శ్రీశ్రీ కవిత్వాన్ని అనేక కోణాల నుంచి చూడవచ్చు. వాటిలో ఒక ప్రత్యేక కోణంనుంచి విశ్లేషణ చేద్దామని నా ప్రయత్నం. అది ఏ దేశమైనా, ఏ కాలమైనా కవులు తమ స్పందనల్ని తెలిపే సామాన్యమైన కవితావస్తువులు కొన్ని వున్నాయి. వాటిని తీసుకుని, అవి శ్రీశ్రీ కవిత్వంలో ఏవిధంగా వ్యక్తమయిందీ పరిశీలించటానికి ప్రయత్నిస్తాను. ఇది శ్రీశ్రీ కవిత్వసర్వస్వం మీద సమీక్షకాదు; ఆయన కవిత్వ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే చిన్న అద్దం మాత్రమే.
మానిషాద వాక్యంతో వాల్మీకిని కవిగా మార్చినవి, సిద్ధార్థ గౌతముడు బుద్ధునిగా మారటానికి ప్రేరేపించినవి – మృత్యువు, దుఃఖం. ఆదికవినుంచి, ఆధునిక కవిదాకా మృత్యువు అనేకమంది కవిత్వంలో వస్తువుగా రూపొందింది. శ్రీశ్రీ కవిత్వంలో కూడా దీని ప్రస్తావన చూడవచ్చు. నిజానికి, మహాప్రస్థానం ప్రారంభ కవితైన అంకితపద్యం ఒక ఎలిజీనే. సాధారణంగా కవులు మృత్యువును ఒక అమూర్తభావనగానే వాడతారు. ఉదాహరణకు “భయ విభ్రమాల మధ్య విషాద వాక్యం వలె సాగే జీవితంలో మృత్యువు ఒక్కటే నిజం” (అజంతా, స్వప్నలిపి). శ్రీశ్రీ మొదట్లో రాసిన ‘సుప్తాస్తికలు’లో మాత్రం కొంతవరకు ఇటువంటి ధోరణి వుంటుంది.
అవి ధరాగర్భమున మానవాస్తికా ప
రంపరలు సుప్త నిశ్శబ్ద సంపుటములు
అటనొకే దీర్ఘయామిని! ఆ నిశాశ్మ
శాన శయ్యకు ప్రాతః ప్రసక్తిలేదు
ఆయగమ్య తమో రహస్యాంగణాన
తాండవించును మృత్యు శైతల్యమొకటె.
ఇది బహుశా భావకవిత్వంలో భాగమైన romantic sorrowలో భాగంగా చెప్పినది కావచ్చు. దీనికి భిన్నంగా, ఇతర చోట్ల మృత్యువు ఒక సందర్భంలో – అంటే ఒక మిత్రుని మరణంగానో, ఒక ముసలి అవ్వ మరణంగానో, ఒక బాటసారి మరణంగానో, ఒక తోటికవి మరణంగానో ఎదురౌతుంది. మరొక విధంగా చెప్పాలంటే, ఈ పద్యాలు the death గురించిగాక, a death గురించి రాసినవి. వీటన్నిటిలో సామాన్యంగా కనిపించే ఒక అంశం -వీటిలో కవికి ఒకరి మరణం కంటే, ఆ మరణంపై ప్రపంచం కనబరచిన ఉదాసీనత ఎక్కువ బాధకలిగిస్తుంది.
ఆకాశం పడిపోకుండానే ఉంది
అఫీసులకు సెలవులేదు
సారాదుకాణాల వ్యవహారం
సజావుగానే సాగింది
….
ఎవరిపనులలో వాళ్ళు
ఎవరి తొందరలో వాళ్ళు
కొంపెల్ల జనార్థనరావు కోసం రాసిన పైవాక్యాలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. భిక్షువర్షీయసి కవితలో చివర్న
ఆ అవ్వే మరణిస్తే
ఆ పాపం ఎవ్వరిదని
వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళిపోయింది
ఎముకముక్క కొరుక్కొంటు
ఏమీ అనలేదు కుక్క
ఒక ఈగను పడవేసుకు
తొందరగా తొలగె తొండ
అని చెప్పటంలో కూడా ఒక ఉదాసీనతను వ్యక్తం చెయ్యటమే ప్రధానాంశం. శ్రీశ్రీ మరొక కవిత బాటసారిలో కూడా మృత్యువు ప్రస్తావన ఉంది. ఈ కవిత ముగింపు గురించి ఒక చిన్న పరిశీలన చేస్తాను. కవిత చివరిలో బాటసారి మరణం ఈ విధంగా వర్ణింపబడుతుంది:
గుడ్డి చీకటిలోన గూబలు
ఘూంకరించాయి
వానవెలిసీ మబ్బులో ఒక
మెరుపుమెరిసింది
వేగుజామును తెలియజేస్తూ
కోడికూసింది
విడినమబ్బుల మధ్యనుండీ
వేగుచుక్కా వెక్కిరించింది
బాటసారి కళేబరంతో
శీతవాయువు ఆడుకుంటోంది
పల్లెటూల్లో తల్లికేదో
పాడుకలలో పేగుకదిలింది
ఈ కవిత ముగింపును మరొక ప్రసిద్ధమైన కధాత్మక కవిత గురజాడ ‘పూర్ణమ్మ’ ముగింపు వాక్యాలతో పోల్చిచూస్తే ఆసక్తికరంగా ఉంటుంది.
కన్నుల కాంతులు కలువల చేరెను
మేలిమి జేరెను మేనిపసల్
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ
పూర్ణమ్మ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందన్న విషయం పైకి చెప్పకుండా గురజాడ ఒక గోప్యత పాటించారు. బాటసారి కూడా ఎవరికీ తెలియకుండా ఎక్కడో చనిపోతాడు. అతను చనిపోయిన వార్త అతని తల్లిదండ్రులకు చేరుతుందా అన్నది సందేహమే. అందువల్ల, అటువంటి గోప్యతను పాటించే అవకాశం ఇక్కడ ఉన్నా శ్రీశ్రీ దానిని పాటించలేదు. “బాటసారి కళేబరంతో / శీతవాయువు ఆడుకుంటోంది” అన్న వాక్యం ఒక్కటి తొలగిస్తే అటువంటి ప్రభావం వచ్చే అవకాశం ఉందిగాని, ఎందువల్లనో శ్రీశ్రీ దానిని స్పష్టంగా చెప్పటానికే మొగ్గు చూపించారు.
మరణం గురించి మాట్లాడేటప్పుడు మరొక విషయం కూడా చెప్పుకోవాలి. మనిషి ఏనాటికైనా మరణాన్ని జయిస్తాడనే ఆశ, నమ్మకం శ్రీశ్రీకున్నాయి. దేవుడి స్వగతం అనే కవితలో
మరణాన్ని మానవుడు జయిస్తే కాలాన్ని
మానవుడు జయిస్తే తన మనస్సునే మానవుడు
గెలిస్తే
అప్పుడు నేను లేను
అని భగవంతుడు భావిస్తున్నట్టుగా రాసారు. కాని ఈ మరణం లేకపోవటమన్నది నిజంగా వాంఛనీయమో కాదో చెప్పలేం. శ్రీశ్రీ భావనలో మరణాన్ని జయించటమన్నది మనిషి సామర్థ్యం మీద ఆయనకున్న నమ్మకానికి నిదర్శనం. మనిషిపై ఈ నమ్మకం మానవుడా! వంటి ఇతర కవితల్లో కూడా వ్యక్తమౌతుంది. మానవునిపై శ్రీశ్రీకున్న అభిమానాన్ని సూచించటానికి ఒక పాటను కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కధానాయిక పుట్టినరోజు సందర్భంగా పాట పెట్టటం ఒకప్పటి సినిమాల్లో ఆనవాయితీ. అటువంటి ఒక సందర్భానికి శ్రీశ్రీ రాసిన పాటలో ఈ క్రింది వాక్యాలుంటాయి:
వేల వేల వత్సరాల కేళిలో, మానవుడుదయించిన శుభవేళలో
వీచె మలయమారుతాలు, పుడమి పలికె స్వాగతాలు
తారకలే మాలికలై నిలిపె కాంతి తోరణాలు
మామూలు పుట్టినరోజు పాటను మానవజాతి ఆవిర్బావాన్ని కీర్తించే స్థాయికి చేర్చటం బహుశ ఒక్క శ్రీశ్రీకే సాధ్యమనుకుంటాను.
శ్రీశ్రీ ఎక్కడా మరణాన్ని కీర్తించలేదు. ‘ఊగరా, ఊగరా, ఉరికొయ్యనందుకొని ఊగరా’ అన్న కవితలో మాత్రం వీరుని మరణాన్ని కీర్తించినట్టు కనబడుతుందిగాని, అది అతని ఆశయాన్ని, త్యాగాన్ని కీర్తించినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి భిన్నంగా, మానవ జీవితపు విలువను శ్రెశ్రీ అనేకసార్లు ప్రస్తుతించారు. ‘కలకానిది, విలువైనది – బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు’ అన్న పాట దీనికొక గొప్ప ఉదాహరణ.
అందరిలాగే కవి కూడా ఆశ, నిరాశల మధ్య కొట్లాడుతూ ఉంటాడు. వర్తమానం, భవిష్యత్తు ఒకోసారి ఆశాజనకంగాను, ఉత్సాహంగాను కనిపించటం, మరొకసారి అవే అంధకారంగా తోచటం మనకు తరచు ఎదురయ్యే అనుభవమే. ఆశనిరాశల మధ్య ఊగిసలాడే కవిత్వం శ్రీశ్రీలో కూడా అనేకసార్లు చూడవచ్చు. చేదుపాట, దేనికొరకు, కేక వంటి కవితల్లో వ్యక్తిగతమైన నిరాశ, నిస్పృహలు ధ్వనిస్తాయి.
మనదీ ఒక బ్రదుకేనా
కుక్కలవలె నక్కలవలె
మనదీ ఒక బ్రదుకేనా
సందులలో పందులవలె
అని నిరుత్సాహపడే చేదుపాట, ‘వేళకాని వేళలో, లేనిపోని వాంఛలతో’ ఎందుకు ప్రాకులాడుతావని తనను తానే ప్రశ్నించుకునే దేనికొరకు అన్న కవిత మొదలైనవి ఎప్పుడైనా తాత్కాలికంగా నిరాశకు లోనైనప్పుడు రాసినవై ఉండాలి. అప్పటి మానసికస్థితిని ప్రతిభావంతంగా ఆవిష్కరించటంలోనే శ్రీశ్రీ కవిత్వ పటిమ మనకు తెలుస్తుంది. ఇటువంటి కవితలలో తలమానికమనదగిన కవిత ‘కేక’.
నిద్రకువెలియై
నేనొంటరినై
నాగదిలోపల చీకటిలో
చీకటిలోపల నాగదిలో
ఒంటరితనాన్ని, దిగులును, భయాన్ని ఈ కవిత కళ్ళకుకట్టినట్టుగా చూపి, మనకు దాన్ని అనుభవమయ్యేలా చేస్తుంది. ఈ కవిత ఎడ్వర్డ్ మంక్ (Edward Munch) చిత్రించిన ప్రముఖ చిత్రం The Scream కు కవితారూపమని ఈ మధ్య శ్రీమతి ఆర్.వసుంధరాదేవి మాటల సందర్భంగా సూచించారు. ఇటువంటి సామ్యాన్ని ఇదివరకే ఎవరన్నా చెప్పారేమో తెలియదు. ఇది చాలా ఆసక్తికరమైన పరిశీలన. భయం, ఒంటరితనం రెండిటిలోనూ ప్రముఖమైన అంశాలే అయినప్పటికీ, The Scream చిత్రం లోనిది ఆరుబయట సంధ్యాకాలంలో కలిగిన అనుభవం కాగా, ఈ కవిత ఒక గదిలో, చీకటిలో కలిగిన అనుభవాన్ని చెబుతోంది. ఐతే, ‘భగభగ, భుగభుగ మండే చీకటి నాలుకలు’, ‘ఘంటల, మంటల కంటక కంఠపు గణగణలు’ వంటివి రెండిటికీ సరిపోతాయి. ఈ కవితకు శీర్షిక కేక అని పెట్టటం కూడా ఈ రకమైన సామ్యాన్ని చూడటానికి అవకాశం ఇస్తుంది.
నిరాశ అనే అంశాన్ని గురించి చెప్పేటప్పుడు శ్రీశ్రీ చూపిన ఒక వైవిధ్యాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాధారణంగా కవులు చంద్రుడు, వెన్నెల వంటి వస్తువుల్ని ప్రేమ, హాయి, చల్లదనం వంటి అనుకూల పరిస్థితుల్ని చెప్పటానికే వాడుకుంటారు. దీనికి భిన్నంగా శ్రీశ్రీ చంద్రుణ్ణి నిరాశ, అసహాయతకు ప్రతీకగా వాడుకున్నారు.
గగనమంతా నిండి పొగలాగ క్రమ్మి
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టునన్ను
– అని చెప్పి వెన్నెలని,
ఆకాశపుటెడారిలో కాళ్ళు తెగిన
ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి
అని చంద్రుణ్ణి నిరాశను, నిస్సహాయతను సూచించటానికి వాడుకున్నారు. ఈ కవితలోనే కాదు, మహాప్రస్థాన గీతాలకంటె ముందు రాసిన ఖండశశి అనే పద్య ఖండికలో కూడా శ్రీశ్రీ చంద్రుణ్ణి నిరాశ ధ్వనింపజేస్తూ ఈ విధంగా సంబోధిస్తారు:
ఆ పశ్చిమాశా విషాదాంత కావ్యమై
వ్యాపించు కాల మేఘాళిలో పొడచూపి,
ఖండేందు మూర్తి! ఆకాశకర్పరమెల్ల
నిండు నీ గుడ్డి వెన్నెల ధూమ ధూపమై
ఇందులో ధూమ ధూపమై నిండిన వెన్నెలే తరువాతి కవితలో గగనమంతానిండి పొగలాగు క్రమ్మిన బహుళ పంచమి జ్యోత్స్న గా మారి ఉండవచ్చు.
ముందే చెప్పినట్టు, నిరాశ అన్నది తాత్కాలికమైన మానసిక పరిస్థితేగాని, కవులతోబాటు ప్రతిఒక్కరు దీనికి లోనుకావటం సహజమే. మహాప్రస్థానం తరువాతి శ్రీశ్రీ పద్యాల్లో ఎక్కడా ఇటువంటి ఉదాహరణలు కనిపించవు. ఎప్పుడైనా నిరాశ వ్యక్తిగతమే. శ్రీశ్రీ అభ్యుదయకవి కాబట్టి ఆయన సామాజిక లేదా సామూహిక చేతన మాత్రం పూర్తిగా ఆశతో నిండి ఉంటుంది.
నేనొకణ్ణే ధాత్రినిండా
నిండిపోయీ
నా కుహూరుత శీకరాలే
లోకమంతా జల్లులాడే
ఆ ముహూర్తాలాగమిస్తాయి!
– అని చెప్పి జయభేరి మ్రోగించినా,
శాంతి శాంతి కాంతి శాంతి
జగమంతా జయిస్తుంది
ఈ స్వప్నం నిజమౌతుంది
ఈ స్వర్గం ఋజువౌతుంది
అని భవిష్యవాణి వినిపించినా, గొప్ప ఆశాభావం, ఆత్మవిశ్వాసం వ్యక్తమౌతాయి. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అన్న నమ్మకం, ఆశాభావం శ్రీశ్రీ దృక్పధంలో కడదాకా కొనసాగాయనే చెప్పాలి. ఉద్యమాలకి, ఉద్యమ శక్తులకి, ప్రజా చైతన్యానికి సంబంధించినంతవరకు మాత్రం ఎక్కడా నిరాశా నిస్పృహలు శ్రీశ్రీలో కనిపించవు.
ఆశ-నిరాశ వంటిదే మరొక అంశం సందేహం-సమాధానం. ఎప్పటికైనా ప్రశ్నలు శాశ్వతం. వివిధ తరాలు తమకు దొరికిన సమాధానాలు వాటికి చెప్పుకుంటాయి. ఐతే, కవి నిరంతరం పశ్నిస్తూనే ఉంటాడు. సమాధానాలకోసం అన్వేషిస్తూనే ఉంటాడు. తనకు లభించిన సమాధానాలపై సందేహపడుతూనే ఉంటాడు.
నిజంగానే నిఖిలలోకం
నిండు హర్షం వహిస్తుందా?
మానవాళికి నిజంగానే
మంచికాలం రహిస్తుందా?
– అనే సందేహం కలిగినా,
ఈ సృష్టికి ఏమర్థం?
మానవునికి గమ్యమేది
ఒక సకలాతీతశక్తి
ఉన్నట్టా లేనట్టా?
అనే సదసత్సంశయం కలిగినా, అది కవిలోని జిజ్ఞాసకు, అన్వేషణాసక్తికి నిదర్శనం. కవి తనని తాను మరింత తరచి చూసుకోవటానికి,తద్వారా రచన కొనసాగించటానికి అది ఉపయోగపడుతుంది. ఓ మహాత్మా అన్న పద్యం మొత్తం ప్రశ్నల పరంపరగా సాగుతుంది. ‘ఏది చీకటి, ఏది వెలుతురు? ఏది జీవిత, మేది మృత్యువు? ఏది సత్యం, ఏదసత్యం? ఏదనిత్యం, ఏది నిత్యం’ ఈ ప్రశ్నలన్నీ ఒక జిజ్ఞాసను, అన్వేషణనే సూచిస్తాయి. ఇటువంటి అన్వేషణ కట్టిపెట్టి అన్ని ప్రశ్నలకూ ఒకే సమాధానంతో సంతృప్తిపడి –
నువ్వో సైంటిస్టువి కావాలంటే
ఆర్టిస్టువి కావాలంటే
ముందుగా కమ్యూనిస్టువి కావాలి
నువ్వు చంద్రగోళం చేరాలంటే
కుజగోళం తాకాలంటే
ముందుగా కమ్యూనిస్టువి కావాలి
– అనే ఖచ్చితత్వం వైపుకు పయనించినప్పుడు, కవిత్వం దెబ్బతింటుంది. సదసద్సంశయానికి కొనసాగింపుగా రాసిన ఖండికలో
ఉన్నాడా లేడా అను
కున్నప్పటి అనుమానం
లేనేలేడను నిశ్చయ
మైనందున ఆగె రచన
అంటారు. నిజానికి ఏ సందేహానికైనా నిశ్చయమైన, ఖచ్చితమైన సమాధానం లభించిందని సంతృప్తిపడితే రచన ఆగిపోవటమే జరుగుతుంది. ఒకవేళ శ్రీశ్రీ జీవితాంతమూ నిత్యాన్వేషిగా, ఏ సమాధానంతోనూ పూర్తిగా సంతృప్తిపడని సందేహశీలిగా మిగిలిపోతే, మలిదశలో ఆయన కవిత్వం ఎలా ఉండేదో అన్నది ఒక ఆసక్తికరమైన ఊహ.
కవులను ఆకర్షించే మరొక అంశం బాల్యం. పసిపిల్లల్లో ఉండే స్వచ్ఛత, అమాయకత్వం, ఏ వస్తువునైనా కొత్తగా చూసే తత్వం కవులకు బాగా నచ్చుతాయి. మహాప్రస్థానంలో శ్రీశ్రీ బాలల కోసం రాసిన కవిత శైశవగీతి. ఈ పద్యంలో ఇటువంటి స్వభావం గురించే శ్రీశ్రీ చెబుతారు.
మెరుపు మెరిస్తే,
వాన కురిస్తే,
ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మీకే అని ఆనందించే
కూనల్లారా!
అలాగే భవిషత్తు వారిదేననే భరోసా ఇస్తూ ‘మీరే లోకపు భాగ్య విధాతలు’ అంటారు. పద్యం చివర్లో తాను కూడా తన బాల్యపు ప్రతిధ్వనులకై చేచి చూస్తున్నానని చెబుతారు. పిల్లల మాస పత్రికలు బాల, చందమామ వంటివాటి కోసం రాసిన గేయాలు, కప్ప వైద్యుడు, సీనూ-భానూ వంటివి కూడా పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమను తెలియ జేస్తాయి. కాని, మొత్తమ్మీద ఈ పద్యాలన్నీ బాలల్ని ఒక సమూహంగా ఉద్దేశించి ప్రబోధాత్మకంగా చెప్పినవి. తెలుగు కవిత్వంలో బాల్యం గురించి వచ్చిన కవితల్లో తరువాత కాలంలో వ్యక్తిగత స్పర్శ ఎక్కువౌతూ వచ్చింది. ఉదాహరణకు ఇస్మాయిల్ గారు బాల్యం గురించి రాసిన కవితల్లో ఆయనకు వ్యక్తిగతంగా తెలిసినవారే ఉంటారు – మనవరాలు ట్వింకిల్, బడినుంచి ఇంటికి వచ్చిన మనవడు, నక్సల్ భావే అనే రవి – ఇలా. ఇది మరింత ముందుకు సాగి, బాల్యమంటే కవి తన బాల్యం గురించే చెబుతూ, తన ప్రస్తుత పరిస్థితుల్ని పోల్చి చూసుకొనే ఆధారంగా బాల్యాన్ని ఉపయోగించుకోవటం ఎనభైల తరువాత వచ్చిన కవిత్వంలో ప్రధాన లక్షణం. ఈ విధంగా తెలుగు కవిత్వంలో బాల్యం అంతకంతకూ వ్యక్తిగతమౌతూ వచ్చిందని చెప్పుకోవచ్చు.
కవిత్వం చిన్నచిన్న విషయాల గురించి చెప్పాలా, పెద్ద పెద్ద సంఘటనలకి మాత్రమే స్పందించాలా అన్నది ఎప్పుడూ ఉండే ప్రశ్నే. ‘కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా’ కవితకనర్హం కాదన్న శ్రీశ్రీ తాను స్వయంగా అటువంటి వస్తువుల గురించి పద్యం రాయలేదు. ఇంకా సిద్ధాంతరీత్యా ఆయనతో విభేదించే ఇస్మాయిల్ వంటివారే రాయి, సీసా, గాడిద, చెప్పులు వంటి చిన్నచిన్న విషయాల మీద కవితలు రాసారు. మలికాలంలో శ్రీశ్రీ ఎక్కువ big pictureను మాత్రమే పట్టించుకున్నారనిపిస్తుంది. ఆంధ్రావతరణం, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎన్నికైన ప్రజాప్రభుత్వం కేరళలో కూలిపోవటం, లుముంబా మరణం, ప్రెసిడెంట్ కెన్నెడీ విదేశాంగవిధానం -ఇలా పలు ప్రముఖ విషయాల గురించి శ్రీశ్రీ కవిత్వం వెలువడింది. ఐతే, మళ్ళీ అనువాద కవిత్వం దగ్గరకి వచ్చేసరికి మాత్రం, చిన్న చిన్న అనుభవాలకి సంబంధించిన కవితలు శ్రీశ్రీ అనువదించారు. ఉదాహరణకి, పాబ్లో నెరుడాకి ఒకమ్మాయి గౌరవంతో మేజోళ్ళు అల్లి ఇస్తే వాటిమీద ఆయన అద్భుతమైన కవిత రాస్తారు. శ్రీశ్రీ ఆ కవితను చక్కగా అనువదించారు. దీనినిబట్టి అటువంటి తరహా కవిత్వం మీద ఆయన కభిమానం ఉందనే తెలుస్తోంది. మరి స్వీయకవితల్లో మాత్రం అటువంటి ప్రయత్నం ఎక్కువగా చెయ్యలేదు. ఇక్కడ మరొక విషయం కూడా చెప్పుకోవాలి. శ్రీశ్రీ తనకు కోపం వచ్చినపుడు చాలా అల్పమైన వివాదాల మీద కవిత్వం రాసి, తన వ్యక్తిగతమైన రాగద్వేషాలకు కవిత్వం వృధా చేసారని అనిపిస్తుంది. తనకు నచ్చనివారి రూపాన్ని, పేరును అపహాస్యం చెయ్యటం (దాశరధిని పొట్టికవి అని, సోమసుందర్ ని దోమసుందరా అని, ఆరుద్రని రోమలక్ష్మీపతి అని) వంటివి నిరాశ కలిగిస్తాయి.
శ్రీశ్రీ ఛందస్సులో, కవితాప్రక్రియలో అనేక ప్రయోగాలు చేసారు. గీతాలు, వృత్తాలు, మాత్రాఛందస్సు, ముత్యాలసరాలు, కందపద్యాలు – మళ్ళీ కందంలో అనేకరకాలు – ఇలా. ఇక అధివాస్తవిక కవిత్వం మొదలుకొని ప్రక్రియాపరంగా ఆయన చేసిన ప్రయోగాలు మనకు తెలిసినవే. ఒక్క కవిత్వమేకాదు, కథ, నాటకం, వ్యాసం – ఏది రాసినా అందులో శ్రీశ్రీ ప్రయోగతత్వం స్పష్టంగా తెలుస్తుంది. కాని, ఈ వైవిధ్యాన్ని ఆయన కవితావస్తువునెన్నుకోవటంలో పూర్తిగా ప్రదర్శించలేదు. ఇందాక చెప్పినట్టు ప్రముఖ విషయాలకే పరిమితమయ్యారు. అంతేకాదు ఉగాదివంటి రొటీన్ విషయం మీద శ్రీశ్రీ అన్ని కవితలు ఎందుకురాసారా అని ఆశ్చర్యం కలుగుతుంది. విశ్వావసు, పరాభవ, సౌమ్య, సాధారణ, రాక్షస (వచ్చావా రాక్షసా, రా! తెచ్చావా ద్రాక్షసారా!) ఇలా అనేక ఉగాదులకు శ్రీశ్రీ రాసిన పద్యాలున్నాయి.బహుశ ఇవన్నీ ఆకాశవాణి వారి సౌజన్యంతో రాసినవై ఉండవచ్చు.
శ్రీశ్రీ రాసిన చలనచిత్ర గీతాల్లో మాత్రం వస్తుపరమైన వైవిధ్యం కనిపిస్తుంది. ప్రేమ, భక్తి, దేశభక్తి వంటి అనేక వస్తువులమీద శ్రీశ్రీ రాసిన మధురగీతాలెన్నో ఉన్నాయి. ‘మనసున మనసై, బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము’ అనే గీతం ఒక గాఢమైన personal poem లాగా ఉంటుంది. సినిమా కవిత్వానికి సైద్ధాంతికమైన పరిమితులు లేకపోవటం వల్ల ఈ వైవిధ్యం సాధ్యపడి ఉంటుంది.
శ్రీశ్రీ రచనలన్నిటిలోనూ మహాప్రస్థానమే అత్యుత్తమ రచనని దాదాపు అందరూ అంగీకరిస్తారనుకుంటాను. మహాప్రస్థానం తరువాత శ్రీశ్రీ రాసిన కవితలన్నీ ఎక్కువగా ప్రయోజనమే ప్రధానోద్దేశ్యంగా ఉన్నట్టుంటాయి. ఈ సందర్భంలో రెండు సందేహాలు కలుగుతాయి. మొదటిది – శ్రీశ్రీ తనను తానొక ఉద్యమ కవిగా భావించి ఉంటే, ఇతర ఉద్యమ కవుల్లాగా, తన కవిత్వం కంటె అది చెప్పే ఆశయమే గొప్పదని భావించేవారా? శ్రీశ్రీ తన కవిత్వం గురించి చేసిన ప్రకటనలను చూస్తే అటువంటి భావం ఆయనకున్నట్టు తోచదు. రెండవది – దాదాపు ఏభై సంవత్సరాలు కవితా రచన చేసిన కవికి, ఎప్పుడో తాను ఇరవైల్లో ఉండగా చేసిన రచనే అత్యుత్తమమైనదిగా పాఠకులు భావిస్తున్నారంటే, ఏమైనా ఇబ్బంది అనిపించేదా? లేక మహాప్రస్థానం ప్రాముఖ్యత శ్రీశ్రీకి కూడా తెలుసుకాబట్టి, అందుకు ఆయన సంతోషంగానే ఉండేవారా? శ్రీశ్రీని సన్నిహితంగా తెలిసినవారెవరైనా ఈ రెండు సందేహాలకూ సమధానం చెప్పగలరేమో.
చివరిగా ఒక విషయం. ఒకప్పుడు ఆంధ్రదేశంలో శ్రీశ్రీ కవిత్వం మీద వ్యాఖ్యానించటమంటే కొంత రిస్కు ఉండేది. అద్దేపల్లి రామ్మోహనరావు గారు శ్రీశ్రీ గురించి రాసిన పుస్తకం మీద రా.రా. చేసిన క్రూర విమర్శ, మిరియాల లక్ష్మీపతిగారు శ్రీశ్రీ మీద రాసిన థీసిస్ గురించి ‘శ్రీశ్రీకి మిరియాల కషాయం’ అంటూ పురాణం సుబ్రహ్మణ్యశర్మ రాసిన మరొక క్రూర సమీక్ష వంటివి కొన్ని ఉదాహరణలు. ఐతే, శ్రీశ్రీ తదనంతరం తెలుగు రాజకీయాలలో, సాహిత్యంలో వచ్చిన అనేక పరిణామాల వల్ల ఇప్పుడా పరిస్థితి లేదనుకుంటాను. అందువల్ల శ్రీశ్రీ కవిత్వాన్ని నిర్భయంగా, నిష్పాక్షికంగా అంచనావేసే అవకాశం ఉంది. ఈ శతజయంతి ఉత్సవాలు అందుకు తోడ్పడితే మంచిదే.
(శ్రీశ్రీ, కొకు, గోపీచంద్ శత దినోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 26-27, 2009 న డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ ఆధ్వర్యాన జరిగిన సభలో చేసిన ప్రసంగం ఈవ్యాసానికి ఆధారం).