పరిచయము
ఇరవైయవ శతాబ్దంలో పుట్టిన అద్వితీయ కవి శ్రీశ్రీ. సామాన్యుల భావాలను అసామాన్య భాషలో, ఛందస్సులో వెలువరించిన మహాకవి శ్రీశ్రీ. పాతకాలపు రచనల ధోరణి, వాటి ఛందస్సు నేటి కాలపు కవిత్వానికి అన్వయం కావని (వాటిని ఒక మారు ప్రయోగించిన తరువాత మాత్రమే) తిరస్కరించినా, తెలుగు మాత్రాఛందస్సామ్రాజ్యానికి సార్వభౌముడు శ్రీశ్రీ. ‘శ్మశానాలవంటి నిఘంటువులు దాటి, వ్యాకరణాల సంకెళ్ళు విడిచి, ఛందస్సుల సర్పపరిష్వంగం వదలి వేయాలని’ అభిలషించి, ‘ఛందో బందోబస్తులన్నీ ఛట్‌ఫట్‌ఫట్‌మని త్రెంచి Damn it! ఇదేమిట్రా అంటే Pray, it is poetry అందాం’ అని కొంటెకోణాలలో అంటాడు. కానీ ఇదేదీ పూర్తిగా నిజం కాదు. శ్రీశ్రీ అభిలషించి అందుకొని అవలీలగా వ్రాసిన మాత్రాఛందస్సు కూడా ప్రాచీన ఛందస్సే. తెలుగులో ఈ ఛందస్సు ముందే ఉన్నా దానికి పూర్వ కవుల ఆదరణ లభించలేదు.
ఛందస్సు – శ్రీశ్రీ
శ్రీశ్రీ పుట్టుక 1910లో. అదే సంవత్సరంలోనే నవయుగానికి నాందీగీతాన్ని పాడిన మహాకవి గురజాడ అప్పారావు ముత్యాలసరం కూడా పుట్టింది. ఆధునిక యుగంలో అందాలు సంతరించుకొన్న దేశి ఛందోరూపాలలో అది మొదటిది. తరువాతి కాలంలో శ్రీశ్రీ ఈ ఛందస్సును తన అవసరానికి అద్భుతంగా మలచుకొన్నాడు. అతనికి సాంప్రదాయిక ఛందస్సులోని గతులను, రీతులను బోధించిన వారు విశాఖలోని మిసెస్ ఏవీఎన్ కళాశాలలో వైస్‌ప్రిన్సిపల్‌గా పని చేసిన వడ్డే కేశవరావు.
చాలా చిన్నప్పుడే శ్రీశ్రీకి పద్యాలమీద మోజు ఎక్కువ. పద్యాలు వ్రాయడం అంటే కూడా చాలా ఇష్టం. ఈ విషయం గురించి చెబుతూ ఇలా అంటాడు –
“నేను ఏవో యతిప్రాసలు లేని పద్యాలు వ్రాస్తూండడం చూచి మా నాన్నగారు నాకు సులక్షణసారం కొనిపెట్టారు. ఛందస్సులో మొదటిపాఠం చెప్పారు. అప్పటికి నాకు ఏడెనిమిది సంవత్సరాలకు మించి ఉండదు. ఆ రోజు నుండి ఎన్ని పద్యాలు వ్రాశానో చెప్పను, అన్నీ తప్పులే! కాని ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చెయ్యలేదు. అందరూ నా తప్పులు దిద్దేవారే! కొన్ని తప్పులు నాకు తప్పుగా తోచలేదు. అవి చెయ్యడానికి నాకేదో హక్కు ఉందనిపించింది. అందువల్ల నా వ్యక్తి చైతన్యం ప్రగాఢతరం అవుతున్నట్లు, నా బలం హెచ్చినట్లు నాకు స్పష్టంగా తోచింది!
మొట్టమొదటిసారి నాకు పద్యం వ్రాయాలని బుద్ధి పుట్టినప్పుడు ఏదో కొత్తది కనిపెట్టినట్లే భావించాను. నేను వెతుకుతున్న గులేబకావళి దొరికిందనుకొన్నాను. అతః పూర్వ సాహిత్యానికి అది అనుకరణ కాదు! తర్వాత తర్వాత సాహిత్య దృష్టి హెచ్చి నాలాగే ప్రమాదప్రయాణాలు చేసి అనుభవాలు సంపాదించి విశేషాలు కనుక్కొని మజాగా చెప్పినవారి పరిచయం పూర్వులదీ నవ్యులదీ కలిగిన పిమ్మట వాటికి తగినంత చేరువగా అనుకరణ చేస్తూ పోవాలని బుద్ధి పుట్టింది. ఛందస్సు గుఱ్ఱం వంటిది. గుఱ్ఱం ఎటు తీసుకుపోతే అటల్లా వెళ్ళిపోయేవాడు ఆశ్వికుడు కానట్లే ఛందస్సు లాగుకుపోయినట్లు వ్రాసేవాడు సంవిధానజ్ఞుడు కాడు! ఆ ఛందస్సును లొంగించుకొని దానిచేత చిత్రవిచిత్రరీతులలో కదం త్రొక్కించిన వారినే ప్రశంసిస్తాం.”
వాక్యం రసాత్మకం కావ్యం, అంటే రసవంతమైన వాక్యాలతో నిండి ఉంటే అది కావ్యమవుతుంది అని. అదే విధంగా వాక్యం లయాత్మకం ఛందస్, అంటే లయాత్మకమైన వాక్యాలతో నిండి ఉంటే అది ఛందస్సు అవుతుంది అని చెప్పవచ్చు. శ్రీశ్రీ ఛందస్సుపైన చేసిన తిరుగుబాటు నిజంగా పదహారణాల తిరుగుబాటు కాదు, అలా చేసిన ఘనత గురజాడ గారిది. శ్రీశ్రీ మొట్టమొదట చాలామంది కవులలాగే ఉత్పలమాల, శార్దూలవిక్రీడితము, సీసము, తేటగీతి లాటి ఛందస్సులోనే పద్యాలను కట్టాడు. తరువాతి కాలంలో వ్యావహారిక ప్రయోగాలు చేసినా, ఆయనకి సంస్కృత పదాలపైన మోజు పోలేదు. శ్రీశ్రీ కవిత్వం ఆనందించిన వారందరికీ ఆయన ఉపయోగించిన కొన్ని పదాలకు అర్థం తెలిసికోవాలంటే నిఘంటువులు వెదకవలసిందే!
సాంప్రదాయిక కవిగా శ్రీశ్రీ
మనకు దొరికిన శ్రీశ్రీ పద్యాలలో మొట్టమొదటిది ఆయన పదిహేనో ఏట రాసిన ఒక తేటగీతి పద్యం. అది –
ఓ మహత్మ త్వదీయ మహోన్నత ప్ర
భావ మింతని తెలుప నెవ్వానితరము?
ముందే చెప్పాను, అనుకరణ అంటే శ్రీశ్రీకి ఇష్టమని. కృష్ణశాస్త్రిని అనుకరించిందని తోస్తుంది కింది తేటగీతి పద్యం –
ఇది మహోజ్జ్వల మమృతరసైక మధుర
మిది మనోహర మానందసదన మిద్ది
మొట్టమొదట శాస్త్రీయముగా శ్రీశ్రీ రచించిన ఒక రెండు వృత్తాలను ఇక్కడ చెప్పడం సబబు. ‘ప్రళయనర్తనము’లో జగత్తును నీ మూడవ కంటితో తగులబెట్టమని శార్దూలవిక్రీడితములో శివుని అడుగుతాడు –
శా. సాయం ప్రస్ఫుట రాగరంజిత లసత్సంపూర్ణ సౌందర్య రా
శీయుక్తామల దివ్యమూర్తివయి సాక్షీభూత నానామరు
త్తోయస్తోత్ర గభీర గానరవ సంతుష్టాంతరంగంబునన్
మాయామేయ జగద్వినాశాన మతిన్ నర్తింపుమా శంకరా
ఈ పద్యాన్ని చదువుతుంటే శ్రీశ్రీ అభిమానించిన తిక్కన వ్రాసిన ‘భీష్మద్రోణకృపాది ధన్వి నికరాభీలంబు’ లాటి పద్యాలు జ్ఞాపకానికి వస్తాయి.
భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన సందర్భంలో 1947లో శ్రీశ్రీ వ్రాసిన దుష్కరప్రాసముతో ఒక స్రగ్ధరా వృత్తమును ఉదహరిస్తాను. “శత్రుచ్ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం…” లాటి స్తోత్ర పద్యాలు ఈ వృత్తములో ఉన్నాయి. నన్నెచోడుని కుమారసంభవము లోని మొదటి పద్యము స్రగ్ధరయే. పైన చెప్పిన శార్దూలవిక్రీడితములా కాక క్రింది పద్యములోని పదాలు అందరికీ అర్థ మయ్యేవే.
స్ర. ఏ స్వాతంత్ర్యం నిమిత్తం ఎవరెవరెవరో ఎందరో దేశసేవా
భాస్వంతుల్ బాలవృద్ధుల్ పతితులధికు లప్రాజ్ఞులున్ ప్రజ్ఞులంతా
అస్వాశల్ వీడి లాఠీహతులయి ఉరికొయ్యల్ కవుంగిట చేర్చా
రా స్వాతంత్ర్యం లభించిందని విని హృదయం హ్లాద సంపుష్టమైతే
అలానే మచ్చుకి, శ్రీశ్రీ రాసిన మాలా వృత్తాల ఉదాహరణలుగా ఈ రెండు పద్యాలను చూడండి –
చ. ముసరు నిశాంధకారముల మ్రోతలలో నొకమూల తారకా
రసికవిలాసవీణ కొసరన్ దలపోసెడు మూగపాటకే
దెసలు చెవుల్ నిగుడ్చి పరతేరని రాగము లాస చేయ, ని
శ్వసనము లాగుచున్ హృదయవాద్యరుచుల్ బిగియించివేగుచున్
– నక్షత్రవీణ, మూగపాట
ఉ. ఈయెడ విస్తరిల్లు ప్రతి హృద్య లతాంత పరీమళాల నా-
లో యువకానుభోగసరళుల్ పులకించు, రసప్రమోదపున్
తీయదనాలు నించుకొను తీరనదత్ ప్రతి కమ్రవాయువుల్
నాయెద భావతంత్రుల నినాదిల చేయునెవో కవిత్వముల్
– పూలనెత్తావులు
మాత్రాఛందస్సు
ఛందస్సు రెండు విధాలు, అవి గణ ఛందస్సు, మాత్రాఛందస్సు. గణ ఛందస్సు అంటే ఒకటి, రెండు, మూడు అక్షరాలతో ఉండే గణాలతో అమర్చబడినవి. అక్షర గణాలలో అక్షరాల సంఖ్య మారవు, గురు లఘువుల (హ్రస్వ దీర్ఘాల) స్థానాలు మారుతూ ఉంటాయి. అందుకే మూడు అక్షరాలతో మ, భ, జ, స, న, య, ర, త అనే ఎనిమిది గణాలు లభిస్తాయి.
మాత్రాగణములలో మాత్రల లేక కళల సంఖ్య ముఖ్యము. ఈ పద్ధతిలో గురువుకు రెండు మాత్రలు, లఘువుకు ఒక మాత్ర. ఉదాహరణకు మనకు నాలుగు మాత్రల గణాలు కావాలంటే అవి రెండునుండి నాలుగు అక్షరాలవరకు ఐదు విధాలుగా దొరుకుతాయి. మాత్రాగణాలతో పద్యాలు, పాటలు అందరినీ బాగా ఆకర్షిస్తాయి. ఈ విషయం కాళిదాసుకు కూడా తెలుసు. విక్రమోర్వశీయంలో మహారాజు నోటిగుండా కొన్ని ప్రాకృత పద్యాలు ఉన్నాయి. ఉదాహరణకు దుర్మిల ఛందములోని క్రింది పద్యము అట్టిదే –
దఇఆ-రహిఓ అహిఅం దుహిఓ విరహాగుణఓ పరిమంథరఓ
గిరి-కాణణఏ కుసుముజ్జలఏ గజ-జూహ-వఈ బహు ఝీణ-గఈ
– విక్రమోర్వశీయము (ఉత్తర ప్రతి) (4.10)
(భార్యలేక అతి దుఃఖితుడై విరహాతిశయమువలన గిరికాననములలో వసంతకాలములో గజరాజు చిక్కిపోయినవానివలె కనబడెను.)
మాత్రాఛందస్సు మాయలు శంకరాచార్యులకు కూడా తెలుసు. వారు చతురస్ర గతిలో వ్రాసిన భజగోవిందం లాటి స్తోత్రాలు శ్రీశ్రీకి ఎంతో ప్రేరణను ఇచ్చాయి. అదే విధంగా మిశ్రగతిలో శంకరులు వ్రాసిన చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం స్తోత్రము, మత్తకోకిలలాటి వృత్తాలు, మాత్రాగణాలతో రుద్రకవి వ్రాసిన జనార్దనాష్టకములోని “అలుకలన్నియు తీరగా నా అండ కెప్పుడు వస్తివీ…” వంటి పద్యాలను కూడా శ్రీశ్రీ తప్పక చదివి ఉండాలి. ముత్యాలసరపు గతి కూడా ఇలాంటిదే. ఈ గతిని ఉపయోగించుకోవడంలో శ్రీశ్రీ తన ప్రతిభను చూపించాడు. శంకరాచార్యుల గురి మతప్రచారం, శ్రీశ్రీ గురి తన కమ్యూనిస్టు వాదాన్ని చాటడం. అందుకే ఇద్దరూ జనరంజకమైన మాత్రాగణాల ఛందస్సును వాడడంలో ఆశ్చర్యం లేదు.