శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు

శ్రీశ్రీ ఎక్కడా మరణాన్ని కీర్తించలేదు. ‘ఊగరా, ఊగరా, ఉరికొయ్యనందుకొని ఊగరా’ అన్న కవితలో మాత్రం వీరుని మరణాన్ని కీర్తించినట్టు కనబడుతుందిగాని, అది అతని ఆశయాన్ని, త్యాగాన్ని కీర్తించినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి భిన్నంగా, మానవ జీవితపు విలువను శ్రెశ్రీ అనేకసార్లు ప్రస్తుతించారు. ‘కలకానిది, విలువైనది – బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు’ అన్న పాట దీనికొక గొప్ప ఉదాహరణ.

అందరిలాగే కవి కూడా ఆశ, నిరాశల మధ్య కొట్లాడుతూ ఉంటాడు. వర్తమానం, భవిష్యత్తు ఒకోసారి ఆశాజనకంగాను, ఉత్సాహంగాను కనిపించటం, మరొకసారి అవే అంధకారంగా తోచటం మనకు తరచు ఎదురయ్యే అనుభవమే. ఆశనిరాశల మధ్య ఊగిసలాడే కవిత్వం శ్రీశ్రీలో కూడా అనేకసార్లు చూడవచ్చు. చేదుపాట, దేనికొరకు, కేక వంటి కవితల్లో వ్యక్తిగతమైన నిరాశ, నిస్పృహలు ధ్వనిస్తాయి.

మనదీ ఒక బ్రదుకేనా
కుక్కలవలె నక్కలవలె
మనదీ ఒక బ్రదుకేనా
సందులలో పందులవలె

అని నిరుత్సాహపడే చేదుపాట, ‘వేళకాని వేళలో, లేనిపోని వాంఛలతో’ ఎందుకు ప్రాకులాడుతావని తనను తానే ప్రశ్నించుకునే దేనికొరకు అన్న కవిత మొదలైనవి ఎప్పుడైనా తాత్కాలికంగా నిరాశకు లోనైనప్పుడు రాసినవై ఉండాలి. అప్పటి మానసికస్థితిని ప్రతిభావంతంగా ఆవిష్కరించటంలోనే శ్రీశ్రీ కవిత్వ పటిమ మనకు తెలుస్తుంది. ఇటువంటి కవితలలో తలమానికమనదగిన కవిత ‘కేక’.

నిద్రకువెలియై
నేనొంటరినై
నాగదిలోపల చీకటిలో
చీకటిలోపల నాగదిలో

ఒంటరితనాన్ని, దిగులును, భయాన్ని ఈ కవిత కళ్ళకుకట్టినట్టుగా చూపి, మనకు దాన్ని అనుభవమయ్యేలా చేస్తుంది. ఈ కవిత ఎడ్వర్డ్ మంక్ (Edward Munch) చిత్రించిన ప్రముఖ చిత్రం The Scream కు కవితారూపమని ఈ మధ్య శ్రీమతి ఆర్.వసుంధరాదేవి మాటల సందర్భంగా సూచించారు. ఇటువంటి సామ్యాన్ని ఇదివరకే ఎవరన్నా చెప్పారేమో తెలియదు. ఇది చాలా ఆసక్తికరమైన పరిశీలన. భయం, ఒంటరితనం రెండిటిలోనూ ప్రముఖమైన అంశాలే అయినప్పటికీ, The Scream చిత్రం లోనిది ఆరుబయట సంధ్యాకాలంలో కలిగిన అనుభవం కాగా, ఈ కవిత ఒక గదిలో, చీకటిలో కలిగిన అనుభవాన్ని చెబుతోంది. ఐతే, ‘భగభగ, భుగభుగ మండే చీకటి నాలుకలు’, ‘ఘంటల, మంటల కంటక కంఠపు గణగణలు’ వంటివి రెండిటికీ సరిపోతాయి. ఈ కవితకు శీర్షిక కేక అని పెట్టటం కూడా ఈ రకమైన సామ్యాన్ని చూడటానికి అవకాశం ఇస్తుంది.

నిరాశ అనే అంశాన్ని గురించి చెప్పేటప్పుడు శ్రీశ్రీ చూపిన ఒక వైవిధ్యాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాధారణంగా కవులు చంద్రుడు, వెన్నెల వంటి వస్తువుల్ని ప్రేమ, హాయి, చల్లదనం వంటి అనుకూల పరిస్థితుల్ని చెప్పటానికే వాడుకుంటారు. దీనికి భిన్నంగా శ్రీశ్రీ చంద్రుణ్ణి నిరాశ, అసహాయతకు ప్రతీకగా వాడుకున్నారు.

గగనమంతా నిండి పొగలాగ క్రమ్మి
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టునన్ను

– అని చెప్పి వెన్నెలని,

ఆకాశపుటెడారిలో కాళ్ళు తెగిన
ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి

అని చంద్రుణ్ణి నిరాశను, నిస్సహాయతను సూచించటానికి వాడుకున్నారు. ఈ కవితలోనే కాదు, మహాప్రస్థాన గీతాలకంటె ముందు రాసిన ఖండశశి అనే పద్య ఖండికలో కూడా శ్రీశ్రీ చంద్రుణ్ణి నిరాశ ధ్వనింపజేస్తూ ఈ విధంగా సంబోధిస్తారు:

ఆ పశ్చిమాశా విషాదాంత కావ్యమై
వ్యాపించు కాల మేఘాళిలో పొడచూపి,
ఖండేందు మూర్తి! ఆకాశకర్పరమెల్ల
నిండు నీ గుడ్డి వెన్నెల ధూమ ధూపమై

ఇందులో ధూమ ధూపమై నిండిన వెన్నెలే తరువాతి కవితలో గగనమంతానిండి పొగలాగు క్రమ్మిన బహుళ పంచమి జ్యోత్స్న గా మారి ఉండవచ్చు.

ముందే చెప్పినట్టు, నిరాశ అన్నది తాత్కాలికమైన మానసిక పరిస్థితేగాని, కవులతోబాటు ప్రతిఒక్కరు దీనికి లోనుకావటం సహజమే. మహాప్రస్థానం తరువాతి శ్రీశ్రీ పద్యాల్లో ఎక్కడా ఇటువంటి ఉదాహరణలు కనిపించవు. ఎప్పుడైనా నిరాశ వ్యక్తిగతమే. శ్రీశ్రీ అభ్యుదయకవి కాబట్టి ఆయన సామాజిక లేదా సామూహిక చేతన మాత్రం పూర్తిగా ఆశతో నిండి ఉంటుంది.

నేనొకణ్ణే ధాత్రినిండా
నిండిపోయీ
నా కుహూరుత శీకరాలే
లోకమంతా జల్లులాడే
ఆ ముహూర్తాలాగమిస్తాయి!

– అని చెప్పి జయభేరి మ్రోగించినా,

శాంతి శాంతి కాంతి శాంతి
జగమంతా జయిస్తుంది
ఈ స్వప్నం నిజమౌతుంది
ఈ స్వర్గం ఋజువౌతుంది

అని భవిష్యవాణి వినిపించినా, గొప్ప ఆశాభావం, ఆత్మవిశ్వాసం వ్యక్తమౌతాయి. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అన్న నమ్మకం, ఆశాభావం శ్రీశ్రీ దృక్పధంలో కడదాకా కొనసాగాయనే చెప్పాలి. ఉద్యమాలకి, ఉద్యమ శక్తులకి, ప్రజా చైతన్యానికి సంబంధించినంతవరకు మాత్రం ఎక్కడా నిరాశా నిస్పృహలు శ్రీశ్రీలో కనిపించవు.