తొలీత గురుస్వామి మొకము చూచిన్నాడు
వెతికింది దొరికిందిర దద్దా అనుక్కున్నాను.
పెరడు తవ్వినోడికి లంకెబిందెల్లాగ –
ఎదురుచూడ్డాలంటె ఇలాగే గావాల.
మలీత సద్గురుడు కబురు పెట్టిన్నాడు
ఎందుకొచ్చిన గొల్లని ఎనక్కొచ్చీసేను.
దొంగ ఠానా ముందు దడుసుకున్నట్టుగ –
మోజూరితనమంటే ఇలాగే గావాల.
ఈసుట్టు ఆయనే ఎదురొచ్చినప్పుడు
‘ఏఁటి సోదరా? కులాసా?’ అని పలకరిస్తున్నాను.
గుడిమీద పావురాలు కూకుడున్నట్టుగ –
మనం మనం బరంపురం ఇలాగే గావాల.
తొన్నాడు గురువరుని బోధనలు వినుకోని
ఆచరించవలెనని ఆత్రపడిపోయేను.
లంఖణాల రోగికి వడ్డించినట్టుగ –
ఆశ లావు పీక సన్నం ఇలాగే గావాల.
మీదటికి వచనములు వల్లించి వల్లించి
నమ్ముదునా మానుదునా రవ్వ పడిపోయేను.
సంధిలో జడుపొచ్చి సణుక్కున్నట్టుగ –
పెరటి చెట్టు మందంటె ఇలాగే గావాల.
ఈపాలి తత్వములు చదవొచ్చినప్పుడు
ఒళ్ళు కంపరమెత్తి లెగిసెళ్ళిపోతాను.
ఒద్దన్న సీడేదొ వెంట తరుముతునట్టు –
ఇంక చాలు సోదరా అంటె ఇలాగే గావాల.
ఒక్కడివె ఒక్కాడ నిలువుమని గురుడంటె
ఒళ్ళు మరిచిపోయి ఒచ్చి కూకున్నాను.
తిరిగి తిరిగి ఇంట్లోకే తిరిగొచ్చినట్టుగ –
స్వాగతం క్రిష్ణా అంటె ఇలాగే గావాల.
రాన్రాను ఒక్కణ్ణి ఒసిలి కూకోనుండి
ఉండబట్టలేక ఉలుకులికి పడ్డాను.
వొగిసిందాయి వీధిలోకి వొచ్చెల్లినట్టుగ –
వగలాడితనమంటె ఇలాగే గావాల.
ఈనడుమ ఒక్కణ్ణి ఇమ్ముకోనుంటేను
ఇంకేటికావాలని ఇచ్చగించుకుంటాను.
ముసిలి బేపి చూరు కింద మిడుకుతున్నట్టుగ –
సచ్చిన కుక్కలాగంటె ఇలాగే గావాల.
కార్తీక దీక్షలకి తావళము రప్పించి
తెల్లారి తెములుకుని కోవిల్లకెళ్ళేను.
బాలెంతరాలు పిల్లి ఏడిళ్ళు తిరిగినట్టు –
కొత్త పూజారంటె ఇలాగే గావాల.
మీదటికి స్నానాలకెల్దాము రమ్మంటె
మాటా పలుకూ లేక టక్కు పెట్టీసేను.
ఊరుగాని ఊర్లోన ఉష్టపడ్డట్టుగ –
మల్లగుల్లాలంటె ఇలాగే గావాల.
ఈయేడు కార్తీక నెత్తాళ్ళకంటేను
తల తిరిగినట్టయ్యి తప్పుకోనెల్తాను.
అప్పులోడ్ని కనిపెట్టి తప్పించుకున్నట్టు –
నామాన్నేనంటె ఇలాగే గావాల.
తొన్నాడు మఠములో పంచాక్షరీ అంటె
పులకించి కనుమూసి మఠమేసుకున్నాను.
పెళ్ళిచూపుల్లోన చూపు కలిపినట్టుగ –
తత్వార్ధ సాధనము ఇలాగే గావాల.
మీదటికి ధ్యానమని పిలిసి కూకుంటేను
వాత నొప్పులు తగిలి ఉష్టబెట్టుకున్నాను.
నడవలేనోడికి బరువులెత్తినట్టుగ –
ఆరంభ శవుర్యము ఇలాగే గావాల.
ఇవ్వాళ ధ్యానమని గురుడు దండిస్తేను
ఒగ్గడియ కూకోని లెగిసెళ్ళిపోతాను.
నట్టింట పాదరసం జారిపోయినట్టుగ –
ఉన్నకాడె ఉండంటె ఇలాగే గావాల.
నీతి చంద్రిక నీను తొలిసుట్టు విన్నప్పుడు
కట్టీసినట్టయ్యి కష్టపెట్టుకున్నాను.
అడివి దున్నకి తెచ్చి పలుపు కట్టినట్టుగ –
అల్లడ తల్లడంటె ఇలాగే గావాల.
మీదటికి నీతులు నియమములు వినుకోని
నా చిత్తానుసారమే నీనుందుననుకున్నాను.
కన్ని తెంచుకు పశువు కలదిరుగుతున్నట్టు –
నీతీ జాతి లేదంటె ఇలాగే గావాల.
ఈయేడు యమ నియమ ధర్మములు చవులుగొని
ఇందలేటున్నాయి బంధనాలన్నాను.
వెలయాలు ఒళ్ళిరిసి వెక్కిరించినట్టుగ –
మబ్బు విడిసిన ఎండంటె ఇలాగే గావాల.
శ్రీచక్ర యోగమని తత్వగురుడంటేను
గొప్ప సాధనమని బోధించుకున్నాను.
మిండగాడు పొద్దుగాల మిడిసి కూకున్నట్టు –
పెద్దవారి ఎచ్చులంటె ఇలాగే గావాల.
శివ తత్వ మార్గమని స్వామి రమ్మంటేను
ఇంకెంత దూరమని ఇదిలించుకున్నాను.
ఈవొడ్డుకావొడ్డు అవుపించనట్టుగ –
అవ్వా బువ్వా అంటె ఇలాగే గావాల.
ఎటు దుక్కు వెల్దుమని ఇప్పుడడిగిన తెన్ను
ఎక్కడికీ ఒద్దురని నిలవరించుకుంటాను.
తెల్లారిపోనిచ్చి దొంగ పడుకున్నట్టు –
ఉడిగిపోవడమంటె ఇలాగే గావాల.
మునుపు సభలోకొచ్చి మాట్లాడమంటేను
తెలివైన వోడినని కులికి మాటాడేను.
అందగత్తె అలాగిలా తిప్పుకోనెల్లినట్టు –
కంచు మోగడమంటె ఇలాగే గావాల.
పడిపూజ భాషణము శెలవియ్యమంటేను
పలుమార్లు వల్లించి విసిగిపోతున్నాను.
గుడ్డోడూ గుడ్డోడూ గెడ్డలో పడ్డట్టు –
పాడిందే పాటంటె ఇలాగే గావాల.
ఈపాలి అచలమును చదవ రమ్మంటేను
హద్దు మీరగలేక అట్టె నిలుచున్నాను.
పంజరములో చిలక పలుకాడబోనట్టు –
ఏమి చెప్పుదునంటె ఇలాగే గావాల.
ఆనాడు వాదములు తలకెత్తుకున్నప్పుడు
అడ్డు చెప్పినవాని అడకించి పంపేను.
ఆవిటికి పుంజుల్ని బరి దించినట్టుగ –
కాలు దువ్వడమంటె ఇలాగే గావాల.
అటుమీద వాదులకి కబురొచ్చినప్పుడు
వాదముల వెనకున్న మర్మములు వెదికేను.
తగుమనిషి సాక్షుల్ని తరచి రమ్మన్నట్టు –
ఆలకించడమంటె ఇలాగే గావాల.
ఈనాడు తగువులకి బయలెళ్ళినప్పుడు
విన్న మాటలనెల్ల విడిసి వస్తున్నాను.
వెర్రోడు ఆడకనే ఈడిగిలినట్టుగ –
అంతా కులాసంటె ఇలాగే గావాల.
శాస్త్ర పాఠములనుచు సదవ పిలిసిన్నాడు
నేర్చింది టక టకా వల్లించి చూపేను.
గెడసాని తాడెక్కి కేళించుకున్నట్టు –
బతక నేర్వడమంటె ఇలాగే గావాల.
మీదటికి కీర్తనము రాయబిలిసిన్నాడు
మాట మీద మాటల్లి మర్యాద చూపేను.
పూస మీద పూసల్లి పలకసర్లయినట్టు –
మాటకారితనమంటె ఇలాగే గావాల.
ఇటుపైన పాసురము ఇవరించమన్నపుడు
ఇనిపించుకోనట్టు బిగదీసుకున్నాను.
చెవిటి శంఖము మోత లెక్కింపనట్టుగ –
అచల యోగమ్మంటె ఇలాగే గావాల.
అలనాడు నేస్తుల్ని కలవబోయిన్నాడు
నువ్వా నేన్రా యని బిగదీసుకున్నాను.
కినుకతో కాడెడ్లు జట్టీకి దిగినట్టు –
నువ్వెంతంటె నువ్వెంతంటె ఇలాగే గావాల.
మీదటికి మిత్రులము మళ్ళి కలిసిన్నాడు
‘పిల్లా పాప కులాసా మిత్రమా?’ అన్నాను.
ముసిలి పేరంటాలు మురుసుకున్నట్టుగ –
ఇందమ్మంటె అందమ్మంటె ఇలాగే గావాల.
ఈసుట్టు చుట్టాలు పక్కాలు దిగినపుడు
లేనట్టు పెరటి తిన్న పైకి సుణిగీసేను.
పెళ్ళింట కుష్టోడు వెలి పెట్టుకున్నట్టు –
ఏక్ నిరంజన్ అంటె ఇలాగే గావాల.
వొయసులో జేబీల డబ్బులాడిన్నాడు
పద్దు లెక్కించుకుని పదిలముగ వున్నాను.
దసరాకి కుర్రోలు దండుకున్నట్టుగ –
నడమంత్రం కురుపంటె ఇలాగే కావాల.
ముందటికి ఆర్జితము మదుపు చేసిన్నాడు
ఎంతకీ చాలదని ఆత్రపడిపోయేను.
గంపలోనికి నూని ధార కడుతున్నట్టు –
ఊరంత ఆశంటె ఇలాగే గావాల.
ఈనాడు జీతాలు లెక్క సరిచూసుకుని
ఎందుకీ చందమని ఎనకడుగు వేస్తాను.
ఎత్తలేని పెత్తనము నెత్తి దింపుకున్నట్టు –
బోడిగుండు సుఖమంటె ఇలాగే గావాల.
నౌకర్లు చాకర్లు కొలువు కుదిరిన్నాడు
రాచోరి బిడ్డవలె బిగదీసుకున్నాను.
కొలువు కూటము లోన కొత్వాలునైనట్టు –
రాజాం పెద్దంటె ఇలాగే గావాల.
మీదటికి నౌకర్లు పనులకొచ్చిన్నాడు
నా పదవి పోయిన తీరు చిన్నబుచ్చుకున్నాను.
పాలుమాలిన కోతి పేలు చిక్కునన్నట్టు –
పన్లేని పాటంటె ఇలాగే గావాల.
ఈయేడు పనివాళ్ళు తలుపుకొట్టిన్నాడు
ఇంకొద్దు ఎల్లమని బూకరించుకున్నాను.
ఇల్లు తాళం పెట్టి ఇంక శెలవన్నట్టు –
ఎవుల్దాల్దే సోదరా అంటె ఇలాగే గావాల.
తొల్దొలుత కుర్రోలు గురువుగారంటేను
ఇనుకోండి విషయమని అతిశయము చూపేను.
బంట్రోతు నాయకుని పదవందుకున్నట్టు –
చెబాస్ మిత్రమా అంటె ఇలాగే గావాల.
ముందటికి శిష్యులని దండాలు పెడితేను
దీవించి సర్దుకొని సేవందుకున్నాను.
నలుగురాడే చోట నిగిడి కూకున్నట్టు –
జాగా కొద్దీ బైఠో అంటె ఇలాగే కావాల.
ఇవాళ్రేపు ఎవలొచ్చి గురువుగారంటేను
ఎల్లండెల్లండని యెంటపడి తిడతాను.
దేవులాడు జీవాల్ని తరిమికొట్టీటట్టు –
రాళ్ళిసరడాలంటె ఇలాగే గావాల.
[హెర్బెర్ట్ గ్యుంథర్ (Herbert V. Guenther) ఆంగ్లానువాదం ద్వారా, పాత్రుల్ రింపోచే (Patrul Rinpoche; 1808-87) వ్రాసిన చేజ్ దెమ్ అవే! (Chase them away!) ఆధారంగా]