ్ళందరూ వ్యాన్ వైపు నడిచారు. తలుపులని దబదబా బాదేస్తూ తెరిచారు, పిల్లలందరూ వెనుక డోర్ తెరచి అక్కడే కూర్చోడానికి గొడవ పడుతున్నారు. కుందన్ తన సీట్లోంచి దిగి బయటకి వచ్చాడు. పిల్లలందరూ పొందికలేని బట్టల్లో ఉన్నారు. ఒకరి నిక్కర్ జారిపోతుంటే, మరొకరి టీషర్ట్ బైటికి వేలాడుతోంది. పిల్లలందరూ వెనుక కూర్చోడానికి గొడవ పడుతున్నారు. చివరికి వాళ్ళతో పాటు వచ్చిన ఆయన కొంతమంది ఇప్పుడు వెనుక కూర్చుంటే మరికొందరు వచ్చేటప్పుడు కూర్చొనేట్టు వాళ్ళకెలాగొలా నచ్చజెప్పి కూర్చోబెట్టాడు.
కుందన్ ఓ పక్కగా నిలుచుని ఇదంతా చూస్తున్నాడు. హఠాత్తుగా కుందన్ దృష్టి వ్యాన్ లోపల పడింది. పిల్లలందరూ మురికి చెప్పులతో ఎక్కి లోపలి సీట్లన్ని పాడుచేసేసారు. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఇంతలో, ‘డ్రైవర్, పోనీ’ అనే ఆదేశం వినబడింది. మౌనంగా వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. మొదటగా హాంగింగ్ గార్డెన్‌కి పోనివ్వమని చెప్పారు. ఇందాక పిల్లలకి సర్దిచెప్పిన ఆయన వచ్చి కుందన్ పక్క సీట్లో కూర్చున్నాడు. పిల్లలు అప్పటికే గొడవ గొడవ చేస్తున్నారు. ఎస్టీమ్ వెనకాలే బండి కదిలి కొంచెం ముందుకు వెళ్ళగానే, “డ్రైవర్, స్టీరియో ఆన్ చేయ్” అంటూ ఓ కుర్రాడు కరుగ్గా ఆజ్ఞాపించాడు. కుందన్ తల వెనక్కి తిప్పి చూసాడు, ఆ ఆర్డరేసిన కుర్రాడు దాదాపు గప్పూ వయసే ఉంటాడు. పొద్దున్న గప్పూ అన్న మాటలు గుర్తొచ్చాయి. ‘నాన్నా, స్టీరియో పెట్టవా?’ అంటూ ఎంత మర్యాదగా అడిగాడు! ఇంతలో ఆ కుర్రాడు “డ్రైవర్, వినబడలేదా? స్టీరియో ఆన్ చెయ్” అంటూ అరిచాడు. కుందన్ ఏం మాట్లాడకుండా స్టీరియో ఆన్ చేసాడు. పిల్లలందరు పెద్దగా అరుపులూ, కేకలూ. కనుచివర్ల నుంచి తన పక్కన కూర్చున్న ఆయన కేసి చూసాడు కుందన్. ఆయనకీ అరుపులేమీ పట్టినట్లు లేవు. హాంగింగ్ గార్డెన్ చేరేలోపు పిల్లల అరుపులూ, అసభ్యంగా ఒకరినొకరు తిట్లూ – వినలేక కుందన్ చెవులు తూట్లు పడ్డాయి. ఆ పిల్లలందరినీ అక్కడికక్కడే వీపు చిట్లగొట్టాలని కుందన్‌కి మనసు పీకింది. ఎలాగోలా తనని తాను అదుపు చేసుకున్నాడు. కొంచెం కూడా మర్యాద లేదు. అమ్మా నాన్నా వీళ్ళకేమీ నేర్పించడం లేదేమో. పిల్లల్ని ఇంత గారాబంగా ఎలా పెంచుతారో? అని అనుకున్నాడు.
హాంగింగ్ గార్డెన్ చేరగానే, పిల్లలు గబగబా బయటకి దూకి పరిగెత్తారు. మేడం, వాళ్ళ అతిధులు మెల్లగా పిల్లల వెనుకగా నడిచారు. కుందన్ మూడ్ మళ్ళీ పాడయిపోయింది. హఠాత్తుగా కుందన్‌కి గుర్తొచ్చింది మధ్యలోని సీట్‌ని పిల్లలు చాలా మురికి చేసేసారని. ఓ గుడ్డ తడిపి మురికిని రుద్ది తుడుస్తుంటే అతనికి గుర్తొచ్చింది – తన పిల్లలు ఆ సీట్లో దాదాపు మూడు గంటల పాటు కూర్చున్నా, ఒక చిన్న మరక కూడా పడలేదని. సంజయ్ సీట్‌పైన చెప్పులని ఆనిస్తేనే తను అరిచాడు. సీట్‌ని తుడుస్తుంటే – ఎందుకీ అనవసరపు శ్రమ, ఆ పిల్లలు మళ్ళీ ఎలానూ పాడుచేస్తారని అనుకున్నాడు.
అందరూ హాంగింగ్ గార్డెన్ నుంచి బయటకి వచ్చే సమయానికి ఓ కుర్రాడి డ్రెస్ పూర్తిగా మురికై పోయింది, మోకాళ్ళు గీరుకుపోయాయి. ‘ఎక్కడో పడిపోయుంటాడు’ అనుకున్నాడు కుందన్. ఇందాక తన పక్కన కూర్చున్న ఆయన ఆ కుర్రాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మాటిమాటికి తెగ బుజ్జగిస్తున్నాడు. కార్లన్నీ రెస్టారంట్ వైపుకి బయలుదేరాయి. ఆ తర్వాత అక్కడ్నించి చౌపాటీకి. ఈ సారి వ్యాన్‌లో పెద్ద అమ్మాయి ఎక్కింది. చాలా విచిత్రమైన డ్రెస్; మోకాళ్ళ దాక వచ్చే టీషర్ట్! మాసిపోయి, చిరిగిపోయున్న జీన్స్ పాంట్! కాళ్ళకి బాత్‌రూం చెప్పులు! ఆ అమ్మాయి మాటిమాటికి కళ్ళు చికిలిస్తూ చూయింగ్ గమ్ నములుతోంది. బబుల్గమ్ అంటే కుందన్‌కి అసహ్యం. ముఖ్యంగా పిల్లలు బబుల్గమ్‌ని కచాపచా నములుతూ చేసే చప్పుడంటే మరీ చిరాకు. పైగా ఇప్పుడు ఆ పిల్ల ఆ బబుల్గమ్ కార్లో అంటిస్తుందేమోనన్న భయం ఒకటి.
కుందన్ భయం నిజమైంది. చౌపాటీలో దిగేటప్పుడు ఆ అమ్మాయి నోట్లో చూయింగ్ గమ్ లేదు. అందరు ముందుకు వెళ్ళగానే, కుందన్ చటుకున్న మధ్య సీట్లోకి తొంగి చూసాడు. చూయింగ్ గమ్ వ్యాన్ తలుపు ఫోమ్‌కి అతికించబడి ఉంది. కుందన్ ముఖం వివర్ణమైంది. ఓ ఇటుకరాయితో ఆ పిల్ల తలమీద ఒక్కటిద్దామనుకున్నాడు. ‘ఈ పిల్లల కంటే నా పిల్లలు ఎన్నో రెట్లు నయం. నేనెంత ఫాల్తూగాణ్ణి, అనవసరంగా పొద్దున్నుంచి వాళ్ళకి మర్యాద తెలియదంటూ తిట్టాను’ అనుకున్నాడు. తన మీద తనకే సిగ్గేసింది కుందన్‌కి. మౌనంగా వచ్చి తన సీట్లో కూర్చుని అద్దం కిందకి దించుకున్నాడు. ఒక్కసారిగా ఉదాసీనంగా అయిపోయాడు. ఆ ప్రపంచం గురించి ఎంత భ్రమలో ఉన్నాడో పూర్తిగా తెలిసొచ్చింది.
అప్పుడే నిశ్చయించుకున్నాడు కుందన్ – ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలకు బోల్డన్ని చిరుతిళ్ళు, బొమ్మలు కొనుక్కొని తీసుకువెళ్ళాలని!
[హిందీ మూలం: సూరజ్ ప్రకాశ్ కథ ఫర్క్. వారి ఇతర కథలన్నీ వారి వెబ్‌సైట్‌లో ఉన్నాయి.]