6. వచన పద్యం: వాద సమాపనం

కాగా, వృత్తాదులయిన అన్ని రకాల పద్యాల్లోనూ అంతర్నిర్మాణం కవికి, బాహ్య నిర్మాణం లక్షణానికి సంబంధించింది. బాహ్య నిర్మాణాన్ని లక్షణం సాధిస్తుంది. దాన్ని మన్నిస్తూ కవి అంతర్నిర్మాణం, అందులో వైవిధ్యం సాధిస్తాడు. కాగా వచన పద్యానిక్కూడా లక్షణ పరంగా బాహ్య నిర్మాణమూ, కవి పరంగా అంతర్నిర్మాణమూ ఉంటాయి.

మరి భావగణాల స్వరూపం –

భావగణంలో ‘గణ’మన్నది ఔపచారికంగా ప్రయుక్తమనీ, భావగణమంటే భావాంశమనీ మొదటినుంచీ స్పష్టమే. ఈ రెండూ, పర్యాయ పదాలుగా ఇకముందు గూడా ప్రయుక్తమయితయి.

భావాన్ని సమగ్రపరిచేదీ, పరిపుష్టం చేసేదీ భావాంశం. మనోవికారమే భావం. అది మనసులో కల్గుతున్నది. అది అభివ్యక్తం కావటానికి సాధనం భాష. మనస్సులో కల్గిన భావం వివిధ పదాలను అనువుగా సంపాదించుకుంటూ, వాటి పొసగే ఒక క్రమీకృతి ద్వారా తన నభివ్యక్తం చేసుకుంటుంది. అది వ్యక్తమయినాక సాధనమయిన భాష తన పాత్ర విరమిస్తుంది. మిగిలేది మళ్ళా భావమే. అది దాని స్వరూప స్వభావాలను బట్టి కొన్ని అంశాలుగా విభక్తం కావచ్చు, కాకపోవచ్చు. విభక్తమయితే, అవి భావాంశాలు – భావగణాలు – భావాంశాల తోడి భావం. విభక్తం కాకుంటే, ఏకాండ భావం. ఈ భావాంశాల విభజన సువ్యక్తం కావటానికి మళ్ళీ భాషే సాధనం. వ్యక్తమయినాక మళ్ళీ ఆ భాష తన పాత్ర విరమించుకుంటున్నది. భావాభివ్యక్తి లేదా భావబోధ జరిగిం తరువాత బోధపడిన భావాన్ననుసరించి సాధమయిన భాష – వాక్యంలోని వివిధ పదాలను విభజించి, వాటి సంబంధాన్ని గుర్తించి – తదనుక్రమాన్ని, స్వరూపాన్ని నిర్ణయించుకోవటం జరుగుతుంది. దీన్నే తిరగేసి చెప్పితే, వాక్యంలోని పరస్పర సంబంధాలూ, పదాలూ, తదనుక్రమం ద్వారా భావబోధ జరుగుతుంది. ఇట్లా చెప్పటం వ్యాకరణం. కాగా, సాధనమయిన భాష యొక్క అంశాలను వింగడించి, వాటి సంబంధాలను భావబోధ ననుసరించి వింగడించే వ్యాకరణానికీ-భావబోధకూ, అంటే భావస్ఫూర్తికీ అవినాభావ సంబంధమని రామారావుగారనటం ఇందుకే. అందుకభ్యంతరం ఎవ్వరికీ ఉండనక్కర లేదు. అయితే, నేను భావం వైపు నుంచయితే, ఆయన వ్యాకరణం వైపు నుంచి సాగుతున్నారు. నేను ‘భావగణా’లంటే ఆయన వ్యాకరణ గణా’లంటున్నారు. మరి ఈ భావబోధ కలిగినాక, వ్యాకరణం స్థితి ఏమిటి?

సాధ్యవిషయాన్ని సాధించటంలో ఉపయోగపడే సాధనానికి ఉన్న ప్రాధాన్యం, ఆ విషయం సాధింపబడిన తరువాత ఉండదు. దాని ఉనికి కనిపిస్తున్నా అది గౌణమే అవుతుంది. అప్పుడు సాధింపబడ్డ విషయానికే ప్రాధాన్యం. అంటే, సాధ్యమయిన భావం సాధింపబడినాక సాధనమయిన భాషకు ప్రాధాన్యముండదు. సాధింపబడ్డ భావానికే ప్రాధాన్యముంటుంది. ఇక, ఈ సాధింపబడిన భావం ద్వారా సాధింపబడే మరొక దానికి ఆ భావమే సాధనమయితుంది గాని, తద్భావసాధనలో సాధనమయిన భాష గానీ, తద్విషయిక వ్యాకరణం గానీ కాదు. ఈ విషయాన్ని సూచించేందుకే గతంలో నేను ‘అర్థాలంకారాల’ ప్రసక్తి తెచ్చింది. అంతేకాని, వాటిలో పాదవిభజన ఉంటుందని కాదు. రామారావుగారు విస్తరించినట్టు, అది ఏ భాషయినా, ఏ ప్రక్రియయినా, ఎట్లాంటి వాక్యమయినా కావచ్చు, అర్థబోధ కలిగినాక ఆ భాషా-ప్రక్రియా-వాక్యాల ప్రాధాన్యం పోతుంది. మిగిలిన, బోధపడిన అర్థమే ప్రధానం. దానిద్వారా సాధ్యమయ్యే అలంకారానికి ఆ అర్థమే సాధనంగాని, తదర్థ బోధ సాధనమయిన వ్యాకరణ సంబంధాలు కాదు. కాబట్టే, అవి అర్థాలంకారాలు. ఆ ప్రసక్తి కంతవరకే తాత్పర్యం. ‘శబ్దరూప ప్రాధాన్యం లేదన్న వాక్యవ్యవస్థను బట్టి (అర్థ) అలంకారం మారక’ పోవటానిక్కారణం, ఆ అలంకారం అర్థాన్నాశ్రయించిందే తప్ప, శబ్దరూపాల వాక్య వ్యవస్థ నాశ్రయించక పోవటమే. కాగా, బోధపడిన భావం అంశాలుగా విభక్తయితే అవి భావాంశాలు – భావగణాలు అయితయే గాని, ఆ భావబోధ సాధనమయిన వ్యాకరణ సంబంధాలూ, అంశాలూ లేదా ‘వ్యాకరణ గణాలూ’ కావు.

అయితే, భావ-భావాంశాలు వ్యక్తస్థితిలోనే ఉండాలె కాబట్టి, వాటి కాధారంగా ఎప్పుడూ భాష-పదాలు, తత్సంబంధి వ్యాకరణ సంబంధాలూ ఉంటూనే ఉంటయి. అందువల్లే, భావ-భావాంశాలను వ్యక్త స్థితిలో గుర్తుపట్టటానికి, నిరూపించుకోవటానికి మళ్ళీ భాష-పదాలు-తత్సంబంధి వ్యాకరణ సంబంధాలు సాధనమయితున్నయి. పదాల – వాక్యోపవాక్యాదుల ఉనికి అవసరమయితున్నది. భావ-భావాంశాల వ్యక్తి, గుర్తింపు తరువాత ఇవి ప్రధానమయి, అవి గౌణమయి పోతున్నయి. కాగా, భాష-పదాలు-వ్యాకరణ సంబంధాలు భావ-భావాంశ వ్యక్తికి ఆధారాలు, గుర్తింపు సాధనాలు మాత్రమే తప్ప అవే భావ-భావాంశాలు కావు. అందువల్ల, భాషా-పద-వ్యాకరణ సంబంధాలు ఆధారాలుగా, సాధనాలుగా ప్రత్యక్షమయితూ ఉన్నా గూడా భావ-భావాంశాల ప్రత్యేక స్థితికి క్షతి లేదు. సాధనం సాధనమే, సాధ్యం సాధ్యమే. రెండూ ఒకటి కావు. వీటిలోని సాధ్య-సాధన సంబంధం అవినాభావం కావచ్చు. సాధనమయిన భాష-పదాలు-వ్యాకరణ సంబంధాలు ఫిజికల్ రియాలిటీ అయితే, భావ-భావాంశాలు సైకలాజికల్ రియాలిటీ.

భావ-భావాంశాలంటే ఏమిటో చెప్పటమయింది కాబట్టి, ఇక అవి ఎట్లా స్పష్టపడుతాయో, ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు.

భూకంపం వచ్చిందన్నా
మరో యుద్ధం రేగిందన్నా
తన భార్య కవలల్ని కన్నదన్నా
కంగారుపడక కోటు తొడుక్కొని
కోటీశ్వరరావు ఆఫీసు కెళతాడు, వస్తాడు

– గొంగళి పురుగులు, బాల గంగాధర తిలక్, ‘కవిత’ – సంపా. అబ్బూరి ఛాయాదేవి.

తిలక్ బతికున్న రోజుల్లోనే ఇది వెలువడింది. – ఈ విధమయిన పాదవిభజన తోనే. ఇందులో భావమేమిటి? భావాంశాలేమిటి? ఇందులో భావాంశాలు – భావగణాలు ఎట్లా గుర్తు పట్టటం? కోటీశ్వరరావు నిజం వ్యక్తి కాదు. గుమస్తా జీవితానికి ప్రతీక. ఆఫీసుకెళ్ళటం – రావటం అంతే ఆ జీవితం. చివరి పాదం జీవిత స్వరూపాన్ని వ్యక్తం చేస్తున్నది. ఆ జీవితం అలా రొటీన్‌గా సాగిపోవలిసిందే. నాల్గోపాదం అది రొటీన్ అనే అంశాన్ని – కంగారుపడక కోటు తొడుక్కోవటం – ద్వారా వ్యక్తం చేస్తున్నది. ఇది చివరి పాదంలో భావాన్ని సమగ్రం చేస్తున్నది. ఈ రొటీన్ జీవితంలో ఏదేమయినా, ఏ మార్పు జరగదనటానికి మొదటి మూడు పాదాల్లోని అంశాలు పరిపుష్టి కలిగిస్తున్నయి. ఈ పరిపోషించే, సమగ్రపరిచే లక్షణం చేత మొదటి నాల్గు పాదాల్లో వ్యక్తమయినయి భావాంశాలు – భావగణాలయితున్నయి. కాగా, ఒక భావాన్ని సమగ్రపరచటం, పరిపుష్టి కలిగించటం అనే లక్షణం ద్వారా భావగణాలను గుర్తుపట్టవలసి ఉంటుంది. అంటే, భావగణాలు భావ పరిణామాన్ని విస్తరింపజేస్తూ దాని ప్రభావక శక్తిని పెంచుతయి. ఇక్కడ పాదవిభజనను ‘గైడ్’ చేస్తున్నది భావ-భావాంశాలే గానీ, వాక్యోపవాక్యాలు కావు. అవే అయితే నాల్గో పాదం ‘తొడుక్కొని’తో పూర్తి కాదు. కాని, అయింది – అది సమగ్రపరిచే భావాంశాన్ని వ్యక్తం చేస్తున్నది కాబట్టి. అయితే, ఇది అక్షరాదుల లెక్కల ద్వారా పాదం గుర్తించినంత తేలిక కాకపోవచ్చు. కాని, ఈ పద్ధతి కలవాటుపడితే ఇది సుగమం కాకపోదు. వచన పద్య నిర్మాత ఈ పద్ధతి కలవాటుపడి వచన పద్యం రచిస్తే, పరిశీలకుడూ ఇదే పద్ధతి కలవాటుపడి వచన పద్యాన్ని పరిశీలిస్తే, ఉభయత్రా పద్ధతిలోని ఏకత్వానికి ఐక్యత వల్ల వచన పద్య స్వరూప విచారణ నిష్కృష్తమయితుంది. అట్లా కాక, ఉభయులూ ఎవరికి వారేగా ఒక పద్ధతి ననుసరించక పోయినప్పుడే కన్‌ఫ్యూజన్ కలుగుతున్నది. అందుకే ఉభయులకూ నిర్దేశకమయిన ఒక లక్షణం ఏర్పడటానికే మొదటినుంచీ నా ప్రయత్నం.

ఇక చివరి అంశానికొస్తే –

నిజానికి వచన పద్యాన్ని వచనం నుంచి వేరు చేసేది దాని పాదాలే గాని, భావగణాలు కాదు. సాంప్రదాయికంగా అనువర్తించే పద్యాల్లోనూ ఇంతే. ప్రతి పాదాన్నీ భ-జ-సాది గణాలుగా విభజించవచ్చు. కాని, పాదాల నిర్మాణం మాత్రమే పద్యాన్ని వచనం నుంచి వేరు చేయగలుగుతున్నది. ‘…పదక్షరాలలోపునే ఉన్న పాదపరిమితి పాటిస్తూ విషమ వృత్తాలు సృష్టించవచ్చు గాని, పాదాంత విరామం, ప్రాసమైత్రి గాని దెబ్బ తినకుండా ఒక వ్యాసాన్ని వృత్తంగా నిరూపించటం సాధ్యమయితుందనుకోను’ అన్నారు రామారావుగారు. కాని, పాదాంత విరామం తెలుగులో లేదు. ప్రాసమైత్రి సంస్కృతంలో లేదు. ఈ రెండు నియమాలు లేకుండా తెలుగులో ‘దూతమత్తేభం’ (రాయప్రోలు), ‘చిత్రాంగద’ (మల్లవరపు) రచించబడ్డాయి. ఇక్కడ పాద పరిమితే ప్రధానమయింది – ఇది తప్ప మిగతావన్నీ ఐచ్ఛిక నియమాలు కాబట్టి.

ఇక, భావ-భావాంశాలుగా విభజిస్తే వచనం పద్యం కాదు. అట్లాంటివి చాలామంది వచన పద్య ప్రయోక్తలు వచన పద్యాలు కాని వాటిని గూర్చి అంటున్నట్టు ‘వచనపు తుంటల పేర్పులే’ అయితయి. కాగా, వచన పద్య పాదాల్లో ఉండే భావభార సమత్వం వ్యాసాన్ని విభజించడం వల్ల ఏర్పడే ముక్కల్లో ఉండదు. ఈ భావభార సమత్వం వచన పద్యాల ఆదియందో, అంతమందో ఉపయుక్తమయ్యే అనుకూల – వ్యతిరేక భావస్ఫోరక పదాల నియత ప్రయోగంతో వ్యక్తమయితుంది. ద్వంద్వాలను వ్యక్తం చేసే పదాలు ఉభయపాదాల్లో ఒకటొకటిగా ఉండటం ద్వారా వ్యక్తమవుతుంది. ఇదిట్లా ఉండగా, బండి నాగరాజుగారన్నట్టు (చూ. అనుబంధం) వారు చెప్పిన మాత్రా సమత్వ విషయం అట్లా ఉంచితే, అంత్యప్రాసలు తోడ్పడతయి. ఇంకా పాదాద్యక్షరాల యతిప్రయోగం వల్లా, ప్రాసల వల్లా కూడా వచన పద్య పాదాలు వచనం నుంచి భేదిస్తయి. సాంప్రదాయిక పద్యాల్లో పద్య పాదానికి యతి ప్రాస నియమాలున్నట్టు నియామకాలయితున్నట్టు వచన పద్యంలోనూ కావటానికి అభ్యంతరం లేదు. భావగణాలు భావపరిమితిని సూచిస్తయి. ఒకే భావగణం ఒకే పాదంలోంచి తరువాత పాదంలోకి వ్యాపించగూడదని, పాదానికి పాదాంత విరామం తప్పనిసరి అని – ఈ విధంగా అవి సూచిస్తయి. అయితే, ఈ వివిధ నియమాలను పరిశీలించి, అనువుగా కొన్నిటిని నియతం చేసి, ఉదాహరణ పూర్వకంగా (ఇక్కడ అంతటి అవకాశం లేదు గాని) ప్రదర్శిస్తే, ఈ అంశాలన్నీ సువ్యక్తమవుతయి. ఈ విధమైన నియమాల పాటింపు వచన పద్య పాద నిర్మాణంలో వచనం కన్నా ‘అసాధారణ’త్వాన్ని సంపాదిస్తయి. శ్రీశ్రీ, కుందుర్తి, తిలక్ మొదలయినవారి వచన పద్యాల్లో ఈ విధమయిన వివిధ విధాల నియమాల పాటింపు వల్ల కలిగిన అసాధారణత్వం పరిశీలించుకోవచ్చు. వచన పద్యంలో వాక్య నిర్మాణ దృష్ట్యా అసాధారణత్వం సాధించటానికి రామారావుగారు ఆలోచిస్తున్నట్టుగా – ఆ రీతిలో ‘కొన్ని కొత్త విషయాలు’ నిష్పన్నమయితే వాటిని గూర్చి కూడా తరువాత పరిశీలించవచ్చు. కాగా, శుద్ధవచనమయిన వ్యాసం యథాతాథ రూపంలో వచన పద్య పాదాలుగా విభక్తం కాదనీ, వచన పద్య పాద నిర్మాణానికి విశేష లక్షణాలు వచనం నుంచి అసాధారణత్వాన్ని సంతరించుకుంటయనీ, ఇవన్నీ వివరంగా నిరూపించుకోదగిన అంశాలని మాత్రమే ప్రస్తుతానికి భావించవలసి ఉంటుంది.

వచన పద్యానికి టెంటటివ్‌గా ఒక లక్షణం ప్రతిపాదిస్తాను.

1.వచన పద్యానికి నాలుగు పాదాలు. అంతకన్నా ఎక్కువయితే మాలా వచన పద్యం. తక్కువయితే త్రిపాదాదులు.
2.భావంతో గాని, భావగణాలతో గాని పాదాలేర్పడుతయి.
3.ఒక పాదంలో ఒక భావం గాని, ఒకటి లేదా రెండు భావగణాలు గాని ఉంటయి.
4.ఈ భావగణాలు ఒక పాదంలోంచి మరో పాదంలోకి వ్యాపించవు.
5.భావంతో గాని భావాంశంతో గాని పాదం ముగుస్తుంది. పాదాంత విశ్రాంతి ఉంటుంది.
6.పాదాద్యక్షరాలకు యతి గాని, ప్రాస-అంత్య ప్రాసలు గాని, అనుకూల-వ్యతిరేక భావ సూచక పదాలు గాని పాదాల భావభార సమత్వం కోసం ప్రయుక్తమయితయి.
వచన పద్యం ఆద్యంతంగా భావాలతో ఉంటే ఆ రకంవి ఒక వర్గం, భావగణాలతోనే ఉంటే రెండో వర్గం; వీటి కలగలుపుగా ఉంటే మూడో వర్గం. పాదాల్లో ఉండే భావగణాల సంఖ్యను బట్టి, కలగలుపులోని భేదాలను బట్టి, పాద సంఖ్యను బట్టి ఈ వర్గాల్లో వివిధ స్వరూపాలు నిష్పన్నమయితయి. ఈ ధోరణిలో ప్రయత్నిస్తే ఒక ‘సిస్టం’ నిర్ధారిత మయితుంది.

చివరి మాట –

వచన పద్యానికి నేను చెప్పిన లక్షణమే లక్షణం కావాల్నని గాని, కేవలం ఇది మాత్రమే నిర్దిష్టమయిందని కాని వాదించే అతిశయం నాకు లేదు. నాకు స్ఫురించిన ఒక పద్ధతిని సూచించటం మాత్రమే నా తాత్పర్యం. దీన్ని బహుధా చర్చించి మార్పులు, చేర్పులు చేసి ముందు ముందు నిష్కృష్టమయిన లక్షణం రూపొందవచ్చు. లేదా మరో పద్ధతిలో లక్షణం రూపొందవచ్చు. ఎట్లా అయినా నా కభ్యంతరం లేదు. అది నాకు సంతోషకరం. అయితే చిట్టచివరిగా ఒకటే నా మనవి. వచన పద్యం ‘పద్యం’. ఈ అంశం కాదంటూ, మరచిపోతూ ఎంతగా వచనపద్యాన్ని గూర్చి ఆలోచించినా లాభం లేదు. వచన పద్యం ‘పద్యం’ అని మరచిపోవటం నా సాధ్యం కాదు.

(భారతి, సెప్టెంబరు 1978.)


వచన పద్యం: లక్షణ చర్చ – ఉపయుక్త గ్రంథ, వ్యాస సూచి.

వచన పద్యం: ఒక పరిశీలన – బండి నాగరాజు. వచన పద్యం లక్షణ చర్చకు అనుబంధ వ్యాసం.