భవబంధాల సాక్షిగా…

“హే, కాన్ట్ కం టుడే… నాట్ వెల్” – కొలీగ్ కి ఎసెమ్మెస్ చేసి ఆలోచనలో పడింది ప్రత్యూష. ఆమె మనసంతా అశాంతిగా ఉంది వారం రోజులుగా. తన కలలకీ, వాస్తవానికి మధ్య దూరం చాలా పెరిగిపోతున్నట్లు అనిపిస్తోంది. ఎవరితోనూ మాట్లాడాలి అనిపించట్లేదు, ఎవర్నీ కలవాలి అనిపించట్లేదు. తనేమిటో, తన పనేంటో – అంతే! ఇలాగే ఉంది వాలకం. బుద్ధి పుడితే ఆన్లైన్ వెళ్ళి ఎవరన్నా పలకరిస్తే జవాబివ్వడం లేదంటే సైనవుట్ అవడం. ఫోను ఇరవై నాలుగ్గంటలూ సైలెంట్ మోడ్ లో హ్యాండ్‍బ్యాగ్ లో ఓ మూల పడి ఉంటోంది. పొద్దున్నోసారీ, రాత్రోసారి ఫోన్ చూస్కుని, ఉన్న కాల్స్‌లో అమ్మదో, నాన్నదో ఉంటే, మూడుంటే ఓసారి డయల్ చేసి ‘బ్రతికే ఉన్నా’ అన్నట్లుగా ముక్తసరిగా మాట్లాడటం, బై చెప్పేయడం. “ఏమిటే, ఎందుకలా ఉన్నావు?” అని అడిగిన ప్రతిసారీ – “పని ఎక్కువగా ఉంది” అని బొంకడం. చివరికి మనుష్యులతో ఆమాత్రం మాట్లాడటం కూడా విసుగు పుట్టేసింది తనకి. రోజంతా ఎవరికీ కనబడకుండా దాక్కుని, మాట్లాడాలా వద్దా.. మాట్లాడాలా వద్దా అని కాసేపు తటపటాయించడం, మాట్లాడకుండా ఆగిపోవడం – ఇలాగే ఉండింది. ఆఫీసులోనూ ఎవరితోనూ సరిగా మాట్లాడకపోయేసరికి అభిరామి అడిగింది కూడా – “ఆర్యూ ఓకే?” అని.

“ఆర్యూ ఓకే?” అన్నది ఎంత చెత్త ప్రశ్న అసలు? ఓకే? అంటే ఏ విధంగా ఓకే? అవతలివాళ్ళతో మాట్లాడకపోతే నాటోకే నా? అసలు మనతో మనమే మాట్లాడలేని పరిస్థితుల్లో అవతలివాళ్ళతో మాట్లాడగలిగితే అప్పుడు మనం ఓకే అన్నట్లేనా? అంటే, ‘నాటోకే’ అంటే, అవతలి వాళ్ళతో మన సంబంధాల పరంగా మాత్రమేనా? అసలు వాళ్ళతో సక్రమంగా ప్రవర్తించినంత వరకూ అవతలివాళ్ళకి మనలోని సంఘర్షణలు పట్టనక్కర్లేదా? అసలు అవతలివాళ్ళతో మనం ‘ఓకే’ గా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది? – “ఛ! ఏమిటీ పిచ్చి వాదం!” తనని తానే విసుక్కుంది ప్రత్యూష.

ఇలా బయట వెలుగే ఉన్నా, గదిలోపలి తన లోపలి చీకటిలో, ఒంటరిగా కూర్చుని ఉండటంతో – మనసు మేనేజర్ డ్యూటీకి దిగింది.

“పని మానేసి ఏమిటిది?”

“ఆఫీసులో చేసేదే పనా?” ప్రత్యూష జవాబు.

“ఇప్పుడసలు నువ్వేమీ చేయట్లేదు కదా…”

“ఏం చేస్తే నీకు చేసినట్లనిపిస్తుంది? అసలెప్పుడూ అవతలివాళ్ళకి ఏది చేస్తే సరైనది అనిపిస్తుందో – అదే చేయాలా నేను?”

“ఏంటి రెండు మూడ్రోజులుగా నీలో ఈ వితండవాదం ఎక్కువగా కనిపిస్తోంది?” మనసు తిరిగి ప్రశ్నించింది.

“నా సమస్యేంటో చెప్పాల్సింది నువ్వు. నేను కాదు.” చిరాగ్గా అన్నది ప్రత్యూష.

మనసు నవ్వింది. “నీ బాధని లోకువ కట్టి మాట్లాడట్లేదు నేను. ఎందుకు నీకిలా అనిపిస్తోందో నాకు సింపుల్గానే అర్థమైంది అని చెప్పబోతూ ఉండగా నువ్వే ఇలా అపార్థం చేసుకున్నావు..”

“సరే, అలా అయితే, నీ ఉద్దేశ్యంలో నా సమస్యేమిటి?”

“నీ సమస్య నీకు ఉన్న హై స్టాండర్డ్స్. హై హోప్స్”

“ఎవరి గురించీ? నేనే నాకు నచ్చట్లేదు. ఇంక ఇంకోళ్ళ గురించి హై హోప్స్ ఏంటి?”

“నీ గురించే నీవి హై స్టాండర్డ్స్ అంటున్నా. నువ్వు మనిషన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావేమో అనిపిస్తోంది.”

“ఏం చేయమంటావ్ నన్ను?”

“ఏమీ చేయకు. అస్తమానం నీ లెవెల్‌కి తగ్గట్లు జీవించాలని, దానికి కాస్త స్థాయి తగ్గగానే నామోషీగా ఫీలవడం మానేయి. మనసుకేం తోస్తే అదే చేయి” గీతోపదేశం దొరికింది ప్రత్యూషకి ఫ్రీగా.

“మనసుకేది తోస్తే…- అంటే, అంతా నీ ఇష్టమనేగా?” – వెటకారంగా అంది ప్రత్యూష.

జవాబేదీ రాలేదు.

ఓ గంట తరువాత –

“నాకు కొన్నాళ్ళు ఎక్కడికన్నా ఎవరికీ కనిపించనంత దూరంగా వెళ్ళాలని ఉంది. కానీ, వెళ్ళే పరిస్థితులు లేవు. పరిస్థితులున్నా కూడా, అంత దూరాన్ని ఎక్కడ వెదుక్కోను? శాశ్వతంగా ప్రపంచం నుండి సెలవు తీసుకోడానికి ధైర్యం చాలట్లేదు.”

“అసలు నీకేమొచ్చిందని?” – మనసు ఆరా.

“ఏమొచ్చిందో నీకు అనవసరం. నాకు మాత్రం ఈ ప్రపంచంలో ఉండాలని లేదు.”

“ఎందుకంటున్నాను. ఆత్మహత్య అన్న ఆలోచనే తప్పసలు.”

“తప్పొప్పులు నిర్ణయించేది ఎవరు? నాకు ఒప్పనిపించింది నీకు తప్పనిపించదా ఏం?”

“ఈ వితండవాదానికేం కానీ, ఆత్మహత్య మాత్రం తప్పే!”

“నాకు తప్పు అనిపించట్లేదు. నేను ఆగుతున్నది నాకు ధైర్యంలేక. అలాగే, నాతో పెనవేసుకున్న బంధాలు తెంచలేక. అంతే కానీ, అది తప్పనీ, నేను పాపిననీ కాదు.”

“ఏదో ఒకట్లే, ఆగానన్నావు కదా, అది చాలు” – ప్రత్యూష లేకుంటే తన ఉనికి కూడా ఉండదని అప్పటిదాకా భయపడిందేమో. ప్రాణమంటే తీపి ప్రాణికా, మనసుకా?

“అద్సరే! ప్రపంచానికి దూరంగా వెళ్ళాలంటావు. మరి అదెలా చేద్దామని?” కుతూహలంగా అడిగింది మనసు.

“నిన్నూ, నన్నూ బాధపెట్టుకుంటూ..”

“అంటే?” మనసుకి అర్థంకాలేదు.

“How to lose friends & alienate people” అన్న సినిమా పేరు విన్నావా?

“నువ్వు చూడలేదుగా. అప్పుడోరోజు చూద్దామనుకున్నావు.”

“యా! చూళ్ళేదు. కానీ, ఇప్పుడు నేను చేయబోయేది ఆ టైటిల్ చెప్పేదే. సినిమా సంగతి దేవుడెరుగ్గానీ”.

“ఓహో! తమరి తెలివి తెల్లారినట్లు ఉందండి” – మనసు వెక్కిరించింది.

“నా బుద్ధికి ఆమాత్రం ఐక్యూ అన్నా ఉందండి. నా మనసుకి, అనగా మీకు. ఉత్త ఈక్యూనే.”

“ఏమే! రెండ్రోజులుగా ఫోను కూడా చేయలేదు. నేను చేసిన రెండుసార్లూ నువ్వు ఎత్తలేదు.” – అమ్మ.

“ఆఫీసులో బిజీగా ఉన్నానమ్మా” ఈ జవాబు పూర్తి నిజం కాదు అని తనకి తెలిసినా కూడా.

“మామయ్య ఇందాక ఫోన్ చేసాడు. పోయిన వీకెండ్ వాళ్ళింటి కెళ్ళినప్పుడు ఎక్కువ మాట్లాడలేదట? ఏమైంది? అని అడుగుతున్నాడు.”

“ఏమీ లేదని చెప్తున్నా కదే!”

“నువ్వు షేక్స్పియర్ మొహమేస్కుని కూర్చుని ఉండి ఉంటావ్ అక్కడ.”

“అబ్బా! వదిలేయి అమ్మా! ఇలా ఐతే వాళ్ళింటికి కూడా పోను. నాకు అసలే చిరాగ్గా ఉంది.”

“నీకంతా విసుగే, అంతా నసే. బొత్తిగా మనుషుల్తో మాట్లాడ్డమే నచ్చట్లేదు నీకసలు ఈ మధ్య”

“సరే, నచ్చట్లేదు. నువ్వొక్కదానివన్నా గుర్తించావు. థాంక్స్. ఏం చెయ్యమంటావ్ ఐతే?”

“ఈ వెటకారాలకేంలే! సరే, డోర్ బెల్ మ్రోగుతోంది. ఎవరో వచ్చినట్లు ఉన్నారు. బై.” ఫోన్ పెట్టేసిన శబ్దం.

వెటకారమేమిటీ? నిజంగానే నాకు మనుషులు నచ్చట్లేదు. ఎవరూ నమ్మరేం! అని నిట్టూర్చింది ప్రత్యూష.

ఏరోజుకారోజు మనుషుల్తో మాట్లాడకూడదు, మనుషుల్తో చేరకూడదు – అనుకోడం ఓ రెండు మూడు నెల్ల బట్టీ జరుగుతూ ఉంది. అలా అలా క్రమంగా తగ్గిస్తూ తగ్గిస్తూ ఇరవైనాలుగ్గంటలూ స్నేహల్లో మునిగి తేలే ప్రత్యూష ఉనికిని చాలా మంది మర్చిపోయేదాకా తెచ్చుకుంది. కానీ, రోజుకోసారి ఇలా ఒకరిద్దరిని హలో అని పలకరించడం మాత్రం మానలేకపోయింది.

“నువ్వు మానలేవోయ్! నువ్వు మనుషుల్తో మాట్లాడ్డం మానలేవు” అని ఓ పక్క మనసు చెబుతోంది.

“ఏం? మనుషులేం పెద్ద ఇదా?”

“మనుషులేమో కానీ.. నువ్వు మాత్రం పెద్ద ‘అది’ కాదు. కనుక నువ్వు అలా ఉండలేవు.”

“నాకు చిరాకేస్తోంది ఈ బంధాలు తెంచుకోలేకపోవడం చూస్తూ ఉంటే! నా బలహీనతకి నా మీదే అసహ్యం పుడుతోంది” – అసహనంగా అన్నది ప్రత్యూష.

“తెంచుకోలేకపోవడం బలహీనతే అంటావా?”

“కాక? నేను తెంచుకోవాలి అనుకున్నాక తెంచుకోలేకపోవడం మాత్రం తప్పక నా బలహీనతే” – మొండిగా అంది ప్రత్యూష.

“నువ్వు పెట్టుకున్న లక్ష్యమే అసాధ్యమైనదేమో?”

“మనిషి చంద్రుణ్ణే చూసొచ్చాడు.” – ప్రత్యూష నవ్వింది.

“మనిషి చంద్రుణ్ణి చూసాడేమో – మరి, తనని తాను చదూకోగలిగాడా? తన మనసు ఎక్కడుందో తెలుసుకోగలిగాడా?”

“అసలీ మాటల్లోనే తెలుస్తోంది తెలుసా నీకెంత పొగరో, గర్వమో?” కోపంగా అంది ప్రత్యూష.

“పొగరేముంది – అది నిజమే కదా! నేనేంటోనే తెలుసుకోలేకపోయాడు మనిషి. అసలు నేనెక్కడుంటానో ఇప్పటిదాకా సరిగ్గా చెప్పలేకపోతున్నాడు – ఇక నాలోని లోతులెక్కడ తెలుస్తాయి?” – ధీమాగా అంది మనసు.

“మరి నీకు నా గురించి తెలుసా? నేనిలా ఉండలేను అంటున్నావు?”

“నేననీ.. నీవనీ… వేరుగా లేమని… చెప్పినా చెప్పినా వినరా ఒకరైనా… నేను నీ నీడనీ, నీవు నా నిజమనీ..ఒప్పుకోగలరా ఎపుడైనా…” పాట వినిపించింది, మిక్కీ జె.మేయర్ సంగీతంతో సహా.

“చాల్లే! ఆపు! భరించలేకపోతున్నాను.” అసహనంగా అరిచింది ప్రత్యూష.

అటువైపు నవ్వు వినిపించింది. ప్రత్యూష చుట్టూ చూసింది – గదిలో తానొక్కతే.. ఎప్పటిలాగే.

“పోనీ, వీళ్ళని నాతో మాట్లాడ్డం మానేయమని రిక్వెస్టు చేద్దామా?”

“అబ్బే! అలా అంటే మళ్ళీ బాగోదు. మనమే మాట్లాడ్డం మానేద్దాం..”

“అబ్బ! ఎంత ప్రయత్నించినా మానలేకపోతున్నాను… పోనీ, గొడవపడదామా?”

“గొడవపడ్డమే చేతనైఉంటే ఈ తంటాలన్నీ దేనికి?”

“కొన్నాళ్ళు ఇలాగే అడ్డగోలుగా మాట్లాడుతూ, దాగుడుమూతల్లో బ్రతికితే వీళ్ళంతా విసుగొచ్చి నాతో మాట్లాడ్డం మానేస్తారు లే!”

“నాకీ ఎదురుచూపులంటే అసహ్యం. నాకు ఇన్స్టంట్ రిజల్స్ట్ కావాలి”

“నాకు మనుష్యుల్తో మాట్లాడాలని లేదూ! లేదూ! లేదూ!”

“నాకీ ప్రపంచమంటే అసహ్యం!”

“బంధాలు పెంచుకోడం ఎందుకు? తెంచుకోలేకపోవడం దేనికి?”

“పెంచినంత తేలిగ్గా తెంచుకోలేనప్పుడు పెంచుకోడం దేనికి? చస్తూ చస్తూ కట్టగట్టుకు పోతామా? ఇంకెందుకు ఇవన్నీ?”

“చావనైనా చావనివ్వని వెధవ మానవసంబంధాలు”

“మనసుని చంపేస్తే ఈ సంబంధాల బంధనాలు తెంచేస్కోవచ్చు. కానీ, అదెలా ఉంటుందో కూడా తెలియదే!”

“మనిషిని చంపడంకంటే మనసుని చంపడం కష్టంలా ఉంది.”

“మనిషికంటే మనసు కాంప్లికేటెడా? మనసుతో కలిసిన మనిషి కాంప్లికేటెడా? మనసొక్కటే కాంప్లికేటెడా?”

“అబ్బా!”

-విసుగుతో వచ్చిన కేకో…కేకే విసుక్కుందో! ప్రత్యూషకంతా గజిబిజిగా ఉంది.

రోజులు గడుస్తున్నాయి. ప్రత్యూష ఆఫీసు పని అవసరమైన దానికన్నా ఎక్కువసేపు చేస్తూ, పలకరించాలనుకుంటున్న వారికి దొరక్కుండా, దొరికిన వారితో బిజీ అని చెప్పి తప్పించుకుంటూ, వీలు చిక్కినప్పుడల్లా తన గురించి తానే సైకో అనాలిసిస్ చేసుకుంటూ, బ్రతుకెందుకు? చావెందుకు? అని ప్రశ్నించుకుంటూ గడిపేస్తూ ఉంది. అలాంటి రోజుల్లో ఓ రోజు –

“నాన్నకి ప్రమోషనొచ్చింది” – అని పొద్దున్నే అమ్మ ఫోనుతో నిద్రలేచింది ప్రత్యూష.

అప్పటికి ఇంటికి కాల్ చేసి రెండ్రోజులౌతోంది. ఇంట్లో వాళ్ళకి కూడా విసుగొచ్చి తనే చేస్తుందని వదిలేసుంటారు అనుకుంది, వాళ్ళు కూడా చేయకపోయేసరికి.

“ఏమిటీ నిన్నా, మొన్నా మాట్లాడలేదు?” – అడిగింది అమ్మని.

“నువ్వు మాట్లాడకుండా ఉండొచ్చు, మేము మాత్రం ఉండకూడదా?” – పక్క నుంచి చెల్లి అరుపు వినిపించింది, వాళ్ళు స్పీకర్ ఆన్ చేసారని అప్పుడు అర్థమైంది ప్రత్యూషకి.

“నేనేదో బిజీగా ఉన్నాను… నీకేమొచ్చిందే?” విసుగ్గా అంది ప్రత్యూష.

“అది కాదే, ఎందుకు నీకంత విసుగు. చెల్లెలే కదా.” అమ్మ మధ్యలో అందుకుంది.

కొన్ని నిముషాల మాటలు. “నీ గురించి దిగులుగా ఉంది.” “సరిగా తింటున్నావా?” “ఎందుకు ఈ మధ్య ఇలా ముక్తసరిగా మాట్లాడుతున్నావు?” “ఏమన్నా సమస్యలా అక్కడ?” “ఎవరితోనన్నా గొడవా?” – ఇలా ప్రశ్నలన్నీ వింటూ అన్నింటికీ “ఊ” అనో “ఊహూ” అనో జవాబిచ్చేసాక “వదలాలనుకున్నా వదలని ఈ బంధాలేమిటీ? ఎవరితోనూ సంబంధం లేకుండా బ్రతకలేమా?” అనుకుంది ప్రత్యూష.

ఫోను పెట్టేశాక ఆఫీసుకి బయల్దేరింది. మరో రోజు… యధావిధిగా…

“రెండ్రోజులౌతోంది – ఇంటి నుంచి ఫోన్ లేదు. ఈసారి కూడా వీళ్ళు కావాలనే చేసుంటారు, నేను చేస్తానేమో అని. ” అనుకుని ప్రత్యూష చిరాగ్గా అనుకుంది. అలాగే ఆఫీసుకెళ్ళింది.

మధ్యాహ్నం ఔతూ ఉండగా, మెషీన్ కాఫీ సేవిస్తూ ఉండగా, ఇంటి ఫిల్టర్ కాఫీ గుర్తొచ్చి, “ఎవరో ఒకరం…ఎవరు చేస్తే ఏం?” అనుకుని… ఇంటికి కాల్ చేసింది. జవాబులేదు.

“అదేమిటి – ఇంట్లో లేకుండా ఎలా ఉంటారు?” అనుకుని వాళ్ళమ్మ అమ్మ సెల్‌కి చేసింది. రింగ్ ఔతుంది కానీ ఎత్తట్లేదు. నాన్న సెల్‌కి చేస్తే – అవుటాఫ్ కవరేజ్ ఏరియా. “ఈయనకి ఆ పల్లెటూరి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా ఈ నో-సిగ్నల్, లో-సిగ్నల్ బాధలు తప్పవు కదా…” నిట్టూర్చింది.

“హే, ఏమిటి అలా ఫోన్ చూస్తూ ఆలోచిస్తున్నావ్, ఎవ్రీథింగ్ ఓకే?” – ఆఫీసులో తెలుగు కొలీగ్ పలకరింపుతో మళ్ళీ తేరుకుని, సరే, కాసేపాగి చూద్దాంలే అనుకుని పనిలో పడింది ప్రత్యూష.

మళ్ళీ సాయంత్రం అవుతూ ఉండగా ఇప్పటిదాకా ఇంటి నుండి ఫోన్ లేదన్న సంగతి గుర్తొచ్చింది. “నా మిస్డ్ కాల్స్ చూసి కూడా ఫోన్ చేయలేదేం?” ప్రత్యూషకు కొంచెం కంగారుగా అనిపించింది. కానీ, ఏం చేయాలో తోచలేదు. మళ్ళీ కాల్ చేయడం -అవతల ఎత్తకపోవడం -చిరాకుపడ్డం. ఇలా కొన్నిసార్లు జరిగేసరికి, రాత్రి ముసిరే కొద్దీ ప్రత్యూషకు కంగారు పెరిగింది. ఆఫీసులో కూర్చుని కూర్చుని విసుగొచ్చి, ఇంటికి బయలుదేరిందన్న మాటే కానీ, మనసంతా అయోమయంలో, తెలీని భయంలో మునిగి ఉంది. తలుపు తీసుకుని ఇంట్లోకి అడుగుపెట్టింది కానీ, ప్రత్యూష స్థితిలో మార్పు లేదు.అర్థరాత్రి దాకా ఫోన్లు చేస్తూనే ఉంది ఇంటికి.

చా! నిన్నా-మొన్నట్లో కాల్ చేసి మాట్లాడి ఉండాల్సింది.

అయినా, ఎవరికన్నా ఏమైనా అయి ఉంటే, మూడ్రోజులౌతోంది – ఎవరో ఒకరు కాల్ చేసి చెప్పేవారుగా?

ఎవరికీ ఏం కాకపోతే – ఫోన్లెందుకు ఎత్తట్లేదు?

నాన్న ఫోనెందుకు ఇప్పుడు కూడా అవుటాఫ్ రీచ్? అమ్మ ఫోన్ ఇంతసేపు చూడదా? అసలు ల్యాండ్‍లైన్ ఎత్తరేం?” – ఇలా ఆలోచిస్తూనే, దాదాపు పన్నెండున్నరదాకా ఫోన్లు కలుస్తాయేమో ప్రయత్నిస్తూనే ఉంది ప్రత్యూష. “పోనీ, పడుకున్నారేమో, పొద్దున్నే చేస్తాను…” – తన ఆలోచన తనకే అసంబద్ధంగా అనిపించినా, చివరకు ఫోన్లు ఆపింది. కానీ, నిద్రపట్టదే. అలా అలా ఏవేవో ఆలోచిస్తూ, ఎప్పటికో నిద్రపోయింది.

ఫోన్ అదేపనిగా మ్రోగుతూ ఉంటే, ప్రత్యూషకు మెలుకువొచ్చింది.శబ్దం వినబడగానే ఇంటినుంచేమో అని, ఉలిక్కిపడి లేచి, ఫోన్ తీసింది. ఇంతలో కాల్ ఆగిపోయింది. నంబర్ చూస్తే – ఏదో కొత్త నంబర్. అబ్బబ్బ! పొద్దున్నే వీళ్ళెవరో! అని విసుక్కున్నా, మనసేదో కీడును శంకించింది. ఇంటికి కాల్ చేయబోయేంతలో – మళ్ళీ సెల్లు మ్రోగింది – ఇందాకటి నంబరే. విసుగ్గా ఫోన్ ఎత్తి – ’హలో’ అంది ప్రత్యూష.

“నేనే అమ్మను. లేచావా?”

“అమ్మా! ఎక్కడికిపోయారు మీరంతానూ? నిన్న ఎన్నిసార్లు కాల్ చేసానో తెలుసా?” గట్టిగా అరిచింది ప్రత్యూష.

“ఏమౌతుందే…అందరం బానే ఉన్నాము…”

“ఏమైందసలు? ఒక్కరు కూడా ఫోన్లు ఎత్తరేం?”

“అది కాదే… నా ఫ్రెండు భాగ్య ఆంటీ ఉంది కదా – నిన్న తనకి యాక్సిడెంటైంది. వాళ్ళింట్లో వాళ్ళెవరూ ఊర్లో లేరు. దాంతో పొద్దున్నే మీనాన్న ఆఫీసుకెళ్తున్నప్పుడే నేను చెప్పేసి హాస్పిటల్ కి వెళ్ళిపోయాను. చిన్నదేమో కాలేజీకి వెళ్ళిపోయింది. ఇక భాగ్యకు తోడుగా అక్కడే ఉండిపోయా. ఇప్పుడిక ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నా, వాళ్ళ వాళ్ళు ఊర్నుంచి వచ్చేసార్లే…”

“ఎలా ఉందిప్పుడు ఆంటీకి…?”

“తనకేం పర్లేదు లే. తనకి కంగారెక్కువవడంతో నేనక్కడే ఉండిపోయా. పెద్ద దెబ్బలేం తగల్లేదు… భయం… అంతే” అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా, ప్రత్యూష మధ్యలోనే ఆపి –

“అయినా, నీ సెల్లేమైంది? ఆ ల్యాండ్ లైన్ ఒక్కసారి కూడా ఎవరూ ఎత్తలేదేం? నాన్న సెల్లేమైంది…?” – ప్రశ్నలమీద ప్రశ్నలు.

“అయ్యో! నిన్నంతా మాకూ అవస్థే. మన ఫోను మూడ్రోజులుగా డెడ్ అయి ఉంది. నేనేమో హడావుడిలో నిన్న సెల్లు పట్టుకెళ్ళలేదు. అది ఎప్పట్లాగే సైలెంట్ మోడ్‌లో ఉంది కనుక, నువ్వు చేసినా ఎవరికీ తెలిసుండదు. నిన్న చాలా అవస్థ పడ్డాంలే ఈ ఫోన్లు పని చేయకపోవడం వల్ల. ఉన్నదానికి తోడు, మీ నాన్న సెల్లు పోగొట్టుకొచ్చారు…”

“ఒక్కళ్ళైనా ఫోన్ చేసి ఉండొచ్చుగా..”

“ఇప్పుడు చేస్తున్నా కదా ఫోను. నిన్న మీ నాన్న హాస్పిటల్‌కి వచ్చి ఫోను పోయిన సంగతి చెప్పేదాక నేను కూడా ఆయన సెల్లుకి చేస్తూనే ఉన్నా. ఆఖరుకి పక్కింటివాళ్ళకి చేసి ఆయన వచ్చినపుడు రాత్రికి నేను హాస్పిటల్లోనే ఉంటానని చెప్పమని చెప్పాను..దాంతో ఆయన హాస్పిటల్ కి వచ్చి వెళ్ళారు.. ”

“ఆ సౌజీ ఏం చేస్తోంది?” – చెల్లెల్ని ఉద్దేశించి అంది ప్రత్యూష.

“అదెక్కడుందసలు? వాళ్ళ ఫ్రెండింట్లో నైటౌట్ అని నిన్న పొద్దున్నే బట్టలు తీసుకుని వెళ్ళిపోయింది.”

“మీరంతా కలిసి – నాకెంత కంగారు పుట్టించారో తెలుసా….ఇంతకీ ఈ నంబర్ ఎవరిది?”

“హాస్పిటల్ లో పబ్లిక్ బూత్. సరే, పెట్టెస్తానిక.”

“బై…” అని ఫోన్ పెట్టేసి పత్యూష ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూంటే ఇంతలో మళ్ళీ ఫోను మ్రోగింది. చూస్తే అమ్మ సెల్ నుంచి –

“హలో” అంది ఆశ్చర్యంతో.

“నేన్రా …. చాలాసార్లు చేసినట్లున్నావ్ కదా అమ్మ సెల్‌కి” – నాన్న గొంతు.

“ఏంటి నాన్నా…నిన్న ఇంట్లోనే ఉన్నావుగా…. ఒకసారి చూసి ఉండొచ్చు కదా సెల్ ఎక్కడుందో…”

“నాకు తెలీదమ్మా… మీ అమ్మని అడిగితే గుర్తులేదంది… ఇప్పుడు వంటింట్లోకి వెళ్తే, గిన్నెలు పెట్టే స్టాండు పక్కన కనబడ్డది సెల్… ఏం చేసేది?”

“హమ్మయ్య! ఏమీ కాలేదన్నమాట…” – ఇంతలోనే…

“నాకెవ్వరూ వద్దు. మనుష్యులతో సంపర్కమే వద్దు… అదీ ఇదీ అన్నావు….?” – మనసు సిద్ధంగా ఉంది.

“ఇప్పుడూ అదే అంటున్నా…”

“చెప్పేదొకటీ… చేసేదొకటీ…”

“చెప్పేదే చేయాలనుంది… చెయ్యాలనుకునే చెప్తున్నాను… కానీ నువ్వే నాకడ్డు..”

“నేనా…”

“శల్య సారథ్యం చేస్తున్నావ్ గా…”

“తప్పంతా నాదేనంటావ్?”

“కాదు – నిన్నూ, నన్నూ కలిసి బ్రతకమని శాసించిన వాడిది”

“అయితే మరి, అసలు నీది బలహీనతా? నీ బలహీనతలకు కారణం ఏమిటి? అసలు నువ్వు…”

“ఆఫీసుకి వేళవుతోంది… పద పద…”

ఎప్పట్లాగే, అడిగినవీ, అడగనివీ – ఏ ప్రశ్నలకి జవాబులు ఇద్దరికీ దొరకలేదు.